నగ్మే, కిస్సే, బాతే, యాదే: ఆనంద్ బక్షి జీవితం, పాటలు

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

***************

మూలంః రాకేష్ ఆనంద్ బక్షి

అనువాదంః కొల్లూరి సోమశంకర్

పుడుతూనే మనిషి లౌకిక ప్రపంచపు ధ్వనులకు, శబ్దాలకు అలవాటు పడతాడు. ఆయా శబ్దాలు మాటలుగా, పాటలుగా క్రమంగా అతని జీవితంలో భాగమైపోతాయి. అర్థం కాని వయసులోనూ అమ్మ జోలపాట బిడ్డకు సాంత్వననిస్తుంది. ఒక హాయిని, ఉపశమనాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అది మొదలుగా తనను ఆహ్లదపరచే అంశాల్లో పాట ఒకటవుతుంది. ఏమీ తెలియని పాపాయిలూ, పశువులూ కూడా పాటకు, సంగీతానికి తన్మయులు అవుతారు. పాటకు భాషాబేధం లేదు. ఎలాటి నియమాలూ కూడా ఉండనక్కరలేదేమో, వినసొంపుగా ఒక లయతో కదిలే భావ ప్రవాహం వినికిడిని ఆకట్టుకుంటుంది.

పాట అంటే చిన్ననాటి నుంచీ కలవరించి, ప్రేమించి, తన జీవితమే పాట అని నమ్మి, ఎలాటి భయసంకోచాలకీ లోనవకుండా బ్రతుకు తెరువును కూడా వదులుకుని జీవితాన్ని పణంగా పెట్టిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. విధి అనేది ఒకటి ఉంటుందని తెలిసీ, తన చేతలద్వారా మాత్రమే దానిని ఎదుర్కోవాలని కృతనిశ్చయుడైన ఒక అమాయక బాలుడి పాట కథ ఇది. 

మనలో చాలామందికి సంగీతం అంటే ఇష్టం ఉంటుంది. అది శ్రుతి, రాగం, తాళం వంటి వాటి మధ్య ఒదిగే శాస్త్రీయ్తమైన సంగీతమే కానక్కరలేదు. మనసుకున్న అన్ని భావోద్వేగాలనూ పంచి ఇవ్వగలిగే పాట ఏదైనా చాలు.

హిందీ సినిమాలు, పాటలు తెలిసిన వారెవరికైనా ఆనంద్ బక్షిపేరు ప్రముఖంగా తెలిసే ఉంటుంది. వారి కుమారుడు రాకేష్ ఆనంద్ తన తండ్రి గురించి రాసిన పుస్తకం ఇటీవల తెలుగులో అనువాదమైంది. ఆనంద్ బక్షి జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను, ఒంటరితనాన్ని, భయసందేహాలను, ప్రేమను, విజయాలను అన్నింటినీ ఆసక్తికరంగా చెప్పిన పుస్తకం నగ్మే, కిస్సే, బాతే, యాదే – ఆనంద్ బక్షి జీవితం, పాటలు.

పంజాబ్ (రావల్పిండి) లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆనంద్ బక్షి! అంటే ఆనందం కానుకగా లభించినవాడు. బక్షి ఆడంబరాలు లేని నిజాయితీపరుడంటారు ముందుమాటలో సలీమ్ ఖాన్. తండ్రి మరణించిన పందొమ్మిది సంవత్సరాల తరువాత ఆయన అసమాన వ్యక్తి జీవితాన్ని ప్రపంచానికి వెల్లడించే ప్రయత్నంగా తన సోదరుడు రాకేష్ ఈ పుస్తకాన్ని తెచ్చారంటారు బక్షి పెద్ద కుమార్తె సుమన్.

డైరీ రాసుకునే అలవాటున్న తన తండ్రి ప్రతి డైరీ మొదటి పేజీలోనూ రాసుకునే వాక్యాలను మొదటి పేజీల్లో రాకేష్ చెప్పారుః

నేను దివ్య కాంతి, దైవిక శక్తి యొక్క జీవిని. విశ్వం అందించే ప్రతిదానికీ నాకు ప్రాప్యత ఉంది. నేను ఎప్పుడైనా నాకు కావలసినది తీసుకోగలను లేదా చేయగలను. నా స్థితిగతులకంటే ఉన్నతమైనది, జీవితంలోని ఏ పరిస్థితికన్నా బలమైనది నాలో ఏదో ఉంది.

