ఆత్మ యజ్ఞము (అను గొల్ల కలాపము) – భాగవతుల రామయ్య

వ్యాసకర్త: Halley

*****
శుక్రవారం రోజున హిందూ పత్రికలో కేరళ నర్తకి ఒకావిడ గొల్లకలాపం గురించి చేసిన కృషిని గురించి ఒక వ్యాసం చదివాను. అసలు ఈ గొల్ల కలాపం కథా కమామిషు తెల్సుకుందాం అని కాసేపు అంతర్జాలంలో దొరికిందల్లా చదివాను. ఎందుకనో ఇంకొంత తెల్సుకోవాలి అని ఒక కుతూహలం కలిగింది. అదృష్టవశాత్తు అర్కైవ్ డట్ ఆర్గ్ లో కూచిపూడి కి చెందిన భాగవతుల రామయ్య గారు రాసిన “ఆత్మ యఙ్ఞము” (అను గొల్ల కలాపము) అన్న పుస్తకం కనపడింది. ఈ పరిచయం ఆ పుస్తకం గురించి.

ఈ విషయాలలో నాకు యే విధమైన పాండిత్యం లేదు. పరిచయం కూడా పెద్దగా లేదు. ఐతే ఆసక్తి కొద్దో గొప్పో ఉంది. ఆ ఆసక్తి ఆధారంగానే ఈ పరిచయం రాస్తున్నాను.

పుస్తకం మొదట్లో నటరాజ రామకృష్ణ గారి ‘కళాంజలి’ లో ఇది దృశ్య ప్రబంధం అనీ జ్ఞానప్రభోదకమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, ఆత్మానందకరమైన అనేక విషయాలను అందరకూ అర్థమయ్యేటట్టు ఆడుతూ పాడుతూ చెప్పాలని రామయ్య గారు ఈ గొల్లకలాపం రచించారని చెప్పారు. దృశ్య ప్రబంధం అంటే నర్తకులు ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారనమాట. కళాకారులు ఇది విజయవంతంగా ప్రదర్శించాలంటే సంస్కృతంలో పంచకావ్యాలు చదివి ఉండాలంట. ఇది కాక సంస్కృతంపై మంచి పట్టు ఉండాలట. సంగీతం నేర్చుకొని భరతాభినయాలను అభ్యసించి ఉండాలట. దీనికి తోడు వాగ్ధాటి కలిగి ఉండాలట. బాబోయి ఇన్ని క్వాలిఫికేషన్సా అని ఆశ్చర్యపోయాను నేను.

తర్వాత వచ్చిన పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ గారి వ్యాసం కూడా నాకు ఎంతో నచ్చింది. మన కళా రూపాలు కేవలం వినోద ప్రధాన సాధనాలే కాదు మత ప్రచార సాధనాలు కూడా అని అన్నారు. జాతి మహోన్నత చరిత్రని చాటి చెప్పేవి ఆ జాతి సంస్కృతీ సంప్రదాయలు అని అన్నారు. అసలు ఈ గొల్ల కలాపం దేని గురించో మిడి మిడి జ్ఞానంతో నేను ఏదో రాసేసే కంటే యెంచక్కా ప్రసాద్ గారి వాక్యాలను ఇక్కడ యథా తథంగా పేస్టు చేస్తాను.

“ఇందులో లౌకిక ఆధ్యాత్మిక విషయాలు సంయుక్తంగా చర్చింపబడ్డాయి. ఇది గొల్లభామ, బ్రాహ్మణుల మధ్య జరిగిన సంభాషణ. పిండోత్పత్తి, యజ్ఞపట్టు అనే విషయాలు ఇందులో కనిపిస్తాయి. శిశుజననాన్ని గూర్చిన శాస్త్రీయ విషయం వివరిస్తుంది పిండోత్పత్తి. యజ్ఞపట్టు యజ్ఞ కర్మ నిర్వహించే విధానాన్ని వివరించి అందులోని మంచి చెడ్డల్ని నిశితంగా చర్చిస్తుంది.

