పుస్తకం.నెట్ నాలుగో వార్షికోత్సవం
నేటితో పుస్తకం.నెట్ నాలుగేళ్ళు పూర్తిచేసుకొని ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా “పుస్తకం” అభిమానులకు, వ్యాసకర్తలకు, పుస్తకాభిమానులకు శుభాకాంక్షలు. అలాగే ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు కూడా.
గత ఏడాది పుస్తకం.నెట్ ప్రస్థానం సంఖ్యల్లో:
ఈ ఏటి ప్రోగ్రెస్ అంకెల్లో:
వ్యాసాలు: 228
వ్యాఖ్యలు: 1291
హిట్స్: 230455
నాలుగేళ్ళల్లో పుస్తకం సంఖ్యా బలం:
వ్యాసాలు: 1081
వ్యాఖ్యలు: 6951
హిట్స్: 788255
ముఖ్యాంశాలు:
- సెప్టెంబర్ నెలలో పుస్తకం.నెట్ లో వ్యాసాల సంఖ్య 1000కు చేరుకొంది. ప్రస్తుతం 1100 దరిదాపుల్లో ఉంది. పుస్తకాలకు మాత్రమే పరిమితమైన ఒక సైటు, కేవలం నాలుగేళ్ళల్లో ఇక్కడికి చేరుకొందంటే మాటల్లో చెప్పలేనంత ఆశ్చర్యం.
- “వీక్షణం” అనే కొత్త శీర్షికను ప్రారంభించాం. అంతర్జాలంలో సాహిత్యం గురించి వచ్చిన వార్తలూ, వ్యాసాలు, కథనాల మాలిక ఈ వీక్షణం. గత మూడు నెలలుగా నడుస్తున్న ఈ వ్యాసాలకి మంచి స్పందన వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ శీర్షికను క్రమం తప్పకుండా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాము.
- కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పుస్తకం.నెట్ ను దాదాపుగా ఓ పదిహేను రోజులు ఆఫ్-లైన్ ఉంచాల్సి వచ్చింది. తిరిగొచ్చాక మాత్రం, వ్యాసపరంపర ఎప్పటిలానే నిరంతరంగానే కొనసాగింది. ఆ పదిహేను రోజులు మాకు అండదండగా నిల్చిన పొద్దు వారికి, ఆ పై వ్యాసకర్తలకు మా ప్రత్యేక ధన్యవాదాలు.
- సామాన్య పుస్తకాభిమాని గుండెచప్పుడు వినిపించాలనే ప్రయత్నంతో మొదలైన పుస్తకం.నెట్ సైటులో నాగరాజు పప్పుగారు, శ్రీనివాస్ పరుచూరిగారి “అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య పుస్తక సంస్కృతి” లాంటి పరిశోధనాత్మక వ్యాసం రావటం గౌరవప్రదం.
- వేల్చేరు నారాయణరావు గారి పుస్తకాల గురించి కె.వి.యస్.రామారావు గారు వరుసగా పరిచయం చేశారు. అందుకు వారికి ధన్యవాదాలు.
- ప్రాజెక్ట్ గుటెన్బర్గ్ లో తెలుగు పుస్తకాలను చేర్చాలని కంకణం కట్టుకున్న వాంలంటీర్లకు, పుస్తకం.నెట్ “నామమాత్రం”గా పనికొచ్చి, ఉడతాసాయం చేసింది. ఇప్పుడు ప్రాజెక్ట్ గుటెన్బర్గ్ లో మహీధర రామమోహనరావు రాసిన – శుభలేఖ, అగ్నిగుండం, కొల్లాయిగట్టితేనేమి నవలలు ఉచితంగా చదువుకోవచ్చు. ఈ కృషిని ముందుండి నడిపిన “లియో”గారికి అభినందనలు.
- ప్రమద మోహన అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని వ్యాసాలు పంపటం మరో ప్రత్యేక విషయం. పుస్తకం.నెట్ పాఠశాలలు, కళాశాలలకు చేరుకుంటుందంటే మహదానందం.
చింతిస్తున్నాం:
- సైటులో వ్యాసాల సంఖ్య పెరిగేకొద్దీ పాత వ్యాసాలను వెదకటంలోనూ, నచ్చినవి దాచుకోవటంలోనూ చాలా ప్రయాసపడవలసి వస్తుంది అని అనేకులు మాతో చెప్పుకున్నారు. సాంకేతికంగా ఈ సమస్యలకు పరిష్కారం ఉన్నా, సమయాభావం వల్ల వాటిని అమలుపర్చలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. ఇప్పటికే ఓపిక పట్టిన మిమల్ని మరింత ఓపిక పట్టమనటం భావ్యం కాదని తెల్సినా, ప్రస్తుతానికి అదే అడుగుతున్నాం. ఈ ఏడాది ద్వితియార్థంలో పనులు చేపట్టేలా ప్రయత్నిస్తాం.
