‘నడుస్తున్న చరిత్ర’ – “అమ్మనుడి”

వ్యాసం రాసినవారు: సామల రమేశ్ బాబు
***********
మొన్నటిదాకా ‘నడుస్తున్న చరిత్ర’
అదే ఇప్పుడు “అమ్మనుడి”

1993 డిసెంబరులో ఒక చిన్న పత్రికగా సామాజిక, రాజకీయాంశాలతో మొదలైన ‘నడుస్తున్న చరిత్ర’ క్రమంగా ఎదిగి తెలుగు భాషోద్యమ పత్రికగా రూపుదిద్దుకొంది. తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్మాణంలోను, ఎదుగుదలలోను వెన్నుదన్నుగా నిలిచి ఒక భాషోద్యమ పత్రికగా పేరు గడించింది.

నడుస్తున్న చరిత్ర ప్రోత్సాహంతో ఎందరో రచయితలు తయారైనారు. కాలవాహిని అలలవాలున జారిపోయేదిగా కాక, ఏటికెదురీది నిలిచి గెలిచిన పత్రికగా నడుస్తున్నచరిత్ర పేరు గడించింది. ఎక్కడ ఎవరు ఏ సభలో మాట్లాడినా, పత్రిక పేరు ప్రస్తావించక తప్పని విధంగా ఉద్యమంతో పత్రిక మమేకం అయింది. ప్రభుత్వాన్నయినా, పెద్దలనయినా తెలుగు జనశ్రేయస్సు కోసం నిలదీసిన చరిత్ర, తెలుగుకు ప్రాచీనభాష హోదా కోసం జరిగిన పోరాటానికి దారిచూపి అండగా నిలిచిన చరిత్ర ‘నడుస్తున్న చరిత్ర’దే. తెలుగుపై ఇతర భాషల మితిమించిన ఆధిపత్యాన్ని ప్రశ్నించి తెలుగును కాపాడుకొని పెంపుదల చేసుకోవడానికి ప్రయోజనకరమైన రచనలను ప్రోత్సహించి ప్రచురించిన ఘనత ‘నడుస్తున్న చరిత్ర’దే.

అటువంటి పత్రికకు ఆర్థిక వనరులు అడుగంటడంతో 2013 అక్టోబరు సంచికతో ప్రచురణను ఆపివేయ వలసివచ్చింది. నా అనారోగ్యంతో ఒక ఏడాదికి పైగా విశ్రాంతిగా గడుపవలసి వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యాన్ని పుంజుకొని, మళ్ళీ నా భాషోద్యమ యాత్రను కొనసాగిస్తున్నాను.

ఇప్పుడు నడుస్తున్న చరిత్ర స్థానంలో ‘అమ్మనుడి’ పేర పత్రికను మీ ముందుకు తెస్తున్నాను. నడుస్తున్నచరిత్ర పత్రిక ఏ ఆశయాలకు నిలబడిందో, దానికి తగ్గ పేరునే ఎంచుకోవాలనిపించింది. సహచరులు, చదువరుల తలంపులను కూడ తెలుసుకొని, ‘అమ్మనుడి’ పేరును నమోదు చేయించి, ఇప్పుడు తొలిసంచికను మీ ముందుకు తెస్తున్నాను.

‘అమ్మనుడి’ పత్రికకు నడుస్తున్న చరిత్ర చదువరులే తొలి చదువరులు, ప్రోత్సాహకులు. స్పష్టమైన లక్ష్యాలతో ఇప్పుడు పత్రిక మీముందుకు వచ్చింది. దీని నిర్వహణ కోసం ‘తెలుగుజాతి’ ట్రస్టును మిత్రులతో కలిసి స్థాపించాను. ఆ ట్రస్టు తరఫున ఈ పత్రిక వెలువడుతున్నది.

ఈ పత్రిక ముఖచిత్రం తెలుగుజాతి సాంస్కృతిక చిత్రపటం. 18 కోట్లకు పైబడిన తెలుగు ప్రజలు కేవలం ఆంధ్ర తెలంగాణాల్లోనే గాక మరి అనేక రాష్ట్రాల్లో వేలాది ఏళ్ళుగా పాదుకొని వున్నారనే వాస్తవాన్ని నడుస్తున్నచరిత్ర వెలుగులోకి తెచ్చిన సంగతి మీకు తెలిసిందే! ఇప్పుడీ సంగతి అందరి గుర్తింపుకు వచ్చింది. ‘అమ్మనుడి’ ఈ కృషిని కొనసాగిస్తుంది. ఇందుకు మీ అందరి ప్రోత్సాహం, సహకారం కొనసాగించాలని కోరుతున్నాను. ‘అమ్మనుడి’కి మీ ఆశీస్సులు కోరుతున్నాను.

మీ
సామల రమేష్ బాబు
సంపాదకుడు

You Might Also Like

2 Comments

  1. Raghavendra

    గొప్ప ప్రయత్నం. విదేశాల్లోని పాఠకులు పత్రికకు చందా ఎలా,ఎక్కడికి పంపాలోచెప్పగలరా?

    1. రహ్మానుద్దీన్ షేక్

      ఈ పత్రిక ఆర్ఖైవ్.ఆర్గ్ వేదికగా చదవవచ్చు.

Leave a Reply