పుస్తకం
All about booksపుస్తకభాష

May 15, 2014

అమృతవల్లి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి.శ్రీవల్లీ రాధిక
***********

ఇది ఏడవ నవల. ఆరవ నవల అయిన అశ్వమేథము శుంగ వంశపు రాజైన పుష్యమిత్రుడు రాజ్యానికి వచ్చిన కథని చెప్తుంది. ఈ శుంగవంశపు రాజులు పదిమంది. వారిలో చివరి రాజు దేవభూతి. అతనికే క్షేమభూతి అనే పేరు కూడా వుంది.

ఈ క్షేమభూతి కాముకుడై రాజ్యాన్ని మంత్రులకి అప్పగించి దుష్టముగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన మంత్రి వాసుదేవుడు. ఈ వాసుదేవుడు కాణ్వాయన బ్రాహ్మణ వంశమునకు చెందినవాడు. ఈ కథ కలియుగ రాజవృత్తాంతములో, భాగవతంలో వుంది. దానికి కొంత కల్పన జోడించి ఈ నవల వ్రాశారట విశ్వనాథ సత్యనారాయణగారు.

దేవభూతి తన మంత్రి అయిన వాసుదేవుని కూతురు అందగత్తె అని విని, ఆమెను నమ్మకము మీద పిలిపించి, ఆమె భర్తను చంపించి, ఆమె భర్త వేషమును తాను వేసుకుని ఆమె వద్దకు పోవడం, ఆమె అతనిని నిరాకరించడం, అతడు బెదిరించగా ప్రాణాలు వదలడం జరుగుతుంది. ఆ వార్త విన్న వాసుదేవుడు దుఃఖించి, రాజు మీదకి విషకన్యను ప్రయోగించి రాజును చంపుతాడు. – ఇది కథ.

కథలోని విషాంగన వారాంగన. ఈ నవలలోని విషాంగన ఈ కథలోని నాయిక అయిన అమృతవల్లి. ఆమె కూడా బ్రాహ్మణ స్త్ర్రీయే.

ఈ విషయమంతా పీఠికలోనే వివరించబడుతుంది. నవల శ్రీమాలి, అమృతవల్లి అనే ఇద్దరు స్నేహితురాళ్ళ మాటలతో ప్రారంభమవుతుంది. శ్రీమాలి తండ్రి వాసుదేవుడు కోసల రాజ్యమునుండి వచ్చాడు. అమృతవల్లి తండ్రి హరిసేనుడు మిథిల నుండి వచ్చాడు. వాసుదేవుడు మగధరాజ్యానికి మహాసేనాధిపతి. హరిసేనుడు ఒక చిన్న ప్రభువు.

ఈ స్నేహితురాళ్ళు ఇద్దరూ అక్కచెల్లెళ్ళు కాకపోయినా చూడటానికి ఒకేలా వుంటారు. కానీ రూపంలో ఎంత సామ్యమున్నా మనసులలో చాలా భేదం వుంది. అది వారి ప్రవర్తనలో కనిపిస్తూనే వుంటుంది. ఒకరు లేడి అయితే మరొకరు చిరుతపులి. వీళ్ళని గురించిన ఈ పరిశీలన విదురుడు అనే వృద్ధునిది. అతడు గిరివ్రజపురంలో వుండే ఒక శూద్ర వృద్ధుడు. పిల్లలంటే అతనికి ముద్దు. ఎప్పుడూ ఎందరో పిల్లలు అతని చుట్టూ చేరి అతను చెప్పే కథలు, కబుర్లూ వింటూ వుంటారు. అతని తమ్ముడు జయద్రథుడు. ఆ అన్నదమ్ములిద్దరూ కూడా భిన్న ధ్రువాలు. నవలలో జయద్రథుడు నేరుగా మనకి పరిచయం కాడు. ఇతరుల సంభాషణల ద్వారానే చెప్పబడతాడు. ఆ జయద్రథుడి దగ్గరకి శ్రీమాలి ఎక్కువగా వెళ్ళదు కానీ అమృతవల్లి వెళ్తూ వుంటుంది.

