కొల్లాయిగట్టితేనేమి? – నేనెందుకు రాశాను? – 1

రాసిన వారు: మహీధర రామమోహనరావు
*****************

Hidden Springs of the Indian National Movementను తెలుగునాటి కమ్యూనిస్టు cadre కి చెప్పడం కోసమే నేనీ నవల వ్రాసేను.

1960ల నాడు నేను ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్రలో సబ్-ఎడిటరుగా పనిచేస్తున్నాను. ఆ రోజులలో ఆదివారం ప్రత్యేక సంచిక బాధ్యత నేను చూస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జయంతి సంచికకై వ్యాసాలు సేకరిస్తున్నాను. ఆ సందర్భంగా ఒక వ్యాసం నా మనస్సునకు చాలా బాధ కలిగించింది. ’అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిన ఆంధ్రపత్ర్రిక అల్లూరి సీతారామరాజును దౌర్జన్యకారిగా నిందించిం’దని రచయిత అభ్యంతరం. గాంధేయ అహింసావాదాన్ని సమర్థిస్తూ 1922లో ఆంధ్రపత్రిక ఆ వ్యాఖ్య చేసి వుండవచ్చు. అభిప్రాయభేదంగా చూడాలి తప్ప అది నింద్యమేం కాదు. 1936నాడు సోషలిస్టు – కమ్యూనిస్టు సాహిత్యాన్ని పల్లెటూళ్ళకు తీసుకెళ్ళినప్పుడు మా వాకబు గ్రామంలో ఆంధ్రపత్రికనెవరు తెప్పిస్తారు? ఎవరు చదువుతారు? అనే. ఆ పాఠకులు సామాజికంగానూ, రాజకీయంగానూ పురోగామిభావాలు కలిగి వుంటారనీ, వారి మనస్సులు సోషలిస్టు భావాన్ని ఆకళింపుచేసుకోగలుగుతాయనే మా అభిప్రాయం. సాధారణంగా వారు మమ్మల్ని మాట్లాడనిచ్చేవారు, వినేవారు. మర్యాదకైనా పుస్తకాలు తీసుకునేవారు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలలో రాజకీయ, సామాజిక సంస్కారం కలిగించిన ఆంధ్రపత్రికను ’అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిందని’ నిందించడం నాకు కష్టం అనిపించింది. దీనికి కారణం జాతీయోద్యమ పురోగతికి ఏయే శక్తులు ఏ విధంగా తోడు పడ్డాయో తెలీకపోవడమే అనిపించింది.

ఆ రాసిన వారొక కమ్యూనిస్టు రచయిత. బహుగ్రంథకర్త. అంతేనా? ప్రజాసంఘాలతో సంబంధం వున్న కార్యకర్త.

కమ్యూనిస్టు వుద్యమం పుట్టుక నుంచీ కాంగ్రెసు వ్యతిరేకతను జీర్ణించుకున్న వుద్యమం. కాంగ్రెసు జాతీయోద్యమంలో identify అయి విస్తరిస్తూంటే కాంగ్రెసు ఆస్తిపరుల (బూర్జువాల) సంస్థ అనీ, అది శ్రామిక వర్గ ప్రయోజనాలకు శత్రువనీ, కనుక దానిని సర్వాత్మనా వ్యతిరేకించవలసిందేననీ cadreను నమ్మింపచేసింది. దాని ఫలితమే ఈ వ్యాసధోరణి అనిపించింది. కనుక జాతీయోద్యమ విజృంభణకు దేశంలో మూలం ఎక్కడుందో చూపడం, educate చేయడం అవసరమనిపించింది.

ఎప్పుడో 1936-40 మధ్యకాలంలో నేను Hidden Springs of the Russian Revolution అనే పుస్తకం చదివేను. అది ఓ చరిత్ర గ్రంథం. ఆ పేరు గుర్తు వచ్చింది. జాతీయోద్యమ విజృంభణకు మూలం అయిన సామాజిక పరిణామాలను నా నవల్లో చిత్రించాలి.

* * *

మన జాతీయోద్యమం చాల మంది భావిస్తున్నట్లు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైనది కాదు. కులమత భేదాలను, ద్వేషాలను నిరాకరించడంలో, నిర్మూలించడంలో దాని భవిష్యత్తు ఆధారపడి వుంది. సమాజంలో సగం మంది వున్న స్త్రీలను ముందుకు తీసుకురావడం, సమానస్థాయి కల్పించడం మీద దాని పురోగతి ఆధారపడి వుంది. అస్పృశ్యతనూ, అసమానతనూ పోనాడి వెనకబాటుతనంతో అవమానాలకు గురి అవుతున్న వర్ణ పంచమత్వాన్ని నిరాకరించడం, వారికి మిగిలిన వారితో సమాన ప్రతిపత్తిని కలిగించడం ఆ వుద్యమ పురోగతికి ఆయువు పట్టుగా వుంది. ఫ్యూడల్ ఆచారాలనూ, ఆలోచనలనూ, అలవాట్లనూ పోనాడి, జనంలో తలెత్తుతున్న కొత్త ఆలోచనలకూ, ఆచారాలకూ పుష్టినివ్వాలి. వానిని అలవాటు చేయ్యాలి.

