చదవడం అంటే ఏమిటి… నేర్చుకోవడం అంటే ఏమిటి…
వ్యాసకర్త: మద్దిరాల శ్రీనివాసులు, సెల్:9010619066
*********
పుస్తకం పేరు: చదవడం అంటే ఏమిటి… నేర్చుకోవడం అంటే ఏమిటి…
రచయిత: సీవీకే ( సీ.వీ.క్రిష్ణయ్య గారు)
ఈమధ్య కాలంలో ఉపాధ్యాయుల కోసం వచ్చిన అద్భుతమైన ఉపయుక్త పుస్తకం ఇది.
క్లాసు రూముల్లో కష్టపడవలసింది విద్యార్థి కాదు, ఉపాధ్యాయుడు అంటారు రచయిత ఇందులో. నిజమే కదా! అయితే ఈ వాక్యాన్ని వక్రీకరించే వారు కూడా వుంటారని ముందే ఊహించిన రచయిత ఈ వాక్యం వెంటనే “విద్యార్థి, తన విజ్ఞాన సాధనలో నేర్చుకుంటున్నాననే స్పృహ కలుగకూడద”నే మరో వాక్యాన్ని జోడించారు కూడా.
బోధన అంటే విద్యార్థిని చేయి పట్టుకుని నడిపించడం కాదంటారు. తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా పిల్లలు ఆడుకుంటూ కనబడితే చాలు… వారిని పాడైపోతారని, ఎప్పుడూ కుదురుగా వుండలేర్రా మీరు? అని, తిట్టేవారే ఎక్కువ. అలాంటి వారికి, పిల్లలు ఆటలు ఆడకపోతే ఎంతగా నష్టపోతారో తెలిపే జవాబు ఈ పుస్తకం. చాలావరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి, “మా పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదు సార్, నాలుగు తన్ని భయం చెప్పాలి మీరు” అని, ఫిర్యాదు చేస్తుంటారు. అపుడు కొందరు ఉపాధ్యాయులు ఆ పరిస్థితులలో ఆ పిల్లలను మందలించడమో, కొట్టడమో చేస్తుంటారు. అది ఎంత తప్పో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది.
“తెలివితేటలు అంటే “, అనే అంశంలో, జాన్ హాల్ట్ గారు తెలిపిన మాటలను ఉదహరిస్తూ,ఎంతో అద్భుతమైన వివరణ యిచ్చారు ఇందులో రచయిత. తెలుసుకోవడానికి-నేర్చుకోవడానికి, ఉపాధ్యాయుడికి-గురువుకి గల తేడాలను చాలా చాలా చక్కగా వివరించారు. ఇవి చదువరులకు చాలా ఉపయుక్తం.
“మెదళ్ళకు తాళాలేసి…” అనే అంశంలోనైతే క్లాసు రూములో విద్యార్థులు ఎంత చిలిపిగా వ్యవహరిస్తుంటారో, ప్రత్యక్షంగా వర్ణించారు. “హీరోలు – జీరోలు” లో తన స్వీయ సంఘటనలతో, పిల్లవాడికి ఫిక్స్డ్ నాలెడ్జ్ అందిస్తే ఎలా నష్టం జరుగుతుందో తెలిపారు. పిల్లలలో నీతిబోధ కోసం వారిని కొట్టకుండా, తిట్టకుండానే, వారిలో మార్పు తేవడానికి, నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకోవాలో తెలిపారు.
ఇలా, ఈ పుస్తకంలో ప్రతి ఒక్క విషయం ఉపాధ్యాయులకు ఒక సహాయకారిగా వున్నది. ఇటు తల్లిదండ్రులకు కూడా పనికి వచ్చే విషయాలు కూడా చాలా వున్నాయి. రచయిత ఇందులోని ప్రతి పేజీని విలువైనదిగా మలిచారు.
మరొక అద్భుతమేంటంటే, గురువుకు తానిచ్చిన ఒక గొప్ప నిర్వచనం, “గురువు అంటే ఒక ఫలవృక్షమట”, దానిని వివిధ రకాల విద్యార్థులు ఎలా వాడుకుంటారో గొప్పగా చెప్పారు. హ్యాట్సాఫ్ సీవీకే గారూ…
ఇంత గొప్పగా ఈ పుస్తకాన్ని వ్రాసిన రచయిత కూడా ఒకప్పుడు ఉపాధ్యాయులుగా పని చేసినవారే. ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ, సీవీకే గారు ఎంత గొప్ప ఉపాధ్యాయులో…. కాదు, కాదు, ఎంత గొప్ప గురువులో అర్థమవుతుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలు, ప్రభుత్వ అధికారులతో పాటు, పాఠ్యపుస్తక రచయితలు కూడా చదువదగిన పుస్తకం ఇది. చివర ముగింపు ఈ పుస్తకం విలువను ద్విగుణీకృతం చేసేదిగా ఉన్నది.
ఒక మాటలో చెప్పాలంటే, ఉపాధ్యాయ వృత్తిలో వున్న వారందరికీ ఇది ఎంతో ఉపయుక్త గ్రంథంగా వుంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. పదవ తరగతి అమ్మాయితో ఇందులో చిత్రాలు వేయించడం కూడా కొసమెరుపు. రచనంతా ద్రాక్షాపాకంలో సాగించారు.
72 పేజీలతో మూడవ ముద్రణగా, ఆకర్షణీయ ముఖ చిత్రంతో ఫిబ్రవరి 2015 లో జనవిజ్ఞాన వేదిక వారి ప్రచురణ ద్వారా మన ముందుకు వచ్చిన ఈ పుస్తకం వెల కేవలం రూ.35=00 లు మాత్రమే. అంటే ఈ వేసవి కాలంలో నష్టం అని తెలిసినా త్రాగడానికి వెనుకాడని పనికి రాని కూల్ డ్రింక్ కై వెచ్చించే ఖరీదన్నమాట. 2012 లో ప్రథమ ముద్రణ పొంది, మూడు సంవత్సరాల స్వల్ప కాలంలోనే మూడవ ముద్రణకు స్వీకారం చుట్టినదంటే, ఈ పుస్తకం ఎంతగా ఉపయుక్తమైనదో తెలుస్తున్నది.
ఇంత మంచి పుస్తకాన్ని నాకు పంపి, చదివే అవకాశం కలిగించిన విద్యాప్రేమికులు, విద్యార్థిప్రేమికులు “దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ,తెన్నేరు, “అధినేత “శ్రీ దేవినేని మధుసూదనరావు” గారికి కృతజ్ఞతలు.
ఈ పుస్తకం కొరకు మనము “బి.క్రిష్ణారెడ్డి, ప్రచురణల విభాగం, 15/984, వెంకట్రామపురం, నెల్లూరు” అనే చిరునామాలోనూ, 9493355144 అనే సెల్ ద్వారానూ మరియూ అన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ ల లోనూ సంప్రదించవచ్చును.
Leave a Reply