పుస్తకం.నెట్ ఐదో వార్షికోత్సవం

నేటితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి ఐదేళ్ళు పూర్తయ్యాయి. ఈ శుభసందర్భాన పుస్తకం.నెట్ పాఠకులకు, వ్యాసకర్తలకు, వ్యాఖ్యాతలకు అభినందనలు, ధన్యవాదాలు. కేవలం పుస్తకాలపై పాఠకులు అభిప్రాయాలను పంచుకునే వీలు కల్పించే వేదికగా ఇన్నాళ్ళు మనగలగటం ఆశ్చర్యం. అది సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ, ఈ ప్రయాణంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాత్ర వహించిన  అందిరికి – పెద్దలైనా, పిన్నలైనా (అవును! పుస్తకం.నెట్ కు కొన్ని చిట్టిచేతులూ ఊతాన్నిచ్చాయి) –  శతకోటి ధన్యవాదాలు మరోసారి. ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు!  

గడిచిన ఏడాదిలో:

సంఖ్యల ప్రకారం చూసుకుంటే గడిచిన ఏడాదిలో పుస్తకం.నెట్ లో రెండు మైలురాళ్ళని దాటింది.

  • వ్యాసాలు సంఖ్య 1300 పోస్టులు దాటింది.

  • నవంబర్ 2013నాటికి ఒక మిలియన్ హిట్లు దాటింది. నవంబర్ 2010నాటికి మూడు లక్షల హిట్లున్నాయి. అంటే తర్వాతి మూడేళ్ళ కాలంలో ఏడు లక్షల హిట్లు వచ్చాయన్నమాట.

2013లో మిగితా సంఖ్యలు చూస్తే:

వ్యాసాలు: 257

వ్యాఖ్యలు: 1241

హిట్స్: 244157

ఏడాది మధ్యలో కొంచెం మందకోడిగా నడిచినట్టు అనిపించినా, ఎవరో ఒకరు ఏదో ఒక రూపేణ తలా ఒక చేయి వేయటంతో ఈ ఏడాది కూడా నిరాటంకంగా, నిర్విఘ్నంగా పూర్తయ్యింది. పుస్తకం.నెట్ కళకళాడింది.

అలాగే, 2012 చివర్లో మొదలుపెట్టిన వీక్షణం శీర్షిక, ఒక వారం కూడా తప్పకుండా, అన్ని సోమవారాలూ ప్రచురింపబడింది. ఒకానొక దశలో ఈ శీర్షికను ఆపేద్దామనుకుంటున్న తరుణంలో,  పుస్తకం.నెట్ ఫేసుబుక్ గ్రూప్ లో నిర్వహించిన పోల్‍లో ఈ ప్రయత్నాన్ని ఆపవద్దని ప్రోత్సహించినవారికి మా ధన్యవాదాలు. ఈ శీర్షికలో మీరు చూడాలనుకుంటున్న సైట్స్, గ్రూప్స్ వివరాలు ఉంటే మాకు తప్పక తెలియజేయండి.

గత ఏడాది, ఆరో తరగతికి చెందిన అభిరామ్ గోదావరి పుస్తకం.నెట్ వ్యాసకర్తలలో పిన్నవయస్కుడయ్యారు.

సప్టెంబర్ 2013, తెలుగు-వెలుగు పత్రికలో పుస్తకం.నెట్ పై సుధీర్ఘ వ్యాసం వెలువడింది. అడపాదడపా పుస్తకం.నెట్ పేరు ప్రింట్ లో కనిపించినా, ఈ ప్రయత్నాన్ని సమగ్రంగా వివరించటంలో తెలుగు-వెలుగు వారి కృషి విస్మరించలేనిది. అందుకుగాను, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

మొత్తం ఐదేళ్ళల్లో:

వ్యాసాలు: 1338

వ్యాఖ్యలు: 8129

హిట్స్: 1,032,412

ఖచ్చితమైన సంఖ్యలు కాకపోయినా, ఈ ఐదేళ్ళలో, పుస్తకం.నెట్ పై ఐదువందల పై చిలుకు తెలుగు పుస్తకాలు, రెండొందలకు పైగా ఆంగ్ల పుస్తకాలపై వ్యాసాలు వచ్చాయి. దాదాపు నలభై ఇంటర్వ్యూలు వచ్చాయి.