ఆనంద్ బక్షి జీవిత చరిత్రను రచించినది వారి కుమారుడే కావటం ఈ జీవిత చరిత్ర ప్రాధాన్యతను ఇనుమడింపజేస్తుంది అంటారు కస్తూరి మురళీకృష్ణ.

ఈ అనువాదం సంచిక వారపత్రికలో ముఫ్ఫై ఆరువారాల పాటు సీరియల్ గా వచ్చిందని చెపుతూ అనువాదకులు కొల్లూరి సోమశంకర్ తనకు ఆనంద్ బక్షి నచ్చటానికి గల కారణాలు నిరాడంబరత, క్రమశిక్షణ, తన బలహీనతలు తెలిసి ఉండటం, బలహీనతలనే బలంగా మార్చుకోవటం, సద్విమర్శలను స్వీకరించి పొరబాట్లు దిద్దుకోవటం, ఎదుటివారికి గౌరవమివ్వటం అని చెప్పారు. 

ఈ పుస్తకం రాయడం వల్ల తాను తన తోబుట్టువులకు దగ్గరయ్యానని, మళ్లీ నాన్నతో ప్రేమలో పడ్డానని రచయిత రాకేష్ ముందుమాటగా చెప్పారు.

రావల్పిండిలో ఆనంద్ తాతగారు పంజాబ్ జైళ్ల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉండేవారు. వారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో అక్టోబర్ రెండవ తేదీన ఆ కుటుంబం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారతదేశానికి శరణార్థులుగా వలస వచ్చారు. దానికి కారణం అంతకు కొన్ని వారాల క్రితం రాడ్ క్లిఫ్ లైన్ ద్వారా భారత ఉపఖండం ఏకపక్షంగా విభజించబడటం, అనంతరం జరిగిన మతకల్లోలాలు. తమ విలువైన వస్తువులతో సరిహద్దు దాటిన ఆ కుటుంబం పదిహేడేళ్ల ఆనంద్ తన కూడా తెచ్చిన విలువైన వస్తువును చూసి హర్షించలేదు. కారణం అది ఆనంద్ తల్లి ఫోటో మాత్రమే కావటం. ఆరేళ్ల వయసులో ఆనంద్ తాను పోగొట్టుకున్న తల్లిప్రేమ తాలూకూ దుఃఖం తాను ఒంటరివాడినన్న ఒక భయాన్ని పెంచి పోషించి,జీవితాంతం వెంటాడింది. నానమ్మ ప్రేమలో పెరిగిన ఆనంద్ ఆమెను ఎంతగా ప్రేమించినప్పటికీతన స్వంత తల్లి బ్రతికి ఉంటే బావుండేది అని కోరుకునేవాడు. నానమ్మ చెప్పినట్టుగా ఆడపిల్లలు తండ్రులకు అదృష్టాన్ని తెస్తారని నమ్మాడు. ఆ ప్రభవంతోనే మొదటి కూతురు పుట్టాక సైన్యంలోంచి బయటకు వచ్చి బొంబాయి హిందీ సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

తల్లి గురించి, అమ్మా, నువ్వు దేవతవి కాదు, కానీ దేవత కంటే తక్కువా కాదు అని తన తల్లిని, తన పిల్లల తల్లిని కూడా ప్రశంసిస్తూఅనేవాడు ఆనంద్. తన పిల్లలను ప్రేమించే ఉత్తమ మార్గం వాళ్ల తల్లిని ప్రేమించడమేనన్న నానమ్మ మాటలు ఆయనకు సదా జ్ఞాపకం ఉన్నాయి. అంతేకాక శరణార్థులుగా కొత్తజీవితం మొదలు పెట్టాక భారతదేశంలో కొత్త వ్యక్తులకు, సంబంధాలకు, కొత్త ఆచారాలకు అలవాటు పడతామని, భయపడనక్కరలేదన్న ఆనంద్ నానమ్మ చెప్పిన్బ మాటలు విలువైనవి. 

రావల్పిండిలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న ఆనంద్ చిన్న వయసులోనే రాయల్ ఇండియన్ నేవీలో చేరారు. 

