పుస్తకం
All about booksపుస్తకభాష

May 12, 2009

రవీంద్రుని శత వార్షికోత్సవ ముచ్చట్లు

‘ఫోకస్‌’ అంటూ పుస్తకం.నెట్‌ పిలిచాక విశ్వకవి రవీంద్రుడి గురించి ఏదయినా రాయాలని మనసు పీకింది. కానీ ఏం రాయాలి? మనలో ఎక్కువమందికి ఆయన చిన్నప్పుడే, దాదాపు ఏడో క్లాసులోపే పరిచయమవుతాడు. ఒక కాబూలీవాలా కథో, ఒక గీతాంజలి పాదమో పాఠ్యపుస్తకంలో నెమలీక లాగా దాక్కుని చిన్న మనసును ఏ క్వార్టర్లీ పరీక్షల తర్వాతో,  రెండో యూనిట్‌ ముందో పలకరిస్తుంది. దురదృష్టవశాత్తు అలా పలకరించకపోయినా, ఆయనకూ పిల్లలకూ సంయుక్తంగా వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే జనగణమన పాటగా అతనప్పుడే వారి నాలుకల మీదకు ఓ స్వరమై చేరిపోయి ప్రభాత ప్రార్థన సమయంలోనో, సంధ్యవేళ స్కూలొదిలే ముందో తప్పక ప్రతిధ్వనిస్తాడు.

అటువంటి మనిషి గురించి, అతని రచనల గురించి కొత్తగా నేనేం రాయగలను అనుకుంటూ పుస్తకాల్ని, పాత డైరీల్ని వెతికే పనిలో పడ్డాను. అప్పుడు మా ఆఫీసులో ఒక పెద్దమనిషి దగ్గర కనిపించింది – శ్రీ రవీంద్ర  శతవార్షికోత్సవ విశేష సంచిక. ‘యురేకా కసామిసా’ అంటూ ఒక్క గెంతులో వెళ్లి ‘మేట్రుగారండీ ఈ పుస్తకం నాకోపాలియ్యరాదేటి, నాన్సదివేసి మావోళ్లకు నాలుగు ముక్కలు సెప్పుకుంతాను కదా..’ అని కాళ్లట్టేసుకున్నాను. ఆయన ఓ చూపు చూసి ‘ఓలమ్మీ, నీకియ్యడానికేటి నేనింకెవడిదగ్గరో బెతిమాలీ బామాలీ ఎత్తుకొచ్చింది? నెగెహె… నాదయిపోయాక ఇత్తేఇత్తాను, ఇవ్వకపోతేఇవ్వను..’ అన్నాడు. ఉసూరుమని రెండ్రోజులు ప్రాణం ఉగ్గబట్టుకున్నాక, మూడో రోజు పిలిచి జాగ్రత్త అంటూ చెప్పి మరీ ఇచ్చారు. ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటే విశ్వకవి రవీంద్రుడి శతవార్షికోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, హైదరాబాద్‌ వారు 1961లో ప్రచురించినది. రెండొందల పేజీలున్న ఈ బైండు పుస్తకాన్ని అజంతా ప్రింటర్సు, సికింద్రాబాద్‌ ముద్రించారు. వెల పది రూపాయలు. మా ఎడిట్‌ పేజీ సీనియర్‌ ఒకాయన పేవ్‌మెంట్‌ మీద కొనుక్కొచ్చిన ఈ పుస్తకంలో ఏ పేజీని ముట్టుకున్నా నుసైపోయేలా ఉంది. కొన్ని పేజీలు పురుగులేవో తినేశాయి కూడా. ముఖచిత్రంగా రవీంద్రుడే గీసిన ఓ హంస బొమ్మ ముచ్చటగా ఉంది.

ఇందులో ఉన్నవి మొత్తం ముప్ఫైఐదు వ్యాసాలు. కవి, తత్వవేత్త, చిత్రకారుడు, సంగీతకారుడు, రచయిత… ఇలా రవీంద్రునిలోని భిన్న కోణాలను తామెరిగిన మేరకు వెల్లడించారు మప్ఫైఐదుమంది ప్రముఖులు. అందరూ మహామహులే. తొలి పేజీలో ఈ పుస్తకం పరిచయం అచంట జానకిరామ్‌ చేశారు. ‘ఈ సంవత్సరము రవీంద్రనామ సంవత్సరము’ అంటూ సాగిన ఆ పరిచయ వాక్యాల్లోనే టాగోర్‌ ఆంధ్రులకు అంత ప్రియమైన వ్యక్తి ఎందుకయ్యాడో వివరించారాయన.

‘రవీంద్రుడు తను పెంపొందించిన విశ్వమానవ సోదరభావము మూలాన భారతదేశపు ఎల్లలను దాటి లోకహితుడూ, లోకమిత్రుడూ, లోక గురువుగా శాశ్వతముగా ఉండిపోయాడు ప్రపంచంలో అందరి హృదయాలలోను. ఐనా, ఆయన జన్మించినది భారతదేశంలో కాబట్టి, భారతీయులమైన మనము, ఆయనను గురించి ప్రత్యేకంగా గర్వించడానికి తగిన కారణమున్నది. ఇంకా దగ్గరగా ఆలోచిస్తే, ఆంధ్రులకు ఆయన అభిమాన రచయిత. ఆధునిక ఆంధ్ర ఆధ్యాత్మిక సాధనకు రవీంద్రుని ఉపన్యాసాలూ, ఆయన రచనలూ ఎంతో ఎంతో సాయపడినవి. ఇక సాహిత్య విషయంలో ప్రబంధపు బంగారు సంకెళ్లను తెంపుకొని, హాయిగా స్వేచ్ఛగా క్రొత్తరీతులను పాడసాగిన మన కవికుమారుల ఆలోచనలనూ, ఊహలనూ, వాక్కునూ ఎంతో ఆవహించినవి రవీంద్రుని ఆలోచనా, ఊహా, వాక్కూ. ఈ కారణంగా రవీంద్రుడు తెలుగువారికి ఎంతో సన్నిహితుడైనాడు.’

‘గురుచరణ సన్నిధి’ వ్యాసంలో ‘విశ్వభారతిలో మహాకవి శిష్యునిగా ఉండి ఉండుట గొప్ప అదృష్టముగా భావించుచున్నాను’ అంటూ ప్రారంభించి  బెజవాడ గోపాలరెడ్డి శాంతినికేతన్‌లో తాను చదువుకున్న రోజుల్ని, అవి తన భావాల్ని ప్రభావితం చేసిన తీరునూ కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తారు. ‘చిరస్మరణీయమైన సమావేశము’ అనే వ్యాసంలో మండపాక రాజేశ్వరశాస్త్రి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూరుతో వీణాచార్య తుమరాడ సంగమేశ్వరశాస్త్రి పరిచయం గురించి రాశారు. 1919 ప్రారంభంలో పిఠాపురం రాజావారి ఆస్థాన వైణికుడిగా సంగమేశ్వరశాస్త్రి వీణావాదనం విన్న రవీంద్రులు ఆయన్ని శాంతినికేతనానికి ఆహ్వానించి, తప్పకుండా పంపమని రాజావారిని కోరారు. అలా ఆ ఏడాది సెప్టెంబర్‌ నెలలో శాస్త్రి శాంతినికేతనానికి వెళ్లారు. అక్కడ జరిగిన ఒక గొప్ప ఘట్టం గురించి రాజేశ్వరశాస్త్రిగారిలా రాశారు.

“వసంతోత్సవం అన్న నాటకంలో విశ్వకవీ, మహావైణికుడూ కలిసి గానం చెయ్యడం. కథానాయకుడొక ఋషి. ఆ పాత్రను ఠాగూరే ధరిస్తారు. వారు పాడిన పాటలను శాస్త్రి వీణ మీద అనుకరిస్తారు. కలకత్తానుంచి ప్రముఖులనేకులు హాజరైన ఈ చరిత్రాత్మక ప్రదర్శనలో శ్రోతలందరికీ ఠాకూరు పాట, శాస్త్రి వీణావాద్యమూ మరువరాని దివ్యానుభూతిని కలిగించినవి. వేర్వేరు మందంగల తీగలు కట్టిన వీణలు రెండు కలసి గానం చేస్తున్నట్లే అందరికీ అనిపించింది. ప్రదర్శన మధ్యలో లైట్లారిపోయినా ఠాకూరు పాటనాపలేదు, శాస్త్రి వీణ మానలేదు. ఆ గాఢాంధకారంలో ఒక దైవీ వీణ – గాత్రం, ఒక మానుషీవీణ కలిసి అమృతతుల్యమైన అమరగానం అందిస్తున్న ఆ మధుర క్షణాలు మరపురానివిగా శ్రోతల హృదయాలలో హత్తుకుపోయినవి.”

