అడిదం సూరకవి

రాసిన వారు: నేదునూరి రాజేశ్వరి
(ఈ వ్యాసం “సాహిత్యం” గూగుల్ గుంపులో వచ్చింది.పుస్తకం.నెట్లో ప్రచురణకు అనుమతించినందుకు రాజేశ్వరి గారికి ధన్యవాదాలు)
*****************
మన తెలుగు సాహితీ చరిత్రలో చెప్పుకో దగిన కవులలో “అడిదము సూరకవి” ఒకరు. ఈయన 18వ శతాబ్ధమునకు చెందిన వాడు. కవితా వృత్తిచే ఆంధ్రదేశమంతటా పేరు పొందిన నియోగి బ్రాహ్మణుడు. ఇతడు వశిష్ఠ గోత్రీకుడు. శివ శ్యామలా దేవతోపాసకుడు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారు. వీరికి 14 తరాల నుండి రాజాస్థానం లభించింది. వీరు కళింగ దేశంలోని విద్వత్కవి వంశములోని వారు. అసలు అడిదము వారి వంశం మొదట మోదుకూరు పిమ్మట గంధవారణం, అనే ఇంటి పేర్లు ఉండేవట. తదుపరి వీరి పూర్వీకుడైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని(కత్తిని) కానుకగా పొందాడట. అప్పడినుండి “అడిదం” వారని ప్రసిద్ధి వచ్చిందట.

ఇతడు లోకంలో తిట్టు కవిగాను, లోకజ్ఞుడు గాను, విఖ్యాతుడైనప్పటికీ “రామలింగేశ శతకం” వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం రచించాడట. ఇతడు నీలాద్రి కవికి 9వ తరం వాడు. ఇతడు సంభాషణాత్మక చాటువును ఇలా వ్రాసాడు.

“ఊరెయ్యది చీపురు పలి
పేరో సూర కవి ఇంటి పేరడిదము వార్
మీ రాజు విజయ రామ మ
హా రాజతడేమి సరసుడా ? భోజుడయా ?”

ఇలా ఈ పద్యాన్ని బట్టి తనకి తనే స్వయం గా చాటువులో చెప్పుకున్నాడన్న సంగతి విదితమౌతోంది. అంతే కాదు ఈయన విజయనగర ప్రభువు పూసపాటి విజయ రామరాజు ఆస్థాన కవి గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభువును స్తుతిస్తూనే పెద్దాపుర ఆస్థానంలో ఈ కవి గారు చెప్పిన సుప్రసిద్ధ చాటువు ఇది. అంతే కాదు మన సూర కవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటువు కుడా ఇదే .

“రాజు కళంక మూర్తి,రతిరాజు శరీర విహీను,డంబికా
రాజు దిగంబరుడు,మృగరాజు గుహాంతర సీమవర్తి,వి
బ్రాజిత పూసపాడ్విజియ రామ నృపాలుడు రాజు కాక ఈ
రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్ !”

ఈ పద్యం వినగానే సభలో ఉన్న రాజులందరు తమని తరాజులంటున్నాడని రోష పడ్డారట. అప్పుడు “తాను పేర్కొన్న రాజు చంద్రుడు, వానికి మచ్చ రతిరాజు అనగా మన్మధుడు, అతగాడికి శరీరమే లేదు, ఇక శివుడికి కట్టు బట్టల్లేవు, సింహం గుహల్లొ నివాసం, వీళ్ళు రాజు లేమిటి?” అని వారినే తాను రాజులు గా చెప్పినట్టు చమత్కరించాడట.

