చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర

హైదరాబాదు బుక్ ఫెయిర్ లో లోకేశ్వర్ గారి స్టాల్ ఒకటి చూశినప్పుడే అర్థమయింది – ఆయన “సలాం హైదరాబాద్”, “జీవితం అతనికొక తమాషా” పుస్తకాలు కాకుండా ఇంకా చాలా రాసాడని! అక్కడ నుంచే వచ్చింది ఈ చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర పుస్తకం మా ఇంట్లోకి. పుస్తకం దేని గురించంటే –

“…రాజకీయంగా కూడా ఇదొక నూతన రాష్ట్రం. అందువల్ల ప్రత్యేక తెలంగాణా కార్యకర్తగా కూడా ఆ రాష్ట్ర పర్యటన నన్ను ఆకర్షించి సన్నద్ధుడిని చేసింది. ఆ రాష్ట్రంలో నడిచిన ఉద్యమానుభవాలు మన వర్తమాన తెలంగాణా ఉద్యమానికి ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుసుకునే అధ్యయన యాత్రగా ఆ పర్యటన చేయాలని నిర్ణయించుకున్నాను”
-అనుకుని యాత్ర ప్లాన్ చేసుకున్న రచయిత తన స్నేహితుడైన సతీష్ తో కలిసి ఫిబ్రవరి 2009లో పదిరోజులపాటు మొత్తం 1943 కిలోమీటర్లు ప్రయాణం చేసి చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో పర్యటించి వచ్చారు!! ఆ అనుభవాల సారం ఈ పుస్తకం. దీని కోసం ఎంచుకున్న వాహనం – హోండా ఆక్టివా స్కూటర్!

లోకేశ్వర్ హైదరాబద్ నుండి బయలుదేరి, వరంగల్ లో తన మిత్రుడు సతీష్ ను కలుసుకున్నాక, వీళ్ళ ప్రయాణం మొదలవుతుంది. మొదట ఖమ్మం భద్రాచలాల మీదుగా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కుంట చేరుకుని అక్కడ నుండి చత్తీస్ ఘడ్ లో పదిరోజులు తిరిగి, భూపాలపట్నం మీదుగా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించారు. ఈ మధ్యలో – చత్తీస్ ఘడ్ లోని ప్రకృతి సౌందర్యం, గిరిజనుల జీవన విధానం, చూడదగ్గ జలపాతాలు, గుహలు మొదలుకుని, అక్కడి కార్మికోద్యమాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాల నాటి నాయకులు, స్థానిక హీరోలు – ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటూ, తెలియజేస్తూ సాగారు పుస్తకంలో. అన్నింటితో పాటు ఎక్కడికక్కడ ఫొటోలు కూడా జతచేశారు.

ఈ అనుభవాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నవి – ఇక్బాల్ సాబ్, లాలా జగదల్పురీ వంటి స్థానిక ప్రముఖులని కలిసినప్పటివి. స్థానిక జీవితాల గురించి, చరిత్ర గురించి వాళ్ళ మాటల్లో వినడం ఆసక్తికరంగా అనిపించింది. అలాగే, Raja Pravir Chandra Banjadev, Shankar Niyogi వంటి వారి స్పూర్తివంతమైన జీవితాల గురించి కొంత వివరంగా తెలుసుకోవడం వల్ల వాళ్ళ మీద గౌరవం, వాళ్ళ గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం కలిగాయి. భూపాల పట్నానికి 1857 తిరుగుబాటుతో గల సంబంధం గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. మన చుట్టుపక్కలే జరిగిన ఈ చరిత్ర గురించి నాకు ఏమీ తెలియకపోవడం గురించి కాస్త సిగ్గనిపించింది కూడా!

కుటుంబసర్ గుహలు, ఇంద్రావతి జలపాతం, దంతేవాడ ఆలయం కథ – ఇటువంటి వాటి గురించి వివరించేటప్పుడు రచయిత రాసిన పద్ధతి ఎలా ఉందంటే – నాకంత అడ్వెంచర్లు చేసే కెపాసిటీ లేదని తెలిసినా కూడా, నేనూ ఇలా పర్యటన చేయాలని కలలు కనేలా ఉంది! 🙂

రచయితకు శంకర్ నియోగి అంటే విపరీతమైన గౌరవాభిమానాలు ఉన్నట్లు తోస్తుంది. నాకు ఆ పేరు వినడమే తప్ప పెద్దగా వివరాలేవీ తెలియవు ఈ పుస్తకం చదివేదాకా. అందువల్ల ఇక్కడ నియోగీ పై రాసిన పెద్ద వ్యాసం, అటుపిమ్మట నియోగీ తిరుగాడిన స్థలాలని, ఆయన కుటుంబ సభ్యులను చూడ్డానికి రచయిత పడ్డ తాపత్రేయం – ఇదంతా చదివాక ఆయన గురించి చాలా కుతూహలం కలిగింది. అలాగే, ఆయనపట్ల రచయితకు గల గౌరవాభిమానాల లో కొంత శాతం అలా నాకు అంటుకున్నట్లు అనిపిస్తోంది 🙂

ఇకపోతే, పుస్తకంలో నాకు నచ్చని/నన్ను ఇబ్బందిపెట్టిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి.

