దేశవిభజనకు అటు, ఇటు

గాంధిని హతమార్చడానికి గాడ్సే బృందం పన్నిన కుట్రను కూలంకషంగా వివరించే పుస్తకం, మనోహర్ మల్‍గోవన్కర్ రాసిన The Men who Killed Gandhi. భారత స్వాతంత్ర్య నేపథ్యాన్ని, ఆనాటి స్థితిగతులని పరిచయం చేసే రచన Freedom At Midnight. ఈ పుస్తకాలను గూర్చి జరిపిన సంభాషణను ఇక్కడ పంచుకుంటున్నారు శ్రీనివాస్-పూర్ణిమ. – పుస్తకం.నెట్ 

***

పూర్ణిమ: శ్రీనివాస్ గారు, నమస్కారం! మొన్న మీరు ’మీరేం చదివారు?’లో ’Freedom at Midnight’ అన్న పుస్తకం చదివారని చెప్పారు.  అదే సమయంలో నేనో పుస్తకం చదివాను. పేరుకి అది “The Men who Killed Gandhi” అయినా, అది కేవలం గాంధీని చంపడానికి పూనుకున్న, ప్రోత్సహించిన ఐదారుగురి గురించి మాత్రమే కాదు. గాంధీ మరణం నాటికి దేశరాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో విహంగవీక్షణంలా చూపించే ప్రయత్నం కనిపించింది. వాటిలో ముఖ్యమైంది, దేశవిభజన. మీరు చదివిన పుస్తకం టైటిల్ బట్టి, అందులో విభజనను కూలంకషంగా పరిచయం చేసుంటారని నాకనిపిస్తోంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఉన్నది ఏంటి? మన స్వాతంత్ర్యానికి సంబంధించిన ఏయే కోణాలు అందులో విశదీకరించబడ్డాయి? ముఖ్యంగా, ‘దేశవిభజనకు బాధ్యులు ఎవరు?’ అన్న ప్రశ్నకి మీరు చదివిన పుస్తకంలో సమాధానం దొరుకుతుందా?

శ్రీనివాస్: Freedom at Midnight ఇతివృత్తం మల్గోంకర్ పుస్తకపు ఇతివృత్తానికి దగ్గరిదే: భారత స్వాతంత్ర్యపు పూర్వరంగమూ, తదనంతర పరిణామాలున్నూ.

1947 జనవరి ఒకటో తేదీన మౌంట్‌బాటెన్‌ని ఇండియాకి పంపాలని నిర్ణయించినప్పటినుంచి 1948 ఫిబ్రవరి 28వ తేదీన చివరి ఆంగ్లేయ సైనిక దళం (ఫస్ట్ బెటాలియన్, సోమర్సెట్ లైట్ ఇన్‌ఫాంట్రీ) గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర భారతీయులకు వీడ్కోలు చెప్పడందాకా ఓ పదమూడు నెలలపాటు పరచుకున్న చరిత్ర. ఆ పదమూడు నెలల ప్రధానకథకి నేపథ్యంగా ఓ మూడున్నర శతాబ్దాల కథ – వలసవాదపు తొలిరోజుల నుంచి – చెప్పుకొస్తారు. కాన్వాస్ పెద్దదే!

“’దేశవిభజనకి బాధ్యులు ఎవరు?’ అనే ప్రశ్నకి ఈ పుస్తకంలో జవాబు దొరుకుతుందా?” అంటే దొరుకుతుందనే చెబుతాను. నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్… అన్నట్లు బోలెడు కారణాలు కనబడతాయి. రెండు ముక్కల్లో చెప్పమంటే, వ్యక్తులూ, వాతావరణమూ అని చెబుతాను.

పూర్ణిమ: ఇంటరెస్టింగ్! 1948 ఫిబ్రవరి 28 వరకూ అంటే, గాంధీ చనిపోయాక నెలరోజులన్న మాట. అయితే, ఇందులో గాంధీ హత్యోదంతం కూడా ఉండే ఉంటుంది?

గాంధీ మరణం అనగానే నాకు మేం స్కూల్ లో ఒకటికి రెండు సార్లు చదువుకున్న పాఠం – The Last Prayer – గుర్తొస్తుంది. ఆయన చివరాఖరిసారిగా ప్రార్థనా స్థలానికి వెళ్తుండటం, ఆయనకి సాయంగా ఆయన మనువరాళ్ళు జత ఉండడం, వేదిక మీదకు గాంధీ రాగానే ఒక అనామకుడు ఆయనకి నమస్కరించి తూటా పేల్చటం! – నాకింత వరకే తెల్సు. అయితే, The Men who killed Gandhi జనవరి 30, 1948 సాయంకాలం మొదలవ్వదు.  ఒక పక్షం రోజులు ముందుగా మొదలవుతుంది, పాకిస్థాన్ వాటా అయిన 55 కోట్ల రూపాయలను తక్షణం మంజూరు చేయాలని పట్టుపడుతూ, గాంధీ ఉపవాస దీక్షకు పూనుకున్నారన్న వార్త వెలువడినప్పటి నుంచి మొదలయ్యి,  నవంబర్ 15, 1949న గాడ్సేని, నారాయణ ఆప్టేని ఉరి తీయటంతో ముగుస్తుంది.

సో, 15-01-1948 నుండి 28-02-1948 వరకూ జరిగిన ప్రధాన ఘట్టాలు ఈ రెండు పుస్తకాల్లోనూ ఉండాలి, వాటి వాటి ఫోకల్ పాయింట్స్ వేరైనా!

రచయిత కేవలం ఘటనాక్రమాన్ని మాత్రమే కాక, అందులో వ్యక్తుల గురించే కాకుండా, అప్పటి వాతావరణాన్ని ఈనాటి పాఠకుని ముందు ఉంచే ప్రయత్నం చేశారు. మీరన్నట్టు “వ్యక్తులూ, వాతావరణమూ”.  అందుకే నాకీ పుస్తకం నచ్చింది. Prejudicesతో చదివితే ఎలా ఉంటుందో తెలీదుగానీ, కొంచెం ఓపెన్‍ గా చదివితే, “హతవిధీ” అనిపించక మానదు.

శ్రీనివాస్: Freedom at Midnight ఆఖరి ఐదు అధ్యాయాలూ గాంధీ హత్యోదంతం గురించే. గోపాల్ గాడ్సే ప్రభృతులనుంచి సేకరించిన వివరాలూ, అప్పటి పోలీసు రికార్డులూ ప్రధానాధారాలు, ఈ అధ్యాయాలకి. కాస్సేపు గాంధీ వైపునుంచీ, కాస్సేపు గాడ్సే బృందం వైపునుంచీ భావోద్వేగాలను, సంఘటనలను ఉత్కంఠ రేకెత్తిస్తూ  రాసుకొస్తారు.

పాకిస్థాన్‌కు 55 కోట్ల రూపాయల వాటా ఇవ్వాలనే డిమాండు గాంధీ నిరాహారదీక్ష విరమణ షరతుల్లో చేరడం – ఓ రకంగా యాదృచ్చికంగా జరిగినదే. హిందూ – ముస్లిం సామరస్య సాధన కోసం నిరాహార దీక్ష మొదలెట్టాలనుందని గాంధీ మౌంట్‌బాటెన్‌తో ప్రస్తావించినప్పుడు, సమయానికి తగు మాటలాడే మౌంట్‌బాటెన్ ఈ డబ్బు విషయంలో భారత ప్రభుత్వానికి నచ్చజెప్పమని గాంధీకి అన్యాపదేశంగా సూచిస్తాడు.ఆ సూచనని అందుకోవడం గాంధీకి ప్రాణాంతకమయింది.

పూర్ణిమ: గాడ్సే అనుకున్నట్లు, గాంధీ ప్రయత్నించింది ఒక వర్గానికి పక్షపాతం చూపించాలని కాదు. “పాకిస్థాన్ లో హిందువులకి పట్టిన దురవస్థ, భారతదేశంలో హిందువుల వల్ల ముస్లిములకు కలగకూడదు, కలిసి ఉండాల్సిన వాళ్ళు ఇలా కొట్టుకొని చంపుకోకూడదు.” అన్న సంకల్పం ఎంతో ఉదాత్తమయిందే. అయితే, విభజనలో సర్వస్వం కోల్పోయిన వారిని ఈ మాటలకు తగట్టు వ్యవహరించమనటం కొంచెం అత్యాశే, ముఖ్యంగా విభజనకు ఎన్నో మైళ్ళ దూరంలో, ఒక పత్రికా ఎడిటరే ఆ మాటలను అర్థంచేసుకోలేనప్పుడు.

