పద్య సాహిత్యం: సంఘ చరిత్ర (1900-1950) – బూదరాజు రాధాకృష్ణ

“నా తెలుగు బాగోదు, మెరుగు పర్చుకోడానికి మార్గాంతరాలు చూపండి” అని కోరగానే వినిపించిన తారక మంత్రం, “బూదరాజు రాధాకృష్ణ”. మర్నాడే విశాలాంధ్రకెళ్లి ఆయన పేరు మీదున్న పుస్తకాలు ఎన్ని ఉంటే అన్ని తెచ్చుకున్నాను. వాటి పేర్లలన్నీ ఇప్పుడు అప్రస్తుతం కానీ, కొన్ని పుస్తకాలు మాత్రం చాలా నచ్చాయి. మచ్చుకు, శ్రీశ్రీ మీద రాసిన మోనోగ్రాఫ్, ఇంకా “మరువరాని మాటలు” అని తెలుగు సాహిత్యం లోని కోట్స్ – ఈ రెండో పుస్తకం వల్లే ఆలూరి బైరాగి పరిచయం జరిగింది. బూదరాజుగారి పుస్తకాల వల్ల నా తెలుగు ఎంత బాగుపడిందో అప్రస్తుతం (అవును మళ్లీ!) గానీ, ఆయన పేరు ఏ పుస్తకం మీద చూసినా కొనటం మొదలెట్టాను. అందులో కొన్ని నాకు కొరకరాని కొయ్యలయ్యినా, కొనడం మాత్రం మానలేదు. మొన్నటి హైద్రాబాద్ పుస్తక ప్రదర్శనలో – ఏ స్టాలో మర్చిపోయాను – ఆయన రాసిన “పద్య సాహిత్యం: సంఘ చరిత్ర (1900 -1950)” అన్న పుస్తకం కొన్నాను. నాకు పద్యాలు గురించి ఏమీ తెలీదు, చరిత్రంటే కాస్తో కూస్తో ఆసక్తి ఉంది. అయినా, ఆయన రాసిన పుస్తకం “నాకు కావాలి – అంతే” అన్న మొండితనంతో కొన్నాను, పుస్తకం లోపల ఏముందో కూడా చూడకుండా.

“రెండు మాటలు” అన్న ముందు మాట చదవగానే, పద్య సాహిత్యం నుండి అప్పటి మన సంఘ, సమాజ తీరులను అర్థం చేసుకునే ప్రయత్నం. “పూర్వపద్యసాహిత్యానికి సంఘజీవనవిధానాల మీద అభినివేశం చాలా తక్కువ” అని నా అనుమానానికి ఊతమిచ్చారు. పుస్తకం కూడా అరవై పేజీలు అంతే! “నా ఓపిక, నా వయస్సు విధించిన పరిమితులకు లోబడి ఈ చిరు ప్రయత్నం చేశాన”ని రచయిత ముందుగానే disclaimer ఇచ్చారు. “నేను చదివి అర్థం చేసుకొగల తెలుగు, నా బద్ధకం విధించిన పరిమితులకు లోబడి ఇప్పుడీ వ్యాసం రాస్తున్నాను.” అని నా డిస్‍క్లేమర్. ”శక్తిమంతులయిన ఆధునిక యువతీయువకులు ఈ నా ప్రయత్నాన్ని మరెంతగానో ప్రస్తరించగలరు” అని ఆయన అన్నారు. “ఆ శక్తిమంతులయిన ఆధునిక యువతీయువకులకు ఇలాంటిదో పుస్తకం ఉందని చెప్పటమే నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో లోపాలను మన్నించగలరు. నాకే కాక, పలువురికి ఉపయుక్తంగా చర్చించగలరు” అని నా మనవి.

నేను చదివిన పద్యాల్లో (అతి తక్కువేననుకోండి)  ఎక్కువగా భక్తి సంబంధితమైనవో, నీతి శతకాలో, భావుకత్వం ఎక్కువగా ఉన్నవో మాత్రమే తగిలాయి. ఇంకా దాశరథి లాంటి వారిని చదవలేదనుకోండి. నన్ను ఆశ్చర్యపరస్తూ, మన పద్యాల్లో అవి తప్పించి వేరే అంశాలుండడం దుర్లభం అని రచయితా అభిప్రాయపడ్డారు. ఉన్నవాటిలో సంఘ చరిత్రను చూపించాలనే ప్రయత్నం ఇది. మొఘలాయిలు మన దేశానికి వచ్చినప్పటి నుండి తెలుగు సాహిత్యం, భారత దేశ చరిత్రను విహంగ వీక్షణం తీరున ప్రస్తావించారు. తొలి రాజకీయ నిదర్శనాలు అంటూ చిలకమర్తి వారి సుపరిచిత పద్యం “భరతఖండంబు చక్కని పాడుయావు”తో మొదలెట్టారు. బెంగాల్ సాహిత్యం మనపై చూపించిన ప్రభావాన్ని నొక్కి వక్కాణించారు. ’వందేమాతరం’, ’దేశమాత’ అన్నపదాలు అక్కడ నుండి వచ్చినవే, అవి మన పద్యాల్లో విరివిగా కనిపించేవట. మన జాతీయ గీతం ఒక మహోద్యమానికి కారణమైన ’వందేమాతరం’ కాకుండా, పంచమ జార్జిని ప్రస్తుతించిన ’జణగణమణ” కావటం బూదరాజుగారిని నొప్పించిందని తెలుస్తుంది.

