పుస్తకం.నెట్ నిర్వహణలో ఇక్కట్లూ, పోట్లు

వ్యాసకర్త: సౌమ్య

పుస్తకం.నెట్ నెటిజన్‍లకి కనబడ్డం జనవరి 1, 2009 న మొదలైంది. ఈ నెలతో పుష్కర కాలం పూర్తయి పదమూడో ఏట అడుగుపెట్టింది. మా తిప్పలేవో మేము పడుతూ నిర్వహిస్తున్నాము, నాకు తెల్సినంత వరకు రాసిన వారితో, వ్యాఖ్యాతలతో, సోషల్ మీడియా లో మర్యాదగానే వ్యవహరిస్తాము అని నా అనుకోలు. అయితే, మనం మర్యాదగా ఉంటే, మనం గౌరవం చూపిస్తే అవతలి పార్టీ మనకి రెసిప్రొకేట్ చేయాలని లేదుగా. పన్నెండేళ్ళలో కొన్ని నాకు చిరాకు తెప్పించే సంభాషణలు/ఈమెయిల్స్ అయ్యాయి శ్రేయోభిలాషులు”, పాఠకులు, రచయితలు – అందరితోనూ. అలాంటివి కొన్ని పంచుకుని, వాటి గురించి నా అభిప్రాయాలు చెప్పడం ఈ పోస్టు ఉద్దేశ్యం. వీటిలో కొన్ని అభిప్రాయాలు అవతల వాళ్ళని నేరుగా అనలేక (అంత పరిచయం లేకనో, మొహమాటమో, వయసుకిచ్చిన గౌరవమో ఏదో అనుకుందాం) ఇక్కడంటున్నవి. 

డిస్ క్లెయిమర్ ఏమిటంటే పుస్తకం.నెట్‍ నిర్వహణలో సాధకబాధకాలు గురించి నా అనుభవాలు పంచుకోవడమే ఇక్కడ ముఖ్యోద్దేశ్యం. మళ్ళీ మళ్ళీ అవే మాటలు వినిపిస్తుంటే, ఎక్కడో చోట ఎవరో ఒకరు ఆపాలిగా. అందుకని పంచుకుంటున్నవి. 

మొదటగా, నా ఫేవరెట్ విషయం – మానిటైజేషన్: 

నేను ఇండియా వెళ్ళిన ప్రతిసారీ, లేదంటే పుస్తకం.నెట్ కి వయసు ఓ ఏడాది పెరిగిన ప్రతిసారీ ఎక్కడో ఓ చోట క్రింది సంభాషణ నడుస్తుంది (ప్రతిసారీ ఓ ముగ్గురు నలుగురే అడుగుతారు, అది వేరే విషయం):

వారు: అదేదో వెబ్సైట్ నడుపుతావ్ కదా… ఏమిటది… ఆ పుస్తకం.నెట్… ఇంకా నడుస్తోందా?

నేను: ఆ, నడుస్తోంది.

వారు: (ఓ వంకర నవ్వుతో) ఇంకా మీరు దాన్ని మానిటైజ్ చెయ్యలేదు కదా?

నేను: లేదు. ఆసక్తి లేదు.

వారు: (జాలిగా చూస్తూ) చొచొచొచొచొ …. గ్రో అవ్వాలి. ఎన్నాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా సొంత డబ్బులు పెట్టుకుంటారు? 

నేను: (మనసులో:‌ మీ బొందండి. మీ బొంద). పైకి – మీకు బిజినెస్ కాని వెబ్సైట్ నడపడం గురించి ఏం తెలీదు అని అర్థమైంది.

(ఆ తర్వాత కాసేపు పనికిమాలిన వాదోపవాదాలు చేసి అందరం సమయం వృధా చేసుకుంటాము. పనికిమాలిన అని ఎందుకంటున్నా అంటే ఆ వ్యక్తులతోనే అవే సంభాషణలు సంవత్సరం దాటి సంవత్సరం అవుతూనే ఉంటాయి కనుక)

