తెలుగువారి వెయ్యేళ్ళ జీవన చిత్రం – ఆంధ్రుల సాంఘిక చరిత్ర (వికీసోర్సు ప్రదర్శిత గ్రంథాలు)

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్
*********************

“ఆ (విజయనగర) కాలమందు స్త్రీలుకూడా మంచి జెట్టీలుగా సిద్దమై కుస్తీలు జేసిరి. క్రీ.శ. 1446 నాటి యొక శాసనములో హరియక్క అను నామె తన తండ్రిని కుస్తీలో చంపిన జెట్టీలతో కుస్తీచేసి వారిని చంపి పగదీర్చుకొనెను.” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

“మన దేశములో పొగాకును ప్రవేశ పెట్టి దేశమును నాశనం చేసిన మహనీయులు పోర్చుగీసువారు. అది క్రీ.శ. 1600-1650 ప్రాంతములో ప్రవేశ పెట్టబడెను.” (క్రీ.శ. 1600 నుండి 1757 వరకు)
*****

“మన పూర్వులకున్న కళాదృష్టి మనలో కానరాదు. చిలుకనో పువ్వునో చెక్కని చెంబు బోడిచెంబే! అంచులేని యుడుపుల ధరించుట అమంగళమని తలంచిరి. ఇండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయిస్తూవుండిరి. ద్వారముల చౌకట్లపై చక్కని జంత్రపుపని యుండెడిది. బట్టలపై అద్దకముతో బొమ్మలను వేయుచుండిరి. ధనికులు పటములను వ్రాయించెడివారు. కాకతీయుల కాలములో చిత్తరువులు జనసామాన్యమందును ఆదరణీయముగా నుండినట్లు కానవచ్చును. ఇండ్లముంగిళ్ళలో మ్రుగ్గులతో చాల చక్కని చిత్రములను పడుచులు తీర్చు చుండెడివారు….
ఏవిధమగు చిత్తరువులు వ్రాయుచుండిరో అవియు తెలియవచ్చినవి. దారుకావనములోని శివుడు, గోపికాకృష్ణులు, అహల్యా సంక్రందనులు, తారా చంద్రులు, మేనకా విశ్వామిత్రులు మొదలైనవి వ్రాయిస్తూ వుండిరి. చిత్తరువులను ‘మయ్యెర’తో వ్రాసిరి. (మయ్యెర అను వెంట్రుకలతో చేసిన బ్రష్షు అయి యుండును – మైర్ అన అరవములో వెంట్రుక అని యర్థము). ఓరుగల్లున ‘చిత్తరువులు వ్రాసే యిండ్లు 1500’ అని ఏకామ్రనాథుడు వ్రాసెను. భోగమువారు తమకు తగిన పటాలను వ్రాయించుకొనిన ఇతరులును వ్రాయించుకొన్న వారు కారు. ప్రజలు తమతమ అభిలాషల కొలది వ్రాయించుకొను చుండిరి. వీర పూజ కోరువారు వీరుల చిత్రాలు వ్రాయించిరి.” (కాకతీయ యుగము)
*****

“పల్లవులు, కాకతీయులు దేశమందలి అడవులను కొట్టించి, గ్రామాలను ప్రతిష్ఠించి, వ్యవసాయకులకు భూము లిచ్చియుండిరి. దీనినిబట్టి క్రీస్తుశకము 1000 కి పూర్వము కర్నూలు, బళ్ళారి మున్నగు మండలాలు అరణ్యప్రాంతాలుగా నుండెనని తెలియును. ప్రతాపరుద్రుడు స్వయముగా కర్నూలు సీమకు వెళ్ళి అడవుల గొట్టించి ఇప్పటికి కర్నూలు పట్టణమునకు 10, 15 మైళ్ళ ఆవరణములోని పల్లెల పెక్కింటిని నిర్మాణము చేసినట్లు ఆకాలపు శాసనాదుల వలన తెలియవచ్చెడివి. తెలంగాణములో నూరేండ్ల క్రిందటకూడ అడవులనుకొట్టి రైతుల ప్రతిష్ఠించుతూ వచ్చిరనిన ఆకాలపుమాట చెప్పనవసరము లేదు.”
*****