కాశ్మీర్ లో జరుగుతున్న  మారణహోమం ఒక కొలిక్కి వస్తేగానీ పాకిస్థాన్ వాటా డబ్బులు ఇవ్వకూడదని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమైనదే! అది రెండు ప్రభుత్యాల మధ్య  సమస్యగా ఉంటే సరిపోయేది. మౌంట్‌బాటెన్‌ వెళ్ళి గాంధీకి చెప్పటం, గాంధీ దానికోసం పట్టుపట్టటం, భారత ప్రభుత్వం వెనక్కి తగ్గటం – వెరసి, కాశ్మీర్ ఇంకా రగులుతూనే ఉంది!

శ్రీనివాస్: ఈ 55కోట్ల రూపాయల విషయంలో భారత ప్రభుత్వం చేసింది తప్పేనని నాకనిపించింది. న్యాయంగా పాకిస్థాన్‌కి చెందాల్సిన ఆ డబ్బు వాళ్ళకి అత్యవసరంగా కావాలి – ఆయుధాలు కొనుక్కోవడానికి కాదు, అవసరాలు, అప్పులు తీర్చుకోవడానికి, ప్రభుత్వ సిబ్బందికి జీతాలివ్వడానికి. అప్పటి పరిస్థితులకు ఉదాహరణగా బ్రిటిష్  ఓవర్సీస్ ఎయిర్‌వేస్‌కి పాక్ ప్రభుత్వం ఇచ్చిన చెక్కు బౌన్స్ అయి జిన్నాకు తలవంపులు తెచ్చిపెట్టిందని రాసారు Freedom at Midnight పుస్తకంలో. యుద్ధ సమయంలో నీతిసూత్రాలకు మినహాయింపులుంటాయని మనల్ని మనం సమర్థించుకోగలం అంతే!

పూర్ణిమ: గాంధీ సత్యాగ్రహం అంతకు ముందు ఎన్ని విజయాలు సాధించినా, చివరిసారిగా మాత్రం చాలా దారుణంగా ఓడిపోయిందని నాకనిపించింది.

అన్నింటినీ పోగొట్టుకొని, ప్రాణాలను చేతబట్టుకొని వచ్చిన శరణార్థులు లక్షల్లో ఉండేవారట ఢిల్లీలో ఆరోజుల్లో. అలాంటి సందర్భంలో, అహింసా ప్రసంగాలు ఎలా ఎక్కుతాయి జనాలకు?. “మర్తా హై తొ మర్నే దొ, ఖూన్ కా బద్లా ఖూన్ సే లేంగె!” (చస్తే చావనీ, నెత్తురుకి ప్రతీకారంగా నెత్తురే తీసుకుందాం) అని గాంధీ ఉన్న భవనం బయట ప్రజలు నినాదాలు చేశారు. అందులో ఒకడు ఏకంగా చంపనే చంపేశాడు. చంపి, ఇలా చెప్పుకొచ్చాడు:

“Had this act not been done by me, of course it would have been better for me. But circumstances were beyond my control. So strong was the impulse of my mind that I felt that this man shouldn’t be allowed to meet a natural death so that the world may know that he had to pay the penalty of his life for his unjust, anti-national and dangerous favouritism towards a fanatical section of the country. I decided to put an end to this matter and to further massacre of lacs of Hindus for no fault of theirs. May God now pardon him for his egoistic nature which proved to be too disastrous for the beloved sons of this Holy land.”

గాంధీని చంపిన తనను ఇండియన్ మీడియా ఎలా ఆడిపోసుకుంటుందో తనకి ముందే తెల్సునని గాడ్సే ఇలా అంటాడు:

I had a very good idea about fiery attacks that would be launched against me in the Press. But I never thought that I could be cowed down by the fire poured against me by the Press. For, had the Indian Press impartially criticized the anti-national policy carried on by Gandhiji and had they impressed upon the people that the interest of the nation was far greater than the whim of any individual howsoever great he may be, Gandhiji and his followers could never dare concede Pakistan to the Muslims as easily as has been done. The Press had displayed such weakness and submission to the High Command of the Congress that it allowed the mistakes of leaders pass away freely and unnoticed and made vivisection easy by their policy. The fear about such a Press — weak and subservient as it was could not dislodge my resolve.

ఇందులో పాయింట్ ఉందని నాకనిపిస్తుంది. ప్రెస్ కాకపోతే, దేశపరిపాలనను నెత్తినేసుకున్న నాయకులో, లేక  గాంధీకి సన్నిహితంగా ఉంటూనే, దేశహితాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనతో విభేదించేవాళ్ళో (టాగోర్ లాంటివాళ్ళూ) ఉండుంటే, ఏమో, జరిగినవ్వన్నీ జరిగుండేవి కావేమో?!

శ్రీనివాస్:  గాంధీ ఆఖరి సత్యాగ్రహం మీరన్నంత దారుణంగా ఓడిపోయినట్లనిపించదు, Freedom at Midnight చదివితే. “చస్తే చావనీ గాంధీని” అని శాపనార్థాలు పెట్టిన మాట నిజమే గానీ ఆయన ప్రాయోపవేశం అయిదో రోజుకు చేరుకునేప్పటికి – మరణానికి చేరువగా ఉన్నప్పుడు – కాస్త చల్లబడ్డారట. తనని దర్శించుకునేందుకు లక్షమంది ప్రజలు అల్‌బుఖరెక్ రోడ్డు మీద మూడు మైళ్ళ పొడవున బారులు తీరారట!

పూర్ణిమ: అలా బారులు తీరిన ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, అవి విన్న నెహ్రూ ఆగ్రహావేశాలతో “ఎవరు గాంధీ మరణాన్ని కోరుకుంటుంది? దమ్ముంటే నా ముందుకొచ్చి అనండి.” అన్నారని నేను చదివిన పుస్తకంలో ఉంది.

శ్రీనివాస్: అలాంటి సంఘటన ఒకటి Freedom at Midnightలో ప్రస్తావించబడింది. నెహ్రూ సభలో అలా అల్లరి చేసింది (ఆ తరువాత రోజుల్లో గాంధీపై హత్యాప్రయత్నం చేసి విఫలుడైన) మదన్‌లాల్ పహ్వా అని రాసారు.  “అంతే కోపం మరెందరి మనస్సుల్లోనో ఉండి ఉండవచ్చును కదా?” అని మీరంటే ఒప్పుకుంటాను. “Disgruntled refugees were commonplace in Delhi” అని అన్నారు లాపియర్-కోలిన్సులు.

“దేశహితాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనతో విభేదించేవాళ్ళో (టాగోర్ లాంటివాళ్ళూ) ఉండుంటే ఇవన్నీ జరిగేవి కావేమో…” అన్నారు మీరు. “ఇవన్నింటిలో” విభజన కూడా ఒకటా? దేశవిభజనకి గాంధీ కూడా బాధ్యుడే, కానీ గాంధీ మాత్రమే బాధ్యుడు కాడు కదా!

పూర్ణిమ: గాంధీ మాత్రమే బాధ్యుడు అని, దేశవిభజనకు సంబంధించిన ఏ కొన్ని వివరాలను పరిశీలించినా అనలేము. దేశవిభజనకు ఎన్నో పరిస్థితులు, ఎందరో వ్యక్తులు కారణమయ్యారు. “ ఫలానావారు ఫలానా చేసుండకపోతే… “ లేదా “ఫలానావారు ఫలానా చేసుండుంటే” అని ఇప్పుడు మనం విశ్లేషణలు చేసుకోవచ్చుగానీ, అప్పట్లో జరగాల్సింది జరిగిపోయింది. ఆ జరిగినదాంట్లో గాంధీ పాత్రను విస్మరించలేము. “Great people make great mistakes.” అన్నట్టుగా, గాంధీ నేతృత్వంలోనే దేశవిభజన కావడం శోచనీయం.

శ్రీనివాస్:  Freedom at Midnight పుస్తకంలో దేశవిభజనకి దారి తీసిన రాజకీయాల విశ్లేషణ ఎక్కువగా లేదు. భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి చేసిన చిట్టచివరి ప్రయత్నమైన కాబినెట్ ప్లాన్ వీగిపోవడంతో విభజన వైపుకు తొలి అడుగులు పడ్డాయనే సూచన తప్ప. లాపియర్-కోలిన్స్ ప్రకారం దేశవిభజనకి ప్రధాన కారణాలు: జిన్నా మొండి వైఖరి, జిన్నాతో/లీగ్‌తో కాంగ్రెస్ నాయకులు విసిగిపోవడం, దేశంలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితిని అదుపు చేసే శక్తి తమకు లేదని బ్రిటిష్ ప్రభుత్వం తేల్చుకోవడం.

