పుస్తకం
All about booksపుస్తకభాష

November 22, 2013

వీరవల్లడు- విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: శ్రీవల్లీరాధిక
***********
నలభై పేజీల ఈ బుజ్జి నవల గురించి అసలు ఏమైనా వ్రాయాలని ప్రయత్నించడమే సరైన పని కాదేమో! ఎందుకంటే యిది కలిగించిన భావాలనీ, ఆలోచనలనీ, ఆనందాన్నీ సరిగ్గా చెప్పాలంటే అది ఏ నాలుగొందల పేజీలో అవుతుంది. అప్పటికీ యిది చదివితే కలిగే అనుభవాన్ని పాఠకుడికి పూర్తిగా యివ్వలేము.

కాబట్టి ఈ నవల గురించి నిజానికి చెప్పవలసినది ఒక్కటే మాట. “తప్పక చదవండి. వెంటనే చదవండి.” అని.

కానీ పరిచయం అంటూ మొదలుపెట్టాను కనుక, పుస్తకానికి న్యాయం చేయలేకపోయినా, నా సరదా తీర్చుకునేందుకు నాలుగు మాటలు వ్రాస్తాను. వల్లడు ఒక పాలేరు. కులానికి మాలవాడు. అతని దొర ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి పూర్వులలో ఒకాయన ఒక అడవిలాంటి ప్రదేశాన్ని చూసి, అది మంచి ప్రదేశమని గుర్తించి, దానిని ఊరుగా మార్చి అక్కడ నివసించాలని నిర్ణయించుకుంటాడు. మొదట అక్కడ తను ఒక పాక వేసుకుని భార్యా పిల్లల్తో కాపురం పెడతాడు.

ఆ తర్వాత ఒక రోజు ఆ దారిన పోతున్న వల్లడి పూర్వీకుడు ఆకలితో ఆ పాక దగ్గరికి వస్తే అతనికి అన్నం పెడతాడు. తన నిర్ణయం అతనితో చెప్పి “నాకు సాయంగా వస్తావా?” అని అడుగుతాడు. ఒక పూట అన్నం పెట్టాడన్న కృతజ్ఞతతో వల్లడి పూర్వీకుడు జీవితమంతా ఆయన దగ్గర ఉండడానికి సిద్ధమై పోయి భార్యా పిల్లలని తీసుకుని వచ్చేస్తాడు.

ఆ తర్వాత కమ్మవారినీ, ఇతర కులాల వారినీ తీసుకొచ్చి వాళ్ళకి భాగాలు పెట్టి అడవంతా కొట్టి దాన్నొక ఊరుగా తయారు చేస్తారు. సరే, తర్వాత కొన్ని తరాలు గడిచాక ఇటు వల్లడు, అటు వల్లడి దొర. ఆ దొరకి ఇద్దరు కొడుకులు. చిన్నపిల్లలు. వాళ్ళని వల్లడు పెద్దదొర, చిన్నదొర అంటాడు. ఆ పెద్ద దొర మనవడితోనే కథ మొదలవుతుంది. వెనుకటి కథ అంతా తర్వాత చెప్పబడుతుంది.

వల్లడి దొర కుటుంబానికి సంబంధించిన పొలం ఉమ్మడి మీద వుంటుంది. ప్రతితరం లోనూ పెద్ద కొడుకు సంతానానిదే అధికారం కనుక ఆ లెక్క ప్రకారం వల్లడి దొరదే పెత్తనం కావాలి. కానీ వరుసకి బాబాయి అయిన ఒక పెద్దాయన రాయుడుగారు వుండడం వలన వల్లడి దొర ఆయనకి గౌరవమిచ్చి ఆయన పేరు మీదగానే అంతా నడిపిస్తూ వుంటాడు. అయినా ఆ రాయుడుగారికి మనసులో కొంత అసంతృప్తి వుంటుంది.

