మునెమ్మ ప్రతీకారం

సమీక్ష: దుగ్గిరాల శ్రీశాంతి
*******
మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి.

కథా విషయం:–

మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు.

మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీథిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా.

ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ.

జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. జయరాముణ్ణి తిడుతుంది. అతనికి ఈ మొండితనమూ, అకారణంగా కోపం తెచ్చుకోవటము లాంటి లక్షణాలన్నీ అతని తండ్రి (తన భర్త) దొరసామి నుంచే వచ్చాయంటుంది.

సాయమ్మ భర్త దొరసామి తాగుబోతు, వ్యక్తిత్వ పరంగా మొరటువాడు, ఎవరికీ తలవంచడు. నాటకాలంటే ఆసక్తి లేకపోయినా ఆ హడావుడిని ఇష్టపడతాడు. ఊళ్లో నాటకాలొస్తే దొరసామి భార్య సాయమ్మ తన పట్టుచీరను అతనికి తెలియకుండా నాటకాలవాడికి ద్రౌపది వేషం కోసమని ఇస్తుంది. దొరసామి తన భార్య చీర పరాయి మగవాడు కట్టుకోవడాన్ని భరించలేక ఆవేశానికి లోనై నాటకాల వాణ్ణి కత్తితో నరికి చంపుతాడు. జైలుపాలవుతాడు. అక్కడ కూడా తోటి ఖైదీలతో గొడవలు పడుతూ, అధికారుల్ని ఎదిరిస్తూ, ఒక రోజు కొందరు ఖైదీలతో కలిసి జైలు నుండి పారిపోతాడు. వారిలో కొంతమంది పోలీసు కాల్పుల్లో చనిపోతారు. వాళ్లలో దొరసామి ఉన్నదీ లేనిదీ ఎవరూ నిర్థారించి చెప్పకపోవటంతో ఎప్పటికీ అతని ఆచూకీ తెలియకుండా పోతుంది. సాయమ్మ మాత్రం భర్త బుద్ధులు తన కొడుక్కీ రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ కథనంతా ఆమె సినబ్బతో నెమరు వేసుకుంటుంది.

ప్రస్తుతంలోకి వస్తే… ఇంటికి వచ్చిన జయరాముడు సంతకి బొల్లిగిత్తను అమ్మడానికి తీసుకు వెళ్తున్నట్టు చెప్తాడు. సాయమ్మ మొదట వ్యతిరేకిస్తుంది గానీ, మునెమ్మ పట్ల బొల్లిగిత్త ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాకా, అమ్మేయటమే మంచిదంటుంది.

పొరుగూరిలోని పశువుల సంత దాకా తన ప్రయాణ ప్రణాళిక ఏమిటన్నది మొత్తం జయరాముడు ఆ రాత్రి తన తల్లికి చెప్తాడు. ఒంటరిగా కాకుండా, పశువుల దళారి తరుగులోడిని కూడా వెంటబెట్టుకు వెళ్తున్నట్లు చెప్తాడు.

అలా వెళ్లినవాడు రెండ్రోజులైనా తిరిగి రాకపోయేసరికి సాయమ్మ, మునెమ్మ కంగారు పడతారు. ఇంతలో మునెమ్మకు కల వస్తుంది. దాని ఆధారంగా తన భర్త బతికి లేడనే నిర్ణయానికి వస్తుంది. పైగా మరుసటి రోజు బొల్లిగిత్త ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది. దాని కొమ్ముకున్న సంత చీటీ అనే ఒక్క ఆధారాన్నీ పట్టుకుని మునెమ్మ భర్త కోసం బయల్దేరుతుంది. వెళ్తూ సినబ్బ (మనకు కథ చెప్తున్న పాత్ర)ను కూడా వెంటబెట్టుకు వెళ్తుంది.