సినిమా పాటల పట్ల తనకున్న ప్రేమ, బాంజో వాయించటం, పాడటం అన్న అభిరుచితో తాను గేయ రచయితనయ్యానని చెప్పే ఆనంద్ తన చిన్ననాటి నుంచే తన పాటలతో, కవిత్వంతో తోటివారిని, స్నేహితులను ఆనందపరిచి ఆకర్షిస్తూ ఉండేవాడు. సరళమైన రోజూవారీ హిందీ పదాలను ఉపయోగించి సమర్థవంతంగా పాటలు రాయటం వెనుక ఉన్న ప్రతిభ గురించి అడిగితే తాను పెద్దగా చదువుకోలేదని, పెద్దగా హిందీ పదజాలం తెలియదని, భావాలను వ్యక్తపరచేందుకు అవసరమైన తనకున్న పరిమిత పదజాలమే ఉపయోగపడిందని నిజాయితీగా చెప్పుకున్న గేయ రచయిత ఆనంద్. రావల్పిండిలో మెట్రిక్యులేషన్ తరువాత నానమ్మ తో కలిసి ఉండచ్చని లాహోర్ వెళ్లిన ఆనంద్ అప్పటికే సినిమాలకి పాటలు రాయాలన్న సంకల్పంతో ప్రయత్నాలు చెయ్యబోయాడు, కానీ మార్గం తెలియలేదు. నాటక ప్రదర్శనలిచ్చే తన స్నేహితులతో ఇంట్లోంచి బొంబాయి పారిపోయే ప్రయత్నాన్ని పదమూడు, పధ్నాలుగు సంవత్సరాల వయసులోనే చేసాడు కానీ స్నేహితులు రైలు సమయానికి రాకపోవటంతో ఇంటిదారి పట్టక తప్పలేదు మన హీరోకి. తల్లి మరణం తరువాత తండ్రి తిరిగి పెళ్లి చేసుకున్నా సవతితల్లి నుంచి, తండ్రి నుంచి, ఉమ్మడి కుటుంబంలోని కజిన్స్ నుంచి ఎలాటి ప్రేమనూ ఆనంద్ పొందలేదు. 

చిన్నతనంలో తాను కోల్పోయిన తల్లి, పిండికి దూరమవటం తనకి జరిగిన నష్టాలుగా భావించాడు. తిరిగి నాటకాల్లోకి మళ్లకుండా ఆనంద్ ని పధ్నాలుగు సంవత్సరాల వయసులో కరాచీ హార్బర్ లోని రాయల్ ఇండియన్ నేవీలో సాయుధ దళాలలో భారతదేశానికి సేవ చెయ్యాలని ఇంటిపెద్దలు చేర్చారు. అది తమ మొహియాల్ వంశపారంపర్య విధానమని పెద్దలు నమ్మారు. 

1944లో ఆనంద్ ప్రకాష్ పేరుతో నంద్ ర్యాంక్ బాయ్1 రేటింగ్ తో చేరాడు. 1946 వరకు కరాచీలో సేవలందించాక హెచ్. ఎం. ఐ. ఎస్. బహదూర్ కు బదిలీ చేసారు. అది కరాచీ నౌకశ్రయానికి దక్షిణంగా ఉన్న చిన్న ద్వీపకల్పం మనోరాలో ఒడ్డున ఉన్న బాలుర శిక్షణా సంస్థ. మిలటరీ తరహాలో కఠినమైన క్రమశిక్షణ అక్కడ అమలయ్యేది. తన ఓడ బొంబాయి తీరానికి వెళ్తుందన్న ఆశతో ఆనంద్ ఉన్నప్పటికీ ఆయనను పోస్ట్ చేసిన నౌకలు కరాచీని వదిలిపెట్టనేలేదు.

