చిన్న పత్రిక చేస్తున్న పెద్ద పని…!

రాసిన వారు: పెరుగు రామకృష్ణ
*****************
06-12-2009 పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ లో జాతీయ కవితోత్సవం లో ఆంధ్రప్ర్రదేశ్ నుండి ఆహ్వానిత కవిగా ,అతిథిగా పాల్గొనడం జరిగింది. ఉపత్యక అనే బెంగాలి చిన్న దినపత్రిక ఈ కార్యక్రమం నిర్వహించింది. ఉదయం పది గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సాహిత్య సమ్మేళనం హాయిగా, హుషారుగా సాగింది..ఈ సందర్భంగా ఇదే వేదిక నుండి పది బెంగాలి పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి..ఇందులో మా గ్రామీణ కథలు 4 వ సంకలనం నన్ను విశేషంగా ఆకర్షించింది..మిడ్నాపూర్ జిల్లాలోని గ్రామాలకు సంబందించిన కథలు గత నాలుగేళ్ళుగా సంకలనపరిచి ప్రతి ఏట జరిగే కవితోత్సవం లో ఆవిష్కరిస్తున్నారట… దేశ,విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాలు ఈ సంకలనాల్ని ఆసక్తిగా కొని అధ్యయనం చేస్తున్నాయట..

bengaliగత 15 ఏళ్లుగా ఈ ఉపత్యక దినపత్రిక నడుపుతున్న సంపాదకుడు తపోష్ మైతి మంచి అభ్యుదయ భావాలు కల వ్యక్తి..తను పుట్టిన గడ్డ మీద మమకారం విపరీతంగా వున్నవాడు.. పొట్ట కోసం పత్రిక నడుపుకోవడమే కాకుండా తన జన్మ భూమి కి సంబందించి ఒక అద్భుతమైన కార్యం చేయాలన్న తపన కలవాడు. ఒక సాయంత్రం మిత్రులతో కలసి కబుర్లాడేటప్పుడు తాము పుట్టిన గ్రామాల గురించి కథలు తయారుచేస్తే బాగుంటుందని ఆలోచన చేసారు..గ్రామాల చరిత్ర ,సాంస్కృతిక నేపథ్యం,అక్కడి స్మారక భవనాలు,గ్రామ దేవతల గుడి గురించి,జానపద సంపద ,గుర్తుంచుకోవాల్సిన ప్రముఖులు,ఇంకా ప్రత్యేకతలు , ఎక్కువ కాలం జీవించిన వారు,స్వాతంత్ర సమర యోధులు ఇలా అనేక అంశాలతో ఆధునికత జోడించిఈతరం వారు ఈ కథలు చదివాక ఇంత మంచి గ్రామం లో జన్మించినందుకు గర్వపడేలా కథలు రూపొందాలని అనుకొని ఈ ఆలోచన అమలు చేస్తూ తమ దినపత్రిక లో ఒక ప్రకటన ఇచ్చారు..స్పందన అనూహ్యంగా వచ్చింది.

గ్రామ సర్పంచ్ లు ,గ్రామ ఉపాధ్యాయులు,అభ్యుదయ భావాలు గల యువకులు , రిసర్చ్ విద్యార్ధులు,పాత్రికేయులు,ఇలా ఎన్నో వర్గాల వారు తమ గ్రామ విశేషాల్ని ఆసక్తి గల కథలుగా మలిచారు..ఇవన్నీ పరిశీలించాక గ్రామాలకు సంబంధించిన ముడిసరుకు దొరికినట్లు సంపాదక వర్గం అనుకొని, వాటిని సవరించి మొదటి సంకలనం 85 గ్రామాల కథలతో 2006 లో విడుదలచేసింది..ఆ తర్వాత దీనికి కొన్ని మార్గదర్శకాలని నిర్ణయించి గ్రామ పేరు వెనుక కథ, భౌగోళిక విషయాలు, జనాభా, తెగల వారి గణాంకాలు, పూర్వ చరిత్ర, ప్రాధాన్యత అంశాలు, గ్రామ దేవతలు, గ్రామ సంబరాలు, గ్రామ ప్రత్యేక సంప్రదాయాలు, జానపద సంపద, కళలు, కళాకారులు, ఆధునిక అభివృద్ధి, ఇటీవల జరిగిన నమోదు కావాల్సిన అంశాలు, కలిపి కథలు తయారు చేయాలనీ మళ్ళీ ప్రకటన ఇచ్చాక ఇక తిరుగులేని విధంగా కథలు రూపొందాయి. ఇక సంపాదకులు వెనక్కి చూడకుండా 2007 లో 74 గ్రామాల కథలు, 2008 లో 90 గ్రామాల కథలు, 2009 లో మళ్ళీ 90 గ్రామాల కథలు, ప్రచురించి నాలుగవ సంకలనం వెలువరించారు..

