కొత్త దుప్పటి

8327_front_coverరాసి పంపిన వారు: కొల్లూరి సోమశంకర్

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారు రాసిన కథల సంపుటి కొత్త దుప్పటి (Kotta duppati). మే 2008లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన 252 పేజీల ఈ పుస్తకం వెల రూ.120/- ఇందులో 30 కథలు ఉన్నాయి.

ఇవన్నీ చక్కని కథలే అయినా నాకు బాగా నచ్చిన కొన్ని కథలను ఇక్కడ ప్రస్తావిస్తాను.
పొలంలో కాపలా ఉన్న మామకి, ఆయన ఎవరి ద్వారానో తెప్పించుకున్న కొత్త దుప్పటి ఇవ్వడానికి అల్లుడు ఇష్టపడడు. చలికాచుకోడానికి పుల్లలు, నిప్పు ఇచ్చి వెడతాడు. అయితే మామ మాత్రం తెల్లవార్లూ పుల్లలు వెలిగించకుండా కొన్ని మిగులుస్తాడు. అల్లుడు అడుగుతాడు – చాలా పుల్లలున్నాయి కదా, ఎందుకు చలిలో కూర్చోడం – మంట వేసుకోవచ్చు కదా అని! ముసలి మామ చెబుతాడు – ఇవన్నీ వేసుకుంటే ఇట్టే ఖర్చయిపోతాయి. నువ్వు వస్తే నీకు చలి కాచుకోడానికి ఉండవని వీటిని ఉంచాను అని. తను స్వార్ధం చూసుకున్నా, మామ తన కోసం ఆరాటపడడం చూసి అల్లుడు సిగ్గుపడతాడు. అతడి నుంచి కొత్త దుప్పటి జారిపడుతుంది.

అమాయక గ్రామీణులని వైద్యం పేరుతో ఎలా మోసం చేయచ్చో నేర్చుకో కథలో చూస్తాము. ఈ విషయాలని నేర్చుకోమని వైద్యుడు అంటే – మీ దగ్గర వైద్యం నేర్చుకోడానికి వచ్చాను శవాలతో వ్యాపారం చేయడం కోసం కాదు. ఇది నేర్చుకోడం కన్నా వీధిలో అడుక్కోడం మేలు – అని కథలో ప్రధాన పాత్ర జవాబు చెబుతుంది. పట్టణాలలో నగరాలలోను ముసలి తల్లిదండ్రులను కట్టడి చేయడానికి ప్రయత్నించే పిల్లలుండడం మనకి తెలుసు. అయితే పల్లెటూర్లలో సైతం ఈ ధోరణి ఉంటుందని గిరి గీయద్దు కథ చెబుతుంది. అలా గిరిగీస్తే దాని ఫలితాలెలా ఉంటాయో కొండా రామయ్య ద్వారా మనకి తెలుస్తుంది.

వేరు శనగ పంట ఎండిపోతోంది – ఒక్క వాన కురిస్తే చాలు, పంట బతుకుతుందని అప్పటి దాకా అనుకున్న రైతుల ఆశలపై నీళ్ళు చల్లుతుంది జడివాన. వాన చేసిన నష్టం అంతా ఇంతా కాదు. రైతు, రోజు కూలీగా మారిపోయేందుకు వానే కారణమవుతుంది. మనసు చెమ్మగిల్లించే ఈ సంఘటనని ఒక్క వాన చాలు కథలో చదవచ్చు. పట్నంలో ఉన్నా, పల్లెలో ఉన్నా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రుల వైఖరి ఒకే విధంగా ఉంటుందని కొడుకు కూతురు కథ చెబుతుంది. కొడుకు పట్టించుకోకపోతే కూతురి పంచన చేరిన ఓ వృద్ధుడు తన అవసాన దశలో తన దగ్గరున్న బంగారాన్ని కొడుకుకి ఇచ్చేస్తాడు. చనిపోయే ముందు కూడా తనని కూతురిగానే గుర్తుంచుకున్నందుకు దుఃఖం పట్టలేక పోతుందామె.