తొలి సాంఘికచరిత్రాధారాలు అన్న శీర్షికన రైలు, పొగయోడ, తంతి తపాల వంటి వాటిపై వచ్చిన పద్యాలను ఉదహరించారు. నూతనావిష్కరణాదుల మీద పద్యాలు రాసిన తొలికవి గా వడ్డాది సుబ్బారాయుడు (1854-1938) గురించి రాసారు. ఇచ్చిన పద్యాలు నాకు నచ్చింది రైలు మీద రాసింది.

ధూమశకట వేగ మేమని వర్ణింతు
భూమిఁ గంటఁబడుచుఁ బోవునట్టి
వేవిగాని సాటిరావు దానికి వడి
దానివంటి దొకటె దాని నీడ!

“వసురాయచాటు ప్రబంధం”లోని మరిన్ని పద్యాలను పరిచయం చేశారు. కాకినాడ కాంగెస్సు సభ, వేషధారణలో పెరుగుతున్న ఖద్దరు వాడకం, అగ్గిపుల్లల పెట్టి, ఊటకలముల పాళీలు (fountain pen), కొత్తగా వస్తున్న మోటారు వాహనాలు, రవాణా సౌకర్యాలు, విద్యుద్దీపం, బాండు మేళాల ప్రస్తావన ఈయన పద్యాల్లో చూడవచ్చును. స్త్రీ విద్యను గురించి కూడా రాశారు, విరేశలింగం పంతుల గారి ప్రయత్నాలను అప్పటి సంప్రదాయ కవులు గుర్తించారని ఒక పద్యం ద్వారా తెలుస్తుంది.

అవధానకవితలో సంఘ విషయం అన్న శీర్షికన, తిరుపతి వేంకట కవులుగా ప్రశిస్తిగాంచిన జంటకవుల పద్యాలను ఉదహరించారు. ఇందులో ఆంగ్ల విద్యా విధానంపై ఒక పద్యం, నాకు చాలా నచ్చింది.

బెంచీ లక్కఱలేదు, గేమ్సు మొదలౌ ఫీజుల్ వినన్ రావు, పొ
మ్మంచు న్నిర్ధనుఁ ద్రోసిపుచ్చరు గురుల్, ప్యాసైననే లాభ మిం
దంచున్ నేమము లేదు, మీ చదువునం దాలోకమీలోకమున్
గాంచన్ వచ్చెడి, నార్యులార! మిము మ్రొక్కన్ వచ్చు నెక్కాలమున్

ఆంగ్ల విద్య తీరుకి, మన సంప్రదాయ విద్యకి తేడాను ఈ పద్యంలో చెప్పుకొచ్చారు. (గడియారం రామకృష్ణ శర్మ గారి అనుభవాలు ఇక్కడ చదవండి.)

ఈ పుస్తకంలో ప్రస్తావించిన చాలా పద్యాలలో ఆంగ్ల పదాలను అవలీలగా వాడారు, అనేకానేక అంశాల పై రాస్తూ. చంధోబద్ధమే అయినా కొన్ని పద్యాలు వ్యవహారికానికి చాలా దగ్గరగా ఉన్నాయి. బూదరాజు గారు, పద్యాలు ఊహాలోకాన్ని పట్టుకొని ఊడిరాలేదు అని బాధపడ్డారు కానీ, అలా వచ్చుంటే అచ్చ తెలుగు పద్యాలు తక్కువై, మనం ప్రస్తుతం మాట్లాడే తెలుగులా తయారయ్యేవేమోనని నాకో మా చెడ్డ అనుమానం వస్తుంది. ఆ అనుమానం వెనుక నా ఆజ్ఞానం ఏ మేరకు ఉన్నదో చర్చించగలరు.

