‘నూరేళ్ల తెలుగు కథ’ నుంచి మినహాయింపు ఒక అదృష్టం!

(ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి “వివిధ” లో అక్టోబర్ 31న వచ్చింది. కొన్ని మార్పులతో రచయిత నరేష్ నున్నా దాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురణార్థం అందించారు – పుస్తకం.నెట్)
*************************
‘నూరేళ్ల తెలుగు కథ’ పేరిట ఖదీర్ బాబు చేసిన నూరు కథల రీటెల్లింగ్ చూశాక (చదివాక), ‘నూరేళ్ల’ వంటి ఒక కాలసూచి ఆధారంగా మరికొన్ని జాబితాలు తయారుచేస్తే ఎటువంటి ఫలితాలు, ఆ ఫలితాల మీద మరెటువంటి రుసరుసలు వస్తాయో కదా అన్న అసంబద్ధ ఆలోచన కలిగింది.

దేశాన్ని క్షేత్రంగా తీసుకొని ‘నూరేళ్లలో నూరుగురు భారతీయాంగ్ల కవులు/ కథకులు/ నవలాకారులు/ నాటకకర్తలు’ అనో, ‘మాతృభాషలో, ఇంగ్లీషులో (bilinguallyగా) రచనలు చేసిన నూరుగురు సాహిత్యకారులు’ అనో, లేదా 20వ శతాబ్దిలో సంగీత, సాహిత్యాల మేలు కలయికగా, కొనసాగింపుగా ప్రాణం పోసుకున్న సినిమా రంగానికి సంబంధించి – ‘నూరేళ్లలో నూరుగురు గొప్ప సినీ దర్శకులు’, లేదా అదే నూరేళ్లలో ‘సినిమాలుగా తెరకెక్కిన నూరు ప్రసిద్ధ రచనలు’, లేదా ‘సినీదర్శకులైన నూరుగురు ప్రసిద్ధ రచయితలు’… అని గాని కొన్ని జాబితాలను ఎంత నిష్పాక్షికంగా తయారుచేసినా, లెక్కతేలే తెలుగువారెంతమంది? లెక్కకు చేతివేళ్లు కూడా ఎక్కువైపోయే ఆ తెలుగువారిలో కుల, మత, ప్రాంత, లింగ వర్గీకరణలు చేస్తే ఎవరివాటా ఎంతెంత?

అయితే, భారతీయాంగ్ల రచయితల విభాగంలో తెలుగువారి వాటా పలచనైనంత మాత్రాన అందులో అవమానపడడానికి, తెలుగునుంచి ఇంగ్లీషు తదితర భాషల్లోకి తర్జుమా చేయగలిగే అనువాదకుల సంఖ్య మరీ చిన్నదైనంత మాత్రాన అభిమానపడడానికి ఏముంది? కొన్ని స్థలకాలమాన పరిస్థితుల వల్ల, సాంస్కృతిక పరిధుల దృష్ట్యా కొన్ని ప్రక్రియలకి కొన్ని జాతులు దూరమవుతాయి. కొన్ని వర్గాలకి మరికొన్ని కళలు అబ్బవు. తెలుగువారిని శాంపిల్‌గా తీసుకుంటే, ‘నూరుగురు ప్రసిద్ధ అవధానులు’, ‘నూరుగురు ప్రముఖ ఖవ్వాలి గాయకులు’… తరహా జాబితాలలో కూడా కొన్ని ప్రాంతాలకి, కొన్ని కులాలకి అసలు ప్రాతినిధ్యమే దక్కకపోవచ్చు. ఆ పరిమితిని అర్థం చేసుకుంటే, ఆవేశకావేశాలకు బదులు అర్థవంతమైన చర్చలు నడుస్తాయి (కొన్నింటికి చర్చలు కూడా కాలయాపనే).

