కొల్లాయి గట్టితే నేమి? (ఒక ఉత్తమ చారిత్రక నవల) – 1

రాసిన వారు: రాచమల్లు రామచంద్రారెడ్డి
(ఈ వ్యాసం “సారస్వత వివేచన” వ్యాసాలలోనిది. యూనీకోడీకరించడానికి సహకరించిన వేణూశ్రీకాంత్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*****************************************
1919-20 నాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను చిత్రించే ప్రయత్నంలో శ్రీ మహీధర రామమోహన రావు గారు రచించిన నవల “కొల్లాయి గట్టితేనేమి?”. పంజాబ్ లో రౌలట్ చట్టం అంతకుముందే అమల్లోకి వచ్చింది. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ అప్పుడప్పుడే జరిగింది. బ్రిటీష్ వ్యతిరేకత పై వర్గాల్లోనే అయినా దావానలంలా వ్యాపిస్తున్నది; జాతీయతాభావం గ్రామసీమల్లోకీ, సామాన్య జనంలోకి ప్రవేశిస్తున్నది. దీనికి చిహ్నంగా కాంగ్రెసు మీద గాంధీ ఆధిపత్యం బలపడుతున్నది. అంతవరకూ విధ్యాధికుల సంస్థగా వుండిన కాంగ్రెస్ సామాన్య ప్రజల రాజకీయ సంస్థగా రూపాంతరం చెందుతున్నది. బ్రిటీష్ ప్రభుత్వంపట్ల సహాయ నిరాకరణకూ, విదేశీ వస్తు బహిష్కరణకూ గాంధీ నాయకత్వాన కాంగ్రెసు పిలుపు యిచ్చింది. సహాయ నిరాకరణలో భాగంగా విద్యార్థులు కాలేజీలు వదిలిపెట్టి జాతీయోద్యమంలో పాల్గొంటున్నారు. విదేశవస్తు బహిష్కరణలో భాగంగా విదేశ వస్త్రదహనం ఆవేశపూరితమైన ఉద్యమ రూపం ధరించింది. ఖద్దరు ధారణ దేశభక్తి చిహ్నంగా, నూలు వడకడం పవిత్ర దీక్షా చిహ్నంగా, జైలుకు పోవడం రాజకీయ వీరకృత్యంగా చలామణిలోకి వచ్చినాయి. ఇవి 1920 నాటి రాజకీయ పరిస్థితులు. విదేశ వస్తు బహిష్కరణా, ఖద్దరు ధారణా రాజకీయ ప్రదర్శనలు మాత్రమే. వాటికి రాజకీయ నాయకులే పెద్దగా ఆర్థిక ప్రాముఖ్యం ఆపాదించలేదు. వాటి ఆర్థిక ప్రాముఖ్యం గురించి ఎపుడైనా ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడితే అది కేవలం మేధావి వర్గాలలో __ రాజకియంగా బ్రిటీష్ ప్రభుత్వంతో రాజీపడి, జాతీయోద్యమం పట్ల విశ్వాసంలేని మేధావి వర్గాలలో దేశభక్తి, కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమం పట్ల విశ్వాసమూ కలిగించడానికి చేసే ప్రయత్నం మాత్రమే.

ఆర్థికంగా చూస్తే ఆంధ్రదేశం పురాణకాలం నుండి వున్నట్లే వ్యవసాయంమీద ప్రధానంగా ఆధారపడి బతికేది. నామమాత్రంగా మిగిలిన చేతి వృత్తులు తప్ప పరిశ్రమలు లేనే లేవు. కృష్ణా గోదావరుల మీద గత శతాబ్దిలో కట్టిన ఆనకట్టల ఫలితంగా మధ్య కోస్తా జిల్లాలలో కరువు కాటకాలు మాయమైనాయి. గ్రామసీమల్లోని వ్యవసాయక సమాజం నుండే మధ్యతరగతి వర్గం ఉద్భవించడానికి పాశ్చాత్య విద్యవైపూ, పాశ్చాత్య భావలవైపూ ఆకర్షింపబడటానికి అవకాశాలు ఏర్పడినాయి. పాశ్చాత్య విద్యకు ప్రభుత్వ నౌకరి తప్ప పరమలక్ష్యం మరొకటి ఉండే అవకాశం లేదు.

సాంఘిక పరిస్థితులు తదనుగుణంగానే ఉండినాయి. వర్ణధర్మాలు గ్రామసీమల్లో చెక్కు చెదరకుండా సాగుతున్నాయి. విద్యాధికుల్లో ఏ కొద్దిమందికో వాటిలో విశ్వాసం సన్నగిల్లినా వాళ్ళకు ఆచారబలాన్ని ధిక్కరించే సాహసం లేదు. తెగించిన వాళ్ళు, హిందూ సమాజాన్ని మార్చలేక బ్రహ్మ సమాజీకులౌతున్నారు. బ్రహ్మ సమాజ ఉద్యమ ఫలితంగా వితంతు వివాహాలూ, వర్ణాంతర వివాహాలూ ఎక్కడైనా ఒకచోట జరుగుతున్నాయి. పాశ్చాత్యభావాల ప్రభావం వల్ల సాంఘిక ఆచారాలు మారకపోయినా వాటిమీద విశ్వాసం సడలుతున్నది.

1919-20 నాటి రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులు ఇవి. ఆ రోజుల్లో రాజమండ్రి కాలేజీలో బియ్యే చదువుకుంటున్న ఒక బ్రాహ్మణ యువకుడు స్వాతంత్ర్యోద్యమం చేత ప్రభావితుడై తన మిల్లు బట్టలనన్నిటినీ కాల్చివేసి చదువు మానుకుని స్వగ్రామమైన ముంగండకు వస్తాడు. దారిలో స్వరాజ్యం అనే నాయుళ్ళ అమ్మాయితో పరిచయమౌతుంది. స్వరాజ్యం తండ్రి అబ్బాయి నాయుడు బ్రహ్మ సమాజీకుడు. స్త్రీ విద్యాభిమానంతో కూతురుకు ఇంగ్లీషు చదువు చెప్పించినాడు. ఆడపిల్లకు చదువేమిటని ఆమె అత్తవారు తీవ్రంగా అభ్యంతరం చెప్పినా వినలేదు. ఆ కారణంగా స్వరాజ్యం భర్త మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. స్వరాజ్యాన్ని కాపురానికి పంపిస్తామన్నా, చదువుకున్న ఆడపిల్లకు తమ ఇంట్లో ఉండే అర్హతలేదన్నారు అత్తవారు. యిరవై యేండ్ల మిసిమి వయస్సులో వున్న స్వరాజ్యం విధవో, సధవో, వివాహితో, అవివాహితో, యేదైందీ తెలియని వింత పరిస్థితిలో వుంది. చేసేదేమీ లేక కాలేజీ చదువుకు పోవాలనుకుంటున్న స్వరాజ్యం ఆలోచనను దేశభక్తి ప్రేరణతో కాలేజీ చదువు మానుకొన్న రామనాథం హర్షించలేకపోయినా, ఆమె ఆధునిక దృక్పథానికీ, మనస్సంకోచాలు లేని నిర్మల హార్ధిక ప్రవర్తనకూ మనసులో హర్షించకుండా వుండలేకపోయినాడు.

రామనాథంకు నాలుగేండ్ల క్రితమే వివాహమైంది, మామ నారాయణమూర్తి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆచారపరుడు, రాజభక్తి పరాయణుడు, దురహంకారి అధికారగర్వి. రాజద్రోహం చేసిన అల్లునిమీద ద్వేషంతో కూతురు భవిష్యత్తును కూడా లెక్కచేయని వట్టి పోలీసు బుద్ధి. అతని దురుసుదనంతో తుదకు కూతురు కాపురం చెడక తప్పలేదు.

రామనాథం పెంపుడు తండ్రి శంకరశాస్త్రి నైష్ఠికుడుకాదు గానీ, ఆచార భంగం సహించలేడు. పాత సమాజంలో మంచి ఫలితాలనిచ్చిన అతని లౌక్యమూ, బుద్ధి చాతుర్యమూ రామనాథం వెంట వచ్చిన కొత్త సామాజిక నియమాల ధాటికి నివ్వెరపోవడం తప్ప ఎదిరించి నిలువలేవు. పెంపుడు కొడుకుని ఐ.సి.యస్. ఆఫీసర్ గా చూడాలని కలలు గంటున్న శంకరశాస్త్రికి రామనాథం రాజద్రోహి కావడమూ, జైలుకు పోవడమూ దుఃఖ కారణాలైనాయి. కానీ అంతకంటే బాధాకరమైనది రామనాథం సకల సనాతన కులమత ధర్మాలనూ నిరాకరించి, సంప్రదాయక ఆచారాలనూ, కుటుంబ వ్యవస్థనూ ధిక్కరించి పాత వైవాహిక నియమాలను కూడా తిరస్కరించి, మొత్తం సమాజానికే వెలిగా బతకడానికి పూనుకోవడం.

రామనాథానికి యిటు తండ్రి మామలతోగానీ, అటు మొత్తం సమాజంతోగానీ వచ్చిన ఘర్షణకు మూలకారణం ఒకటే. ఆధునిక విద్యతో రామనాథంకు అబ్బిన ఆధునిక బూర్జువా సాంఘిక రాజకీయ భావాలకూ, అతను పుట్టి పెరిగిన పాత ఫ్యూడల్ సమాజపు సాంఘిక రాజకియ భావాలకూ పొత్తుకుదరకపోవడమే. కేవలం సాంఘిక భావాల ఘర్షణే ఐతే, యేదో ఒకవిధమైన సహజీవనమో, పరస్పర సహజీవనమో సాధ్యమై వుండవచ్చు. కానీ ఘర్షణ రాజకీయ రంగంలో ప్రారంభమైనందున, ఆనాటి చారిత్రక పరిస్థితులలో సాంఘీక భావాలకు లేని తక్షణ ప్రాముఖ్యం రాజకీయ భావాలకు వుండినందున, రామనాథం మనః ప్రపంచంలో సాంఘీక భావాలకు లేని తీవ్రత రాజకీయ భావాలకు వుండినందున, ఆ ఘర్షణ రామనాథానికి సమాజంతోనూ, బంధువులతోనూ వచ్చిన ఘర్షణ క్రమక్రమంగా తీవ్రతరమూ, బహుముఖమూ కాక తప్పలేదు.

అల్లుడు రాజద్రోహి ఐనందుకే మండిపడుతున్న రామనాథం అత్తమామలు అతను జైలుకు పోయి వచ్చినతర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోనందుకు ప్రతిక్రియగా అతనితో బాంధవ్యబంధాలన్నీ తెంచుకుని, అతని భార్యని కాపురానికి పంపడానికి నిరాకరిస్తారు. ఫ్యూడల్ ప్రితృస్వామిక కుటుంబంలో, ఛాందస ఆచార పరాయణ వాతావరణంలో, పోలీసు అధికారి మానవతాధ్వంసక క్రమశిక్షణకింద పెరిగిన సుందరి (రామనాథం భార్య) భర్తను విషపురుగులాగ చూస్తుంది. ప్రాయశ్చిత్తం చేసుకోడానికి నిరాకరించిన రామనాథం పెంపుడు తలిదండ్రులనుంచి విడివడి, బంధువులనుండీ, మొత్తం బ్రాహ్మణ్యంనుండీ విడివడి తోటలోని పాకలో ఒంటరిగా మకాం పెడతాడు. క్రమక్రమంగా స్వరాజ్యంలోని భావస్వామ్యంచేతా, ఆర్ద్ర హృదయంచేతా, సంకల్ప బలంచేతా ఆకర్షితుడై ఆమెను జీవిత సహచారిణిగా, జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తాడు.

ఈ వ్యక్తి జీవిత కథా (Biographical) ఘటనల మధ్య రామనాథం రాజకీయ జీవితంకూడా పరిణామం చెందుతుంది. విదేశీ వస్త్ర దహనం చేసి, కాలేజీ చదువు మానుకోవడంతో రాజకీయాలు ప్రారంభించిన రామనాథం తన తోటలోని బావినీటిని తోడుకోడానికి గ్రామంలోని హరిజనులకు అనుమతి యిస్తాడు. దీనికి కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వ తేదీల్లో బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి రామనాథమూ, స్వరాజ్యమూ వలంటీర్లుగా పోతారు. ఆ వెంటనే జరిగిన గాంధీ ఆంధ్రదేశ పర్యటన సంధర్భంలో గాంధీని ముంగండకు ఆహ్వానిస్తారు. గాంధీజీకి యివ్వబోయే స్వాగత సత్కారాల కొరకు చేసే సన్నాహాలకు గ్రామ బ్రాహ్మణులు యిచ్చే హృదయపూర్వక సహకారంతో నవల అంతమౌతుంది.