చరిత్ర గతి క్రమంలో ఆంధ్రప్రజ ఫ్యూడల్ సమాజపు కట్టుబాట్లు, ఆచారాలు, ఆలోచనలు మానవతకు విరుద్ధంగా వున్నాయని అనుమానించడం, నిరసించడం, ధిక్కరించడం శతాబ్దాలుగా సాగుతూనే వుంది. అయితే 19వ శతాబ్దంలో బెంగాల్ నుంచి వలస వచ్చిన బ్రహ్మసమాజం ప్రభావం వానికో రూపాన్ని ఇచ్చింది. వాని బలంతో జాతీయోద్యమం పుంజుకుంది. దాని వత్తాసుతో అవి మరింత పుంజుకున్నాయి. ఆ కథలూ, గాథలూ చరిత్రగా రూపొందుతున్నట్లు గ్రహించకపోతే జాతీయోద్యమ గతీ, దానిలో మన పాత్రా అర్థం కావు.

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణనిస్తాను. కొల్లాయి గట్టితేనేమికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ 1968లో అవార్డునిచ్చింది. అ అవార్డు తీసుకోడానికి హైద్రాబాద్ సారస్వత పరిషత్తు హాలుకు వెళ్ళేను. అక్కడ నోరి నరసింహశాస్త్రిగారూ, పోలూరి ఆంజనేయ ప్రసాదుగారు కనిపించేరు. శాస్త్రిగారు నన్నభినందించి – “నీ నవల రెండు వడపోతలయి జడ్జిమెంటుకి వచ్చింది. నీ పుస్తకం నేను చూడలేదు. మార్కెట్టులో ప్రయత్నించినా దొరకలేదు. చివరకు అతను (ఆంజనేయ ప్రసాదు) తెచ్చి ఇచ్చాడు. చదివేను. నా చిన్నప్పటి జీవితం గుర్తు వచ్చింది. చాలా అద్భుతంగా రాసేవు.” అన్నారు. “నీ పుస్తకానికి నా వోటు వేశా.”

“సంధ్యా వందనాదికాన్నీ, సాంప్రదాయికాయికాచారాల్నీ అపహాస్యం చేశానే మీకది ఎట్లా నచ్చింది?” అన్నా. శాస్త్రిగారూ, నేనూ 1936 నుంచి మిత్రులం. వారి నైష్టికత నాకు బాగా పరిచితం. మల్లారెడ్డి (శాస్త్రిగారి నవల) నవల పీఠిక గురించి నేనాయనతో భేధించడం, తనను సమర్థించుకుంటూ ధర్మశాస్త్రాలను ఉదహరిస్తూ ఒక రాత్రంతా ఆయన వాదించడమూ 1960లో కథ.

“ధర్మశాస్త్రాలు సరే, అవి ఈనాడూ అమలు జరుగుతాయనీ, జరగాలనీ మీరంటారా? నేనంగీకరించను” అన్నాను అప్పుడు. ఇప్పటి నా ప్రశ్నకు మూలం అది. శాస్త్రిగారు నవ్వుతూ, “అది నీ కమ్యూనిస్టు గోరోజనంలే, కానీ చాల గొప్పగా రాసేవు.. కమ్యూనిస్టువయిపోయావు గాని, తెలుగువాళ్ళు నీకు బ్రహ్మరథం పట్టేవారు కాదటోయ్” అన్నారు.

“కమ్యునిస్టునయ్యాను గనుకనే బ్రహ్మరథం పట్టించాలన్నట్లు వ్రాసేననుకోండి” అన్నాను.

శాస్త్రిగారు గొప్ప జాతీయవాది. రెండో వేపున అట్టర్ సంప్రదాయ వాదిన్నీ. అందుకే ఈ సంభాషణను ఇక్కడ వుదహరించాను. ఆయనలోని సాంప్రదాయికత జాతీయోద్యమంలో వస్తున్న భిన్న ధోరణలకు వ్యతిరేకం కాలేదు. వానికి సహకరించింది.

