పుస్తకం
All about booksపుస్తకాలు

March 16, 2013

మనకి తెలియని మన చరిత్ర

More articles by »
Written by: అసూర్యంపశ్య
Tags:

తెలంగాణా రైతాంగ పోరాటాం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ మా లైబరీలోని వివిధ పుస్తకాలు చూస్తూండగా, ఈ పుస్తకం దొరికింది.

ఏమిటీ పుస్తకం?
ఈ సంపాదకవర్గం వారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న స్త్రీలతో, అందునా పూర్తిగా ప్రధాన నాయకత్వంలోని వారు మాత్రమే కాక, వివిధ స్థాయుల్లో పోరాటంలో పాల్గొన్న వారితో మాట్లాడి, అప్పటి పోరాటంలో స్త్రీల పాత్ర గురించిన ఒక అధ్యయనం చేయాలన్న ఆశయంతో చాలా చోట్లకి తిరిగి సుమారు 60-70 మందిని ఇంటర్వ్యూలు చేసారు. అయితే, మొత్తం ఇంటర్వ్యూలు అవీ అయ్యాక, ఆ అనుభవాలు గమనించాక, ఈ ఇంటర్వ్యూలని ఉన్నదున్నట్లుగా, వారి జీవితాలని ఒక సజీవ చరిత్రగా అక్షరబద్దం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో కొందరి కథలతో కూడిన పుస్తకమే ఇది. సంపాదకుల మాటల్లో:

“ముందు ఈ గొంతులందరికీ వినిపించేటట్లు చేయడం మా బాధ్యత అనుకున్నాం. అందుకే తెలంగాణ భాషలో ఉన్నా, ఆంధ్ర భాషలో ఉన్నా, కొన్నిసార్లు రెండూ కలిసిపోయి ఉన్నా దాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చెప్పిన భాషలోనే ఉంచినప్పుడే వాళ్ళ భావాన్ని మార్చకుండా ఉంచగలుగుతామని అనుకోవడమే దీనిక్కారణం. ఈ చరిత్రలు తెలియజేయడం మాకెంత ముఖ్యమో, వాటిని స్వయంగా చెప్పగలగడం వారికీ అంతే ముఖ్యం అని గుర్తించడానికి మేం గర్వపడుతున్నాం.”

పుస్తకంలోకి వెళ్తే,

మొదట సాయుధ పోరాట నేపథ్యం, అప్పటి పరిస్థితులు, ఉద్యమంలో కమ్యూనిస్టులు, స్త్రీల పాత్ర గురించి కొంచెం క్లుప్తంగా రాశారు ఒక వ్యాసంలో. ఆపై, స్త్రీల చరిత్ర అంటే ఏమిటి? అందులో ఏముంటాయి? ఏది స్త్రీల చరిత్ర? ఏది కాదు… అసలు స్త్రీల చరిత్ర తాలూకా చరిత్ర ఏమిటి? – ఇలా అన్ని విషయాలని వివరంగా చర్చిస్తూ సాగిన సైద్ధాంతిక మూలాలున్న వ్యాసం ఒకటుంది. ఇందులోనే మళ్ళీ చివరికొచ్చేసరికి, ఈ పుస్తకం రాయడం ఎందుకు అవసరమో చెబుతారు. కొంచెం క్లిష్టంగా ఉన్నా, చాలా ఆసక్తికరమైన వ్యాసం ఇది. దీని తరువాత, వరుసగా, ఉద్యమకారిణులు తమ కథలను చెప్పిన వ్యాసాలున్నాయి.

ఇందులో తమ కథలు చెప్పిన వారు:

* చాకలి ఐలమ్మ
* కమలమ్మ
* అక్కిరాజుపల్లిలో – కొండమ్మ, వజ్రమ్మ, గజ్జెల బాలమ్మ, సైదమ్మ, గొల్ల మల్లమ్మ, గొల్ల బుచమ్మ
* ప్రియంవద
* సుగుణమ్మ
* ప్రమీలా తాయి
* కొండపల్లి కోటేశ్వరమ్మ
* దూడల సాలమ్మ
* మానికొండ సూర్యావతి
* అచ్చమాంబ
* జమాలున్నీసా బాజీ – రజియా బేగం
* మోటూరి ఉదయం
* బ్రిజ్ రాణీ
* లలితమ్మ
* పెసర సత్తెమ్మ
* మల్లు స్వరాజ్యం