ఈ కథాక్రమంలో 1920 నాటి ఆంధ్రదేశ చారిత్రక పరిస్థితులు విపులంగా గాఢంగా, కన్నులకు కట్టినట్లు చిత్రితమైనాయి. రచయిత దీన్ని కేవలం సాంఘీక నవలగాకాక, చారిత్రక నవలగా ఉద్దేశించినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. చారిత్రక నవలకుండవలసిన ముఖ్యలక్షణాలన్నీ యీ నవలకున్నాయి.

చారిత్రక నవలకుండవలసిన మొదటి లక్షణం చారిత్రకత. సాధారణంగా సాంఘీక నవలలన్నీ సమకాలిక సమాజాన్ని వాస్తవికంగానే చిత్రిస్తాయి. కానీ సామాజిక పరిస్థితులు యెంత వాస్తవికంగా, యెంత విపులంగా, యెంత కళాత్మకంగా చిత్రించినా, ఆ దేశకాల పరిస్థితులు అలా యెందుకున్నాయనే ప్రశ్న ఎప్పుడూ ఉత్పన్నంకాదు (ప్రశ్నే లేదుగనక సమాధానమూ లేదు). యథార్థ జీవితంలోని దేశకాల పరిస్థితులను యెలా వున్నవాటిని అలా చిత్రించడమే సామాజిక నవల కర్తవ్యం. ఆ పరిస్థితుల పూర్వాపరాల పరిశీలన కానీ, కార్యాకారణాల పరిశీలన కానీ దానికి అనవసరం. కానీ, చారిత్రక నవలలో దేశకాల పరిస్థితులకు చారిత్రకత వుంటుంది. అనగా, ఆదేశం యొక్క గతచరిత్ర ఫలితంగా ఆనాటి సమాజమ్ అలా వుందనీ, ఆ దేశపు చారిత్రక పరిణామక్రమంలో అది ఒక దశా విశేషమనీ పాఠకునికి ఒక స్పృహ (Consciousness) కలుగుతుంది. నవలలోని దేశ కాల పరిస్థితులు ఒక చారిత్రక దశా విశేషం గనుక, అవి శాశ్వతంగా వుండవనీ, కాలక్రమాన మారుతాయనీ కూడా పాఠకునికి స్పృహకలుగుతుంది. ఈ స్పృహ యెలా కలుగుతుందంటే భూతకాల శక్తులకూ, వర్తమాన కాల శక్తులకూ జరిగే ఘర్షణ కీలకపాత్ర వహించడం ద్వారా.

చారిత్రక నవలలోని మరొక విశేషం దేశకాల నిర్ధిష్టత. సామాజిక నవలలోని దేశకాల పరిస్థితులు చిత్రంలో పూర్వరంగం (Back-ground) లాగే వుంటాయి. కానీ, వాటికి అంతకుమించిన ప్రాముఖ్యం వుండదు. దేశకాల పరిస్థితులు మార్చినా కథకు తీరని నష్టమ్ ఏమీ జరగదు. ఆకథ ఆ దేశంలోనే, ఆ కాలంలోనే జరగాలన్న నిర్భంధం ఏమీ లేదు. బెంగాలీ నవలలోని కథ (అ ప్రధానమైన కొన్ని వివరాలు మార్చివేస్తే) తెలుగుదేశంలో జరగవచ్చు. తెలుగు నవలలోని కథ మహారాష్ట్ర దేశంలో జరగవచ్చు. ఇంగ్లండు నవలలోని కథ ఫ్రాన్సులో జరగవచ్చు; ఫ్రెంచి నవలలోని కథ యూరప్ లో మరెక్కడైనా జరగవచ్చు. లేదా అమెరికాలో జరగవచ్చు. డికెన్స్, డాస్టోయెవ్ స్కీల నవలల వంటి యూరోపియన్ నవలలు భారతదేశంలో యెక్కడైనా జరగవచ్చు. యిది ఎలా సాధ్యమంటే ఆ పాత్రలూ, ఆ సన్నివేశాలూ సామాజిక పరిస్థితులనుండి ఉద్భవించినవే అయినా, ఆ సామాజిక పరిస్థితులు ఆ దేశం, ఆకాలం యొక్క విశిష్ట పరిస్థితులు కావు. ఉదాహరణకు యీనాడు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకూ సామాన్యమైన సామాజిక పరిస్థితులు అనేకం వున్నాయి. నిజానికవి చాలా ముఖ్యమైనవి కూడా; యుగ ధర్మాన్ని ప్రధానంగా నిర్ణయించేవి అవే. అందువలన సామాజిక నవలాకారుని దృష్టిలో అవి ప్రాముఖ్యం వహించవచ్చు. కానీ చారిత్రక నవలాకారుడు తెలుగు వాడయితే తెలుగుదేశంలోని విశిష్ట పరిస్థితులకు ప్రాముఖ్యం యిస్తాడు. మహారాష్టృడయితే మహారాష్ట్ర విశిష్ట పరిస్థితులకు ప్రాముఖ్యం యిస్తాడు. ఆ దేశకాల విశిష్ట పరిస్థితులలో తప్ప ఆ కథ అలా జరగదని అనిపిస్తుంది చారిత్రక నవల. యిది ఎలా సాధ్యమంటే, యిటు నవలలోని పాత్రలకూ, సన్నివేశాలకూ, అటు దేశకాల విశిష్ట పరిస్థితులకూ కార్యకారణ సంబంధం వుంటుంది. పాత్రల మనోధర్మాలూ, జీవిత పద్దతులూ, ప్రవర్తనా రీతులూ, వ్యక్తావ్యక్త ఆశయాలూ, అట్లే సన్నివేశాల పూర్వా పరాలూ దేశకాల విశిష్ట పరిస్థితులచేత నిర్ణయింపబడతాయి.

