పచ్చని తోరణాల మధ్య కవిత్వం ఒక ప్రగాఢ విశ్వాసం ” నా గుండె గుమ్మానికి పచ్చనాకువై”

ఎన్ని శతాబ్దాల భావ ప్రభంజనం కవిత్వం. కవిత్వం ఇదే అని చూపడానికి దాఖలాలు లేవు..ఒక్కో గుండె పలకరింపు ఒక్కోలా ఉంటుంది. అలాగే ఒక్కో కవిత్వం ఒక్కోలా ఉంటుంది..తొలి గజల్ కవయిత్రి ఎం.బి.డి.శ్యామల గారి శీర్షిక లోనే కవిత్వాన్ని అందించారనే చెప్పాలి. కవిత్వం ఎప్పుడూ వాడిపోని పచ్చని తోరణం. ఇక కవిత్వానికి వాకిలి గుండె అయినప్పుడు అక్షరాలకు లోటు ఏముంటుంది? వీరి కవిత్వంలో వాస్తవం ఉంది. ఒక ఓదార్పు ఉంది. పసితనం నుండి రెండవ పసితనం వరకు తలుచుకోవాల్సిన సంఘటనలున్నాయి. వీరి వ్యక్తీకరణలో భావాలపట్ల ప్రగాడ మయిన విశ్వాసంతో పాటు ఆత్మ స్థైర్యం ఉంది. వీరి కవిత “ఒక అపురూపమయిన వాక్యం” లో

“ఓ సాయంత్రం వేళ

 నేనో కవితావేశమై

 వివిధ భావాల వర్ణ శబ్ద లతలను పులుముకుంటూ..

రాగారంజితమై పోతుంటాను

గుండె మల్లె పాడగా మారి

 అరవిచ్చిన భావాలతో  

తీయని పరిమళమై సోలిపోతుంటుంది.

చివరిలో తాను జన్మించిన ప్రతిసారీ

 తానో కన్న తల్లయి నాకు పునర్జన్మ నిస్తుంది .”

అనడంలో అభివ్యక్తీకరణ ఎంతో ఆలోచింపజేస్తుంది. వీరు రాసే కవిత్వంలో అనుభూతి కనిపిస్తుంది. మనిషి జీవితానికి, మరోవైపు శరీరానికి కూడా ఎంతో అత్యవసరమయిన గుండెను మల్లె పొద తో పోల్చడం చాలా హృద్యంగా ఉంది.

చెట్టు మనిషి జీవితానికి నేస్తం. వేరు నుండి చిగురాకు దాకా ఏదోవిధంగా మనకు ఉపయోగ పడుతూనే ఉంటుంది. విడివిడిగా ఉన్నా, లేక కలిసి వృక్షం లా ఉన్నా సరే అందరికి నీడనిస్తుంది. తోడుగా నిలుస్తుంది. అలాటిది ఈ కవయిత్రి ఏకంగా స్నేహానికే అకుపచ్చదనాన్ని ఆపాదించింది. ఏకంగా “ఆకుపచ్చని నేస్తం” అనడం ఎంతో బావుంది. నిజమే నేస్తం ఆకుపచ్చని వారైతే అంతకంటే ఏమి కావాలి? ఆకుపచ్చని దనం స్వచ్చతకు నిదర్శనం. అందులో ఇలా అంటారు

“శాఖలు శాఖలుగా విస్తరించిన సౌజన్యాన్ని

 అవనికి పట్టిన ఆకుపచ్చని గోడుగుని చూస్తున్నా

కొమ్మా కొమ్మా కొటి గొంతుకలై పిలుస్తున్న

ఆహ్వాన గీతాలకు అతిదినైపోతున్నా!

అంటూనే ఒకచోట అంటారు

చెట్టును చూస్తే

నాకెందుకో తోబుట్టువనిపిస్తుంది” అంటూ. నిజమే కవికి ప్రకృతికి మించిన తోబుట్టువు లేదు. పాటకు మించిన ఓదార్పు లేదు. కవి గుండె ఎప్పుడూ ఆకాశానికి, భూమికి, చెట్టుకు, చీమకు, పక్షికి దాసులే అన్నట్లు ఈ కవయిత్రి శ్యామల ఈ కవితతో నిరూపించుకున్నారు.