1. రచయిత కొంచెం పద్ధతిగా ఏదో ఒక భాష-ఒక మాండలికం వాడి ఉంటే బాగుండేది. ఒక వాక్యం పత్రికల భాషలో. ఒక వాక్యం తెలంగాణలో. మధ్యలో ఉర్దూ..మధ్యలో ఇంగ్లీషు… వీటన్నింటి మధ్య నాటక ఫక్కీ గ్రాంథికం..అంతా కలగాపులగంగా ఉండింది. ఉర్దూ, ఆంగ్లాలను అటు పెడితే, కొన్ని చోట్ల తెలంగాణ మాండలికం వాడి కొన్ని చోట్ల వాడకుండా రాస్తూ ఉంటే వింతగా తోచింది నాకు. ఏదో ఒక పద్ధతి అనుసరించవచ్చు కదా అనిపించింది. దీని వల్ల భాష కొంచెం కృత్రిమంగా తయారైంది నాకు. గతంలో ఈయన రాసిన “జీవితం అతనికొక తమాషా” చదివినప్పుడు నెరేషన్ చాలా కంఫ్యూజింగ్ గా అనిపించింది. ఎక్కడ రచయిత మాట్లాడుతున్నాడో, ఎక్కడ ఆయన ప్రొఫైల్ చేసిన వ్యక్తుల మాటలు యథాతథంగా వాడుతున్నాడో తెలీక ఇబ్బంది పడ్డాను. ఇందులో ఆ తరహా అన్వయపరమైన ఇబ్బందులు ఎదురుకాకున్నా, ఈ భాష మాత్రం చాలా చిరాకు తెప్పించింది.

2. రచయితకు కవితాత్మక ధోరణి ఎక్కువ అనుకుంటాను. కానీ, కొన్ని చోట్ల కృత్రిమంగా భావుకతను జొప్పిస్తున్నట్లు అనిపించింది.

3. ఆ ఆధ్యాయాల పేరుతో మొదట్లో ఒక విషయ సూచిక కూడా ఉంచి ఉంటే బాగుండేది అనిపించింది.

4. ఆయన పుస్తకం, ఆయన అభిప్రాయాలు, ఆయన ఇష్టమే అయినా – చాలా చోట్ల చరిత్ర చెబుతున్నట్లు ఆయన సొంత అభిప్రాయాలు చెప్పడం కొంత చిరాకు తెప్పించిందనే చెప్పాలి.

ఏదేమైనా, మొత్తానికైతే మట్టుకు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది పుస్తకం. అలాగే, నాకు తెలియని ఎన్నో సంగతులు తెలియజేసింది..మరింత తెలుసుకోవాలన్న కుతూహలం కలిగించింది. నన్ను అడిగితే తప్పకుండా చదవమనే చెబుతాను. ఎందుకు? అంటే మన చుట్టుపక్కల గురించి తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకునీ ఏం లాభం?? పైగా, టూ-వీలర్లో పర్యటనలు చేయడం గురించి నిరంతరం కలలు కంటూ ఉండదం మూలాన కూడా నాకీ పుస్తకం నచ్చి ఉండవచ్చు. 🙂 🙂

నేను చదివినది రెండవ ముద్రణ. ఇందులో 2009 లో చేసిన యాత్ర తరువాత 2011లో చేసిన ఫాలో అప్ యాత్ర తాలూకా ఫొటోలు కూడా జతచేశారు.

పుస్తకాన్ని – “చత్తీస్‌ఘడ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం, సమాంతర, ప్రత్యమ్నాయ ప్రజా ఉద్యమాల కోసం, మెరుగైన ప్రపంచం కోసం, మరో ప్రపంచం కోసం, అహర్నిశలు సంఘర్షించి ప్రాణాలు బలిపెట్టిన” కామ్రేడ్ శంకర్ గుహా నియోగి కి అంకితమిచ్చారు.

ఈ పుస్తకం గురించి అంతర్జాలంలో కనబడ్డ ఒక బ్లాగు టపా ఇక్కడ. నచ్చిన సంగతులు అటుపెడితే, నన్ను ఇబ్బంది పెట్టిన అంశాలు ఈ బ్లాగు రాసిన వారిని కూడా ఇబ్బంది పెట్టినట్లున్నాయి ఈ పుస్తకంలో! 🙂

***

పుస్తకం వివరాలు:

చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర
రచన: పరవస్తు లోకేశ్వర్
ప్రచురణ: గాంధి ప్రచురణలు, హైదరాబాద్
వెల: 100 రూపాయలు
పేజీలు: 156
లభించు చోట్లు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు.
రచయిత సెల్: 9160680847

You Might Also Like

4 Comments

  1. pavan santhosh surampudi

    ఈ పుస్తకం నాకూ నచ్చింది. ఐతే ఉర్దూ ఏదో ప్రతి తెలుగువాడికీ వచ్చిన భాషలాగా ఉర్దూ వాక్యాలకు ఏ అనువాదమూ ఇవ్వకపోవడం చిర్రెత్తించింది.(ఒక్కొక్కరు రచయితలు సంస్కృత శ్లోకాల విషయంలో ఇలానే చేస్తారు).

  2. leo

    “రాసాడని!”??

  3. budugoy

    soumya garu,
    Agree with you on almost all the accounts. This is a good book to read. The #1 problem you mentioned above would have been sorted if we had the culture of having an third party editor for books. But inspite of that small hiccup, its a worthwhile read and must read for travellers. As for me, I guess, next time I go to Kaleswaram, I dont need to wonder whats on the other side.

  4. pavan santhosh surampudi

    4వ తారీఖున విజయవాడ బుక్ ఫెయిర్లో లోకేశ్వర్ గారి స్టాల్ చూశాను. ఆయనే చెప్పుకున్నట్టు బుక్ ఫెయిర్లో మరో రచయిత ఎవరూ స్టాల్ పెట్టుకున్న దాఖలా కనిపించలేదు నాకు.

Leave a Reply