గాంధీ విభజనను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, నెహ్రూ-పటేల్ (మౌంట్‌బాటెన్‌ని కూడా కలుపుకోవాలేమో ఈ జాబితాలో…) నిర్ణయాలకు అడ్డు రాకూడదని రంగంలోంచి తప్పుకోవడం విభజనకు మార్గాన్ని సుగమం చేసింది. ఈ చివరి దశలోని నిర్వేదమే, ప్రజలు తనతో కలిసి రారేమోనన్న సంశయమే గాంధీ జివితంలో Colossal Failure కి కారణమయ్యాయని అనిపిస్తుంది నాకు.

లాపియర్-కోలిన్సులు ఎంత వెనకేసుకొచ్చినా, ఈ వ్యవహారంలో నాకు మౌంట్‌బాటెన్ తప్పులే చాలా కనబడ్డాయి. రాజప్రతినిధిగా నియుక్తుడయి నెలన్నా పూర్తవకముందే విభజన తప్పదని తేల్చేసుకోవడం, విభజన ప్రణాళికను ఫార్మల్‌గా దేశనాయకుల ముందుంచి, 24గంటల్లోపే అటో ఇటో తేల్చి చెప్పమని బలవంతపెట్టడం, ఓ విలేఖరుల సమావేశంలో ఎదురైన ప్రశ్నకు జవాబులేదని చెప్పడానికి ఇచ్చగించక – ఎవ్వరినీ సంప్రదించకుండానే, సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోకుండానే – ఆగస్ట్ 15 ముహూర్తాన్ని నిర్ణయించడం, ఉజ్జాయింపు జనాభా లెక్కలను, అవకతవక మ్యాపులను, అయిదు వారాల గడువునూ ఇచ్చి – జిన్నా, నెహ్రూల సలహా ప్రకారమే అయితేనేం – ఇండియా గురించి ఏమాత్రం తెలియని సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌ను రెండు దేశాల సరిహద్దులను నిర్ణయించమనడం…అన్నింటికన్నా పెద్ద వైఫల్యం – దేశవిభజన పర్యవసానాలను ఊహించలేకపోవడమే అనిపిస్తుంది.

ఇంతా చేసీ, ఇరవయ్యేదేళ్ళ తరువాత, ‘క్షయ వ్యాధిగ్రస్తుడైన జిన్నా అట్టే కాలం బతకడని “కాస్త ముందు తెలిసెనా”, దేశవిభజనకి ఒప్పుకునే వాడిని కాదు’ అని మౌంట్‌బాటెన్ అన్నాడని చదివినప్పుడు  మీరన్నట్లు “హతవిధీ” అనాలనిపిస్తుంది.

చర్చ కొంచెం బరువెక్కినట్లుంది… ఒక నవ్వొచ్చే విషయం చెప్పనా?

వాటాలకు సంబంధించి ఓ పెద్ద అధ్యాయం ఉంది ఈ పుస్తకంలో. అంత విషాదంలోనూ మన పూర్వీకులు పట్టుకున్న సిగపట్ల కథల్లో ఒకటి మచ్చుకు:

Sets of the Encyclopedia Britannica in the Punjab Government library were religiously divided, alternate volumes going to each dominion. Dictionaries were ripped apart, A-K going to India while the rest went to Pakistan. Where only 1 copy was available for any book, librarians were supposed to allot that book based on which country had a greater interest in it. As a result, librarians actually came to blows over which country had a greater interest in Alice in Wonderland  or Wuthering Heights.

ఇంకొన్ని వివరాలకు…

పూర్ణిమ: భారత-పాక్ పార్టిషన్ సమయంలో పూచికపుల్లతో సహా పంచుకున్నట్టు అన్నీ వాటాలేసుకొన్నారని మల్గోంకర్ పుస్తకంలో ప్రస్తావిస్తూ, ఒక ఫోటో ఇచ్చారు. అందులో వాటాలేసుకున్నాక వచ్చిన ఫైళ్ళను పాక్ కు రైళ్ళో రవాణా చేస్తుంటే, క్లర్క్ లెక్కలు చూస్తున్నట్టు ఉంటుంది. అది చూసే విస్తుపోయాను. ఇహ, మీరు పైన ఇచ్చినవి చదువుతుంటే, నిజంగానే నవ్వొస్తోంది. “మనం” విడిపోయి, “నీ-నా” అయినప్పుడు ఈ మాత్రం వెర్రి తప్పదేమో!

నాకు ఇంకోటి అనిపిస్తోంది. గాడ్సే’ అనే అనామకుడికి ఒక రకంగా immortality వచ్చిపడిపోయింది. గాంధీ చంపింది ఎవరని అడిగితే, “గాడ్సే” అన్నది partly correct answer! ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా గాంధీని పోలీసులు ఈ దారుణం నుండి కాపాడగలిగేవారు. అసలు, గాడ్సే నేతృత్వాన ఓ ఐదుగురు కలిసి చేసిన ఈ మర్డర్ ప్లాట్ చదువుతుంటే ఏదో కామెడీ చదువుతున్నట్టు అనిపిస్తుంది. తింగరి వేషాలు వేస్తూ, అనుమానాలు రేకెత్తిస్తూ, ఎక్కడబడితే అక్కడ సాక్ష్యాధారాలు వదిలేస్తూ, ఏ మాత్రం పకడ్బందీ ప్లాన్ లేకుండా, ఏకంగా గాంధీ అంతటి పబ్లిక్ ఫిగర్ చంపడానికి ప్రయత్నంచటం హాస్యాస్పదమే! కానీ అంతటి lenient effortని కూడా మన పోలీసులు ఆపలేకపోవటం అంత కన్నా విడ్డూరం.

ఒకవేళ, గాడ్సే తనంతట తాను లొంగిపోకుండా ఉంటే అతగాడిని పట్టుకోడానికి మన యంత్రాంగానికి ఇంకెన్నాళ్ళు పట్టేదో?!

శ్రీనివాస్: మీరింతకు ముందు పేర్కొన్న గాడ్సే మాటలు తన డిఫెన్సు స్టేట్‌మెంట్‌లోనివనుకుంటాను. అది చాలా ఉద్వేగకరంగా ఉంటుందని విన్నాను.  మల్గోంకర్ రాసిన పుస్తకంలో ఆ ప్రసంగపాఠపు వివరాలున్నాయా?

పూర్ణిమ: పూర్తి పాఠం కాక, కీలక పాయింట్లను మాత్రమే ఇచ్చారు. అది కేవలం ఉద్వేగంగా ఉండడమే కాదు, నా మట్టుకు నాకు, ఆలోచింపజేసే విధంగా కూడా అనిపించింది. గాడ్సే వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలతో నేను ఏకీభవించే అవకాశం ఉందంటే, నేను అతడు చేసిన ప్రతి పనిని వెనుకేసుకొస్తానని కాదు. ఓ మనిషిని చంపటమనేది ఎప్పటికీ హేయమైన చర్యే! దాన్ని ఎవ్వరూ సమర్థించకూడదు. కాకపోతే అంతటి విపరీత చర్యకు ప్రేరకమైన ఆలోచనలూ, వాటినుండి ఏర్పర్చుకున్న అవగాహనను అర్థం చేసుకునే వీలుకలిపిస్తుంది, గాడ్సే ఆఖరి ప్రసంగం.

మల్గోంకర్ పుస్తకానికో పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే, ఇందులో జరిగింది జరిగినట్టు చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ పుస్తకం చదవదగ్గదే కాక, దాచుకోదగ్గది అని నా అభిప్రాయం. కారణం: ఇందులో అపురూపమైన చిత్రాలు, ఎన్నో కీలక డాక్యుమెంట్లను పొందుపరిచారు.

శ్రీనివాస్: మీరు మల్గోంకర్ పుస్తకానికిచ్చినట్లు నేను లాపియర్, కోలిన్స్ పుస్తకానికి నిష్పాక్షికత సర్టిఫికెట్టును ఇవ్వలేను. రచయితలకు గాంధీ అంటే విపరీతమైన గౌరవం, మౌంట్‌బాటెన్ పట్ల మిత్రభావం. నెహ్రూ పటేల్ ద్వయం మీద సానుభూతి. జిన్నా అంటే నిరసన. గాడ్సే బృందం మీద తీవ్రమైన ఆగ్రహం.

