పుస్తకం
All about booksపుస్తకభాష

February 9, 2012

ఏడుతరాలు – అలెక్స్ హేలీ

More articles by »
Written by: అతిథి
Tags:

రాసిన వారు: ఆలమూరు మనోజ్ఞ
******************
నేను ఎనిమిదవ క్లాసులో ఉన్నప్పుడనుకుంటాను ఆ పుస్తకం చదివాను. విపరీతంగా కదిలిపోయాను. ప్రపంచం ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. అదే పుస్తకాన్ని వరుసగా మూడు సార్లు చదివాను. కొన్ని పేజీలను మళ్ళీ మళ్ళీ చదివాను. ఎన్ని సార్లు చదివానో అన్ని సార్లు ఏడిచాను. అలాంటి జీవితాలు ఇంకెవరికీ ఉండకూడదని కోరుకున్నాను. ఆనాడు నా మనసును కదిలించి, చెరగని ముద్ర వేసి, ప్రపంచం, జీవితం అంటే చూపించిన పుస్తకం అలెక్స్ హేలీ రాసిన ఏడు తరాలు.

ఏడు తరాలు తరతరాలు గుర్తుంచుకోవలసిన చరిత్ర, బాధామయ జీవితాల గాథ. చీకటిని చీల్చుకుని వెలుతురును జయించిన ఆఫ్రికనుల అనుభవాల జ్ఞాపకాలు. స్వేచ్ఛ , స్వాతంత్రాల కోసం అల్లాడిన కొన్ని తరాల జీవిత చరిత్ర. ప్రతీ దేశస్థుడూ, ప్రతీ వ్యక్తీ తెలుసుకోవలసిన చరిత్ర. కొన్ని పుస్తకాలు చదివితే మనసు ఆనందంతో పులకిస్తుంది. మరికొన్ని చదివితే బుద్ధి వికసిస్తుంది. కానీ కొన్ని పుస్తకాలు చదివితే కన్నీరు మున్నీరై ప్రవహిస్తుంది. మనసు, బుద్ధి ఆ ప్రవాహంలో కొట్టుకుని గిలగిలలాడుతాయి. అటువంటి పుస్తకమే ఏడుతరాలు. మానవ మృగాలకు బానిసలుగా చిక్కి నరకం అనుభవించిన ఆఫ్రికనుల జీవిత వ్యధ ఏడుతరాలు. చీకటి ఖండంలోంచి వెలుగులోకి వచ్చినా తమ బతుకుల్లో చీకటిని దూరం చేసుకోలేపోయిన దురదృష్టవంతుల జీవితం.

ఈ పుస్తకం గురించి చెప్పుకునే ముందు దీని రచయితల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎలెక్స్ హేలీ…అమెరికాలో స్థిరపడిన ఆఫ్రికన్. ఈతని తాత ముత్తాతల కథే రూట్స్. తన అమ్మమ్మ నోటి నుంచి వినిన కథను ఆధారంగా చేసుకుని, తన పూర్వీకుల చరిత్రను పరిశోధించి రాసిన పుస్తకం రూట్స్. తనవారి చరిత్ర గురించి తను తెలుసుకోవడమే కాకుండా ప్రపంచానికి తెలియజేసాడు అలెక్స్ హేలీ. నాగరికత అంటూ విర్రవీగే అమెరికన్ల పునాదులు ఎంత రాక్షసత్వమైనవో తెలియజెప్పి ప్రతీ అమెరికన్ తలదించుకునేలా చేసాడు. ఈ పుస్తకం రాసి తన జాతి బానిసత్వపు రుణాన్ని తీర్చుకున్నాడు అలెక్స్. రూట్స్ ను ఏడుతరాలుగా అద్భుతంగా తెలుగులో అనువదించిన రచయిత సహవాసి(జంపాల ఉమామహేశ్వర్రావు). ఎక్కడా ఒక అనువాద పుస్తకం చదువుతున్నామనే భావన తీసుకురాదు ఈయన రచన. సరళమైన తెలుగులో ఉండే ఏడు తరాలపుస్తకంలో ఉండే వ్యక్తుల పేర్లు, స్థలాల పేర్ల బట్టి అనువాద పుస్తకమని గుర్తించాలి గాని రచనను బట్టి కాదని నాకు అనిపిస్తుంది. దీని తరువాత చాలా అనువాద పుస్తకాలు చదివాను కానీ సహవాసి రాసిన అంత బాగా మరెవరూ రాయలేదనిపించింది. ఏడుతరాలు పుస్తకం తెలుగులో కూడా పేరు సంపాదించడానికి ఇది ఒక ముఖ్య కారణం అనే చెప్పుకోవాలి.