బెంగాలీ కుర్రవాడి నాయకత్వంలో ఒకసారి అతని సహచరులు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేసే ప్రయత్నం జరిగింది. తిరుగుబాటు జరిగిన ఓడలోకి చేరేందుకు తనకా బెంగాలీ తెలుసునని, మాట్లాడతానని చెప్పి ఓడ మారిన ఆనంద్ బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు మొదలెట్టాడు. అంత చిన్న వయసులో అరెస్టు చేసి జైలుకి పంపితే ఆనంద్ భవిష్యత్తు లేకుండా పోతుందని బ్రిటిష్ కమాండింగ్ ఆఫీసర్ ఎ.సి. మూర్ ఆనంద్ ని సర్వీసు నుంచి 1946లో సర్వీస్ నుంచి డిస్మిస్ చేసారు. మైనర్ నావల్ క్యాడెట్ ను శిక్షించకుండా వదిలివెయ్యటం వారి దయకు, విజ్ఞతకు నిదర్శనమని ఆనంద్ నమ్మారు. డిస్మిస్ అయి ఇంటికొచ్చాక ఇంట్లోని వారికి తెలియకుండా రావల్పిండిలోని రోజ్ థియేటర్ లో పని చేస్తూ రోజూ సినిమాలు చూస్తూ పాటలు వింటూండేవాడు. ఇంట్లో పెద్దలు ఉద్యోగానికి వెళ్లిపోయాక ఇంటి సందులో గంటల తరబడి పంజాబీ జానపద, సినిమా పాటలు పాడుతూ గడిపే ఆనంద్ బాటసారులైన తన శ్రోతల అభినందనలూ అందుకునేవాడు.

సినిమా థియేటర్ లో పదేపదే చూసే సినిమా యక్షన్, పాటలు ద్వారానే సినిమా దృశ్యాలు, కథ, పాత్రలతో అనుసంధానించబడి ఉన్నాయన్నది అవగాహనకి తెచ్చుకున్నాడు. అది ముందుముందు సినీ గేయ రచయితగా ఆయనకు మార్గదర్శకమైంది. ఆ తరువాత రెండు దశాబ్దాలకు సంగీత దర్శకుడు ఎస్. డి. బర్మన్ బక్షీ, సినిమా కథని జాగ్రత్తగా వినండి. పాటలు కథలోనే ఉన్నాయి అని చెప్పేవారని, తన పాటల్లో సినిమా కథ మొత్తం నాలుగు కవితల్లోకి కుదించబడేలా రాసేవాడినని ఆనంద్ చెప్పారు. 

ఫిబ్రవరి 2002 లో తన మరణానికి ముందు సింధ్ నుంచి శరణార్థిగా వచ్చిన ప్రియ స్నేహితుడు శ్యాం కేశ్వానీతో పిండిని సందర్శించేందుకు వేసుకున్న పణాళిక సాధ్యం కాలేదు. ఆయన పాటలు సరిహద్దులకు అతీతంగా చిరస్థాయిగా నిలిచాయి. 

చిన్న వయసులో జరిగిన విషాదాలన్నీ అనుభవించి ఆపైన స్వయం కృషితో మంచి రోజులు చూసాడు ఆనంద్.

పదిహేడేళ్ల వయసులో ఇండియన్ ఆర్మీ, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ శిక్షణాకేంద్రంలో సిగ్నల్ మ్యాన్ గా చేరారు. విరామ సమయంలో స్వంత నజ్మ్ లను రాసుకుని, సహచరుల ముందు పాడి ప్రశంసలను పొందేవాడు. బర్సాత్ సినిమా ఇరవై సార్లు చూసి ఆ పాటలను తన మాటల్లో తిరిగి రాసుకున్నాడు. యూనిట్లలోని సీనియర్లు కూడా అతడిని ప్రోత్సాహపరచేవారు.

తాను ఉర్దూలో చదువుకోవటంతో సినీగేయ రచయితగా తొలినాళ్లలో ఉర్దూ పదాలను ఎక్కువగా ఉపయోగించినా రానురాను సామాన్యుడికి అర్థమయే మామూలు హిందీ మాటలను వాడుతూ ప్రజల కవి అయ్యాడు. 1949లో స్విచ్ బోర్డ్ ఆపరేటర్ గా పదోన్నతి కలిగింది. సహచరులు, సీనియర్లు ప్రోత్సాహంతో సైన్యం వదిలి బొంబాయి చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకుందుకు సైన్యం నుంచి రాజీనామా చేసాడు. కుటుంబ సభ్యులు అతని పనికి ఆందోళన చెందారు. విధి కంటే తన చర్యలనే నమ్మి వేసిన సాహసపూరితమైన అడుగు ఇది. 1950లో దాచుకున్న మూడు, నాలుగు వందల రూపాయలతో దాదర్ చేరారు. ఆరేడు నెలల అనంతరం బొంబాయి వదిలి దిల్లీ తిరిగొచ్చారు. ఆకాశవాణిలో వాయిస్ టెస్ట్కి హాజరై విఫలమయ్యారు. తిరిగి సైన్యంలో చేరాలా అన్న ఆలోచన చేసారు. 1951 లో తిరిగి జబల్పూర్ డివిజన్లో రెండవసారి సిగ్నల్స్ కార్ప్స్ లో శిక్షణ పొంది, 1953 నాటికి ఎలక్ట్రీషియన్ గా అర్హత సాధించారు.ఈ సమయంలో ఒక రైలు ప్రయాణ సందర్భంలో ఆనంద్ కు ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. పాఠకుడు చదివి తెల్సుకోవలసినదే అది. 