శాస్త్రిగారు నా నవలలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నాను అంటే నవలలో జీవిత వాస్తవాలు చిత్రించబడినాయనుకోవాలి. అంటే సమాజంలో వస్తున్న మార్పులు, అవి తమ సాంప్రదాయక పంథాకు భిన్నంగానే వున్నా “అది కమ్యూనిస్టు గోరోజనంలే” అని సాచివేయగలంతగా అలావటయిపోయింది. అంటే ఆ మార్పులు జీవితంలో భాగాలయిపోయాయి. ఆ మార్పులు దేశ జీవితంలో భాగాలవడాన్ని కార్యకారణ సంబంధాలుగలవిగా చూపడం చేతనే ఆయన నవలలో తన చిన్ననాటి జీవితాన్ని చూడగలిగేరు.

మాలపల్లి స్వాత్రంత్ర్యోద్యమానికి సంబంధించిన నవలే. కొల్లాయి గట్టితేనేమి లాగ 1920 ప్రాంతాల నాటి వుద్యమాన్నే అందులో చిత్రింపబూనుకున్నారు. అయితే అందులో వుద్యమాన్ని idealistic పంథాలో చిత్రించారు. కాని, నేనీ నవలలో ’ఒక యుగసంధితో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణ’గా చిత్రించ ప్రయత్నించాను. చాల అరుదైన ఈ కళాభిజ్ఞతను సమకూర్చినది మార్క్సు వివరించిన చారిత్రకభౌతికవాద విజ్ఞానమే.

1936-37లలో మార్క్సేయ గతితర్కాన్నీ, చారిత్రక భౌతికవాదాన్నీ చదివాను అని మాత్రమే చెప్పగలను. ఆ రోజుల్లో మాకు దొరికిన మార్క్సిస్టు సాహిత్యమే తక్కువ. లెనిన్ రాసిన “Two Tactics”, “what is to be done’ లాంటివి దొరికేవి. అయితే రష్యను రాజకీయ పార్టీల polemics మీద నాకు ఎందుచేతనో ఆసక్తి కలుగలేదు. మార్క్సు గురించి లెనిన్ వ్రాసిన వ్యాసం చిక్కింది. కాంగ్రెసు నాయకుడు కళా వెంకట్రావుగారు మార్క్సు రాసిన Capital మొదటి సంపుటం ఇచ్చాడు. దానినింక వదలలేదు. అందులో ఆయన గతితర్క సూత్రాలను రాజకీయాలకి సమన్వయం చేయండి 18th బ్రూ మెయిర్‍లో చూశాను. జీవితానికి గతితర్క సూత్రాల నన్వయించడం, ఆ కోణం నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవడం మీదనే నా దృష్టి అంతా.

మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాక ఆ కోణం నుంచి నా అనుభవాలన్నీ కొత్త అర్థంలో కనబడసాగాయి. నేను చదువుకున్నది సంస్కృతం, తెలుగు, హింది ఈ మూడు భాషల్లోనూ సాహిత్యాన్ని బాగానే చదివాను. మార్క్సిజం చదివాక ఆ చదువుకున్నదంతా కొత్త కోణం నుంచి కనబడింది. శాకుంతలంలో కాళిదాసు ’సతాంహి సందేహ పదేషు వస్తుషః ప్రమాణమంతః కరణ ప్రవృత్తయః’ అంటూ మంచివాళ్ళకి మంచి ఆలోచనలే ఉంటాయి అనే ఆనాటి జనంలోని విశ్వాసాన్ని నొక్కి చెప్పాడు. తరువాత ఓ వెయ్యేళ్ళకు పుట్టిన అయ్యప్ప దీక్షితుల వారు తమ “చిత్రమీమాంస”లో ఆ శాకుంతల శ్లోకాన్నే ఉదహరించి దాన్ని ఒక అలంకారం – ఆత్మ ప్రత్యాలంకారం అనేవాడు. అంటే కాళిదాసు కాలంనాటి విశ్వాసం అయ్యప్ప దీక్షితుల కాలంనాడు – ఒక అందముగా చెప్పిన అబద్ధం! మనుష్యుని సంస్కారంలో ఎంత మార్పు వచ్చింది? ఆ కాళిదాసే కుమారసంభవంలో “భవననేత్ర దహ్ని” మన్మధున్ని మసి చేసిందంటాడు. అక్కడ “భవ” శబ్ద ప్రయోగం ఔచిత్య భంగం అంటాడు. ఓ వెయ్యేళ్ళ తరువాత పుట్టిన క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో ఈ మధ్యకాలంలో శబ్దార్థాలలోనే మార్పు వచ్చిందా? పాణిని రాసినట్లు మేమంతా శతాంధువుల్లాగా చదివేము (“శతాందాః కోపం స్రవిశంతి శతాంధూః) అన్న మాట. చదువుతున్న రోజుల్లో దేనికదే చదివేము. కంఠోపాఠం చేసేం. మార్క్సిజం చదివాక ఆ చదువుల లోపం కనబడసాగింది. “హయ్యం గనీనమాదాయ ఘోష వృద్ధానుసస్థితాన్ ” అనే శ్లోకం ఆనాటి సామాజిక నిర్మాణాన్ని ఆలోచింప చేస్తున్నదనుకున్నామా? “సమ్పణ్శయే వీత హిరణ్మయ త్యాత్ పాత్రేనిధా యార్ఘ్యమనర్ఘశీలంః’ అనే శ్లోకంలో రఘు మహరాజు చేశాడని సూచించిన విశ్వజ్జీద్యాగం వంటివి. సమాజంలో పెచ్చు పెరుగుతున్న కలిమిలేముల ఆద్యవస్థను సరిదిద్దడం కోసం సమాజం విధించిన ఉపశమన క్రియలనే భావం మార్క్సిజం చెప్పేవరకూ వూహలకెందుకందలేదు?