ఏడుతరాలు ముఖ్యంగా బానిసల కథ. జాలి, దయ తెలియని అమెరికన్ల దుష్ట స్వభావానికి పరాకాష్ట . తమ దేశంలో, తమ పల్లెల్లో హాయిగా స్వేచ్ఛగా తమదైన సంప్రదాయాలతో ఆడుతూ పాడుతూ జీవించే ఆఫ్రికన్లను జంతువులను వేటాడినట్టు వేటాడి, చీకటి ఓడలలో రోజుల తరబడి బందీలుగా ఉంచి తమ దేశానికి తీసుకువచ్చి బానిసలు చేసుకున్న అమెరికన్ల కథ ఇది. ఈ కథలో తరాలకి ఆద్యుడు కుంటా కింటే. క్రీస్తుశకం 1750లో బింటా, ఉమరో లకు మొదటి బిడ్డ కుంటాతో మొదలవుతుంది ఈ కథ. ఆఫ్రికనుల సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి యవ్వనం వచ్చే దాకా పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచుతారు వాళ్ళు. అన్నిటికన్నా మగపిల్లలకు పురుషత్వం కోసం ఇచ్చే శిక్షణ చాలా వింతగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ చాలా వివరంగా రూట్స్ లో వివరించాడు అలెక్స్ హేలీ. కుంటా పుట్టిన నాటి నుంచి అతను యవ్వనంలోకి అడుగుపెట్టేంత వరకు అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆ తరువాతే మొదలవుతుంది అసలైన కథ. ఓ రోజు పొలం కాపలాకు వెళ్ళి తిరిగి వస్తున్న కుంటాని దొంగతనంగా ఎత్తుకు వచ్చేస్తారు అమెరికన్లు. అక్కడ మొదలవుతుంది ఏడుతరాల ఆఫ్రికన్ల అంతులేని బానిసత్వం. ఆఫ్రికా నుంచి బానిసలను అమెరికాకు తరలించడానికి అమెరికన్లు ఓడలను ఉపయోగించేవారు. వందల చొప్పున బానిసలను తీసుకురావడం అమెరికాలో అమ్మేయడం ఇదీ తంతు. ఇలా కుంటా కూడా ఓ ఓడలో కొన్ని రోజుల పాటు ప్రయాణిస్తాడు. రచయిత ఈ ఓడ ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు. నిజంగా మనమే ప్రయాణిస్తున్నామా అన్నట్టు ఉంటుంది. నిజంగా బానిసల ఓడ ప్రయాణం భయంకరం. దాని కంటే చచ్చిపోవడం మేలు. ఎక్కడో ఓడ అడుగు భాగంలో గాలీ వెలుతురు లేని ప్రదేశంలో కట్టి పడేసేవారు. అక్కడే కూర్చున్నచోటనే మలమూత్రాదులు కూడా చేసుకోవాలి. ఎప్పుడో తెల్లతొక్కకి బుద్దిపుట్టినప్పుడు వచ్చి శుభ్రం చేస్తాడు లేదంటే అదీ ఉండదు. బానిస ఏమైనా అన్నాడో వాడు తోలు ఊడవలసిందే. ఇలా నానారకాల చిత్రహింసలు పెట్టేవారు. ఇన్ని బాధలు పడలేక కొంత మంది అక్కడే చనిపోయేవారు. మిగిలిన వారిని అమ్మేసేవారు. ఇలా అమెరికా తీసుకురాబడ్డ కుంటాను ఓ తెల్లదొరకు అమ్మేస్తారు.

కుంటా బలవంతంగా నిగ్గరు బతుకు బతుకుతాడు కానీ ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కుంటాకి తన జాతి, సంప్రదాయాల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. చావడానికైనా సిద్దపడతాడు కానీ వాటిని భంగపరచడానికి ఏ మాత్రం ఇష్టపడడు. పారిపోవడానికి కుంటా చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కాలు కూడా పోగొట్టుకుంటాడు. ఇక విధిలేక అక్కడే ఉన్న ఓ నిగ్గరు స్త్రీ బెల్ ని పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత అతనికి కిజ్జీ అనే కూతురు పుడుతుంది. కుంటా తన కూతురును ఆఫ్రికన్ సంప్రదాయాల ప్రకారమే పెంచుతాడు. తన కథ మొత్తం అంతా చెబుతాడు. అంతే కాదు రాబోయే తరాలకి కూడా ఈ కథ అంతా చెప్పాలని చెబుతాడు.

