దివాణం సేరీవేట – పూసపాటి కృష్ణంరాజు చెప్పిన అలరాచపుటిళ్ళ కథలు

నేను పత్రికలు విడువకుండా చదువుతూ కథలనీ, కథకుల్నీ గుర్తుపెట్టుకోవటం మొదలుబెట్టేటప్పటికే తెలుగులో మంచి కథకులు చాలామంది కథలు వ్రాయడం మానేశారు – కొ.కు, ముళ్ళపూడి, సి.రామచంద్రరావు వంటి వారు. ఈ కోవలోనే ఇంకొక గొప్ప కథారచయిత పూసపాటి కృష్ణంరాజు గారు. చాలాకాలం తర్వాత ఒక కథాసంకలనంలో (తెలుగు కథ, సాహిత్య అకాడెమి, 1988) రెండు బంట్లు పోయాయి కథ చదివేను. అరే, భలే రాశాడే అనుకొన్నాను కథ చదివిన వెంటనే. కథావస్తువు కొత్తది కాదు. కానీ కథ వెనుక వాతావరణం, కథ ఎత్తుకొన్న తీరు, నడిపిన తీరు, ముగింపు, భాష, ఆఖరుకు కథకు పెట్టిన పేరు సెభాషో! అనిపించేలా ఉన్నాయి. అప్పట్నుంచీ కృష్ణంరాజుగారి కథలకోసం ఒక కన్నువేసి ఉంచాను. ఆయనవి మరికొన్ని మంచి కథలు కథాసంకలనాల్లోనే దొరికాయి. కృష్ణంరాజుగారి కథలన్నీ కలిపి సీతాలు జడుపడ్డది అనో, పూసపాటి కృష్ణంరాజు కథలు అనో పుస్తకాలుగా వేశారని విన్నాను కానీ నాకెక్కడా దొరకలేదు. తెలుగునాడి పత్రిక 2005 జనవరి సంచికలో అలనాటి కథ శీర్షికలో కృష్ణంరాజుగారి దివాణం సేరీవేట కథ ప్రచురించాము. డెట్రాయిట్ ప్రాంతంనుంచి తెలుగునాడికి చందా కడుతూ అప్పుడప్పుడు ఉత్తరాల ద్వారా అభిమానం వెల్లడిస్తున్న ఒక పాఠకురాలు కృష్ణంరాజుగారి కుమార్తె అట. కథ వేసినందుకు కృతజ్ఙతలు చెపుతూ ఉత్తరం వ్రాశారు. మొహమాటపడకుండా (సిగ్గు లేకుండా) ఆమె దగ్గర కృష్ణంరాజుగారి కథాసంకలనం కాపీ దొరుకుతుందా అని అడిగాను. ఆ సంవత్సరం జులైలో డెట్రాయిట్‌లో 15వ తానా మహాసభలు జరుగుతున్నప్పుడు ఆమె భర్తతో కలసి వచ్చి ఎంతో సహృదయంతో ఈ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. వారికి మళ్ళీ ఇప్పుడు బహిరంగంగా కృతజ్ఞతలు చెప్తున్నాను.

పూసపాటి కృష్ణంరాజుగారు తక్కువగా కథలు వ్రాశారు. నిజానికి చాలా ఆలస్యంగా కథలు వ్రాయటం మొదలుబెట్టారట. ఆ ఆలస్యానికి, తక్కువ కథలు రాయటానికి ఆయనే చెప్పిన కారణాలు…

“కథలు రాద్దామనే ఉద్దేశం నాలో కలిగేనాటికి అనేక దశలు గడిచిపోయినై. కాస్త ఆలస్యంగా కలం పట్టుకొన్నందున చురుగ్గా సాగలేక ఆయాసంతో కాళ్ళు సరిగ్గా పడ్డం లేదు. అనుభవం, బాధ్యత బరువుని గుర్తు చేస్తుంటే గమనానికి ఆటంకాలు కదూ!…లెక్కలేనన్ని కథలు, గల్పికలు రాయాల్సిన వయస్సులో చేతను కలానికి బదులు హలం ఉండటం, విద్వద్గోష్టిలో పాల్గొనవలసిన ప్రాయంలో ఆలమందలను కాసుకుంటూ వాటివెంట తిరిగి మూగభాషలో మచ్చిక చేసుకోవడం, కుకవి సుకవుల కావ్య మీమాంసల్లో తలదూర్చవలసిన నాడు చెరుకుపొదల్లో కూలినై దూరి, ఆకుల రంపపుకోతకు ఓర్చి తోట చుట్టడం, కావ్యాలల్లవలసిన ప్రాయంలో భయంకరమయిన ఉక్కు కార్ఖానాఘోషల మధ్య నిర్మలమైన మనస్సుతో కండలు కరిగించుకునే కార్మికునివంటి అనేకానేక సంఘటనలు నాకు రచయితగా కన్ను విప్పుకునేందుకు కాస్త ఆటంకాలయినవి.”