(అన్నట్టు నాకు కొన్ని మామూలు సందేహాలు, నివృత్తి చేయగలరు. అవధానాల్లో ప్రస్తుత రాజకీయార్ధిక విషయాలు ప్రస్తావనకి వస్తుంటాయా? అవధానమన్నది తెలుగుకి మాత్రమే ప్రక్రియా? అవధానమన్న ప్రక్రియ ముఖ్యోద్దేశ్యం ఏంటి – అవధాని పద్యవిద్యను పరీక్షించటమేనా?)

ఈ జంటకవులు రాసినదే మరో పద్యం, మన న్యాయవ్యవస్థ మీద – అప్పటిదైనా, ఇప్పటిదైనా!

గెలియనట్టిదియైన గెల్చునటంచును, లాఁ జూచి కల్పనలను ఘటించి
తప్పుఁ జెప్పుమటన్నఁ దప్పుఁ జెప్పనివారి, నోటి కబద్ధాలు నూరిపోసి
జెడ్జిగారికి నేను జెప్పుమాటలు పథ్య, ములు సుమా యని వాని మోసపుచ్చి
రేపు ఫీ జిచ్చెద మా పిచ్చెద నటన్నఁ, గాదు తెమ్మని ముందుగానె కొనియు
వ్యాజ్య మొకవేళఁ బోయిన వాని సాక్షి, మీఁద నెపమడి, గెల్చిన మీఁదఁ బెట్టు
కొని నటింతురు ప్లీడరుల్ గొంద ఱిలను, న్యాయవాదుల మంచు నన్యాయలీల.

1910 నాటికే ఉన్న మునిసిపల్ ఎన్నికల పై ఈ కవులు రాసిన మరో పద్యం మీద వ్యాఖ్యానిస్తూ: “భారతీయ సంప్రదాయ చరిత్రకుగాని సంఘపరిణామక్రమానికి గాని సంబంధంలేని విజాతీయ భావన ప్రజాస్వామ్యం” అని రచయిత అభిప్రాయపడ్డారు. ఓటర్లకి లంచాలివ్వడం, చదువు సంధ్య లేకున్నా పది మందిలో గుర్తింపు కోసమని పదవి కోసం ప్రాకులాడ్డం వంటివి ఆనాటి నుంచీ ఉన్నాయని తెలుస్తుంది.

తర్వాత మంగిపూడి వేంకటశర్మ (1882-1951) రాసిన నిరుద్ధభారతం నుండి ఒక పద్యానిచ్చారు. ఇవి అస్పృశ్యతా వ్యతిరేక పద్యాలు. ఉమర్ అలీ షా (1885 – 1945) రాసిన ఉమర్ ఖయ్యూం అనే పుస్తకం ఏడాది బట్టి పక్కకు పెట్టి పూజిస్తున్నాను. కాస్త కూడా చదవలేదు. ప్రస్తుత పుస్తకంలో ఆయనవి కొన్ని పద్యాలిచ్చారు, సమాజదుస్థితిని సూచించేవి. సిగరెట్టుని ప్రస్తావించిన తొలి కవిట. ఆయన కాఫీ గురించి రాసిన రెండు ముక్కలు

కాంత లేకున్న మానె నేకాలమందు
కాఫి యుండినఁ జాలు, దుఃఖంబు లేదు…

వీరి పద్యాల్లో మన ప్రస్తుత సమాజంలోని రేషన్ షాపులను ప్రతిబింబించే ఓ అంశం పై బూదరాజుగారి వ్యాఖ్యానం: సామాన్యజనం వాటిని “రేషన్ షాపు”లంటే ప్రభుత్వం వాటినే సహాయకసంఘాలు అని వ్యవహరించేది. చేసింది నియంత్రణ; పిలిచింది ఉపశమన / సహాయ సౌకర్యమని.” ఉమర్ పద్యాలను వివరిస్తూనే రచయిత కొన్ని తెలుగు పదాలకు, అప్పటి నాణేములకు అర్థాలు వివరించారు.

ఆంధ్రరత్న చాటుపద్యాలు అన్న శీర్షికన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (1889-1928) పద్యాలను పరిచయం చేశారు. ఈయన ’అభినయదర్పణాన్ని’ సంస్కృతంనుంచి ఇంగ్లీషులోకి అనువదించి ఆనంద కూమరస్వామికి సహాయపడ్డారట. (అనువాద రచనను ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చును.) నేను చదవకుండా పూజిస్తున్న మరో రచయిత ఆనంద కుమారస్వామి. దుగ్గిరాల గురించి చాలా విషయాలనే చెప్పుకొచ్చారు. దుగ్గిరాల గాంధీజిని “పురుషోత్తముఁ డనుకొన్నాను, ఉత్తమ పురుషుఁ డయినాడు” అని వ్యాఖ్యాన్నించారట. గాంధీజి విధివిధానాలకు తెలుగువాళ్ళల్లో అప్పట్లో కాస్తా కూస్తో వ్యతిరేకత ఉన్నదని అక్కడక్కడా అనిపించింది. దుగ్గిరాల భావకవులకు పెట్టిన పేరు, “కొత్తిమీర కవిగాళ్ళు” అని.

