Philosophy of village movement – J.C.Kumarappa
రాసిన వారు: Halley
***************
ప్రఖ్యాత గాంధేయవాది మరియు ఆర్థిక శాస్త్రవేత్త జే.సి.కుమారప్ప గారి పుస్తకాలు నేను పోయిన సంవత్సరం చదివాను. పుస్తకం.నెట్ పాఠకులకు కుమారప్ప గారిని పరిచయం చేయటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. కుమారప్ప గారి గురించి వికీ లంకె ఇది. కుమారప్ప గారికి గాంధిగారితో ఉన్న అనుబంధం గురించి కొన్ని పిట్టకథలు ఇక్కడ.
టూకీగా చెప్పాలి అంటే తమిళనాడులో జన్మించి, 1920-30 కాలంలో ఇంగ్లాండ్ మరియు అమెరికా దేశాలలో పై చదువులు చదివి, భారత దేశానికి తిరిగి వచ్చాక గాంధీగారి ఆలోచనల పట్ల ఆకర్షితుడయ్యి, తన జీవిత పర్యంతం గాంధేయ ఆర్థిక శాస్త్రం మరియు గ్రామీణోద్యమం వంటి ఉన్నత ఆశయాలకు అంకితమైన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. ఆయన రాసిన “Economy of Permanence” , “Why the Village Movement”, “Philosophy of Village Movement” అనే పుస్తకాలను నేను చదివాను. ఈ వ్యాసం “”Philosophy of Village Movement” గురించి. మిగిలిన పుస్తకాలను కూడా వీలు చూసుకొని పరిచయం చేయటానికి ప్రయత్నిస్తాను.
ఈ పుస్తకం కుమారప్ప గారు స్వాతంత్రోద్యమ కాలములో చేసిన ప్రసంగముల సంకలనం. ప్రచురణ కర్త “శనివారపు సుబ్బారావు, రాజాన్ ఎలెక్ట్రిక్ ప్రెస్, రాజమండ్రి”. పేజీలు 100. ఈబుక్కుకు లంకె ఇక్కడ. ముందు మాట మాజీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు రాసారు. చాలా వరకు ప్రసంగాలు 1930లలో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఇచ్చినవే అవటం విశేషం.
మొదటి ప్రసంగంలో పాశ్చాత్య నాగరికతకు, మన నాగరికతకు ఉన్న మౌలిక భేదాలను వివరించారు. వారి దేశాలలో సంపదకి ప్రాముఖ్యత ఇస్తే మన దేశంలో ధర్మానికి ప్రాముఖ్యత ఇచ్చిన వైనం గురించి వివరంగా చెప్పారు. సంఘ సమతుల్యతకి మూలమైన కుల వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోయిందో , కులధర్మం మరిచిన సంఘం ఎలా మారిపాయిందో ఉదాహరణలతో సహా తెలియజేసారు. స్వరాజ్యానికి నిజమైన అర్థమేమిటి, మన గ్రామ పరిపాలన వ్యవస్థ గొప్పతనం, విశిష్టత వంటి విషయాలు మనకి ఈ ప్రసంగం ద్వారా తెలుస్తాయి. మన గ్రామాలలో కళకారులు, చేతిపనివారు, రైతన్నల సహజీవనం వలన ఉన్న లాభాలూ, పాశ్చాత్యుల యంత్ర సామాగ్రి వలన ఉపాధి కోలుపోయిన కళాకారులు వ్యవసాయానికి వలస రావటం వలన దెబ్బతిన్న గ్రామీణ సాంఘిక వ్యవస్థ గురించి వర్ణించారు. ఈ ప్రసంగం రాజమండ్రీలో గ్రామ పునర్నిర్మాణ కార్యకర్తలను ఉద్దేశించి ఇచ్చినందువలన మన గ్రామాలను తిరిగి సమున్నత స్థానానికి తీసుకొని వెళ్ళాలంటే నిజమైన కార్యకర్త చేయవలిసిన విధులు ఏమిటో కూడా వివరించారు.
