వేయి అడుగుల జలపాతపు వేగాన్ని!

(ఈరోజు, నవంబర్ 24, ఇస్మాయిల్ గారి ఎనిమిదవ వర్ధంతి. ఈ సందర్భంగా, ఈ ఏటి ఇస్మాయిల్ అవార్డు అందుకున్న పద్మలత గారి కవితా సంకలనం “మరో శాకుంతలం” పై తమ్మినేని యదుకులభూషణ్ గారి సమీక్ష. పద్మలత గారితో భూషణ్ గారి ఇంటర్వ్యూ గతంలో పుస్తకం.నెట్ లో వచ్చింది. లంకె ఇక్కడ)

***************************
ప్రతి తరంలో కొత్త కవులు పుట్టుకు వచ్చి ఉజ్వలమైన తమ జీవితానుభవాలను వ్యక్తం చేసి ఆ క్రమంలో భాషను సుసంపన్నం చేస్తారు.దానితో, ఇది వరకు ఎరగని ఊహా లోకాలు తమదైనటువంటి వర్ణ వైభవంతో అకస్మాత్తుగా ప్రత్యక్షమయి రసజ్ఞులను వశపరచుకొంటాయి. నిండైన ఆత్మ విశ్వాసంతో ఒక అద్భుతప్రపంచాన్ని సృష్టించేబోయే కవిదెప్పుడూ ఉచ్చైస్వరమే.

” వేయి పగళ్ళు ఇంత ప్రశాంతమా-
అనిపించే తేజాన్ని !
వేయి రాత్రులు ఇంత నిగూఢమా-
అనిపించే నమ్మకాన్ని!
వేయి ఏనుగుల బలం ఇంత సున్నితమా –
అనిపించే తామర తూడుని!
వేయి అడుగుల జలపాతపు వేగాన్ని!
సముద్రపు లోతున దాగిన వజ్రాన్ని !”

అంతే కాదు, జీవితంలో కవిత్వానికి గల స్థానం పట్ల తనకు చాలినంత స్పష్టత ఉంది:

“గుర్తించడానికి
లోపల దాగే గుండె శబ్దానివి
శ్రద్ధగా వింటే లయనాదానివి
మరచిపోతే నా ఉనికివి ”

కవిత్వం అది ఎవరిదయినా -హృదయపు ముడులు విప్పుకొని -దాన్ని సాకల్యంగా అర్థం చేసుకోవడం అన్నివేళలా అందరికీ సాధ్యం కాదు.

“నేను
నీకు అర్థం కాని
అధర్వణ వేదాన్ని.
అద్భుత యోగాన్ని
నను చేరాలంటే
సాధన కావాలి
నువు యోగివి కావాలి.
అన్యమనస్కం కూడదు.
అంతా నా మయం అయితే
మనం అనంతమవుతాం.”

పారదర్శకమైన కవిత్వాన్ని సృష్టించే భాషకున్న పరిమితులు తనకు తెలుసు.

“అన్నీ చెప్పగల భాష
అక్కడే ఆగిపోయింది.
వేసుకొందామంటే
ఏ చొక్కా నచ్చని
ఐదేళ్ళ నా కొడుకు పెంకితనమే
నా భాష కొచ్చింది.”

వర్ణన కవిని దారి తప్పిస్తుంది, కానీ, కల్పన కవిని కాపాడుతుంది.ఈ విషయం అవగతమైనది కాబట్టే-

“ఆనందం
అనుభవ సారమే గాని
వర్ణనకు తావేది ? “
అని ప్రశ్నిస్తోంది.
అంతే కాదు మోహ ప్రాధాన్యాన్ని సవ్యంగా ఎరిగినది, కనుక

“అన్నిటా మోహమే
ఈ సృష్టినంటి ! “
అనగలడమే కాదు
” సుడిగాలిలా మారగలిగి
చిరుగాలిలా నీ చెంపలనానడం “
అని సున్నితంగా చెబుతోంది.

గడుసైన ఎత్తుగడలు ప్రయోగించడంలో కడు నేర్పరి ఈ కవయిత్రి. లలితమైన ప్రేమతో ఇంద్రధనుసులా మెరిసిపోయే కవితలెన్నో.

