పహరా – జొయ్‌దీప్ రోయ్‌భట్టాచార్య

యుద్ధం దేశాల మధ్య జరుగుతుంది. యుద్ధం ఎప్పుడు జరగాలో, అసలు జరగాలో, వద్దో నాయకులు, దౌత్యవేత్తలు నిర్ణయిస్తారు. కాని యుద్ధం చేసేది, చావుబతుకులమధ్య పహరా కాసేదీ మాత్రం సైనికులే. ఆదేశాలను అమలుజరపడమే తప్ప యుద్ధపు అవసరాన్ని, ధర్మాధర్మాలను ప్రశ్నించే హక్కు వారికి లేదు.

యుద్ధం కొందరికి అవసరం. దరిద్రంనుండి తప్పించుకోవటానికి, కొత్త జీవనమార్గాన్ని ఎంచుకోవటానికి వారిముందున్న ఏకైక మార్గం.

యుద్ధం కొందరికి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. బతుకు కన్నా ముఖ్యమయింది తమ కుటుంబాన్ని, ఆస్తిని, అస్తిత్వాన్ని, మనుగడని, పుట్టిన గడ్డని కాపాడుకోవడం; శత్రువును జయించడం; తల ఎత్తుకు బతకడం.

యుద్ధం కొందరికి అనివార్యం. మంచిని నిలబెట్టడం, చెడును నిలువరించటం వారికి కర్తవ్యం. అవసరమైనప్పుడు ఆయుధం పట్టక తప్పదు.

యుద్ధం కొందరికి తమను తాము అర్థం చేసుకునే అవకాశం. మరికొందరికి పరిస్థితులనుంచి పారిపోయి కొత్త అవతారమెత్తే అవకాశం.

ఏది ఏమైనా యుద్ధరంగంలో శత్రువుతో తలబడుతున్న సమయంలో అందరిదీ ఒకటే ధ్యేయం – మరణించకుండా, తీవ్ర గాయాల పాలు కాకుండా యుద్ధరంగాన్ని విడచి తామూ, తమ సహచరులూ ఇంటికి చేరగలగటం.

The Watch నవలలో జొయ్‌దీప్ రోయ్‌భట్టాచార్య యుద్ధ వాతావరణాన్ని వివిధ దృక్పథాలనుంచి తరచి చూసే ప్రయత్నం చేశాడు. చచ్చిపోయిన ఒక ఆఫ్ఘన్ (పష్టూన్) దళనాయకుడి శవం తీసుకుని కాని కదలనని మొండికేసుకుని కూర్చున్న వికలాంగురాలైన అతని సోదరి, ఆఫ్ఘన్ల దాడిలో తమవారిలో చాలామందిని కోల్పోయిన దుఃఖంతో, కసితో, ఆందోళనగా ఉన్న అమెరికన్ సైనిక దళం ఈ పుస్తకంలో పాత్రలు. ఖాందహార్ ప్రాంతంలో పర్వతశ్రేణులకు దగ్గరగా, పగలు మంటలు మండిస్తూ, రాత్రులు చలితో కొంకర్లెత్తించే ఎడారిలో ఉన్న సైనికశిబిరం రంగస్థలం.

గ్రీకు క్లాసిక్స్‌లో సోఫోక్లిస్ వ్రాసిన యాంటిగనీ (Antigone) అనే నాటకం బాగా ప్రసిద్ధి పొందింది. థెబెస్ దేశపు రాజుపై ఇంకో యువరాజు పోలెనీస్ తిరుగుబాటు చేశాడు. యుద్ధంలో రాజు, పోలెనీస్ ఇద్దరూ చచ్చిపోయారు. కొత్తగా రాజైన క్రియాన్, తిరుగుబాటుదారైన పోలెనీస్ శరీరానికి అంతిమసంస్కారాలు చేయకుండా వదలివేయాలని ఆజ్ఞాపించాడు. పోలెనీస్ చెల్లెలు యాంటిగనీ రాజాజ్ఞను అనైతికమైందిగా భావించి, అన్నకు అంతిమసంస్కారాలు చేయటం తన బాధ్యతగా స్వీకరిస్తుంది. రాజుని ధిక్కరించి శవాన్ని ఖననం చేస్తుంది, రాజు ఆమెను ఖైదు చేస్తాడు. రాజ్యంలో అందరి సానుభూతి యాంటిగనీ వైపే ఉంటుంది. క్రియాన్ కొడుకు హైమాన్ తండ్రిని ధిక్కరించి తన ప్రియురాలు యాంటిగనీతో కలసి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వార్త విన్న అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. తన అధర్మపు చర్యలవల్ల దేవతల కోపానికి గురయిన క్రియాన్ మనశ్శాంతిని కోల్పోతాడు.