భగవద్గీతలోని ఆత్మ సమ్యమ, మొక్ష సన్యాస యోగాలలోని గంభీరమైన క్లిష్టతరమైన అంశాలు పండితపామరులందరికీ అర్థమయ్యే రీతిలో “ఆత్మ యఙ్ఞం” ప్రతిపాదించబడింది”

అదనమాట విషయం. మన సంస్కృతినీ సంప్రదాయాన్నీ సాహిత్యాన్నీ కళలనీ మన “యువ హృదయం” ఆదరించాలనీ, క్రొత్త జవ జీవాలతో జాతి నూతన చైతన్య స్ఫూర్తి పొందాలనీ, అందుకు జరగాల్సిన కృషిలో భాగమే ఈ ప్రచురణ అనీ అన్నారు ప్రసాద్ గారు. నాకెంతగానో నచ్చాయి ఆ మాటలు.

సాధారణంగా మన కళా మాధ్యమం ద్వారా జరిగే ‘చదువు’ గురించి నేను విశ్వనాథ వారి రచనలలో ఎన్నో సార్లు చదివాను. ” వేయి పడగలు” లో కబీరుకీ ధర్మరావుకీ మధ్యన జరిగిన సంభాషణ ఒకటి బాగా గుర్తు. అందులో “వీథి భాగవతములు, తోలు బొమ్మలు, హరి కథలు, యక్ష గానములు, జంగము కథలు ఒకటి యేమిటి, సర్వమును విద్యా బోధ కొరకే యెర్పడినవి” అన్న ఒక మాట రాశారు. ఈ ‘గొల్ల కలాపం’ దానికి ప్రత్యక్ష ఉదాహరణ. మన ఆర్ట్ లో ఇంత విషయముందా అని అనుకున్నా నేను ఈ పుస్తకం చదివాక.

భాగవతుల రామయ్య గారు అప్పటి దేవదాసిలకు శిక్షణ ఇచ్చేవారట. ఈ గొల్ల కలాపం ప్రదర్శించాలంటే ఆ దేవదాసీలు ఎంతటి నిష్ణాతులై ఉండాలి , ఈ పాండిత్యం సంపాదించటానికి ఎంత కష్టపడి ఉండాలి?

ఈ గొల్ల కలాపంలో పద్యాలు, పాటలు, దరువులు, గద్యాలు వేదాంతపరమైనవి అని రాసారు పుస్తకం మొదట్లో . వేదాంతం గురించి నేనేం చెప్పగలను! కాబట్టి నాకు నచ్చిన మూడు ముక్కలు చెప్తాను అంతే.

చాలా పద్యాలు సులభంగానే అర్థమయ్యేలాగానే ఉన్నాయి. వచనం లో ఇచ్చిన అర్థముతో పోల్చుకుంటూ చదివితే దాదాపుగా అర్థమయ్యేటట్టుగానే అనిపించాయి.

గొల్లభామకీ బ్రహ్మణుడికీ మధ్యన జరిగే సంభాషణలలో ఉన్న చమత్కారం నాకు నచ్చింది. ఉదహరణకి భామ “మేము గొల్ల వారమయా” అని అంటే బ్రహ్మణుడు “(నవ్వుచూ) యేమి వారము? ఆదివారమూ సోమవారమూ మున్నగు వారములు విన్నము కాని గొల్లవారమును వినియుండ లేదమ్మా?” అని అంటాడు.

“పిండోత్పత్తి” అనే భాగం మొదలు అవక ముందే గొల్లభామకీ బ్రహ్మణునికీ మధ్యన వర్ణ వ్యవస్థ గురించి ఒక పసందైన ఆర్గ్యుమెంటు అవుతుంది. ఈ గొల్ల కలాపం అంతానూ ఇలా వాద ప్రతివాదలతోనే నడుస్తుంది.

పిండోత్పత్తి, స్త్రీ ఋతుకాలము, శుక్ర శోణితములు, శిశు లింగ నిర్ధారణ, తొమ్మిది నెలలూ శిశువు వృద్ధి పొందు విధానమూ, మాతృ భుక్తాన్నరాసము శిశువు స్వీకరించే విధానము, శిశువు బయటకు వచ్చు విధానము, ఆశ్రమాలు, మరణము, పునర్జననము ఇలాంటివన్నీ సులభంగా అర్థం అయ్యేటట్టు గా రాసారు. ప్రధానంగా ఆంగ్ల మాధ్యమున చదివినందున సగం పదాలు నాకు కొత్తగా అనిపించాయి. చిన్నప్పుడు “ఛీ తెలుగు మీడియం వర్డ్స్” అని ఇలాంటివి మేము పట్టించుకొనే వాళ్ళం కాదు. ఏం చేస్తాం. అందువలన ఈ chromosomes, genetics వంటి విషయాలు మన వాళ్ళకి తెలియవేమోలే అని అనుకొనేవాళ్ళం అప్పట్లో. ఇలా ఎంచక్కా పబ్లిక్ biology lessons చెప్పే విధానం ఒకటి ఉంది అని తెల్సింది ఈ గొల్ల కలాపం చదివాక.

ఆ విధంగా పిండోత్పత్తి వగైరా విషయాలన్నీ చెప్పాక గొల్లభామ తిరిగి మొదట వర్ణ వ్యవస్థ గురించి అడిగిన ప్రశ్నలకు వెనక్కు వచ్చి, చావు పుట్టుకల విధానం ఇదైనప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా అవుతారు అని ప్రశ్నించటంతో “ఆత్మజ్ఞానం” అనే అధ్యాయం మొదలు అవుతుంది.

“విరాడ్రూపము యొక్క ముఖము నుండి భుజముల నుండి తొడల నుండి పాదముల నుండి నాలుగు వర్ణములు పుట్టెను” అన్న మాట పైన కొన్ని వాద ప్రతివాదాలతో ఈ అధ్యాయం మొదలు అవుతుంది. గొల్ల భామ ప్రశ్నలు బ్రాహ్మణుని సమాధానాలు భామ ప్రతిప్రశ్నలు ఎంతో ఆలోచింపజేస్తాయి. “జాతికిని బ్రహ్మత్వమునకును సంబంధము లేదయా” అని భామ వాదిస్తుంది ఈ అధ్యయము మొదట్లో, ఈ వాదన చేసే క్రమంలో అరిషడ్వర్గాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచాకోశములు ఇలా ఎన్నో విషయాల గురించి తెలుపుతారు.

ఏమీ తెలియని వాడు ఈ గొల్లకలాపం ప్రదర్శన పలు మార్లు చూసి మొదట నుంచి చివర దాక అర్థం చేసుకున్నాడంటే వాడో గొప్ప వేదాంతి అవటం ఖాయం .

ఇలా మొదలయిన అధ్యాయము మెల్లగా కర్మల మీదకి మళ్ళుతుంది. కర్మ కి జ్ఞానముకి గల లంకె మీదకూ నిష్కామ కర్మకూ మళ్ళుతుంది. ఈ వాదన క్రమము అసలు వేరే స్థాయిలో ఉందని అనిపించింది.

అటు తర్వాత డిస్కషన్ యజ్ఞాల మీదకు మళ్ళుతుంది. గొల్లభామ బ్రాహ్మణుడిని, “విప్రుడవై యుండి కూడా పశుహింస తో కూడిన యజ్ఞమును గొప్ప ఎలాగు అంటావు” అని అడగటం తో ఈ భాగం మొదలు అవుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు “యజ్ఞములు చేసిన పూర్వులగు జనక మహారాజు వంటి వారి కంటే నీవు మేధావంతురాలివా” అని భామను ప్రశ్నిస్తాడు. భామ తిరిగి “నిశ్చల భక్తితో ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు కానీ యజ్ఞ యాగాదులు చేసి భగవంతుడిని మెప్పించుట మీ వలన గాదు గదయ్యా” అని అంటుంది . ఇలా ఒకరి తర్వాత మరొకరి ఉత్తర ప్రత్యుత్తరాలతో సాగిపోతుంది ఈ భాగము.

ఇదిలా జరుగుతూ ఉండగానే అసలు యజ్ఞములలో ఏమి జరుగుతుంది వాటి తాలుకా పద్ధతులు నియమములు ఏమిటి అని ఒక మినీ లెక్చరు సమాంతరంగా సాగుతూ ఉంటుంది. ఇందులో యుపస్తంభము, చాత్వల దేశము ఇటువంటి ఎన్నో పదాల అర్థాలు వివరించారు. ఇది కాక సోమరసపానము, వంటలు ఇటువంటి విషయాల గురించి చర్చించారు.

ఇవన్ని ఇలా చర్చిస్తూనే “జంతు బలి కోరిన మీ దేవుడు ఘాతకుడు ” అని భామ అనటం జరుగుతుంది . అలా అని ఊరుకోక .. “బోయలకు అల్ప ప్రాణులను చంప రాదు అని నీతి ఉన్నది” … “ధనుర్భాణములను ధరించి అడవి లోని క్రూర మృగాలని చంపలేక మేకపోతులని పలువురితో కలిసి బలవంతంగా చంపి దాని మాంసాన్ని మీరైనాను అనుభవింపక అంటరాని వేల్పగు అగ్నిహోత్రునకు ఇచ్చెదరు. ఇది తనకు మాలిన ధర్మమూ కాదటయ్యా , స్వామీ !” అని అంటుంది .