సంఖ్యాబలాల బట్టి భుజాలను ఎగురవేయటం కన్నా, పుస్తకం.నెట్ పరమోద్దేశ్యమైన పుస్తకాలను గురించి మాట్లాడుకునే వాతావరణాన్ని కల్పించటంలో సఫలమయ్యామా? లేదా? అన్నదే ముఖ్య ప్రశ్న కావాలి. ఏదో ఒకరిద్దరు పూనుకొని, వారానికి ఒకట్రెండు వ్యాసాలు రాసినా, ఏడాదికి వంద వ్యాసాలవుతాయి. కానీ, ఒక కమ్యూనిటిగా, ఒకరు చదివినదాని గురించి వేరొకరికి ఆసక్తి కలిగించటానికీ, చదివినవాటిపై ఆసక్తికరమైన చర్చలు లేవదీయటానికి, చదివిన పుస్తకాలను కొత్త కోణాల్లో, సరికొత్త వెలుగుల్లో మళ్ళీ మళ్ళీ చూడ్డానికి వీలు కలగాలంటే అది ఒకరిద్దరితో అవ్వదు. అందుకే పుస్తకం.నెట్ వెనుకు ఉండి నిర్వహించటంకన్నా, దాన్ని ముందుండి నడపడమే కష్టతరమైన పని. ఆ పనిని ఇన్నేళ్ళుగా నిర్విరామంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. సైటు మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకూ, అన్నిరకాల సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.

పుస్తకం.నెట్ అంటే..

మరోసారి మననం చేసుకోవటం తప్పు లేదనుకుంటా. ఇన్నేళ్ళ ప్రయాణంలో పుస్తకం.నెట్ ముఖ్యోద్దేశ్యం మారలేదు. అది సామాన్య పాఠకులకు ఒక వేదిక అవ్వటం. ఆ వేదిక వ్యాసరూపేణ ఊండే పుస్తక పరిచయాలకో, లేక సమీక్షలకో పరిమితం కాదు. దాంట్లో..

  • చదివిన పుస్తకంతో మీకు ఏర్పడ్డ అనుబంధాన్ని వివరించచ్చు. లేదా ఆయా రచన లేవనెత్తే ప్రశ్నలపై మీకు దొరికిన జవాబుల గురించి రాయచ్చు.

  • మీకు నచ్చిన రచయితా, మిమల్ని నిరాశపరిచే రచయితా – ఎవరి గురించైనా మీ ఆలోచనలు పంచుకోవచ్చు. అయితే మెచ్చుకోలులోనూ, తెగడ్తలోనూ సమన్వయం కనబరిస్తే అది అందరికి క్షేమదాయకం.

  • ఒక్కోసారి చదివిన పుస్తకమంతా దేనిగురించో గుర్తే ఉండదు.. కానీ అందులోని కొన్ని మాటలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఒక రచయిత రాసిన, లేక ఒక రచనలో ఉన్న మరువురాని మాటలూ ఇక్కడ పంచుకోవచ్చు.

  • అనుకునో, అనుకోకుండానో ఇద్దరు, ముగ్గురు ఒకేసారి ఒకే పుస్తకం చదవడం తటస్థిస్తే, దాని గురించి చర్చా గోష్ఠి నిర్వహించి, దాని సారాంశం మాకు పంపవచ్చు. ఆధునిక సాంకేతిక సాధనాలు ఎటూ మనకు అందుబాటులో ఉన్నాయి. స్కైప్, గూగుల్ హాంగ్ అవుట్ ఉపయోగించి వీడియోలు చేసినా, లేక గూగుల్ డాక్స్, ఎవర్-నోట్ ఓపెన్ చేసి ఇరువురూ రాసినా, సైటులో ఉంచే బాధ్యత మాది! మీవైపు నుండి కావాల్సింది ఉత్సాహం, కాస్తంత తీరిక.