రెండవ ప్రసంగములో వివిధ రకాల పెట్టుబడిదారు విధానముల గురించి చెప్పారు. అప్పటి రష్యాలోని కమ్యునిష్టు వ్యవస్థను పెట్టుబడిదారు విధానములలో ఒకటిగా ముడి పెట్టటం విశేషం. పెట్టుబడిదారు సమాజములన్నిటిలోనూ హింస మరియు దౌర్జన్యములు ఎక్కువగా ఉన్న వైనము గురించి చెప్తూ, ఉత్పత్తిని వికేంద్రీకరించటం వలన వచ్చే లాభాలు, అది ఏ విధంగా హింసకు తావు లేని సమ సమాజాన్ని నిర్మించటంలో సహాయపడుతుందో చాలా చక్కగా వివరించారు. ఈనాడు ప్రపంచ శాంతికి వికేంద్రికరణ ఎంతో అవసరమని ఆలోచింపచేసేలా ఉంది ఈ ప్రసంగం.
మూడవ ప్రసంగంలో జాతీయ గ్రామీణ పరిశ్రమల సంఘం ముఖ్యోదేశాలను వివరించారు. జంతువుల శవ విక్రయంలోని సాధక బాధకాలు, వాటి ఎముకలతో ఎరువు తయారు చేయటం వంటి విషయాలు మనకు ఎబ్బెట్టుగా అనిపించినా అవే జీవన ఆధారముగా అప్పట్లో బతికిన హరిజన సోదరులకి ఇవి తప్పకుండా పనికొచ్చే ఉంటాయనుకుంటాను.
1935 లో సుబ్బారావుగారు ట్రైనులో కుమారప్ప గారితో చేసిన ఇంటర్వ్యూ సారం కూడా ఈ పుస్తకంలో పొందుపరచారు. ఈ ఒక్క ఇంటర్వ్యూ చదివితే బహుశ కుమారప్ప గారి ఆలోచనల గురించి చూచాయగా తెలుస్తుంది అనుకుంటాను. ఏలూరులో చేసిన ప్రసంగంలో సామ్రాజ్యవాద పాలనా నిరంకుశత్వం గురించి సంశయాలకు తావులేకుండా వర్ణించారు. అప్పటికీ, ఇప్పటికీ ప్రపంచ సామ్రాజ్యవాద వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగినప్పటికీ, కొన్ని మౌలికమైన విషయాలలో కుమారప్పగారు అడిగే ప్రశ్నలకు బహుశా సామ్రాజ్యవాద సిద్ధాంతకర్తల దగ్గర కూడా సరైన సమాధానాలు ఉండవు కాబోలు. గుంటూరు జిల్లా కావురులో ఇచ్చిన ప్రసంగం లో “Prostitution of Art” అన్న భాగం నన్ను ఎంతో ఆలోచింపజేసింది.
యాంత్రిక పరిశ్రమల ఉత్పత్తి విధానములను తూర్పారబడుతూ రాసిన వ్యాసం “Ahimsa in the Economic world“. ప్రకృతికి లోబడి జీవించే విధానం నుంచి ప్రకృతిని లోబరుచుకొని జీవించే విధానమునకు మారటం వలన వచ్చే నష్టాలను ఈ వ్యాసంలో వివరించారు. వెనుకబాటుతనం అంటే ఏమిటి, ప్రగతి,వికాసం అనే పదాలకు నిజమైన అర్థమేమిటి అని అందరిని ఆలోచింపజేసేటట్టుగా ఉంది ఈ వ్యాసం. తిండి, గుడ్డ, గూడు మానవుడికి నిజమైన అవసరాలయితే నేటి సమాజంలో సిగరెట్టు, పౌడరు, కాస్మటిక్సు వంటివి సహజసిద్ధమైన అవసరాలుగా ఎందుకు మారిపోయాయి అని ఈ వ్యాసంలో ప్రశ్నకు వచ్చిన అంశాలు. నేడు ప్రకటనలు, ప్రచారసాధనాల గిమ్మిక్కులతో అసహజమైన కోరికలు అవసరాలుగా ఎలా మారిపోయాయో వివరించారు. మార్కెటింగ్ పరిభాషలో చెప్పాలి అంటే “Needs”, “Wants”, “Desires” లోని భేదాల గురించి చర్చించారు.