స్పర్శకు భాష ఉంటుంది. ఒక్కో స్పర్శ మనకో సంకేతాన్ని అందజేస్తుంది. మనిషి శరీరంలోని నాడులన్నీ మనకో సందేశాన్ని అందజేస్తూనే ఉంటాయి. మేలుకుంటే జీవితం మిగుల్తుంది. లేకుంటే జీవితం జీర్ణవస్త్రమవుతుంది. అలాంటి స్పర్శను గురించి ఎంత చక్కగా వర్ణించారో గమనించండి.

“స్పర్శ ఒక అనురాగపు పోటెత్తిన అల

పులకింతల పులగుత్తుల కోసం

అనుమానపు పెను సర్పాలు పెనవేసిన

శుష్క హృదయాలకోసం

చల్లని శ్రీ గంధమయిన ప్రతి వెన్నెల రేయి

స్పర్శను వర్షించే ఒక మహాద్భుతం!” అంటారు.

స్పర్శ ఏ విధంగా అద్భుతమయినా, స్పర్శ పట్ల వీరి కున్న భావం మాత్రం నిజంగా ఒక అద్భుతమే! ఏ సంపుటిలో దాదాపు ఎనభై కవితలున్నాయి. ప్రతి కవిత్వంలో అంతర్లీనంగా దృశ్య రుపకాలే చోటుచేసుకున్నాయి. కవిత్వం ఎప్పుడూ సమాజానికి, సమాజం ప్రభావితమయ్యే సమస్యలకు పరిమితమయితే భావితరాలకు ఇప్పటి స్తితిగతులు, ఇప్పటి ఆచార వ్యవహారాలూ, అవగతమవుతాయి. అలాగే వ్యక్తికి పరిమితమయితే ఆ వ్యక్తిని గురించి భావితరాలు ఏదైనా గ్రహిస్తారా ఆంటే అక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే అందులో వాస్తవం ఉండదు కనుక. కేవలం పొగడ్తలు మాల తప్ప వస్తువు ఉండదు. అలాంటి ధోరణిలోనే మన యుగపు కవి డా. సి. నారాయణ రెడ్డి గారిపై వీరి కాలాన్ని కళ్ళెం లా తిప్పేరు. “సాహితీ విశ్వంభరుడు” అనే శీర్షికతో ఇలా అంటారు

“సాహితీ విశ్వంభరను మోసిన ఆదిశేషుడు

 గారడిగా పదక్రీడలాడే సరసపు చెలికాడు

అక్షర గాండీవాన్ని ఎక్కుపెట్టి అక్షయ తుణీరం ధరించి

కవితా సారాలను సంధించే సవ్యసాచి” అంటారు. ఆమె అన్నట్లుగా ప్రముఖ కవి సినారె అనడంలో భావితరాలకు సైతం సందేహం లేదు. కాని వ్యక్తి గతమయిన కవితలలో వాస్తవికత లోపిస్తుంది.

ఇలాగే గొర్రెల కాపరి,అస్తమయం లేని రవి,ఆశల వృక్షపు నీడలో!, పేరెంట్స్ డే, అనే కవితలు గుండెతో తనువు ఏకమై అశ్రు కణాలు రూపంలో అక్షరాలు రాలినంత అందంగా మలచబడ్డాయి.నమస్కరానికి అర్థం దేశానికి నమస్కరించడమే! పాదపూజ ఆంటే గాంధీకి చేతులెత్తి మొక్కడమే! అన్నట్లు ఇక్కడ “నా దేశానికి నమస్కరిస్తూ” అనే కవిత రాసేరు. ఇందులో

“మహా వ్రుక్షమయినా మొలకేత్తేది ఒక బీజం నుంచే

మహా ప్రస్తానానికైనా ఒ అడుగే ఆరంభం!

ఆ అడుగే వందల వేల అడుగులై

చెడును కడిగే రెండో జాతీయ ఉద్యమానికి జయపతాక కావాలి”

అని అక్షరీకరించి తమ దేశభక్తిని చాటుకున్నారు.

ప్రతి కవితలో అర్థం ఉంది. కాకుంటే ఇక పరమార్ధం కూడా ఏర్పడితే మరింతగా సమాజానికి ఉపయోగ కరంగా ఉంటుందని సలహా ఇస్తూ అభినందిస్తున్నాను.

You Might Also Like

One Comment

  1. బొల్లోజు బాబా

    looking forward to read the book

    review made it so. wonderful

Leave a Reply