ఈ సంకలనాలను వెలువరించడం ద్వారా ప్రపంచీకరణ నేపథ్యంలో, సెజ్ లు ఏర్పాటు, భూ ఆక్రమణలు, తదితర అంశాలపై గ్రామవాసుల భాద్యత, మారుతున్న మానవ సంబంధాలు, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక పర్యావరణ పరిస్థితులు నమోదు చేయగలుగుతున్నట్లు సంపాదకులు భావించారు. ఈ కథలు నగరాలలోని మేధావుల ప్రశంసలు అందుకోవడం మరో విశేషం. ప్రభుత్వం, లేదా ఇతర సంస్థలు చేయవలసిన పని – ఎలాంటి వనరులు లేకుండా ఒక చిన్న దినపత్రిక బృందం శ్రద్ధతో చేయడం ఎంతో అభినంద నీయం.. ప్రతి ఏట 1000 కాపీలు ముద్రించి రచయితలకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేక ఒక కాపీ పుస్తకం ఇస్తున్నారు.. పలు విశ్వవిద్యాలయాలు ఈ పనిని మెచ్చుకున్నా ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని, ఇప్పటివరకు రెండున్నర లక్షలు తమ స్వంత ఖర్చులతోనే ప్రచురిస్తున్నట్టు ఉపత్యక సంపాదకులు తపోష్ మైతి చెప్పారు..త్వరలో ఈ సంకలనాలు అంగ్లంలో అనువదించి మా గ్రామాల గురించిన విశేషాలు విశ్వవ్యాప్తం చేస్తామని ధీమా వ్యక్తపరిచారు.. వినూత్నమైన పనిని అంకిత భావంతో చేస్తున్న వీరికి జేజేలు…!

You Might Also Like

4 Comments

  1. perugu

    ధన్యవాదాలు భూషణ్ గారు
    మీకు బెంగాలి వచినందుకు సంతోషం.తప్పక చిరునామా
    పంపుతాను మీ మెయిల్ కు.

  2. తమ్మినేని యదుకుల భూషణ్.

    చక్కని సమాచారం అందించారు.మేదినీ పూరేర్ గ్రామేర్ కథ
    (మేదినీపూర్ గ్రామకథ )అని ఉన్నది పుస్తకం అట్ట మీద.
    బెంగాలీ రాత లో ఉన్న చిరునామా స్కాన్ చేసి పంపండి.
    నేను చదివి పుస్తకం వారికి ఇవ్వగలను.

  3. perugu

    ఈ పత్రిక కి వెబ్సైటు లేదు..
    ఇంగ్లీష్ లో చేసేటప్పటికి బహుసా వస్తుందేమో
    వారి చిరునామా బెంగాల్లో ముద్రించడం వల్ల ఇవ్వలేకపోయాను
    పెరుగు

  4. సౌమ్య

    Nice article! Thanks Ramakrishna garu!
    అన్నట్లు, ఈ పత్రిక్కి వెబ్సైటు వంటివేమైనా ఉన్నాయా?
    వీరిని ఎలా సంప్రదించాలి? ఇవి ఆంగ్లంలో విడుదలైతే, వీరి గురించి దేశంలో మిగితావారికి తెలిసి, ఈ స్పూర్తి తో ఇతర భాషల్లో కూడా ఇలాంటి కృషి జరిగితే బాగుండు.

Leave a Reply