ఆ తరువాత కిజ్జీ, సంతానం వారు పడ్డ బాధలు అన్నీ ఉంటాయి. కానీ కుంటా కథ మాత్రం పరంపరాగతంగా అన్ని తరాలకు చెప్పబడుతూ ఉంటుంది. అలా ఏడోవ తరం అయిన అలెక్సి హేలీకి కూడా ఈ కథ తెలుస్తుంది. అక్కడి నుంచి అతను చాలా పరిశోధనలు చేసి మొత్తం చరిత్రనంతటినీ సమకూర్చుకుని రూట్స్ నవల రాయడం తరువాతి కథ.

జపూరు నాగరికత, తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే తపన, తన సంస్కృతీ సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం నవల చదువుతున్నంతసేపూ మనల్ని వెంటాడతాయి. నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే బాధలు, ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా ప్రయత్నాలు కంటతడిపెట్టిస్తాయి. ఆఫ్రికన్ల కష్టం తింటూ, వారి తల్లుల పాలే తమ పిల్లలకు తాగిస్తూ తెల్లవారు చేసిన దమనకాండ ఛీ అనిపించకమానదు. నాగరికతను అభివృద్ధి చేశామని చెప్పుకునే అమెరికా చేసిన అనాగరిక చర్యలకు ప్రత్యక్ష సాక్ష్యం ఏడుతరాలు.

*************
Edutaralu – Roots by Alex Haley
Translation: Sahavasi,
Publication:November, 1980
Reprints 1983, 90, 94, 97, 99, 2001.
Price Rs. 70/-
(తెలుగు అనువాదం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. కొనుగోలుకి ఈవినింగ్ అవర్ వెబ్సైటును సంప్రదించండి.)
ఈ పుస్తకం గురించిన ఆంగ్ల వికీ లంకె ఇక్కడ, తెవికీ లంకె ఇక్కడ.)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.11 Comments


 1. […] ఈ పుస్తకంపై గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ. […]


 2. మనోజ్ఞ

  చాలా మంచి విషయాలు చెప్పారండీ శ్రీనివాస్ గారు. మంచి లింకు కూడా ఇచ్చారు, ధన్యవాదాలు. ఇందులో కొన్ని నేను కూడా చదివాను.(ఈ వ్యాసం రాసిన తరువాత) పుస్తకంలో యథాతథంగా రాయకపోయి ఉండవచ్చును. కానీ రాసిన దానిలో చాలా మట్టుకు నిజాలే అని నేను అనుకుంటున్నాను. ఆఫ్రికన్లు అమెరికాకు బానిసలుగా తీసుకురాబడడం నిజం కదా. నేను ముందే అన్నట్టు ఇది చరిత్ర ఆధారంగా రాయబడ్డ నవలే. అయితే ఇందులో కొన్ని కల్పించబడ్డాయి అని పైన మీరు ఇచ్చిన లింకులో చదివి తెలుసుకున్నాను. అలెక్స్ హేలీ బహుశా ఎవరిదో కథ తనది చెప్పుకుని రాయవచ్చు, తరువాత దానికి పరిహారం చెల్లించుకునీ ఉండవచ్చు కానీ అతను చేసిన ప్రయత్నం మాత్రం ఎన్నదగ్గది. మంచి నవల రాసారు.


 3. మరొక విషయం అమెరికన్ల మీద నాకు ఎలాంటి కక్షా లేదు. అంటరాని వసంతం నేనూ చదివాను. తప్పు ఎవరు చేసినా తప్పే. మనమైనా, అమెరికన్లు అయినా. ఏడు తరాలు రాసాను కాబట్టి అమెరికన్లను అనవలసి వచ్చింది. అదే అంటరాని వసంతం గురించి రాస్తే అందులో ఉన్నవాళ్ళ గురించి అంటాను.


 4. ఇది అలెక్స్ హేలీ కల్పించిన నవల కాదు. చరిత్ర ఆధారంగా రాసిన నవల. కనుక మనం ఒప్పుకోము అనడానికి ఇందులో ఏమీ లేదు. అమెరికన్ల అనాగరికత్వం ప్రపంచం అంతా తెలిసినదే. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్న ఒకప్పుడు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారనడానికి ఈ నవల ఒక ఉదాహరణ.


  • VARAPRASAD

   THANQ MANOJNA GARU,MANCHI PUSTAKAM GURINCHI PARICHAYAM CHESINANDUKU,MEERU MARINNI ROOTS NI PARICHAYAM CHEYYNDI.