” నా లేత పెదాలు నిన్నంటితే
గ్రీష్మతాపంలో తొలకరి జల్లనీ
నా పొడుగాటి కురులు నిను కప్పితే
మాఘమాసంలో చలిమంటనీ ”

ఐతే,తన కవిత్వ ప్రస్థానం అంత సులభం కాదు,

“ఉడుకుతున్న నీళ్ళపై
మూత తీస్తే వదిలిన ఆవిరిలా
కదలని కాలం నన్ను విడిచి
గాలిలో కలిసింది.

బుడగ పగల కుండా
పువ్వు వాడకుండా
ఎగిరే గాలి పటం రాలకుండా
చేసే ప్రయత్నంలో
చాలా దూరం
ప్రయాణించాను

అలసి చూస్తే
వాడిన పూవులు
వృక్షాలై నవ్వుతున్నాయి.”

తీరా,ఇంత దూరం వచ్చాక, “వరిచేల మడిలా / మీ ఊరి దారిలా /ఉంటాను /నన్నెరగవా ?? “ అన్న కవయిత్రిని నలుగురిలో పోలిక పట్టడం సులభమే! ఆపై ,మీలో సున్నితత్వం ఉంటే- కవయిత్రి మాటల్లోనే

“ప్రతి పగలు రాత్రి
ఎండలో వానలో
నా జ్ఞాపకం ఒకటి
నీ కంటి పాపలో భద్రమై ఉంటుంది ”

You Might Also Like

9 Comments

  1. హెచ్చార్కె

    పద్మలత ‘మరో శాకుంతలం’ మీద భూషణ్ రైటప్ చదివాక ఇలా అడగాలనిపించింది. ఇదంతా నన్ను నేను కనుక్కునే ప్రయత్నంలో భాగమే ‘విమర్శ’ కాదు.
    ” వేయి పగళ్ళు ఇంత ప్రశాంతమా-
    అనిపించే తేజాన్ని !
    వేయి రాత్రులు ఇంత నిగూఢమా-
    అనిపించే నమ్మకాన్ని!
    వేయి ఏనుగుల బలం ఇంత సున్నితమా –
    అనిపించే తామర తూడుని!
    వేయి అడుగుల జలపాతపు వేగాన్ని!
    సముద్రపు లోతున దాగిన వజ్రాన్ని !”