రైతుల సమస్యలని తమ స్వార్ధ ప్రయోజనాలకి వాడుకునే వ్యక్తుల మనస్తత్వాన్ని చక్కగా చిత్రించిన కథ – వాళ్ళు మా పార్టీ కాదు. ముక్కుపచ్చలారని అమాయకత్వంతో ఓ పాప ఓ కిరాయి హంతకుడి మనసుని మారుస్తుంది – కన్నీటి కత్తి కథలో. సర్పంచ్ మాటలు నమ్మి రాజకీయాలలోకి వచ్చి, 5000/- రూపాయల కోసం ఓ వ్యక్తి ని హత్య చేసి కిరాయి హంతకుడిగా మారిన రైతు మరో హత్య చేయడానికి బస్‌లో వేరే ఊరు వెడుతుంటాడు. హత్యా రాజకీయాలకి తన తండ్రి బలవగా, పిచ్చిదైపోయి ఊర్లు పట్టిపోయిన తల్లిని వెతుక్కుంటూ బయల్దేరుతుంది ఓ పాప అదే బస్‌లో. తలలు నరకడానికి తీసుకెళ్ళిన కత్తితో కొబ్బరి బోండాం కొట్టి పాపకిస్తడా రైతు. ఈ కత్తులు ఇందుకు కూడా పనికొస్తాయా, భలె భలే ……. అని అంటుందా పాప ఆనందంగా.

ఎంతెంత దూరం కథ గ్రామీణ పాఠశాలలలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలని చక్కగా ఆవిష్కరిస్తుంది. పిల్లలు బడికి దూరమా? ఉపాధ్యాయుడు పిల్లలకి దూరమా అనే ప్రశ్నని లేవనెత్తుతుంది ఈ కథ. తమ్ముడంటే అవాజ్యమైన ప్రేమ ఉన్న వ్యక్తి, తన ఇంట్లో శుభకార్యానికి తమ్ముడిని ఎందుకు పిలవలేదు? కళ్ళు చెమ్మగిల్లింపజేసే కథ తమ్ముడి ఉత్తరం లో సమాధానం దొరుకుతుంది. గంపెడు గడ్డి కథ మనుషుల లోని లోభాన్ని ఎత్తి చూపుతుంది. చాలా ఆర్ద్రమైన కథ. కొందరు తనదాకా వస్తే గానీ సమస్య తీవ్రతని అర్ధం చేసుకోలేరన్న నిజాన్ని వీరమరణం కథ చెబుతుంది.

ఇవన్నీ మానవత్వపు పరిమళాలు వెదజల్లిన కథలు. కొన్ని చోట్ల సంభాషణలు రాయలసీమ యాసలో ఉన్నా కథా గమనానికి ఏ మాత్రం అడ్డుతగలవు. రాయలసీమలోని చిన్న సన్నకారు రైతుల వ్యధల గురించి తెలుసుకోవాలంటే ఈ కథల సంపుటి చదవాల్సిందే.

You Might Also Like

3 Comments

  1. రానారె

    సోమశంకర్‌గారే పరిచయం చేశారే! ఈ సంపుటిలో ‘దిగంబరం’ అనే కథ కూడా వుందా? ఉన్నా లేకున్నా కొని చదవాల్సిందేననుకోండి. కానీ పదేళ్లక్రితం ఆ కథను కడపరేడియోలో విన్నప్పుడు కలిగిన ఉద్వేగం మాత్రం మరపురానిది.

  2. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి కవిత -కళ్ళం « సృజన – అనుసృజన

    […] కొత్తదుప్పటి కథల సంకలనం లోని రైతు కథల సారమంతా ఈ కళ్ళం కవితలో ఉందని నాకనిపించింది. మీరేమంటారు?   […]

  3. “కొత్త దుప్పటి” కథల సంపుటి « సృజన - అనుసృజన

    […] పుస్తకం.నెట్ ప్రచురించిది. ఈ లింక్‌ లో వ్యాసాన్ని […]

Leave a Reply