అలాగే జీవితంలో అనుభవించినవి, చూసినవి, విన్నవి, అవగాహన కావటం మార్క్సిజం చదివేకనే. గత జీవితానుభవాలను కొత్త వెలుతుర్లో అవగాహన చేసుకునేందుకు నేను నిత్యం ఆలోచిస్తుండేవాడిని. ముంగండలో సంస్కృత పాఠశాల పెట్టాలని ప్రయత్నం మూణ్ణాళ్ళ ముచ్చటైయ్యింది. ఎందుచేత? అంత క్రితము, అటు తర్వాత కూడా గ్రామములో వారాలు చేసుకుంటూ చదువుకుంటుండిన విద్యార్థులే ఆ పాఠశాల బాలురు. అంతవరకూ మాకు సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం చెప్పిన – చెప్తూ ఉన్న పండిత గురువులే ఆ పాఠశాల ఉపాధ్యాయులు. కానీ అది మూడు రోజులైనా నిలువలేదు. ఎందుచేతనన్న ప్రశ్నకు చారిత్రక భౌధిక వాదం సమాధానం ఇచ్చేవరకూ నాకూ తట్టలేదు. చరిత్ర గతిని చూసి, జ్ఞానోదయమూ కలిగించిన మొదటి అంశం అది.

రెండోవది మాల, మాదిగలను వీథులలోకి రానివ్వని గ్రామవీథుల్లో మే దినోత్సవం పేరున పేటల జనాన్ని ఊరేగింపుగా తెచ్చాం. గందరగోళం జరుగుతుందేమోనని భయపడ్డాం. కానీ ఎక్కడా అభ్యంతరం మాటే వినబడలేదు. దీనికి సమాధానం మార్క్సు ఆర్థిక సూత్రాలలో దొరికింది. ఆర్థిక అవసరాల దృష్ట్యా మాల,మాదిగలను వీథులలోకి తీసుకురానివ్వాలని దృష్టి గ్రామీణులలో అది వరకే అంతర్గతంగా ఉంది. అందుచేతనే ఆ ఊరేగింపు ఒక విధంగా వారి వాంఛకు రూపం ఇచ్చింది. కనుకనే చల్లగా ఊరుకున్నారు.

రాజమండ్రిలో శ్రీపాద కామేశ్వరరావుగారని ఒక అడ్వకేటు ఉండేవారు. మంచి విద్యావంతుడు. ద్వీజేంద్రలాల్ రాయ్ నాటకాలెన్నింటినో తెలుగులోకి అనువదించిన రచయిత. వీరు తమ కోడలు చదువులకెగబడి కాపురానికి రావటం లేదని కోర్టుకెక్కారు. ఆ కేసు విచారణలో ఒక రోజున ’వినోదం’ చూడడానికి నేను కోర్టుకు హాజరయ్యాను. తర్వాత కేసు నుంచి విడబడి ఆమె స్కూళ్ళ ఇనస్పెక్టరుగా పనిజేసి రిటైర్ అయ్యి ఇప్పుడు విజయవాడలోనే ఒక విద్యాసంస్థ నడుపుతున్నారు. ఆమె పేరు సీతారామమ్మ. నేనామెను ఇటీవలనే కలుసుకున్నా.