దళారి తరుగులోణ్ణి ఆరా తీస్తుంది. అతని మాటల్లో తడబాటును బట్టి అతను చెప్తున్నది అబద్ధమని మునెమ్మకు రూఢీ అవుతుంది. పూటకూళ్ల ముసలి దంపతులను, సంత సంచాలకుణ్ణి, సంతలో కల్లుపాక యజమానినీ విచారించిన తర్వాత, తన భర్త జయరాముడు బొల్లిగిత్తను పశువుల వైద్యం చేసే మందులోడికి అమ్మినట్టు తెలుసుకుంటుంది మునెమ్మ. సినబ్బతో కలిసి అతని ఊరు రామినాయుడు పల్లెకు వెళ్తుంది. అక్కడికి చేరే సరికి మందులోడు మరణశయ్య మీద ఉంటాడు. ఆవుకి వైద్యం చేయబోతే కొమ్ము విసిరిందని అతని భార్య అబద్ధం చెపుతుంది. అసలే చావుబతుకుల్లో ఉన్న మందులోడు మునెమ్మ ఎడం చేతి మీద బొల్లిగిత్త పచ్చబొట్టు చూసి భయంతో చచ్చిపోతాడు. దాంతో బొల్లిగిత్తే మందులోడి చావుకి కారణమని మునెమ్మ అనుమానిస్తుంది. తర్వాత అతని పెద్ద కొడుకు ద్వారా నిజం తెలుసుకుంటుంది మునెమ్మ. మందులోడూ తరుగులోడూ ఇద్దరూ కలిసి తన భర్తని చంపేశారని ఖాయపర్చుకుంటుంది. ఇక మిగిలిన తరుగులోడిపై మునెమ్మ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే ముగింపు.

నా అభిప్రాయంలో మునెమ్మ:–

కథ ప్రారంభంలో మునెమ్మ పాత్ర అమాయకంగా కనిపించినా, భర్త హంతకుల్ని వెతికే క్రమంలో ఆమె ఎక్కడ లేని మొండి ధైర్యాన్ని, ప్రవర్తనలో పరిణతినీ ప్రదర్శిస్తుంది. భర్త ఇక లేడు అనే భావనే ఆమెలో అంతకుముందు లేని ఈ నిబ్బరాన్నీ, నేర్పరితనాన్నీ కల్పించాయనిపిస్తుంది. నాకు ఇక ఎవరూ లేరు అనే భావన రాగానే ప్రతి స్త్రీలోనూ మొండిధైర్యం ప్రవేశిస్తుంది.

మునెమ్మ తనలోని అనుమానాలను చూపుల ద్వారా తెలుపుతుందే కానీ, మనసు విప్పి ఎవరితోనూ పంచుకోదు. మాట్లాడిన కాసిని మాటల్లోనూ తాత్త్విక ధోరణి తొంగి చూస్తుంది. ఆ మాటలు ఎక్కడా పల్లెపడుచు మాటలుగా మనకు అనిపించవు.

“కాలు దీసి వీధిలో పెడితే దారి దానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదికి వచ్చే ముందు ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం? ఇవన్నీ ఆలోచించే వచ్చామా?”

“అడుగుదాం. సమయమొచ్చినపుడు గొంతు మీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్ళలో మునిగినప్పుడు గదా గాలాన్ని లాగుతాం.”

… ఇలాంటి తాత్త్విక ధోరణీ, ఈ అరుదైన పోలికలూ మునెమ్మవా, లేక రచయితవా అనే సందేహం కలుగుతుంది.

కానీ ఆమె ఇలా ఎంత అరుదైన ఉపమానాలు వాడినా, ఎంత లోతైన తాత్విక ధోరణి ప్రదర్శించినా, ఆమె మాటల్లోని యాస వల్ల మనం కాస్త సులువుగానే సమాధాన పడతాం. కానీ కథను మనకు చెప్పే సినబ్బ విషయంలో అలా సమాధాన పడలేం. అతని మాట తీరూ, అతను వాడే పదజాలమూ, కథను నేర్పుగా వెనకా ముందులు చేసి చెప్పటం… వీటి వల్ల మనకు కథ చెప్పేది ఒక పల్లెటూరి యువకుడని అనిపించదు. బాగా విజ్ఞానవంతుడెవరో చెప్తున్నట్టు అనిపిస్తుంది.

“వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అలాగే స్వప్న జగత్తులో జరిగిన సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపి వేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్ళు, ఆమెలోని సకల సందిగ్ధతలను, సకల సంశయాలను, సకల జడత్వాలను కడిగి వేశాయి.”

… ఇలా సాగుతుంది సినబ్బ కథనం. మునెమ్మకు రచయిత తన ఉపమానాల్ని మాత్రమే అరువిచ్చాడు. సినబ్బకు తన శైలి కూడా అరువిచ్చేశాడని అనిపిస్తుంది. ఈ శైలి కథా వాతావరణానికి నప్ప లేదు. సినబ్బ కూడా మునెమ్మలా యాసలో మాట్లాడి ఉంటే కథకు బాగా నప్పేదేమో అనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని లోటుపాట్లుగా అనిపించినా కథలో ఉత్కంఠ కారణంగా మనం మనసులోనే సమాధాన పడుతూ చదువుకుంటూ పోతాం. పైగా ఈ రచన మేజికల్ రియలిజం అనే ధోరణి ఆధారంగా రాసిందని అన్నారు గనుక, ఇలాంటి పొసగని అంశాలు ఎన్నో ఆ పేరు మీద చెల్లిపోతాయి.

భర్త హంతకుల్ని చంపటమే భర్తకు తాను చేసే అంత్యక్రియలుగా భావిస్తుంది మునెమ్మ. పట్టుదలగా వాళ్లని వెంటాడి తుదముట్టిస్తుంది. ప్రతీకారం కోసం ఆమె ప్రయాణమే ఈ నవల.

You Might Also Like

4 Comments

  1. Thirupalu

    నేను ఈ నవల మీధ చదివిన విమర్శలు గానీ, సమీక్షలు విశ్లేషనలు గానీ, ఒక విషయం మాత్రం ఐలైట్‌ చెయ్యలేదు. (మీరు చెప్పిన కధలో తీసుకున్నారు) అది ఏంటంటే, జయరాముని ప్రవర్తనకు- గిత్తను చావబాధడం- రచయిత ఒక నేపద్యాన్ని కల్పించిన సంగతి ఎవరూ పట్టించు కోలేదు. దీనికి అందరు వికృత వ్యాఖ్యనాలు చేసిన వారే! మునెమ్మకు గిత్తకు రంకు కట్టడం, అందుకే జయరాముడు అలా ప్రవర్తించాడనడం. ఇలాంటి రకరకాల వ్యాఖ్యానాలకు కారణం ఆ నేపధ్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోక పోడమే ననుకుంటాను.
    జయరాముని తండ్రి పాత్ర గ్రామీన నెపద్యం ఉన్న వాల్లకు తప్ప మరెవరికి అర్ధం కాదు. అదీ 1940 ప్రాంతపు భాస్వామ్య సమాజపు పురుషుల విచ్చలవిడి తనం, సోమరి పోతు డాంభికాలు,ఉన్న ఆస్తులు జల్సాల పేరుతో కరగపెట్టుకోవటం, స్రీ వ్యామోహం, భార్య శీలం మీద అనుమానాలు( ఇలాంటివన్ని కో.కు గారి నవలల్లో చూడవచ్చు) దుర్‌ వ్యసనాలు ఇదీ ఆనాటి గ్రామీణ భాస్వామ్య సమాజపు పురుష పాత్ర. ఈ నేపద్యమే జయరాముని ప్రవర్తనకు కారణం. అది అతని మగ సంస్కారం. ఈ కోణాన్నివదిలిపెట్టి మునెమ్మ రంకు కోనాన్నే ఎత్తు కోవడం బోలెడన్ని చర్చలకు కారణమైంది.
    సినబ్బ పాత్ర ద్వారా కద నడిపించడం, ఆ పాత్ర తాత్విక విషయాలు మాట్లాడటం, బరువైన డైలాగ్‌ లు చెప్పటం ఇవన్నీ లేక పోతె ఒక గ్రామీణ యువకుడు, అదీ చదువు సంద్య లేని యువకుడు తన దోరణిలో కధ చెపితే ( రచయితే చెప్పిస్తే) మీరు చదవగలరా?
    ఇంకో విషయమేమిటంటే, మునెమ్మ పాత్రకు మొదట అమాయకంగా కనిపించిన దానికిం ఇంత చైతన్యం ఎలా వచ్చిందా అని. ఇలాంటి వాల్లు మనకు నిజ జీవతంలో కూడా తారసపడతారు. అందు కే ఒక నానుడి చెపుతారు ” అవసరం సృజనకు తల్లి వంటిది ” అని. ఇదే మానవ పరిణామ క్రమము. మనిషి అవసరాన్ని పట్టే ఇంత పెద్ద సృజనాత్మకమైన సమాజంగా మారింది. యునివర్సిటీలో చదువుకున్న వారికి మాత్రమే చైతన్యం ఉంటుందనేది పొరపాటు అభిప్రాయం. ఎంత చదువుకోని వారైనా వాల్ల పరిదిలో వాల్లకు చైతన్యం ఉంటుంది.

