స్తీల హృదయాలను గెలుచుకున్న అద్భుత అక్షర మాల: శివారెడ్డి గారి గ్రంధం “ఆమె ఎవరైతే మాత్రం”

పచ్చగడ్డిపైన ఒక్క వాన చుక్క పడితే ఒకవైపు పచ్చగడ్డి, మరోవైపు వానచుక్క కలిస్తేనే ప్రకృతికి హృద్యమయిన చిత్రమవుతుంది. అలాగే బిడ్డ, తల్లి తోను, ఒకానొక వయసులో తల్లి, బిడ్డతోను ఉన్నప్పుడే సృష్టికి ప్రతిరూపమై నిలుస్తుంది. నేడు మనిషిని మనిషిగా చూడటానికే ఇష్టపడని సమాజంలో మనము మనుషులమై జీవిస్తున్నాము. ఒక మనిషి సంపూర్ణత్వం ఎప్పుడూ సాధిస్తాడు ఆంటే అది ఈ రోజుల్లో ఒక ప్రశ్నే. కాని వ్యక్తిలో నిజాయితీ ఉన్నప్పుడే అది సాధ్యం. “ఆమె ఎవరైతే మాత్రం” అనే ప్రముఖ కవి శివా రెడ్డి గారి కవితా సంపుటి “ఏ కవితా సంపుటి అయితే మాత్రం” అనేటట్లు లేదు. నిజాయితీని గుండెలనిండా, వాస్తవాన్ని వీరి జీవితమంతా పరుచుకుని ఉన్న ఒక వెన్నెల పందిరిలా ఉంది. స్త్రీ రూపాలు సృష్టిలో ఎన్ని ఉన్నా కూడా ఎవరి పాత్ర వారిదే.. ఎక్కడి అనురాగం అక్కడిదే. నేడు స్త్రీ వేదికలపైన ఉపన్యాసాలలో ఉన్నతంగా తీర్చిదిద్దబడి ఆ మెట్లు దిగగానే ఏకవచన సంభోదనతో ప్రస్తుతిస్తూ, నీచంగా చిత్రీకరిస్తూ, తనవల్లె చెడిపోయినా సరే నీచురాలని ముధ్రవేస్తున్న నికృష్ట సమాజంలో ఇంకా చాలా ఓర్పుతో, స్త్రీలు పురుష జాతిని శక్తివంచన లేకుండా, ప్రేమించడమే ధ్యేయంగా పెట్టుకుని బతుకుతున్నారు. అలాంటి సంక్లిష్ట సమాజానికి సమాధానంగా కొందరు పురుషులు లేకపోలేదు. వారందరూ మనకు కనబడరు కాని ప్రఖ్యాత సాహితీవేత్తగా మనకు కనిపించే ఒక గొప్ప సమాధానం శివారెడ్డి గారు. వీరు చిన్నతనంలో తల్లిని కోల్పోయినా, ఆ తల్లిని పెంచిన మరో తల్లి వీరికి తల్లి, గురువై సమాజానికి అందించారు. ఆ సంస్కారం తోనే స్త్రీకి ఇలా అక్షరాభిషేకం చేసారు “ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదుపుతాం/ హాయిగా అస్వప్నంగా మళ్ళా ముకుళిత పుష్పంలా శయనించిన ఆమెను/ ఆమె ఎవరైతే మాత్రం ఎలా కదుపుతాం/ ఆమె ఎవరైతే మాత్రమేమిటి?/ నా భార్యో/పక్కింటావిడో/పిల్లల తల్లో/ తెల్లని పిల్లో/ఆమె ఎవరితే మాత్రం ఎలా కదిలిస్తాం?/ఆమె పడుకుంటే పడుకోనీ/మనం ఆమె చుట్టూ చేరి ప్రార్ధనలు చేద్దాం/ ఏ కల్మష స్వప్నము ఆమెను అంటవద్దని/ రేపటి తాలుకు ఏ దురుహాన్నా ఆమెను సోకవద్దని/రేపటి మృగాన్ని ఎదుర్కునేందుకు/ సర్వశక్తి సామర్ధ్యాల్ని స్వీకరిస్తున్న / ఆమెని కదపద్దు/మనసులో అన్నా పిలవద్దు”