సాధారణంగా ఎవరన్నా వాళ్ళ మానాన వాళ్ళు పూనుకుని ఏదన్నా చేస్తున్నారంటే చుట్టుపక్కల దాన్ని కొట్టిపడేసేవారు ఉంటారు. అలా ఉండకపోతే మనం తెలుగునాటితో గానీ, తెలుగు ప్రజలతో కానీ ఏం సంబంధాలు పెట్టుకోకుండా ఏకాకి తెలుగులా బ్రతుకుతున్నామనే (నాకు తెల్సినది తెలుగు సమాజమే కనుక చెప్తున్నా. వేరే వాళ్ళ వివరాలు అనవసరం). ఇక వృత్తి జీవితానికో, వ్యక్తిగత జీవితానికో సంబంధం లేకుండా ఒకటి చేశామంటే నెక్స్ట్ కామన్ ప్రశ్న – డబ్బులొస్తాయా?  రావు అనో, డబ్బు కోసం చేయట్లేదనో, నేను ఆ దిశలో ఆలోచించలేదనో అన్నామా…. ఇంక మనంత చేతకాని వాళ్ళుండరు.  ఇంక కొంత మన డబ్బే (ఎంత చిన్న మొత్తమైనా) వెచ్చించామని తెలిసిందో…… అయ్యో, నా బోటి సలహా ఇచ్చే శ్రేయోభిలాషులు లేక ఇలా వేస్టు చేస్తున్నావే అని పాపం దుగ్ధ మొదలవుతుంది. 

ఈ విషయంలో నా అభిప్రాయాలు: ఒక వెబ్సైటుని మానిటైజ్ చేయాలంటే ప్రధానంగా మూడు అంశాలు కలిసి రావాలని నా అభిప్రాయం అవి:  ఆ వెబ్సైటు దేని గురించి? నిర్వాహకులకి ఆ దిశలో పొయ్యే ఆసక్తి ఉందా? ఇక అది కొంచెం సమయం వెచ్చించాల్సిన వ్యవహారమే – ఆ సమయం ఉందా?

  • వీటిలో మొదటి ప్రశ్న “ఆ వెబ్సెట్ దేని గురించి?” కి నా సమాధానం: మనం వెబ్‍జైన్ అనుకున్నా పుస్తకం.నెట్ అన్ని రకాల అంశాలు వేసే పత్రిక లాంటిది కాదు. అందునా ప్రత్యేకం ఎడిటర్ల బోర్డు, ఇలాంటి ప్రాసెస్ లేదు. ఎవరన్నా పుస్తకాల గురించి రాసుకోవచ్చు. ఎవరన్నా చదువుకోవచ్చు, మనమేం ఇవ్వం – స్పేస్ తప్ప, అన్న మాడల్. ఇది ఆ మానిటైజ్ అన్న మోడల్‍కి అతకదు అని నా భావన. ఈ అడిగే వాళ్ళకి మోడల్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇలా పుస్తకాలు అమ్మే వెబ్సైటులూ, సబ్స్క్రైబ్ అయ్యి చదివే వార్తా పత్రికలూ, మ్యాగజైన్‍లు (వీటిలో చాలా మటుకు రాసిన వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇచ్చుకునేవారే) – ఇదీ తెలిసిన ప్రపంచం. ఒక్కరికీ కనీసం బ్లాగు అయినా నడిపిన అనుభవం లేదు. అలా మొహాన చెప్పలేక,  “మీకు బిజినెస్ కాని వెబ్సైట్ నడపడం గురించి ఏం తెలీదు అని అర్థమైంది.” అంటా అనమాట. 
  • ఆసక్తి విషయం: నాకైతే ఓ క్షణం కూడా ఆ ఆసక్తి కలగలేదు (ఎవడిష్టం వాడిది. ఎవళ్ళ ఆసక్తులు వాళ్ళవి). అది నా చేతకానితనం అని నేను అనుకోలేదు. I know my priorities right – అనుకున్నా అనమాట. “అయ్యో, కనీసం వెబ్సైటు నిర్వహణకన్నా సంపాదించుకోలేకపోతే ఎలా?” అన్నది నాకు తరుచుగా ఎదురయ్యే మాట.  నిజానికి అది నాకు ఇచ్చేదానితో పోలిస్తే నేను దాని నిర్వహణకి ఇచ్చేది చాలా చాలా తక్కువ. అందువల్ల ఇంక మళ్ళీ దాన్ని పిండొచ్చు అన్న ఆలోచన నాకు రాదు. పైగా నేనేం వీళ్ళని అప్పు అడగడం లేదు కదా?  ఇక దేన్ని గురించి ఎలా ఆలోచించాలి, ఏ పనికి డబ్బుల్రావాలి? అన్నది నలభయ్యోపడికి దగ్గరౌతున్న మనుషులకి ఇంకోళ్ళొచ్చి అడక్కుండా చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. అదనమాట. 
  • సమయం: సలహాలు ఇవ్వడానికి, పని చేసుకోడానికి మధ్య ముఖ్య తేడా ఇదే. ఈ సలహా ఇచ్చేవాళ్ళకి అర్థం కానిదేంటంటే ఊరికే ఏదో ఆడ్ వర్డ్సో ఇంకేదో పెట్టేస్తే పనైపోదు, ఏదన్నా ఒక పని మానిటైజ్ చేయడం అన్నదానికి సమయం వెచ్చించాలి. “నేనున్నా గా, నన్ను చేర్చుకోండి, చేస్తా” అనొచ్చు కానీ, అపుడు మళ్ళీ పైన చెప్పిన ఆసక్తి సెక్షన్‍కి పోతుంది. Infinite Loop గురించి చదవండి అర్థం కాకపోతే. పుస్తకం.నెట్ కి రాసేందుకు, మామూలుగా ఇదివరకటిలా పని చేసేందుకే లేని సమయం ఆసక్తి లేని అంశాల మీద ఆలోచించడానికి ఎక్కడ్నుంచి వస్తుంది, అధ్యక్షా? 