ఆమె స్త్రీవాద దృష్టిలో అత్తవారిమీద తిరుగుబాటు చేయలేదు. చదువుకోసం ఆమె ఆసక్తి, స్త్రీలలో పెచ్చు పెరుగుతున్న విద్యాభిలాషకి, ఆమె తిరుగుబాటు ఒక సూచన. ఈనాడు కాలేజీలలో చదువుతున్న యువతులు, వివిధ ఉద్యోగాలలో ఉన్నవారు ఆమె వారసులు. ఆ రోజుల్లోనే అనేదేమిటి? సెక్స్ జీవితంలో భాగం. సమాజంలో పెచ్చు పెరిగిన కులభేధాలు, ఆచారభేధాలు ఆ జీవన సహజవాంఛని వికృతం చేయగలవేగాని నిరోధించలేవు. మా పెద్దతల్లి గారి మగడు ఒక బలిజ అమ్మాయిని చేరదీసాడు. ఆమెకో ఇల్లు ఏర్పరిచాడు. భోజనం మినహా ఆయన మకాం అక్కడే. ఆయనకో కొడుకు కలిగాడు. ఆ కుర్రవానిని ఇంటికి తీసుకొచ్చి తన పంక్తిన పెట్టుకునేవాడు. చదువు చెప్పించాడు. పెళ్ళి మాత్రం తల్లి కులం పిల్లనే వెతికి చేసాడు. సాంప్రదాయాచారాల ప్రకారం అయితే ఆయననీ ఊరిలో వెలివేసి ఉండేవారు. కానీ ఎవ్వరూ నోరు విప్పలేదు. కానీ ఆ కుర్రవానికి తన స్థితి అవమానకరంగా తోచింది. ఒకరి ఉంపుడుకత్తెగా ఉండిందని తల్లి మీద కోపం. తనతో సమంగా బ్రాహ్మణత్వం ఇవ్వనందుకు తండ్రిమీద కోపం. పెళ్ళై ఉద్యోగంలో చేరాక మరి ఊరువేపు రాలేదు. తల్లిదండ్రులను చూడలేదు. ఒక పాతిక ముప్ఫై ఏళ్ళ తర్వాత అతని కూతురు తన కమ్యూనిస్టు భర్తతో మా ఊరు వచ్చింది. ఆమెకు మా అమ్మగారు చీరపెట్టి సత్కరించింది. అది అప్రస్తుతం. అసలు విషయం తండ్రి అనాచారాన్ని, బ్రాహ్మణ సమాజం సహించింది. ఎందుచేత? ఆ కొడుక్కు తల్లిదండ్రుల మీద ఆ కోపం ఏమిటి? మార్క్సిజం అధ్యయనం చేసేకనే ఆ ఘటనలు అర్థమయ్యాయి. ఒక వైపున కులాచారాల పట్టు సమాజంలో శిధిలం అయిపోతుంది. కృత్రిమంగా బిగిసి ఉన్న ఆచారాలు కల్పిస్తున్న అవమానం సహించరాదని జ్ఞానం, చైతన్యం కొత్త తరంలో మేల్కొంది. ఈ విధంగా సమాజం నూతన సంబంధాలను ఏర్పర్చుకోవలసిన రోజు వచ్చింది. సమాజం అటువేపు కదులుతోంది. ఈ నిర్లక్ష్యాలు కోపతాపాలు నూతన దశకు హార్చింజర్స్ (harbingers) మాత్రమే. మార్స్కిజం చదవనంత వరకూ ఈ ఘటనల మీద నా ఆలోచనలు ఆ వ్యక్తుల చర్యలకు విరుద్ధంగానే ఉండేవి. అవి సామాజిక ధర్మాలుగా తోచలేదు.

రెబ్బాప్రగడ మందేశ్వర శర్మగారు, జ్యోష్యుల అప్పురామమూర్తిగారు వంటి నైతిక దేశభక్తులు నాకు సన్నిహితంగా ఉండేవారు. వారు, ఆస్తులు, ఆరోగ్యం, కుటుంబాల గురించి చూసుకోలేదు. ప్రజాసేవకు అమూర్తమైన దేశసేవకు కాదు సుమండీ. గిరిజన, హరిజన సేవకు జీవితాలను ఖర్చుచేసేరు. కానీ కులాచారాలను కొంచెం కూడా పట్టువిడవకుండా ఆచరించేవారు. దీనికి సమాధానం ఇచ్చినది మార్క్సిజంలోని మానవత్వం, కార్యకారణ సంబంధాలను ఆలోచింపజేయగల తార్కిక శక్తిని భూతకాలం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి భవిష్యత్తులోకి ఉన్న మార్గాల క్రమపరిణామాన్ని చూడగల అవగాహన శక్తిని అది అందించింది. నేను అందుకోగలిగానని ఇప్పుడు చదువుతున్న అమృతలాల్ సాగర్ ’అమృత ఔర్ విష్’ చెప్తుంది. పందొమ్మిది వందల అరవై నాటి లక్నో సమాజం, యూపి, రాజకీయాలు దానిలో ప్రస్తుతం. పందొమ్మిది వందల అరవైలలోనే నేను రాసిన ’కొల్లాయిగట్టితేనేమి?’లో చిత్రించిన పందొమ్మిది వందల ఇరవైల నాటి ఆంధ్రదేశపు గ్రామాల స్థితిని నైష్ఠికులైన నోరి నరసింహశాస్త్రిగారు తన కథే తను జీవించిన తెలుగు సమాజమే అన్నంత తాద్మాత్యం అనుభవించారు. అది ఆయన మాటే. పందొమ్మిది వందల అరవైల నాటి మన ఆంధ్ర సమాజ జీవితాన్ని నా నవలలు ’కత్తుల వంతెన’, ‘ఎవరి కోసం’ లలో చిత్రించాను. ఈ మూడు చదివితే మన తెలుగునాడులో ఈ నలభైయేళ్ళ మధ్యకాలంలో వచ్చిన అభివృద్ధి కనబడుతుంది. ఆ దృష్టిలోంచి చూస్తే ఉత్తరప్రదేశ్ సమాజం 1920నాటి తెలుగు సమాజం స్థాయికి కూడా రాలేదనిపిస్తుంది. బి.జె.పి ప్రభుత్వం ఏర్పడిన తీరే సామాజిక పరిస్థితులే అక్కడ ఉన్నాయా? జాతీయోద్యమం విస్తరించడానికి అవసరమైన సామాజిక పరిణామక్రమం అక్కడ పనిజేయలేదా? ఆ విషయములో ఆంద్రప్రదేశం చాలా చాలా ముందే ఉంది.