రాజనీతి, రాజ శాసనం, నైతికత, ధిక్కారం వంటి అనేక విషయాలను విపులంగానూ, ప్రతీకాత్మకంగానూ తరచిచూడడానికి అవకాశం ఉన్న ఈ నాటికనుండి ఒక ముఖ్యఘట్టాన్ని తన పుస్తకానికి కేంద్రబిందువుగా వాడుకున్నాడు జొయ్‌దీప్ రోయ్‌భట్టాచార్య. ఆ విషయాన్ని బట్టబయలుగానే పాఠకుల ముందు పెడతాడు. పుస్తకానికి ముందు, వెనుక సోఫోక్లిస్ మాటలు. తొలి ప్రకరణం పేరు యాంటిగనీ…

ఆఫ్ఘనిస్తాన్ మారుమూలలో ఎడారిమధ్యన ఉన్న ఒక అమెరికన్ సైనిక శిబిరంపై ఇసుకతుపాను మధ్యలో చీకటిమాటున కొందరు ఆఫ్ఘన్లు దాడి చేశారు. తీవ్రమైన ఘర్షణలో ఆఫ్ఘన్లు చాలామంది చనిపోయారు. అమెరికన్లు కూడా కొంతమంది చనిపోయారు; కొంతమందికి తీవ్రమైన గాయాలైనాయి. మరునాడు ఉదయం గాయపడినవారిని తీసుకుని వెళుతున్న అమెరికన్ హెలికాప్టర్ కూలిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ దాడి వల్ల కలిగిన ఆందోళన, తమతో రోజూ తిరిగే సన్నిహితులు చనిపోయిన దుఃఖం, వారి మృతికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి అమెరికన్ సైనికులకు అశాంతిని కలిగిస్తున్నాయి.

చనిపోయినవారిలో ఒక యువకుడి తలపాగా ప్రత్యేకంగా ఉంది. అతను నాయకుడై ఉంటాడని భావించి అతని ఫొటో హెడ్‌క్వార్టర్స్‌కి పంపితే, నిర్ధారణ నిమిత్తం శవాన్ని పంపించమని ఉత్తరువులొచ్చాయి. వెంటనే అమలుజేయడానికి హెలికాప్టర్ ‌లేక వేచి చూస్తున్నారు.