మాకు పుస్తకం.నెట్ కి ఓ externally validated KPI కావాలని ఎప్పుడూ అనిపించలేదు. అది డబ్బు రూపేణా ఉండాలని అసలనిపించలేదు. సైటు ఎలా నడుస్తోంది? అంటే “బాగుంది” అని మనస్పూర్తిగా చెప్పగలనా లేదా అన్నదే ముఖ్యం మాకు. అలాగే, ఎంతోమంది అడపాదడపా వ్యాఖ్యలలోనో, సోషల్ మీడియా లోనూ, ఈమెయిల్స్ లోనో చెప్పే మాటలు ముఖ్యం. పోయినేడు తో పోలిస్తే ఇన్ని హిట్లు పెరిగాయి, ఇన్ని వ్యాసాలొచ్చాయి, కొత్త వాళ్ళు రాశారు – ఇలాంటివి తరుచుగా బేరీజు వేసుకోడం మీద ఆసక్తి ఉన్నా అదంతా సక్సెస్ అనో ఫెయిల్యూర్ అనో లెక్కించము (అది just information అనమాట). అలా ఆలోచిస్తే ప్రతి సంవత్సరం నన్ను నేను, నేను ప్రపంచాన్ని, కూడా ఇలాగే బేరీజు వెయ్యాలా? అని సందేహం వస్తుంది. నువ్వు కాదు, మేము లెక్కిస్తాం అంటారా – లెక్కించుకోండి కానీ మీ లెక్కలతో మీరు మార్కులేస్తే మేము స్వీకరించాలనేముంది? – అదేమిటో నాకు సింపుల్ గా అనిపించే ఈ పాయింటు పై సంభాషణలు నడిపే ముగ్గురు నలుగురికీ అఫెంసివ్ గా అనిపిస్తుంది. మీరన్నది నాకూ అఫెన్సివు గానే ఉంటుంది అంటే మనోభావాలు దెబ్బతింటాయి. 

******

సరే, ఆ మానిటైజర్లని (సానిటైజర్ల లాగా అదో రకం అనమాట) వదిలేసి ఇతర అంశాల్లోకి పోదాం. 

నెలకో రెండు నెలలకో ఒకసారన్నా క్రింది రకం ఈమెయిళ్ళు వస్తాయి:

“నా పుస్తకాలు అమ్మాలి. మీ సైటులో ఎలా పెట్టాలి?”

“నా పుస్తకాలు ఉచిత డౌన్‍లోడ్ కి మీ సైటులో ఎలా పెట్టాలి?”

“నా కథలు/కవితలు మీ వెబ్సైటులో వేస్తారా?”