ఈ స్నేహితురాళ్ళు చెప్పుకునేవి మామూలు కబుర్లు కావు. పెద్ద పెద్ద చర్చలు, విశ్లేషణలు. మొదటి ఘట్టంలోనే వారి సంభాషణ ఇలా వుంటుంది-
“ఓసి శ్రీమాలీ! నీకొక్కమాట చెప్పెదను వినుము. ఈ సృష్టిలో నొక రహస్యము కలదు. మంచిని చెడ్డగా చెప్పవచ్చును. చెడ్డను మంచిగా చెప్పవచ్చును. పరమేశ్వరుడు సర్వజనులకు మనస్సను దానినిచ్చెను. ఆ మనస్సునకు గల శక్తి ముందు దానిని సృష్టించిన పరమేశ్వరుడు కూడ నిలువలేడు. అది ఆ పరమేశ్వరుని కాదనగలదు. వాని నౌననగలదు. ఉన్నాడు లేడని ద్విదాభూతముగా కూడ చెప్పగలదు. మొదట లేడు తరువాత నున్నాడనగలదు. దాని యిష్టము వచ్చినట్లు చెప్పగలదు. దీని పేరు పాండిత్యము. నీవు పండితురాలవు. మీ నాయనగారు పండితులను పెట్టి నీకు చదువు చెప్పించినాడు. మా నాయనగారు నాకు చెప్పించినాడు. మన యిద్దరకు పట్టిన దుర్దశ యిదియే. మనము చదువుకొనక పోయినచో మనమెంతయో బాగుపడెడివారము. చదువుకొన్నాము. చెడిపోతిమి.”
ఇక్కడ మొదలయ్యి ఇంకా చాలా లోతులకి వెళ్తుంది ఆ సంభాషణ.

సరే, తర్వాతి సన్నివేశంలో వాళ్ళిద్దరూ కాలంజరి అనే స్త్రీని వెతుక్కుంటూ ఆమె యింటికి వెళ్తారు. ఆమె ఒక సోదె చెప్పే స్త్రీ. ఆమె దగ్గరికి వెళ్ళి సోదె చెప్పించుకోమన్న సలహా జయద్రథుడు యిస్తాడు అమృతవల్లికి. నిజానికి ఉన్నతకుటుంబాలకు చెందిన ఆ యిద్దరు అమ్మాయిలూ వెళ్లదగిన చోటు కాదు అది. అయినా వెళ్తారు. అక్కడ కాలంజరి కొంత పెడసరంగా మాట్లాడుతుంది. వినయంగా వుండే శ్రీమాలి దానిని పట్టించుకోదు కానీ అమృతవల్లి చిరాకు పడుతుంది. తర్వాత వాళ్ల మధ్య సామరస్యం ఏర్పడుతుంది. ఆ సన్నివేశచిత్రణా, అక్కడ వాళ్ళ పాత్రచిత్రణలో విశ్వనాథ చూపే సూక్ష్మాంశాలు గొప్పగా అనిపిస్తాయి. ఈ సంభాషణ చూడండి.