పూర్ణిమ: మీరు చెప్పినదానిబట్టి రచయిత తన సొంత అభిప్రాయాలనూ, భావోద్వేగాలనూ చరిత్ర చెప్పటంలో చొప్పిస్తే, ఈ పుస్తకం వల్ల పాఠకునికి కలిగే ప్రయోజనం ఏంటి? ఈ పుస్తకం ఎందుకు చదవాలి? ఎవరు చదవాలి? అన్నింటికన్నా ముఖ్యంగా, ఎలా చదవాలి? (అంటే ముందుగానే కొంత నేపథ్యం తెల్సుకొని చదవకపోతే తప్పుదోవ పట్టించే ప్రమాదం లాంటివి ఉన్నాయా?)

శ్రీనివాస్:“నేపథ్యాన్ని తెలుసుకొనే” ప్రయత్నంలో తప్పుదోవ పట్టమని ఏవిటి నమ్మకం? 🙂

పూర్ణిమ: నిజమే! అసలు ఈ దోవల్లో తప్పేంటో, ఒప్పేంటో తెల్సుకోవడమే అసలు చిక్కు. ఇలా ఒకటి అరా పుస్తకాలు చదివి అభిప్రాయాలను ఏర్పర్చుకొని, వాటిని నిశ్చితాభిప్రాయాలుగా మార్చేసుకొని వితండవాదాలు చేయడమా? లేక అనేక కోణాలనుండి చూడదగ్గ విషయాన్ని ఇలా ఒక కోణం నుండి చూసే వీలు కలిగిందని సరిపుచ్చుకోవడమా? అన్నది ఆయా పాఠకుల మీద ఆధారపడి ఉంటుందనుకుంటా. అందులోను ముఖ్యంగా చరిత్రను అభ్యసించడానికి కాకుండా చరిత్రను పరిచయం చేసుకునే తొలిదశల్లో ఉండే మనలాంటి వాళ్ళం ఆచితూచి అడుగులు వేయక తప్పదు.

శ్రీనివాస్: రచయితల అభిప్రాయాలూ, రాగద్వేషాలూ ఈ పుస్తకపు ధోరణిని  ప్రభావితం చేసినా, కొన్ని చోట్లలో ఓవర్‌సింప్లిఫై చేసారనిపించినా, వాతావరణ చిత్రణలో స్పెషల్ ఎఫెక్ట్‌లు కాస్త ఎక్కువైనా – ఈ పుస్తకం చదివి తెలుసుకోదగ్గవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నప్పుడెప్పుడో, నాలుగో ప్ఫదో అమరచిత్రకథలు చదివేసి చరిత్ర తెలిసిపోయింది లెమ్మనుకున్న నాలాంటివాళ్ళకు. :).

పూర్ణిమ: దేశవిభజన గురించీ, గాంధీ హత్య గురించీ కొంత తెలుసుకున్న తరువాత మీకేమనిపించింది? How do you sum up your reading experience of this book?

శ్రీనివాస్:  చాలా కొత్త విషయాలను తెలుసుకున్నాను గానీ కొత్త స్థిరాభిప్రాయాలేవీ ఏర్పరచుకోలేదేమో ఈ పుస్తకం చదివాక.

మొన్నెక్కడో చదివాను – అసలు జిన్నాకు పాకిస్థాన్ విడిపోవాలని లేనేలేదని. ఆ మాటను నెహ్రూ ప్రభృతులను ఇరకాటంలో పెట్టడానికి ఆయుధంలా వాడుకుందామనుకున్నాడట. ఆయన ఉద్దేశాలేమైనా జరిగింది మాత్రం దారుణ విధ్వంసమే కదా! వేర్పాటువాదాన్ని, మూక మనస్తత్త్వాన్ని రాజకీయాస్త్రాలుగా వాడుకోవడం కొండ పైనుంచి రాయిని దొర్లించడం లాంటిది. దొర్లించినంత సులువుగా నిలువరించలేము కదా!

విద్యాధికుడు, ఉదారవాది, కాన్స్టిట్యూషనలిస్ట్, సెక్యులర్ జిన్నా, రాజద్రోహం కేసులో తిలక్ తరఫున వాదించిన జిన్నా, ఖిలాఫత్ ఉద్యమాన్ని తీవ్రంగా ఖండించిన జిన్నా – ముస్లింలకు ఏకైక ప్రతినిధి (Sole Spokesman) గా, పాకిస్థాన్ పితగా పరిణమించడం ఎంత విషాదం! ఎందుకలా జరిగిందో ఇంకా తెలుసుకోవాలి నేను.

ఎందుకిదంతా చదవడం, తెలుసుకోవడం అనే ప్రశ్న తరచుగా ఎదురవుతుంది. బడిలో, పుస్తకాల నుంచీ కాకుండా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. మన పెద్దవాళ్ళనుంచో, సన్నిహితులనుంచో గ్రహించిన అభిప్రాయాలు – మంచివీ చెడ్డవీ – మన మనస్సులోకి బాగా ఇంకిపోతాయి. వాటిని అలాగే అవిచారితంగా వదిలేయకుండా తరచి నిగ్గు తేల్చుకోవడం మన మానసిక/బౌద్ధిక ఆరోగ్యానికి ఎంతో మంచిదని అనుకుంటాను. ఆ ప్రయత్నంలో భాగమే మన చరిత్ర గురించి తెలుసుకోవడం. 🙂

మీరేమంటారు?

పూర్ణిమ: హిహిహి.. ఇట్లాంటివి విచారించటమంటే మానసిక ఆరోగ్యానికి మేలు అనుకోవచ్చు, కానీ గాంధీ-గాడ్సే గురించి ఎక్కువ ఆలోచిస్తే మెదడు గిర్రున కూడా తిరగగలదు. అలా తిరుగుతున్నదాన్ని మధ్యలో ఆపేస్తే, అరకొర అభిప్రాయాలతో అదో తంటా!

శ్రీనివాస్: అర్ధజ్ఞానం అపాయకరం కదా! ఆలోచించకుండా బుర్రను స్విచాఫ్ చేయలేముగానీ “చరిత్రను అభ్యసించడానికి కాకుండా చరిత్రను పరిచయం చేసుకునే తొలిదశల్లో ఉండే మనలాంటి వాళ్ళం ఆచితూచి అడుగులు వేయక తప్పదు.”  (మీ మాటలే, :))

పూర్ణిమ: గాంధీ మనిషి కాకపోయుంటే, ఆయన జీవితం కేవలం ఒక కాల్పనిక గాధ అయ్యుంటే? జన్మంతా అహింసనే ఆశ్రయించిన యోధుడికి చివరికి ఒక మతోన్మాది చేతిలో చావా? కృష్ణుణ్ణి వేటగాడు చంపటం వెనుక గాంధారి శాపం ఉంది. మరి, ఎందరి తల్లుల శాపం కల్సి గాంధీని హతమార్చింది? ఏవో బలమైన కారణాలు చూపించక, చివర యాభై పేజీల్లో ఒకడు అమాంతంగా పుట్టుకొచ్చి, కథానాయకుడిని ఒక్క దెబ్బలో నేలకూలిస్తే, అంత అసంబద్ధమైన కథను రాసినవాణ్ణి ఏమనాలి? Gandhi’s life had been an incredible journey and his death, the mother of all anti-climaxes.

శ్రీనివాస్: కథలల్లేవాళ్ళకి యాదృచ్ఛికతను తమ రచనల్లో కంట్రోల్డ్‌గా చొప్పించే వెసులుబాటు ఉంటుంది. విధికి పాపం ఆ సదుపాయం ఉండదు కదా! ఉన్నట్లుండి యాదృచ్ఛికత ఎక్కువగా ఒలికిపోయి రసాభాస అవుతుంది జీవితం… గాంధీ  “బలిదానం” తరువాత, విభజన అల్లర్లు సద్దు మణిగాయట సరిహద్దుకి ఇరువైపులా. ఆ కోణం నుంచి ఆలోచిస్తే గాంధీ జీవితానికి మరీ అంత అర్థరహితమైన ముగింపేమీ కాదేమో ఆయన హత్య. It was a cruel and tragic end, of course.

పూర్ణిమ: ఇక, గాడ్సే సైకాలజిస్ట్‌లకు మంచి కేస్-స్టడీ అవుతాడు. అతడు చేసినది క్షమింపలేనిదే! కానీ అందుకోసం అతడు చూపిన తెగువ, ధైర్యం అబ్బురపరుస్తాయి. అతడి ఆలోచనలు తప్పుదారిపట్టి ఉండవచ్చు, కానీ ఎవరినుండి ఒత్తిడి లేకపోయినా, ఒక ప్రయత్నం విఫలమైనా, పారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నా, తనకుగానీ, తనవారికిగానీ నేరుగా ఎలాంటి కష్టం వాటిల్లకపోయినా, చాటుమాటునుండి నేతృత్వం వహించి ఆనక తప్పించుకునే అవకాశం ఉన్నా తాను చేయాలనుకున్నది చేశాడు.