చారిత్రక నవలలోని మరొక ముఖ్య లక్షణం పాత్రలను ఆనాటి చారిత్రక శక్తులకూ, సామాజిక ధర్మాలకూ ప్రతినిధులుగా చిత్రించి, వాటి మధ్య జరిగే ఘర్షణను పాత్రలమధ్య జరిగే ఘర్షణగా చిత్రించడం. పాత్రల మధ్య జరిగే ఘర్షణ కేవల వైయక్తిక స్వార్థాలవల్లనో, కేవల వైయక్తిక కారణాల వల్లనో జరగదు. ఆ పాత్రలు భిన చారిత్రక శక్తులకు ప్రతినిధులైనందున ఘర్షణ తప్పనిసరి అవుతుంది. సమాజంలో నిత్యం ఘర్షణపడే ధర్మాలకూ, చారిత్రక శక్తులకూ, జీవిత విధానాలకూ పాత్రలు ప్రాతినిధ్యం వహించడమంటే ఆ పాత్రలు యోచించి, చర్చించి, లాభనష్టాలు బేరీజు వేసుకుని ఒక పక్షం వహించడం కాదు. ఆ పాత్రల జీవిత పద్ధతులూ, మనోధర్మాలూ, అవ్యక్త కాంక్షలూ అన్నీ కలిసి ఆయా పాత్రలు ఆయా పక్షం వహించేటట్టు (గత్యంతరం లేదని అనిపించే విధంగా) నిర్ణయిస్తాయి.

చారిత్రక నవలలో చారిత్రక పరిస్థితులకూ, చారిత్రక వాతావరణానికీ ప్రాముఖ్యం వుంటుంది. కానీ అంతమాత్రాన రాజకీయ చర్చలకూ, ఉపన్యాసాలకూ తీర్మానాలకూ ప్రాముఖ్యం వుంటుందనుకోవడం పొరపాటు. తారీఖులకూ, దస్తావేజులకూ చరిత్ర అధ్యయనంలో విలువ వుండవచ్చుగానీ, చారిత్రక నవలలో వుండదు. యెందుకంటే చారిత్రక నవల చారిత్రకంగా వుంటూనే నవలా లక్షణాలను అణుమాత్రం కూడ కోల్పోకూడదు. కనుక చారిత్రక నవలలో చారిత్రక పరిణామ క్రమంలోని వివిధ ఘటనల విపుల చిత్రీకరణకూ, ఆ ఘటనల పూర్వా పరాల విస్తృత పరిశీలనకూ తావుండదు. చారితక పరిణామంలోని సారభూతమైన (Essential) కొన్ని ఘటనలకు మాత్రమే తావుంటుంది. అనగా చారిత్రక పరిణామ క్రమానికి క్లుప్తీకరణా (Condensation) సాంద్రీకరణా (concentration) జరుగుతాయి. తత్ఫలితంగా చరిత్ర నాటకీకృతం అవుతుంది. అంతేగాక, సారభూతమైన ఆ ముఖ్య ఘటనల చిత్రణకూడా (ఘటనల ఆర్ధిక సాంఘీక రాజకీయ ఫలితాలూ కారణాలూ అంటూ) శుష్క శాస్త్ర చర్చకు దిగకుండా, ఆఘటనలు వ్యక్తుల జీవితాలను ఏవిధంగా మార్చివేసిందీ, వ్యక్తుల హృదయాలను యేవిధంగా కలచి వేసిందీ కళాత్మకంగా ప్రదర్శిస్తుంది. కళాత్మకంగా అంటే వ్యక్తుల కష్టసుఖాలకూ; రాగద్వేషాలకూ, హృదయగతమైన అనుభూతులకూ ప్రాముఖ్యం యివ్వడం. అప్పుడే నాటకీకరణ పరిపూర్ణమూ అవుతుంది. సాఫల్యమూ పొందుతుంది, అప్పుడే ఆనాటి సమాజమూ, ఆనాటి ప్రజాజీవితమూ రక్తమాంస పుష్టంగా మన కండ్లముందు ప్రత్యక్షమౌతాయి. అప్పుడే అది సాహిత్యమౌతుంది. వ్యక్తుల హృదయానుభూతులతో నిమిత్తం లేకుండా కేవల చారిత్రక పరిఙ్ఞానమే చాలుననుకుంటే, దానికి చరిత్ర గ్రంథాలు వున్నాయి; చారిత్రక నవలలు రాయడం అనవసరం. ఆ చారిత్రక దశలోని ప్రజాజీవితంతో పాఠకుడు తాదాత్మ్యం పొందగలిగినప్పుడే చారిత్రక నవల సార్థకమౌతుంది.

చారిత్రక నవలకు అతిముఖ్య లక్షణం మరొకటి వుంది. నవలలో చిత్రితమైన చరిత్ర తన గత చరిత్రే అని పాఠకునికి అనుభూతి కావాలి. గత చరిత్రకూ వర్తమాన చరిత్రకూగల కార్యాకారణ సంబంధం పాఠకుని బోధపడాలి. ఆనాటి చరిత్ర అలా వున్నందువల్లనే యీనాటి చరిత్ర ఇలా వుందనే స్పృహ (consciousness) పాఠకునికి కలగాలి. నవలలో సాహిత్య లక్షణాలు యెన్ని వున్నప్పటికీ, చారిత్రక వాస్తవికత యెంత వున్నప్పటికీ యీ అంశం కొరవడితే, అది ఉత్తమ చారిత్రక నవల కాలేదు. యెందుకంటే వర్తమానానికి కారణం కాజాలనిది గతచరిత్ర కాలేదు. వర్తమానాన్ని సుబోధకం చేయజాలని గతాన్ని మనమ్ స్మరింపవలసిన అవసరమూలేదు.

