విశ్వనాథ వారి ‘సాహిత్య సురభి’

“సాహిత్య సురభి” అన్నది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పుస్తకం. “రాసిన” అంటే, పూర్తిగా రాసిన అని కాదు. నిజానికి ఈ పుస్తకం మన పురాణాలలోని బాగా ప్రాచుర్యం పొందిన ఓ మూడొందల పద్యాల సంకలనం. ఈ మూడొందల పద్యాలనూ అర్థసహితంగా వివరించి ఆయన స్వీయ విశ్లేషణలు అక్కడ పొందుపరిచారు. దైవ ప్రార్థనతో మొదలౌతుంది – శుక్లాంబరధరం శ్లోకాన్ని విశ్లేషిస్తారు. తరువాత “యాకుందేందు తుషార హార ధవళా” మరియు “తల్లీ నిన్ను దలంచి పుస్తకము..” – సంస్కృతం, ఆంధ్ర భాషల్లోని సరస్వతీ స్తోత్రం పద్యాలు భావ సహితంగా చెప్పి విశ్లేషిస్తారు. తరువాత నన్నయ భారతంలోని మొదటి పద్యం ఐన – “శ్రీవాణీ గిరిజాస్చిరాయ దధతో” పద్యాన్ని గురించి వ్యాఖ్యానం తో అసలు సాహిత్య సురభి మొదలౌతుంది.

ఈ పద్యం “ఆంధ్రకేసరి” సినిమాలో “వేదంలా ఘోషించే గోదావరి” పాటలో మొదటిసారి విన్నాను నేను. దీనికి ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు. దీనిలో ఇంత అర్థం ఉందని కూడా ఈ పుస్తకంలో చూసేదాకా తెలియదు నాకు. నన్నయ, తిక్కన, నాచన సోమన, అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, బమ్మెర పోతన, శ్రీనాథుడు, పింగళి సూరన, సారంగు తమ్మయ్య మరియు నంది తిమ్మన గారి పద్యాల గురించిన వ్యాఖ్యలు ఉన్నాయి ఇందులో. పేర్లు వింటూ ఉంటేనే (సారంగు తమ్మయ్య అన్న పేరు తప్ప) చిన్నప్పుడు స్కూల్లో పద్యాలు నేర్పిస్తూ ఈ ప్రాచీనకవుల గురించి టీచర్లు చెప్పిన విషయాలు గుర్తు వస్తున్నాయి. మనమందరం వెనక్కి వెళ్ళి గ్రాంథికం మాట్లాడుతూ, పద్యాలు రాయాలి అనట్లేదు నేను. మన చరిత్రని మనం తెలుసుకోవాలి అంటున్నా. తెలుగు భాషలోని ప్రత్యేకతను కనీసం acknowledge చేసేంత జ్ఞానం అన్నా కలుగుతుంది ఈ పుస్తకం చదివితే. అంతే కాదు, పద్యాలు చదవడం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం – ఇదంతా ఓ మానసిక వ్యాయామం. అందుకే గ్రీకు-లాటిన్ క్లాసులు కూడా పెడతారట కొన్ని దేశాల పిల్లలకి తప్పనిసరిగా. ఓసారెప్పుడో ఇక్కడ చదివాను. “[Latin] trains your mind. Trains your memory. Unraveling a Latin sentence is an excellent exercise in thought, a real intellectual puzzle, and a good introduction to logical thinking,” అదే మన పద్యాలు చదివే విషయానికీ అన్వయించుకోవచ్చు.

కెరీర్ ఓరియంటెడ్ తల్లిదండ్రులూ, పిల్లలూ – “అబ్బా! తెలుగా! ఎందుకిప్పుడూ!” అని విసుక్కునే ముందు పై వాక్యాలు, అసలా వ్యాసం చదివితే “సాహిత్య సురభి” వంటి పుస్తకాలు మనకెందుకు అవసరమో అర్థమౌతుంది. “ఎందుకూ? మనకు కూడా గ్రీకూ-లాటిన్ నేర్పొచ్చు కదా…ఎంచక్కా ఓ విదేశీ భాష నేర్చుకున్నట్లు ఉంటుంది.” అంటారా… ఇక మీ ఇష్టం. “హీ హుళ హుళ హుళ హిక్కి హిక్కి హిక్కి సిక్కి మిక్కీ మిన్నీ” అని సుత్తి వీరభద్రరావు పిచ్చి భాష మాట్లాడుతూ షర్టు చించుకుంటాడు ఈ వాదన విన్నాడంటే మాత్రం.

ఇప్పుడీ పుస్తకం ప్రచురణలో ఉండే అవకాశం చాలా తక్కువ. నేను చదివినది 1986 లో వేసిన ద్వితీయ ముద్రణ. ప్రచురణకర్తలు – ఎస్ ఎ ఎస్ అండ్ కో, హైదరాబాద్. ఇలాంటి పుస్తకాల అవసరం మన తరానికి, తరువాతి తరానికి చాలా ఉందని నా అభిప్రాయం. మీరేమంటారు? విజ్ఞులెవరైనా ఇలాంటి ప్రయత్నాలకి పూనుకుంటే బాగుంటుంది. కనీసం పద్యాలు-వాటి అర్థాలూ వివరించే ప్రయత్నాలన్నా చేస్తే బాగుంటుంది – సొంత విశ్లేషణలు అందరూ చేసేస్తే గందరగోళం నెలకొంటుంది కనుక. ఇప్పటికే బ్లాగుల్లో ఇలా పద్యాలు-వివరణలు అక్కడక్కడా కనిపిస్తూ ఉన్నాయి కానీ, పుస్తక రూపంలో వస్తే అది అందరినీ చేరుతుంది కదా.  అంతే కాదు, అలాంటి ప్రయత్నాలన్నీ ఓ చోట చేర్చినట్లు ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి విషయాల మీద ఆసక్తి చూపితే బాగుండు. మన కావ్యాలూ వగైరాలన్నీ ఓపిగ్గా చదివే మనుష్యులు రాబోయే తరాలలో ఉండడం కష్టం. ఇలాంటి పుస్తకాలేవో వారి చేత చదివిస్తే తప్ప వారిలో అవి చదవాలని కుతూహలం పుట్టదు. ఇది మాత్రం నిజం. స్వీయానుభవం మీద చెప్తున్నాను.

Sahitya Surabhi – Viswanatha Satyanarayana

You Might Also Like

17 Comments

  1. Krishna Chaitanya

    ఈ పుస్తకం కోసం నేను కొన్ని నెలలుగా వెతుకుతున్న … మా మావయ్య దగ్గర వుంది .. చాలా మంచి పుస్తకం .. ఇప్పుడు ఎక్కడ దొరుకుందో .. ఎలా పొడగాలనో మీకు గనుక తెలిసినట్ల్యతే.. వెంటనే నాకు కింద ఈ-మెయిల్ కి పంపగలరు .. krish1842@gmail.com

  2. viswanadha satyanarayana

    విశ్వనాథ వారి పుస్తకాల కొరకు సంప్రదించగలరు శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్
    9246100751/752/753

    1. Krishna Chaitanya

      ఈ పుస్తకం కోసం నేను కొన్ని నెలలుగా వెతుకుతున్న … మా మావయ్య దగ్గర వుంది .. చాలా మంచి పుస్తకం .. ఇప్పుడు ఎక్కడ దొరుకుందో .. ఎలా పొందగలనో వెంటనే నాకు కింద ఈ-మెయిల్ కి వివరములు పంపగలరు .. krish1842@gmail.com

      అలాగే నా నెంబర్ 7028272949 / 9676355699

  3. పుస్తకం » Blog Archive » నేనూ తయారుచేశానొక జాబితా….

    […] సాహిత్య సురభి – విశ్వనాథ : తెలుగు పద్యాల అందాన్ని పరిచయం చేసినందుకు […]

  4. narasimha rao mallina

    కామేశ్వరరావు గారూ
    మీరిచ్చిన పై లింకులననుసరించి లేఖిని ద్వారా మీ పోస్టింగులు చదివాను.విశ్వనాధవారు నన్నయగారిని గూర్చి వ్రాసిన ఉపోద్ఘాతములవలె ఉన్నాయి.ఇవి కాక ఇంకా మీరు పోస్టుచేసిన పద్యముల వివరములను పొందుపరిస్తే మా బోంట్లకు ఆనందాన్ని చేకూర్చిన వారౌతారు.మీ కృషికి నా ధన్యవాదాలు.

  5. narasimha rao mallina

    యోగి గారూ,
    ధన్యవాదములు.కామేశ్వరరావుగారి ఇంగ్లీషు లిపిలోని వాటిని తెలుగులో ఎలా చదువుకోవచ్చో తెలిపినారు. మీరు చెప్పినట్లుగా లేఖినిని ఉపయోగించి చూస్తే — వావ్! — అద్భుతం.పూర్తిగా తెలుగులో వారి పాత పోస్టులను చదవగలుగుతున్నాను.ఈ సందర్భంగా లేఖిని సృష్టికర్త అయిన వీవెన్ గారి కేమిచ్చి మనం వారి రుణం తీర్చుకోగలం? కామేశ్వరరావుగారూ, మీరు యోగిగారడిగిన అనుమతిని వెంటనే దయచేయండి.అది అందరికీ ఉపకారమౌతుంది.

  6. sriram velamuri

    మంచి ఆలోచన యోగి గారూ.plese go ahead.

  7. యోగి

    కామేశ్వర రావు గారు

    మీరు ఇచ్చిన లంకె లోని స్క్రిప్టును లేఖిని సహాయంతో తెలుగు అక్షరాలలోకి మార్చడం చాలా సులభం. మీరు ఇలా పద్యాలు, పుస్తక రివ్యూలు మొదలగునవి రాసిన లంకెలన్నీ నాకు ఇవ్వగలిగితే వాటన్నింటినీ తెలుగు అక్షరాల్లోకి మార్చి ఒక చోట అందరూ సులభం గా చదివే లాగా ఉంచాలని ఉన్నది. అదీ మీకు అభ్యంతరం లేకపోతే. my mail id jnanakhadga at gmail

    నాకెందుకీ ఆసక్తి అంటారా.. అదో ఆనందం అనుకోండి 🙂
    యోగి

  8. కె.మహేష్ కుమార్

    @కొత్తపాళీ:మీరు చెప్పినవాటితో ఏకీభవిస్తూనే విభేధించాలనిపిస్తోంది.మీరు చెప్పింది nostalgic testimony లాగుంది.అంతే!

  9. కామేశ్వర రావు

    నా ముందరి వ్యాఖ్యలోని లంకెలు సరిగా పనిచెయ్యటం లేదు. అంచేత సరైన లంకెలతో మళ్ళీ ఈ వ్యాఖ్య పంపుతున్నాను. నా ముందరి వ్యాఖ్యని దయచేసి తొలగించండి.

    నేను చాలా కాలం క్రితం ఛందస్సు గూగులు గుంపులో సాహిత్య సురభి పద్యాలని విశ్వనాథ వివరణతో ప్రచురించడం మొదలుపెట్టాను. కానీ భారతం లాగానే అదికూడా నన్నయ్యగారి భాగంతో ఆగిపోయింది!
    ఆ లంకెలు ఈ కింద యిస్తున్నాను. ఆసక్తిగల వాళ్ళు చదువుకోవచ్చు.
    వీటిని యూనికోడీకరించి నా తెలుగుపద్యం బ్లాగులో తిరిగి ప్రచురించాలనుకుంటున్నాను. త్వరలో ఆ పని చేస్తాను.

    ఈ పుస్తకంలో నాచన సోమన పద్యాన్ని విశ్వనాథ వారు తప్పుగా వ్యాఖ్యానించారు. శివుని పరంగా ఉన్న ఒక పద్యాన్ని కృష్ణుని పరంగా వివరించే ప్రయత్నం చేసారు. ఆ పద్యం “కుజము కుంజరముచే కూలునో కూలదో”. ఎందుకలా పొరబడ్డారో మరి!

    కనీసం ఇందులోని భాగవతం పద్యాలన్నీ మా అమ్మాయికి నేర్పాలని నా ఆశ. తనే మాత్రం ఉత్సాహం చూపిస్తుందో చూడాలి!

    1) http://groups.yahoo.com/group/Chandassu/message/985
    2) http://groups.yahoo.com/group/Chandassu/message/1013

    sAhitya surabhi – nannaya
    1) http://groups.yahoo.com/group/Chandassu/message/1021
    2) http://groups.yahoo.com/group/Chandassu/message/1052
    3) http://groups.yahoo.com/group/Chandassu/message/1073
    4) http://groups.yahoo.com/group/Chandassu/message/1099
    5) http://groups.yahoo.com/group/Chandassu/message/1119
    6) http://groups.yahoo.com/group/Chandassu/message/1130
    7) http://groups.yahoo.com/group/Chandassu/message/1146
    8) http://groups.yahoo.com/group/Chandassu/message/1186
    9) http://groups.yahoo.com/group/Chandassu/message/1197
    10) http://groups.yahoo.com/group/Chandassu/message/1220
    11) http://groups.yahoo.com/group/Chandassu/message/1251
    12) http://groups.yahoo.com/group/Chandassu/message/1294

    sAhitya surabhi – e~r~rana
    1) http://groups.yahoo.com/group/Chandassu/message/1347

  10. narasimha rao mallina

    రామబ్రహ్మం గారి పద్యకవితాపరిచయం పుస్తకం కలిగి ఉన్న అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని.

  11. కొత్తపాళీ

    ఈ రచన పుస్తక పరిచయం కంటే కూడా .. తెలుగు ప్రాచీన సాహిత్యం ఎందుకు చదవాలి అనే ప్రతిపాదనకి మంచి నాందీ ప్రస్తావనలాగా ఉంది. అది మంచి లక్షణమే. తెలుగు పద్య కావ్యాలు ఎందుకు చదవాలంటే సౌమ్యగారు చెప్పిన కారణాలకి ఇవి కూడా చేరుస్తాను:
    1. అవి మనవి. ఈ భూప్రపంచకం మొత్తంలో ఇంకెవరివీ కాదు. కేవలం, మన కోసమే, తెలుగు భాష మాట్లాడేవాళ్ళ కోసమే అవి.
    2. ఇవి మన పూర్వికులు సంపాయించి పెట్టి పోయిన ఆస్తి లాంటివి. బుద్ధి ఉన్న వాడెవడూ పూర్వికులిచ్చిన ఆస్తిని విసిరి అవతల పారెయ్యడు గదా! ఈ ఆస్తిని మనం కొత్తగా సంపాయించడానికి ఏమీ కష్టపడనక్కర్లేదు. చెయ్యాల్సిందల్లా ఉన్నదాన్ని అనుభవించడమే!

    విశ్వనాథవారి ఈ పుస్తకం నేను చదవలేదు. కానీ వారి ఇతర రచనలు చదివిన అనుభవంతో ఊహిస్తున్నదేవిటంటే వారు ఒక పద్యాన్ని వివరించే తీరు గొప్పగా ఉంటుందని. ఈ పుస్తకం బహుశా ఇప్పుడు దొరకట్లేదేమో.

    ఇటువంటిదే ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు ఇంకో పుస్తకం వెలయించారు, పద్యకవితా పరిచయం అని. సుమారు 18 మంది తెలుగు కవుల కావ్యాల నుండి ఒక్కొక్క ఘట్టం, ఆ ఘట్టములోని శిల్ప విన్యాసాలు, కథా కథన చతురత, పద్యాల్లో చమక్కులు అన్నీ వివరిస్తూ చాలా హృద్యంగా రాశారు. ఈ పుస్తకం ఇంకా దొరకుతుండే అవకాశం ఉంది.

  12. యోగి

    పద్యం డాట్ నెట్ మంచి ఆలోచన!

  13. chavakiran

    ఓ త్వరలో పద్యం డాట్ నెట్ రాబోతుందన్నమాట!

  14. narasimha rao mallina

    పైన సూచించిన శ్రీమదాంధ్రమహాభారతం లోని పద్యాలు ఈబ్లాగులో ఉంచటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందనుకుంటే నిర్వాహకులు అనుమతిస్తే అవి ఇక్కడ ఉంచే ప్రయత్నం చేయగలనని మనవి.నా బ్లాగు url
    http://kasstuuritilakam.blogspot.com బ్లాగు పేరు -నరసింహ

  15. narasimha rao mallina

    మీ ఉద్దేశాలే నావి కూడ. మీరు సూచించిన విషయాన్ని గురించి ఆలోచించి, అందులో నేను చెయ్యగలిగిన మొదటి ప్రయత్నంగా – పోతన గారి శ్రీమహాదాంధ్రభాగవతం- దశమస్కంధం నుంచి ప్రారంభించి పోతన గారి కంఠస్థం చెయ్యదగిన పద్యాలను నా బ్లాగులో వ్రాయటం మొదలు పెట్టాను.పోతన గారి భాగవత పద్యాలు ద్రాక్షాపాకంతో అందరికీ అర్థం అయ్యేలానే ఉంటాయనే ఉద్దేశ్యంతో పద్యాల అర్థ తాత్పర్యాలను వ్రాయటం లేదు.అక్కడక్కడా కఠినమైన పదాలుంటే అర్థం వ్రాయటానికి ప్రయత్నం చేస్తాను.ఎంతమందికి నా ఈ ప్రయత్నం నచ్చుతుందో తెలియదు.కాని ప్రయత్నమంటూ చెయ్యాలిగా —

  16. రాఘవ

    ఈ పుస్తకం ఇప్పుడెక్కడ దొరుకుతుందో మీకేమైనా తెలుసునా?

Leave a Reply to narasimha rao mallina Cancel