హటాత్తుగా దొర చనిపోవడంతో రాయుడుగారు పెత్తనమంతా తన చేతిలోకి తీసుకుని, వల్లడి దొర పెళ్ళాం పిల్లల గురించి పట్టించుకోవడం మానేస్తాడు. ఊర్లో పెద్దలందరినీ తనవైపు తిప్పుకుని పొలం మొత్తం తానే అనుభవించాలనుకుంటాడు. తిండికి జరగని పరిస్థితులలో ఆవిడ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆవిడ అన్నదమ్ములూ రాయుడుగారిని ఎదుర్కునేంత శక్తి లేక చేతులు ముడుచుకు కూర్చుంటారు. అయితే పాలేరు వల్లడు అలా ఊరుకోలేకపోతాడు. ఆవిడని మళ్ళీ ఊరికి తీసుకు వచ్చి ఆవిడ ఆస్తి ఆవిడకీ, ఆవిడ పిల్లలకీ దక్కేలా చేస్తాడు. ఇదంతా వల్లడు ఎలా చేస్తాడు అన్నది కథ.

అవతలి పక్షం వారు దౌర్జన్యం చేసిన సందర్భాలలో వాళ్ళని ఎదుర్కోగల శారీరక బలం వుండీ, ‘బలంతో కాదు, వ్యవహారంతో సాధిస్తాను’ అనుకుంటూ మొత్తం విషయాన్నంతా లౌక్యం తోనే చక్కబెడతాడు.

మునుసబు కమ్మాయన. కరణం నియోగి బ్రాహ్మడు. నాయకుడు సాయిబు. ఈ ముగ్గురి స్వభావాలు, స్వార్ధాలు, అభిరుచులు, సంస్కారాలు, విశ్వాసాలు – అన్నిటినీ వల్లడు ఎంత నిశితంగా గమనిస్తాడు, అర్థం చేసుకుంటాడు, వాటితో ఎలా ఒక ఆట ఆడతాడు, వాళ్ళనెలా తన (ధర్మ) మార్గం లోకి రప్పిస్తాడు …. ఇదంతా టూకీగా చెప్పడం కుదరదు. చదవాల్సిందే.

ఈ కథలో చమత్కారం ఏమిటంటే, వల్లడి దొర పేరేమిటో మనకి రచయిత చెప్పరు. ఆయన వల్లడి దొర. అంతే. కానీ వల్లడు మాత్రం “వీరవల్లడు”. అసలు కథ ఎలా మొదలవుతుందంటే, వల్లడి దొర మనవడు తన కొడుక్కి “వల్లప్ప” అని పేరు పెడతాడు. ఆ వల్లప్ప పల్లెటూరి చదువు పూర్తి చేసుకుని పట్నంలో బళ్ళో చేరగానే అక్కడి మేష్టరు గారు ఆ పేరు విని “వల్లప్పా! వల్లకాడప్పా!” అని వెక్కిరిస్తారు.

అపుడు ఆ కుర్రాడు యింటికి వచ్చి పేరు మార్చమని గొడవ చేయడం.. తల్లీ, తండ్రీ, నాయనమ్మా, నాన్న నాయనమ్మా – ఇంతమందీ, మామూలుగా వాడిని ఎంతో గారాబం చేసే వాళ్ళందరూ కూడా వాడి ఈ కోరికని మాత్రం ఒప్పుకోకపోవడం, ఆ పిల్లవాడూ, చదువుతున్న మనమూ కూడా ’ఏమిటీ వల్లడి ప్రాముఖ్యత!’ అని ఆసక్తిగా అనుకోవడం. ఇంత నాటకీయత తర్వాత మొదలవుతుంది వల్లడి కథ.

ముందు వల్లడి రూప వర్ణన. ఆ తర్వాత వరుసగా వాడి గుణాలు, వ్యవహార దక్షత.. అన్నిటినీ అబ్బురంగా చెప్తారు.

పాత్ర చిత్రణ అద్భుతంగా వుంటుంది. ఒక్క వల్లడి పాత్రే కాదు. కరణము, మునుసబు, సాయిబు, దొర, దొర భార్య సర్వలక్షమ్మ గారు, చిన్నపిల్లలు – ఇలా నవలలోని మొత్తం అన్ని పాత్రలూ కళ్ళకి కట్టినట్లుగా వుంటాయి.