  • ఒకసారి సైటు ఐదు నిముషాలు బ్రౌజ్ చేసినా అక్కడ ఏముందన్నది అర్థమవుతుంది. ఆ ఐదు నిముషాలు కూడా గడపకుండా ఎక్కడ పడితే అక్కడ మన రచనలు పడిపోవాలి, అమ్ముడుపోవాలి అంటే నాకు అసలు మన రచనని మనమే అగౌరవపరుస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ఇంకోళ్ళేం గౌరవిస్తారు? ఇంతకీ నేను పరమ మర్యాదగా అందరికీ లేదు, మేము అలాంటివి చెయ్యము ఈ వెబ్సైటులో అని వివరించా నాకు గుర్తున్నంత వరకూ. ఇప్పుడు బహిరంగంగా మొత్తుకుంటున్నా అంతే. 

******

ఇంకొన్ని ఈమెయిల్స్ ఇలా ఉంటాయి:

“ఫలానా పుస్తకంపై నేను రాసిన వ్యాసం పంపిస్తున్నాను”‌ (ఈమెయిల్ లో ఉండని విషయం: ఇది ఆల్రెడీ వేరే చోట/చోట్ల వచ్చేసింది అన్న విషయం నేను పొరపాట్న కూడా మీతో ప్రస్తావించను.)

  • గూగుల్ సర్చ్ తెలుగు కి కూడా ఇంగ్లీషంత కాకపోయినా బాగా పనిచేస్తుంది. కనుక ముక్కస్య ముక్క అదే వ్యాసం ఇంకో చోటకి పంపితే కనుక్కోడం కష్టం కాదు. ఇలా చెప్పకుండా పంపడంలో మతలబు మాత్రం నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రస్తావించిన అన్ని విషయాల్లోకి పూర్తిగా విచిత్రంగా అనిపించేది ఇదే. ఆల్రెడీ ఫలానా వెబ్సైటులో వచ్చింది అని చెప్తే పొయ్యేదేముంది? ఒకవేళ వేద్దాం అనుకుంటే అక్కడొచ్చింది, రచయిత పంపితే ఇక్కడేస్తున్నాం‌ అని ఓ లైను పెడతాం అంతే కదా? అది పెట్టకుండా వేసేస్తే రేప్పొద్దున్నా ఆ ఇంకో పత్రిక వాళ్ళు పుస్తకం వాళ్ళు కాపీ కొట్టేశారు అనరా? అది ఆల్రెడీ ఇంకోచోట పడిందని మాకు తెలీదు మొర్రో అంటే వినేవాడు ఎవడు?ఆల్రెడీ గూగుల్ సర్చి లో దొరికే వ్యాసం (ముఖ్యంగా యూనికోడ్ లో టైప్ అయినది) అయితే మళ్ళీ పుస్తకం.నెట్ లో వేయం.  ఆ రిపిటీషన్ తో మనం సాధించేది ఏమీ లేదు కదా! 

*******

ఇంకొన్ని రకాలు:

“నేను నిన్న వ్యాసం పంపా. ఇంకా వెయ్యలేదేం? నా బ్లాగులో పెట్టుంటే ఇప్పటికి పబ్లిష్ అయిపోయి ఉండేది. అసలు ఫేస్బుక్ లో పెడితే వంద లైకులన్నా వచ్చేవి!”

  • మన బ్లాగులో కాకుండా ఎవరికి పంపినా కొంత సమయం ఉంటుంది. అది సహజం అని నేను అనుకుంటాను.  పైగా వీలును బట్టి ఒక్కోసారి పోస్టులో‌ టైపోలు సరిదిద్దడం, ఫొటోలేమన్నా పెట్టడం వంటివి చెయ్యాలనుకుంటే ఇంకా టైము పడుతుంది. ఇదంతా వృత్తి కాదు. ఎవరి వృత్తులూ, జీవితాలు వాళ్ళకుంటాయి అనుకుంటే ఇంకాస్త టైము. మా నిర్లక్ష్యం వల్ల ఆలస్యం అయిన సందర్భాలూ లేకపోలేదు కాని, అలాంటి సందర్భాల్లో నాకు గుర్తున్నంతవరకూ ఆ విషయం ఒప్పుకుని క్షమాపణలు అడిగాము అనుకుంటాను. నాకేమో మనసులో పీకేది ఏమిటంటే మిగితా వెబ్సైటు వాళ్ళతో మర్యాదగానే ఉంటారు, మమ్మల్ని పట్టుకుని ఆడుకుందామనుకుంటారు అని. ఫేస్బుక్కు లో పెడితే టక్కుమని లైకులు వస్తాయి నిజమే. ఓ నెల తర్వాత వచ్చి చదువుతారా? పుస్తకం.నెట్ లో ఎప్పుడో పదేళ్ళ నాడు వచ్చిన వ్యాసాలకి కూడా ఒక్కోసారి వ్యాఖ్యలు వస్తాయి మరి! అహ, అలా కాదు, నాకు రేపట్లోగా లైకులు, వ్యాఖ్యలు పడిపోవాలంటే ఎవరిష్టం వాళ్ళది. బలవంతం ఏముంది? రాస్తారా? అని అడుగుతాం‌ కానీ రాసి తీరాలనలేం కదా? 