ఆ సమయంలో సైనిక శిబిరపు గోడ దగ్గరకు చక్రాల బండి తోసుకుంటూ ఒక వ్యక్తి రావటం కనిపించింది. ఆ వచ్చే వ్యక్తి మానవ బాంబా, తమను రక్షణ వదలి శిబిరం బయటకు రప్పించటానికి తాలిబన్ పన్నిన పన్నాగమో అర్థం కాలేదు. దుబాసి ద్వారా ప్రశ్నిస్తే, ఆ వ్యక్తి తాను చనిపోయిన నాయకుడి చెల్లెలినని, సోదరుడి శవాన్ని తీసుకుని శాస్త్రకర్మలు జరిపి పాతిపెట్టడానికి వచ్చానని చెప్పింది. ఆ శవాన్ని తీసుకువెళ్ళే హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది. శవాన్ని ఇవ్వటానికి వీలుకాదని చెప్పిన సైనిక అధికారులు ఆమెను వెనక్కు తిరిగివెళ్ళిపొమ్మని సలహా ఇచ్చారు. అన్న శవం లేకుండా తాను వెళ్ళను అని ఆమె ఖచ్చితంగా చెప్పింది. పగటి ఎండనూ, రాత్రి చలినీ లక్ష్యపెట్టకుండా ఆ శిబిరం ఎదురుగా ఆమె తిష్ట వేసింది. ఆమెకు ఆహారం, ఇతర సహాయం అందించటానికి అమెరికన్లు చేసిన ప్రయత్నాలను నిరాకరించింది. ఆమె రెండు కాళ్ళు అంతకు ముందెప్పుడో తన ఊరిపై విమానాలు చేసిన బాంబుదాడిలో పోయాయి. అన్న శవంకోసం పర్వతాలగుండా ఎన్నో మైళ్ళు చక్రాలబండిని చేత్తో నడుపుకొంటూ వచ్చిన ఆమె దృఢత్వం సైనికులకు ఆశ్చర్యాన్ని కల్పించింది. పోనీ ఆమె అన్న శవాన్ని ఆమెకు అప్పగిద్దామా అంటే పై అధికారుల ఆదేశాలు వేరేగా ఉన్నాయి. శిబిరం గోడకు ఒక పక్క సైనికుల పహరా. ఇంకో పక్క శవం కోసం మొండిగా ఆమె కావలి. ఆమె శ్రమకు ఫలితం దక్కుతుందా? ఆమె వచ్చిన పని నెరవేరుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం ఊహించని రీతిలో దొరుకుతుంది.

మూడు రాత్రులు మూడు పగళ్ళలో జరిగిన సంఘటనల్ని రచయిత వివిధపాత్రల ఆలోచనల ద్వారా మనకు తెలియపరుస్తాడు. నిజాం (వికలాంగురాలైన యువతి), ఫస్ట్ లెఫ్టినెంట్, సెకండ్ లెఫ్టినెంట్, మెడిక్ (బెటాలియన్‌లో వైద్యం చేసే వ్యక్తి), ఫస్ట్ సార్జెంట్, కెప్టెన్, దుబాసిల అంతరంగాలు, దృక్పథాల ద్వారా మనకు జరిగిన, జరుగుతున్న విషయాలతోపాటు అక్కడ అప్పుడు జరుగుతున్న సంఘటనలకు ఎక్కడో ఎప్పుడో ఉన్న మూలాలు తెలుస్తాయి. శిబిరంలో ఉన్న సైనికులు, పై అధికారులు, వారి గాథలు, బాథలు మనకు అవగతమౌతాయి. సైనికులంతా 19-20 యేళ్ళ వయసువాళ్ళు, ప్రపంచంగురించి తెలిసింది తక్కువ; తమకు తెలియదు అన్న జ్ఞానమూ తక్కువే. వీరందరి చావు బతుకులను నిర్ణయించే ఆదేశాలిస్తూ, అన్నీ తెలిసినట్లు, అనుభవాలతో తల పండినట్లు మాట్లాడే పటాలపు ముఖ్య అధికారి (కెప్టెన్ కానొలీ) వయస్సు మాత్రం ఎంత? 27 సంవత్సరాలు. రోజూ ఎడ్రినలీన్ ఆటుపోట్లతో జీవితాన్ని గడిపే ఈ పిల్లలు ఒక అగ్రదేశపు యుద్ధవిధానాన్ని పరాయిగడ్డపై నిర్వహించాల్సిన వాళ్ళు. తమగడ్డపై తమ జీవితాల్ని వదలిపెట్టి వచ్చిన వీళ్ళకోసం అక్కడివాళ్ళు ఇంకా అలాగే వేచి ఉంటారా?

రచయిత ప్రతిభ ఈ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, ప్రతి ఒక్కరి గొంతును మనకు విడిగా వినిపింపజేయడంలోనూ, కథను ఉత్కంఠగా నడపడంలోనూ, సైనిక జీవితాన్ని, ఆ మూడురోజుల ఆందోళనాపూరిత వాతావరణాన్ని సజీవంగా మనల్ని అనుభవింపజేయడంలోనూ వ్యక్తమౌతుంది.