 5. Kiran

  Yes.., I read the book. I donot agree with you. the things mentioned in “ROOTS” (The original Book) is 110 per cent correct. Curse these americans and whites.


  • Srinivas Vuruputuri

   >>ఇది అలెక్స్ హేలీ కల్పించిన నవల కాదు. చరిత్ర ఆధారంగా రాసిన నవల.

   మీ సమీక్షా, ఇక్కడ వచ్చిన వ్యాఖ్యలూ చదివాక, ROOTS గురించీ,అలెక్స్ హేలీ గురించీ వికీపీడియాలో కొంత చదివాను.

   హెరాల్డ్ కొర్లాండర్ అనే రచయిత రాసిన ఆఫ్రికన్ అనే నవల నుంచి హేలీ గ్రంథ చౌర్యం చేసాడని కేసు నడిచిందట (1978లో). ఆరున్నర లక్షలు చెల్లించి ఔట్ ఆఫ్ ద కోర్టు సెటిల్మెంట్ చేసుకున్నాడట, హేలీ.

   ROOTS చరిత్రా, కల్పనా అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. “Faction” (ఫాక్ట్స్ + ఫిక్షన్) అనే “కాల్పనిక వాస్తవికత” అనే మాటను సృష్టించారు ROOTS లాంటి నవలలను అభివర్ణించడానికి.

   వంశవృక్షాల అధ్యయనంలో స్పెషలిస్టులైన గ్యారీ మిల్లిస్, ఎలిజబెత్ మిల్లిస్‌లు, స్పాట్సిల్వేనియా కౌంటీ, కాస్వెల్ కౌంటీ దస్తావేజులనూ, జనాభా లెక్కలనూ ఆధారంగా చేసుకొని 1981లో రాసిన ఓ వ్యాసం (http://www.historicpathways.com/download/rootsnfaction.pdf) లో హేలీ చెప్పిన కథలోని చరిత్ర తప్పులను చాలా వివరంగా చర్చించారు. మచ్చుకి కొన్ని ఉదాహరణలు:

   1. కుంటాయే టోబీ అని నిర్దారించడం అసంబద్ధం! ఎందుకంటే… హేలీ లెక్క ప్రకారం, కుంటా అమెరికాకి వచ్చిన తేదీ: సెప్టెంబర్ 29, 1767. ఆనాటి రికార్డుల ప్రకారం – టోబీ అనే బానిస వాలర్‌ల ఇంట్లో 1756 నుంచీ ఉండేవాడు.
   2. కుంటా కూతురయిన కిజ్జీ 1790లో పుట్టిందని రాసారు, హేలీ. కానీ, 1782 తరువాత పన్నుల రికార్డులలో టోబీ కనిపించడు. ఇంకో యజమానికి అమ్మేయబడ్డాడనడానికి ఆధారాలు లేవు. 1782లోనో లేదా అంతకు మునుపో అతడు చనిపోయి ఉండవచ్చునని వ్యాసకర్తలు ఊహిస్తారు.
   3. “మిస్సీ ఆన్నీ వాలర్” 1786లో పుట్టిందని, కిజ్జీతో కలిసి ఆడుకొనేదనీ, కిజ్జీకి చదవడం, రాయడం నేర్పిందనీ రాసారు హేలీ. నిజానికి, విల్ వాలర్ వీలునామా ప్రకారం 1767లోనే పుట్టింది. కిజ్జీ పుట్టేనాటికి తను వివాహిత!
   4. దస్తావేజుల దాకా వెళ్ళక్కరలేదు కాని కథాంతర్గతమైన మరో తప్పు: 1806 అక్టొబర్ మొదటివారం తరువాత (అక్టొబర్ 10న కాబోలు)- కిజ్జీని టాం లీకి అమ్మేసారు. టాం లీ చేత బలాత్కరించబడిన కిజ్జీ (కోళ్ళ) జార్జిని కంటుంది. ఎప్పుడు? 1806 శీతాకాలంలో!!

   ఇలాంటివి ఇంకా ఉన్నాయి.

   ROOTS/ఏడు తరాలు చదువుతున్నప్పుడు నన్ను ఎంతో కదిలించింది. ఇప్పుడివన్నీ చదివాక నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు కానీ నేను రచయిత చుట్టూ ఏర్పరచుకొన్న aura మాత్రం చాలా మటుకు కరిగి పోయింది.


  • Indian Minerva

   That’s a wow!

   ఈ అసంబధ్ధతలనుగురించి ఎప్పుడో చదివినట్లు గుర్తుండటంతో ఒకసారి mention చేశానంతే.