ఒక్కొక్కరి కథా ఒక్కోరకంగా కదిలించింది నన్ను. మోటూరి ఉదయం ఆద్యంతమూ ఓకింత sense of humour తో కథ చెబితే, పెసర సత్తెమ్మ, దూడల సాలమ్మ మొదటి అక్షరం నుంచీ భారీ నిట్టూర్పులు విడుస్తూ, విడిపిస్తూ చెప్పారు కథ. అచ్చమాంబ (డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ కాదు..ఈవిడ నర్సు అచ్చమాంబ) కథ…ఆవిడ మామూలుగా చెప్పినా కూడా, నాలో గగుర్పాటును కలిగించింది. మరి కొందరి కథల్లో ఈ పోరాటాల్లో పాల్గొనడం ద్వారా, ఒక స్త్రీ అయిన కారణంగా ఈ అమ్మలందరూ ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా కొంత అవగాహన కలిగింది. యువతరాన్ని చైతన్యవంతం చేసేలా లేని ఇప్పటి పరిస్థితుల (అప్పటి ఇప్పుడంటే ఇప్పుడు సుమారు పాతికేళ్ళ క్రితం నాటివి) గురించి రజియాబేగం అన్న మాటలు – “గతం భవిష్యత్తు లేదనిపిస్తుంది. వర్తమానమే ఉంది. అదీ ఇప్పటి వ్యవస్థ విలువ” : ఆలోచనలో పడేశాయి. అలాగే, ఉద్యమానంతర జీవితాల గురించి తెలుసుకున్నప్పుడు, దీని గురించి కొంతమందిలో వ్యక్తమైన అసహనం గురించి చదివినప్పుడు – ఒక విధమైన వైరాగ్యం కలిగింది. అలాగే, “నేనట్ల పోరాటంజేసి తీరినాగని నాకొక్క రాగిపైస మంజూరు లేకపాయె. ఈ పోరాటం జేసేమి, కూలవడ్తన్న గంతేలెక్క, ఎం లేదిగ. మందన ఆవులేదు, బొందన రూపాయల్లేవు. మెడమీద కంటె, రాగి పుత్తెగూడలేదు నా బత్కుకు. నా సీతల కష్టాలుజూడు. ఈ బూమ్మీదవడి ఏడ్సుకుంటున్న..” -అన్న దూడల సాలమ్మ మాటలు విన్నాక కూడా…. అంత కష్టపడి పోరాటాలు చేసిన వారికా ఈ పరిస్థితి? అనిపించింది. ఇలా అనుకున్న సందర్భాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి నిజానికి.

మొదట్లో ఈ పుస్తకం ఎందుకు వచ్చిందో తెలియజేసినట్లే ఈ పుస్తక రూపకల్పనలో తమ అనుభవాలతో, ఈ ఉద్యమకారిణులు తమకి ఏ విధంగా సహకరించారో, వీళ్ళ చరిత్ర మనకి ఎందుకు ముఖ్యమో మరొకసారి వివరిస్తూ సంపాదకులు చివర్లో మరొక వ్యాసం జతచేశారు. అందులో కొన్ని వాక్యాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఉదా:
“ఇంటర్వ్యూల్లో వాళ్ళు మర్చిపోయారనుకున్న పోరాట సంప్రదాయపు గతం ప్రాముఖ్యతను వాళ్ళకే గుర్తుచేసినట్టయింది. కమలమ్మ ఇట్లా అంటుంది – ‘మేం చరిత్ర సృష్టిస్తున్నాం అన్నారు. ఇప్పుడు మీరొచ్చిన దాకా మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు.’ ‘మా చరిత్రలు రాసిన వాళ్ళెవరు? ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళెవరు? మీరు చేస్తుంటేనన్నా చెప్పాలి కదా!’ అంటుంది స్వరాజ్యం.”

భాష నన్ను కొంచెం ఇబ్బంది పెట్టిందన్నమాట ఒప్పుకోవాలి ఇక్కడ. ఇది మౌఖిక చరిత్ర కనుక, ఆ భాషలోనే ఉండాలన్నది సంపాదకవర్గ నిర్ణయం. ఇలాంటి పుస్తకాలు వేరే భాషల్లో కూడా వచ్చాయి అన్నది వారి వాదన. అది కరెక్టే కావొచ్చు కానీ, అంతటి గ్రామీణ తెలంగాణా యాస చదువరులలో ఎంతమంది అర్థం చేసుకోగలరు? అన్నది నాబోటి మనుషులకి టక్కుమని వచ్చే సందేహం. అంతా ఒకే యాసలో కూడా లేదు. వీరిలో కొందరి భాష మామూలుగా మనకి పత్రికల్లో కనబడే తరహా భాషలా ఉంది. ఇంతకీ, ఇందులో వాడిన భాష బాగాలేదని కాదు నేనంటున్నది. నిజానికి ఆ పలుకుబళ్ళు చదవడానికి చాలా బాగున్నాయి. వినడానికి ఇంకా బాగుండి ఉండొచ్చు. కానీ, mainstream భాష కాదు కనుక, చాలా ఇబ్బంది పడ్డాను అర్థం చేసుకోవడానికి. ఒకట్రెండు వ్యాసాలకైతే పూర్తిగా అసలేం అర్థం కావట్లేదని, ఆంగ్ల అనువాదం అరువు తెచ్చుకుని చదవాల్సి వచ్చింది. ఏదో, ఒక గ్లాసరీ తరహాదైనా జత చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అన్నట్లు, ఆంగ్లంలో కూడా speech transcripts చదువుతున్నట్లే ఉంటుంది కనుక, మామూలుగా కనబడే భాషలా అనిపించదు. కాస్త ఇబ్బంది తప్పదు. కానీ, అవేవీ పుస్తకాన్ని దూరంగా ఉంచనీవు. వీళ్ళ గాథలు అలాంటివి!

