వావిళ్ళ రామస్వామి శాస్త్రి

రాసిన వారు: ద్వైతి

బాలశిక్ష మొదలు భారతంబు వరకు
గ్రంథమేదియైన కావలసిన
వ్రాయుడింకనేల “వావిళ్ళ” కనియెడు
పలుకు తెలుగునాట నిలిచె నేడు

ఆంధ్ర వాఙ్మయ చరితంబునందు తెలుగు
ముద్రణ చరిత్రమును చెప్పమొట్ట మొదట
వెలయు మూడక్షరముల “వావిళ్ళ” పేరు
వాఙ్మయ ముఖాన నోం కృతి వరలునట్లు

నిడుదవోలు వెంకటరావు

*************
“తెలుగు జాతిరత్నాలు” పేరిట సి.పి.బ్రౌన్ అకాడెమీ సంస్థ వారు కొంతకాలంగా తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రలు వెలువరిస్తున్నారు. ఊహ తెలిసిన నాటి నుండి వావిళ్ళ ప్రెస్ అన్న పేరు, వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారి పేరూ వింటూ ఉన్నా, ఆయన గురించి పెద్దగా తెలిసిన సంగతులేమీ లేవు. తెలుగు వికీలో కూడా ఎక్కువ సమాచారం లేదు. దానికి తోడు, ఆన్లైన్లో కూడా మంచి వనరులేవీ కనిపించలేదు. ఇన్నాళ్ళకి, ఈ పుస్తకం పుణ్యమా అని ఆయన గురించి కొంచెం తెలుసుకున్నాను. సంక్షిప్తంగానైనా ఆయన గురించి తెలియజెప్పాలి అని పుస్తకం ముద్రించిన అకాడెమీ వారికీ, రాసిన శర్మ గారికి నమస్కారాలు.

పుస్తకం పేరు “వావిళ్ళ రామస్వామి శాస్త్రి” అయినా, పుస్తకాన్ని ఆయన జీవిత చరిత్రగా చూడ్డం కష్టం. మొదటి అధ్యాయం- “పుదూరు ద్రావిడుల చరిత్ర”, మూడో అధ్యాయం “చెన్నపురిలో పుదూరు వారి ప్రెస్సులు”, ఆరవ అధ్యాయం – “సరస్వతీ నిలయం ముద్రణాలయం నుండి వెలువడ్డ గ్రంథాలు”, ఏడు-“సర్ వేపా రామేశం పంతులు, మద్రాసు”, ఎనిమిది-“నృసింహ భారతీ స్వాముల జీవిత సంగ్రహము” , తొమ్మిది-“ద్వితీయ పుత్రి జీవిత సంగ్రహం”, పది-“వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి” – ఇలా వీటి పేర్లు చూస్తేనే తెలుస్తోంది కదా… పుస్తకం వావిళ్ళ వారి గురించే కాదు, వారి జీవితంతో సంబంధం ఉన్న ఇతరత్రా విషయాల గురించి, వ్యక్తుల గురించి కూడా అవగాహన కలిగించడానికి అని. కొంతమేరకు ఈ విధమైన అవగాహన మంచిదే అనిపించింది కానీ, కొన్ని చోట్ల అసలు ప్రెస్సుకి గానీ, సాహిత్య సేవకు గానీ ప్రత్యక్ష సంబంధంలేని ఆయా కుటుంబాలు, వాళ్ళ వంశవృక్షాలు, కుటుంబ చిత్రాలు-ఇవన్నీ తెలుసుకోవడం వల్ల చదువరులకి ఉపయోగం ఏమిటి? అన్నది మాత్రం అర్థం కాలేదు. ఆ విధంగా కొంచెం అసంతృప్తి కలించింది ఈ పుస్తకం నాకు. వావిళ్ళ గారి గురించి కంటే, తక్కిన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తోచింది.

అది సరస్వతి గ్రంథాలయం నుండి వెలువడ్డ పుస్తకాల గురించి రాసిన అధ్యాయం – నాకు చాలా నచ్చింది. పుస్తకాల గురించి కొన్ని ప్రాథమిక వివరాలు కూడా అందించినందుకు నాకు ఇది చాలా విలువైన అధ్యాయంగా అనిపించింది ఈ పుస్తకంలో. అక్కడక్కడా అసలు విషయం వదిలేసి పక్కదోవ పట్టిన దాఖలాలు లేకపోలేదు కానీ, పరిశోధకుల తత్వమే అంత అని సరిపెట్టుకోవచ్చు :).