“నైజాంలో కవులున్నారా?” అన్న కోస్తాంధ్రుడి దురహంకార వ్యాఖ్యకి సురవరం ‘గోలకొండ కవుల సంచిక’ ప్రచురించడం చెంపపెట్టువంటిదే. తెలుగు ఆధునిక కవులు, ఆధునిక కథకుల జాబితాలో తెలంగాణ వాళ్లు తక్కువగానే ఉండడం ఒక సామాజిక అనివార్యత. బ్రిటీషిండియాలో ఆధునిక రచయితలు పుట్టుకొస్తారు గానీ, నైజాం నుంచి ఎందుకొస్తారు? కోస్తాంధ్రలో పుట్టి, పెరిగి, పరాయి రాష్ట్రాల్లో బతికిన భండారు అచ్చమాంబని మెట్టినిల్లు ఆధారంగా తెలంగాణ రచయిత్రిగా అనుకోవడం, తొలికథ తెలంగాణ ప్రాంతానిదే అని జబ్బలు చరుచుకోవడం రాజకీయ కీచులాటకి చెల్లుబడి అవుతుందే గానీ, సాంస్కృతిక చర్చోపచర్చలకి పనికిరాదు. తెలుగు, ఉర్దూ, పారశీక, మరాఠీ, కన్నడ, సంస్కృతం వంటి పలు భాషల్లో పండితులైన బహుభాషా ప్రవీణులు వారు హైదరాబాద్ స్టేట్‌లో ఉన్నంత మంది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమై ఉన్న కోస్తాంధ్రలో ఎలావుంటారు? ఒకే ప్రాంతానికి చెందినప్పటికీ రచయితలతో రాశిలోనే కాదు, వాసిలోనూ రచయిత్రులు ఎలా పోటీపడగలరు? ఎవరైనా అసాధారణంగా ఉన్నప్పటికీ, వారు కేవలం మినహాయింపులే.

ఆధునిక కవిత్వంలో ‘వస్తువు’ ఎంత ‘దేశీ’ అయినా, ఎంత మట్టి వాసన వేసినా, రూపపరంగా అది ఎన్నటికీ పరాయే కాబట్టి ఆ మ్లేచ్చవాహిక మన మౌలిక భావప్రసారానికి పనికిరాదంటూ కొన్ని వలసానంతర వాదనలు కూడా వచ్చాయి. తన జాతి ఉద్వేగాల ప్రకటనకి పరాయి భాషైన ఆంగ్లాన్ని ఇక మీదట వాడనని భీష్మించి, తన మాతృభాష గికియూలోనే సాహిత్యసృష్టి చేస్తున్నాడు కెన్యా రచయిత గుగివా ధియాంగో. ఆ భావాల, అభిప్రాయాల బాగోగుల చర్చని సౌలభ్యంకోసం పక్కనపెట్టి, ఆధునిక సాహిత్య ప్రక్రియైన ‘కథ’ విషయానికి వస్తే, తెలంగాణకి ‘అన్యాయం’ జరిగి తీరాలి. ప్రాంతానికే కాదు, కుల, మత, లింగ వివక్షకి కూడా ‘కథకుల జాబితా’ గురికావలసిందే. అటువంటి ‘అన్యాయం’, ‘వివక్ష’ ప్రస్ఫుటంగా కనిపించకపోతేనే ఆ సంకలనం అబద్ధమని, ఆ సంకలనకర్త లౌక్యానికి, దొంగ ప్రజాస్వామికతకి పాల్పడినట్టు అర్థం. దూసుకొచ్చిన కొత్త చైతన్యాల, అస్తిత్వ పోరాటాల సాంస్కృతిక బ్లాక్‌మెయిలింగ్‌కి లొంగినట్టు అర్థం. అయితే, ఇటువంటి బ్లాక్‌మెయిలింగ్ ఒకటంటూ ఉందన్న స్పృహ ప్రప్రథమ సంకలనకర్తలకి లేదు, తరువాత తరాలవారికి ఉంది.