ఇదెట్లా సందర్భపడింది? ఆంధ్ర జిల్లాలకు భౌగోళికమైన ఒక సౌలభ్యం ఉంది. అది ఉత్తరానికి, దక్షిణానికి మధ్య సేతువులా ఉంది. పశ్చిమాన ఉన్న మహరాష్ట్రంతో, కర్నాటకంతో సుధీర్ఘమైన సరిహద్దు ఉంది. ఫలితముగా ఏ దిశలో వచ్చిన భావవిప్లవము ఆంధ్రకి ఇట్టే అందేది. ఈనాడు తెలుగునాడు ప్రతి గ్రామం కూడలిలోనూ జరుపుకునే వినాయక నవరాత్రి ఉత్సవాలు మనకి మహారాష్ట్రం నుంచి అందాయి. ఆంధ్రప్రదేశ్‍ వర్తమాన చరిత్రని మార్చివేసిన బ్రహ్మసమాజం, రెండువేల ఏళ్ళ క్రితం ఆంధ్రలో మూలమూలకంటా విస్తరించిన జైన, బౌద్ధ మతాలు ఉత్తరాది నుంచి వచ్చాయి. వీర శైవం కర్నాటక దేశపు బహుమతి. వైష్ణవం తమిళ బహుకృతి. ఇటీవలి కాలంలో పెరియార్ రామస్వామి నాయకులు self respect movement మన వైవాహిక సాంప్రదాయలను పూర్తిగా తల్లకిందులు చేసింది. నేడు ఆంధ్రలో పరిపాటి అయిపోయిన దండల పెళ్ళిళ్లు, సభాముఖంగా పెళ్ళిళ్ళ పద్దతిని ప్రవేశపెట్టినది, అలవాటు చేసినది కమ్యూనిస్టులు. Self respect ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన జీవానందం మొదటి తరం కమ్యునిస్టులకు ఆప్తమిత్రుడు. ఈ వివిధ భావాలు, ఉద్యమాలు తెచ్చిన సంస్కారాన్ని ప్రజల సంస్కారంగా మార్చిన ఘనత వీరేశలింగం, చలం గార్లది, మార్క్సిస్టు భావజాలానిది. మద్రాసులో నేను ఉద్యోగం చేస్తున్న కాలంలో తమిళ, కర్ణాటక మిత్రులతో పలుమార్లు ఈ విషయం మీద చర్చలు జరిగినప్పుడు తెలుగు యువకుల మనసుల తుప్పుదుళ్ళ కొట్టినది, ఇతర రాష్ట్రాల వారు వదుల్చుకోలేకుండా ఉన్న inhibitions పీడ వదిల్చినది వీరేశలింగం, చలమూననీ వాదించేవాడిని. కేరళీయులకు వారి సంస్కర్తలున్న వారు పంతులగారిది, చలంగారిది రుణం తీర్చగలది కాదు.

దేశసాహిత్యంలో కొల్లాయిగట్టితేనేమి? నవలకున్న స్థానాన్ని అర్థము చేసుకోవాలంటే భారతీయ సమాజంలో ఆంధ్ర ప్రజాజీవితంలోని ప్రత్యేకతలను అర్థం చేసుకోవాలి. మిత్రులు రాచమల్లు రామచంద్రారెడ్డి తమ ’సంవేదన’ వ్యాసంలో ఇలా వివరించారు.