తక్కిన సంగతులు అటు పెడితే, వావిళ్ళ వారి గురించి నాకు అద్భుతంగా అనిపించిన విషయం స్వంతంగా వ్యాపారం పెట్టాలన్న ఆలోచన కలగడం. ఎప్పుడో నూటయాభై ఏళ్ల క్రితం సామాజిక, కుటుంబ పరిస్థితుల మధ్య ఆ ఊహ రావడం ఒక ఎత్తైతే, మూడుసార్లు దెబ్బతిన్నా నాలుగోసారి మళ్ళీ ప్రెస్సు పెట్టి నిలదొక్కుకోవడమూ నాకు అద్భుతంగా తోచింది. ఈ ప్రయత్నానికి వాళ్ళ కుటుంబ సభ్యులు (ముఖ్యంగా భార్య) ఎలా స్పందించారో మరి! ఈ పుస్తకంలో పుదూరు ద్రావిడులు స్థాపించిన ఇతర ప్రెస్సుల వివరాలు చదువుతూ ఉంటే కూడా ఆశ్చర్యంగా తోచింది. ఇన్ని ఉంది ఉంటాయి అని అనుకోలేదు నేను.

పుస్తకం వెనుక అనుబంధంగా ఇచ్చిన ఫోటోలు, వావిళ్ళ వారు ముద్రించిన పుస్తకాల జాబితా : రెండూ భద్రపరుచుకోదగ్గవి.

అచ్చుతప్పులు బానే ఉన్నాయి అని నా అనుమానం. నాకు కనబడ్డంత లో కొన్ని.
౧) ఉపయుక్త గ్రంథాల జాబితాలో “విక్రమసింహపురి విద్వాత్ప్రవము” అని రాసారు. నాకు తెలిసినంతమేరకు ఆ పుస్తకం పేరు “విక్రమసింహపురి విద్వత్ప్రవరులు”.
౨) 106వ పేజీలో ఉన్న స్వర్ణ కంకణం ఫోటో కింద – “బహు గ్రంథ కర్త, బ్రిటీషు వేల్స్ యువరాజు విన్డర్స్ ప్రభువు నుండి 1922వ సంవత్సరంలో స్వర్ణకంకణం బహుకరించినది” అని రాసారు. అసలుకి వాక్యమే గందరగోళంగా అనిపిస్తే, అసలు స్వర్ణకంకణం పొందినది ఎవరో మొత్తానికే ఎత్తేసారు. చదలవాడ సుందరరామ శాస్త్రి గారు అనుకుంటాను.
౩) వావిళ్ళ వారి తృతీయ పుత్రి శారదమ్మ గురించి రాస్తూ – (1889-1996) అని రాసారు. తరువాత మళ్ళీ కింద, శారదమ్మ 1961 లో మరణించారు అని రాసారు వెంటనే.
౪) నృసింహ భారతీ స్వాముల వారి జీవితసంగ్రహం రాస్తున్నప్పుడు అల్లాడి సుబ్రహ్మణ్యం దంపతుల ఫోటోలు పెట్టారు. నిజానికి అక్కడ వాళ్ళ ప్రస్తావనే లేదు. వాళ్ళ గురించి తరువాతి అధ్యాయంలో ఉంది. అలాగే, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారి గురించి రాసిన అధ్యాయంలో కాళహస్తి కాశీవిశ్వనాథం, రామనాథం అన్న వారి మేనల్లుళ్ళ కుటుంబ చిత్రాలు ఇచ్చారు. అవి కూడా ఆ వ్యాసానికి అసంబద్ధమైనవి. నిజానికి వీరి ప్రస్తావన కూడా మరో అధ్యాయంలో ఉంది…కానీ, ఫోటోలు పెట్టేంత సమాచారం అయితే లేదు నా అభిప్రాయంలో.
౫)ఇవి కాకుండా చాలా చోట్ల నాకు వాక్య నిర్మాణం గందరగోళంగా అనిపించింది. అది నా తెలుగు ప్రావిణ్యం వల్లనా, లేకపోతే ఆ వాక్యనిర్మాణమే అలా ఉన్నదా? అన్నది అర్థం కాలేదు.
౬) వేపా రామేశం పంతులు అన్న అధ్యాయం మొత్తం చదివాక కూడా నాకు ఆయనెవరో అర్థం కాలేదు. అసలుకి ఆ అధ్యాయంలో రెండవ సగ భాగం చదలవాడ సుందరరామశాస్త్రి గారి గురించి… మొదటి సగ భాగం వావిళ్ళ వారి ప్రశంసానూ. ఈ విధంగా అధ్యాయాల విభజన చాలా చోట్ల నాకు అర్థం కాలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని చెప్పుకోవచ్చు కానీ, ఇన్ని ఉన్నా కూడా ఈ పుస్తకం పుస్తకం విలువైనది అనడంలో నాకు సందేహం లేదు. కొంచెం ముద్రణ సమయంలో ఎవరన్నా రెండోసారి చదివి, వాక్య నిర్మాణాలు, అచ్చుతప్పుల మీద శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనిపించింది, అంతే.