విభజనకు కారణం మౌంట్‍బాటెన్/జిన్నా అని నమ్మి, వాళ్ళని చంపుంటే, అప్పుడు మనం గాడ్సేని మరో భగత్ సింగ్ అని అనుకునేవాళ్ళమా?

శ్రీనివాస్: సందేహమా?

పూర్ణిమ: 🙂 ఇక ఇక్కడితో చర్చను ముగిద్దాం. అడిగిన వెంటనే చర్చకు ఒప్పుకొని, నేను చేసిన జాప్యాలకు విసుక్కోకుండా మీరు చదివిన పుస్తకం గురించి తెల్సుకునే వీలు కలిగించడమే కాకుండా, నేను చదివిన పుస్తకంలో కూడా కొత్త కోణాలు చూసే విధంగా మీ ఆలోచనలు పంచుకున్నందుకు బోలెడన్ని థాంక్స్.

*****

Books Details: 

Freedom At Midnight 

Authors: Dominique Lapierre, Larry Collins

Publishers: Vikas Publishing House

No. of Pages: 774


The Men Who Killed Gandhi

Author: Manohar Malgonkar

Publishers: Roli Books Pvt Ltd.

No. of Pages: 355

 

Further links: 

N.S. Rajaram review of The Men who Killed Gandhi

 

You Might Also Like

25 Comments

  1. 2012లో చదివిన పుస్తకాలు | పుస్తకం

    […] *The Men Who Killed Gandhi – Manohar Malgoankar: ఇదో అపురూపమైన పుస్తకం. దాచుకోదగ్గ పుస్తకం. చదవాల్సిన పుస్తకం. […]

  2. varaprasad

    yes this is the realstory,anatdu teesukunna nirnayalu manchiva cheddava annadi kalame nirnainchali.

  3. margam rajpal

    if gadses place gaffur the present stuation ,problems of today may not arise.

  4. Dr.M.V.Ramanarao

    దేశవిభజన కాలంలో మేము కాలేజీలో చదువుతూ ఉండేవాళ్ళం.అప్పుడు హిందూ-ముస్లిం తగాదాలు ,విద్వేషాలు భయంకరంగా ఉండేవి.ఈ తరం వాళ్ళకి అర్థం కాదు.గాంధి,నెహ్రు సెక్యులరిస్టులు, శాంతివాదులు.కాని పాకిస్తాన్ నాయకులు మతోన్మాదులు.భారత్ ను ద్వేషించేవారు.అప్పటి పరిస్థితిలో దేశవిభజన తప్పనిసరి అయింది.ఎంతో రక్తపాతం,కాందిశీకులు పారిపోవడం రెండు పక్కలా జరిగింది.ఎవరినో ఒక్కరినే తప్పుపట్టలేము.గాంధీ,నెహ్రూలనేకాదు ఎవరినైనా విమర్శించవచ్చును.భారతదేశచరిత్రలో ఒక భయంకరమైన,దురదృష్ట కరమైన కాలం అది.ఇప్పటికీ పాకిస్తాన్ మదేశానికి హానిచేయడానికి,విచ్చిన్నం చేయడానికి ప్రయత్నంచేస్తూనేఉందికదా.కాని ఇప్పుడు భారత్ పూర్వంకన్నా బలీయంగాఉంది.సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంది.తప్పులు చేసినా గాంధీ,నెహ్రూలు గొప్పనాయకులే.గాంధీజీ స్వరాజ్యోద్యమాన్ని శాంతియుతంగా నడిపించి దేశ స్వాతంత్ర్యాన్ని సాధించాడు.పండిట్జీ ఆధునికభారత్ నిర్మాణానికి గట్టి పునాదులు వేసాడు.(Architect of modern India.)

  5. Purnima

    Thanks to everyone, for dropping by and sharing your thoughts.

    India Today’s new edition has an interesting imaginary conversation between Gandhi and Jinnah, on the eve of 66th Independence day.

    http://indiatoday.intoday.in/story/gopalkrishna-india-pak-gandhi-mahatma-gandhi-and-quaid-e-azam-imaginary-conversation/1/212757.html

    The following makes a good read:

    http://indiatoday.intoday.in/story/india-today-editorial-director-m.j.-akbar-india-pakistan-65-years-of-independence/1/212768.html

  6. Indian Minerva

    నిన్న పూర్తిచేశాను ఈ పుస్తకాన్ని చదవడం నాకనిపించింది ఇవి

    హంతకులు ఏదో ఒకటి పెద్దది చేసిచూపాలని ఈపనిచేశారేకానీ వాళ్ళు చేయబోతున్నపని పర్యవసానాలు వాళ్ళకి తెలిసిచేశారని అనిపించలేదు. గాడ్సే విషయంలోకూడా చివర్లో ఆయన కోర్టులో చెప్పిన మాటలను మినహాయిస్తే చేతికందిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉన్మాదం తప్ప మరేమీ కనవ్బడలేదు. వీళ్ళ plotting అంతా చాలా comical గా అనిపించింది. వీళ్ళ ఆవేశంలోనూ, గాంధీ చనిపోయిన తరువాత జరిగిన అల్లర్లలో బ్రాహ్మణులను చంపడంలోనూ మానవ సమాజంలోని ఒక వికృత పార్శ్వం కనిపించింది. ఎవరు హత్యచేశారో వారినేమీ చేయలేకపోతేనేం? వాళ్ళ కులమోళ్లనో, మతమోళ్ళనో చంపేశాం. ఆవిధంగా ఏదో చేసేశాం అన్నది ఇప్పటికి ఎన్నిసార్లు repeat అయ్యుంటుందంటారు? హిందువులు, సిఖ్ఖులు, ముస్లిములు… ఇంతకు మించి మనకు identityలు ఉండవా? ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరా? అనిపించింది.

    ఇహ పోలీసులు. తరువాత్తరువాత పోలీసు వ్యవస్థ ఎలా పనిచేయబోతోంది అనడానికి ఒక preview ఇచ్చినట్లనిపించింది.

    గాడ్సే “ఒక మనిషి మొండిపట్టు, ప్రజాప్రభుత్వాన్ని కాళ్ళబేరానొకొచ్చేయాచేయడం గర్హనీయం” అని గాంధీ గురించి చేసిన వ్యాఖ్యల్లో నేను హజారేకి connect అయ్యాను 🙂 . యుధ్ధంలోనున్న శత్రువుకి ఆర్ధికన్యాయంకూడదన్న art of war నీతి గాడ్సే దయితే, నీతి వీటన్నిటికంటే ఉన్నతమైనదన్నది గాంధీ భావన. ఎవరు right అంటే ఏంచెబుతాం చెప్పండి? నేను ఈవిషయంలో గాడ్సేకి (మరియు కాంగ్రెస్‌కి) మార్కులేస్తాను.

  7. విజయవర్థన్

    1945 ఆఖరుకల్లా బ్రిటీషు వారికి ఇండియాని వదిలించుకోవాలని అర్థం అయ్యింది. బ్రిటీష్ ప్రధాని Clement Attlee భారత దేశానికి 1948 జూన్ కల్లా అధికారం అప్పగించాలని నిర్ణయించిట్టు పార్లమెంట్లో ప్రకటంచాడు. 1947 ఫబ్రవరిలో అప్పటి వైస్రాయ్ Lord Wavellని ఒక నెలరోజుల్లో వెనక్కోచ్చేయమని అదేశించింది బ్రిటీష్ ప్రభుత్వం.

    June 1948 కల్లా పని ముగించమని Lord Mountbattenని పంపారు. 14 March 1947 రోజు Lord Mountbatten అధికారంలోకి వచ్చిన ఐదు రోజులకే కలకత్తా, బొంబాయిలలో అలజడులు మొదలై వందకు పైగా మరణంచారు. పరిస్థితి చేయి దాటుతోందని తలచి 15 Aug 1947 కల్లా అధికారం బదలాయించనున్నట్టు Lord Mountbatten పత్రికా ప్రకటన చేసాడు.

    పక్షపాతం లేకుండా చేస్తాడనే అప్పటి ప్రముఖ లాయర్ Sir Cyril Radcliffeకి దేశ విభజన పని అప్పగించారంట. ఎప్పటివో పాత maps, census returns వాడి ఏడు వారాల్లో పాకిస్థాన్, ఇండియా maps తయారు చేసాడు.

    Lord Mountbatten ఈ mapsని 17 Aug 1947దాకా బయటపెట్టరాదని నిర్ణయించాడు. ప్రముఖ చరత్రకారుడు Leonard Mosely ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ దేశాల హద్దులు ముందే తెలిస్తే కొన్ని లక్షల హిందువుల, ముస్లిముల, సిక్కుల ప్రాణాలు పోయేవి కావు అంటాడు.