ఇలా అంటున్నంత మాత్రాన కథాసంకలనాలు తెస్తున్న, తెచ్చిన వారు శుద్ధసాహిత్యాంశాల ప్రాతిపదికన మాత్రమే ఆలోచించిన ప్యూరిటన్లు అని నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు; నాణ్యతా ప్రమాణాలకు మాత్రమే లోబడి, కుల, మత, లింగ, ప్రాంతాలకి అతీతంగా కథల ఎంపిక జరిగిందని కూడా కాదు. ఏ ప్రమాణాల దృష్ట్యా అయినా తీసివేతలకి వీల్లేని గొప్ప రచయితలు ఆయా సంకలనాల్లో చోటు చేసుకోవడంలేదని కొందరు చేస్తున్న ఆరోపణలు పరమసత్యమే. ఇక ఖదీర్‌బాబు వినూత్న ప్రక్రియగా చేసిన పున:కథనాల సంకలనం విషయానికొస్తే-
…. ఈ సంకలనంలో పున:కథనాలకి ‘నోచుకోని’ రచయితలదే భాగ్యం అని నా అభిప్రాయం. ఖదీర్ పున:కథనం ఘోరం; ఆ రీటెల్లింగ్ వంటకానికి మాడిపోయిన తాలింపులా ఖదీర్ చేసిన ముక్తాయింపు వ్యాఖ్యానాలు మరీ ఘోరం. కనుక ఖదీర్ బారిన పడని రచయితలు, వారి అభిమానులు సంబరపడాలే తప్ప ఆక్రోశపడకూడదు.
సంకలనం కాకమునుపు, ఈ పున:కథన విన్యాసానికి అత్యంత పెద్ద సర్క్యులేషన్ ఉన్న పత్రిక వేదిక అయింది. (ఖదీర్ గణాంకాల ప్రకారం చెప్పాలంటే) కోటీ నలభైలక్షల పాఠకుల్లో హీనపక్షం యాభైవేల మందికి రోజుకొక రచయిత చేరువయ్యారు. కె.సి.డే పాటలు, లక్ష్మీబాయి సంగీతం… మోటారు రొదల్లో, దుమ్ము రోడ్లమీద మాదాకవళం అరుపుల్లో, పందుల గురగురల్లో, వేడి మసాల వడల కేకల్లో కలిసి వెదజల్లబడుతూ ఉంటే, చలంగారు ఏడ్చినట్లు, ఆ రోజువారీ కథలకు సంబంధించి కూడా బాధపడిన అభిమానులు, రచయితలు ఉన్నారా? లేక పచ్చి పాపులారిటీ యావతో ఎక్కడ ప్రచారమొస్తేనేం అని అందరూ సర్దుకుపోయారా? అంటూ సందేహపడ్డాను.

నాకు తెలిసి, అభ్యంతర పెట్టిన రచయిత జయప్రభ ఒక్కరే కనిపించారు. బ్యూటీ టిప్పులు, వంటింటి చిట్కాలు, వాతావరణ సూచికలు, వారఫలాల మధ్య తన కథని పున:కథనం పేరిట పంకిలం చేసి వెదజల్లడాన్ని చూసి ఊరుకోనిదీ, ఆ పున:కథనాన్ని ఈ సకంలనంలో చేర్చడానికి వీల్లేదన్నదీ జయప్రభ ఒక్కరే. ఆ విధంగా ఈ సంకలనం నుంచి ఆమె స్వాభిమానంతో బయటపడ్డారు. కాబట్టి, బుర్రా, వేలూరి, నోరి, బైరాగి, త్రిపుర, జగన్నాధశర్మ… ఇంకా ఎవరైతేనేం… ఈ సంకలనంలో స్థానంలేనివారిదే గౌరవం.