చివరికి, ఒక్క సన్నివేశంలో మాత్రమే కనబడే మునుసబు గారి తల్లి గానమ్మగారూ, మరో సన్నివేశంలో తళుక్కుమనే కరణం గారి పక్కింట్లోని ముసలమ్మా, వల్లడు దొరసానిని తిరిగి తీసుకురావడానికి అన్నం మానేసి మరీ నడిచిపోతుంటే దారిలోని ఒక ఊర్లో అతనికి ఎదురు పడే బ్రాహ్మలావిడా.. ఇలాంటి ప్రతి చిన్న పాత్రా కూడా స్పష్టంగా మన కళ్ళ ముందు మెదుల్తుంది. వాళ్ళ మాటలు మన మనసులో నిలిచిపోతాయి.

ఇక దొర కుటుంబానికీ, వల్లడికీ మధ్య వున్న అనుబంధం గురించి. సాంఘికంగా వాళ్ళ మధ్య వున్నదూరం, హృదయాలలో వాళ్ళ మధ్య వున్న దగ్గరితనం – రెండూ కూడా గొప్పగా చెప్పారు.

దొరసాని మడికట్టుకున్నాక వల్లడితో మాట్లాడితే మళ్ళీ స్నానం చేయాలి. ఆవిడ బండిలో కూర్చుంటే.. ఎడ్ల తలతాళ్ళు వల్లడు లాగితే ఆవిడ ఆచారానికి పనికి రాదు. ఇంతటి దూరం వుంది వాళ్ళ మధ్య. మరొక ప్రక్కన మీరు ఊరికి తిరిగి రాకపోతే నేనిక్కడే అన్నం మానేసి చస్తానని వాడు ఆవిడని బెదిరిస్తాడు. ఆవిడ, అందరూ వ్యతిరేకమైన ఆ ఊర్లో నేనెలా నెగ్గుకురాగలనని భయపడుతూనే వాడి మాటలకి తల వొగ్గి వాడి వెంట వెళ్తుంది. ఇంతటి బాంధవ్యమూ వుంది.

దొరకీ తనకీ మధ్య ఉన్న బంధం గురించి వల్లడు ఇలా చెప్తాడు. “నేనూ ఆయనా ఒకే ఈడు వాళ్ళం. నాకన్నా కొంచెం చిన్నవాడనుకో. కులాలు భేదం గానీ మేమిద్దరం చుట్టాలల్లే వుండేవాళ్ళం. “ఒరే నాకు కూతురు పుడితే నీకు కొడుకు పుడితే వాళ్ళిద్దరికీ పెళ్ళి చేద్దామురా!” అన్నాడోరోజున. ఆ మాట నిజం కాదని ఆయనకీ తెలుసు. నాకూ తెలుసు. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకు మాకల్లా వుండేది.”

‘ఒకళ్ళంటే ఒకళ్ళకు మాకల్లా వుండేది’ అన్న ఈ మాట గురించీ, ఇది నా మనసులో కలిగించిన భావాల గురించీ ఒక పది పేజీలు వ్రాయచ్చు.

నలభై పేజీల ఈ పుస్తకంలో ఒక్కొక్క పాత్రనీ ఇంత స్పష్టంగా అర్ధం చేయడం.. మరోప్రక్కన కృష్ణా నదినీ.. దానిని చూసినప్పటి వల్లడి మనస్థితినీ – ఇలాంటివాటినీ వదిలిపెట్టకుండా వర్ణించడం.. ఇంకో వైపు ధర్మం పట్ల, నీతిగా బ్రతకడం పట్ల ఆరాధననీ, తాత్విక విషయాలపట్ల అవగాహననీ కలిగించడం.. నాటి సమాజ పరిస్థితులనీ, మనుషుల స్వభావాలలోని అత్యంత సున్నితమైన ఎన్నో అంశాలనూ స్పష్టంగా వివరించడం.. ఒక్క కోణం కాదు. ఒక్క ఆవేశం కాదు. ఒక్క రసం కాదు.

ఇలా చెప్తుంటే అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ నేనేం చేయను! ఆశ్చర్యం నుంచి తేరుకోవడం నా వల్ల కావడం లేదు. పొరపాటు పడ్డానేమోనని ఎన్నిసార్లు తిప్పి తిప్పి చూసినా నిజంగా నలభై పేజీలే వున్నాయి. విషయాలు చూడబోతే ఇన్నిన్నున్నాయి. వాటి లోతులు చూడబోతే ఇంతింతున్నాయి.