   మీ పరిశోధన బాగుంది. వాటిని మరోసారి చదివే అవకాశం కలిగింది. Thank you. కధలోని కొన్ని విషయాలు అంత ఖచ్చితంగా ఉండకపోవచ్చునుగానీ స్థూలంగా ఇది నడిచిన చరిత్రేననేదే నా నమ్మకంకూడా.


  • శ్రీనివాస్ గారూ, బాగా చెప్పారు. ఈ నవల నేనూ చిన్నపుడెప్పుడో చదివాను కాబట్టి గూగుల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయింది రచయిత గురించి. అయితే ఆ తర్వాత నేను ఇంగ్లీష్ నవల ఒక ఆరేడేళ్ళ క్రితం చదివినపుడు హేలో గురించి మరిన్ని వివరాలుం,, వ్యక్తి గత జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇంటెర్నెట్ ని ఆశ్రయించినపుడు రూట్స్ నవల గురించిన వివరాలు కొన్ని తెలిశాయి.

   దీనివల్ల నాకు హేలో మీద అభిప్రాయాన్ని మార్చాయని చెప్పలేను కానీ,, కొంత అసంతృప్తి కలిగిందని మాత్రం చెప్పగలను.

   కానీ మొదటి సారి పాఠకులకు మాత్రం ఇదొక అద్భుతం!


 6. budugoy

  >> నాగరికత అంటూ విర్రవీగే అమెరికన్ల పునాదులు ఎంత రాక్షసత్వమైనవో తెలియజెప్పి ప్రతీ అమెరికన్ తలదించుకునేలా చేసాడు
  >> చదువుతున్నప్పుడు అభివృధ్ధిచెందిన దేశాలమని గొప్పలుచెప్పుకొనే దేశాల్లోని ప్రతి రహదారి ఇలా ఆఫ్రికన్ బానిసల రక్తంతో వేయబడిందేకదా అనిపించింది.

  why this america bashing? are nt there skeletons in our closet? so what will u say if u read ‘antaraani vasantam’.
  btw, good review. one of my first reads and unforgettable book.


 7. Indian Minerva

  కొన్నాళ్లక్రితం ఆంధ్రభూమి వాళ్ళు వారంవారం మంచిమంచి ఇంగ్లీషునవలలని పరిచేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఆ కార్యక్రమంలో మొట్టమొదట పరిచయంచేసింది ఈ పుస్తకాన్నే. అలా ఈ నవల నాకు పరిచయమయ్యింది. నేను చదివిన మొదటి ఇంగ్లీషు నవల కూడా ఇదే.

  చదువుతున్నప్పుడు అభివృధ్ధిచెందిన దేశాలమని గొప్పలుచెప్పుకొనే దేశాల్లోని ప్రతి రహదారి ఇలా ఆఫ్రికన్ బానిసల రక్తంతో వేయబడిందేకదా అనిపించింది. ఇందులో ఆకాలంనాటి పోరాటాలగురించీ Abraham Lincoln, Soujourner of Truth గురించీ చదివి తరువాత వాళ్ళగురించి విడిగా చదివాను.

  కుంటా తను దొరికిపోయిన రోజు జరిగిన సంఘటనలన్నింటినీ మళ్ళీమళ్ళీ గుర్తుచేసుకోవడం, చివరికి కధానాయకుడు తన జాతివారిని ఆఫ్రికాలో కలుసుకున్నప్పుడు తను అటునల్లగానూ, ఇటుతెల్లగానూ లేక రెంటికీ కాకుండాపోయానే అనుకొని వాళ్ళమధ్య సిగ్గుపడటం, కిజ్జీ(Kizzi అంటే stay put అనర్ధం అట ఆఫ్రికన్ భాషలో) కన్నీళ్ళు తెప్పిస్తాయి.తననుంచి దూరమైపోవడం, తమ సంస్కృతిని కాపాడుకోవడానికి వాళ్ళుపడే తపన కన్నీళ్ళుతెప్పిస్తాయ్.

  ఇది Malcom X జీవిత చరిత్రట రచయితమాత్రం Alex Haely. ఇందులో అనవసరంగా తెల్లవారిని విలన్లనుచేశారని, ఇందులో చెప్పినవిషయాలు నిజం కాదని ఆరోపణలున్నాయు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

ఏడు తరాల నీడ

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ (ఈ వ్యాసం గతంలో తెలుగువెలుగు మాసపత్రిక జూలై సంచికలో ...
by అతిథి
2