ఈ పుస్తకం కేవలం కుమారప్ప గారు చేసిన పనులకి నమ్మిన సిద్ధాంతాలకి ఒక పరిచయం లాగానే పనికి వస్తుంది. వారి ఆర్ధిక సిద్ధాంతాల మూలం పైన చెప్పినట్టుగా “Economy of Permanence”, “Why the Village Movement” అనే పుస్తకాలలో ఉన్నది. 1930లలో మన ఆంధ్రదేశంలోనే ఇంతగా వెలుగు వెలిగిన గ్రామీణ పరిశ్రమ ఉద్యమం తర్వాత మెల్లగా కనుమరుగు అయిపోవటం మన దురదృష్టం . గాంధీగారి ఆర్ధిక సిద్ధాంతాలను ఎందఱో నాయకులు, ముఖ్యంగా జవహరలాల్ నెహ్రు తప్పుగా అర్థం చేసుకోవటం వలన బహుశా ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించింది ఏమో. ఎపుడైనా సమయం చూసుకొని ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నా మరి. ఐ.ఐ.ఎం. లో “Business Sustainability” అనే కోర్సులో ప్రొఫెస్సర్ “ఈ.ఎఫ్.షూమాకర్” రాసిన “Small is Beautiful” అన్న పుస్తకం గురించి చెప్పటం, అందులో అయన కుమారప్ప గురించి రాయటం వలన నాకు కుమారప్ప పుస్తకాలు చదివే అవకాశం లభించింది. ఈ పరిచయం వలన మీలో కొందరు కుమారప్ప గారి గురించి మరి కొంచెం తెల్సుకొనే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.
Madhu
Where can I get these books by late J C Kumarapps? This is well written.
రాజశేఖర రాజు
“గాంధీగారి ఆర్ధిక సిద్ధాంతాలను ఎందఱో నాయకులు, ముఖ్యంగా జవహరలాల్ నెహ్రు తప్పుగా అర్థం చేసుకోవటం వలన బహుశా ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించింది ఏమో.”
మీ సంశయ వాక్యం చరిత్రలో తేలిపోయింది కదా. నెహ్రూ గాంధీ ఆర్థిక సిద్ధాంతాలను తప్పుగా అర్థం చేసుకోవడం కాదు. చాలా తెలివిగా ప్రభుత్వ, ప్రైవేట్ స్వామ్య విధానాలను ప్రణాళికా బద్ధంగా తీసుకువచ్చిన నేత నెహ్రూ. ఆయన అమాయకుడు మాత్రం కాదు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే నమునాను గాంధీజీ ప్రపంచానికి బోధిస్తే, సరిగ్గా అందుకు విరుద్ధంగా వ్యవహరించారు నెహ్రూ.
ఇది మినహా మీ వ్యాసం అత్యద్భుతం. 1930ల లోనే సోవియట్ యూనియన్‌లో సామ్యవాదం ఛత్రచ్ఛాయిలో పెట్టుబడిదారీవిధానం -ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం- ఉనికిలో ఉందని తదనంతరం నిరూపించిన పరిణామాలను కుమారప్పగారు చెప్పారని చదువుతుంటే గగుర్పొడుస్తోంది.
తప్పకుండా ఈయన అన్ని రచనలను వెలుగులోకి తీసుకురండి.
ధన్యవాదాలు.
Nagini
రాజమండ్రి లో పుట్టి పెరిగిన నాకు,శ్రీ కుమారప్ప గారి గురించి తెలుసుకోవడం సంతోషం కలిగించింది…Thanks for the nice post…:-)
Purnima
Quite Interesting. Thanks for introducing.
Looking forward for more introductions from you. Keep writing.
Kumar N
Interesting!
Thanks for writing about it.