ఇలా కాసేపయ్యాక .. “ఇడా నాడి” , “పింగళా నాడి” , “సుషుమ్నా నాడి” , “బ్రహ్మ నాడి” , “మోక్ష ద్వారము” , “ఓంకార నాదము ” ఇలా రక రకాల విషయాలు చర్చిస్తారు విప్రుడు గొల్ల భామ ఇద్దరు కలిసి.

చివరాఖరున “పరబ్రహ్మమును స్వాధీనం చేసుకోటానికి నది స్నానములు, యజ్ఞ యాగాదులు, వేద పఠనము , శాస్త్ర పాండిత్యము , తపస్సు వగైరాలు యేవీ సరిపోవనీ, సద్గురు భోధ, భగవంతుని యందు నిశ్చల భక్తి లేక ఆ పరబ్రహ్మ వస్తువు చిక్కదయ్యా స్వామీ!” అని అంటుంది గొల్ల భామ.

ఇలా మరి కాసేపు వాదులాడాక బాహ్య యజ్ఞ కర్మల నుంచి అత్మయజ్ఞము లోనికి వెళ్తుంది వీరి సంభాషణ. ఈ ఆత్మ యజ్ఞము చేసే విధానము చెప్పాక దృశ్య ప్రబంధము ముగుస్తుంది.

పీ.వీ.ఆర్.కె ప్రసాద్ గారి వ్యాసంలో ఒక మాట అన్నారు. “ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక అపూర్వ ప్రయోగం. అతి క్లిష్టమైన మహొత్కృష్టమైన వైదిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక విషయాలు ప్రధాన వస్తువుగా స్వీకరించి, నృత్య నాటికగా ప్రయోగించటం అసాధారణం అనితర సాధ్యం. ప్రపంచ సాహిత్యం లో గానీ, రంగ స్థలం మీద గానీ ఇట్టి మహత్తరమైన నృత్య రూపకం ‘న భూతో న భవిష్యతి’ అంటే అతిశయోక్తి కాదు” అని. నిజం! .

నా మటుకు నాకైతే ఇంత చిన్న పద్యాల్లో అంత పెద్ద భావాలు ఎలా దాగున్నాయా అని బోలెడంత ఆశ్చర్యమేసింది. ఇది కాక అసలు ఆ విసుర్లు, సటైర్లు, పంచ్ డైలాగులూ , బాబోయి! ఏదో అపుడపుడు ఛానలు మారుస్తూ ఉంటే అక్కడక్కడా ఏదో దూరదర్శన్ చానలులో తగులుతూ ఉంటయి మనకి ఇలాంటివి. లేదా హిందూ లాంటి పేపర్లో. ఏంటో మనకి అర్థం కాని జడ పదార్థం అని అనుకోటం తప్పితే ఎప్పుడూ ఏదీ తెల్సుకున్న పాపాన పోలేదు నేను. ఈ రోజు ఏదో ఒక పుస్తకం చదివాను కాబట్టి మన తెలుగు కూచిపూడి గొల్ల కలాపం ప్రాభవం తెల్సి వచ్చింది. ఇలాంటివి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ పుటల్లో ఎన్ని ఉన్నయో ఏమో. చదివితేనే ఇలా ఉన్నది చూస్తే మరింకెలా ఉంటుందో.

దీని తస్సదియ్యా భారతీయ కళల ద్వారా అబ్బే జ్ఞానం ఇలా ఉంటుందా అని అనిపించింది నాకు. మరి అప్పట్లో ప్రేక్షకులకి ఇవన్నీ అర్థమైపోయేవా? అటువంటుప్పుడు మనం డబ్బా కొట్టుకొనే ఇప్పటి లిటరసీ అర్థం ఏంటి? వంకాయ్ !

ఏంటో నాకు కొన్ని విషయాలు అసలు అర్థం కావు.

****
పుస్తకం వివరాలు:

ఆత్మ యజ్ఞము
రచన: “బ్రహ్మీభూత” భాగవతుల రామయ్య
ప్రచురణ: త్రివేణి ప్రెస్, మచిలీపట్నం, 1986
వెల: 20 రూపాయలు
archive.org లంకె ఇక్కడ.

You Might Also Like

Leave a Reply