పుస్తకం
All about booksవార్తలు

May 1, 2009

నాలుగు నెలల పుస్తకంలో..

పుస్తకం.నెట్ ప్రస్థానంలో నాలుగు నెలలు గడిచాయి. క్వార్టర్లీ రిపోర్ట్ అంటూ వెనక్కి తిరిగిచూసుకునే ప్రయత్నం ఇది.

ఇప్పటిదాకా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాల మీద వచ్చే వ్యాఖ్యానంలో తెలుగుదే అత్యధిక భాగం. నిడదవోలు మాలతి గారు మనం మరిచిపోయిన రచనలూ – రచయిత్రలనూ పరిచయం చేస్తే, ఆచార్య తిరుమల రామచంద్ర గారి అరుదైన పుస్తకాలను ఇప్పుడు మనకి పరిచయం చేస్తున్నారు, బ్లాగాడిస్తా రవిగారు. నాగమురళిగారు చేసిన పర్వ పుస్తక పరిచయం ఇప్పటిదాకా అత్యధిక హిట్లనూ, వ్యాఖ్యలనూ సంపాదించుకుంది. అతిధి విభాగంలో ఎక్కువ మంది పాల్గొనటం ఒక మంచి పరిణామం. మేధగారు పరిచయం చేసిన “మహాశ్వేత”  వ్యాసానికి ఫణిగారి వ్యాఖ్య, “truth is stranger than fiction” అని మరోసారి నిరూపించింది. ఓ పుస్తక పరిచయం, ఓ జీవితానుభవాన్ని పంచుకునేలా చేసినందుకు మహదానందంగా ఉంది.

డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు తాము సమీక్షించిన, చర్చించిన పుస్తక విశేషాలను ఇక్కడ ప్రచురించడానికి అంగీకరించారు. ఇప్పటికి ఒక వ్యాసం వేశాము. మున్ముందు మరిన్ని వేయగలము.  మొత్తానికి ఈ నాలుగు నెలల్లో పుస్తకం పురోగతికి అందరూ సాక్షులే. డెబ్భై పోస్టులకి దరిదాపుగా పాతిక వేల హిట్లూ,  నాలుగొందలదాకా స్పందనలూ – ఇదీ నాలుగు నెలలో పుస్తక ప్రస్థానం.

Scoreboards lie!  Oh yeah.. they do!
అంకెల బట్టి పుస్తకం బానే నడుస్తోంది అనే అనిపించినా, అంకెలమీదే పూర్తిగా ఆధారపడక గత నాలుగు నెలలని విశ్లేషిస్తే మాకు ముందుగా ఎదురైన ఇబ్బంది, పుస్తకం ముఖ్యోద్దేశ్యం పాఠకులకి సుస్పష్టంగా తెలీలేదనే తెల్సొచ్చింది. పుస్తకం.నెట్ ఉద్దేశ్యం తెలుగు పుస్తకాల మీద ఒక వికిపీడీయాను తయారు చేయటం కాదు. ఏ భాషా పుస్తకం గురించైనా తెలుగులో వ్యాఖ్యానాన్ని అంతా ఒక చోట పంచుకునే యత్నం. ఇందులో అందరూ భాగస్వాములే! ఇప్పటి వరకూ వచ్చిన అధిక వ్యాసాలూ – పుస్తక పరిచయాలే! అలా కాక, పుస్తకంతో మీ అనుభవం, మీ అభిప్రాయం ఒక “మ్యూజింగ్” లా రాయాలనుకున్నా ఇక్కడ రాయవచ్చు. వ్యాసం నిడివిపైకానీ, వ్యాసం ఉండాల్సిన తీరుపై కానీ ఎలాంటి ప్రతిబంధనా లేదు.

పుస్తకం.నెట్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, “సామాన్య పాఠకుల వేదిక”!  పుస్తకం రూపేణా మన దాకా ఒక కథో, కవితో చేరడానికి రచయితలూ, ప్రచురణకర్తలూ, అమ్మకందారులూ ఇలా ఎవ్వరి గురించైనా ఇక్కడ పంచుకోవచ్చు. ఉదా: మీరో పుస్తకాల కొట్టులో ఆ కొట్టు యజమానితోనో, యాజమాన్యంతోనో, లేక సహ కొనుగోలుదారుడితోనో జరిపిన సంభాషణనీ ఇక్కడ పంచుకోవచ్చు. పుస్తకంతో అనుభవాలు లాగానే రచయిత/ రచయిత్రులూ మీ మీద వేసిన ముద్రనీ పంచుకోవచ్చు.

త్వరలో చర్చా వేదికనూ మొదలెట్టాలని ఆలోచన. దాని వివరాలు వీలైనంత త్వరలో తెలియజేస్తాం.

ఈ సైటులో కథలూ, కవితలూ, వాటి అనువాదాలూ, పుస్తకాల పైరేటెడ్ ఈ-బుక్ వర్షెన్లూ ఇవేవీ ఉండవు. కవులకూ, రచయితలకూ, సాహిత్యవేత్తలకూ పుస్తకం.నెట్ వేదిక కాగలదు, వారూ సహ-పాఠకులుగా ఉంటే! 🙂

మే నెల ఫోకస్ టాగోర్:
ఫిబ్రవరి  నెలలో శ్రీశ్రీ మీద ఫోకస్ శీర్షిక నిర్వహించినట్టుగా, ఈ నెలలో విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ మీద ఫోకస్ నిర్వహించాలని నిర్ణయించాము. ఇతర పుస్తక పరిచయాలతో సహా, ఈ నెలలో టాగోర్ రచనలపై వ్యాసాలను ప్రచురిస్తాము. టాగోర్ వీరాభిమానులనుండీ.. ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్న వారు వరకూ మీ మీ వ్యాసాలను మాకు పంపవచ్చు. ఇక టాగోర్ రచనలెప్పుడూ చదవని వారు, సిద్ధంగా ఉండండి. మీ “చదవాల్సిన జాబితా”లో కొన్ని పేర్లు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.