“బెజవాడ కనకదుర్గమ్మను గురించి నేలటూరి వేంకటరమణయ్యగారిట్లు (S-I-Temple లో) వ్రాసెను. “ఒకగ్రామమం దేడ్గురు విప్రసోదరులుండిరి. వారికి కనకమ్మయను చెల్లె లుండెను. ఆమె శీలమును వారు సందేహింపగా నామె బావిలోపడి చనిపోయి జనుల బాధించు శక్తికాగా, జనులామెకు గుడికట్టి పూజింప దొడగిరి”. నెల్లూరిలోని దర్శి తాలూకాలోని లింగమ్మ అను బీదరాలొక ధనికునింటి సేవకురాలుగా నుండెననియు, ధనికుల సొత్తు లపహృత మగుడు ఆమెపై నిందవోపగా నామె బావిలో పడి చచ్చి దేవరయ్యెననియు, నెల్లూరు జిల్లాలోని పొదిలమ్మయు, సందేహింపబడి చంపబడిన యొక స్త్రీశక్తిగా మారినట్టి దనియు, నూరేండ్ల క్రిందటగూడ కోటయ్య అను లింగబలిజి ఒక గొల్ల మగనాలినిగూడి ఆమె భర్తచే వధింపబడి కోటప్పకొండ దేవరగా ప్రసిద్ధు డయ్యె ననియు శ్రీ నేలటూరివారు వ్రాసినారు.” (రెడ్డిరాజుల కాలము)
*****

“నేటికిని తెనుగు అక్షరాలను “ఓనమాలు” అని దేశమంతటను అందురు. శైవుల ప్రాబల్యమే తెనుగుదేశాని కుండినదనుట కీ ఓనమాలే సాక్ష్యమిస్తున్నవి. “ఓం నమ: శివాయ” అను షడక్షరీ శివమంత్రముతో విద్య ప్రారంభమగుచూ వచ్చినది. ఉత్తర హిందూస్థానములోను, మళయాళములోను “శ్రీ గణేశాయ నమ:” అని అక్షరాభ్యాసము చేతురు. కాని మన తెనుగు దేశమందును, కర్ణాట మందును ఈం నమశ్శివాయయే కాక ‘సిద్ధం నమ:’ అనియు వ్రాయింతురు. మొదట జైనమత వ్యాప్తియై జైనులే విద్యాబోధకు లగుటచేత వారు “ఓం నమ: సిద్ధేభ్య:” అని అక్షరాభ్యాసము చేయిస్తూ వుండిరేమో !” (కాకతీయ యుగము)
*****

“ఆ కాలమందు గడియకాలములో నీటిలో మునుగునట్లుగా నొక చిల్లిగల గిన్నెను నీటిపై నుంచి అది మునిగిన వెంటనే లెక్కప్రకారము గంట కొట్టుతూ ఉండిరి.” (కాకతీయ యుగము)
*****

“రాజులు కావ్యనాటకాలను, సాహిత్యశాస్త్రమును, సంగీతనాట్యశాస్త్రములను ఎక్కువగా నభ్యసించి రనుటకు రెడ్డిరాజులు వ్రాసిన శాస్త్రాలు, చేసిన వ్యాఖ్యలే ప్రథమసాక్ష్యములు. అవికాక వారికి అశ్వశిక్షణము, అశ్వశాస్త్రము, గజ శాస్త్రము, రాజనీతి, యుద్ధతంత్రము ముఖ్యములైన విద్యలు, రాజనీతిని గూర్చిన శాస్త్రములు సంస్కృతములో నెక్కువగా నుండెను. తెనుగులో మడికి సింగన సకలనీతిసమ్మతము వ్రాసెను. అందతడు పలువురి తెనుగు నీతికవుల నుదహరించెను. ఆ కవులలో పెక్కుకవుల గ్రంథాలు మనకు లభించుటలేదు. సంగీత నాట్యశాస్త్రములలో కొన్నిరచనలు రాజులే చేసిరి. కుమారగిరి వసంతరాజీయ రచనల కుదాహరణముగా అతని యుంపుడు కత్తెయగు లకుమాదేవి నాట్యము చేస్తూవుండెడిది.” (రెడ్డిరాజుల కాలము)
*****