ఒక్క ఉదాహరణ చెప్తా. వల్లడు దొరసానిని తీసుకురావడానికి ఊరికెళ్తాడు కదా! అప్పుడు ఆవిడ వూరు మొదట్లోనే చెరువు దగ్గర కనిపిస్తుంది, నీళ్ళు తీసుకు వెళ్తూ. వల్లడితో మాట్లాడినందుకు ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ స్నానం చేయవలసి వస్తుంది. అందుకని ఆవిడ చెరువు వైపు వెళ్తూ నువ్వు యింటికి పదరా! నేనొస్తాను. అంటుంది. వల్లడు ఇంటికొచ్చేసరికి వాకిట్లో చిన్నదొర, అంటే దొర చిన్న కొడుకు మట్టి లో ఆడుకుంటూ వుంటాడు. వాడిది మరీ పసితనం. వాడికన్నా కొంచెం పెద్దవాడు పెద్ద దొర. అంటే దొర పెద్దకొడుకు.

వల్లడిని చూడగానే చిన్నవాడి స్పందన, కొంచెం వూహ తెలిసిన పెద్దవాడి స్పందన.. ఆ రెండింటి మధ్య తేడా.. పెద్ద పిల్లవాడు అప్పుడే ఇంటికి వచ్చిన తల్లితో “అమ్మా, వల్లడొచ్చాడే” అని సంబరంగా చెప్తే, ఆ సంబరాన్ని పాడు చేయడం యిష్టం లేక తల్లి తాను వల్లడిని ముందే చెరువు దగ్గర చూశానని చెప్పకుండా అప్పుడే చూసినట్లుగా మాట్లాడడం.. ఆ విషయాన్ని గమనించిన వల్లడు అంత చిన్న విషయం లోనుంచే దొరసాని స్వభావాన్ని అంచనా వేయడం…ఇంత వుంటుంది ఒక సంఘటనలో. మరి ఆశ్చర్యం కాదూ!

ఇక సన్నివేశాలు – ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం అద్భుతంగానే వుంటుంది కానీ వల్లడు దొరసానిని తిరిగి ఊరికి తీసుకువెళ్ళే సన్నివేశం మాత్రం పరమాద్భుతంగా వుంటుంది. వల్లడిమాటల్లో అదొక్కటీ చెప్తాను.

“ఆ రాత్రి సుఖంగా నిద్రపోయినాను. మరునాడు మా దొరసాని నాయనగారు పంచాంగం చూచి, బాగానే ఉందన్నాడు. బయల్దేరి కృష్ణ దాటాము. కృష్ణ దాట్టం తోటే అక్కడో ఊరుంది. ఆ వూళ్ళో ఓ బండి బాడుగకు కట్టించాను. ‘రెండు మాడ’ లిమ్మన్నాడు. సరే! అని ఒప్పుకున్నాను. ఆ బండికి గుడిశ లేదన్నాడు. ‘లేకపోతే మాడన్నరే యిస్తా’ నన్నాను. ఆ బండి ఆయన అరమాడా ఎక్కడ పోతుందోనని యెక్కడో గుడిశ తెచ్చి కట్టాడు. మా పెద్ద దొర “ఎడ్ల మెడలో గంటలూ, మువ్వలూ లేకపోతే నేనెక్క’ నన్నాడు. నేనూ అంతే నన్నాను. ఆ వూళ్ళో మువ్వల పట్టెడ ఎక్కడా దొరకలేదు. దొరసాని పిల్లవాణ్ణి కోప్పట్టం మొదలుపెట్టింది. నేను, “మనం దొరలల్లే వెళ్తున్నాం. మువ్వల పట్టెడ లేకుండా ఎట్లా వెళ్ళుతాం?” అన్నాను. మళ్ళీ కృష్ణ దాటి మా దొరసాని పుట్టిన వూరు పోయి వూళ్ళో కనుక్కుని ఎవరింట్లోనో అద్దాలు తాపిన మువ్వల పట్టెడలుంటే తీసుకు వచ్చాను.” అదీ సంగతి. అలా మొదలవుతుంది ఆ ప్రయాణం.

ఇక ఆ ప్రయాణమూ, వూరు చేరడమూ కూడా మురిపెంగా నవ్వుకుంటూ మీకు చెప్పేయాలని వుంది కానీ… అపుడు దీనిని పరిచయం అనరు. కాబట్టి ఇక్కడ ఆగుతాను.