కాలంజరి అమృతవల్లితో అంటోంది.
“ఆమెది సాధువైన ప్రకృతి. నీది అంత సాధువు కాదు. ఆమె తాను గొప్ప యింటి బిడ్డ అయినను లేచి నిలుచుండి దీనారము పులి తల మీద పెట్టినది. పోయి సోదెకు కావలసిన సామాగ్రి కొని తెచ్చినది. నిన్ను బతిమాలి లోనికి తీసుకొని వచ్చినది. ఆమె యందు వినయమున్నది. మంచితనమున్నది. పరిస్థితులకు ఒదిగి ప్రవర్తించెడు లక్షణమున్నది. నీయందది లేదు. నీ ప్రకృతి తాటిపట్టె కెదురుదేకును. నీ యందును మంచితనము కలదు. ఆ మంచితనము తరువాత భాసించినది. నేను నిన్ను చూసి నవ్వితిని. నీవు సహజముగా మంచిదానవు గనుక నా యందు ప్రసన్నవైతివి. సహజముగా మంచి లక్షణములు లేని స్త్రీ అయినచో, నీ వలె పైకి నింతటి అధికారిక భావము ప్రదర్శించు స్త్రీ అయినచో, నా నవ్వును చూచి తిరస్కరించును. నేను క్షుద్రకుల స్త్రీని. మీరుత్తమకుల సంజాతలు. ఒక యుత్తమకుల సంజాత అయిన స్త్రీ, క్షుద్రకుల స్త్రీ యొక్క స్నేహపూర్వకమైన మందహాసమును పాటించునా? పాటించదు. పాటించుట కూడ తన గొప్పదనమునకు భంగ మనుకొనును. నీవట్లనుకొనలేదు. అందుచేత నీ యాత్మ వస్తువు మంచిది.”
ఇదీ విశ్వనాథ పాత్రలని చిత్రించే పద్ధతి. “శ్రీమాలి, అమృతవల్లి అని ఇద్దరు అమ్మాయిలు వుంటారు. వాళ్ళలో ఒకరు వినయంగా వుంటారు. మరొకరు అహంకారంగా వుంటారు.” – ఇలా యింత సామాన్యంగా వుండదు పాత్రలని పరిచయం చేసే పద్ధతి. పైకి కనబడే వారి పనులు, పద్ధతులే కాక అంతరంగాలు, సంస్కారాలు కూడా పరిచయం చేయబడతాయి. ఒక్కొక్కసారి రచయితద్వారా. ఒక్కొక్కసారి మరొక పాత్రద్వారా.

అంతే కాదు ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఏమిటంటే ఈ మూడు స్త్రీ పాత్రలూ కూడా ఇంత సూక్ష్మంగా అవతలి వారిని అర్థం చేసుకోగల తెలివైన పాత్రలు. సరే యింతకీ ఈ సన్నివేశంలో కాలంజరి భవిష్యత్తులో ఏం జరగబోతోందో సూచనప్రాయంగా చెప్పేస్తుంది. అంటే పీఠికలో చెప్పబడిన కథ మొత్తం చెప్పేస్తుంది. శ్రీమాలి రాజుచే వంచించబడి మరణిస్తుందనీ, ఆ పగ తీర్చుకునేందుకు అమృతవల్లి విషకన్యగా మారి రాజు మరణానికి కారణమవుతుందనీ – ఈ కథంతా మనకి నవల రెండో సన్నివేశంలోనే విప్పేస్తారు రచయిత. అయినా మనకు తెలిసిపోయిన ఆ కథని మనచేత మళ్ళీ పట్టుగా చివరివరకూ చదివిస్తారు!
ఇలాంటి అద్భుతమైన పాత్రచిత్రణతో, సంభాషణలతో. ఈ సన్నివేశం లోదే మరొక సంభాషణ చూడండి. సోదె చెప్పించుకోవడానికి వచ్చిన శ్రీమాలి, అమృతవల్లులు కాలంజరికి రెండు దీనారాలు యిస్తారు. ఆమె అంతకు ముందు ఎన్నడూ దీనారాలు చూసి ఎరుగదు.

“ఇవి దీనారాలా! ఇవి నాకెందుకు పనికొస్తాయి? వీటితో బియ్యం వస్తాయా! ఉప్పులు పప్పులు వస్తాయా! నగలు చేయించుకోవడానికి తప్ప ఇంకెందుకూ పనికి రావట కదా యివి!” అంటుంది. అదేమిటంటే, “ఉప్పుపప్పులు వీటితో కొనడం నేనెప్పుడూ చూడలేదు. వాటన్నిటికీ ఒక వస్తువు యిచ్చి ఇంకొక వస్తువు తీసుకుంటాం. ఇవి తినేవి కావు కదా, వీటినేమి చేస్తాం?” అని అడుగుతుంది.