వేలూరి శివరామశాస్త్రి (1892-1967) ’తెలుగు దుర్గతిని’ చూపించిన తీరు:

“తెలివికి సంస్కృతమో మఱి, కలిమికి నాంగ్లేయమో యిఁకం దురకంబో
విలువయిడి నేర్చి నీయీ, తెలుఁ గెవ్వరి పాలు చేసి తిరుగెద వాంధ్రా?”

బాగా ప్రశ్నించారు కదూ?! మనదన్న దాన్ని పూర్తిగా విస్మరిస్తే కాని, ఇతర భాషలపై పట్టు రాదన్నట్టు వ్యవహరించటం ఈనాటిది కాదనిపించింది.

పోకూరి కాశీపతి (1892-1974), తాపీ ధర్మారావు గారి కోరిక మేరకు కాఫీపై దండకం చెప్పారట. సంప్రదాయ కవి అయినప్పటికీ ఆయన చాలానే ఆంగ్లపదాలని వాడారు. పొద్దున్నే లేవగానే కాఫీ తాగకపోతే,

“ద్విజుల్ వేదమంత్రంబులన్ బల్కఁ గా లేరు, ప్రాంచత్కవుల్ పద్యముల్ హృద్యమౌ రీతి నిర్మింపఁగా లేరు… డ్రైవర్లు స్టీరింగులన్ బట్టఁగా లేరు, టీచర్లు పాఠంబులన్ జెప్పఁగా లేరు..” అని దండకమెత్తుకొచ్చారు. అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న కొత్తవాటిపై మోజు గురించి ఎక్కవ చెప్పనక్కరలేదు, అయినా నేను ఆంధ్రా భోజనం పై కొన్ని పద్యాలుంటాయనుకున్నాను. చరిత్రను నిరూపించటానికి అవి అనవసరమనిపించి ఈ పుస్తకంలో పెట్టకపోయుండచ్చు.

పద్యకవితా దురంధరుడైన గుర్రం జాషువా(1895-1971) రాసిన పద్యాలలోని సమాజ దుఃస్థితిని వివరించారు. అస్పృశ్యతను గురించి, కులవిద్వేషాలను గురించి, స్త్రీల విద్య గురించి రాసిన పద్యాలనిచ్చారు. ఆయన రాసిన ఒక పద్యం:

“రేయి బవలు భారతీయసంస్కృతి పేర, గండశిలలు చూపి కథలు చెప్పి
కటికపేదవాని కడుపులోగల చిచ్చు, గడపగలవె నీవు గగనవాణి?”

సుందరరామ వామనుడి త్రివిక్రమావతారం శీర్షికన మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి (1895-1950) గురించి రాశారు. ఈ కవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ప్రపంచ విషయాలూ, ప్రముఖ వ్యక్తుల గురించే కాక, కన్యాశుల్కంలోని గిరీశం గురించి కూడా పద్యాలు అల్లారట. “రాయలసీమ” అన్న రచనలో ఒక పద్యం ఇదిగో:

బొగ్గు న్నుగ్గుఁ బొగాకు దుగ్గు సయితంబున్ నిప్పు లేకుండఁగన్
బగ్గుం బగ్గున మండుచున్నయది, ప్రాణం బుండి యీ రీతిగన్
మ్రగ్గం జచ్చుటకన్నఁ జచ్చుటయె కొంతంగొంత మేల్గాదె? యీ
కిగ్గాడీ జడం బిఁకెప్పటికి శక్తింబాసి శాంతించునో?”

గోల్కొండ కవుల్లో ప్రఖ్యాతుడైన గంగుల శాయిరెడ్డి (1895-1975) రచన “కర్షకా” నుండి కొన్ని పద్యాల ద్వారా ఆనాటి నైజాం పరిస్థితులు తెల్సుకోవచ్చును.

అబ్బూరి వివరించిన ఆనాటి స్థితిగతులు శీర్షికన అబ్బూరి రామకృష్ణారావు (1896-1979) రాసిన పద్యాల్లో ముళ్ళపూడి వెంకటరమణను ఉద్దేశ్యిస్తూ రాసిన దాంట్లో ఒకటి:

జిన్నాకును గాంధీజి, కెన్నో పోలికలు కల వదెట్లనగా లో
నున్నది అల్లా ఒకడే, విన్నావా? ముళ్ళపూడి వేంకటరమణా!