తనకంటూ కోల్పోయిన పసితనం మనసుకు వదిలేయకుండా దృశ్య రూపంలో దాచుకుని నేడు స్త్రీని ఒక మూర్తిగా చేసుకుని ప్రేమను పంచే తత్వమే వీరికి రెండింతల అపురుపమయిన జీవితమయింది.
మనిషి జీవితం ఎన్నో బంధాలతో, అనుభందాలతో ముడిపడి ఉంటుంది. అవన్నిటినీ నిష్పాక్షికంగా గుర్తించి ఆయా సంభందిత దృక్పధాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవానికి అనుభూతిని చేర్చి అందించడం ఈ కవికే సాధ్యం. నిరంతర సన్నివేశాల సారాంశ మయిన స్త్రీ జీవితాన్ని ఎక్కడా ఆవేశం గాని, అనాలోచితమయిన పద ప్రయోగాలు కాని ఉపయోగించకుండా కేవలం గౌరవాన్ని, అభిమానాన్ని, అనురాగాన్ని మాత్రమే పంచి ఇచ్చి రూపు దిద్దుకున్న అందమయిన ఆల్బం ఈ సంపుటి “ఆమె ఎవరైతే మాత్రం”.

“తల్లీ ! నీకు నమస్కారం నన్ను కన్నందుకు”
అని ఒకచోట ప్రయోగిస్తే మరోచోట “ఆ తల్లి ముఖం చూడండి/ఎంత దయ, ఎంత ప్రేమ/ఎన్ని కష్టాలయినా / ఎంత దుఖాన్నయినా లోనే అదిమిపెట్టి/ శరీరం మొత్తాన్ని ఒక కారుణ్యం చేసి, ఒక లాలిత్యం చేసి/మహా మృదువైన పడక చేసి/రెక్కలోచ్చీ, రెక్కలు రానీ ఆ చిట్టి తల్లికోసం తానో గూడు/ అన్ని గాడ్పుల్నీ,అన్ని రుతువుల్నీ,మార్పుల్నీ, తట్టుకుని నిలబడే గూడు / అంటూ చివరిలో ఆమె చేతుల్లో పండిపోయినా, ఎండిపోయినా, రాలిపోయినా, గొప్ప భాగ్యమే “ అనడం స్త్రీ జాతి మొత్తం తలెత్తుకుని నిలుచునేలా చేసింది.ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారనే మాట పాతదే అయినా వీరు స్త్రీకి చేసే పూజే నేడు ఇంతగా సరస్వతీ దేవి కటాక్షానికి పాత్రులయ్యారు అనిపిస్తుంది.

మనం ఒక బాధనయినా, ఆనందాన్నయినా అనుభవిస్తేనే అర్థమవుతుంది. కాని కవి కళ్ళకు స్త్రీ ఒక దేవతలా కనిపించడం జరిగింది. తల్లి ని చిన్న తనంలోనే పోగొట్టుకున్న కారణంగా ప్రతి స్త్రీలో తల్లినే తలిచేరు. అందుకే ఆమెను వెన్నెలతో పోల్చారు. ” ఆమె కళ్ళనిండా/ నీళ్ళు పెట్టుకుని అడిగింది/ ‘నా సంగతేంటని’ / నా గుండె నిండా దుఖాన్ని నింపుకుని అడిగాను/ ‘ నా సంగతేంటని’ / ఇద్దరం పక్కున నవ్వాం/ ఇద్దరి కళ్ళనుండి /వెన్నెల వర్షం కురిసింది” అన్నారు. ఆంటే స్త్రీ పురుషుల మధ్య ఆత్మీయతకు అర్థం ఈ కవిత. నిలదీయటంలోనే ఆత్మీయత ఉంది. నువ్వు నా వ్యక్తివి అనే అనురాగం దాగుంది. ఈ భావాలు అద్భుతం!