“1920నాటి రాజకీయ వాతావరణంలో కొన్ని అంశాలు గమనార్హం. బెంగాల్‍లోనూ పంజాబ్‍లోనూ ఆనాడు టెర్రరిస్టు ఉద్యమం బలంగా ఉండింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఎప్పుడూ ప్రవేశించలేదు. మహారాష్ట్రలోనూ ఇతర ఉత్తర భారత ప్రాంతాలలోనూ, జాతీయోద్యమంలో హిందు మతాభిమానము, సనాతన ధర్మ పునరుద్ధరణ వాద ప్రాబల్యము పెనవేసుకొని ఉండినాయి. ఆంధ్ర రాజకీయాల్లో వాటికెప్పుడూ స్థానమే లేదు. మతాభిమానము, సనాతన ధర్మము బ్రిటిష్ వాళ్ళ తాబేదార్లుగా వ్యవహరించేయేగానీ దేశభక్తిలెప్పుడూ వానిని ఆదరించలేదు. కాంగ్రెస్ మంత్రులకు స్వతంత్ర పార్టీ నాయకులకూ తిరుపతి దేవుడు ఈనాడు వేల్పైనాడు గానీ, ఆనాటి జాతీయనాయకులు ఉద్యమ ఫలసిద్ధికి తిరుపతి దేవునికెప్పుడూ ముడుపులు కట్టుకోలేదు. నిజానికి తెలుగు జాతి జీవితంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘ సంస్కరణ, తదనుబంధంగా మత సంస్కరణ ఉద్యమ రూపంలో ప్రవేశించినాయి. అనగా 1920నాటికే తెలుగుదేశంలో మత విశ్వాసాల మీద, తిరుగుబాటు, బూర్జువా మనస్థత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై ఉండింది. ఇది ఆనాటి ఆంధ్రదేశ ప్రత్యేకత అనుకోవచ్చు.“

ఆ సమాజంలో నిత్యజీవితంలో గడుపుతున్న వానికి ఈ లోతులు ఎప్పుడోకాని అర్థం కావు. అర్థం అయినప్పుడు కలిగే ఆనందానికి అంబరం వుండదు.

ఈ నవల రాస్తున్న రోజుల్లో ఓ మారు రాజమండ్రిలో మా తమ్ముడు జగన్మోహనుని యింటికి వెళ్ళేను. అప్పుడే అక్కడికి సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకులు వెన్నేటి సత్యనారాయణగారు వచ్చేరు. నేను రాస్తున్న నవల ప్రసక్తి వచ్చింది. నా ప్రయత్నాన్ని అభినందిస్తూ నేనెప్పుడూ విని వుండని రెండు విషయాలు చెప్పేరు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిని కాలేజి నుంచి బహిష్కరించిన కేసులో ప్రభుత్వం నియమించిన విచారణాధికారి మోచర్ల రామచంద్రరావు గారు విచారణానంతరం ఒక మాట అన్నారట. “నా కొడుకే ఆ విధంగా వ్యవహరించి వుంటే ఎంతో సంతోషించేవాడిని”…అని.

“అటు తర్వాత రాజమండ్రిలో జాతీయ కళాశాల పెట్టాలనే ఆలోచన వచ్చి టౌనుహాలులో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు డిప్యూటి కలెక్టర్, డి.వై.ఎస్పి వచ్చి కూర్చున్నారు. వారి రాక టౌను పెద్దలలో చాలా మందికి బెదురు పుట్టించింది. సభకు పిలిచిన న్యాయపతి సుబ్బారావుగారు అందరికి ధైర్యం చెప్పారు. సభను ప్రారంభించే ముందు ఆయన బంట్రోతులను పిల్చి కొత్తవాళ్ళు రాకుండా గేటు వేసేయమన్నారు. తర్వాత సభలో కూర్చున్న వారిలో ఆహ్వానాలు లేనివారిని పంపేయమన్నారు. ఆ మాట అనటంతో అనాహుతంగా వచ్చిన అధికారులు సభ విడిచి పోయారు.” అంటూ “మీరు మితవాదులనేవారు చేసిన పని ఇది. మీరే అయితే ఆ ధైర్యం చేసి ఉండేవారా?” అని సవాలు విసిరారు. నేను నవ్వేను. “మా కమ్యూనిస్టులకి ఆ ఉపాయం తోస్తుందా అంటే చెప్పలేను. కానీ ధైర్యం పర్వాలేదు.” అన్నాను.