“ఇందాక వ్యాఖ్య రాశా, ఇంకా సైటులో కనబడ్డం లేదు. ఎందుకు నా వ్యాఖ్యలు అనుమతించడం లేదు? నా అభిప్రాయాలు సప్రెస్ చేయకండి”

  • పైన రాసినట్లే, మాడరేషన్ అన్నది ఒకటి ఉంది సైటులో. వ్యాఖ్య వస్తే ఈమెయిల్ వస్తుంది. ఎవరో ఒకళ్ళం అది చూసి, సైటులోకి లాగిన్ అయ్యి అప్రూవ్ చెయ్యాలి. ఇదేమన్నా 24*7 కాల్ సెంటరా ఏం? ఒక్కోసారి నాలుగైదు రోజులు కూడా పడుతుంది ఇద్దరిలో ఒకరు సెలవులో ఉంటేనో, బిజీ గా ఉంటేనో, ఒకరికి ఆరోగ్య సమస్యలుంటేనో, ఒకరు పూర్తిగా మానేసి గుట్టుగా సంసారం చేసుకుంటూంటేనో… ఏదో లక్ష కారణాలు ఉంటాయి. ఇండియన్ ఐటీ కంపెనీ వాళ్ళలాగా దబాయిస్తే అవ్వదు కదా అన్నిచోట్లా? 

“మీరు ఐదేళ్ళ క్రితం రాసిన వ్యాసానికి మూడేళ్ళ క్రితం టైటిల్ మార్చారు. నాకు తెలుసు. ఎందుకు మార్చారో తెలియాలి. మళ్ళీ పాత టైటిల్ పెట్టాలి” (ఇంతకీ వ్యాసం నాది కాదు కానీ అది మీకనవసరం)

  • ఇలాంటివి ఎక్కువ లేవు. నాకు బాగా గుర్తున్న ఒక ఉదంతంలో అయితే నేను వ్యాసం రివిజన్ హిస్టరీ చూశాను, ఆ టైటిలే ఉంది, మీరు పొరబడ్డారేమో అంటే లేదు, నేను కరెక్టే, నాకు గుర్తుంది, నువ్వే అబద్ధం చెబుతున్నావంటారు. రాసినవాళ్ళతో నాకు పరిచయం లేదు, అడిగిన వాళ్ళతో ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. అందువల్ల ఈ బలవంతం ఏమిటి? ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అంటే, కట్ చేస్తే, వాళ్ళ ఫేస్బుక్ లిస్టులోంచి మాయం అయ్యా అనమాట. అలాంటప్పుడు సైటు అడ్మిన్ గా అన్నింటికీ నేను సమాధానం ఇవ్వక్కర్లేదు అనిపిస్తుంది. అవతలి వాళ్ళ వయసుని గౌరవించి నోరు మూసుకుంటా… (కానీ మర్చిపోను అన్న విషయం అర్థమయ్యే ఉంటుంది గా ఈ పాటికి పాఠకులకి! ఇలా చేయి తిప్పుతా అనమాట ఆనక). 

*******

ప్రస్తుతానికి గుర్తొచ్చినవి ఇవీ. ఇంకా ఉంటాయి… ఇంకో పోస్టు రాస్తానేమో.

ఇదంతా చదివి నా మీద కలిగిన కోపాన్ని పుస్తకం.నెట్ మీద చూపించి చదవడం మానేస్తా అంటారా – మానేయండి, కానీ ఏ ఒక్కరి వల్లో నడిచే సైటు అయితే పన్నెండేళ్ళ క్రితమే మూతబడి ఉండేది కదా?