అయితే ఖదీర్ పున:కథనాలు, వ్యాఖ్యానాలు అసలు కథకంటే కూడా బాగున్నాయని కొందరు కథకులు స్వయంగా సభాముఖంగా పోటీలుపడి మరీ ప్రకటించారు. ఈ బహిరంగ ప్రకటన దిగజారుడుతనానికి కూడా కొంత నేపథ్యముంది. ఉత్తమ సాహిత్యం ఏ సీమాసమయసందర్భాల్లోనైనా భావాల్ని, సిద్ధాంతాల్ని అనుసరించదు. ఏ కాలానికి తగ్గ భావజాలాలు, చైతన్యాలు ఆ కాలానికి ఉంటూనే ఉంటాయి. తెలుగు కథకుల విషయానికొస్తే, తొలితరం కథల్లో కథకుల పాండిత్యం, ప్రాపంచిక అవగాహన సరస్వతీ నదిలా అంతర్వాహినులే. ఆ ప్రచ్ఛన్నత వల్ల జీవితమంత కథకి నెత్తావి అబ్బింది.

1960ల తర్వాత సిద్ధాంతాల స్వైరవిహారం పెరిగి, చెలామణిలో ఉన్న నిర్ధారిత భావాలకి పాత్రల్ని తొడిగి, రక్తమాంసాలులేని ఆ బొమ్మల గారడీని కథలే అని కథకులు దబాయించడం ప్రారంభించారు. గత యాభై ఏళ్లుగా తెలుగు కథ విషయంలో ఈ తంతు నానాటికీ ముదిరిపోయింది. కాబట్టి అర్థశతాబ్దిగా కొన్ని మినహాయింపులు పోను మిగతా వారివి కథలు అనే కంటే కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రతిపాదనల సమాహారాలు అనొచ్చు.

కాబట్టి పాత తరం కథకుల రచనల్ని పునరుల్లేఖించి, విశ్లేషించి, వ్యాఖ్యానించే విషయంలో ఖదీర్ కొన్ని చోట్ల దారుణంగా విఫలమయ్యాడు. మరికొన్ని చోట్ల తొలితరం రచయితలవి కొన్ని పేలవమైన కథలు తీసుకొన్నాడు, తన సౌలభ్యం కోసం. తరువాత తరాల రచయితల కథల ఎంపికలో తనదైన ఒడుపు ప్రదర్శించుకున్నాడు. మరో చెంప తన సూక్తిముక్తావళికి వీలుగా కథలు అనబడే ఉపన్యాసాలు ఉండడం వల్ల అతని పని మరీ సులువైపోయింది.

‘కథ’ వంటి పడమటి సాహిత్యరూపాన్ని సొంతం చేసుకునే యాతనలో తొలినాళ్ల రచయితలు పడిన శ్రమ నుంచి మినహాయింపు, వారి శ్రమ వల్ల దక్కిన ఫలాల్ని అనుభవించే వెసులుబాటు మలితరం రచయితలకి కలుగుతాయి (కలిగాయి). ప్రపంచ సాహిత్యంలో కథకచక్రవర్తుల్ని మధించి, ముందు తరం వారు వేసిన దారిని కొత్త చైతన్యాల వెలుగులో శుభ్రపరుస్తూ, ఆ దారిని మరింత వెడల్పు చేసుకుంటూ వెళ్లే సావకాశం తరవాత తరాల రచయితలకి ఉంటుంది.