దైనందిక కార్మిక జీవనంతో ఇంత ప్రత్యక్ష, వైవిధ్య అనుభవం ఉండబట్టేనేమో ఆయన కథలు జనజీవనాన్ని గొప్పగా ప్రతిబింబించేయి.

అయినా అందుబాటులో ఉన్నంతమట్టుకు దొరికిన పుస్తకాలన్నీ చదివేరు. గురజాడ అప్పారావుగారి రచనలు కృష్ణంరాజుగారిని రచనకు పురికొల్పాయి. 1960 ప్రాంతాల్లో దివాణం సేరీవేట కథ వ్రాసేరు. పత్రికకు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) కథను ఇచ్చేరు. వారు ప్రచురించేరు. ఆ ఆనందం మరిన్ని రచనలు చేయాలని పురికొల్పింది. “’మనుషులు బాగుపడాలి’ అనే రాసేను. ‘దేశం బాగుపడాలి’ అనే కోరుకుంటున్నాను… వారి జీవితాలను పరిశీలనగా చూసి, చూసినది చూసినట్టు చతురతతో రాసి అట్టి జీవిత సత్యాలను రచనలో చట్రం కట్టినప్పుడు అద్దంలో చూసుకొన్నట్టు వారి వారి ప్రతిబింబాలను రచనల్లో చూసుకుని వారి రూపాలను వారే చక్కదిద్దుకొనేందుకు అవి ఉపయోగపడేలా రాసేందుకు ప్రయత్నం చేసేను, చేస్తున్నాను, అందుకే నేను రాసేను” అని చెప్పారు కృష్ణంరాజుగారు.

దివాణం సేరీవేట కృష్ణంరాజుగారి మొదటి కథ అనుకొన్నాం కదా. ఒక్కసారి ఆ కథ ఏమిటో చూద్దాం.

అడవిపందిని పొడుచుకొచ్చేరు. చావిడి ముందు పడేసేరు. చావిడి అరుగులమీద చినరాజులంతా చతికిలబడి కూర్చున్నారు. రాట్లకు స్తంభాలకు వేటకుక్కల్ని కట్టేరు. గోడలకు చేరబెట్టిన యీటెలు మెరిసిపోతున్నాయి. వాళ్ళ ప్రతాపాలు కబుర్లు వీరోచిత గాధల్లో జయలక్ష్మిని చేపట్టిన సైనికుల వీర సంభాషణల్ని స్ఫురింపజేస్తున్నాయి. పొలాలకు పోతున్న పాలికాపులు, రేవుకు వెళ్ళే పడతులూ ఆ ముచ్చట కాస్త తొంగిచూసి మరీ వెళ్తున్నారు.

చినరాజులందరికీ భీష్ముడు – ఒకప్పుడు వేటలో ఆరితేరిన, ఎనభై యేళ్ళుదాటిన రాంభద్రరాజుగారు. ఆయనే పూనుకొని మా తుప్పుపట్టిన యీటెలను దులిపించి చినరాజులని “తలో కుక్కని మేప”మని సరంజామా అంతా గూర్చి తరిపీజు యిస్తున్నారు. వేట మొదలుబెట్టి ఆరుమాసాలయినా పంది పట్టుబడ్డం ఇదే ప్రధమం. ఆయన చావడిదగ్గరకు రాగానే చినరాజులంతా ఆయన చుట్టూ చేరి అడవిపందిని ఎట్టా కొట్టి తెచ్చారో వివరంగా వర్ణించి చెప్పారు. పెదరాజుగారి కంటికి ఎందుకో ఆ పంది అంత బాగా ఆనడంలేదు. వేటకు సైన్యాధిపతి లాంటి జగన్నాధం ఆయన అనుమానాల్ని కొట్టిపడేశాడు. పందిని కోసి వాటాలు వేసి పంచిపెట్టాక రాజులంతా సుష్టుగా భోజనంచేసి, విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాయంత్రానికి చావడిదగ్గర సమావేశమయ్యారు. ఐతే, అంత అనుభవమున్న పెద్దరాజుగారు ఊరికే అనుమానపడతారా? ఆ సాయంత్రం పక్కవూరు చంద్రాయి వచ్చాక కానీ ఆ ముడి విడవడలేదు.

అసలు ఎవరైనా మొదటి కథ రాసే పద్ధతి ఇదేనా? పందివేట పైన కథా? గోడలు జారిపోయిన దివాణం కథాస్థలమా? ఇంతమంది పాత్రలా ఈ చిన్న కథలో? అదీ ఉత్తరాంధ్ర మాండలికంలోనా? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగిసిందో ఈ కథ! అనుభవం లేనివాళ్ళు మొదటి కథలే ఇలా రాసేస్తే అనుభవం ఉన్నవాళ్ళు ఇంకేం రాయాలి? బొత్తిగా ఆరుపేజీలు కూడా లేని ఈ కథ చదివినవాళ్ళకి ఆ శిథిలమైన దివాణమూ, పెద్దరాజుగారూ, చిన్నరాజులూ, పల్లె కాపులూ, వయారంగా బిందె నడుం మీద తిప్పుకుంటూ నడిచే ఎంకీ కళ్ళముందు 70 ఎం.ఎం.లో కదలాడేట్టు చేయడం కొత్తగా కథలు రాసేవాళ్ళు చేయగల పనేనా? సగటు పాఠకుడికి బొత్తిగా పరిచయం లేని ఒక సంస్కృతిని ఇట్లా పటం గీసినట్టు వివరంగా చూపించడం ఏమన్నా సామాన్యమైన సంగతా? ఈ ఒక్క కథ చాలదూ పూసపాటి కృష్ణంరాజు గారు అలాంటిలాంటి అల్లాటప్పా రచయిత కాదు అని నిరూపించటానికి?

కొంతమంది కళాకారులుంటారు. రావటం రావటమే తారాజువ్వల్లా పైకి దూసుకుపోతారు; ఉన్న సత్తువంతా ఒక్కపళాన ఖాళీ చేసుకుని మళ్ళీ అదే స్పీడుతో క్రిందబడి మాయమౌతారు. కృష్ణంరాజుగారు మాత్రం తానేమీ ఒంటికథ వండర్‌ని కాదని స్పష్టంగా ఋజువు చేసుకున్నారు తన మిగతా కథల్లో. పైన చెప్పిన రెండుబంట్లు పోయాయి కథలో ఇతివృత్తం అంతకు ముందు చాలా కథల్లో వచ్చిందే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి దగ్గర్నుంచి ఈ రోజుదాకా చాలా మంది చెప్పిన కథే. ఐతే, కృష్ణంరాజు గారు చూపించిన బొమ్మ వేరు. చదరంగం బల్ల చేతిలో లేకుండా కదలని తాతగారు పెళ్ళికుమార్తె తరపువారి పిలుపునందుకుని బంధువుల ఊరు వెళ్ళారు. తీరా ముహూర్తం సమయం వచ్చేసరికి జరిగుతున్న సంఘటనలు చూసి “వెధవ సంత ఇది పెళ్ళేనా!” అని విసుక్కునే పరిస్థితి వచ్చింది. తాతగారు అంతకు ముందు ఊహించని ఎత్తుల్ని చూశారు ఆ పెళ్ళిపందిరిలో. ఆ వాతావరణంలో తాతగారి బలగంలో రెండుబంట్లు పోతే ఆశ్చర్యమేముంటుంది? ఈ రెండుబంట్లు పోయాయి కథ చాలా సంకలనాల్లో చోటు చేసుకోవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.

మొఖాసాదారుల దొడ్లలో పశువులు ఎలా క్షీణించిపోయాయో చెప్పే ఒక ఉదాహరణ సామంతం కథ. నల్లరాజూ, తెల్ల దొరా సరదాగా ప్రారంభమైన సెంటిమెంటల్ కథ. కూలిపోతున్న ఇంటికప్పుని తిరగేయించుకోవాలని తెగ ఆరాటపడ్తున్న తల్లీ, నిరుద్యోగి కొడుకుల కథ దిగులు చాసో కథల్ని గుర్తుకు తెస్తుంది.

కృష్ణంరాజు గారు మాసిపోయిన రాచరికాల గురించో, లేక పల్లెటూళ్ళ గురించో మాత్రమే రాయగలరనుకుంటే పొరపాటే. భూతాలస్వర్గం కథలో ఏదో పెద్దపాటి పట్నంలో కొత్తగా కట్టిన హోటల్లో కొంతమంది స్నేహితుల మధ్య జరిగిన మందుపార్టీ గురించి రాసిన తీరు చూడాలి; అదే కథలో నాయకుడి చిన్ననాటి వేట అనుభవాన్ని బార్‌లో సంఘటనలను కలిపిన విధానాన్నీ చూడాలి. అలాగే మహారాజయోగం కథలో వైజాగ్‌లో ఒక స్టూడెంటులాడ్జీలో కలసి చదువుకుంటున్న కుర్రాళ్ళ కథలో రాచరికపు చాయలెమీ కనిపించవు.

కుక్కుటచోరులు వంటిదే ఒక కథ ఒకటి నామిని సినబ్బ కతల్లో కనిపిస్తుంది. దెయ్యాల భయానికి, మూఢ నమ్మకాలకీ బలైన ఒక కుటుంబం కథ సీతాలు జడుపడ్డది. ఇంకోరకం దెయ్యాల కథ దారి తప్పినా, మాట తప్పినా. ఒక ఉత్తరాంధ్రపల్లెటూళ్ళో తనకు తెలియని సుడిగుండాల్లో చిక్కుకుని పేరంటాలయిన ఒక అభాగ్యురాలి కథ పేరంటాలు గుండం.

కృష్ణంరాజు గారు దాదాపు 15 కథలు వ్రాశారని పుస్తకాల్లో కనిపించే మాట. 1964లో వచ్చిన సీతాలు జడుపడ్డది సంకలనంలో పదే కథలు ఉన్నాయిట. వాటికి భూతాల స్వర్గం కథ కలిపి 11 కథలతో ఈ పుస్తకం వచ్చింది. ఇవి కాక ఆయన వేరే కథలు కూడా వ్రాశారో, లేక 15 అనేది ఒట్టి ఉజ్జాయింపు లెక్కో తెలీదు.

కృష్ణంరాజు గారి కథల్లో బలంగా కనిపించేది వాతావరణ చిత్రణ. వర్ణనలే కాక, సంభాషణలు, సంఘటనలతో ఆయన చకచకా ఒక సజీవమైన చిత్రాన్ని మనముందు పెడతారు. ఆ చిత్రంలో పాత్రలు జీవంతో కళకళలాడతాయి. దీనికితోడు సునిశితమైన పరిశీలన ఉంటుంది. వ్యంగ్యమో, చమత్కారమో, బలమైన అనుబంధాలో మేధకు చురుకు పుట్టేట్టు, మనసును హత్తుకునేట్టు ఉంటాయి. ఇంతచేసీ, కథల నిడివి మరీ పెద్దగా ఏమీ ఉండదు. ఆకర్షణీయంగా కథ చెప్పే విద్య కృష్ణంరాజుగారికి బాగా తెలుసు.

కృష్ణంరాజుగారు 1928 ఆగస్టు 20న విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో జన్మించారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ ఆక్ట్ (జమీందారీ రద్దు చట్టం) వల్ల ఆస్తులు పోయినా, ఆభిజాత్యాలు పోని కుటుంబాలను దగ్గరనుంచి చూశారు. ఉన్నతవిద్య లేకపోయినా, విశాఖ కాల్టెక్స్ రిఫైనరీ, మద్రాస్ రిఫైనరీస్‌లలో పైప్‌లైన్ నిర్మాణాలలో ముఖ్యపాత్ర వహించేరు. నటుడు, నాటక రచయిత, నాటక ప్రయోక్త కూడా. కృష్ణంరాజుగారు అరవై ఆరేళ్ళుదాటాక 1994 నవంబరు 18న మరణించారు.