  • అభిరామ్, ప్రమద మోహన ఇచ్చిన ధైర్యంతో చేస్తున్న అపీలు ఇది:  మీ పిల్లలకు పుస్తకాలపై ఆసక్తి ఉంటే, వారు వాటిపై రాయగలిగితే – ముఖ్యంగా తెలుగులో – తప్పక మాకు పంపండి. లేదా, వారు పుస్తకాల గురించి చెప్తున్న కబుర్లను వీడియో లేక ఆడియో క్లిప్పులుగా మలిచి మాకు చేరవేయండి.

  • ఈ తరం సాహిత్యాభిమానులు ప్రింట్‍లో కన్నా వెబ్‍లో ఎక్కువ చదువుతున్నారు. అలా, మీరు ఒక రచనకోసమో, రచయిత కోసమో జల్లెడ పట్టిన జాలాన్ని “వీక్షణం ప్లస్”లో పంచుకోవచ్చు.ఏళ్ళ తరబడి ఎంతో ఆసక్తిగా అనుసరిస్తున్న ఏ (వెబ్) పత్రికను గురించి రాసి పంపవచ్చు.

  • సాహిత్యానికి సంబంధించిన విషయమేదైనా.. మీ ఊహకు అడ్డుపెట్టటం లేదు..

మరో ఏడాది మీ అందరితో, బోలెడన్ని పుస్తకాల కబుర్లతో ఆడుతూ పాడుతూ గడచిపోవాలని కోరుకుంటూ.. మీ అందరికి మరోసారి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు!

– పుస్తకం.నెట్

You Might Also Like

24 Comments

  1. డా. మూర్తి రేమిళ్ళ

    Once again congrats to the team for excellent management of Pustakam.net.

    But i wish to reiterate my request for Telugu input interface on Pustakam.net and more importantly SEARCH TOOL.

    నిన్ననే నేను మళ్ళీ ఇబ్బంది పడ్డాను, మన లిపి పుత్తు పూర్వోత్తరాలు discussion పేజ్ పట్టుకోడానికి. జనరల్ గా RECENT లిస్ట్ ని follow అవుతాను, అది అందులో లేకపోవడంతో కష్టబడ వలసి వచ్చింది.

    Please seriously consider this request for SEARCH tool.

    డా. మూర్తి రేమిళ్ళ

    1. పుస్తకం.నెట్

      We regret the inconvenience caused to you in searching old articles on the site. We’d try and see how the issues you’ve mentioned can fix. Meanwhile, if you’ve any trouble in digging up the archives, please mail us at editor@pustakam.net with details of what you’re looking for, so that we can be of some help. That’s a temporary workaround that we can suggest, at the moment.

      We appreciate your patience and interest in the site. Hope we’ll resolve the issues soon.

      Thanks,
      pustakam.net

    2. డా. మూర్తి రేమిళ్ళ

      Very happy to see two great additions today on pustakam .net
      Telugu input interface and more importantly SEARCH TOOL.
      I am sure many others will be equally happy .

      But a small feedback – the input is taken by default in తెలుగు with a need to change back . I think an option to select the language should go well .

      Once again thanks.

  2. ఫణీన్ద్ర పురాణపణ్డ

    bingo… happy birth day, belated of course. you have a unique style in maintaining the site. keep going.

  3. kv ramana

    పుస్తకం నెట్ అయిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుని నాకూ అభినందిద్దామనే ఉంది. కానీ నాకు ఆ అవకాశం లేకుండా చేశారు. శ్రీ శ్రీ హృదయగానం అనే యద్దనపూడి కామేశ్వరి గారి వ్యాసంపై జరుగుతున్న చర్చలో నేను చివరగా రాసిన అభిప్రాయాన్ని మీరు కేరీ చేయలేదు. ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. అందులో అసభ్యమైన మాటలు లేవు. వ్యక్తిగతమైన దూషణలు లేవు. దానిని కేరీ చేయకుండా తొక్కిపెట్టడంలో మీ వివేకం ఎలాంటిదో పాఠకులకు తెలియాలంటే దానిని వెంటనే కేరీ చేయండి.