సుబేదార్ అమర్ సింగ్ మోహన్ కుటుంబం కూడా రావల్పిండి నుంచి 1947లో శరణార్థులుగా వచ్చినవారు. ఆనంద్ మేనత్త కు బంధువులు. ఆమె ద్వారా అమర్ సింగ్ చిన్న కుమార్తెతో ఆనంద్ వివాహం నిశ్చయమైంది. 1954లో వివాహం జరిగింది. 

సైన్యంలో ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా రైళ్లలో మాత్రమే ప్రయాణించటంతో సైన్యం, భారతీయ రైల్వేలు తనకు సమయం విలువను, నిబద్ధతను నేర్పాయని చెపుతాడు ఆనంద్. సినీరంగంలో ప్రవేశించాక అక్కడి సీనియర్లకు, నిర్మాతలకు, దర్శకులకు గౌరవం ఇచ్చేందుకు ఆ విలువలు ఆదర్శంలా పనిచేసాయట. కెప్టెన్ వర్మ సిఫార్స్ తో రెండవసారి 1956లో సైన్యం నుంచి స్వచందంగా పదవీవిరమణ చేసి సినిమా ప్రయత్నాలకు బొంబాయి చేరిన ఆనంద్ కు అప్పటికి తొలి బిడ్ద పుట్టింది. తన పదవీ విరమణ హర్షించని ఉమ్మడికుటుంబ సభ్యులు తన భార్యను, బిడ్దను సక్రమంగా చూసుకోరన్న ఆలోచనతో అత్తవారింట వారిని వదిలి ఆనంద్ బొంబాయి చేరారు.

నెలలుగా ప్రయత్నించి కనీసం టాక్సీ డ్రైవర్ గా కూడా పని దొరకనప్పుడు రంజిత్ స్టూడియోలో నటుడు భగవాన్ ను కలిసి తన తొలి అవకాశాన్ని భలా ఆద్మీ చిత్రం ద్వారా పొందారు ఆనంద్. అంతటితో కష్టాలు తీరలేదు. రెండేళ్ల వరకూ ఆ సినిమా విడుదల కాలేదు. మామగారు అప్పుడప్పుడు ఆనంద్ ఆర్థిక పరిస్థితి చూసి డబ్బు సమకూర్చినా, భార్యాబిడ్దల్ని పుట్టింట్లో వదిలి బాధ్యతారహితంగా జీవిస్తున్న అల్లుడికి ఉత్తరాల ద్వారా తన నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. 1965 లో జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాతో ఆనంద్ కు విజయం దొరికింది. ఆ సమయంలో నిరాశతో ఇంటి దారి పట్టేందుకు మెరైన్ లైన్స్ స్టేషన్ లో కూర్చున్నప్పుడు ఒక అరుదైన సంఘటన జరిగి ఆనంద్ జీవితంలో తిరిగి ఆశలకు ఊపిరిలూదింది. జీవితాంతం తోడొచ్చిన అత్యుత్తమమైన అనుభవం!

ఆనంద్ భార్య తన ఖర్చులకోసం టైలరింగ్ క్లాసుల్లో చేరింది. నాలుగేళ్ల తరువాత భార్యాబిడ్డల్ని చూసేందుకు వెళ్లిన ఆనంద్ కు నిరసన ఎదురైంది,

క్రమంగా సినీరంగంలో కాళ్లూని ఎందరో ప్రముఖులతో కలిసి పనిచేసి, విజయవంతమైన సినీగేయ రచయితగా పేరుపొందారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చదివే పాఠకుడికి ఏమీ మిగల్చనేమోనన్న సంశయం కలుగుతోంది. ఇంకొక్క అరుదైన అనుభవం చెప్పి విరమించి తీరాలి. 