    ఈ పద్యంలో నాకు అనుభవం కన్న ఆలోచన ఎక్కువగా ‘అనిపించింది’. కొంచెం ఎక్కువ కాదు. చాల ఎక్కువ.
    పగళ్లు ప్రశాంతిని కోల్పోయేది తేజం లేదా తేజ రాహిత్యం వల్ల కాదు. అశాంతి మూలాలు వేరు. అది ఎంత తేజమైనా ప్రశాంతికి ఎలా దోహదం చేస్తుంది?
    ఈ బొమ్మను అర్థం చేసుకోడానికి మరో ప్రయత్నం చేశాను. ఈసారి సఫలమయ్యానని అనిపించింది. పగలు తేజం/కాంతి ఉంటుంది. కాని అశాంతి ఉంటుంది. ప్రశాంతితో కూడిన తేజం/కాంతిని ఇమ్మని కవి అడుగుతున్నారు. బాగుంది. కాని ఈ ఆలోచనా ధార పద్యంలోని రాత్రుల బొమ్మకు నప్పుతుందా?
    రాత్రలు నిగూఢం, చీకటి కనుక, లోకం నిద్ర పోతుంటుంది కనుక. నిగూఢత అంటేనే ఒక పట్టాన అర్థం కానిది, తవ్వి లేదా అడిగి తెలుసుకోవలసినది. విప్పాల్సి వున్న లేదా విప్పరాని రహస్యం. అది నమ్మకాన్ని ఎలా ఇస్తుంది? మీరు (ని)గూఢమైన మనిషి అయితే, మీ మీద నాకు నమ్మకం ఎలా కలుగుతుంది? నిగూఢతతో కూడిన నమ్మకాన్ని ఇమ్మని కవి అడుగుతున్నారా? ఎందుకు ఆ నమ్మకం?
    తేజానికి, ప్రశాంతికి మధ్య వైరుధ్యం లేదు. రెండూ ఒక చోట ఉండడం సాధ్యమే. కోరుకోదగినదే. నిగూఢతకు, నమ్మకానికి మధ్య వైరుధ్యం వుంది. ఈ వైరుధ్యం వల్ల, గూఢత్వంతో కూడిన నమ్మకం మూఢ నమ్మకం అవుతుంది. తెలిసి నమ్ముతున్నది కాదు.
    మూడవ బొమ్మ అసలు నాకు అందనే లేదు. ప్రతిదీ సున్నితమైనదే ప్రతిదీ బలమైనదే. ఏనుగుల బలంలో ఒక సున్నితత్వం వుంది. తామర తూడులో ఒక బలం వుంది. అది ఏనుగులను తామర తూడులను ఒకటి చేయడం వల్ల ‘అనిపించే’ది కాదు. బహుశా‍, ఏనుగులలోని బలం, తామర తూడు లోని సున్నితత్వం రెండూ ఒకే చోట ఇమ్మని కవి అడుగుతున్నారు.
    అసలు విషయం: ఈ పద్యాన్ని తెలుసుకోడానికి ‘చూడ్డం’ చాలదు. అనుభవం దగ్గర ఆగితే కుదరదు. ఆలోచించాలి. విడదీయాలి, కలుపుకోవాలి. అర్థాన్వయాలలో కాస్త రాజీ పడాలి కూడా. పోనీ చివరికి ‘వావ్, చాల కొత్తది తెలుసుకున్నాను’ అనే తృప్తిని మిగిల్చే ఆలోచనేమీ కాదు. ఇది మామూలు దేవుడి ప్రార్థనే కావొచ్చు, ఇందులో ఉన్నది దేవుడైనా కాకున్నా.
    రవీంద్రడు, ఇస్మాయిల్ వంటి పెద్దలు సూచించిన బాట ఇది కాదేమోనని నాకు గట్టిగా అనిపిస్తోంది. నిరుడు నామాడి శ్రీధర్ పుస్తకం చదివినప్పుడు కూడా నేనిలాగే అనుకున్నాను. ఇవి వ్యక్తీకరణ సంక్లిష్టత వైపుగా కొత్త పయనాలని కూడా అనుకుంటున్నాను. నా వైఖరిలో లోపం ఉంటే సరిదిద్దుతారని, ఇక్కడ ఇలా…

    1. హెచ్చార్కె

      నవంబర్ 30న ఆ వ్యాఖ్య రాశాక, మనసు ఊరుకోక పుస్తకం సంపాదించి చదివాను. వ్యాఖ్యను సవరించికోవాల్సి ఉంది. తేజం, నమ్మకం, తూడు, వేగం, వజ్రం… అవన్నీ తానని అంటున్నారామె.
      వాటిని ‘ఇవ్వమంటున్నారు’ అనీ, ఇది దేవుడి ప్రార్థన కావొచ్చుననీ రాశాను. నా ఊహ తప్పు.

  2. Srinivas Vuruputuri

    భూషణ్ గారికి

    > “నిండైన ఆత్మ విశ్వాసంతో ఒక అద్భుతప్రపంచాన్ని సృష్టించేబోయే కవిదెప్పుడూ ఉచ్చైస్వరమే.”

    ఉచ్చైస్వరం అనే మాటను మీరు బలమైన గొంతుక అనే అర్థంలో వాడారా? తెలుగు నిఘంటువులో ఆ మాట కనబడలేదు. సంస్కృత నిఘంటువు ప్రకారం “ఉచ్చైః స్వరం” అంటే గట్టిగా ఏడవటం అని అర్థం.

    శ్రీనివాస్

    1. తమ్మినేని యదుకుల భూషణ్.