రామమోహనరావుగారు రచించిన ఈ నవలలో పై లక్షణాలనీ యేవిధంగా సాఫల్యం పొందిందీ వివరించడం ఈ వ్యాసంలో సాధ్యంకాదు కానీ, 1920 నాటి రాజకీయ పరిస్థితులూ, సామాజిక పరిస్థితులూ పాత్రలను తీర్చడంలోనూ, సన్నివేశాలను కూర్చడంలోనూ, నిర్ణాయక పాత్ర వహిస్తాయి. రాజకీయ పరిస్థితులలో ఆంధ్రదేశ ప్రత్యేకత అనదగింది యెక్కువగా లేనిమాట నిజమే. యెక్కువ ప్రత్యేకత వుండడానికి అవకాశంలేదు కూడా. బ్రిటీష్ ఆధిపత్యం కింద భారతదేశమంతా రాజకీయ ఏకీకరణ పొందిన తర్వాత రాష్ట్రాలకు రాజకీయ ప్రత్యేకత యేమీ మిగలలేదు. రాజకీయ ఏకీకరణ యేర్పడింది. గనుకనే రాజకీయ స్వాతంత్ర్యం కొరకు జరిగిన మన జాతీయోద్యమం ఆవిర్భవించడానికీ, విస్తరించడానికీ, తుదకు విజయం పొందడానికీ వీలు కలిగింది. ఐనప్పటికీ 1920 నాటి రాజకీయ వాతావరణంలో కొన్ని అంశాలు గమనార్హం. బెంగాల్ లోనూ, పంజాబ్ లోనూ ఆనాడు టెర్రరిస్టు ఉద్యమం బలంగా ఉండింది. ఆంధ్రదేశ రాజకీయాల్లో అది యెపుడూ ప్రవేశించనేలేదు. మహారాష్ట్ర లోను యితర ఉత్తర భారత ప్రాంతాలలోనూ జాతీయోద్యమంలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుద్ధరణ వాద ప్రాబల్యమూ పెనవేసుకొని వుండినాయి. ఆంధ్ర రాజకీయాల్లో వాటికెప్పుడూ స్థానమే లేదు.

మతాభిమానమూ, సనాతన ధర్మమూ, బ్రిటీష్ వాళ్ళ తాబేదార్లుగా వ్యవహరించినాయే గానీ దేశభక్తులెప్పుడూ వాటిని ఆదరింపలేదు. కాంగ్రెసు మంత్రులకూ, స్వతంత్ర పార్టీ నాయకులకూ తిరుపతి దేవుడు అయినాడు యిలవేలుపైనాడు గానీ, ఆనాటి జాతీయ నాయకులు తమ ఉద్యమ ఫలసిద్ధికి తిరుపతి దేవుని కెప్పుడూ ముడుపులు కట్టుకోలేదు. నిజానికి తెలుగు జాతి జీవితంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘ సంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమ రూపంలో ప్రవేశించినాయి. అనగా 1920 నాటికి తెలుగుదేశంలో ఫ్యూడల్ విశ్వాసాలమీద తిరుగుబాటూ, బూర్జువా మనస్తత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై వుండింది; ఇది ఆనాటి ఆంధ్రదేశ ప్రత్యేకత అనుకోవచ్చు. యీ ప్రత్యేక లక్షణం నవలలోని వాతావరణంలో ప్రస్ఫుటంగా వుండటమే గాక, ఘటనాక్రమంలో నిర్ణాయక పాత్ర వహిస్తున్నది. కథానాయకుడైన రామనాథం రాజకీయ కారణాలవల్ల కాలేజీ చదువు మానుకోవడంతో అతని జీవితం మలుపు తిరిగినప్పటికి, అతని తదనంతర జీవిత మంతా సాంఘీక దురాచారాలమీద పోరాటమే. ఆ పోరాటంలో వచ్చిన అగ్నిపరీక్షలే అతని జీవిత సర్వస్వాన్ని నిర్ణయించి, అతన్ని ఒక మనిషిగా ఒక వీరునిగా తీర్చిదిద్దుతాయి. నిజానికి కాలేజీ చదువు మానేటప్పటికే అతనికి ఫ్యూడల్ సామాజిక ధర్మాలమీద విశ్వాసం నశించింది. అప్పటికే అతనిలో జాగృతమైన బూర్జువా మనోధర్మమే అతన్ని రాజకీయ రంగంలోకి ఆకర్షించిందని కూడా చెప్పవచ్చు.