“రెడ్డిరాజుల కుండిన బ్రాహ్మణభక్తి భారతదేశ చరిత్రలో వేరుచోట కాన వచ్చునో లేదో అత్యంత సంశయమే. ఓరుగంటి చక్రవర్తు లిచ్చిన దానాలు తురకవిజేతల చేతులలోనికి పోయెను. రెడ్డిరాజులు తాము గెలిచిన ప్రాంతములందంతటను పూర్వరాజులు దానము లన్నింటిని స్థిరపరిచిరి. పైగా తామున్నూ అసంఖ్యాకముగా భూములను, అగ్రహారములను బ్రాహ్మణులకు దానము చేసిరి. వీరి దానములచే ఆకర్షితులై తూర్పుతీర మందలి కృష్ణా గోదావరీ మండలములలో బ్రాహ్మణులు కొల్లలుగా నిండుకొనిరని పలువురు చరిత్రకారు లభిప్రాయ పడినారు.” (రెడ్డిరాజుల కాలము)
*****

“ఆంధ్రులు సముద్ర వ్యాపారము విశేషముగా చేసినప్పుడు తత్సంబంధమగు సాంకేతికపదములు వాఙ్మయములో నుండవలసియుండెను. కాని యట్టివి విశేషముగా గ్రంథస్థము కాలేదు. అయినట్టివి కొన్ని కూడా జనుల కర్థము కానివై పోయెను.” (రెడ్డిరాజుల కాలము)
*****

“తెలంగాణాలో నిర్మల కత్తులు జగద్విఖ్యాతి కాంచియుండెను. అచ్చటి కత్తులు అచ్చటి యుక్కు డెమాస్కస్ నగరాని కెగుమతి యగుచుండెను. మెరుగు టద్దాలుకూడా సిద్ధమవుతూ వుండెను. వాటిని శుభ్రము చేయుటకేమో మెరుగురాతి పొడిని వాడినట్లు కానవస్తున్నది.” (రెడ్డిరాజుల కాలము)
*****

“చతురంగపు ఆట చక్రవర్తులనుండి సాధారణజనులవరకు ఆసక్తిని కలిగించినట్టిది. దీనిని మోసిన్ పుట్టకముందే హిందువులు కనిపెట్టిరని ప్రతీతి నౌషీర్వాన్ అను ప్రసిద్ధ పారసీకచక్రవర్తి యీ యాట గొప్పదనమును విని హిందూస్థానమునుండి అదేపనిగా చతురంగపు పలకలను, కాయలను తెప్పించుకొని ఆ విద్యను నేర్పు గురువును పిలిపించుకొనెను.” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

“ఈ కాలము(రెడ్డిరాజుల కాలము)లో కళాపోషణము ఉచ్చస్థాయి నందెను. తుది రెడ్డిరాజులు వసంతరాజ బిరుదాంచితులగుట ఈ కళాపోషణమున కొక ప్రబలతర నిదర్శనము. కవిసార్వభౌముడును, ఆసేతువింధ్యాది పర్యంతము తన కీడుజోడు లే డనిపించుకొన్నవాడును, బహుశాస్త్ర పురాణ పారంగతుడును, కవితలో నూతన యుగస్థాపకుడునునగు శ్రీనాథుడు విద్యాధికారియట! అఖిలాంధ్ర వాఙ్మయమునకు ప్రామాణికాచార్యత్రయములోనివాడగు ప్రబంధ పరమేశ్వరుడు ముఖ్యాస్థానకవి యట ! శివలీలా విలాసకర్తయగు నిశ్శంక కొమ్మన రెడ్డి రాజుల కీర్తనల చేసినవాడట ! సహస్ర విధాననవాభినయ కళాశ్రీశోభితలకుమాదేవి రాజసన్నిధిలో నిత్యనూత్నముగా నటంచినదట ! బాలసరస్వత్యాది మహాపండితు లాస్థాన దివ్యజ్యోతులట ! స్వయముగా రెడ్డి, వెలమప్రభులు కవులై, వ్యాఖ్యాతలై, సాహిత్యాచార్యులై సర్వజ్ఞులై సర్వజ్ఞ చక్రవర్తులైన దిగంత విశ్రాంత యశోవిశాలురట ! కర్పూర వసంతోత్సవములకు సుగంధ భాండాగారాధ్యక్షు లుండిరట ! ఇక కళాభివృద్ధికి కొదువయుండునా ?” (రెడ్డిరాజుల కాలము)
*****