    1. దుగ్గిరాల శ్రీశాంతి

      1. “ఒక గ్రామీణ యువకుడు, అదీ చదువు సంద్య లేని యువకుడు తన దోరణిలో కధ చెపితే రచయితే చెప్పిస్తే) మీరు చదవగలరా?”

      నేను నామిని కథలు చదివి ఆనందించగలిగాను. కాబట్టి ఇదీ చదవగలిగేదాన్ననే అనుకుంటున్నాను. కథ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో సాగుతుంది కాబట్టి, అన్ని ప్రాత్రలు ఒకేలా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను.

      నామిని రచనలు వాస్తవికంగా సాగుతాయి. “మునెమ్మ” మేజిక్ రియలిజం అనే పేరు మీద సాగుతుంది. కాబట్టి ఇందులో ఏదైనా సాగొచ్చు అని ఎవరైనా అనొచ్చు. అందుకే నేను రాశాను, “ఈ రచన మేజికల్ రియలిజం అనే ధోరణి ఆధారంగా రాసిందని అన్నారు గనుక, ఇలాంటి పొసగని అంశాలు ఎన్నో ఆ పేరు మీద చెల్లిపోతాయి” అని. ఇంకెన్నో పొసగని అంశాలకు నాకు నేను ఆ పేరు చూపించుకునే సమాధానపడ్డాను. కానీ ఈ ఒక్క భాష విషయంలో మాత్రం, అది మేజిక్ రియలిజం అనుకోవాలా, రచయితకు మాండలికం బాగా వాడుకోవడం చేత కాక అనుకోవాలా అన్నది తెలియక, ఆ ఒక్కటీ ఎత్తి చూపాను.

      2. “ఇంకో విషయమేమిటంటే, మునెమ్మ పాత్రకు మొదట అమాయకంగా కనిపించిన దానికిం ఇంత చైతన్యం ఎలా వచ్చిందా అని.”

      దీనికి మీరు చెప్పిన జవాబే నాకు నేనూ చెప్పుకున్నాను. అదే ఇక్కడ రాశాను కూడా: “భర్త ఇక లేడు అనే భావనే ఆమెలో అంతకుముందు లేని ఈ నిబ్బరాన్నీ, నేర్పరితనాన్నీ కల్పించాయనిపిస్తుంది. నాకు ఇక ఎవరూ లేరు అనే భావన రాగానే ప్రతి స్త్రీలోనూ మొండిధైర్యం ప్రవేశిస్తుంది.”

  2. కత్తి మహేష్ కుమార్

    ఇప్పటికే ఈ నవల మీద చాలా విశ్లేషణలు జరిగాయి. ఇంత లేటుగా ఒక వ్యాసం ప్రచురితమౌతోందంటే ఇంకేదైనా కొత్తకోణమో ఘాఢమైన ధృక్కోణమో ఉంటుందేమో అనుకుని చదివాను. I am disappointed because of my own expectation.

    1. సౌమ్య

      Mahesh garu: I don’t want to do this each time… but, can’t resist replying. I think not all articles on books are critical assessments. Some of them can just be individual reactions… general thoughts on the book. I am not saying that you are being critical about this article…I am just using this opportunity to express my opinion on the various kinds of articles one can see on books.

Leave a Reply