ఫ్యూడల్, బూర్జువా ధర్మాలకు జరిగిన చారిత్రక ఘర్షణే యితివృత్తంగా గల యీనవలలో బూర్జువా ధర్మానికీ రామనాథం ప్రతినిధి. బ్రాహ్మణ గ్రామమైన ముంగండను కథాస్థలంగానూ బ్రాహ్మణ యువకుడైన రామనాథానాన్ని కథానాయకుడుగానూ రచయిత స్వీకరించినాడు. తెలుగుదేశంలోని వేలాది గ్రామాలకు ఒక బ్రాహ్మణ గ్రామం ప్రతినిధి కాజాలదని తెలుగుదేశంలోని లక్షలాది యువకులకు ఒక బ్రాహ్మణ యువకుడు ప్రతినిధి కాజాలడనీ అనిపించవచ్చు. కానీ, ఫ్యూడల్ ధర్మాలకూ బూర్జువా ధర్మాలకూ జరిగిన ఘర్షణను చిత్రించేటప్పుడు ఫ్యూడల్ వ్యవస్థను అత్యంత ఘనీభూత రూపంలో చిత్రిస్తే తప్ప ఆ ఘర్షణ యెక్క తీవ్రతా, వ్యగ్రతా వ్యక్తంకావు. ఫ్యూడల్ ఆచారాలు, ఆలోచనలూ విశ్వాసాలూ ఎంత కఠోరంగా యెంత అమానుషంగా యెంత మూర్ఖంగా వుండగలవో చూడాలంటే బ్రాహ్మణ గ్రామాల్లోనూ, బ్రాహ్మణ కుటుంబాలను మాత్రమే చూడగలం; జైలునుంచి వచ్చిన రామనాథాన్ని, జైల్లో కులభ్రష్టుడైనాడన్న కారణంచేత అతని తలిదండ్రులే యింట్లోకి రానివ్వరు. అతను ముట్టుకున్న బిందె మైలపడిందని కంసాలి కామయ్యా, అతను ముట్టుకుంటే చేద మైలపడుతుందని పడవ సరంగూ విశ్వసిస్తారు. శివరామయ్య తల్లిదీ మరీ విపరీతమైన ఆచారం. వీథిలోనుండి యింట్లోకి యెవరు వచ్చినా వాకిట్లో నిలబడి చెంబెడు పేడనీళ్ళు కాళ్ళమీద చల్లుకుని రావలసిందే; లేకపోతే యిల్లంతా మైలపడుతుందని ఆమె భయం. ఇక మూడుకాళ్ల ముసలమ్మ నరసమ్మ ఆచార పరాయణత్వం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఆచారాలు పుణ్యపాపాలకూ, పరలోక గతులకూ మూలమనీ సనాతులందరూ విశ్వసిస్తారు. కానీ, ఆమె “ఏమో ఎవరు చూడొచ్చారు?… పరలోకం అంటూ వుందో లేదో.. దానిని నమ్ముకుని ఇక్కడ అనాచారపు బ్రతుకు గడప మంటావా?” అంటుంది. ఆమెకు ఆచారం అనేది పరలోకం కంటే కూడా విలువైనది. విశ్వసనీయమైనదీ. పరలోక గతులు కాకపోతే ఇక ఆచారానికి ప్రయోజనమేమిటని అడిగితే బహుశా ఆమె సమాధానం చెప్పలేకపోవచ్చు, చెప్పగలిగితే (virtue is its own reward) అన్న ధోరణిలో వుంటుంది. ఆచారం మంచిది, గనుక ఆచరిస్తున్నాం, దానికి ప్రయోజనమెందుకు ?” అంటుంది. అచారం ఆమె రక్తంలో జీర్ణించిపోయిన అలవాటు. అలవాట్లకు బానిసలైన వాళ్ళు వాటి ప్రయోజనాలను గురించి ఆలోచించరు. ఆ అలవాట్లు చిన్నప్పుడే ఊహ తెలియకముందే యేర్పడితే, ఇక ఆలోచించేశక్తి వుండదు వాళ్ళ మెదడుకు. ఆచారం గురించి ఆమె ఆలోచించదు; ఆలోచించలేదు. యెవర్నీ ఆలోచించనివ్వదు. ఫ్యూడల్ వ్యవస్థలోని ప్రథమసూత్రం అదే. ఆలోచించకుండా ఆచారాలకూ, అధికారాలకూ తల వొగ్గడమే దైవభక్తి. రాజభక్తి, పతిభక్తి, పితృభక్తి మతం చాతుర్వర్ణ్యం, సమాజంలో ప్రకృతి సిద్ధమైన అంతస్థులు దైవ దత్తమైన తర తమ బేధాలు – యేదో ఒక పేరుతో మనుషులను ఆలోచించనీయకుండా అణుకువా, విధేయతా, ఆజ్ఞాపాలనా, బానిసబుద్ధి మొదలైన సద్గుణాలను ఉగ్గుపాలతో నేర్పేదే ఫ్యూడల్ వ్యవస్థ. ఈ వ్యవస్థ యొక్క పరమమైన (absolute) రూపం చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాల్లోనే సాధ్యమౌతుంది. ఫ్యూడల్ బూర్జువా వ్యవస్థలను వాటి పరమమైన రూపాలలో చిత్రించినప్పుడే వాటి పరస్పర సంఘర్షణ యెంత భయంకరంగా, యెంత భీభత్సజనకంగా వుండేదీ వ్యక్తమౌతుంది. ఆ సంఘర్షణలో చిక్కుకున్న వ్యక్తలకు అది యెంత మర్మ విదారకంగా వుండేదీ అప్పుడే పాఠకులకు అనుభూతమౌతుంది. అందుకే రచయిత ముంగండను. కథారంగంగానూ, రామనాథాన్ని కథానాయకునిగానూ, యెన్నుకున్నాడు.

రామనాథం మామ నారాయణమూర్తిని పోలీసు ఇన్ స్పెక్టర్ గా చిత్రించడంలోని అంతర్యంకూడా అటువంటిదే. అల్లుని ప్రభుత్వ వ్యతిరేకి ఐన సత్యాగ్రహిగానూ, మామను ప్రభుత్వపు బంటు ఐన పోలీసు ఉద్యోగిగానూ చిత్రించడం మరీ నాటకీయం (dramatic) గా వుందనీ, సగటు వాస్తవ జీవితానికి దూరంగా వుందనీ యెవరైనా నిందించవచ్చు. కానీ ఒక చారిత్రక యుగాన్ని మానవ హృదయానుభూతుల పరిభాషలోకి అనువదించవలసినపుడు చరిత్రను నాటకీకరించక తప్పదు. సుమారు అరశతాబ్దంపాటు సాగిన మన జాతీయోద్యమం కేవలం ఇంగ్లీషు వాళ్ళకూ, భారతీయులకూ మధ్యనే సాగిన పోరాటం కాదు. అది మొత్తం భారత దేశాన్నే జాతీయ వాదులూ; ప్రభుత్వ పక్షపాతులూ అనే రెండు కూటాలుగా చీల్చింది. ఫూడల్ బూర్జువా శక్తుల పరస్పర సంఘర్షణకూడా యీ జాతీయ సంగ్రామంతో పెనవేసుకొని పోవడంతో యీ చీలిక మరింత గాఢంగానూ, మరింత సంక్లిష్టంగానూ, మరింత సర్వంకాష్టంగానూ జరిగింది. తత్ఫలితంగా మన జాతీయ పోరాటంలో అంతర్యుద్ద స్వభావం ప్రగాఢంగా వుండింది. నిజానికి ఫ్యూడల్ వ్యవస్థమీద బూర్జువా శక్తుల పోరాటం ఇంగ్లాండు, ఫ్రాన్సు, అమెరికా మొదలైన అనేక దేశాలలో అంతర్యుద్ధ రూపంలోనే సాగింది.

ఇతర కారణాలతో పాటు, మనదేశంలోని బూర్జువా విప్లవం జాతీయ పోరాటరూపం ధరించిన ప్రధాన కారణంచేత, అందులోని అంతర్యుద్ధ స్వభావాన్ని మనం సరిగా గుర్తించడంలేదు. మొత్తం జాతినే రెండు శిబిరాలుగా చీల్చిన అంతర్యుద్ధాం అంతటితో ఆగలేదు; అనేక లక్షల కుటుంబాలను, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను కూడా రెండు శిబిరాలుగా చీల్చింది. జాతీయ పోరాటంలో పాల్గొన్న వాళ్ళూ, ఫ్యూడల్ నిరంకుశ శాసనాలనూ, వికృత సనాతన ధర్మాలనూ యెదిరించిన వాళ్ళూ, యెన్ని లక్షలమంది యువతీ యువకులు తమ తలిదండ్రులను ధిక్కరించవలసి వచ్చిందో, తమ ఆలుబిడ్డల సంక్షేమాన్ని తృణీకరించవలసి వచ్చిందో, తమ ఆత్మీయుల హృదయాలలో అగ్ని రగిలించవలసి వచ్చిందో, తత్ఫలితంగా తామే ఎంత మనో వేదనకు గురి కావలసి వచ్చిందో మనకు తెలుసు; చరిత్రకారులు చెప్పకపోయినా మనం ఊహించుకోగలం. మరి ఒక అంతర్యుద్ధానికి నవలా రూపం ఇవ్వవలసి వచ్చినప్పుడు, ఒక చారిత్రక దశలో చారిత్రక కారణాల వల్ల స్త్రీ పురుషులలో కలిగిన హృదయ సంతాపాన్నీ, హృదయ సంక్షోభాన్నీ (ఈనాటి) పాఠకులకు కళా పరిభాషలో అందజేయవలసి వచ్చినప్పుడు, కుటుంబాలనే అంతర్యుద్ధ రంగస్థలంగా చిత్రించక తప్పదు, చరిత్రను నాటకీకరించక తప్పదు.