“గారడీ అను విద్యను ఇంద్రజాల మనిరి. ఇంగ్లండులోని ఇంగ్లీషు పత్రికలలో ఇంచుమించు 40 ఏండ్లనుండి యొక చర్చ కొన్నిమారులు చేసినారు. ఇంచుమించు 150 ఏండ్ల క్రిందట ఒక ఇంగ్లీషు వాడొక ఇంద్రజాల ప్రదర్శనమును హిందూస్థానములో చూచి దాన్ని చాలా మెచ్చుకొని అనాడే పత్రికలో వ్రాసెను. ఆ ఇంద్రజాలమ లో ఒకడు త్రాటి నొకదానిని పైకి నిలువుగా విసరి గాలిలోనిలబెట్టి దానిపై కెగబ్రాకి మాయము కాగా, వాని యంగములు ఖండ ఖండములుగా క్రిందబడె ననియు, మరి కొంతసేపటికి వాడు త్రాటినుండి గబ గబ దిగివచ్చెననియు వ్రాసెను. అది యబద్ద మనియు, అట్టి విద్యను ప్రదర్శించు వానికి ఇంగ్లండుకు రానుపోను వ్యయమును భరించి వేలకొలదిగా బహుమానము లిత్తుమనియు కొందరు ప్రకటించిరి. కాని కొరవి గోపరాజు ఒక కథలో ఇదేవిధమగు ఇంద్రజాలమును వర్ణించినాడు.
ఒకడు తనభార్య అనుదానిని వెంటబెట్టుకొని రాజసన్నిధిలో ఆమెను రక్షణార్థమై విడిచి, తాను దేవసహాయార్థమై యుద్ధముచేయ వెళ్ళుతున్నాని చెప్పి ఒక త్రాటిని పైకి నిలువుగా విసరి, దాన్ని నిలబెట్టి, దానిపై కెగబ్రాకి మాయమయైను. కొంతవడికి వాని కాలుసేతులు, తల, మొండెము తుంటలై క్రిందబడెను. వాడుంకువగా నుంచిపోయిన వానిభార్య రాజును వేడి సెలవు పొంది సహగమనము చేసెను.
వెంటనే త్రాడు పైకి ప్రాకిపోయిన భటుడు పైనుండి దిగివచ్చి తనభార్యను పంపుమనెను. రాజు విచారగ్రస్తుడై ఆమె సహగమనము చేసెనని చెప్పెను.” (రెడ్డిరాజుల కాలము)
*****

“హిందూ సైనికులు ముసల్మానులవంటి సైనికభటులు కారు. ముసల్మాను సైన్యములో అరబ్బులు, ఖురాసానీ తురకలు, పారసీలు, అబిషీలు (అబిసీనియనులు), పఠానులు, బిల్లులు, మున్నగు అటవికులు ఉండిరి. తమ సైనికులు తురక భటులకు సరిరారని విజయనగర చక్రవర్తులు గుర్తించి, తురకలను తమ సైన్యములో భర్తీచేసి, వారికొక “తురకపేట”ను ప్రత్యేకించి వారికి మసీదులు కట్టించి సకల సదుపాయములు చేసిరి. అట్లు చేసినను వారికి హిందూ రాజులపై విశ్వాస ముండినటుల కానరాదు. వారు తమ ఏలికలకు సలాములు కూడ చేయుటకు ఇష్టపడనందున ఏదోవిధముగా తమ గౌరవము నిలుపుకొనుటకు తన గద్దెపై ఖురాను నుంచుకొని దానికిచేసిన తురక సలాములను తానును పంచుకొనెను.” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

“ద్వంద్వయుద్ధము కేవలము విజయనగర రాజ్యమందే నెగడెను. ద్వంద్వయుద్ధము చేయువారు మంత్రి లేక రాజు సెలవు పొందవలసి యుండెను. గెలిచినవానికి ఓడినవాని ఆస్తి యిప్పించెడివారు.” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

“జనులు మాడలను బిందెలలో నింపి ఇండ్లలో, దొడ్లలో, చేలలో గుర్తుగా దాచుకొంటూవుండిరి. తరాలుగా దాచిన జాడలు వృద్ధులు తమవారికి తెలుపకముందే చచ్చుటయు, దానికై వాని సంతతి వారు వెదకుటయు సంభవించెడిది. ధనాంజనము వేసి ధన మెక్కడున్నదో కనిపెట్టే మంత్ర తంత్రవేత్తలు బయలుదేరిరి. పలుమారు దాచిన ద్రవ్యము పరులకు హఠాత్తుగా దొరుకుతూ వుండెను. ద్రవ్యమును భూమిలో పూడ్చి దాచుకొను నాచారము నేటికికూడ మన పల్లెలలోని కొందరిలో కానవస్తున్నది.” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

