సి.ఏ.సి.యం – జనవరి ౨౦౧౨ సంచిక

(అవునండీ, పత్రికల్ని కూడా ఇలా వివరంగా రాయవచ్చు.)
మోషే వార్ది గారు ఈ పత్రిక సంపాదకులు. “Artificial Intelligence: Past and Future” అన్న సంపాదకీయ వ్యాసంలో కృత్రిమ మేధ (artificial intelligence) పరిణామ క్రమాన్ని చూస్తూనే, సాధారణంగా సంబంధిత సాంకేతికత గురించి శాస్త్రజ్ఞుల ఆలోచనలు, ఊహలు, ఇతరుల స్పందనలు – ఇలాంటివి టూకీగా ప్రస్తావించారు. అయితే, ఇక్కడ ప్రధాన విషయం ఏమిటి అంటే, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నా కూడా, కృత్రిమ మేధ మూలాన ఎన్నో పనుల యంత్రీకరణ జరగడం ఆగడం లేదు. కార్లు, ట్రక్కులు కూడా యంత్రాలు నడిపే రోజులు ఎంతో దూరంలో లేకపోవచ్చు. అప్పుడు ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏమిటి? నిజంగా మన భవిష్యత్తుకి మన అవసరం ఉందా? అన్న ప్రశ్నతో ముగుస్తుంది ఈ సంపాదకీయం. ఇదే “థీం” ఈ సంచికలో కొన్ని ఇతర వ్యాసాలు చదువుతున్నప్పుడు నేరుగానో, పాక్షికంగానో మళ్ళీ కనబడడం యాదృచ్చికం మాత్రం కాదనుకుంటాను.
సూచిక వరుసలో లేకున్నా, ఇదే థీం లో సాగిన మరో వ్యాసం: అలెక్స్ రైట్ రాసిన “Analyzing Apple Products“. ఒక సంస్థగా యాపిల్ తన పనితీరును గురించి ఎంత గోప్యత వహిస్తుందో, ఐటీ రంగంతో పరిచయం ఉన్న వారికి తెలిసే ఉంటుంది. అలాంటి ఆపిల్ నుండి వెలువడ్డ పరికరాలను తీసుకుని, వాటి నుండి వచ్చే ఆదాయంలో ఆపిల్ లాభం ఎంత? ఎంత వరకు వీళ్ళ పరికరాలు అసెంబుల్ చేసే చైనా కంపెనీలకి వెళ్తాయి? ఏది లాభదాయకం? అని పరిశోధన చేసిన బృందం గురించి, వారి సలహాల గురించి ఈ వ్యాసం. ఈ బృందం ఇంత గోప్యమైన ఆపిల్ నెట్వర్క్లో కూడా వివిధ వ్యక్తులతో మాట్లాడి, ఎన్నో పరిశీలనలు చేసి కనిపెట్టినవి ఏమిటంటే: తన మానుఫాక్చరింగ్ యూనిట్లకి ఆపిల్ రాల్చే రొక్కం చాలా తక్కువని, బాగా హిట్ అయిన ఆపిల్ ప్రొడక్ట్స్ లో దాదాపు అరవై శాతం ఖరీదు యాపిల్ జేబులోకే చేరుతోందనీ. ఒక పక్క రిసెషన్ అనీ, అమెరికాలో ఉద్యోగాలు చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళూ తన్నుకు పోతున్నారనీ అక్కడ గోలపెట్టేవారికి.. ఆ ఉద్యోగాలు ఇక్కడే ఉంచేసినా వాటి వల్ల పెద్ద లాభం ఏమీ ఉండదనీ, దానికంటే, ఇలాగే కొనసాగుతూ, ఆపిల్ తరహాలో చక్కటి పరికరాలో, అలాంటి హై-ఎండ్ పనులో చేసి, వాటి ద్వారా బోలెడు డబ్బు గడించమని తేల్చారు అన్నమాట. నిజానికి ఈ భాగం లో ఉన్న లాజిక్ తేటతెల్లమే అయినా కూడా, ఇప్పటి వరకూ చైనా లో మానుఫాక్చరింగ్ ఉన్నందువల్ల వాళ్ళు చాలా లాభ పడుతున్నారు అన్న అపోహలో ఉన్న నాకు జ్ఞానోదయం కలిగింది