*****About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.6 Comments


 1. శివఘనపాఠీ

  శ్రీవల్లీ రాధిక గారు… ఆహా.. సమీక్ష ఎంతబాగా రాశారు? చాలా బావుంది. మంచి నవల, మంచి సమీక్ష. కవిసామ్రాట్ .. కవిసామ్రాట్టే!


 2. విశ్వనాధ వారి “వీరవల్లడు” సమీక్ష చాలా బావుంది అని తేలిగ్గా చెప్పడం నాలుక చివరినుండి జారిన మాటలా అనిపిస్తోంది. మరి నాకు కలిగిన అనిర్వచనీయమయిన అనుభూతిని ఎలా ప్రకటించాలో అర్థం కాకుండా ఉంది. నేను సామాన్య పాఠకుడిని. నాలాంటివాళ్ళకి సైతం విశ్వనాధ వారి రచనలు ముఖ్యంగా నవలలు చేతిలో ఒలిచి పెట్టబడ్డ అరటిపళ్ళే. వీరవల్లడు దొరల మధ్య స్నేహ బాంధవ్యం వగైరాలు చదువుతుంటే సమీక్షలో రచయిత్రి చెప్పినట్లు ఆశ్చర్యంతో పాటు మనోల్లాసం కూడా కలుగుతుంది. సామాన్య పరిభాష లో చెప్పాలంటే దొర, వల్లడనే పనివాడు వారి అనుబంధం ఏ కాలంలోనూ బానిసత్వానికి చిహ్నాలుగా చెప్పలేము. ఇప్పుడు కూడా పల్లెల్లో కొంత ఇటువంటి స్నేహసంబంధాలు మనుష్యుల మధ్య ఉన్నాయి.భారతీయాత్మను అంతః సూత్రంగా అల్లిన వారి రచనలు నా వరకు అన్నీ దేనికది ఒక మణిపూసే. ఎప్పుడో చదివాను మళ్ళీ ఇప్పుడు ఈతరం విద్యావంతులచేతుల్లోంచి జాలువారుతున్న సమీక్షలు మహదానందాన్ని కలిగిస్తున్నాయి. రచయిత్రికి శుభాశీస్సులు.


 3. bhavani

  eppudo chadivina navala gurtuchesinanduku abhinandanalu.. bagundi


 4. kameswari yaddanapudi

  విశ్వనాథ సత్యనారాయణగారి నవలల్లో ఏకవీర, వేయిపడగలు గొప్పవైనా వాటిలో అంశాలపైన ఆయన ఆలోచనాకోణం నచ్చని వారు చాలా ప్రతికూలవ్యాఖ్యలను చేసారు.ఆయన అభిమానులైన వారు ,కానివారు కూడా వీరవల్లడు నవలను తప్పుపట్టలేదు. మానవ అనుబంధాలను గొప్పగా చిత్రించిన నవలగా వీరవల్లడు చాలా ప్రసిద్ధినే పొందింది. మనం ఎవరమైనా విశ్వనాథ వారికి, కీర్తినో అపకీర్తినో తేగలమని అనుకోను.