ఇందులో వాడిన భాష గురించి సంపాదకులు అన్నట్లు – “మా ప్రయత్నం చదివేవాళ్ళ మీద కూడా ఒక పెద్ద బాధ్యతనుంచుతుంది. దీన్నర్థం చేసుకోవటానికి శ్రద్ధ ఎంత అవసరమో, ఊహాశక్తీ అంతే అవసరం”.

ఫొటోలు చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీతో ముద్రించి ఇంకో ఏడిషన్ వస్తే చాలా బాగుంటుంది. చివర్లో “చదవాల్సిన పుస్తకాల జాబితా” కూడా ఇవ్వడం మంచి విషయం.

మీకీ పుస్తకం దొరికే అవకాశం ఉంటే మట్టుకు చదవడానికి కొంచెం కష్టంగా అనిపించినా, తప్పకుండా చదవాల్సిన పుస్తకం. (అని నా అభిప్రాయం మాత్రమే!)
నిజానికి నాకీ భాష వంటబట్టక కొంచెం, ఆంగ్లానికి మరలినా అదీ వంటబట్టక కొంచెం…నేను పుస్తకాన్ని సరిగ్గా చదవలేదన్న భావన నాలో ఉంది. కొన్నాళ్ళాగి మరొక్కసారి ప్రయత్నించి చదవాలి అనుకుంటున్నాను.

తెలంగాణా ఉద్యమ నేపథ్యం గురించిన వ్యాసంలో సంపాదకులు అన్నట్లు – “ఈ పుస్తకంలోని ఇంటర్వ్యూల సహాయంతో మాత్రమే తెలంగాణా పోరాట చరిత్రను రాయటం సాధ్యం కాకపోవచ్చు. కానీ, మామూలు చరిత్ర చెప్పని విషయాలెన్నో ఈ స్త్రీల గొంతుల్లో మనం వింటాం.” – అందుకే ఈ పుస్తకం చదవాలి!

తెలుగు పుస్తకం వివరాలు:
మనకు తెలియని మన చరిత్ర : తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు
ఒక సజీవ చరిత్ర
సం: కె.లలిత, వసంత కణ్ణబిరాన్, రమా మేల్కోటే, ఉమామహేశ్వరి, సుసీ తారూ, వీణా శతృఘ్న, ఎం.రత్నమాల
ప్రచురణ: శ్త్రీ శక్తి సంఘటన,1986
(ఈ పుస్తకం ప్రస్తుతం అలభ్యం అని ఇటీవలే హైదరాబాద్ బుక్ ట్రస్టులో సంప్రదిస్తే తెలిసింది.)

English Book Details:
“We were making history…”
Life stories of Women in the Telangana People’s Struggle
Ed: Lalitha K., Vasantha kannabhiran, Rama Melkote, Uma Maheswari, Susie Tharu, Veena Shatrugna
Pub: Kali for Women, 1989.
ISBN: 81-85107-12-2

**
(చివర్లో ఒక గమనిక: అయ్యలారా, అమ్మలారా, ఇక్కడి ఏకవచనాలు వాళ్ళని అగౌరవ పరచడానికి కాదు. వాళ్ళ మాటల్లో ఈ కథలు వింటూ వాళ్ళతో ఒక దగ్గరి తనాన్ని అనుభవించాను కనుక చెబుతున్నా. వాళ్ళేమన్నా నీ స్నేహితులా? ఏక వచనంలో రాస్తావేమిటి? అనకండి.)About the Author(s)

అసూర్యంపశ్య4 Comments


 1. సౌమ్య

  One article from this book can be read here:
  http://www.bhumika.org/archives/2902


 2. రమాసుందరి

  చాలా ఏళ్ళ క్రితం ఈ పుస్తకం చదివాను. (90?) అప్పుడు ప్రస్తావించిన మహిళల్లో కోటేశ్వరమ్మగారు మిగిలారేమో! చదవాల్సిన పుస్తకం.


  • సౌమ్య

   Sreenivas garu: I thought the book is available, as you indicated so in a previous comment. But, as of december 31st, it was not. I went to HBT and enquired about the book. They said there are no copies. Gita garu did not mention about any reprint at that time. But, I did not ask about a reprint specifically…so I don’t know.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 
 

The Book of Joy

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దా...
by అతిథి
0

 
 

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహ...
by పుస్తకం.నెట్
2

 

 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2

 
 

గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [రచయిత మల్లిపురం జగదీశ్ ‘శిలకోల’కి డాక్టర్ మాడభూషి రంగాచార...
by అతిథి
4

 
 

The Immortal Life of Henrietta Lacks – Rebecca Skloot

వ్యాసకర్త: Naagini Kandala ************** కొన్నిసార్లు ఒక పుస్తకం చదవాలనే ఆసక్తి కలగడానికి పుస్తకం పేర...
by అతిథి
1