ఇందాక గాంధిజి మీద వ్యతిరేకత కనిపించిందని అన్నానే, ఇదో మరో ఉదాహరణ – గాంధీ సిద్ధాంతలను అనుసరించే పట్టాభి సీతారామయ్య,  ఆత్మరక్షణార్థం లాఠీలుపయోగించి, అది అహింసామార్గావలంబనమే అని వ్యాఖ్యానించారని ఈ పద్యం.

“తన్నులు దిని ప్రహ్లాదుడు, తన్నించె నృసింహుచేత తండ్రిని చంపెన్
దీన్నే ’అహింస’ అందురు’…

విల్ డ్యూరెంట్ రాసిన “ది కేస్ ఫర్ ఇండియా” అనే పుస్తకంలో అనుకుంటా, అహింస అంటే చేతగానితనం కాదు, తిరగబడ్డం తప్పించి మార్గాంతరం లేనప్పుడు తిరగబడాలి అని గాంధి అనేవారు / నమ్మేవారు అని రాసారు. అబ్బూరి వారు మాత్రం తెలుగువాడి సొత్తైన సెటైర్ ని ప్రయోగించేశారు.

మొత్తానికి ఈ పుస్తకం ఆసక్తి రేకెత్తించేలా ఉంది. మన దేశ చరిత్రను సరిగ్గా డాక్యుమెంట్ చేసుకున్న దాఖలాలు లేవు. సాహిత్యం నుండి తెల్సుకుందామా అంటే, తెలుగు వాళ్లకి సరైన గ్రంథాలయాలూ లేవు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇలాంటి ఒక వ్యాసం రాయబూనడం అభినందనీయం. చిన్న పుస్తకమైనా విలువైనది. ఇలాంటి ప్రయోగాలు మరేవన్నా ఉంటే తెలియజేయగలరు.

ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డ మరికొందరు కవులు / రచయితలు:
కనుపర్తి వరలక్ష్మమ్మ (1896-1978)
దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897 – 1980)
వేదుల సత్యనారాయణ శాస్త్రి (1900-1976)
శేషభట్టర్ వేంకట రామానుజాచార్యులు
శ్రీశ్రీ
ఏటుకూరి వేంకట నరసయ్య (1911-1949)
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-90)
జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (1914-68)
విద్వాన్ విశ్వం (1915-1985)
మాచిరాజు దేవీప్రసాద్(1922-1974)
దాశరధి కృష్ణమాచార్యులు (1925-1987)
గోల్కొండ కవులు

(కనుపర్తి వరలక్ష్మమ్మ గారిని తప్పించి, దాదాపుగా ఇక్కడ ప్రస్తావించిన చాలా కవులు, వారి రచనల మీద పుస్తకం.నెట్ లో వ్యాసాలు రాలేదు. పుస్తక పరిచయాలతో పాటు, రచయితల, కవుల పరిచయాలపైనా దృష్టి పెట్టదల్చిన వారికి ఇందులోని పేర్లు సూచిగా పనికొస్తుంది అనుకుంటున్నాను.)

*******************************

పుస్తకం వివరాలు:

పద్యసాహిత్యం: సంఘ చరిత్ర (1900-1950)
రచయిత: బూదరాజు రాధాకృష్ణ
వెల: రూ 25 /-
మొదటి ప్రచురణ: 2005
ISBN: 81-7443-019-9
ప్రతులకు:
Prachee Publications
3-3-859/1/8
Second Floor, Lane opposite Arya Samaj,
Kachiguda
Hyderabad – 500027
Ph: 04024602009

You Might Also Like

9 Comments

  1. sahitya abhimani

    “పూర్వపద్యసాహిత్యానికి సంఘజీవనవిధానాల మీద అభినివేశం చాలా తక్కువ”
    అన్నారు ఈ వ్యాసంలో. నిజానికి ఆంధ్రుల సాంఘిక చరిత్రను ముఖ్యంగా పద్యసాహిత్యాధారాల ద్వారానే నిర్మించారు ప్రతాపరెడ్డి గారు.
    కాలానికి నిలిచే ఏ సాహిత్యమైనా స్థలకాలాలకు అతీతమైన అంశాలని ఇముడ్చుకోవడమే కాక ఆనాటి సమాజాన్ని ఎంతో కొంత ప్రతిబింబించి తీరాలి. ఈ నేపథ్యంలో మీకీ అభిప్రాయం ఎలా కలిగిందో ఆశ్చర్యంగా ఉంది.

    1. సౌమ్య

      From what I understood, this article’s author quoted that line from the book…So, it is Dr BRK’s line and not her line.