గతకాలం శైదిల్యంతో ఉంది, భవిష్యత్ అంతా భయంతో కదిలిపోయే చిత్రంతో కాంతి లేదా లేక శాంతి లేదా తేల్చుకోలేక కాలం కరుగుతునే ఉంటుంది. నువ్వెవరు ? అని అడిగితే నువ్వు నా నీడవనే దాని అర్థం! గుండె స్పందించడం ఒక్కరోజుతోనో లేక ఒక నేలరోజుల్లోనో నేర్చుకునే ఒక కోర్సు కాదు. లేదా చదివి ప్రాక్టీసు చేసే పదాల బరువు కాదు. పుట్టుకతోనే వచ్చేది ఆలోచనా విధానం! ఇక్కడ గమనించండి “నాకింద పక్కలానో/ నావకిండా నీళ్ళలానో/ కాళ్ళకింద నీడలానో/ఆకాశం కింద పక్షిలానో/ ఎండాకాలం గాలినుండి పైకి లేచినప్పుడు కనబడతావు/వీధిలో ‘ఎర్రటి సూర్యుడు రాయి’ నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినబడతావు.. చివరిలో ఏ ఆడపిల్లని చూసినా/ రాత్రికీ/ పగటికీ మధ్య కొట్టుకుంటున్న నల్లని తెరలా/నాలో ఎల్లప్పుడూ కదుల్తూనే ఉంటావు!”
ప్రపంచంలో ఎన్నో ఆవేదనలు ఎన్నెన్నో అవరోధాలు ఒక మనిషికి ఎదురైనా వాటిని ఎదుటి వ్యక్తిగా చూసినంత కాలం మనసుకు పట్టవు. అదే మనకే ఎదురైనప్పుడు మాత్రం గుండె భారానికి ఎంత విలువుందో, మోయడం ఎంత కష్టంగా ఉందో అర్థమవుతుంది. కాని కవి అనేవాడు మాత్రం ఎదుటి కష్టాలను తాను భరిస్తాడు. ఎదుటి వారి నొప్పిని తాను అనుభవిస్తాడు. వారినే కవి అంటారు. అలాగే ఈ కవి జీవితంలో ఎదురైన స్త్రీలు అమృత హృదయులు అవ్వడంతో వారి కంటితో చూస్తుంటే లోకం లోని స్త్రీలు అందరూ తల్లి స్వరుపంలోనే తారసపడుతారు. ఇలా స్త్రీ ముర్తులందరికి నమస్కారం పెడుతూ, పురుటి నొప్పులు, నా తల్లి లాంటి తల్లి, తళ్లికో బహుమతి, ఒకానొక పొద్దుటిపుట, ఒక ఆడ, ఒక మగ, తెలిఫోనే తీగ, అలివేణి, నల్ల పిల్ల, ఆ కన్నీళ్లు నావే, రెండు అస్తిత్వాలు, ఆమె ఎవరైతే మాత్రం, అంటూ ప్రతి కవితకు ఒక కిరీటం లాంటి శీర్షికను ఉంచేరు. ప్రపంచాన్ని జయించడం కంటే ఒక స్త్రీని గౌరవించడం మిన్న! సృష్టిని నిలదీయడం గొప్పకాదు. ప్రతిసృస్టిని సంతోష పెట్టగలగాలి! ఆ విషయంలో ప్రముఖులు శివారెడ్డి గారు ప్రపంచాన్ని జయించేరు. ” ఆమె ఎవరితేనేం? ? ఆ కన్నీళ్లు నావే/ ఆమె ఎవరితేనేం? /ఆ ఆవేదన నాదే / ఆమె ఎవరైతేనేం?/ ఆమె నా ఆలోచన/ ఆమె ఎవరైతేనేం?/ నాలోపలి అద్దం మీద చెరగని ముద్ర / ఆమె ఆనవాళ్ళు/ నా అక్షరాల నిండా ప్రత్యక్షం..! అని ఎలుగెత్తి స్త్రీ ప్రస్థానాన్ని “ ఆమె ఎవరైతే మాత్రం” అనే ఒక అద్వితీయమయిన పలకరింపుతో స్త్రీల హృదయాలని గెలుచుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

అక్షరం అమ్మ లాంటిది. భావం భార్య లాంటిది. రెండు కలిస్తేనే కవిత్వం పొందికగా ఉంటుంది. సరదాగా సాగుతుంది. నమస్కరిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను!

(శివారెడ్డి గారి ఇతర రచనలపై పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ చదవండి. ఇదే పుస్తకం పై అరుణ పప్పు గారి సమీక్ష ఇక్కడ చదవండి – pustakam.net)

Online purchase link on AVKF here.

You Might Also Like

Leave a Reply