కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు

కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ – ఈ ఏడు ఈ ముగ్గురి శతజయంతి సంవత్సరం. Detroit Telugu Literary Club (DTLC) వారు ఈ ఏడు సెప్టెంబరు లో ఈ సందర్భంగా మూడురోజులపాటు సాహితీ సమావేశాలను ఏర్పరచ తలపెట్టారు. దానికి సంబందించిన ప్రకటన ఇది.

***********************************************************************
ఏ భాషలోనైనా తమ తమ రచనలతో తమకొక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమోగాని తెలుగు సాహిత్యంలో విశేషంగా కొనియాడదగ్గ అసమాన ప్రతిభావంతులు ముగ్గురు కొద్ది నెలల తేడాలో వంద సంవత్సరాల క్రితం పుట్టారు. వారే కొడవటిగంటి కుటుంబరావు (కొకు), శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ), త్రిపురనేని గోపీచంద్. రాబోయే సంవత్సర కాలంలో తెలుగు నాట
అంతటా ఈ ముగ్గురి తెలుగు సాహిత్య కృషిని గుర్తుచేసుకునేందుకు ఎన్నో సాహితీ సమావేశాలు ఇంచుమించు నెలనెలా జరుగుతాయి. వారం మధ్యలో వచ్చే పండగను కూడా వారాంతంలోనే జరుపుకొనే మనకు అంత అవకాశం ఎలాగూ ఉండదు గనుక, డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) ముగ్గురి శతజయంతుల్నీ కలిపి ఈ సంవత్సరం సెప్టెంబరు చివరి వారాంతం, అనగా సెప్టెంబరు 26, 27 (శనివారం, ఆదివారం) తేదీల్లో సాహితీ సమావేశాలతో గుర్తు చేసుకునేందుకు తలపెట్టింది. ఉత్తర అమెరికాలోని తెలుగు సాహిత్యాభిమానులందరికీ డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ తరపున ఈ సమావేశాలకు ఇదే మా ఆహ్వానం!

స్థూలంగా సమావేశ వివరాలు ఇవి: రెండు రోజుల్లో మొత్తం ఐదు సమావేశాలు జరుగుతాయి. ముందు సమావేశం శనివారం (సెప్టెంబరు 26, 2009) ఉదయం ముగ్గురి రచయితల జీవిత విశేషాలపై ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క రచయిత సాహిత్యంపై ఒక్కొక్క సమావేశం శనివారం మధ్యాహ్నం, ఆదివారం ఉదయం జరుగుతాయి. చివరిగా ఆదివారం మధ్యాహ్నం, ఈ ముగ్గురి రచయితల సాహిత్యం, నాటి సమాజం, ఎలాంటి పరస్పర ప్రభావం కలిగి ఉన్నాయన్న విషయంపై చర్చ ఉంటుంది. శ్రీశ్రీ సాహిత్యంపై సమావేశానికి శ్రీ వెంకటయోగి నారాయణస్వామి (swamyv@gmail.com), కొకు సాహిత్యంపై సమావేశానికి ఆచార్య గోపరాజు లక్ష్మి(lakshmi_goparaju@yahoo.com) గార్లు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రసంగించదల్చుకున్నవారు స్వామి గారికిగాని, లక్ష్మి గారికిగాని తెలుపవచ్చు. మిగిలిన మూడు సమావేశాలకు నాయకత్వ బాధ్యత వహించడానికి ముందుకు రావలసిందిగా అనుభవజ్ఞులకు ఇదే మా ఆహ్వానం. ఈ సమావేశాలకు నాయకత్వం వహించదల్చుకున్నవారు, కృష్ణారావు మద్దిపాటి గారికి గాని (kmaddipati@gmail.com) ఆరి సీతారామయ్య (ari.sitaramayya@gmail.com) గారికి గాని తెలియజెయ్యండి.

గత సంవత్సరం సెప్టెంబరులో మా డిట్రాయిట్ లిటరరీ క్లబ్ పది సంవత్సరాల పండుగ సమావేశాలకొచ్చిన సాహితీ మిత్రులందరికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ సెప్టెంబరులో మళ్ళీ రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకూ మా సమావేశాలకు రావడానికి అవకాశం కలగని మిత్రులకు, వచ్చి వట్టి హృదయాలతో వెళ్ళరని మాత్రం హామీ ఇస్తున్నాం! ఇంటర్నెట్ పత్రికలు, రచ్చబండ వంటి సమూహాల్లో ఎలక్ట్రానిక్ గా పరిచయమైన మిత్రుల్ని ముఖతః
కలుసుకునే అవకాశం వదులుకోరని విశ్వసిస్తున్నాం.

ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి రావడం కుదరని వారు తమ వ్యాసాలను MS Word వారి Doc ఫైళ్ళ రూపంలో పంపవచ్చు. సమావేశానికి అంగీకరింపబడ్డ వ్యాసాలన్నీ ఎలెక్ట్రానిక్ పద్ధతి లో, అచ్చులోనూ ప్రచురణార్హత పొందుతాయి. మీ వ్యాసాలను ఆరి సీతారామయ్య (ari.sitaramayya@gmail.com) గారికి లేదా ఈ ఈమెయిల్ ఐడీ కి (aj2642@wayne.edu) కిగాని పంపగలరు.

వ్యాసాలు పంపవలసిన ఆఖరు తేదీ సెప్టెంబర్ ఒకటి 2009.

You Might Also Like

4 Comments

  1. పుస్తకం » Blog Archive » కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు - Updates

    […] కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ – ఈ ఏడు ఈ ముగ్గురి శతజయంతి సంవత్సరం. Detroit Telugu Literary Club (DTLC) వారు ఈ ఏడు సెప్టెంబరు లో ఈ సందర్భంగా మూడురోజులపాటు సాహితీ సమావేశాలను ఏర్పరచ తలపెట్టారు అన్న సంగతి తెలిసిందే. దాని గురించిన ప్రకటన కూడా మే నెల మొదటివారంలో పుస్తకంలో ప్రకటించాము. […]

  2. gaddeswarup

    రచయత్రుల మాటేమిటి? ఎవరూ లేరా?

  3. మద్దిపాటి కృష్ణారావు

    కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ ల శతజయంతులు జరపడంలో మిగిలిన సాహితీమూర్తుల్ని తక్కువ చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదని మనవి. నెటిజన్ గారు ఉదహరించిన వారందరూ తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసినవారే. వీరిని మరువకుండా గుర్తు చేసినందుకు ఎంతైనా కృతజ్ఙతలు. ఇంకా ఆస్థాయి తెలుగు సాహితీవేత్తల వివరాలు తెలిసినవారు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.

  4. నెటిజన్

    “కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ – ఈ ముగ్గురి శతజయంతి సంవత్సరం.” వారు ముగ్గురే కాదు. ఇంకా చాలా మంది ఉన్నారు తెలుసు సాహిత్యవికాసానికి కృషి సలిపిన వారు. మగ్దూం మొహియుద్దిన్ , నార్ల వెంకటేశ్వర రావు, రోణంకి అప్పలస్వామి, చక్రపాణి, మహీధర రామమోహన రావు లాంటి సాహితి వేత్తలను గూడా ఒక్కసారి స్మరించుకుంటే బాగుంటుంది! ఇక సుంకర సత్యనారాయణ (౨౩-౦౩-౧౯౦౯ – ౦౯-౦౯-౧౯౭౫) నీ కూడ ఈ తరం వారికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

Leave a Reply to gaddeswarup Cancel