మరోవిధంగా చెప్పుకుంటే, ఒ హెన్రీ, చెకోవ్, మపాసా, పో, మామ్, ప్రభృతులు ముందు తరం రచయితల రూపేణా పరోక్షంగా వారి రచనా వారసుల రక్తంలోకి ప్రసరిస్తారని ఒక అంచనా. అయితే ఆ అంచనాని పున:సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ దుర్వాఖ్యానాల సంకలనం ద్వారా తాజా తరం కలం వీరుడు ఖదీర్ గుర్తుచేశాడు.
చివరిగా ఒక్క మాట: ఖదీర్ పునఃకథన కుతూహలానికి, ఫలితంగా కలం ఝళిపించడానికి పూర్తి బాధ్యత అతను పనిచేస్తున్న పత్రికదే. తమ ఉద్యోగి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు, ప్రతిభాపరిమితులు ఆ పత్రిక నిష్పాక్షికతని, ప్రతిష్టనీ బలిచేయకూడదన్నది ప్రాథమిక సూత్రం. నూరేళ్ళ కాలంలో తెలుగు కథల్ని ఎంచి, వ్యాఖ్యానించి, తమ కోటీ నలభై లక్షల మంది పాఠకుల ముందు నిలబెట్టడానికి ఖదీర్ అర్హుడే అని ఆ పత్రిక యాజమాన్యం భావించింది. కాబట్టి, ఈ ‘నూరేళ్ల తెలుగు కథ’ మీద పడే పూలూ, రాళ్ళకి పత్రికదే బాధ్యత. Disposable కప్పూల్లో, plastic టిన్నుల్లో దొరికే instant కాఫీలా, processed food లా ఈ నూరేళ్ల తెలుగు కథ’ అనే గైడుని కారుచౌకగా అందించి, ‘కథ అంటే ఓస్ ఇంతేనా’ అని ఓ యాభై వేలమంది చవక చేసుకోడానికి, లేదా చౌకబారుగా గొప్ప చేసుకోడానికీ కూడా ఆ పత్రికదే బాధ్యత.

You Might Also Like

7 Comments

  1. రమణ కుమార్

    నరేంద్రగారూ,
    మీరు మరీ ఇంత సులభంగా తేల్చెయ్యడం బాగోలేదు. ఎందుకంటే ఎప్పుడూ మాట్లాడని మీవంటివారు మాట్లాడినప్పుడు మాలాంటివాళ్ళు మరింత ఆశిస్తారు.

  2. narendra madhuranthakam@ penku

    ee pusthakaaniki kadheer ane rachayatha naaku nachhina noorella telugu katha
    ani peru pettikunte ea samasysya vundedhi kaadu

  3. రమణ కుమార్

    జ్వాల గారూ,
    ఖదీర్ బాబు చక్కటి కథకుడు. అందులో సందేహం లేదు. అయితే మంచి కథారచయిత కావడం అనేది కథా సాహిత్యం పట్ల ఆయనకి వున్న అవగాహనని ఏవిధంగా తెలియజేస్తుందో నాకు అర్ధం కాలేదు. ఎందుకంటే కథలు రాయగల సామర్ధ్యం, “కథ” అనే ప్రక్రియ మీదున్న అధికారాన్ని మదింపు చెయ్యలేదు.