ఒకరోజు బొంబాయి నుంచి దిల్లీకి ఫ్రాంటియర్ మెయిల్ లో ప్రయాణిస్తున్నాడు ఆనంద్. తెలవారుఝామున రెండు లేదా మూడు గంటలకు రైలు ఒక మారుమూల గ్రామంలో కిరోసిన్ దీపాలతో వెలుగుతున్న స్టేషన్ లో ఆగింది. ఆ చల్లని, శీతాకాలపు ప్రశాంతమైన రాత్రి తాను రాసిన హిట్ పాట మిలన్ సినిమాలోని సావన్ కా మహీనా పవన్ కరే సోర్ పాటను స్టేషన్ ప్లాట్ ఫాం అంచున ఉన్న ఒక మర్రిచెట్టు కింద కూర్చుని ఒక ఫకీర్ పాడుతున్నాడు. అతనొక భిక్షాటన చేసుకునే వ్యక్తి. అతనికి ఒక పూట భోజనం పొందేందుకు సాయపడుతోందాపాట. ఎలాటి ప్రచారం, మార్కెటింగ్ లెకుండానే ఆ పాట అలా జనాల్లోకి ఆ మారుమూలకి చేరటం ఆనంద్ ను విహ్వలుడిని చేసింది.

ఇలా ఈ సినీగేయ రచయిత తాను కలలు కన్న జీవితాన్ని చేజిక్కించుకునే క్రమంలో ఎదుర్కొన్న అనేకానేక సమస్యలు పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

పాట రాసేటప్పుడు తనలో తాను కూనిరాగాలు తీస్తూ రాసే అలవాటు ఈ గాయక రచయితది. అది తన కవిత్వంలోనూ, పాటలోనూ ఒక ఛందస్సును అందించిందంటాడు. ట్యూన్ బావుంటే పదాలను పట్టించుకోరని, తన పాటల్లో పంజాబీ పదాలను చాలానే వాడానంటాడు. తనకు అందే కన్వేయన్స్ అలవెన్స్ ను తన కోసం కాక ఆర్థిక అవసరాలున్న తనవారికి అందించే గొప్ప గుణం ఉన్నవాడు! 

జీవితాంతం ప్రతి కొత్తపాట రాసే సమయంలో తాను రాయగలనా లేనా అన్న భయం తనను వెంటాడుతూనే ఉందంటాడు. ఇన్ని భయ సందేహాల మధ్య తాను గాలివాటుగా విజయవంతమైన కవిగా మాత్రం మిగలకూడదన్నది అతని అభిమతం. తన జీవితానుభవాలు అందించిన తాత్త్వికతతోనూ, అనుభవంతోనూ అన్నివయస్సుల్లోనూ, అన్ని తరహా పాటలకూ ప్రాణం పోసాడు. 

పంచగనిలో ఆనంద్ కట్టుకున్న ఇంటి పొరుగువ్యక్తితో జరిగిన సంభాషణ, ఒక ఆదాయపు పన్ను అధికారి ఇంట జరిగిన సంఘటన ఆనంద్ ముక్కుసూటితనం చెపుతాయి. ఐదు దశాబ్దాల కాలంలో 630 చిత్రలకు 3300 పాటలను రాసిన ఆనంద్ ఎన్నో తరాలతో కలిసి పనిచేసారు.

పుస్తకంలో ఎందరో ప్రముఖులు ఆనంద్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

కిళ్లీ నమలటం, సిగరెట్ త్రాగటం వంటి అలవాట్లను వదల్లేని బలహీనతకు అనారోగ్యం పాలై 72 సంవత్సరాల వయసులో ఆనంద్ మరణించారు. విజయపథంలో నడక మొదలైన తరువాత తన లక్ష్యం తన కుటుంబ శ్రేయస్సే అని దానికోసం తాను మరింతగా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించి, విజయవంతమవాలని కోరుకున్న ఆనంద్ దానిని సాధించారు. పుస్తకంలో ఆనంద్ చిన్ననాటి నలుపు, తెలుపు చిత్రాలున్నాయి. పుస్తకం ముఖచిత్రం ఆకర్షణీయంగా (కర్టెసీః ఫిల్మ్ ఫేర్) ఉంది.