ఇది యుద్ధవ్యతిరేక తాత్విక దృక్పథంతో వ్రాసిన పుస్తకం. ఐతే క్యాచ్-22లా అపహాస్యం పుస్తకం కాదు. యుద్ధంలో ఉన్న అసంగతత్వాన్ని, అమెరికన్ సైనికులపైనా, ఆఫ్ఘన్ ప్రజలపైనా యుద్ధపు దుష్ఫలితాలనీ, ఆశయాలకు, ఆచరణకు మధ్య కలిగే ఘర్షణనూ, నిష్ఫలమైన వేదననూ తాత్వికంగా చర్చించటానికి చేసిన ప్రయత్నం. గ్రీకు క్లాసిక్స్‌లో ఉండే తాత్విక సంఘర్షణ, విషాదమూ ఈ నవలకు ప్రేరకాలన్నది రచయిత ముందునుంచి నిర్మొహమోటంగా మనకు సూచిస్తూనే ఉంటాడు.

ముగింపు విషయంలో పాఠకులను రచయిత కావాలనే తప్పుదారిని నడిపించా డనిపించినా, యుద్ధం పట్ల, ఆఫ్ఘనిస్తాన్లో ఆమెరికన్ యుద్ధవిధానం పట్ల రచయిత భావజాలపు విస్తరణకే ఈ పుస్తకాన్ని వ్రాసినట్లు చాలాసార్లు అనిపించినా, బలమైన ముద్ర వేసే కొన్ని పాత్రలూ, సంఘటనలనూ చిత్రించి పుస్తకాన్ని ఆసాంతమూ వేగంగా చదివించాడు. అక్కడక్కడా ఆగి ఆలోచించుకోవలసిన పరిస్థితినీ కల్పించాడు.

ఇండియాలో పుట్టిన జొయ్‌దీప్ రోయ్‌భట్టాచార్య కలకత్తా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాల్లో రాజనీతి, తత్వ శాస్త్రాలు చదివాడు. ఈ పుస్తకం ఇతని మూడో నవల అట. ఇతని రచనలు చదవడం నాకు ఇదే మొదలు. ఇండియాలో పెరిగినా, వివిధ ప్రాంతాల, స్థాయిల అమెరికన్ల జీవన విధానాలనీ, మాటతీరునూ, ఆలోచనా విధానాలనూ బాగా పట్టుకున్నాడు. సైన్యంలో పనిచేయకపోయినా సైనిక శిబిర జీవితాన్ని, యుద్ధవాతావరణాన్ని వాస్తవికంగా చిత్రీకరించాడు. మామూలుగా ఇండో అమెరికన్ రచయితలు తీసుకొనే వస్తువు కాదు; వ్రాసే విధానమూ కాదు. విస్తృతంగా చదువుకున్నవాడని, తాత్విక ప్రాతిపదిక ఉన్నవాడేనని, కనిపెట్టి ఉండవలసినవాడేనని అనిపిస్తుంది.

ఈ పుస్తకం చదివాక నన్ను బలంగా వేధించిన ప్రశ్నలు – మనకెందుకు ఇటువంటి నవలలు రావటంలేదు? నూరేళ్ళు దాటినా, ప్రపంచ సాహిత్యంతో ఇంత పరిచయం ఉన్నా తెలుగు నవల ఎందుకు ఎదగలేదు? వస్తువులోనూ, కథనంలోనూ ఒక చట్రంలో అలానే బిగుసుకుని ఉండిపోవటానికి కారణాలేమిటి?

* * *

The Watch
Joydeep Roy-Bhattacharya
2012
Hogarth
290 pages
పుస్తకం అమేజాన్ కొనుగోలు లంకె ఇక్కడ; ఫ్లిప్కార్ట్ లంకె ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. Manjari Lakshmi

    పరిచయం, పుస్తకంలోని విషయం రొండు బాగున్నాయి.

  2. Padmaja

    Thanks for suggesting this book. Read it and enjoyed.

Leave a Reply to Padmaja Cancel