రాన్డల్ సి.పికర్ రాసిన మరో వ్యాసం – “The Yin and Yang of Copyright and Technology” కూడా పై రెండు వ్యాసాల లాగానే, సాంకేతికతకు సాంకేతికేతర అంశాలకు మధ్య ఉండే సంబంధం గురించే. అయితే, ఇక్కడ ఆ రెండో విషయం – చట్టం,న్యాయం. సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ కాపీరైట్ అన్న పదానికి అర్థం లేకుండా పోవడాన్ని గురించి వ్యాఖ్యానిస్తూనే, ఏ సాంకేతికత మూలానైతే కాపీరైట్ ఉల్లంఘనలు, పైరసీ పెరిగిపోయయో, అదే సాంకేతికత తో వాటిని ఎదుర్కునే ప్రయత్నాలు చేయాలంటూ, ఆ దిశగా పడుతున్న తొలి అడుగులను ప్రస్తావించడంతో ముగిసిందీ వ్యాసం. నిజానికి, ఇది ఒక అభిప్రాయం మాత్రమే – పరిశీలన కాదు అని నాకు అనిపించింది (నిజమే…అది “వ్యూ పాయింట్” కాలం లో వచ్చింది మరి!!) మరో వ్యాసం “Law and order” కూడా సైబర్ లా, దానికి సంబంధించిన అంశాల చుట్టూనే మరికాస్త వివరంగా సాగుతుంది.
ఫిలిప్ జి. ఆర్మర్ రాసిన “The Difference Engine” కూడా ఒక్క చిన్న “వ్యూ పాయింట్” వ్యాసం. భిన్న నేపథ్యాల నుండి, వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డ జట్టు చర్చల్లో ఉత్పన్నమయ్యే ఆలోచనలు భిన్న కోణాలు తీసుకోస్తాయనీ, చాలా సార్లు వీటి వల్ల పనితీరు మెరుగవుతుందనీ చెప్పిన పరిశోధనను సమర్థిస్తూ సాగిన వ్యాసం ఇది.
సంచిక లో చివరి వ్యాసంగా “లాస్ట్ బైట్” కాలంలో డేనియల్ హెచ్.విల్సన్ రాసిన “Future Tense: The Near Cloud” మంచి వ్యంగ్య వ్యాసం – గూగుల్ ఇతర సంస్థలు మన వ్యక్తిగత వివరాలు సేకరించడంలో చూపించే అత్యుత్సాహం గురించి. అలాగే, ఈ దిశలో ఆలోచిస్తే, కాస్త గగుర్పాటు కూడా కలిగిస్తుందీ వ్యాసం, మన గురించి వివిధ వెబ్సైట్ల వాళ్లకి ఎంత స్థాయిలో వివరాలు తెలుస్తాయి అన్న విషయం గురించి ప్రాథమిక అవగాహన ఉన్న ఎవరికైనా.
ఈ విధంగా, నా మట్టుకు నాకు చక్కటి చర్చలతో, అన్నింటికీ మించి మాములు భాషలోనే సాంకేతికతకు సంబంధించిన ఉపయోగాలే కాక, సంఘం పై దాని ప్రభావం గురించి కూడా వివరంగా రాసినందుకు ఈ సంచిక నచ్చింది. అయితే, తరుచుగా ఏదో ఒక వ్యాసం నాకు తెగ నచ్చి, దానికి తాలూకా ఇతర పరిశోధాలు కూడా కనీసం ఒకట్రెండన్నా చదివే “కిక్” ఇస్తుంది. ఈసారి అలాంటి “కిక్” దొరకలేదు. ఫిషింగ్ వ్యాసం ఒక్కటే ఇచ్చీ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి లాగేసుకుంది.
Leave a Reply