విన్నపాలు:
- పుస్తకాలలో మునిగుండేవారికే కాదు, పుస్తకాలను ఒకటీ అరా చదివేవాళ్ళూ ఇందులో పాల్గొనవచ్చు. పుస్తకం.నెట్ సందర్శకుల్లో తెలుగుబ్లాగు ప్రపంచానికి సంబంధించనివారి సంఖ్య గత రెండేళ్ళల్లో కొంచెం పెరిగినా, దాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకని మీ కుటుంబసభ్యులకు, చుట్టుపక్కలవారికి, స్నేహితులకు పుస్తకం.నెట్ గురించి చెప్పండి. పుస్తకాలను చదివే ఆసక్తిని పెంచమని మనవి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు, కాలేజి విద్యార్థులకు చేరువవ్వడానికి సహాయం చేయండి.
- ఏవైనా కొత్త శీర్షికలకు ఆలోచనలుండి, వాటిని అమలు పరిచే ప్రణాళిక, వీలుంటే మాకు తప్పక తెలియజేయండి. ఉదా: ఏదైనా మాసపత్రికను ప్రతినెలా పరిచయం చేయవచ్చు.
- గడిచిన ఏడాదిలో పుస్తకం.నెట్ చాలా ప్రశాంతంగా నడిచింది. వాదోపవాదాల్లో కూడా సంయమనం పాటించిన అందరికి ధన్యవాదాలు. ఈ అందమైన వాతావరణాన్ని ఇలానే ఉంచడానికి ప్రయత్నించాలని అందరికి మనవి.
- వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో కామెంట్స్ కూడా పెద్దవి రావటంలో ఆశ్చర్యం లేదు. పుస్తకం.నెట్ నిడివిని గురించి ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. కానీ ఐదొందల పదాలతో ఉన్న కామెంట్ ను మోడరేట్ చేయాలంటే నిర్వాహకలు కూడా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అది అన్ని వేళలా సాధ్యం కాదు. కామెంట్ సబ్మిట్ చేయగానే అది కనిపించాలన్న కుతూహలం అర్థంచేసుకోగలిగినదే అయినా, పుస్తకం.నెట్ నిర్వాహకులు అన్నివేళలా పుస్తకం.నెట్ పనులే చూసుకోలేరని గమనించగలరు.
- పుస్తకం.నెట్ లోని వ్యాసాలను ఏ కారణపూర్వకంగానైనా తిరిగి అంతర్జాలంలోనో, లేక పత్రికల్లోనో తిరిగి అచ్చువేసేటప్పుడు మాకు, ఆయా వ్యాసకర్తలకు ముందస్తుగా ఒక మాట చెప్పి అనుమతిని పొందండి. ఒకరు రాసినదాన్ని వారి పేరు తొలగించి ప్రచురించడం సంస్కారం కాదని గ్రహించమని మనవి.
- ఇదివరకే ఎక్కడో (మీ బ్లాగులోనైనా సరే) ప్రచురితమైన వ్యాసాలు పంపుతున్న పక్షంలో ఆ వివరాలు పుస్తకం.నెట్ కు తెలియజేయడం కూడా వ్యాసరచయితల బాధ్యతే. అంతర్జాలంలో ఇదివరకే ఉన్న రచనలు పుస్తకం.నెట్లో పునఃప్రచురణకు అంగీకరించము.
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
పుస్తకం.నెట్ ఏడో వార్షికోత్సవం. | పుస్తకం
[…] నాలుగో సంవత్సరం […]
S. Narayanaswamy
సంతోషం. అభినందనలు. బడి, కాలేజి విద్యార్ధులనించి రాబట్టే మార్గాలు వెతకాలి.
Madhu
Congratulations. I wish more people see the reviews more books and decide which book to purchase and read. Pustakam.net is a good source for many people. I wish some old good books be reviewed so that we know about them. With the review of old books, I was able to know about them.
sivasankar ayyalasomayajula
You guys are doing a great job.. your team efforts are appreciable.. Keep doing the good work and wish you all the best to each one of Pustakam.net team.
Jampala Chowdary
పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుస్తకం ఇలాగే దినదినప్రవర్థమానమౌతూ కలకాలం పుస్తకప్రియులకు కరదీపికలా ఉంటుందని ఆశిస్తున్నాను.
చంద్రహాస్
నాల్గవ వార్షికోత్సవం చేసుకుంటున్న పుస్తకం.నెట్ కి శుభాకాంక్షలు. cake చాలా అర్థవంతంగా వుంది. తయారుచేసిన వారికి అభినందనలు. ఈ siteని నడుపుతున్న వారికి thanks.
Purnima
అన్యాయం! కేక్ బొమ్మను కొట్టుకొచ్చినవారికి ఏమీ లేవా? 😛
తృష్ణ
congratulations and Best wishes.
పి.సత్యవతి
నాలుగవ వార్షికోత్సం జరుపుకుంటున్న పుస్తకం.నెట్ కి అభినందనలతో పాటు మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆశ.పుస్తకంలో వెలువడే సమీక్షలూ ,వీక్షణం శీర్షికా నిర్వాహకుల శ్రద్ధకీ సిన్సియారిటీకి ఉదాహరణలు.నేను చాలా ఇష్టపడే సైట్ పుస్తకమ్.నెట్
ఏల్చూరి మురళీధరరావు
సర్వశుభంకరంగా పౌగండంలోకి అడుగుపెట్టి ఆవిర్భావోత్సవం జరుపుకొంటున్న పుస్తకం.నెట్ సమర్థ సంపాదికలకు, విద్వద్వ్యాసకర్తలకు, మిత్రులందరికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు!