జుమ్మా – రాయలసీమ, పేదల, ముస్లిం జీవితాల కథలు

రెండు దశాబ్దాల క్రితం వరకూ తెలుగులో ముస్లిములైన రచయితలు ఉండేవారుకానీ, ముస్లిం కథ అంటూ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత సాహిత్యం ఉన్నట్లు గుర్తు లేదు. గత రెండు దశాబ్దాలలో ముస్లిం సాంస్కృతిక, సామాజిక నేపధ్యంలో చాలా కథలు వచ్చాయి. ఖదీర్‌బాబు, రహమతుల్లా వంటి కథకులు ముస్లిం జీవన విధానాలని, కుటుంబ బాంధవ్యాలని, సామాజిక సంబంధాలని ముస్లిమేతర పాఠకులకు పరిచయం చేయటంలో కృతకృత్యులయ్యారు. యువ రచయిత శ్రీ వేంపల్లె షరీఫ్ కూడా ఆ బాటనే పయనిస్తున్న కథకుడు అనవచ్చు కానీ, అది షరీఫ్ రాసిన కథల్ని మరీ ఇరుకుగా వర్గీకరించడమౌతుంది.

శ్రీ షరీఫ్ ఈ మధ్యే ప్రచురించిన కథాసంకలనం జుమ్మాలో 12 కథలు ఉన్నాయి. రెండు కథల్లో అసలు ముస్లిం పాత్రలే లేవు. మిగతా పది కథలకు ముస్లిం కుటుంబాలే నేపధ్యం ఐనా, వాటిలో కొన్నిటికి ఆ కథలో వ్యక్తులు ఏ మతానికి చెందినవారన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. ముస్లిం జీవనం ముఖ్యపాత్ర వహించేది నాలుగు కథల్లో మాత్రమే (పర్దా, జుమ్మా, ఆకుపచ్చ ముగ్గు, తెలుగోళ్ళ దేవుడు). మిగతా కథలు చాలావరకూ రాయలసీమలో పేద కుటుంబాల కథలు. ఆ కథలను పెద్ద మార్పులు లేకుండా హిందూ, క్రిస్టియన్ పాత్రలను పెట్టి రాసినా అలాగే ఉంటాయి. అందుచేత, షరీఫ్ మైనారిటీ వర్గానికి చెందిన రచయితే ఐనా మైనారిటీ అస్తిత్వం ఒక్కటే ఉన్న రచయిత కాదు.

పర్దా కథలో జేజి, ఆకుపచ్చ ముగ్గు కథలో అక్క గుర్తుండే పాత్రలు; రచయిత శ్రద్ధగా నిర్మించిన పాత్రలు. తన పల్లెటూర్లో స్వతంత్రంగా, ధైర్యంగా, అవసరమైతే నోటినే ఆయుధంగా ఉపయోగించైనా తన బతుకు తాను వెలమార్చుకుంటూ, పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేసుకున్న జేజి, వయసు మళ్ళాక పట్నంలో కొడుకుపంచన ఉండవలసి వచ్చింది. పట్నంలో కొడుకు, కోడలు, వారితోటి ముస్లిం కుటుంబాలు అనుసరించే పద్ధతులు ఆమెకు కొత్త. అవి ఆమెకు ఆమోదయోగ్యం కావు కాని కొడుకూ కోడళ్ళకు ఎదురు చెప్పలేదు. అట్లా అని వారికి కావలసిన విధంగా ప్రవర్తించనూ లేదు. కాయకష్టం చేసిన కాళ్ళు ఒక్క పంచలో బందీగా ఉండమంటే ఎలా ఉంటాయి? తల ఎత్తి బతకటం అలవాటైన మనిషి ముసుగులోకి ఎలా వెళ్తుంది? ఇంతకు ముందు, బమ్మిడి జగదీశ్వరరావు కూడా ఇలాటి సంఘర్షణే ఇతివృత్తంగా ఒక కథ రాసిన గుర్తు. ఐతే ఆ కథలో తల్లితో పోలిస్తే ఈ జేజి చాలా ఆత్మాభిమానమూ, స్వతంత్ర ప్రవృత్తీ ఉన్న మనిషి.

ఆకుపచ్చ ముగ్గు కథ కళాదృష్టి ఉన్న ఒక ముస్లిం ఆడపిల్ల జీనత్ కథ. “తోడ్తా తిరిగే ఆడపిల్లలంతా ఇండ్ల ముందు ముగ్గులేసుకుంటా ఉండింది చూసి తనగ్గూడా ఎయ్యాలని ఉండేది. ఇంట్లో అమ్మ ఎయ్యనిచ్చేది కాదు.” మరేం చెయ్యాల. ఇంట్లో కనీసం ముగ్గు కూడా లేకపాయె. నిమ్మకాయల వ్యాపారం చేసే తండ్రి కాయల్ని మగ్గపెట్టడానికి వాడే మందుపొడిని ముగ్గు వేయడానికి వాడబోతే కంట్లో పడి కంటి చూపు పోయినంత పనయ్యింది. తనలో ఉన్న కళను వెలిబుచ్చటానికి ఆ యమ్మి ఎవరికీ అభ్యంతరం కాని మార్గాన్నెంచుకుంది. ముగ్గురాడపిల్లల తల్లై జీవితమంటే భయపడడం మొదలుపెట్టాక కూడా, అంతే ఆసక్తితో ఆమె ఆకుపచ్చముగ్గులు వేస్తూనే ఉంది. ఈ ముగ్గులు వేయటం కాఫిర్ బుద్ధి అని వెక్కిరించబోయిన తమ్ముడుతో ఆమె చెప్పిన సమాధానం ఆలోచింపజేస్తుంది.

ఈ సంకలనంలో నాలుగు కథలు పేదకుటుంబంలో పెరుగుతున్న చిన్నపిల్లల కథలు. అయ్యవారి చదువు, పలక పండగ కథల్లో, బళ్ళో చదువుకుంటున్న పిల్లల చిన్నచిన్న అవసరాలు తీర్చటానికి కూడా ఒకోసారి తల్లితండ్రులకు ఎంత కష్టమో వర్ణిస్తాడు రచయిత. అయ్యవారి చదువులో పిల్లవాడికి కావల్సిందల్లా చిన్న సీసా బుడ్డి; సీసా మూతికి బొరక బెట్టి, ఒత్తి తొడిగి, ఒక రూపాయి కిర్సనాయిలు పోసి ముట్టించి హాయిగా ఒక మూల కూర్చుని చదువుకోవటం. అదీ కలగానే మిగిలిపోతోంది. ఐనా ఆ కుర్రవాడు ఏమీ డీలాపడిపోలేదు. ఈ కథలో తండ్రీ కొడుకుల సంబంధం చాసో ‘ఎందుకు పారేస్తాను నాన్నా’ను గుర్తు చేసింది. పలక పండగలో ఇతివృత్తం కూడా దాదాపు ఇలాంటిదే. దస్తగిరి చెట్టు కథలో పిల్లవాడి బాధల్లా సెలవుల్లో నానీమా ఇంటికి వెళతానంటే ఇంట్లో పెద్దవాళ్ళు పంపించకపోవడం. పెద్దవాళ్ళ కారణాలు పెద్దవాళ్ళకి ఉన్నాయి. వాటిని ఈ పిల్లాడికి అర్థమయ్యేలా తల్లి ఎలా చెప్తుంది? రూపాయి కోడిపిల్ల కథలో అంజాద్ రూపాయి పెట్టి కోడిపిల్లను కొనుక్కొని ప్రేమగా పెంచి పెద్దదాన్ని చేస్తాడు. చిన్నప్పుడు గెద్దల్నుంచి కోడిపిల్లను కాపాడితే సరిపోయింది. పెద్దయ్యాకా కాపాడుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా?

తెలుగోళ్ళ దేవుడు కథ ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధిస్తుంది. అల్ప సంఖ్యాక వర్గం సంస్కృతిని మెజారిటీ సంస్కృతి – అనాలోచితంగానే ఐనా – ఎలా చుట్టుముట్టేస్తోందో వర్ణిస్తుంది ఈ కథ. ఈ కథ హిందూ సమాజంలో ఉన్న ముస్లిం కుటుంబం కథ. కొద్దిగా తిరగరాస్తే ఈ కథ అమెరికాలో మెజారిటీ క్రిస్టియన్ సమాజం మధ్య ఉన్న హిందూ (లేక యూదు, ముస్లిం) కుటుంబం కథ ఐపోతుంది. (హిందువులను ముస్లిములు తెలుగోళ్ళు అనడం నాకు కొద్దిగా కొత్త. నెల్లూరు ప్రాంతానికి చెందిన ముస్లిం దర్జీ ఒకాయన కొన్ని కారణాల వల్ల అమెరికాలో చిక్కుపడి మా ఇంట్లో కొన్నాళ్ళున్నారు. ఆయన మాటల్లో మొదటిసారి విన్నాను ఈ వాడుకని.)

రజాక్‌మియా సేద్యం, జీపొచ్చింది కథలు గత పాతికేళ్ళలో వచ్చిన రాయలసీమ బడుగు సేద్యగాళ్ళ జీవిత కథల మూసలోవి. జుమ్మా కథ మక్కామసీదు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుళ్ళ నేపధ్యంగా రాసింది. జాడ తెలియని కొడుకుకోసం తల్లి పడే ఆరాటం, అలాంటి ఆరాటాలపై సొమ్ము చేసుకొనే మూఢ నమ్మకాల గురించిన కథ అంజనం. ఈ కథలో తల్లి మనేదని, ఆశలని వర్ణించిన తీరు బాగుంది. చాపరాయి కథ మాత్రం మిగతా కథల నేపథ్యానికి భిన్నంగా ఉంది. అరకులోయ వంటి పర్యాటక ప్రదేశాల వద్ద రాళ్ళపై, కొండలపై ప్రేమికులు వాళ్ళ పేర్లు పెయింట్ చేసుకొంటూ ప్రకృతిని పాడు చేయటం కథలో ఒక ముఖ్య వస్తువు. పిల్లల స్వేచ్ఛ ఇంకో వస్తువు.

శ్రీ షరీఫ్ వచనం చాలావరకు రాయలసీమ మాండలికంలో సాగుతుంది; ఉర్దూ పదాలు తక్కువ. రాయలసీమలో అంతే అంటున్నారు ముందు మాట రాసిన దాదాహయాత్ – ఇక్కడ ఉర్దూలో తెలుగు పదాలు దొర్లుతాయ్ అంటూ. నాకైతే ఉర్దూలో తెలుగు దొర్లినట్లు కాకుండా తెలుగులో అక్కడక్కడా ఉర్దూ పదాలు దొర్లినట్లుగా అనిపించింది.

నేల విడిచి సాము చెయ్యని కథలు అన్నారు ఇంకో ముందు మాట రాసిన కేతు విశ్వనాధరెడ్డి. షరీఫ్ భాష లాగానే, కథలు కూడా సరళంగానే ఉన్నాయి. తాను రచనలు చేయటం ఎలా మొదలైందో, ఎలా కొనసాగిందో తాను రాసిన ముందు మాటలో రచయిత చెప్పారు. ఈ కథలన్నీ 2003-2011 మధ్య ప్రచురితమయ్యాయి (చాపరాయి ఒక్కటే ఇంతకు ముందు ప్రచురించినట్లు లేదు). చాలా కథలు వివిధ కథాసంకలనాల్లోకి కూడా ఎక్కాయి. రెండు కథలు ఆంగ్లంలోకి, మైథిలిలోకి అనువదించబడ్డాయి. కొత్త తరం కథా రచయితల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొంటున్నాడు శ్రీ షరీఫ్. రాయలసీమ కథకుడనో, ముస్లిం కథకుడనో మూసల్లో పడకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాడని కూడా అనిపిస్తుంది.

దాదాహయాత్ ఉందని సూచించిన చిక్కతనం నాకు ఈ కథల్లో చిక్కలేదు. వాతావరణ కల్పన బాగున్నప్పటికీ, చాలా కథలు సింగిల్ పాయింట్ మీద ఆధారపడిన కథలు. ఆ పాయింటు కథగా విస్తరించేంత లేకపోతే కథ తేలిపోతుంది. పర్దా, ఆకుపచ్చని ముగ్గు కథల్లో కనిపించిన పాత్ర నిర్మాణం, దొంతరలు మిగతా కథల్లో అంతగా కనిపించవు. కొన్ని విషయాలు వ్యాసాలుగానో, బ్లాగులుగానో, పత్రికలో కాలంలు గానో బాగుండవచ్చు (ఉదా: చాపరాయి) కాని కథలుగా గుర్తుండాలంటే పాత్రలో, సన్నివేశాలో ఇంకొంత బలంగా ఉండాలి. కథలన్నీ నిడివిలో చిన్నవి – చాలా కథలు ఆదివారం సప్లిమెంటుల్లో ప్రచురింపబడటం కారణమేమో తెలీదు. జీవితంపై నిశితపు చూపు, రాయాలన్న తపన ఉన్న ఈ రచయిత పాత్రల నిర్మాణంపై, కథ చెప్పే తీరుపై, కథల్లో సాంద్రత, గాఢత, గూఢత, తాత్వికత వంటి విషయాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వ్రాస్తే ఇంకా మెరుగైన కథలు వచ్చే అవకాశముంది.

పుస్తకం చిన్నది; అందంగా ముద్రించారు. నాకెందుకో ఖదీర్‌బాబు వేలిముద్రలు ఈ పుస్తకంపై ఉన్నట్టు అనిపించింది. అచ్చు తప్పులు చాలా తక్కువ.

మనలో చాలామందికి ఎక్కువగా పరిచయం లేని జీవితాలని దగ్గరగా చూపిస్తాయి ఈ కథలు.

**********

జుమ్మా
వేంపల్లె షరీఫ్ కథలు
2011
సాఫిర్ పబ్లికేషన్స్
13/303, ఇ-4, గండి రోడ్
వేంపల్లె, కడప జిల్లా 516 329
sharifvempalle@gmail.com, Cell no. 96034 29366
104 పేజీలు – 60 రూ.

You Might Also Like

4 Comments

  1. రమాసుందరి

    సమీక్ష బాగుంది.

  2. ముస్లిం దృక్కోణంలో మనిషి కథలు | పుస్తకం

    […] గతంలో జంపాల చౌదరి గారు రాసిన వ్యాసం ఇదిగో. ఈ పుస్తకంపై ప్రజాశక్తి దినపత్రికలో […]

  3. drs.ramani

    kathala kantae mee sameeksha baavundi. pustakaanni , rachayitani ardham chesukunna teeru nachindi

  4. కవియాకూబ్

    మంచి సమీక్ష. ఇంత వివరంగా “జుమ్మా”ను చూపడం బాగుంది.శరీఫ్ నిజంగానె విలక్షణమైన వాడు.మిగతా ముస్లిం కథకులకంటే సయమనం పాటించే కథకుడు.

Leave a Reply to drs.ramani Cancel