“ఫలానా వ్యాసం వేసారు, ఛీ” అనీ, “ఫలానా పుస్తకం గురించి పుస్తకం చదవడం తెలియని వాళ్ళు కూడా రాసేస్తూన్నారు” అనీ – ఇలాంటి కారణాలు చెప్పి మీ సైటుకి మేం రాము/రాయము అన్నవాళ్ళు ఉన్నారు. మీరు ఫలానా మైనారిటీలని పట్టించుకోలేదనో, చిన్నచూపు చూశారనో దుష్ప్రచారం చేసిన ప్రముఖులైన  సాహిత్యవేత్తలూ ఉన్నారు. “మీ మీద కేసు పెడతాం” అన్నవాళ్ళు, ఆ తర్వాత అదేదో జోకులాగా డోకొచ్చే పోస్టులు పెట్టుకుని హాస్యం అనుకుని మురిసిపోయిన పనికిమాలిన వాళ్ళూ ఉన్నారు – ట్రోలింగ్ అన్న పదం ఇంకా చెలామణిలో లేని కాలంలోనే ట్రోలింగ్‍కి గురైయ్యాం. ఇదంతా దాటుకుని నెట్టుకొచ్చి ఇలా రాసుకోగలుగుతున్నాం కనుక, ఒకరో ఇద్దరో మానేస్తే నష్టం లేదని అనుకుంటున్నాను. స్వస్తి. 

You Might Also Like

5 Comments

  1. తమ్మినేని యదుకుల భూషణ్

    పుస్తకం.నెట్ – పఠనాసక్తి గల పలువురు తాము చదివిన పుస్తకాల గురించి తమకు తోచిన నాలుగు మాటలు చెప్పడానికి ఒక వేదిక ఏర్పరచి, పుష్కరకాలం విజయవంతంగా నడిపినందుకు – మహిళాద్వయానికి ( సౌమ్య,పూర్ణిమలకు )హార్దిక అభినందనలు.
    ఇది మామూలు విషయం కాదు.పక్కవారికోసం పదినిమిషాలు కేటాయించలేని మనుషులున్న లోకం ఇది.ఎవరి శక్తి మేరకు వారు భాషాభివృద్ధికి తోడ్పడాలి. ఒక మంచి పని చేస్తున్నవారిని సూటిపోటి మాటలతో వేధించడం, వారికి లేని దురుద్దేశాలు అంటగట్టడం అనాగరిక లక్షణం.(అటువంటి అనాగరికులు కవులై, రచయితలై, సాహితీవేత్తలై సాధించేదేమీ లేదు.) ఇలా,అనాగరికత ప్రబలుతున్నది అంటే, సమాజంలో శఠత్వం (Narcissistic Tendency) పెరిగిందని అర్థం. మనసా , వాచా , కర్మణా పరకార్యాలు చేయడంలో విముఖతే శఠత్వం. ఎంత సేపు ‘నేనునేను’అని జపిస్తూ ఇతరులను దూషించడమే శఠత్వం మూర్తీభవించినవారు చేసే పని.

    ఇక , కవిత్వం career ల గురించి నిష్కర్ష :

    1. కవిత్వాలు,సాహిత్యాలు వేరు , career, డబ్బు సంపాదన వేరు.
    2. డబ్బు సంపాదనకు మార్గం – ఉద్యోగం, వ్యాపారం.
    3. కవిత్వం,సాహిత్యం- మన ఉద్యోగం, వ్యాపారం కాదు.
    4. కాబట్టి, ఈ విషయాల్లో అందరికీ స్పష్టత అవసరం.
    5. స్పష్టత లేనివారితో ఈ విషయంలో చర్చలు పూర్తిగా అనవసరం.

    తమ్మినేని యదుకులభూషణ్

  2. ఎ.కె.ప్రభాకర్

    Keep going

  3. ప్రసాద్

    పీత కష్టాలు పీతవి.. 🙂
    నాకు మాత్రం ఏదే ని పుస్తకం చదవబోయేముందు గానీ, చదివాక గానీ ఎవరైన దాని గురించి ఏమన్నా రాశారా అని తెలుసుకోవడానికి ఇది పెద్ద సోర్స్.
    ఇన్నేళ్ళుగా అన్ని పనుల్లోనూ సమయం వెచ్చించి దీన్ని నడుపుతూ వున్నందుకు ధన్యవాదములు.

  4. chandra pratap

    very nice

  5. Anil battula

    Great essay. Thanks

Leave a Reply