“దేశమందు బాటల నిర్మాణము చాలా తక్కువ. అందుచేత బండ్లపై వ్యాపారము చేయుట కనుకూలముగా లేకుండెను. వ్యాపారస్థులు ఎద్దులపై కూలీల కావళ్ళపై, గుర్రపు తట్టువులపై, గాడిదలపై కంచర గాడిదలపై సరుకులను తీసికొనిపోతుండిరి. ఈవిషయమును మన సారస్వతమందు పలుతావులలో తెలిపినదేకాక ఆగంతుక వైదేశికులగు పీస్, బార్బోసా పభృతులు తాము చూచినట్లు తెలిపినారు. బాటలు లేక అడవులెక్కువగా నుండినప్పుడు దొంగలు కూడా ఎక్కువగానే యుండిరి…. దొంగలభయానికి వ్యాపారులు గుంపులుగాపోయిరి.” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

“కొల్లూరు పట్టణములో ఒకదేవుడు వెలిసెను. ప్రతి జనుడు ధాన్యమును తన మూత్రములో తడిపి ఆ దేవతా విగ్రహముపై వేసిన అవన్నీ రత్నాలై రవ్వ లవుచుండెనట. అందరును ఆ క్రియను చేయుచు మేడలు కట్టిరి. ఆ పట్టణములో ఒక పేద బాప డుండెను. అందరివలె నీవును చేసి సుఖపడరాదా అని అతనిభార్య తొందరపెట్టుచుండెను. ఏమైననుకాని నేనా తుచ్చపుపని చేసి అపచారము చేయనని అ శిష్టు డనుచుండెను. ఒకనాటి మద్యరాత్రి మరొక వృద్ధ బ్రాహ్మణు డా పేదబాపని కుటుంబ సహితముగా పట్టణము బయటకు పిలుచుకొని పోయి అదిగో కొల్లూరుపట్టణ వైభవము చూడు అని ధగద్ధగితముగా మండుచుండే పట్టణమును వారికి చూపి మాయమయ్యెనట. అది కొల్లూరు పట్టణం వలె వెలిగినది అనేకథ. ఆ కథ నిజముగా ఈ వజ్రాలగనికి సంబంధించినదని పైననే కనబడుచున్నది.” (క్రీ.శ. 1600 నుండి 1757 వరకు)
*****

“ఆ కాలమందు కోర్టులు లేకుండెను. ప్రతిగ్రామమందు గ్రామపెద్దలు ప్రతిఫలాపేక్ష లేక తగవులు తీర్పుచేసిరి. విజ్ఞానేశ్వరీయమే ముఖ్యాధార భూతశాస్త్రము. బ్రాహ్మణులే సభాసదులు. వారి తీర్పులపై రాజువద్ద పునర్విమర్శ(అపీలు) కావచ్చును. సాధారణముగా వారి తీర్పునకు తిరుగు లేకుండెను. ధనోద్బవ (సివిల్), హింసోద్బవ (క్రిమినల్) అభియోగములను (కేసులను) వారే విచారించిరి. ముఖ్యమైన నేరములను రాజు స్వయముగా విచారించెనను. ‘సభ’వారిని పిలిచి వారి సహాయముతో తీర్పు చెప్పెడివారు.
“సభ”ను చావడిలోనో, దేవాలయమందో, ఊరిమధ్య నుండు “రచ్చ” కట్టపైననో చేసిరి. అందుచేత వివాదమునకు సభగా కూడుటకును “రచ్చ” యనిరి.” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

“”కృష్ణ” అను పేరుగల విద్వాంసుడు రాయలవారికి సంగీతము నేర్పెను. అతడు రాయలకు వీణావాద్యముకూడా నేర్పినందులకుశిష్యుడు గురువునకు గురుదక్షిణముగా నిలువైన ముత్యాల హారాలను, వజ్రాల హారాలను నిచ్చెనని కర్ణాటభాషలో నారాయణ కవిచే వ్రాయబడిన రాఘవేంద్రవిజయములో తెలిపినారు. సంగీతము శాస్త్రప్రకారము అత్యంతాభివృద్ధి నొందెను. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రాగమునకు ప్రాధాన్యముండెను. వసంతకాలమందు హిందోళరాగము పాడిరి. రాయలకు పోర్చుగీసు రాయభారి తమ దేశపు వాద్యములను కానుక యివ్వగా వారు చాల సంతోషించిరట!” (విజయనగర సామ్రాజ్య కాలము)
*****