    1. సౌమ్య

      రమణ గారికి: మీ వ్యాఖ్యలు మాడరేషన్ లో ఏవీ లేవు మరి. ఉన్న వ్యాఖ్యలు ఆల్రెడీ‌ అప్రూవ్ అయినవే ఉన్నాయి. కనుక, మీర్రాసిన వ్యాఖ్య అసలు సబ్మిట్ అయిందో లేదో తెలియదు కనుక వీలైతే మరోసారి వ్యాఖ్య రాయగలరు.

    2. kv ramana

      సౌమ్యగారూ…తొందరపడి ఆరోపణ చేసినందుకు క్షమించండి. వ్యాఖ్యల లిస్ట్ లో నా వ్యాఖ్య కనబడకపోవడంతో కేరీ చేయలేదనుకున్నాను. తీరా చూస్తే కేరి చూశారు. ఇప్పుడు పుస్తకం నెట్ అయిదవ వార్షికోత్సవానికి రెట్టింపు అభినందనలు. మరో సారి…సారీ

    3. సౌమ్య

      రమణ గారికి: 🙂 బహుశా మీ వ్యాఖ్య తరువాత చాలా మంది వ్యాఖ్యానించి ఉండవచ్చు. అందువల్ల మీ వ్యాఖ్య మెయిన్ పేజీలోని జాబితాలో కనబడి ఉండదు. మాకున్న కాలపరిమితుల వల్ల వ్యాఖ్యల మాడరేషన్ ఒక్కోసారి ఆలస్యం అవుతుంది కానీ, సాధారణంగా వ్యాసానికి సంబంధించిన, అసభ్యంగా లేని వ్యాఖ్యలను అన్నింటినీ పుస్తకం.నెట్లో అప్రూవ్ చేస్తాము.

  4. రవి

    పుస్తకం.నెట్ కు ఇప్పుడు ముందున్న challenges ఇవి.

    – ఒక మూస లోకి జారకుండా చూడటం.
    – వైవిధ్యంగా ఉన్న రచనలను ప్రొజెక్ట్ చేయగలగడం.
    – కొత్తదనం కావాలి. ఏదైనా ఒక రచనను గురించి కొంతమందయినా చర్చించే పద్ధతులూ, వాదప్రతివాదాలూ కావాలి.
    – ఏవైనా కొత్తశీర్షికలు.
    – పుస్తకాన్ని చదవటం మాత్రమే కాక, అనుశీలించగలిగే విధంగా రచయితల నుండి రచనలు రాబట్టటం.
    – ఒక్క పేజి వ్యాసాలు కాక, ఒక సమగ్రమైన గ్రంథాన్ని కనీసం రెండు మూడు పేజీలలో విశదీకరించగలిగిన వ్యాసాలు.
    – some sort of innovative interface.
    – elimination of old and redundant features if any.
    etc..

    పాఠకులను సంపాదించటమూ, వ్యాసాలు దొరకడమూ అన్న ప్రాథమిక స్థాయిని పుస్తకం అధిగమించినది కనుక, దీనిని దిద్దుకోవడం సమర్థవంతులైన సంపాదకుల కర్తవ్యం. ఈ పుస్తకం నవనవోన్మేషంగా ఎన్నడూ ఉండాలని ఆకాంక్షిస్తూన్నాను.

    1. సౌమ్య

      Ravi garu

      మీ సూచనలకి ధన్యవాదాలు. నెమ్మదిగా వీలును బట్టి ఒక్కొక్కదాన్నీ ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తాము. కొత్త శీర్షికలు, మీబోటి వారు పూనుకుని మొదలుపెట్టాలి మరి. 🙂 భవిష్యత్తులో కూడా మీరు ఇప్పటిలాగే‌ మీ తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను.