వ్యాఖ్యల్లో కామెన్ సెన్స్ ప్లీజ్..
ఏ రచనా వ్యాసంగానికైనా స్పందన ఇచ్చే స్పూర్తి, అంతా ఇంతా కాదు. (స్పందింపజేయటం కూడా అషామాషీ కాదనుకోండి.) పుస్తకం.నెట్ కి నిత్యపాఠకులుగా ఉంటూ, మీ అభిప్రాయాలనూ, అభినందనలూ, సూచనలూ ఎప్పటికప్పుడు మాతో పంచుకుంటున్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. విచక్షణతో విషయానికి సంబంధించి ఏ వ్యాఖ్య జోలికీ మా కత్తెర వెళ్ళదు. కానీ అభ్యంతరకరంగా ఏ వ్యాఖ్యలున్నా వాటిని తొలగించడం పుస్తకం.నెట్ నిర్వాహకుల ఇష్టం !

చివరిగా, ఈ సైటు – మనందరి సైటు. ఎవరో ఒక్కరిద్దరికి అప్పజెప్పే పని కాదు. పుస్తకంలో ఫలనా గురించి ఎవరైనా రాస్తే బాగుణ్ణు అని వేచి చూడకుండా, మీరే ఆ విషయాన్ని పంచుకోండి. చదవండి- పంచుకోండి- ఆలోజింపజేయండి! 🙂About the Author(s)

పుస్తకం.నెట్6 Comments


 1. mohan

  It IS Very Nice Book


 2. పుస్తకం ఒక ముదావహమైన ప్రయత్నమే అయినా,అవసరమైన వైవిధ్యాన్ని పంచలేకపోతోంది. ఇందులో పుస్తకం నిర్వాహకుల బాధ్యతకన్నా సహజంగా మన తెలుగువాళ్ళకు పుస్తకాలపై ఉన్న నిరాసక్తత ఎక్కువ కారణం అనిపిస్తుంది. కాబట్టి పాతిక నొక్కులు ఎక్కువే…!?!


 3. పుస్తకాలు కొనుగోలు – శీర్షిక క్రింద ఏటువంటి విషయం లేదు.
  ఆ మధ్య తెలుగు బ్లాగుల సంకలనాలని తెలుగు బ్లాగర్లు ప్రచురించారు. వాటిని ఉచితంగానే ఇచ్చినట్టున్నారు. వాటిని ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి లంకెలు ఏర్పాటు చెయ్యవచ్చు కదా!
  అవి ఈ పుస్తకాలు – హక్కుల సమస్యలు ఏవైనా ఉంటే తప్ప.
  ఛూడండి!


 4. పాతిక వేల “నొక్కు”లు ఊహించనిది. అయితే, పుస్తకాన్ని పరిచయం గా రాస్తే అంత బాగా రావట్లేదు. “మ్యూజింగ్స్” గా రాయాలంటే, ప్రతి పుస్తకం అనుభూతిని రేకెత్తించదు. అనుభూతి లేకుండా మ్యూజింగ్స్ రాస్తే చప్పగా ఉండి తేలిపోతుంది. పరిష్కారం చూడాలి.


 5. పుస్తకం.నెట్ లో ఏం రాయాలో, సొంత బ్లాగులో ఏం రాయాలో తేల్చుకోలేక మథనపడినవాళ్లలో నేనూ ఒకణ్ణి. కొన్ని పుస్తకాలు వ్యక్తిగతానుభవాలతో, ఆలోచనలతో ముడిపడిపోతాయి. ఆ అనుభవాలూ, ఆలోచనల గురించి రాయాలనిపించినప్పుడు వ్యక్తిగతవిషయాల గురించి ఈ సైట్లో ఎందుకులే, బ్లాగులో రాయడమే సమంజసమేమో అనుకుంటూ వచ్చాను ఇంతవరకు. పుస్తకాలతో ముడిపడినది ఏదైనా సరే రాయొచ్చని మీరన్నాకా ఇక్కడ ఇంకొంచం స్వేచ్ఛ తీసుకుని రాస్తూ ఉండాలనే అనుకుంటున్నాను.


 6. మాలతి

  డెబ్భై పోస్టులకి దరిదాపుగా పాతిక వేల హిట్లూ, నాలుగొందలదాకా స్పందనలూ – ఇదీ నాలుగు నెలలో పుస్తక ప్రస్థానం. – అద్భుతం. పుస్తకం.నెట్ నిర్వాహకులకి మనఃపూర్వక అభినందనలూ, శుభాకాంక్షలూ.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

పుస్తకం.నెట్ మొదటి వార్షికోత్సవం

“పుస్తకాలపై తెలుగు వ్యాఖ్యానం అంతా ఒక చోట ఉంటే బాగుంటుంద”న్న ఆలోచన నుండి పుస్తక...
by పుస్తకం.నెట్
18

 
 

జనవరిలో పుస్తకం.నెట్

పుస్తకం.నెట్ ప్రారంభమై నెలరోజులైంది. ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇటు ...
by పుస్తకం.నెట్
3