    అంతే కాకుండా, విభజనకు ముందు పెద్ద మొత్తంలో బ్రిటీషు సైన్యాన్ని దింపి విభజన తర్వాత ఉపసంహరించాలని Lord Wavell చేసిన ప్రతిపాదనను పెడచెవిన పెట్టకపోయినా ఈ మారణ కాండ జరిగేది కాదని ఒక అభిప్రాయం. Lord Mountbatten తొందర పడి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోలేదని ఒక విమర్శ.

    Reference: From Raj to Swaraj : The Non-fiction Film in India, BD Garga

    1. Purnima

      Though I’ve not watched the following movie in full, I guess, it does show yet another interpretation on set of events that occurred pre-partition.

      Lord Mountbatten: The Last Viceroy – http://www.imdb.com/title/tt0090475/

    2. విజయవర్థన్

      This DVD is available in India. There is also one very extensive (5-6 hours) documentary : Lord Mountbatten: A Man for the Century (1968) : http://www.imdb.com/title/tt0335705/
      It is difficult to get this documentary in the market now.

  8. Srinivas Nagulapalli

    మంచి పరిచయం. అంతకన్నా మించి, వర్తమానానికి, ముఖ్యంగా యువతకు, పనికొచ్చే ఆంశం.

    “Great people make great mistakes” కాదనుకుంటాను.
    Really great people consider their mistakes as great and grave. But we seem to consider even our great mistakes as not that great or big.

    గాడ్సే ఆలోచనారాహిత్యానికి పెద్ద అద్దం అతని తూటాలే, కాదు, మాటలే!
    “For, had the Indian Press impartially criticized the anti-national policy carried on by Gandhiji and had they impressed upon the people that the interest of the nation was far greater than the whim of any individual howsoever great he may be, Gandhiji and his followers could never dare concede Pakistan to the Muslims as easily as has been done.
    The fear about such a Press — weak and subservient as it was could not dislodge my resolve.- Godse”

    What stopped Godse from impartially criticising any policy in the same Indian Press? No one stopped him from starting his own Press. If he found it so “weak and subservient”, then why not make it strong and super independent? It is a desperate attempt to find excuses to justify what is unjustifiable, to appear reasonable when it is madness, and display concern while blood is on one’s hands. Also, Godse not running away after shooting Gandhi is no virtue either. After all, he craved for getting attention more than even perpetrating murder. Even if Godse did not kill, Gandhi would have died in few years- he was old. And eventually Godse would die too. But what Godse wanted is attention for his madness, not mere killing of Gandhi. And he miserably failed, as he himself feared, in hopelessly trying to project how insanely great or rational he was against Gandhi.

    ఒక్క ముళ్ళు, కాదు, మాట గుచ్చుకుంటేనే తట్టుకోవడం కన్నా, తిట్టుకోవడం, కొట్టుకోవడం సహజమూ సామాన్యమూ అయిన సమాజంలో గుండెను తూటాలతో పొడిచినా ఒక్క మాటంటే ఒక్క మాటైనా, ఒక్క తిట్టైనా, కనీసం సహాయం కోసం ఆర్తనాదమైనా చేయని ఒక మనీషి నిజంగా మనమధ్యే జీవించాడా అన్నది మానవత్వం మేలుకొన్నంతవరకూ నిలదీసే ప్రశ్నే.

    ఏ అధికారం లేని, ఏ పదవి లేని, కనీసం ఏ ధనం లేని, పోనీ ఏ పాండిత్యమైనా లేని, చూడాడానికి కనీసం అందం కూడా లేని, చుట్టూ ఎటువంటి రక్షకబలం లేని, వంటినైనా పూర్తిగా కప్పుకోని,
    ధనం, సమయం, జీవితం సర్వం జాతి సేవకే అంకితం జేసిన – ఒక్క మనిషి, ఒక్కడంటే ఒక్క మనిషి యొక్క ఉనికి పై, ద్వేషం, కాదు, చంపాలన్న చిత్తవృత్తికి కారణాలు చెప్పడం, ఆ మనిషిలోని లోని లోపాలను వెతకడం, కంట్లో దూలాలు పెట్టుకొని సూదికోసం వెతికినట్లుంది. అంటే అవి లేవని కాదు, కాని వెతికే కళ్ళు సరిగ్గా చూసుకోని, సరి చేసుకోని అమాయకత్వం, అంధకారం.

    ఇంతైనా, గాంధీనే చంపింది, గాంధేయవాదాన్ని కాదు. సొంత కొడుకులే ఆస్తులకోసం తండ్రిని తుదముట్టించడం, లేదా తండ్రి చస్తే ఆ పదవి కోసం వెంపర్లాడటం, నాగరికత అయిపోయిన సమాజంలో, ఆస్తులు, పదవులు సైతం లేని వ్యక్తిని చంపడం పెద్ద విశేషం కాదు. అటువంటి సమాజంలో సైతం అహింస, మానవత్వం కోసం బతికిన మరణించిన జీవితప్రయత్నమే పెద్ద విశేషం, మానవత్వానికి స్ఫూర్తిమంతం.
    =====
    విధేయుడు
    శ్రీనివాస్

    1. Purnima

      >> “Great people make great mistakes” కాదనుకుంటాను.

      నేను కొంచెం వివరించటానికి ప్రయత్నిస్తాను. ఒక ఇంటి యజమాని ఉన్నాడు (అనుకుందాం). చాలీచాలని సంసారంతో ఇద్దరి పిల్లలను ఎట్లానో పెంచుతున్నాడు. అనుకోకుండా అతడికో అవకాశం ఎదురొచ్చింది. అదృష్టం కలిసొస్తే తిరిగి చూసుకోనక్కర్లేదు. కల్సిరాకపోతే మాత్రం ఉన్న కాస్తా కూడా ఊడ్చుకుపోతుంది.

      అతడి పంట పండితే, రిస్క్ తీసుకున్నందుకు అందరూ అతడిని గొప్ప సాహసిగా పరిగణిస్తారు, అతడి పిల్లలతో సహా. కాకపోతే మూర్ఖుడిగా పరిగణించొచ్చు.

      గల్లీలో క్రికెట్ ఆడేటప్పుడు ఒక చెత్త షాట్ కొట్టి అవుట్ అయిపోతే ఆ ఆటగాడి మీదే దాని ప్రభావం ఉంటుంది. అదే ఇండియా కోసం సచిన్ ఆడుతున్నప్పుడు కొట్టకూడని బంతిని కొడితే, అది కొన్ని కోట్ల హృదయాలను గాయపరుస్తుంది. (Please note I’m not trying trivialize the intensity and density of Gandhi’s role in India. The point I’m making is the following:)

      నడుస్తున్న దారి ఒక్కసారిగా రెండుగా చీలి, ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలన్న మీమాంస ఎవ్వరికైనా తప్పదు. కానీ గొప్ప వ్యక్తుల స్టేజ్ చాలా పెద్దది. వాళ్ళ నిర్ణయాల ప్రభావం వాళ్ళ మీదే కాకుండా ఇంకెందరి పైనో పడుతుంది. నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళ ఆలోచనాసరళి, వాళ్ళ ఉద్దేశ్యం ఏమైనా, తీసుకున్న నిర్ణయాలని బట్టి మనిషి నిర్దారించటం పరిపాటే కాబట్టి.. great people make great mistakes. Otherwise put, great people’s decision cause great implications.

      >> But what Godse wanted is attention for his madness, not mere killing of Gandhi. And he miserably failed…

      If it was merely attention that Godse seeked for, I’m afraid, he’s got it more than he might have imagined. It IS about Godse that we’re all focused on whenever we talk about Gandhi’s demise. Why don’t we talk about the failure of the system to protect “The Father of the Nation”? When already a murder attempt on him failed, why haven’t we taken it seriously? How could we let someone as important as Gandhi to be killed by a group of people, who where nothing more than comical?

      I don’t know if Godse was insane or intellectual, but I know he succeed because many others who should have been on guard, took it easy. What scares me is that even Gandhi’s life wasn’t treasured. Oh yeah, Godse was hanged. But after Gandhi was gone, long gone. మనం ప్రాణానికి ఎంత విలువిస్తామన్నది నాకు అనుమానమే!

    2. Srinivas Nagulapalli

      True, great men’s decisions have great impact. And Gandhi’s decision to live and die by his principles is why he is remembered still. Even with hindsight and luxury of looking from 60+years of history vantage point, it is far from clear and not at all convincing what exactly was Gandhi’s great mistake. And Godse’s is not even a mistake, but a horrific crime.