నవలలోని మరొక ఘటనను కూడా యిక్కడే స్పృశించడం న్యాయంగా వుంటుంది. నారాయణమూర్తి ఇంట్లోకి వచ్చి తనకూతురుతో మాట్లాడుతున్న అల్లుని చూసి, యెవరో తుంటరి తనకూతురును అల్లరి పెడుతున్నాడనే అపోహతో వెనక ముందులు ఆలోచించకుండా తక్షణమే చేతిలోని కొరడాతో పశువును బాదినట్లు అల్లుని బాదుతాడు. ఆ సన్నివేశం Melodramatic (అతిశయ నాటకీయం, లేక క్షుద్ర నాటకీయం) గా వుందనే విమర్శ రావడం సహజమే. అంతేగాక ఆ ఘటన ఒక చిన్న పొరపాటువల్ల జరిగిన యాదృచ్ఛిక ఘటన; అటువంటి యాదృచ్ఛిక ఘటనమీద తదనంతర కథాగతి ఆధారపడడం ఉత్తమ కళా లక్షణం కాదనే విమర్శకూడా ఈ నవలమీద వుంది.

ఈ ఘటన అతిశయ నాటకీయంగా కనపడే మాట నిజమే. కానీ నారాయణ మూర్తి వ్యక్తిత్వం (Character) దృష్ట్యా అది అసహజమేమీ కాదు. అతను దురహంకారీ, అధికార గర్వీ మాత్రమే కాదు; యెదటి వాళ్ళను పురుగును చూసినట్లు హీనంగా చూడడమూ, ముందువెనకలు చూడకుండా కొరడాలూ, లాఠీలూ ప్రయోగించడమూ అతనికి అలవాటు. అల్లుడు కాలేజీ చదువు మానుకొని జాతీయ వాదిగా మారిన వార్త విన్నప్పుడు అతను అల్లుని “గూళ్ళు విరగబొడిచేసి బొక్కలో తోసేస్తే” రోగం కుదురుతుందని వియ్యంకునితోనే అనగలిగిన కిరాతకుడు. అల్లుని దారిలోకి తెచ్చుకోడానికి కూతురుకు కార్యం చేసే ఆలోచనలో వున్న భార్యతో ఆ శుభకార్యం తన ఇంట్లో జర్గడానికి వీల్లేదని నిషేధిస్తూ, “నా ఉద్యోగానికి సంబంధించినంతవరకూ అల్లుడూ లేడు, కూతురూలేదు. ఆ కుర్రవాడు నా యింట అడుగుపెట్టడానికి వీలులేదు… ఓ చీరపెట్టి పిల్లని పంపించెయ్యి. ఆ శుభకార్యం వాళ్ళింట్లోనే చేసుకుంటారు” అని అనగలైగిన వట్టి కర్కోటకుడు అతను. బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశ సందర్భంలో వలంటీరుగా పనిచేస్తూ రైలుస్టేషనులో వున్న ఒక పడుచు (స్వరాజ్యం)ను కేవలం కక్షతో, ఆమె ’మగవాళ్ళ వేటకోసం’ వచ్చిన పడుపుకత్తె అనే నెపం పెట్టి ఆమెను యీడ్చుకురమ్మని హెడ్ కానిస్టేబుల్ ను పంపిన కేవలం పోలీసు జంతువు అతను. కనుక అతను అల్లుని కొరడాతో బాదడంలో అసహజత్వమూ లేదు అతిశయ నాటకీయతా లేదు. కాకపోతే, నారాయణమూర్తి పాత్ర కల్పన లోనే ఆ లక్షణాలు వున్నాయని యెవరయినా ఆక్షేపించవచ్చు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన 20 యేండ్ల తర్వాత కూడా మన పోలీసు అధికార్ల అత్యాచారాలూ, అమానుషత్వమూ చూస్తున్న మనం 1920 నాటి పోలీసు అధికార్లలో పశుత్వం మూర్తీభవించినందుకు ఆశ్చర్యపడనక్కరలేదు. నారాయణమూర్తి ప్రవర్తన కేవలం కథా సౌకర్యంకోసం కల్పించింది కూడా కాదు. ఆనాటి పోలీసు ఉద్యోగుల పశుత్వం గురించి రచయితకున్న నిశ్చితమయిన అవగాహనలోనుండి ఉద్భవించిన మూర్తే నారాయణమూర్తి పాత్ర. దాన్ని గురించి సందేహంగానీ, అస్పష్టతగానీ మిగిలించలేదు రచయిత. ఆనాటి పోలీసు మనస్తత్వంలోని పశుత్వమూ, నీచత్వమూ నవల ప్రారంభంలోనే పాఠకునికి పరిచయమౌతాయి. రామనాథానికి పడవ ప్రయాణంలో ఒక పోలీసు జవానుతో ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ చిన్నదే ఐనా పోలీసు జులుం చవిచూసిన రామనాథం “చదువుకొని ఈ దుర్మార్గులకీ, దుష్టులకీ సహాయం చేయడమే కదా మా ఆశయం. ఆ ఉద్యోగమే బ్రతుక్కి పరమార్ధం అనుకొన్నాం. మా పూర్వులు చేసిన పుణ్యకార్యాలూ, మా భార్యలు చేసిన పూజలూ మాచేత ఈ లుచ్ఛాలకి చేతులు నలిపించడం కోసమేనా… ఓరి దేవుడా!” అంటూ ఆక్రోశంతో, ఆత్మగ్లానితో, అభిశంసనతో కంఠం రుద్దమై నిలువునా కృంగిపోతాడు.