పుస్తకం పొడవునా ఎన్నో విజయవంతమైన సినిమాలు, ఆనంద్ రాసిన పాటలు ఉన్నాయి. అవి చదువుతూ ఆ పాటల్లోకి ప్రయాణించే పాఠకుడికి ఈ పుస్తకం ఒక అందమైన అనుభవం. కానీ,

పుస్తకంలో దాదాపు అన్ని విషయాలూ కూడా అనేకమార్లు చెప్పారు. చదివిన సంగతులే మళ్లీ మళ్లీ చదవాల్సి రావటం, వాక్యాల్లో కూడా పునరుక్తి బారిన పడిన అనేక పదాలు పాఠకుడికి భరించలేని విసుగును కలిగిస్తాయి. అంతేకాక 164 పేజీ తరువాత పేజీ నంబర్లు వరుసలో లేవు. 165,166,169,172,173,176 పేజీలు అసలు లేనేలేవు. ఈ అంతరాయం పాఠకుడి కి నిరాశను ఇస్తుంది. 

ఇంత మంచి ప్రయత్నం మరికొంత సమయం తీసుకుని, అవసరమైన (చాలా ఉంది) ఎడిటింగ్ తో చేసి ఉంటే పుస్తకం మరిన్ని తక్కువ పేజీలతో చిక్కదనాన్ని, బిగువును పొంది ఉండేది. హిందీ మూలంలో ఇదే విధంగా ఉన్నప్పటికీ రచయిత నుంచి అనుమతి తీసుకోవచ్చునేమో!

ఒక మధురమైన పాటలా సాగిపోవలసిన పఠనానుభవం పాఠకుడికి దక్కలేదు.

రెండవ ముద్రణలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోగలరని ఆశిద్దాం.

మిలన్, ఆరాధన సినిమాలలోని పాటల నుంచీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, తాళ్ సినిమాల వరకూ, ఇంకా 2002 లో తన మరణానికి ముందు మొహబ్బతే, గదర్ః ఏక్ ప్రేమ్ కహానీ సినిమాలకూ అత్యుత్తమ పాటలను రాసి, హిందీ పాటల అభిమానులందర్నీ ఎంతగానో అలరించిన ఆనంద్ బక్షి మన మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సున్నితమనస్కుడైన కవి. జీవితంలో అడుగడుగునా ఒంటరివాడినన్న భయ సంకోచాలతో జీవించినా, రాజీపడక తన కోరికలకు, నమ్మకాలకు తగినట్టుగానే జీవించాడు.

తన మరణానంతరం తన జీవితగాధను రాయాలనుకుంటే వెంటనే ఆ పని చెయ్యవద్దని, దానికంటే ముందు తనను తాను విజయవంతంగా రచయితగా నిరూపించుకున్న తరువాత మాత్రమే రాయమని రచయిత, కుమారుడు అయిన రాకేష్ బక్షికి ఆనంద్ సలహా చెప్పాడు. తండ్రి మాటపై ముందుగా రాకేష్ డైరెక్టర్స్ డైరీస్ః ది రోడ్ టు దెయిర్ ఫస్ట్ ఫిల్మ్ అన్న పుస్తకాన్ని రాసి, ప్రచురించాడు.

ఆనంద్ బక్షిని తెలుగువారికి అందించే చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి.

ప్రచురణః సాహితి ప్రచురణ, July 2026

ధరః రూ. 2౦౦/-

You Might Also Like

One Comment

  1. kolluri soma sankar

    నమస్తే మేడమ్,
    ఆనంద్ బక్షి పుస్తకంపై నిష్పాక్షిక సమీక్ష వ్రాసినందుకు ధన్యవాదాలు.
    అయితే పుస్తకంలోని పేజీలన్నీ సరిగానే ఉన్నాయి.
    బహుశా మీకు పంపిన కాపీలో ఏమైనా మిస్ అయ్యాయేమో. నా దగ్గర ఉన్న ఇతర ప్రతులలో పేజీలు మిస్ అవలేదు.
    ధన్యవాదాలు
    సోమ శంకర్ కొల్లూరి

Leave a Reply