  5. Nagini

    Congratulations to Pustakam.net..:-)

  6. A.Surya Prakash

    ఐదవ వార్షికోత్సవ అభినందనలు!మీ సామూహికకృషికి అభివందనాలు! నేటి జ్ఞానసమాజంలో పుస్తకాన్ని ప్రేమిద్దాం!

  7. brahmeswara rao

    నాకు చాలా సంతోషంగా ఉంది..వీవెన్ గారి పుణ్యాన ఇప్పుడే నాకు ఈసైట్ ఫరిచయం అయింది.చదవ వలసినవీ ,చూడవలసినవీ చాలానే ఉన్నాయి.ఆలస్యంగానే అయినా ,మీ సైట్ పరిచయం సంతోషాన్నిస్తున్నది.

  8. మేధ

    Congratulations… and miles ahead 🙂

  9. P Sunitha

    Congratulations to Pustakam.net-Ms Poornima & Ms Soumya

  10. మణి వడ్లమాని

    ముందుగ Happy Ainiversary to pustkam.net, ఈ ప్రయాణములో నేను కూడా ఉడతా భక్తిగా ప్రయాణిస్తున్నందుకు నాకు చాల సంతోషంగా వుంది. అసలు ఇది ఒక మహా సముద్రం ఎన్ని చదివినా అయ్యో ఈ వ్యాసం,చదవలేదే అన్నట్లే వుంటుంది. మన పుస్తకంనెట్ ఒక అక్షయ పాత్ర. అది ఎప్పుడు నిండుగానే వుంటుంది. ఈ ప్రయాణం అనంతంగా కొనసాగుతూ వుండాలని అభిలషిస్తూ…….
    మీ
    మణి వడ్లమాని

  11. Jampala Chowdary

    Happy 5th anniversary and Many Happy Returns of the Day!

    Congratulations to Purnima and Sowmya.
    Five years of constant activity is a substantial achievement for any forum on social media. Sowmya’s consistency with veekshaNam is an inspiration.

  12. డింగు

    పోయిన యేడాది పుస్తకం.నెట్‌తో మమేకం అయ్యాను.

    ఐదు సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు. ఈ సైటు నిర్వహిస్తున్నందుకు పుస్తకం.నెట్ టీంకు ధన్యవాదాలు.

  13. డా. మూర్తి రేమిళ్ళ

    పుస్తకం.నెట్ మొదలుపెట్టి ఐదేళ్ళు పూర్తయిన. శుభసందర్భాన పుస్తక సాహిత్యాభిమానులకు అభినందనలు,

    అందిరికి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు!

    Wishing Pustakam.net to cross many milestones and set new levels in the years to come.

    All the best for the organisers.

    – డా. మూర్తి రేమిళ్ళ

  14. తృష్ణ

    Congratulations and best wishes for more and more articles..:)

  15. ఏల్చూరి మురళీధరరావు

    పౌగండవయస్సులోకి అడుగుపెట్టిన శుభతరుణాన పుస్తకం.నెట్ ఇతోధికాలోచనీయ మహితరచనావళితో అనవరతం అభిమానులను అలరింపజేయాలని కోరుతూ –

    సమర్థ సంపాదికలు సౌమ్య, పూర్ణిమ గారలకు, సహృత్సుహృనండలికి,

    హార్దికాభినందనపూర్వక సర్వ శుభాకాంక్షలు !

  16. Madhu

    Good. Congratulations. Pustakam.net encouraged lot new people to test their skills. My self and my wife were able to make a beginning. If you can also accept PDF files to post it it will be appreciated. My review of
    ” Silk route lo Sahasa Yatra” could not be posted, as I sent in PDF file. I could not send in another way in Unicode like what you wanted. Anyway great effort. Pustam.net helped many be to know about some good books, which are out of Print.

Leave a Reply