ఈ పద్యాన్ని ఆశువుగా చెప్పినందుకు అతని విద్వత్తుకు మెచ్చి విజయ రామరాజు కనకాభిషేకం చేయించాడట. ఐతే ఆనాటి ఆనవాయితీ గా తనకు అభిషేకించబడిన ఆ బంగారు నాణాలను ఆ కవి తీసుకోవాలని రాజాజ్ఞ. కానీ సూరన మాత్రం తనకి జరిగిన సత్కారానికి మిక్కిలి సంతసించి “తమ దయవలన ఇంత వరకు స్నానం చేసిన ఉదకమును పానము చేయ లేదు. తమరి ఆజ్ఞని సిరసావహించనందుకు మన్నించమని తీసుకోవడనికి సమ్మతించలేను” అన్ని ఆ నాణాలు తీసుకోలేదట. అందుకు ముగ్ధుడైన రాజు తగు రీతిన సత్కరించాడట. బహుశ అప్పడి నుంచే “డబ్బు నీళ్ళలా వాడటం” అనే నానుడి వచ్చిందని ప్రతీతి. అంటే దీని బట్టి మన సూర కవి దారిద్ర్యానికి అధికారానికీ తల వొగ్గలేదన్న మాట.

ఇక ఇతడు “పొణుగుపాటి వేంకట మంత్రి” అనే మకుటంతో 39 కంద పద్యములు కళింగ దేశ ప్రాంతంలో వ్యాప్తి లో ఉన్నాయట. ఈయన 1720-1780 వరకు శృంగవరపు కోట జమిందారు శ్రీముఖి కాశీపతిరావు గారి వద్ద దివానుగా ఉండేవాడట. అంతే కాదు మన సూర కవి గారు ఈ మంత్రి గారి ఇంట ప్రతి ఏటా మూడు నాలుగు మాసాలు గడుపుతూ ఉండేవాడట. మచ్చుకి ఒకటి రెండు కంద పద్యములు…

1. వెన్నెల వలె కర్పూరపు
దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
మిన్నంది వన్నెకెక్కును
విన్నావా పొణుగు పాటి వేంకట మంత్రీ !

2. చుక్కలవలె కర్పూరపు
ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్
క్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్కసముగ పొణుగు పాటి వేంకట మంత్రీ !

3. పొగ త్రాగ నట్టి నోరును
పొగడం గా బడయ నట్టి భూపతి బ్రతుకున్
మగడొల్లని సతి బ్రతుకును
వెగటు సు మీ పొణుగు పాటి వేంకట మంత్రీ !

కంద పద్యానికి చౌడప్ప అలవరించిన తేట దనానికి మెరుగులు దిద్దడం సూరకవి కందములో అందముగా అగుపిస్తుందట. ఇక పోతే చుక్కలవలె అన్న పద్యం “కన్యాశుల్కం”లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేంత ప్రసిద్ధమైనదట. ఈయన చాటువులు సమకాలీన కవితా రంగం పై గంట పట్టిన ప్రతి వాడూ వ్రాయడాన్ని గురించి ఇలా విమర్శించాడట.

“దేవునాన మున్ను దేశాని కొక కవి
ఇప్పుడూర నూర నింట నింట
నేవు రార్గు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
పదుగురేసి కవులు పద్మ నాభా !”
అని ఎత్తి చూపారట.

సూర కవి “తిట్టు కంసాలి సుత్తి పట్టు” అన్నట్టు గా 18వ శతాబ్ధం లో జీవించిన సూర కవి చాటువులు విజయనగర సమీపంలోని రామచంద్రాపురంలో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందాయట. ఈతని రామలింగేశ శతకం సమకాలీన సాంఘిక జీవనానికి దర్పణం వంటిది. అంతే కాదు, ధన ధాన్యాలను దోచుకునే రాజులను
“పదుగురు కోతి వెంబడి సంచ రింపరే-వాహకుల్లేరె శవంబునకును
గంగి రెద్దుకులేని ఘన తూర్య రావముల్-కలిమి గల్గదె వారి కామినులకు
న్యాయ పద్ధతి నడువని యవనిపతికి నెన్ని చిన్నెలు గలిగిన నెందు కొరకు”