కానీ, ఒక్క మాట చెప్పాలి: ఈ తరంవారికి వావిళ్ళ వారిని పరిచయం చేసేందుకు రాసి ఉంటే మాత్రం ఈ భాషని అర్థం చేసుకోవడం ఈ తరంవారికి చాలా కష్టం. దానికి తోడు, ఒక్కొక్కచోట లోపించిన చుక్కలు, కామాలు వగైరాల మూలాన కలిగే అయోమయం ఒకటి ఉంది. అలాగే, వావిళ్ళ వారి గురించి బొత్తిగా అసలేమీ తెలియని వారికి ఈ పుస్తకం వల్ల మరింత అయోమయం కలుగుతుందేమో అని నా అభిప్రాయం.

“మా ఈ ప్రయత్నంలో వయోభారాన్ని కూడా లెక్కచేయక…… అడిగినదే తడువుగా రచించి ఇచ్చిన వజ్ఝల వెంకట సుబ్రమణ్య శర్మ గారికి…” -అని ముందుమాట చివర్లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు రాసిన మాట మాత్రం అక్షర సత్యం. ఎనభై పైచిలుకు వయసులోనూ ఆయన ఉత్సాహంగా పుస్తకం రాసినందుకు సాష్టాంగ వందనాలు.

ఇక, ఇట్టాంటి కారణాలు నేను లక్ష చెప్పినా కూడా, ఈ పుస్తకం అంటూ ఒకటి రావడమే నాకు సంబంధించినంత వరకూ గొప్ప విషయం కనుక, చదవాల్సిన పుస్తకమే అని అభిప్రాయపడుతున్నాను. వావిళ్ళ వారిపై వచ్చిన పుస్తకాలలో ఎవన్నా ఆన్లైన్ లో దొరికే అవకాశం లేదా, ఇండియాలో కొనుక్కునే అవకాశం ఉంటే తెలుపగలరు.

***************
వావిళ్ళ రామస్వామి శాస్త్రి : 1826-1891 (Vavilla Ramaswamy Sastri)
వజ్ఝల వెంకట సుబ్రమణ్య శర్మ (V.V.Subramanya Sarma)
First Edition: 2009
Publisher: C.P.Brown Academy
Pages: 108
Price: 90/-
For Copies: http://www.cpbrownacademy.org

You Might Also Like

3 Comments

  1. అరుణ పప్పు

    సర్ వేపా రామేశం మద్రాసు హైకోర్టుకు అతి చిన్న వయసులో ముఖ్య న్యాయాధికారి అయిన తెలుగు వ్యక్తి. విశాఖపట్నం నుంచి సర్ బిరుదం పొందిన ముగ్గురిలో ఆయనొకరు. గణిత, న్యాయశాస్త్రాల్లో దిట్ట. గణిత మేధావి రామానుజమ్ ఇంగ్లండ్ వెళ్లడానికి సాయం చేసిన వ్యక్తి. ఆయన కుమార్తెల్లో ఒకరైన దువ్వూరి లలితాంబ 97 ఏళ్ల వయసులో చెప్పిన జ్ఞాపకాల ద్వారా ఆయన గురించి మరికొంత తెలుస్తుంది.
    http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2011/nov/20/gnapakalu&more=2011/nov/20/sundaymain

    1. సౌమ్య

      అరుణ గారికి
      మీరు చేసిన ఇంటర్వ్యూ బాగుందండీ. నిజానికి ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాక్కూడా ఆయనెవరో అర్థం కాలేదు.
      Thanks for sharing!

  2. వేణు

    విలువైన గ్రంథాలనెన్నో అమిత శ్రద్ధాసక్తులతో తెలుగువారికి అందించిన వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారి గురించి ఇలా పుస్తకం రావటం సంతోషకరం. రచయితకూ, ప్రచురించినవారికీ అభినందనలు.

    అచ్చుతప్పులు అసలేమీ లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునే సంప్రదాయం ఆ ప్రచురణ సంస్థది. అలాంటిది ఆ సంస్థ అధినేత గురించి రాసిన పుస్తకంలో అక్షరదోషాలు ఉండటం మింగుడుపడనిదే. తర్వాతి ముద్రణలో అక్షర దోషాలతో పాటు మీరు పేర్కొన్న లోపాలు సవరించుకుంటారని ఆశిస్తున్నాను.

Leave a Reply