 5. mythili abbaraju

  ఒక గొప్ప రచయిత కృతులు అన్నింటినీ ఒకే స్థాయిలో తలదాల్చలేము. నూటికి తొంభై ఎనిమిది శాతం సందర్భాలలో అద్భుతం, అపూర్వం అనదగిన రచన చేసి ఉన్నా, తేడా కనబడే ఆ రెండు చోట్లని సమర్థించి నిలబెట్టాలనే ఆరాటం నిజానికి ఆ రచయిత పట్ల అపచారం అవుతుందని నేను అనుకుంటున్నాను. అభిమానించేవారికి అన్నీ బావుంటాయి, అయితే అన్నీ పంచుకొని తీరవలసినవి కావు. ఆ కాలానికి యథాలాపం గా చెప్పినవాటికి ఇప్పుడు ప్రాసంగికత ఉండకపోయే అవకాశం ఉంటుంది… కొన్ని అన్యాయాలు కాలాంతరాన కాని అర్థం కావు. ఇంకొన్నిసార్లు రచయిత కూలంకషం గా చెప్పాలనుకోకుండా ఒక వివాదాస్పదం కాగల సంగతిని మరొక దృక్కోణం తో రాసి ఊరుకుంటారు
  వ్యాస రచయిత్రి చెప్పిన విషయాలు అన్నీ నిజమే. ఈ నవల నేను చాలా సార్లు చదివాను, ఆ ఒడుపుకి లొంగిపోయి. పరిమితులకి లోబడి కూడా ఆ బ్రాహ్మణ దొర, దళితుడైన పాలేరు- వీరి మధ్యన సౌహృదం బాగా చెబుతారు. వారి మనసులలో ఎడం లేకపోవచ్చు, కాని ఆ సాంఘిక పరిస్థితులు తలచుకోవలసినవి కానే కావు.వల్లడి భక్తి, బాధ్యత ఈ రోజున తిరిగి చూస్తే బానిసత్వం గా అనిపించవా?మొదట ఊరు నిర్మించేటప్పుడే కడజాతి వారికి సబబయిన వాటా లేదు కదా? దొర ఆస్తి దొర బిడ్డలకి వచ్చింది, తెచ్చిపెట్టాడు ఆయన, మరి తన సంగతి ఏమిటి? తమను కదిలించివేసిన కృతజ్ఞత తో విశ్వనాథ రాసిన నవల ఇది,అంతవరకే. రచయిత డెబ్భయి యేళ్ల క్రితం వల్లడిని ‘ వాడు ‘ అని ఉండవచ్చు,[ కుటుంబరావు గారి తొలినాళ్ల రచనలలో పనివారికి నీచవచనం వాడేవారు, తర్వాత సవరించుకున్నారు ] ఈ పరిచయం లో అలా సంబోధించటం సబబేనా? కొన్ని కథలకు చారిత్రక ప్రాధాన్యం మాత్రమే ఉంటుంది, వాటిలో ఇది ఒకటి.
  రుడ్ యార్డ్ కిప్లింగ్ రచనలలో ప్రస్ఫుటమైన జాత్యహంకారం ఉంటుంది. పి.జి.వోడ్ హౌస్ అన్యాపదేశంగా ఇంగ్లీష్ వారి గొప్పదనాన్ని చెప్తున్నారా అనిపిస్తుంటుంది. ప్రసిద్దికెక్కిన బాలసాహిత్యకారిణి ఎనిడ్ బ్లైటన్ పైన కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగని వీరెవరి పుస్తకాలనీ చదవటం ఎవరూ మానేయలేదు. విశ్వనాథ వారిని కూడా అలాగ తీసుకోగలిగే స్థితికి ఇంకా సమకాలీనులైన తెలుగు పాఠకులు చేరుకోలేదు.
  తీవ్రంగా,నిష్పత్తి లేకుండా అపార్థం చేసుకోబడిన ఈ మహా రచయిత తెలుగులోరాసి ఉండటం మన దౌర్భాగ్యం. వారిని తిరిగి స్మరించుకొని చదువుకోవలసిన అవసరం కనిపింపచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామందికి అంగీకారం కాకపోయే కథాంశాలను పరిహరించాలని నా అభిప్రాయం. ఉత్తమస్థాయి శిల్పం, ప్రతిభావంతమైన పాత్ర చిత్రణ విశ్వనాథ వారి అన్ని నవలలలోనూ ఇంచుమించు ఒకే స్థాయిలో ఉంటాయి కనుక ఏ నవలని అయినా ఎంచుకోనగును. సమ్యక్ పరిశీలనకు పాఠకులు సిద్ధంగా ఉన్నప్పుడు కాని [అందుకు చాలా కాలమే పట్టవచ్చు] అన్యధా తప్ప భావించలేనివాటి పట్ల ఉత్సాహం అక్కర్లేదేమో . ఇది దాపరికం కాదు, వివేకం.


  • kv ramana

   mythili abbaraajugaaruu…chakkagaa cheppaaru. mii abhipraayaaniki rachayitri spandinchakapovadam aascharyam.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
1

 
 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
6

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 

 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1

 
 

విశ్వనాథలోని ‘నేను’ – రెండవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. (తొలి ...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మొదటిభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి (తొలి ముద్రణ విశ్వనాథ ...
by అతిథి
2