-అంటూ ఈ శతకము నుంచి ఉదహరింప బడినవి. వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింట నుంట,
రాజీవాక్షుండు అవిరళముగ శేషుని పై పవళించుట
నల్లి బాధ పడలేక సుమీ

-అన్న పద్యంలో చాటువు హాస్యం కుడా మిళిత మై ఉండటం గమనార్హం. ఈయన తిట్టు పటిమను గురించి తిట్టు కవిగా

“గంటకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా
దొడ గితినా పఠీలుమని తూలి పడన్ కుల రాజముల్
విడువ కనుగ్రహించి నిరుపేద ధనాధిపు లార్యు చేతునే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే”

-అంటూ ఇతడు రాజాస్థానాలను సందర్శించి విజయాన్ని చేపట్టి నట్టు తెలుస్తోంది.

అందరి మీదా పద్యాలు చెబుతారు కదా మన బాచన్న మీద కుడా ఒక పద్యం చెప్పండి అని ఒక సారి భార్య అడిగిందట. అందుకు…
“బాచా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్ళున్ తానున్
బూచంటే రాత్రి వెరతురు
బాచన్నను చూసి పట్ట పగలే వెరతుర్”
అని హాస్యం జోడించి చెప్పాడట.

ఈయన ఎంత మహరాజు నైన “నువ్వు, నువ్వని” ఏక వచన ప్రయోగం చేయడమే గాక ఒక సీతా రామ రాజు గారికి సూరకవి
“చిన్నప్పుడు రతికేళిని
ఉన్నప్పుడు కవిత లోన యుద్ధము లోనన్
వన్నె సుమీ ‘ రా ‘ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతా రామా

అని పిల్లల్ని, రతి సమయమందు, కవిత్వం లోను, యుద్ధము నందు, ఎవరినైనా “రా” అనవచ్చును అని చమత్కరించాడట.

ఇక ఇతడు చంద్రా లోకం ఆంధ్ర నామ శేషం వంటి రచనలు చేసాడు. అంతే గాకుండా, పైడిపాల లక్ష్మణ కవితో కలసి ఆంధ్ర నామ సంగ్రహం రచించాడు. ఇలా ప్రముఖుల గురించి ఎంత చెప్పుకున్నా కొంత మిగులుతూనే ఉంటుంది.

*****************
(1. సూరకవి పై మాలతి గారు తన బ్లాగులో రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

2. ఆడిదము సూరకవి జీవితంపై ఆడిదము రామారావు గారు రాసిన పుస్తకం ఆర్కైవ్.ఆర్గ్ సైటులో ఇక్కడ చదవండి.)

You Might Also Like

3 Comments

  1. D.Subrahmanyam

    చక్కని ఆర్టికల్ రాజేశ్వరి గారు. ఈ ఆర్టికల్ ని గూగుల్ గుంపులో చదివాను. అక్కడే సూరకవిగారివి కొన్ని నాదగ్గర ఉన్న పద్యాలు పోష్టుచేసాను. అవికూడా మీ ఆర్టికల్లో జోడిస్తే బాగుండేది. ప్రచురించిన పుస్తకం.నెట్ వారికి ధన్యవాదములు.
    సుబ్రహ్మణ్యం

  2. Satyanarayana Piska

    #telrAjESwarigArU!

    chakkani vyAsam amdimchAru; aBinandanalu.

    mIru udaharimchina padyamulu chAlAvaraku vinnavE! aitE, avi aDidam sUrakavi rachanalu anE sangati mAtram ippuDE telisindi.#tel

  3. M.V.Ramanarao

    ‘రా కొట్టడం గురించి ;తంజావూరు కవయిత్రి రంగాజమ్మ దీ పద్యం అంటారు.క్షేత్రయ్య సినిమాలో కూడా చూపించారు.ఏది నిజం?ప్రసిద్ధమైన వాటిని మనవాళ్ళు అనేకులకు అంటగట్టుతారు లెండి.

Leave a Reply