“అలా కాదు, ప్రతి వస్తువుకీ వెల వుంటుంది. వెల అంటే ధనం. ధనం అంటే ఈ దీనారాలు.” అని అమృతవల్లి వివరించబోతుంది. అపుడు కాలంజరి ఇలా అంటుంది. “వస్తువులకు వెల యుండదు. వస్తువులకుపయోగ ముండును. ఆహారపదార్థములకు భుజించుటకు వీలయిన లక్షణముండును. అనుభవించుటకు అవి యోగ్యమైనవి. ఒక అనుభవించు వస్తువునకు మరియొక అనుభవించు వస్తువునకు సమానత్వముండవచ్చును. అది దానికి దీనికిని సంబంధము. వానిలో సమానత్వము లేకపోయినను నష్టము లేదు. జీవితము యొక్క పరమార్థ మనుభూతి కనుక శేరు గోధుమలకు నొకప్పుడు పావుశేరు పెసలు రావచ్చును. మరియొకప్పుడు పావుశేరులో సగమే రావచ్చును. వెండి బంగారముల విషయములో నిట్టి వ్యత్యాసము వహించుట కష్టము.”

కష్టమెందుకు అంటే “ఈ వెండి బంగారములు ధరించుటకు తప్ప పనికి రావు. అవి ధరించక పోయినను మనుషులు బ్రతుకవచ్చును. ఆహారపదార్థములు మనుషులు బ్రదుకుటకు కావలసినవి. వెండి బంగారములు బ్రతుకుటకు అక్కరలేనివి. వానికి వీనికి సమానత్వమెట్లు?” అని ప్రశ్నిస్తుంది. సరే, ఈ సంభాషణ అంతా అయ్యాక శ్రీమాలి “అయితే మా దీనారాలు నీకుపయోగింపవు అన్నమాట” అంటే “ఎందుకు వుపయోగించవు? నేను మెడలో కట్టుకుంటాను.” అంటుంది. “బ్రతకడానికి మెడలో కట్టుకోనక్కర లేదు కదా!” అంటే “వ్యర్థమైన ఒక భావముననుభవించుటకు కట్టుకొందును. చూసి పోవడానికి వారూ వీరూ వస్తారు. నాకు బేరాలు పెరుగుతాయి. బియ్యం వస్తాయి.” అన్నది సమాధానం.

ఈ కాలంజరి భర్త కాలజ్ఞానం పాటలు పాడుతూ వుంటాడు. అంటే భూతభవిష్యద్వర్తమానాలను గురించి చెప్పే పాటలు. అయితే అవి పాడితే కొన్ని చిక్కులు వున్నాయని, ఆరువందల ఏళ్ళ క్రితం నాటి చాణుక్యుడి కుటిలత గురించి పాడితేనే ఒకసారి ఒక గ్రామంలో ఆ చాణుక్యుడి వంశానికి చెందిన వారు దండించారని, అటువంటిది ఇప్పటి విషయాలు, ఇప్పటి రాజ్యంలో జరుగబోయే మార్పులు మొదలైనవి చెప్తే ఇంకేమవుతుందో తెలియదని అంటుంది కాలంజరి.
“మేము పేదవాళ్ళం. పుట్టినవాళ్ళం పుట్టినట్లుగా వుంటాం. మాకు తెలిసిన విషయాలు మాయందే జీర్ణిస్తాయి. మీ విషయం అలా కాదు. మీరు జరుగుచున్న దానిని, సాగుచున్న దానిని, దాని దారిన దానిని జరుగనీయరు. మీకు మాకు వున్న భేదం యిది. మీరు జగత్తునకు విప్లవం తెస్తారు. ఉన్న స్థితి బాగా లేదంటారు. దాన్ని బాగుచేస్తామంటారు. మీరు కృతకముగా వూహించి, మీ ఊహలో మీ ఈ దురహంకారమును కలిపి, మీరు జ్ఞానమనుకున్న మీ అజ్ఞానాన్ని అందులో మేళనము చేసి లోకాన్ని మార్చటానికి ప్రయత్నిస్తారు.” అంటుంది.