మిత్రులు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు “తెలుగుజాతి జీవనంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘసంస్కరణ, తదనుబంధంగా మత సంస్కరణ ఉద్యమరూపంలో ప్రవేశించాయి. “ఎలాగ? ఎందుచేత? అనే ప్రశ్నలకి కొల్లాయిగట్టితేనేమి? సమాధాన రూపంలో మార్క్స్ రచనల నుంచి పేజీలకు పేజీలు ఎత్తి చూపి నాకున్న పాండిత్యాన్ని ప్రదర్శించే బులబాటం లేదు. అంత అవసరమూ లేదు. నా మనసును పట్టిపోయి, నా ఆలోచనలను శాసిస్తున్న మార్క్స్ సిద్ధాంతాలను నా మాటల్లో చెప్పి వదిలేస్తా – ఆర్థిక నిర్మాణం మారుతున్నప్పుడు సమాజ వ్యవస్థ యొక్క నిర్మాణ రూపాలు మారుతాయి. ఒక వ్యవస్థలో ఎంత చక్కగా నిర్మాణ రూపాలే మరో వ్యవస్థలో పనిజేయవు. మనిషి ఎప్పుడూ తన సుఖాన్ని, సౌలభ్యాన్ని చూసుకుంటాడు. వానికి అనుగుణంగా జీవన పద్ధతిని సవరించుకుంటాడు. అటువంటి సవరణల సంఖ్య పెరుగుతూ వచ్చి జీవన పద్ధతులే మారిపోతాయి. ఇదంతా చాప కింద నీరులా మారుతున్న, మార్చుకుంటున్న మనిషికి కూడా తెలియకుండా జరిగిపోతుంది. కొత్త పాతలని అర్థం చేసుకునేందుకు శాతాల నిర్ణయం పనికిరాదు. ఏది క్రమంగా పెరుగుతుందీ, ఏది క్షీణిస్తుందీ గమనించాలి. నీ కోరికలతో నిమిత్తం లేకుండా ఈ పరివర్తన సాగిపోతూనే ఉంది. ఆ క్రమంలో మానవుడూ, వాని సమాజ నిర్మాణమూ సాగిపోతున్నాయి. మనం ఎంతో దుర్భరమూ, అన్యాయమూ అని అసహ్యించుకునే బానిసత్వము కూడా సామాజిక పురోగతికి ఆటంకముగా ఉన్నప్పుడే తొలగిపోతుంది. అమెరికాలో నీగ్రో బానిసల శ్రమ ఉత్పత్తికి ఆటంకమైయ్యింది. కనుకనే ఉత్తర రాష్ట్ర్రాలు బానిసత్వ నిర్మూలనకై పోరాటం జరిపాయి. ఈ మార్పులన్నీ మనిషికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. కారణం మార్పులకి మూలం ఎక్కడుందో వారికి అర్థమయ్యే పరిస్థితులు లేవు. కారణం అర్థం కాకపోయినా ఫలితాలు చూస్తాడు. వాని ప్రతిబంధకత్వాన్ని చూస్తాడు. అనూచానంగా వస్తున్న నిర్మాణాలను, ఆచారాలుగా మారిపోయిన అలవాట్లనూ ఎందుకు మార్చాలో తన ఆలోచనలకు అనుగుణంగా సిద్ధాంతరీకరిస్తాడు. ఇదో అనంతమైన యాత్ర. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పరిణామం, సమాజ పరిణామ సూత్రానికి భాష్యం చెప్పింది. దానిని అర్థం చేసుకొని పనిజేస్తే సమాజ గతిని త్వరితపరచగలం. ప్రస్తుతం తలెత్తి విజృంభిస్తున్న శాస్త్ర, సాంకేతికాభివృద్ధితో ముడిపడిన అధికోత్పత్తి విధానం యొక్క పరిణామం సోషలిజంలోకి, దాని నుంచి కమ్యూనిజం లోకి పరివర్తనను తెచ్చి తీరుతుంది. ఆ పరిణామం ఎంతకాలంలో వస్తుంది? దాని తరువాత రాగల వ్యవస్థ ఏమిటి? అనే విషయాన్ని వారు భవిష్యత్తుకే వదిలివేసారు. ఇది స్థూలంగా, అత్యంత సంగ్రహంగా ఘనీభూత రూపంలో గతి తార్కిక చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం. కనీసం నేను అర్థం చేసుకున్నదీ నాకు అర్థమైనదీ.

(సశేషం)

You Might Also Like

2 Comments

  1. pavan santhosh surampudi

    కొల్లాయిగట్టితేనేమి? తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే గొప్ప నవల. దాని పూర్వాపరాలు కూడా చాలా గొప్పగా వ్రాశారు రామమోహనరావు గారు. రారా దీన్ని సమీక్షించిన వ్యాసం నవల వెనుక ముద్రిస్తే చదివాను. ఐతే చాలా విషయాలనే అసమగ్రంగా వదిలేసినట్టు అనిపించింది ఆ వ్యాసంలో. అవేమిటో ఇప్పుడు అర్థమయ్యాయి. ముంగడ గురించి, దాన్నే ఎందుకు నేపథ్యంగా స్వీకరించానన్న విషయాన్ని గురించి రాసిన విశేషాలు బావున్నాయి.

  2. కొల్లాయిగట్టితేనేమి? – నేనెందుకు రాశాను? – 2 | పుస్తకం

    […] మహీధర రామమోహనరావు (మొదటి భాగం లంకె ఇక్కడ) ******** నా జీవితంలో 5వ ఏడాది నుంచీ నలభై […]

Leave a Reply