  4. jwaala

    ఖదీర్ బాబు రాసిన నూరెళ్ళ తెలుగు కథ సాక్షి ఫామిలీ లో కొన్నాళ్ళ పాటు శీర్షికగా వచ్చింది, అన్నీ కాకపోయినా చాలావరకు ఆ శీర్షికని నేను ఫాలో అయ్యాను.మొదట్లో ఆ శీర్షిక నిర్వహించేది ఎవరో తెలియకపోయినా రాను రాను కథ ముగింపు వచ్చేసరికి అతను ఇస్తున్న వివరణ చూసిన తరువాత ఇతనెవరో గట్టివాడే అని మాత్రం అనుకున్నాను,తరువాత ఆ శీర్షిక నిర్వహిస్తోంది ఖదీర్ బాబని తెలిసిన తరువాత సరైన వ్యక్తే ఆ శీర్షికను నిర్వహిస్తున్నాడనిపించింది. (నేను అప్పటికే ఆయన పోలేరమ్మ బండ,దర్గా మిట్టా కథలు చదివివున్నాను) తెలుగు కథకు నూరేళ్ళు నిండిన సందర్భగా ఒక రచయిత తనకు నచ్చిన,తనకు తోచిన కథల్ని పరిచయం చెయాలనుకోవడం తప్పేమి కాదు పైగా ప్రోత్సహిచవలసినదికూడా!, ఆంధ్రజ్యొతిలోనే(నవ్యలో) ఇటువంటిదే ప్రతి రచయితా వారికి నచ్చిన వారి కథని పరిచయం చేస్తూ వచ్చారు,రచయితల్ని వారి కథల్ని వారిచేతే పరిచయం చేయించడానికి తెలుగు కథని శిఖరాగ్ర స్తాయిలో నిలబెట్టిన వాళ్ళు చాల మంది ఇప్పుడు బతికిలేరు, వారి కథల్ని పరిచయం చేయడానికి అవగాహన వున్న వ్యక్తి అంటూ ఒకరు కావాలి ,ఖదీర్ బాబుని అందుకు అర్హుడుగా నిర్ణయించదానికి ఆయిన రాసిన కథలు చాలు,వేరే వాలు ఇంకా బాగ రాసివుండోచ్చు కాని మొదట అంటూ ఎవరో పూనుకోవాలి కదా,నరెష్ నున్నా గారు లెవదీసిన ఇంకో పాయింటు ఆయన వుత్తమమైన కథలు తీసుకోదని, అతనికి వున్న అవగాహని బట్టి, అతనుకి వున్న అబిరుచిని బట్టి కథల్ని యెన్నుకోవడం అతనికిసంభందించిన విషయం,ఈ విషయంలో కొంత అసంత్రుప్తి వుండివుండోచ్చు కాని అది అంతగా తప్పు పట్టాల్సిన విషయం యేమాత్రం కాదు, ఇంకోటి రీటెల్లింగ్ గురించి! మనం ఒక కథని పరిచయం చేయాలనుకున్నప్పుడు పాఠకుడు ఆ కథని చదివి వుండోచ్చు లేదా ఆ కథగురించి విని వుండక పోవచ్చు,అందరు పాఠకులని ద్రుస్టిలో పెట్టుకుని శీర్షిక నిర్వహిస్తుణ్ణప్పుడు రీటెల్లింగ్ తప్పేలా అవుతుంది నరేష్ గారూ?మీరు లేవనెత్తిన మరో పాయింటు కె.సి. డే పాటల్ని ఎక్కడ పడితే అక్కడ వినిపించినట్టు ఈయన కూడా కథల్ని ఎక్కడ పడితే అక్కడ రాసాడని, అలా ఇథె మనం కథల్ని పూజ గదుల్లొ తప్ప బయట చదవలేం,ఇప్పుడు మనకి వున్న పాపులర్ వారపత్రికలు,అందుల్లొ వస్తున్న సోకాల్డ్ కథ సరైన చోతె వుంతున్నాయ్య? (పేజికి ముందు దైవస్తుతి వుంటుంది,పేజి తవువాత సెక్సు శీర్షిక వుంటుంది ,ఇది సరైనదే అయినప్పుడు వంటింటి టిప్పుల మధ్యో ఇంకోదాని మధ్యో కథా పరిచయం చేయడం తప్పెలా అవుతుంది? తరువాత మీరు చేసిన ఇంకో పొరపాటు ఆ పత్రికని విమర్సించారు,మీరు రాసిన ఈ వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ రెండు పత్రికలకి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ వుందో అందరికి తెలిసిన విషయమే ఇంతకీ మీ వుద్దేసం ఖదీర్ ని విమర్శించడమా లెదా అతనికి అవకాశం ఇచ్చిన ఆ పత్రికని దుయ్యబట్టడమా? “రీటెల్లింగ్ మరీ ఘోరం” ఇది మారు వాడిన ఇంకో మాట, ఆ శీర్షిక అందరు పాఠకులకోఅసం వుద్దేశించబడినది సో రీటెల్లింగ్ బాగా లేక పోతే అది సక్సెస్ అయ్యేది కాదు,పాఠకుల ఆదరనే ఆ శీర్చిక సక్సెస్ కి వుదాహరణ!,ఒక మంచి ప్రయత్నం చేసిన ఖదీర్ బాబు యెంతైనా అభినందనీయుడు,కోడి గుడ్డు మీద ఈకలు పీకొద్దు,ప్లీజ్