ఆ సందర్భంగా రాజుల గురించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తుంది. తన భర్తకు, అతని పూర్వీకులకు ఈ విషయాలన్నీ ఎప్పటినుండో తెలిసినా దానిని బట్టి వారి ప్రవర్తన మారిపోలేదనీ, ఆ రహస్యాలతో అధికంగా సంపాదించాలని అనుకోలేదనీ, కానీ అవే రహస్యాలు రాజులకీ, అధికారులకీ తెలిస్తే వారు వూరక వుండరనీ, అందులో చెప్పినట్లు జరగకుండా జేయటానికి ప్రయత్నాలు చేస్తారనీ, ఎంతో మంది జీవితాలని నాశనం చేస్తారనీ అంటుంది. “రాజులందరూ ఒకరినొకరు చంపుకుంటూనే వచ్చారు. వాళ్ళ వల్ల వేలకొలది సైనికులు, సామాన్య మానవులు చనిపోయారు. రాజులు లేకపోతే ప్రజలు తమలో తాము చంపుకుంటారా? ఇంతకంటె ఎక్కువ చంపుకుంటారా?” అని ప్రశ్నిస్తుంది. ఆ మాటలన్నీ అమృతవల్లికి బాగా నచ్చుతాయి కానీ శ్రీమాలికి నచ్చవు.

కాలంజరి దగ్గరనుండి ఇవతలికి వచ్చాక శ్రీమాలి కాలంజరి మాటలు తనకెందుకు విపరీతంగా అనిపించాయో వివరిస్తుంది.
“ఆమె అనిన మాటలలో నొక పెద్ద దోషమున్నది. సృష్టి జరిగినప్పుడే మనువుదయించినాడు. ప్రజలతో పాటు రాజు పుట్టినాడు. తొలుత ప్రజలుద్భవిల్లి తద్రక్షణము కొరకు వారు రాజును నియమించుకొనలేదు. ఆ రాజు వీరిని పాలించుకొరకు నేర్పడలేదు. ప్రజలు, రాజును నైకకాలికముగా జనించిరి. కాని కాలము గడచిన కొలది ప్రజలలో దుర్వృత్తి యెక్కువైనది. రాజులును కామాదివాంఛా దూషితులైనారు. అప్పటినుండియు ప్రజలు వేరుగా రాజు వేరుగా భావింపబడుట ఆరంభమైనది. ఒక వృక్షమున్నది. తగినంత నీరున్నది. సుఖములైన వాయువులు కలవు. వృక్షము సర్వత్ర చివురించి కుసుమించినది. అప్పుడది వృక్షము. ఒక దెస నీరు చాలలేదు. ఆ దెస నుండి వచ్చిన గాలులు మంచివి కావు. వృక్ష మా దెస యందు నెండినది. ఆకులు రాలిపోయినవి. చెట్టు కొమ్మ మ్రోడుగా భాసించినది. అప్పుడేమైనది? ఏకదేశమునందు వృక్షము వృక్షము కాకపోయినది. బీజము నుండి అంకురోదయము కలిగినపుడు సర్వము చక్కగా సాగినచో, వృక్షమంతయు వృక్షమై సుఖముగా నుండెడిది. పరిస్థితులు మారునప్పటికి-చెట్టు బోద వేరు, కొమ్మ వేరు, ఆ కొమ్మలలో కొన్ని చేద్యములు, కొన్ని స్వీకార్యములు. ఇది స్థితి.ఏకదేశము నందు చెట్టు చెడిపోగా చెట్టు యొక్క అంకుర స్థితిని దూషించుట ఎట్టిదో, ఆమె రాజులను తిట్టుట అట్టిది. రాజులలో దుష్టులుందురు. ప్రజలలో నుందురు. దానికి కాలము కారణము. సమిష్టిగా నున్న యొక వ్యవహారమును సమిష్టిగా చూడక, భిన్న భిన్న విషయములను వివిచ్యమానముగా చూసి, దోషారోపణ చేయుట కారంభించినచో – ఆ సమిష్టి అయిన వ్యవహారమును పరమేశ్వరుడు సంకల్పించెను. సుస్థితిని నీవెప్పుడును పరిరక్షింపజాలవు. భిన్న దేశములయందు భిన్న దోషములు కనిపించును. దోషములను నిర్మూలింతువో మూలచ్చేదమే చేయుదువో తెలియదు. ఒక్కటి మాత్రము చెప్పుచున్నాను. ఆ వృక్షము పరమేశ్వరోద్దిష్టమైన వృక్షముగా నుండి ఎండకాలమున నెండల నాపుచు, శీతకాలమున చల్లదనమును ప్రసాదించుచు, వసంత కాలమున పుష్ప ఫలముల నిచ్చుచు, నేత్రాభిరామమై యుండవలయునన్న వృక్షమును వృక్షముగా భావింపుము. వృక్ష స్వరూపమును నాశనము చేయకుము. నీవు భిన్నదేశములయందు దోషములను చూసి ఛేదింప నారంభించినచో వృక్షాకృతి యుండదు, ఆకులుండవు, చివుళ్ళుండవు, పూవులుండవు….”