  2. chavakiran

    ఈ పుస్తకం ఇప్పుడు కినిగెలో లభిస్తుందిృ కేవలం 15 రూపాయలకు, లేదా 30 రూపాయలకే చక్కగా చదివి ఆనందించవచ్చు. http://kinige.com/kbook.php?id=445

  3. పుస్తకం » Blog Archive » మూడు జీవితచరిత్రలు

    […] ఆపై, బూదరాజు రాధాకృష్ణ గారి ’పద్య సాహిత్యం: సంఘ చరిత్ర (1900-1950) ’ తిరగేస్తున్నప్పుడు దుగ్గిరాల గారి […]

  4. కొడవళ్ళ హనుమంతరావు

    ఇద్దరు ఉద్దండుల (పరుచూరి, కామేశ్వరరావు గారు) మధ్య తలదూర్చడం సాహసమే గాని, ఇది కొందరికి ఉపయోగపడుతుందని రాస్తున్నాను. కొంత మాఊరి గొప్పదనాన్ని చాటటానికి కూడా.

    కాస్త తెలుగు పుస్తకాలు తిరిగి చదవడం మొదలెట్టిన సమయంలో పరుచూరి వ్యాసం చదివి, “క్రీడాభిరామం,” చదవడానికి ప్రయత్నించి వదిలేశాను – తాత్పర్యం, వ్యాఖ్యానం లేకుండా నాకు పద్య సాహిత్యం అర్థమయే అవకాశం లేదు. అదృష్టవశాత్తూ ఈ మధ్యనే యార్లగడ్డ బాలగంగాధరరావు [1] గారి పుస్తకం దొరికింది.

    “నెల్లూరి తూము కాలువ
    హల్లకముల కమ్మఁ దావి నపలాపించున్
    సల్లలిత లీలఁ దిప్పయ
    వల్లభరాయ ప్రధాన వాగ్డంబరముల్”

    నెల్లూరి తూము కాలువలోని ఎర్ర కలువల కమ్మని సుగంధాన్ని తలపుకు తెప్పిస్తుందట వల్లభరాయని వాక్య విన్యాసంలోని భావపరిమళం. (ప్రస్తుతం నెల్లూరి కాలువలో ఏమున్నాయో గుర్తుకు తెచ్చుకోకూడదు.)

    ఎన్నో విషయాలు తెలిశాయి. మన భాష, ప్రాంతం, ఆచారాలు, కట్టుబాట్లు – అన్నీ తమ పాండిత్యతో సరళంగా వివరించినందుకు యార్లగడ్డ గారిని మెచ్చుకోవాలి. చదివే ముందు ఓ హెచ్చరిక – “క్రీడాభిరామం,” అశ్లీలమని ఒకప్పుడు నిషేధించారు – వేశ్యలు, రసికత ఇతివృత్తంలో ప్రధానం.

    పదిహేనేళ్ళ క్రితం, మా ప్రాథమిక పాఠశాల వజ్రోత్సవ సందర్భంగా మా ఊళ్ళో పెద్ద సభ చేసి, ఓ సంచిక వేసి నాకు పంపించారు. దాంట్లో యార్లగడ్డ వారి పేరు చూశాను – నాగార్జునా లో తెలుగు హెడ్డు. శ్రీనాథుడితో ఎత్తుకొని, మాఊరికి రావినూతల అనే పేరు ఎలా వచ్చిందో వివరించారు. ఆవులిస్తే ప్రేవులు లెక్కపెట్టగలరనిపించింది. ఇంటిపేర్లు, ఊరిపేర్లు మీద ఈయన అథారిటీ.

    అదే సంచికలో మాఊరి ప్రముఖ కవి నాగభైరవ కోటేశ్వరరావు మాష్టారు గారు [2] ఒక విషయం చెప్పారు. ప్రముఖ కవయిత్రి రంగాజమ్మ ఇంటిపేరు పసుపులేటి. వారు కళావంతులు. తండ్రి పేరు రావినూతల వెంకటాద్రి. ఆయనది మాఊరేనట? ఎలా? ఖమ్మం జిల్లాలో ఉన్న మరో రావినూతలలో బ్రాహ్మణ కుటుంబాలు లేవు కనుక ఈయనది ప్రకాశం జిల్లాలోని మాఊరేన్నారు. అనడమేమిటి? ఉత్తేజపడిపోయారు, “రంగాజమ్మ” అన్న కావ్యమే రాసి 1963 లోనే మాఊళ్ళొనే ఆవిష్కరించారు!