ఈ పుస్తకాన్ని ప్రచురించటానికి సంకల్పించిన దాట్ల రాజుగారు ఒక ముందుమాటలో కృష్ణంరాజుగారి గురించి కొన్ని వివరాలు ఇచ్చారు. కె.ఎన్.వై పతంజలి ఇంకో ముందు మాటలో కృష్ణంరాజుగారి శిల్పాన్ని క్లుప్తంగా పరిచయం చేస్తూ, కృష్ణంరాజుగారిని తన గురువుగా భావిస్తున్నాననీ, చాసో అభిమానించిన అతి కొద్దిమంది రచయితల్లో కృష్ణంరాజుగారు ఒకరనీ చెప్పారు. నేనెందుకు రాసేను అని కృష్ణంరాజు గారి వ్యాసం ఉంది. (1960లలో విశాఖ రచయితల సంఘం వారి సమావేశాల్లో నేనెందుకు రాసేను/రాస్తున్నాను శీర్షికతో ప్రముఖ రచయితల చేత ఉపన్యాసాలు ఇప్పించేవారు. ఈ వ్యాసం ఆ పరంపరలోదేమోనని నా అనుమానం. శీర్షిక తప్పించి నా అనుమానానికి వేరే ఆధారాలేమీ లేవు). ఫ్రజాసాహితి వర్కింగ్ ఎడిటర్ నిర్మలానంద ఈ పుస్తకానికి సంపాదక బాధ్యతలు వహించారట.

కృష్ణంరాజుగారి బొమ్మతో కలిపి బాపుగారు వేసిన ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. ఐతే, లోపల పేజీల ముద్రణలో అంత శ్రద్ధ తీసుకోలేదు. మార్జిన్లు లేకుండా, పేజీలో ఎక్కడా ఖాళీ అన్నది కనిపించకుండా ఇరుకిరుగ్గా అనిపించిన పేజీలు చదవటానికి ఇబ్బందిగా, చూడడానికి చిరాకుగా ఉన్నాయి. పుస్తకం ప్రచురించటానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డమొచ్చాయి అని ముందు మాటల్లో చెప్పిన విషయం ఇలాంటి ముద్రణకు కారణమేమో తెలీదు. అచ్చుతప్పులనిపించే కొన్నిటిని మాండలికం తీరు కాబోలు అని సరిపెట్టుకుని పక్కన పెట్టినా, స్పష్టంగా తెలిసే ముద్రారాక్షసాలు విరివిగానే ఉన్నాయి. ఏ కథకూ, కథ ప్రథమ ప్రచురణగురించిన వివరాలేమీ లేవు. సంపాదకులు కొద్దిగా శ్రమపడి ఈ వివరాలన్నిటినీ సేకరించి ఉంటే బాగుండేది.

ఈ పుస్తకం ఇంకా దొరుకుతుందో లేదో తెలీదు. తెలుగు కథల మీద ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవవలసిన కథలు ఇవి.

*********

దివాణం సేరీవేట
(కథల సంపుటి)
పూసపాటి కృష్ణంరాజు (1928-1994)
2000
సాగి శివసీతారామరాజు స్మారక కళాపీఠం
కుసుమగజపతి నగర్, విజయనగరం
102 పేజీలు; 35 రూ.

You Might Also Like

6 Comments

  1. Anil

    Reprint chesthe bagundu

  2. కొత్తపాళీ

    భలే రచయితని పరిచయం చేశారు.
    రేండు బంట్లు పోయాయి కథ బ్రిలియంట్.
    పాత్రల్ని కేరికేచరైజ్ చెయ్యకుండానే చక్కటి హాస్యం పుట్టిస్తారు.

  3. రామ

    దివాణం సేరి వేట – తెలుగు నాడి పుణ్యమాని చదివాను. చాలా బాగా అనిపించింది. వీరి మిగిలిన కథల్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  4. surampudi pavan santhosh

    దారి తప్పినా, మాట తప్పినా కథ వంశీకి నచ్చిన కథలు సంకలనంలో ఉంది. కనుక అదొక్కటే చదివా ఈ పరిచయం చూస్తుంటే ఆ కథలన్నీ చదవాలనుంది. ఏం చేస్తాం. పాతపుస్తకాల దుకాణాల మీద పడాలి.

  5. dvenkat

    రెండు బంట్లు పోయాయి కధ చదివినప్పటి నించి ఈయన కధలకోసం చాలా ప్రయత్నించాను. దొరకలేదు. ఎవరైనా రీ ప్రింట్ చేస్తే బావుణ్ణు

  6. దువ్వూరి వేణుగోపాల్

    దివాణం సేరీ వేట – ఎక్కడ, ఎప్పుడు చదివానో గుర్తులేదు కాని ఇప్పటికీ ఇంకా గుర్తున్న కథ. ఇది ఏదో పత్రికలో చదివిన గుర్తు. గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

Leave a Reply