‘జయతి రవీంద్రో నూతన
కవిలోకశిఖామణీ నవోక్తిఫణీ
అధునాతన బహుకవి
రాట్కిరణోద్గమభూమి మార్తాండః’

– అంటూ సాగిన విశ్వనాథ సత్యనారాయణ ‘రవీంద్ర ప్రశంస’, రాయప్రోలు సుబ్బారావు, వేంకటపార్వతీశ్వర కవులు, దాశరధి, సి.నారాయణరెడ్డి రాసిన పద్యాలు, కవితలు ఈ పుస్తకాన్ని ఆసక్తిగా ఆశ్చర్యంగా చదివింపజేస్తాయి. తణికెళ్ల వీరభద్రుడు, పాలగుమ్మి పద్మరాజు, సంజీవదేవ్‌, బాలాంత్రపు రజనీకాంతరావు, వేలూరి రాధాకృష్ణ, మల్లవరపు విశ్వేశ్వరరావు, పెద్దాడ రామస్వామి, బొమ్మకంటి సింగరాచార్య, కొత్తపల్లి వీరభద్రరావు, శివశంకరస్వామి, అబ్బూరి రామకృష్ణారావు, కాటూరి వేంకటేశ్వరరావు, పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి, నాయని కృష్ణకుమారి, ముట్నూరి వేంకటకృష్ణారావు, గుడిపాటి వెంకటచలం వంటి మహామహులు రాసిన వ్యాసాలు రవీంద్రనాధ్‌ టాగోర్‌లోని భిన్న కోణాలను మన కళ్లకు కడతాయి. ఈ పుస్తకం ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు కనుక చదవాలనుకునేవారు సెకెండ్‌హ్యాండ్‌ పుస్తకాల దుకాణాల మీద ఓ కన్నేసి ఉంచక తప్పదు.About the Author(s)

అరుణ పప్పు5 Comments


 1. బాగుంది అరుణా రవీంద్రుని శత వార్షికోత్సవ పుస్తక పరిచయం. అలాంటిది వుందని కూడా తెలియని మాలాంటి వాళ్ళకు నిజం గా ఈ పరిచయం కన్నుల పండుగ.
  శ్రీనివాస్ గారు నాకు ఆ పి .డి. ఫ్ లను పంపగలరా? అప్పటి ఆ రవీంద్రుని మీద వ్యాసాలు చదవటం ఒక అధ్బుతమైన అనుభవం.. వీలైతే తప్పక పంపగలరు.
  ధన్యావాదాలు.


 2. Sreenivas Paruchuri

  చాలా సంవత్సరాల క్రితం “రజని” (శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు) గారి దగ్గర ఒక రెండు గంటలపాటు అరువు తీసుకుని ఫోటోకాపీ చేసుకున్నాను. ఇప్పుడు DLI లో లభ్యమవుతున్నట్లుంది. ఆసక్తి వున్న వాళ్ళు నాకు మైల్ పంపితే పి.డి.ఎఫ్. కాపీ అందించగలను.

  — శ్రీనివాస్


 3. మంచి విషయాలు చెప్పారు.
  ఈ పుస్తకంలోని వ్యాసాలకు కాపీరైట్లు ఉండకపోవచ్చనే అనుకొంటున్నాను. (నలభై ఏళ్లు దాటిపోయినవి కూడా)
  కనుక
  రవీంద్రుని పై చలం వ్యాసాన్ని దయచేసి అందించగలరా?

  ఈనాటి పాఠకులకు అంతకు మించి మీరిచ్చే గొప్ప కానుక మరేదీ ఉండదు.

  బొల్లోజు బాబా


 4. వ్యాసం అంతా చదివి, చివరికొస్తే, ఆపరేషన్ విజయం, పేషెంట్ పయనం అన్నట్టు ఉంది.

  ఏమ్ చేస్తాం, కానివ్వండి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అంతర్జాలంలో టాగోర్

టాగోర్ అంటే ఇంత iconic figure కదా… ఆయన గురించి అంతర్జాలంలో ఎంత సమాచారం ఉందో…అన్న ఉద్దేశ్య...
by పుస్తకం.నెట్
0

 
 

Stray Birds పై Stray Thoughts

ఓ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. “ఓయ్.. నన్ను వ...
by పుస్తకం.నెట్
6

 
 

Light, my light… the eye-kissing light!

“Vibhusanam maunamapanditanam” – says the great poet Birthirihari which loosely translates to “If you can’t make sense, you better be silent”. But I would like to defy Birthrihari, which I of...
by Achilles
2

 

 
నా జీవితం లో టాగోర్

నా జీవితం లో టాగోర్

టాగోర్ – నా జీవితంలో ప్రతి దశలోనూ ఎలాగో ఒకలా నన్ను వెంటాడుతూనే వచ్చాడు. చిన్నప్పుడ...
by సౌమ్య
7

 
 

రవీంద్రుడు, ఐన్ స్టీన్.

Space is finite, but boundless. – ఐన్ స్టీన్ That which ends in exhaustion is death, but the perfect ending is in the endless. – రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకాయన...
by రవి
8

 
 
He: Shey by Rabindranath Tagore

He: Shey by Rabindranath Tagore

“అతడు” – పదం వినగానే మహేష్ సినిమా గుర్తొచ్చేసిందా? హమ్మ్.. సరే! నేనిప్పుడు నాకు త...
by Purnima
9