ఈ సన్నివేశం ఇలా పూర్తవుతుంది.
మొదటే చెప్పుకున్నట్లూ కథ చిన్నదే. శ్రీమాలి వివాహం, ఆమె కాపురానికి వెళ్ళడం, ఆమె సౌందర్యం గురించి విన్న కామాంధుడైన రాజు ఆమె భర్తని ఉద్యోగబాధ్యతల పేరుతో తన దగ్గరకు పిలిపించుకుని చంపించి, ఆమె భర్త లాగా శ్రీమాలి గదిలోకి వెళ్ళగా ఆమె అది గ్రహించి ఉరి పోసుకుని చనిపోవడం, ఆ తర్వాత విషకన్య అయిన అమృతవల్లి రాజు తనని చూసేలా తనతో గడపాలని కోరుకునేలా వ్యూహాలు రచించి అతన్ని చేరి అతని మరణానికి కారణమవడం – ఇదే కథ.

అమృతవల్లి విషకన్య అవడానికి కారణం జయద్రథుడు. మొదట్లో చెప్పుకున్న విదురుడి తమ్ముడు. ఆ తమ్ముడు ఒకసారి చచ్చి బ్రతుకుతాడు. ఆ సమయంలో అతనిని జయద్రథుడు ఆవహిస్తాడు. అవును, ఈ జయద్రథుడు పురాణవైరగ్రంథమాల లోని మొదటి నవల నుంచీ వస్తూన్న వాడే. భారత కాలం నాటి జయద్రథుని సంతతి వాడు. అతనే ఇపుడు ఈ విదురుని తమ్ముడిని ఆవహించాడు. ఇతడు చిన్నతనంలో తన దగ్గరికి వస్తూ పోతూ వున్న అమృతవల్లికి విషం సేవించమని సలహా చెప్పి ఆమె విషకన్య అయేందుకు కారకుడవుతాడు.

ఇక కాలంజరి, ఆమె భర్త రామడుగు. వీళ్ళదొక కథ. కాలంజరిని కూడా జయద్రథుడు లోబరచుకుంటాడు. ఆమెని ఆవహించి రాజు దేవభూతి దగ్గర చేరి ఆమె ద్వారా రాజ్యంలో ఎవరెవరు అందకత్తెలో వారిని ఎట్లా పొందవచ్చో మహారాజుకు ఉపదేశిస్తూ ఉంటాడు. అలా ఇల్లు వదిలిపెట్టి కనిపించకుండా పోయిన కాలంజరిని వెతుకుతూ రామడుగు పిచ్చివాడిలా తిరుగుతుంటాడు. కథానాయిక అమృతవల్లి తన స్నేహితురాలు శ్రీమాలి తండ్రి అయిన వాసుదేవుడిని యిష్టపడుతుంది. అతన్నే భర్తగా భావిస్తుంది. తాను విషకన్యగా మారిపోయింది కనుక తన జీవితంలో పెళ్ళి ప్రసక్తి లేదని ఆమెకు తెలుసు. తన జీవితాన్ని స్నేహితురాలి పగను తీర్చేందుకు, తాను భర్తగా భావించిన వాడిని రాజును చేసేందుకూ ఉపయోగిస్తుంది.