      గట్టిగా నవ్వుకోవడం తప్ప ఏమి చేయగలను ?? నిఘంటువులతో పని జరగదు, అవి కొద్ది వరకు దిశా నిర్దేశం చేయగలవు, అంతే.పదానికి గల అర్థాన్ని సందర్భాన్ని బట్టి తెలుసు కోవాలి., లేక పోతే గట్టిగా ఏడవటం లేదా గట్టిగా నవ్వుకోవడం ఇవే మిగులుతాయి.ఒక పదానికి అర్థచ్చాయలు అనేకం ఉంటాయి. “ఉచ్చై స్వరం ” అన్నది తెలియని పద బంధం కాదు కదా , నిఘంటువులకు పని చెప్పడానికి. ఉచ్చై అనగా ఉదాత్తం , నీచై అనగా అనుదాత్తం అని పాణినీయం. స్వరం అంటే తెలియని విద్యాధికులు లేరనే అనుకొంటాను.మరి ఉచ్చైస్వరం అన్న పదబంధానికి అర్థం ఊహింపనలవి కానిదైతే కాదు కదా, మరి గట్టిగా ఏడవటం ఎక్కడి నుండి వచ్చింది ??
      ఉచ్చై స్వరంలో ఏడవటం ఉంది.ఉచ్చై స్వరమంటేనే ఏడవటం అంటే కొంత విపరీత ధోరణి. ఆ సందర్భానికి తగిన కావ్య ప్రయోగం చూపితే గాని మనకు ఆ విపరీతార్థం బోధపడదు. ఉచ్చైస్వరానికి సామాన్యార్థంలో కావలసినన్ని కావ్య ప్రయోగాలు చూపగలను,
      మచ్చుకు ( రామాయణం / అరణ్యకాండ ):

      ह्रियमाणौ तु काकुत्स्थौ दृष्ट्वा सीता रघूत्तमौ |
      उच्चैः स्वरेण चुक्रोश प्रगृह्य सु महाभुजौ || ३-४-१

      తమ్మినేని యదుకుల భూషణ్.

    2. Srinivas Vuruputuri

      భుషణ్ గారికి

      అర్థం తెలియకే నిఘంటువు చూశాను. “Crying aloud” అనే అర్థం మోనియర్ విలియమ్స్ నిఘంటువులో ఇచ్చారు. సరైన అర్థం చెప్పినందుకు ధన్యవాదాలు.

      శ్రీనివాస్

    3. తమ్మినేని యదుకుల భూషణ్.

      Monier Williams

      उच्चैःस्वर

      (H3) उच्चैः–स्वर [L=321920.2] mfn. crying aloud, VarBr2S.

      ———————
      Cry అంటే ఏడుపు అనే కాదు అరుపు అన్న అర్థ భేదం ఉన్నది కదా. ఉదాహరణకు War-Cry అంటే యుద్ధంలో ఏడవటం కాదు కదా.
      ఆ రకంగా తీసుకుంటే ఉచ్చై స్వరానికి ఆప్టే లో ఇచ్చిన అర్థమే సిద్ధిస్తుంది.

      उच्चैः -स्वर a. high-sounding. (-रः) a loud sound or voice.

      మోనియర్ విలియమ్స్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థం పక్కన పద ప్రయోగమున్న గ్రంధం వరాహ మిహిరుని బృహత్ సంహిత గా పేర్కొన్నారు.
      దాన్ని తిరగేస్తే గాని ఏడుపు అర్థం గురించి ఇదమిత్థంగా తేల్చి చెప్పలేము. కేవలం ఒక నిఘంటువుని తిరగేసి, సంస్కృతంలో దానికున్న ఏకైక అర్థం గట్టిగా ఏడవటమే అనడం తొందరపాటు.

      సంస్కృతంలో ఉచ్చైః స్వరంలాంటి పదబంధాలకు అర్థాలు వెతికేటప్పుడు ,ఉచ్చైః అన్న పదం కోసం వెదకడం శ్రేయస్కరం . అప్పుడు దాని సమీపార్థాలు
      తెలిసి మనం తప్పులు చేసే సంభావ్యత తగ్గుతుంది.