    రంగాజమ్మ తంజావూరు ఆంధ్రనాయకరాజైన విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయత్రి. మిగుల గడుసరి. రంగాజమ్మ అంటే రాజుగారికి మహా ఇష్టం. రాణీ గారికి ఆమె అంటే కంటగింపు. “మాయల మారి” అని ఆవిణ్ణి రాణీ గారు దూషిస్తే, రంగాజమ్మ తిరుగు ఈ పద్యం వ్రాసి పంపింది [3] [4]:

    “ఏ వనితల్ మముం దలఁపనేమిపనో? తమ రాడువారు గా
    రో? వలపించు నేర్పెరుఁగరో? తమ కౌగిటిలోన నుండగా
    రావది యేమిరా విజయరాఘవ! యంచిలుదూరి బల్మిచేఁ
    దీ వర కత్తె నై పెనఁగి తీసుక వచ్చితినా! తలోదరీ!”

    పరుచూరి అన్నట్లు పాత పద్య సాహిత్యం చదివితే, కాస్త కవిత్వంతో బాటు కొంత సాంఘిక చరిత్ర కూడా అబ్బుతుంది. కొందరికి ప్రేమపాఠాలు కూడా.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం: వచనము – పద్యములు – విశేషాలు,” ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు. నిర్మలా పబ్లికేషన్స, విజయవాడ, 2008.
    [2] కోటేశ్వరరావు మాష్టారు గారి కంచు కంఠం ఇక్కడ వినొచ్చు: http://www.loc.gov/acq/ovop/delhi/salrp/rao.html
    [3] “తెలుగులో చాటు కవిత్వము,” ప్రొ. జి. లలిత. క్వాలిటీ పబ్లిషర్స, విజయవాడ, 1981.
    [4] “A Poem at the Right Moment,” Velcheru and Shulman. University of California Press, 1998.

  5. కామేశ్వర రావు

    హనుమంతరావుగారితో నేను ఏకీభవిస్తాను. ఇరవయ్యో శతాబ్దపు చరిత్రకోసం పద్య సాహిత్యాన్ని చదవనక్కరలేదు. పద్యసాహిత్యం ఏ రకంగా “ఆధునిక”మయిందో చెప్పే ప్రయత్నమేమో మరి! ఈ పుస్తకం నేను చదవలేదు కాబట్టి ఇంతకన్నా దీని గురించి ఏమీ చెప్పలేను. కాని ఉదహరించిన పద్యాలు ఇటు సాహిత్యంగా కాని అటు చరిత్రగా కాని నిలవవు అని నా అభిప్రాయం.

    “మన పద్యాల్లో అవి తప్పించి వేరే అంశాలుండడం దుర్లభం అని రచయితా అభిప్రాయపడ్డారు”.
    ఈ వాక్యం నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. ప్రాచీన పద్యసాహిత్యం నేరుగా సంఘ జీవితాన్నీ, చరిత్రనీ ప్రతిబింబించే డాక్యుమెంటరీ మాదిరి కాదన్నది నిజమే (అలా అయితే ఆ కావ్యాలు ఇంత కాలం నిలచేవా అని నా అనుమానం). కాని అవి బొత్తిగా సంఘాన్ని ప్రతిబింబించవు అన్నది సరికాదు. నన్నయ్య, నన్నెచోడుని కావ్యాలనుంచీ, వేమన పద్యాల దాకా పద్య కవిత్వంలో కనిపించే సాంఘిక/రాజకీయ చరిత్రని పరిశోధకులు విశ్లేషించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు. క్రీడాభిరామం లాంటి ప్రబంధాలలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తే, ఇతర కావ్యాలలో అంతర్గతంగా ఉంటుంది. తెలుగులో ప్రచారంలో ఉన్న చాటుకవిత్వం కూడా సాంఘిక విషయాలని అంతో ఇంతో ప్రతిబింబించేదే.
    ఈమాటలో పరుచూరిగారు చాలాకాలం కిందట రాసిన యీ వ్యాసం గుర్తుకువచ్చింది:

    http://www.eemaata.com/em/issues/200409/148.html

  6. కొడవళ్ళ హనుమంతరావు

    సురవరం ప్రతాపరెడ్డి చాలా వెనకటి కాలపు ఆంధ్రుల సాంఘిక చరిత్ర నిర్మాణానికి సాహిత్యం మీద ఆధారపడ్డారంటే అర్థం చేసుకోగలను కాని, ఇరవయ్యో శతాబ్దపు సంఘ చరిత్ర కోసం సాహిత్యాన్ని ప్రధానంగా ఆశ్రయించాల్సిన అవసరముందా? సంఘ జీవితం పద్య సాహిత్యంలో ఎలా ప్రతిఫలించిందో తెలుసుకోడానికీ, బహుశా ఆవిధంగా పద్యాలు రాయాలనుకునే వాళ్ళకీ ఈ పుస్తకం కొంత ఉపయోగపడుతుంది. నేనీ పుస్తకాన్ని చదివినప్పుడు, నవీన కాలపు అలవాట్లని పద్యాల్లో అలవోకగా చెప్పడం చూసి ఆశ్చర్యపోయాను. తెనాలిలో భార్య పొందుకోరే భర్త కుండాల్సినవాటిని మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి గారిలా వర్ణించారు:

    “కనులన్ జూడదు భార్యయేనియును నీకాలస్థితింబట్టి జ
    ర్మను తైలమ్ము, జపాను సబ్బమెరికా క్రాపున్‌, వియన్నా సులో
    చనముల్‌, స్వీడను చేతి బెత్తమును, స్విట్జర్లెండు రిష్త్వాచి, ఫా
    రెను డ్రెస్‌, ఫ్రెంచి కటింగు మీసమును, పారిస్ ఫ్యాషనే లేనిచో!”

    ఇంతకీ ఈ పద్యాలన్నిట్లో జాషువావి తప్ప మరేవన్నా కవితాపరంగా నిలుస్తాయా?

    భూషణ్ గారు చెప్పిన అందరూ చదివి తీరాల్సిన పుస్తకం, “ఈనాడు భాషా స్వరూపం,” తర్వాత మరికొంత కలుపుకొని వేరే రూపంలో [1] వెలువడింది. దీనిని, తెలుగు మాతృభాషే అయినా రచనానుభవం లేని విద్యార్థులకి ఉపయోగపడుతుందని బూదరాజు ఆశించారు.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “తెలుగు భాషా స్వరూపం (పదబంధ కోశంతో సహా),” బూదరాజు రాధాకృష్ణ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2001.

  7. మాలతి

    @ పూర్ణిమ గారూ, అద్ఫుతమయిన వ్యాసం. ఈమధ్యకాలంలో నేను వ్యాసం ఆద్యంతం ఆపకుండా చదవలేదు. అలా చదివించిన ఘనత మీవ్యాసనిదే. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.

    మాలతి

  8. తమ్మినేని యదుకుల భూషణ్

    చక్కని పుస్తకానికి మరింత చక్కని పరిచయం. తెలుగులో కండగల వచనం రాయదలచుకొన్న వారు
    గిడుగు రామమూర్తి సంపూర్ణ సాహిత్యం చదవాలి. ఉజ్వలమైన వ్యక్తిత్వం (శాస్త్ర చింతన, మహాకరుణ అందులో
    విడదీయరాని భాగం) అడుగడుగునా కనిపిస్తుంది గిడుగు వచనంలో.నిఘంటుకారుని నిర్మమత కనిపిస్తుంది
    బూదరాజు వచనంలో ;పద ప్రయోగాన్ని తేటపరచడం ,వివరించడం నిఘంటుకారుని ప్రధాన లక్షణాలు .
    తెలుగులో రాయదలుచుకున్న వారు విద్వత్త గలవారి రచనలు పలుమార్లు చదివి బలమైన వాక్య నిర్మాణం
    ఉద్వేగ ప్రస్తారాన్ని, అలోచనా శక్తిని వ్యక్తం చేయడానికి ఏ రకంగా దోహదం చేయగలదో ఆకళించుకోవాలి.చక్కని
    వచనం రాయడం వచ్చాకే కథలు కవిత్వాలు ,అనువాదాలు ;నాకు చూడగా (పేరుపొందిన /పొందని) తెలుగు కవుల్లో
    చాలా మందికి సరైన వాక్యం రాయడం చేతకాదు. తమాషా ఏమంటే అలా రాయడమే కవిత్వం అనుకొంటున్నారు.
    దీనికి కారణం కవులుగా రూపొందే సమయంలో వారు సరైన పరిశ్రమ చేయలేదంతే .చక్కని వ్యాసం రాయడానికి
    విషయ పుష్టి వివరణా శక్తి అవసరమవుతాయి.పూర్ణిమ ఆ దారిలో పయనిస్తుంది అనడానికి నిదర్శనం ఈ వ్యాసం.
    ప్రతి ఒక్కరు ఆలసించకుండా చదివి తీరవలసిన పుస్తకం : ఈనాడు భాషా స్వరూపం
    (బూదరాజు రచన ;ఈనాడు వారు వేశారు ;1987 లో దాని ధర పాతిక రూపాయలు )
    చివరిగా సుబ్బన్న శతావధాని గారి అవధాన విద్య చదివితే మీకు గల సందేహాలు పటాపంచలవుతాయి.

Leave a Reply