భాగవతంలో, మత్స్య పురాణంలో, వాయు పురాణంలో భవిష్యత్తును తెలిపే విషయాలు ఉన్నాయని, ఇంకా ముఖ్యంగా భవిష్యత్ పురాణంలో కలి యుగానికి సంబధించిన విషయాలు ఎక్కువగా వున్నాయనీ తెలుసుకుని అ గ్రంథాలకోసం ప్రయత్నిస్తుంది. మరొక ప్రక్కన కాలంజరి భర్త రామడుగుతో ఆ కాలజ్ఞానం పాట పాడించి విషయం తెలుసుకోవాలని మనుషుల్ని పంపి అతనిని వెతికించి తన దగ్గరికి రప్పించుకుంటుంది. వాసుదేవుని ఇంటిలో అటు వాసుదేవుని కొడుకైన భూమిపుత్రుడి చేత ఇటు వాసుదేవుడి చేత కూడా తాను ఏమనుకుంటే అది చేయించగల చనువును, కనబడని అధికారాన్ని సంపాదిస్తుంది. శ్రీమాలి వివాహమపుడు పనులన్నీ చక్కబెట్టి మొత్తం వివాహ బాధ్యతలనంతా తన సమర్ధతతో నడిపించి అందరి అభిమానాన్నీ చూరగొని ఆ యింటిలో ఒక మనిషిలా అయిపోతుంది.

వాసుదేవుడిని అమృతవల్లి తన మనసులో భర్తగా భావిస్తోంది అని చెప్పుకున్నాం కదా, ఆ విషయాన్ని అంత స్పష్టంగా కాకపోయినా కొంతవరకూ వాసుదేవుడు, అతని భార్య, వారి కొడుకు భూమిపుత్రుడు కూడా గ్రహిస్తారు. మరి వాళ్ళ ముగ్గురికీ అమృతవల్లిపై వున్న భావమెలాంటిది? స్పష్టాస్పష్టమైన ఆ భావాలని – ప్రేమ, గౌరవం, అయిష్టం, ఇబ్బంది – వారికే సరిగా తెలియని వారి మనసుని, రచయిత కూడా ‘ఇది యిది’ అంటూ స్పష్టంగా తీర్మానించలేని భావాన్ని మనకి చాలా అందంగా చెప్పారు విశ్వనాథ. దానిని సమీక్షలో వివరించడం కష్టం. ఆ సున్నితమైన అంశాలని ఆయన ఎలా తీర్చిదిద్దారనేది పుస్తకం చదివే తెలుసుకోవాలి.

అలాగే దేవభూతి మరణానికీ రాజ్యం సునాయాసంగా వాసుదేవుడి చేతికి రావడానికీ కావలసిన పథక రచన అమృతవల్లి ఎలా చేస్తుంది, ఆ పథకాలని వాసుదేవుడి ద్వారా భూమిపుత్రుడి ద్వారా ఎలా అమలు చేయిస్తుంది, కాలంజరిని ఆవహించిన పిశాచం (జయద్రథుడు) నుంచి ఆమెకి విముక్తి ఎలా లభిస్తుంది – యివన్నీ నవలలో చదివి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు.
***

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.3 Comments


  1. Dr Ramesh mamidala

    Good


  2. చాలా బావుంది పరిచయం ఇప్పుడే పుస్తకం కొనుక్కుని చదవాలినిపించేట్లుగా – అభినందనలు. అశ్వమేధం మాత్రం గజిబిజిగా ఉంది బహుశా పెద్ద నవలేమో అది కదా!


  3. బాగుంది. నేను ఆఖరుగా చదువుతూ కారణాంతరాలవల్ల ఆపేసిన నవల ఇది. మళ్ళీ మొదలెట్టాలి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1

 
 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
2

 

 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
7

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1