నాట్స్ సంబరాల స్రవంతి – రచనల పోటీలు

వివరాలు పంపినది: రవి వీరెల్లి
*****
డాలస్ లో జూలై 4,5,6 తేదీల్లో జరుగనున్న నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) తృతీయ సంబరాల సందర్భంగా ప్రచురించే “సంబరాల స్రవంతి” ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితల నుండి వివిధ సాహితీ ప్రక్రియల్లో రచనలు ఆహ్వానిస్తున్నాం.

ప్రత్యేక సంచిక ముఖ్య ఉద్దేశ్యం: “భాషే రమ్యం – సేవే గమ్యం” అన్న ధ్యేయంతో పని చేసే సంస్థ నాట్స్. అత్యంత వైభవంగా జరగబోయే “సంబరాలు” మిగిల్చే మధుర స్మృతులకి, జ్ఞాపకాలకీ ప్రతీకగా నిలిచిపోయే ఒక మంచి గ్రంథం – ఈ నాట్స్ సంబరాల ప్రత్యేక సంచిక. ఎన్ని కాలాలు మారినా, తరాలు మారినా , మన భాష , సాహిత్యం, సంస్కృతీ, సంప్రదాయాలు, సతతం కొత్త పుంతలు తొక్కుతూ, నిరంతర జీవనదిలా, సాగిపోతూ ఉంటాయి. మన చరితలోని చైతన్యాన్ని తీసుకొని, నవతరంగాల ఊపుతో ఎప్పుడూ భవితవైపు సాగే తెలుగు భాషా సాహిత్య సంస్కృతీ స్రవంతి.

మన “చరిత”, “నవత” మరియు “భవిత” అని మూడు తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని , సమాజ, ఆచార వ్యవహార స్థితిగతుల్ని , సాహిత్య ధోరణుల వైవిధ్యమైన వర్ణాలకి అద్దం పడుతూ..వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగువైభవపు త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే ప్రయత్నమే ఈ “నాట్స్ సంబరాల స్రవంతి”.

చరిత (50 నిండిన యువత), నవత (యాభై నిండని యువత), భవిత (పద్దెమినిది దాటని పెద్దలు) – మూడు తరాల రచయితల నుంచి ఈ క్రింది విభాగాలలో రచనలు ఆహ్వానిస్తున్నాం: 

1. కథలు
2. కవిత్వం (వచన కవిత్వం)
3. ఛందోబద్ధమైన పద్యకవిత్వం
4. ఫోటో కవిత
5. వ్యాసాలు/గల్పికలు/వ్యంగ రచనలు/ఛలోక్తులు/లేఖలు/పేరడీలు
6. నాటికలు
7. కార్టూన్స్
8. చిత్రకళ

పోటీల నిబంధనలు, రచయితలకు సూచనలు (Competition Rules & Guidelines):

·రచయితలు పైన పేర్కొన్న ఏ విభాగానికైనా తమకు నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును. మూడు తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని ప్రతిబింబిస్తూ రాసే రచనలకు పెద్దపీట వేయబడుతుంది.

·ఉత్తమ రచనలకు $116 బహుమతితో పాటు నాట్స్ జ్ఞాపిక అందజేయబడుతుంది. బహుమతి ప్రధానం నాట్స్ తృతీయ సంబరాలు వార్షికోత్సవ సభలలో జూలై 5,6 తేదీలలో, డల్లాస్ లో సాహిత్య సభా వేదిక పై జరుగుతుంది.

·బహుమతి పొందిన రచనలు, సాధారణ ప్రచురణకు ఎంపిక చేయబడిన రచనలను నాట్స్ తృతీయ సంబరాలు ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది.

·ఒకవేళ మీ వయస్సు 18 సంవత్సరముల లోపు ఉన్నట్టయితే, మిమ్మల్ని నవతరం పోటీ క్రింద పరిగణిస్తూ, ప్రత్యేక బహుమతులు ఉంటాయి.

·రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ మే 24, 2013. ఈ తేదీలోపు కంటే ముందే, వీలైనంత త్వరగా పంపగలిగితే మరీ మంచిది.

·కథలు, నాటికలు: కథల/నాటికల నిడివి వ్రాత ప్రతిలో పది పేజీల లోపు, టైపింగ్ లో ఐదు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

·కవిత్వం: కవిత వ్రాత ప్రతిలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది. ఆదునిక కవిత, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.

·వ్యాసాలు, గల్పికలు, వ్యంగ రచనలు, ఛలోక్తులు, లేఖలు: వ్రాత ప్రతిలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

·కార్టూన్స్, చిత్రకళ: చిత్రాలను JPEG or PNG ఫార్మాట్స్ లో ఈమెయిలు చేయగలరు.

·పేరడీలు: వ్రాత ప్రతిలో రెండు పేజీల లోపు, టైపింగ్ లోఒక పేజీ లోపు ఉంటే బావుంటుంది.

·రచయితల యొక్క అముద్రిత స్వీయ రచనలు మాత్రమే స్వీకరించబడతాయి. అనువాదాలు, అనుసరణలు, అనుకరణలు అంగీకరించబడవు. బ్లాగులు, వెబ్ సైట్స్, వెబ్ పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించబడ్డ రచనలు పరిగణింపబడవు.

·రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. కాని, రచయితలు తమ రచనలను సంబరాల స్రవంతి సంచిక లో ప్రచురించే లోపు ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.

·రచనల్ని యూనికోడ్ ఫాంట్స్ లో పంపాలి. ఒకవేళ మీకు యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపించవచ్చు. దయచేసి వీలైనంత వరకు యూనికోడ్ లో టైప్ చేసి పంపించగలరని కోరుతున్నాం. రచననుఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు. రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్కు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.

·ఫోటో కవిత ఈ ఈమెయిలుకు జోడించిన ఫోటో ఆధారముగా వ్రాయవలసి ఉంటుంది.

·కనీసం ముగ్గురు న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు. న్యాయనిర్ణయం అంతా తగిన నిబద్ధత, కొలబద్దల ఆధారoగానే జరుగుతుంది. విజేతల నిర్ధారణలో అన్ని విషయాలలోనూ నిర్వాహకులదే అంతిమ నిర్ణయం. ఉత్తర ప్రత్యుత్తరములకు తావు లేదు.

·రచనలు పంపవలసిన ఈమెయిలు: nats.sravanthi@gmail.com. ఈమెయిలు లో మీ పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, చిరునామా తెలియచేయగలరు.

You Might Also Like

Leave a Reply