ఇక అల్లుని కొట్టడమ్ అనే యాదృచ్ఛిక ఘటన కథాగతికి ఆధారభూతం కావడం కళాభంగం అనే విమర్శవుంది. అది యాదృచ్ఛిక ఘటన అన్నమాట నిజమే కానీ, తదనంతర కథాగతికి ఆధామైందనడం (స్థూల దృష్టికి అలా అనిపించినా) సూక్ష్మ పరిశీలనకు నిలిచేది కాదు. మామచేత దెబ్బలు తిన్న తర్వాత కూడా రామనాథం తన భార్యను తెచ్చుకోడానికీ, వీలైతే మామగారి కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించడానికీ సకల ప్రయత్నాలు చేసినాడు. కాని నారాయణమూర్తిలోని పోలీసు తత్వమే ఆ ప్రయత్నాలనన్నిటినీ కాలదన్నింది. రాజద్రోహి అయినవాడు అల్లుడయినా తన్ని జైలుకు పంపించిన రాజభక్తి తత్పరుడనే ప్రశంసలముందు అతనికి అల్లుడనే అభిమానంగానీ, కూతురు భవిష్యత్తు సర్వనాశనమౌతుందనే కనీస వివేకంగానీ మిగల్లేదు. కాబట్టి కథాగతి ఆ యాదృచ్ఛిక ఘటన మీద ఆధారపడిందనడం నిజంకాదు. కథ అంతా ఆనాటి చారిత్రక సన్నివేశంలో అల్లుడు జాతీయవాది, మామ పోలీసు ఉద్యోగీ కావడం అనే కీలక పరిస్థితిమీదా, ముఖ్యపాత్రల మనోధర్మాలమీదా సంపూర్ణంగా ఆధారపడింది.

నిజానికి యీ నవల అతిశయ నాటకీయంగా కానీ, నాటకీయంగా కానీ వుందనే విమర్శకంటే, వుండవలసిన చోట తగినంత నాటకీయంగా లేదనే విమర్శ సమంజసంగా వుంటుంది. నవలలోని అనేక సన్నివేశాలను రచయిత నాటకియంగా కల్పించుకొని కూడా, ఆ సన్నివేశాలలోని నాటక తత్వాన్ని (Dramatic element) పూర్తిగా వినియోగించుకోలేక పోయినాడనే అనిపిస్తుంది. ఉదాహరణకు సంభాషణలోని నాటక తత్వాన్ని రచయిత సరిగా గుర్తించినట్లు లేదు.

నవల అనేది గతంలో జరిగిన ఒక కథను చిత్రిస్తుంది. కనుక కథనం యెప్పుడూ భూతకాలం (Past tense) లో వుంటుంది. ఇది యెప్పుడో జరిగి పోయిన కథ అనే స్పృహ (consciousness) పాఠకుని యెప్పుడూ వెన్నాడుతూ వుంటుంది. అందువలన కథ చదువుతున్నట్లు వుంటుందేకాని, ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఉండదు. ఎంతో నాటకీయంగా వున్న సన్నివేశాలలో మాత్రమే పాఠకుడు ఆ స్పృహనుండి బయటపడి, పాత్రలతో తదాత్మ్యం పొంది, ఆ సన్నివేశాలను ప్రత్యక్షానుభూతులుగా అనుభవించగలడు. నవలా తత్వమే అంత. యెప్పుడో జరిగిన కథను యెవరో చెప్పుతూవుంటే మనం వింటున్నట్లు వుంటుంది. నాటకంలో ఐతే కథ అంతా మన కండ్ల యెదుటనే జరుగుతున్నట్లు మనకు అనుభూతమౌతుంది. ఇందులో అభినయ కళకుగల ప్రాముఖ్యం యెంత వున్నా, నాటకానికీ, నవలకూ రచనా సంవిధానంలోనే వున్న భేదమే కీలక అంశం. నాటకం అంతా సంభాషణల రూపంలో సాగుతుంది. ఆ సంభాషణలు మనకు వినపడతాయి. పాత్రలు స్వయంగా వచ్చి మన కండ్లయెదుట మాట్లాడుకుంటారు. కథ అంతా వర్తమానకాలంలో జరుగుతుంది. సంభాషణల మధ్యలో రచయిత ప్రవేశించి వివరణలూ, వ్యాఖ్యలూ యివ్వడం జరగదు. పాత్రలు ముఖాముఖిగా నిలబడి, పరస్పరం ఘర్షించుకుంటారు. పాత్రల మనోభావాలూ, హృదయ తాపాలూ, వివిధ రాగద్వేషాలూ మనకు ప్రత్యక్షానుభవంలోకి వస్తాయి. కథ యెవరో చెప్పగా మనం వింటున్నట్లుగాక, మన ఎదుట జరుగుతున్న కథను మనం చూస్తున్నట్లు వుంటుంది. సంభాషణల్లోగల యీ కళామర్మం గ్రహించిన Hemingway వంటి నవలా కారులు తమ నవలల్లో సంభాషణలకు విశేష ప్రాముఖ్యం యిచ్చినారు. రామమోహనరావుగారి యీ నవలల్లో సంభాషణల పాత్ర చాలా తక్కువగా వుండటమే గాక, యెంతో నాటకీయంగా వున్న సన్నివేశాలలో కూడా ప్రాత్రల సంభాషణ స్వేచ్ఛగా సాగదు. అడుగడుగునా రచయిత పాత్రలమధ్య ప్రవేశించి వాళ్ళ మాటలకు వ్యాఖ్యలూ, వివరణలూ యిస్తాడు. లేదా పాత్రల పాత్రను తానే స్వీకరించి వాళ్ళ మాటలు తానే Indirect speech లో చెప్తాడు. అందువలన పాత్రల ముఖాముఖి ఘర్షణపతాక స్థాయిలోవున్న సన్నివేశాలలో కూడా వాటి నాటకీయ అవకాశాలు నష్టమైపోయినాయి.

(ఇంకా ఉంది.)

You Might Also Like

One Comment

  1. కొల్లాయి గట్టితే నేమి? (ఒక ఉత్తమ చారిత్రక నవల) – 2 | పుస్తకం

    […] వివేచన” వ్యాసాలలోనిది. మొదటి భాగం ఇక్కడ. యూనీకోడీకరించడానికి సహకరించిన […]

Leave a Reply