      > Why don’t we talk about the failure of the system to protect “The Father of > the Nation”?

      At least during Gandhi’s time, it appears not much of the failure of the system. Because, there was not much of a system in place then. It happened barely after getting independence and Gandhi also refused to have body guards.

      Far from cynical, I believe human life was (hopefully is!) more treasured in India than any where else.Really! After reading elsewhere about killing sprees in schools, horrible killings in movie theaters, opening fire inside worshipping places, or shooting just because of traffice rage- it is really relieving they are not happening, at least so far, in India. It is consoling and even humbling to know how much hardship and pain people suffer every day, without resorting to violence in India. I think people deserve much more credit than they get often.
      =====
      Regards
      Srinivas

    3. Srinivas Vuruputuri

      >> మనం ప్రాణానికి ఎంత విలువిస్తామన్నది నాకు అనుమానమే!

      ఏ భూకంపమో, ఉగ్రవాదమో, మత కలహమో, అజాగ్రత్త వల్ల కలిగిన ప్రమాదమో సంభవించి వందల, వేల ప్రాణాలు పోయినప్పుడు, నిజమే ఇక్కడ ప్రాణానికి విలువ లేదు అనిపిస్తుంది.

      “సమయానికి స్పందించి ఉంటే”/”ఇంకోలా జరిగి ఉంటే” అని ఘటనానంతర విశ్లేషణలెలా ఉన్నా హఠదుపద్రవాలను ఎదుర్కొనే శక్తి మన వ్యవస్థకు చాలా తక్కువ అనిపిస్తుంది.

      “ఇండియా అనేది కేవలం ఓ భౌగోళిక భావన” అని జిన్నా అన్న మాట చాలా సినికల్‌గా వినిపించినా దాన్ని నిజం చేయడానికి ఈనాటికీ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నామా మనం అని అనుమానం కలుగుతుంది.

    4. Srinivas Vuruputuri

      >> But what Godse wanted is attention for his madness, not mere killing of Gandhi.

      I don’t think that Godse was an attention monger. He was reticent person by nature (my impression after reading the Freedom at Midnight) Gandhi’s assassination was a political statement of sorts. An extreme and unjust reaction. A sad climax for a terrible tragedy!

    5. jagannadha rao. kolluru

      Sreenivas gariki Gandhi bhakti ekkuvai ala matladutunnaru. Pakistan nundi pranalu aracheta pattukuni vachi vunte ala anagaligevaru kadu. Gandhi ni vimarsiste adedo papam ane manasika jadyam lo unnaru. Desa swanatantrya sadhana lo Gandhi patra nu pogadandi, ade samayamlo jarigina porapatlanu etti choope dhyryam cheyandi. Gandhi ni pogidevallaku desamlo lotemee ledu. Ardham chesukunevalle takkuva.Godese emee criminal kadu. Gandhi lage athadu kuda ahimsa vade. Ganhi charyala valla Pakistan lo poyina pranalaku evaru badhyata vahincharu? Gandhi deeniki naithika badyatha vahinchada? Kaneesam vachina ala paripoyi vachina variki shelter kosam satyagraham chesada? Gandhi congress lo Anna (six paisa) sabhyatvam kuda leni sabhyudu,( Bhogaraju seetha ramayya gari congress charitra chadavandi) kani Tripura congress adhyaksha padaviki thana candidate ga Dr.Bhoga raju ni sponcer chesadu. Group rajakeeyalanu a mahanubhavaude parichayam chesadu. Hyderabad Nizam vishayamlo okalaga Kashmir Raju vishayamlo okalaga matladadam evidhamga sari ainado meere cheppli. Meeru poornima garu kallisi patha abhiprayanne marola chepparu. Nijalanu angeekarinche dhyryam lenivaru anthakanna emicheyaleru.

    6. Srinivas Vuruputuri

      జగన్నాథరావు గారికి

      నాకు గాంధీ భక్తి మానసిక జాడ్యమేమీ లేదండీ. తనను ఎవరైనా విమర్శిస్తే నేనేమీ అనుకోను, :).

      నేనూ పూర్ణిమ గారూ ఒకే (పాత) అభిప్రాయాన్నే మరోలా చెప్పామని అన్నారు. మీరు ఏ పాత అభిప్రాయం గురించి మాట్లాడుతున్నారు?

      గాంధీ తప్పులు చేయలేదని నేను అనలేదు. దేశవిభజనకు గాంధీ ఒక్కడే బాధ్యుడు కాదు అన్నాను.

      “గాంధీ చర్యల వల్ల పాకిస్థాన్‌లో పోయిన ప్రాణాల” గురించి రాసారు మీరు. ఈ చర్యలేమిటో వాటి పర్యవసానాలేమిటో ఇంకాస్త తీరిగ్గా చదువుకోవాలి నేను. సహాయ నిరాకరణం నుంచి తన మరణం దాకా – దాదాపు ముప్పై ఏళ్ళ చరిత్రను గాంధీ ఒంటి చేత్తో రాయలేదు కదా. He was a lead player అంతే! గాడ్సే కోణం నుంచే కాకుండా మరో నాలుగు కోణాల్లోంచి చూస్తే మీరూ ఇంత తీవ్రంగా స్పందించేవారు కాదేమో…

      బోస్-గాంధీ విభేదాల గురించీ, కాశ్మీర్ మహారాజాకిచ్చిన సలహా గురించీ గాడ్సే స్టేట్‌మెంట్‌లో ఉన్నమాటలను చదివాను నేను. ఈ రెండింటికీ దేశవిభజనకు సంబంధం ఉందని అనిపించలేదు. ఇంతకు ముందు చెప్పినట్లు గాంధీ తప్పులు చేయలేదని వాదించడం నా ఉద్దేశం కాదు.

      శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు గాంధీ సత్యాగ్రహం ఎందుకు చేయలేదని అడిగారు మీరు. అప్పటికా ప్రయత్నం భారత ప్రభుత్వం ప్రారంభించింది కదా! సెప్టెంబర్ మొదటివారంలో మొదలైన ఈ పునరావాస ప్రయత్నాల అధ్యాయాన్ని (ఫ్రీడం అట్ మిడ్‌నైట్‌లో) చదవాలి మీరు.

      గాంధీ హత్య దాకా గాడ్సేకి క్రిమినల్ రికార్డు లేదు. తను run of the mill క్రిమినల్ కాదు, నిజమే. అయితే గాంధీ హత్యని క్రిమినల్ చర్యగానే పరిగణించాల్సి ఉంటుంది. హత్యకి ప్రేరేపించిన ఉద్దేశాలనూ, ఉద్వేగాలనూ లెక్కలోకి తీసుకున్నప్పుడు గాడ్సేని మనం (సాధారణ ప్రజలం) క్షమించవచ్చును, కీర్తించవచ్చును. అది వేరే విషయం!

      క్షమించాలి, చాలా పొడుగ్గా రాసేసాను. మీరు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా జవాబు రాయాలంటే ఇంకా చదవాలి నేను.

      శ్రీనివాస్

    7. Srinivas Nagulapalli

      నిజమే, విభజనలో ఎంతో మంది ప్రాణాలు ఎంతో దారుణంగా పోయాయి. మరి ఇంకెంతో మందికి కన్నీళ్ళే మిగిల్చాయి. కాని, గాంధీ అహింసా వాదం లేకుండా, అందరూ గాడ్సే తుపాకి పద్దతి పాటిస్తే, ఇంకెంత నెత్తుటికాండ జరిగేదో ఊహించడం కష్టం. పోయిన ప్రాణాలు పోగా వారికోసం ఏడ్వడానికి కూడా ఎవ్వరు మిగిలేవారు కాదేమో.