      उच्चैः ind. [cf. Uṇ.5.12] 1 Aloft, high, on high, above, upwards (opp. नीचम्-चैः); पश्चादुच्चैर्भवति हरिणः Ś.4. v. l.; विपद्युच्चैः स्थेयम् Bh.2.28; उच्चैरुदात्तः P.I.2.29. -2 Loudly, with a loud noise; उच्चैर्विहस्य; R.2.12,51; Bg.1.12. -3 Powerfully, intensely, very much, greatly; विदधति भयमुच्चैर्वीक्ष्यमाणा वनान्ताः Ṛs.1.22; आश्लेष- मर्पय मदर्पितपूर्वमुच्चैः Amaru.133. -4 (Used as an adj. in comp. or by itself) (a) high, noble; जनो$यमुच्चैः पदलङ्- घनोत्सुकः Ku.5.64,6.75; ˚कुलं चात्मनः Ś4.17; किं पुन- र्यस्तथोच्चैः Me.17; Ratn.4.16. (b) distinguished, pre- eminent, famous; उच्चैरुच्चैःश्रवास्तेन Ku.2.47, M.5.17. -Comp. -कर a. making acutely accented. -घुष्टम् 1 clamour, great uproar. -2 loud proclamation. -घोष a. boisterous, crying, roaring; वयोधा उच्चैर्घोषाभ्येति या व्रतम् Av.9.1.8. (-षः) 1 loud noise. -2 a form of Rudra -द्विष् a. having strong or powerful enemies; निबोध यज्ञांशुभुजामिदानीमुच्चैर्द्विषामीप्सितमेतदेव Ku.3.14. -भुजतरु a. having trees like outstretched arms; Me.38. -वादः high praise; जामदग्न्यस्य दमन इति को$यमुच्चैर्वादः U.5. -शिरस् a. high-minded, one of high rank, magnanim- ous; क्षुद्रे$पि नूनं शरणं प्रपन्ने ममत्वमुच्चैःशिरसां सतीव Ku.1.12. -श्रवस्-स a. 1 long-eared. -2 deaf. (m.) 1 N. of the horse of Indra (said to be churned out of the ocean); उच्चैःश्रवसमश्वानाम् Bg.1.27; उच्चैरुच्चैःश्रवास्तेन् हयरत्नमहारि च Ku.2.47. -2 N. of a horse of the god sun. -स्वर a. high-sounding. (-रः) a loud sound or voice.

      శ్రద్ధగల పాఠకులకు ఉపయోగించే నిఘంటు సంచయం:

      http://www.sanskrit-lexicon.uni-koeln.de/

      రచనా సందర్భం కవిత్వ సమీక్ష , ప్రశ్న జవాబులు పదార్థాల గూర్చి .
      తెలుగు వారిలో ఇంచుక రసజ్ఞత లోపించిందా ?? అన్న అనుమానం
      పొడసూపుతుంది.

      తమ్మినేని యదుకుల భూషణ్.

    4. Srinivas Vuruputuri

      అజ్ఞానం కొద్దో, అత్యుత్సాహం కొద్దో పొరబాటు చేసాను. ఒప్పుకుంటాను. అందుకని తెలుగు వారి రసజ్ఞత పైన చురక వేయాలా? 🙂 వాళ్లందరి సంగతి నాకు తెలియదు గానీ కవిత్వమో, సంగీతమో అనుభవించేందుకు ఇంకా చాలా నేర్చుకోవాలి నేను.

    5. తమ్మినేని యదుకుల భూషణ్.

      Cry అన్న పదానికి అరుపు అన్న అర్థం ఉంది కదా , ఉదాహరణకు War Cry అంటే యుద్ధంలో ఏడవటం కాదు కదా.ఆ రకంగా చూస్తే ఇక్కడ కూడా ఆప్టే లోని అర్థమే సిద్ధిస్తుంది.

      उच्चैः ind. [cf. Uṇ.5.12] 1 Aloft, high, on high, above, upwards (opp. नीचम्-चैः);
      उच्चैः -स्वर a. high-sounding. (-रः) a loud sound or voice.

      ———
      http://www.sanskrit-lexicon.uni-koeln.de/
      ————–

      తమ్మినేని యదుకుల భూషణ్.,

  3. బొల్లోజు బాబా

    మంచి కవిత్వ పంక్తులు
    బాగుంది సమీక్ష

    చిన్న సందేహం
    “ఉడుకుతున్న నీళ్ళపై” నీళ్ళు మరుగుతాయేమో!

Leave a Reply