  5. రమణ కుమార్

    ఈ వంద కథలే ఆణి ముత్యాలని ఎవరూ అనలేదు. అనలేరు. అనరు. అనకూడదు. ఎందుకంటే ఏటా వచ్చే ఉత్తమ కథా సంకలనాల్లో వచ్చినవే ఉత్తమ కథలని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అవి ఆయా సంకలనకర్తల దృష్టిలోకి వచ్చిన ఉత్తమ కథలు మాత్రమే. దాదాపు ముప్ఫై నలభై కథలు ఆయా సంకలనాల్లో వస్తాయి. వాటిపైనే ఏకాభిప్రాయం సాధ్యం కానప్పుడు వందేళ్ళ ఉత్తమ కథలపై ఏకాభిప్రాయం సాధ్యమనే అపోహలో ఎవరూ వుండరు. ఈ వందేళ్ళలో వచ్చిన కథలను మాత్రమే పరిగణించి వాటిలో ( తను చదివిన )తనకి అత్యుత్తమమైనవనిపించిన కథలని మహమ్మద్ ఖదీర్ బాబు తనదైన పద్ధతిలో వివరించి తరించారు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఇంక సూక్తి ముక్తావళి కూడా ఆయన పరిధిలోనే వుంటుంది. దానిగురించి నరేష్ నున్నా గారు చెప్పిన మాటలు కూడా నున్నా గారి పరిధిలోనే వుంటాయి. ఈ రెంటి పరిధుల్నీ విస్తృతపరస్తూ పోతే మరిన్ని మంచి కథల జాబితా తయారవుతుంది. ఈ విషయమై చర్చ వాదోపవాదాలతో అర్ధాంతరంగా ముగిసిపోకూడదని కోరుకుంటున్నాను.

  6. సౌమ్య

    పద్మ అట్లూరి గారికి:
    “aa vyakhyalanu vivarinchaalsina badhyata atidhigaariki vundi. ledante pustakamdotnet vaariki vundi.”
    – వ్యాసనికి సంబంధించినంత వరకూ దానిలో వెల్లడించబడ్డ అభిప్రాయాలు వ్యాసకర్తలవి. దానికి వివరణ ఇవ్వడం, ఇవ్వకపోవడం వ్యాసకర్తలకి సంబంధించిన అంశం. దానికి పుస్తకం.నెట్ కు సంబంధం లేదు.

  7. padma atluri

    pustakamdotnetgaaru

    atidhi vyakhyalu choodandi…. ఈ సంకలనంలో పున:కథనాలకి ‘నోచుకోని’ రచయితలదే భాగ్యం అని నా అభిప్రాయం. ఖదీర్ పున:కథనం ఘోరం; ఆ రీటెల్లింగ్ వంటకానికి మాడిపోయిన తాలింపులా ఖదీర్ చేసిన ముక్తాయింపు వ్యాఖ్యానాలు మరీ ఘోరం. కనుక ఖదీర్ బారిన పడని రచయితలు, వారి అభిమానులు సంబరపడాలే తప్ప ఆక్రోశపడకూడదు.

    ee vyakhyalanu samadhinche vivaraalemi atidhi gaaru ivvaledu.

    aayana ala aneste paatakulu nammeyalani ledu.

    aayana ala anesi voorukunte paatakulu voorukovalani ledu.

    aa vyakhyalanu vivarinchaalsina badhyata atidhigaariki vundi. ledante pustakamdotnet vaariki vundi.

    -padma atluri

Leave a Reply