      నేరస్థుడు కాని గాడ్సేను పంజాబ్ కోర్టు ఉరితీసిందా? గాడ్సే ఏ విధంగా నేరస్థుడు కాడు, ఏ విధంగా అహింస వాది? గాంధీ ఏం చర్యలు పాకిస్తాన్ లొ పోయిన ప్రాణాలకు కారణాలు? గూపు రాజకీయాలను గాంధీ పరిచయం చేసాడా? గాంధీకి ముందు గ్రూపు రాజకియాలు లేకుండా, జనులు విధ్వేషాలు వీడి, కొట్టుకోకుండా సామరస్యంగా అహింసతో సంత్‌పురుషులవలె మెలిగే వారా? గాంధీ ఎవరినైనా కొట్టుకు చావండి అన్నాడా? గాంధీ ఏమన్నా కాంట్రాక్టు తీసుకున్నాడా పాకిస్తాన్ నుంచి వచ్చినవాళ్ళకోసం సత్యాగ్రహం చేస్తాను, ఆశ్రయం ఇస్తాను అని? ఎన్ని విభేదాలున్నా, ఒక్కటి మాత్రం నిజం. అందరితో పాటు గాంధీకి కూడా జీవించే హక్కు ఉంది. ఆ హక్కును కాదని తూటాలు వేసిన గాడ్సే ముమ్మాటికీ నేరస్థుడే, హింసతోటే పరిష్కారం అని నమ్మిన ఉగ్రవాదే. ఇప్పటికీ హింసతోటే పరిషారం అని నమ్మే ఆలోచనారహిత ఉగ్రవాదం, పరిష్కరించినదానికన్నా ఆవిష్కరించిన సమస్యలు మన చుట్టూ, కాదు, మన కళ్ళముందు కనబడూతూనే ఉన్నాయి కదా!
      =====
      విధేయుడు
      _శ్రీనివాస్

    8. Srinivas Vuruputuri

      >>> గాంధీకి ముందు గ్రూపు రాజకియాలు లేకుండా, జనులు విధ్వేషాలు వీడి, కొట్టుకోకుండా సామరస్యంగా అహింసతో సంత్‌పురుషులవలె మెలిగే వారా?

      కాదని ఖచ్చితంగా చెప్పగలము. 1907 సూరత్ సమావేశాల్ల్లో చెప్పు విసురుతో మొదలై, అతివాదులూ, మితవాదులూ లాఠీలు, కుర్చీలు బెంచీలు చేతబట్టి విజృంభించిన కథ సుప్రసిద్ధమే కదా!

      క్లుప్తంగా:

      “Within an hour the vast pandal, strewn with broken chairs, sticks and rags of raiment stood empty as a banquet hall deserted.

      In the twinkling of a shoe the Congress had been changed, and a new spirit, a different and difficult spirit had indeed arisen in the country.”

      వివరాలకు ఇక్కడ చూడండి

    9. rama reddy

      nijamga gandhiji chala great. ippudu prati vallu gandhiji ni vimarsinchadame, ahimsa viluva ippati taramlo chala mandiki teliyadu

  9. pavan santhosh surampudi

    గాడ్సే లొంగిపోయి తన వాదనను వివరించి ఉరికి సిద్ధపడటం చాలా ఉదాత్తమైన పని.
    ఒకవేళ అతను పారిపోయి చంపినవాడు ఒక ముస్లిం అన్న పుకారు పుట్టిఉంటే భారత ఉపఖండం రావణకాష్టమైపోయేది. ఆ మతమౌఢ్యపు చిచ్చు ఆరడం అంత తేలిక కాదు.

    1. Srinivas Vuruputuri

      >> చంపినవాడు ఒక ముస్లిం అన్న పుకారు పుట్టిఉంటే…

      ఎవరు చంపిందీ తెలియక మునుపు మౌంట్‌బాటెన్ మనస్సులో, వేలాది ప్రజల మనస్సుల్లో ఇదే భయం ఉన్నదట. అన్ని కార్యక్రమాల్ని ఆపేసి ‘శతాబ్దపు సంచలన వార్త ‘ను ప్రసారం చేయడానికి బదులు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ బాధ్యతగా వ్యవహరించి అన్ని ప్రసారాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించాడట. పోలీసుల ద్వారా సరైన సమాచారం అందాక సాయంత్రం ఆరింటికి చేసిన హత్యోదంత ప్రకటనలో “హంతకుడు హిందువు” అనే మాటలు చేర్చి మరీ చెప్పారట.

  10. Shouri

    >>> ఇక, గాడ్సే సైకాలజిస్ట్‌లకు మంచి కేస్-స్టడీ అవుతాడు. అతడు చేసినది క్షమింపలేనిదే! కానీ అందుకోసం అతడు చూపిన తెగువ, ధైర్యం అబ్బురపరుస్తాయి. అతడి ఆలోచనలు తప్పుదారిపట్టి ఉండవచ్చు
    >>> ఓ మనిషిని చంపటమనేది ఎప్పటికీ హేయమైన చర్యే!
    Even after so much study of the incident and it’s related events, Manohar didn’t make comments like this.

    – Bhagath Singh, Subhas Chandra Bose, are they heroes? They also killed humans. Is this justified?

    – If your personal biases are impacting the decision making process and are in a way the reason for the killing of thousands of people, you should take the responsibility of your acts and biases. IND – PAK division is such an event and any person among those people who’ve seen the worst atrocities would definitely revolt. Even though Government has formed by the time, Gandhi is very much influential (If Gandhi ).

    http://www.scribd.com/doc/61255807/Exposing-Gandhi-The-Naked-Saint-and-His-Spiritual-Terrorism-of-Nonviolence

    http://www.smileosmile.com/celebrities/why-i-killed-gandhi-nathuram-godses-final-address-to-the-court/

    >>> From – http://www.mkgandhi.org/articles/nonviolence1.htm

    The sentence “By the same logic” in the below paragraph shows what exactly that was asked by Gandhi ………

    ===============

    Beginning the following day, he would go on an indefinite fast. It would be broken only when the hearts of Delhi’s different communities were again one.

    The fast, Gandhi made it clear, was undertaken for the Muslims of the Indian Union. It was, therefore, for the Hindus and the Sikhs of the Union to decide how they would respond to it. *** By the same logic ***, the fast was also for the minorities in Pakistan. For, knowing what he was doing for the Muslims of the Indian Union, Muslims in Pakistan had to decide how they would treat their minorities. This meant, Gandhi pointed out, that the fast was intended to rid of their madness people in both India and Pakistan. It heartened him to know from Mridula Sarabhai, who was then in Pakistan, that people there wanted to know what Gandhi expected them to do in Pakistan. His characteristically forthright reply was:

    Pakistan has to put a stop to this state of affairs. They must purify their hearts and pledge themselves that they will not rest till the Hindus and Sikhs can return and live in safety in Pakistan.

    His call was not without its effect. Especially because, right at its commencement, the fast had led the Indian Government to release the fifty-five crore rupees of Pakistan’s share of the cash assets, which had been withheld pending the settlement of the Kashmir issue. Ghaznafar Ali Khan, Pakistan’s Refugee Minister, said that Gandhi’s fast should make people in Pakistan and India face the shame they had brought upon themselves and atone for it. He called upon the leaders of the two countries to meet together in a spirit of honest cooperation and eliminate all friction.

    Yet, not many understood Gandhi’s way of dealing with the problem. This is revealed in the following question from a journalist ‘Why have you gone on fast at a time when there is no conflict in any part of the Indian Union?’ Gandhi’s reply is equally revealing: ‘People are systematically and resolutely trying to take forcible possession of Muslim houses, will it not be called conflict? This conflict has gone to such an extent that the police and the army have been forced to reluctantly use tear-gas and, albeit in the air, to use the guns…. It would have been utter folly on my part to keep witnessing this devious way of throwing out the Muslims. I call it killing by ordeal.’

    The Delhi fast, which Gandhi described as his greatest, lasted two days longer than the one in Calcutta. He broke it, on 18 January, after a statement, following frantic efforts by the Government in Delhi, had been signed by more than a hundred representatives of various communities and political organizations. The signatories declared their ‘heart-felt desire that the Hindus, Muslims and Sikhs and members of other communities should once again live in Delhi like brothers’. The signatories also pledged ‘to protect the life, property and faith of Muslims’, and assured that communal violence would not recur in Delhi. They assured that the Muslims would get back the mosques which the Hindus and Sikhs had occupied, and further that there would be no objection to the return of those Muslim migrants who wished to come back to Delhi. Finally, assuring that all this would be done by their personal efforts without the help of the police or the military, they requested ‘Mahatmaji to believe us and to give up his fast, and continue to lead us, as he has done hitherto.’

    We are seeing the pampering politics and Gandhi is the one who had initiated such kind of politics. The statement by Gandhi saying Shivaji, Rana Pratap and Guru Govind Singhji “misguided spirits” itself reveals his intentions.

    ===============

    There were lot of discussions in the net but personally experiencing the worst is the most worst thing that can happen and it happened to 3 – 4 millions of people and that hatred has resulted in the assassination of Gandhiji.

    regards,
    Shouri

    1. Purnima

      >> Even after so much study of the incident and it’s related events, Manohar didn’t make comments like this.

      Yep. He didn’t. And that was amply noted in my observations. Are you sure you’re not confusing between an author’s responsibility to project history in an objective manner and a reader’s fleeting thoughts or personal opinion about a set of incidents?

  11. saraswathi rama

    thank you! nice conversation!

  12. Indian Minerva

    Thank you!

Leave a Reply