పై విశేషాలన్నీ సాహిత్య, చారిత్రకాధారాలను విశ్లేషించి, పదాలను అర్థాలను వింగడించి వెయ్యేళ్ళ తెలుగువారి జీవన చిత్రంగా సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకం నుంచి తీసుకున్నవి. ఆంధ్రుల సాంఘిక చరిత్రలో తెలుగు వారు వెయ్యేళ్ళ కాలంలో ఎలా జీవించారన్న విషయాన్ని వివరించే అపురూపమైన గ్రంథం. “తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయ్ చరిత్రకర్థం” అని సంప్రదాయ చరిత్ర రచన లక్ష్యాలు, పద్ధతులు తప్పుపట్టాడు మహాకవి శ్రీశ్రీ.

అదే కవితలో
చారిత్రక విభాత సంధ్యల/ మానవకథ వికాసమెట్టిది?/ ఏ దేశం ఏ కాలంలో/ సాధించిన దే పరమార్థం?/ ఏ శిల్పం? ఏ సాహిత్యం?/ ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?/ ఏ వెల్గుల కీ ప్రస్థానం?/ ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
అన్న కవితాపాదాలకు రూపమిస్తూ ఒక జాతి జనుల సంఘర్షణకు, అలవాట్లకు, పద్ధతులకు రూపంగా వెలువరించారు సురవరం ప్రతాపరెడ్డి ఈ పుస్తకాన్ని. ఒక సాంఘిక సముదాయంగా తెలుగు జాతి ఏ కష్టనిష్టూరాలు ఎదుర్కొన్నది, ఏ అలవాట్లు చేసుకున్నది, ఏ పద్ధతుల్లో జీవించినది, ఏయే పడికట్లు కలిగివుండేది అన్నవి అన్వేషిస్తూ వెయ్యేళ్ళ తెలుగు వారి జనజీవితానికి అద్దంగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర రూపొందింది.

ప్రామాణికత, ఆసక్తిదాయకమైన అంశాల మేలుకలయిక అయిన ఈ పుస్తకం వెలువడిన తొలిముద్రణకే ఆంధ్ర పండిత లోకంలో ప్రముఖులైన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారి మన్నన పొందింది. తర్వాత ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా నిర్ణీతమైంది, ప్రస్తుతం గ్రూప్ పరీక్షలకు పాఠ్య పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను సురవరం ప్రతాపరెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 20వ శతాబ్ది ముగిసి కొత్త సహస్రాబ్దిలోకి అడుగుపెడుతున్న తరుణంలో 1999లో వెల్చేరు నారాయణరావు, జంపాల చౌదరి రూపొందించిన 20వ శతాబ్ది ఉత్తమ తెలుగు పుస్తకాల జాబితా “ఈ శతాబ్దపు రచనా శతం” సహా అనేక ఉత్తమ పుస్తకాల జాబితాలో చోటుచేసుకుంటూనే ఉంది.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకాన్ని తెలుగు వికీసోర్సు సముదాయ సభ్యులు (శ్రీరామమూర్తి, డాక్టర్ రాజశేఖర్, ప్రభృతులు) యూనీకోడ్‌లో పాఠ్యీకరించి, ఇ-పుస్తకంగా తయారుచేశారు. ఈ పుస్తకం ఎవరైనా తిరిగి వాడుకోవచ్చు, పంచుకోవడానికి వీలుగా లభ్యమవుతోంది. 2018 మే మొదటి పక్షంలో ఈ పుస్తకాన్ని విశేషగ్రంథంగా తెలుగు వికీసోర్సు వారు ప్రదర్శిస్తున్నారు.

You Might Also Like

One Comment

  1. Siva Prasad Thakkelapati

    పుస్తకంలోని ముఖ్యాంశాలను చక్కగా స్పృశించారు వ్యాసకర్త పవన్. పాఠకులకు రాబోయే పుస్తకంపైన మంచి ఆసక్తిని కలిగిస్తుంది ఈ వ్యాసం. వ్యాసకర్తకు అభినందనలు.

Leave a Reply