Outcast – Mahaswetha Devi

24957 Outcast మాహాశ్వేతాదేవి రాసిన 4 కథల సంకలనం. కథలు నాలుగే అయినా పాఠకులపై చాలా ప్రభావం చూపగలిగే కథలు ఇవి. మహాశ్వేతాదేవి గొప్ప సామాజిక స్పృహ ఉన్న రచయిత్రి అనిపించింది నాకు ఈ పుస్తకం చదువుతూంటే. రచనకు సామాజిక ప్రయోజనం ఉండాలి, రచయిత కు సామాజిక బాధ్యత ఉంది అన్న ఉపన్యాసాలను చేతల్లో చూపే వారిలో ఈమె కూడా ఒకరు అని అర్థమైంది. Outcast లోని నాలుగు కథలూ బెంగాలీ లో రాయబడినవి. శర్మిష్ట దత్త గుప్త వీటిని ఆంగ్లం లోకి అనువదించారు.

బెంగాల్ లోని గిరిజన జాతుల, ఆదివాసీల జీవితం చుట్టూ తిరిగే కథలే అన్నీనూ. వారి జీవిత చిత్రణ చాలా సహజంగా ఉంది. వారిలోని సాంప్రదాయాలు, వారి అలవాట్లు, వారి లోని తెగలు ఇలాంటి విషయాలెన్నో తెలిసాయి ఈ కథలు చదువుతూ ఉంటే. వారి జీవితాల్లోని విషాదాన్ని చాలా హృద్యంగా మన ముందుంచారు రచయిత్రి. అమాయకంగా వారు ఇటుక బట్టీ సర్కార్ల మాయలో పడడం, మరికొందరు మంచి పని దొరుకుతుందన్న ఆశలో వెట్టి చాకిరీ లో చిక్కుకోవడం, అమ్మాయిల జీవితాలు వారి లోని అమాయకత్వం వల్ల , అసహాయత వల్లా, అన్నింటినీ మించి ప్రజల క్షేమం పట్టని ప్రభుత్వం వల్లా – ఎంత దయనీయంగా మారాయో చదువుతూంటే నే నైరాశ్యం, దిగులే కాదు , ఆవేశం, ఆగ్రహం , ఆలోచనా కూడా కలగక మానవు.

కథలన్నింటిలోనూ – సిరివెన్నెల గారు “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని” అని రాస్తే ఈమె దాన్ని పాటిస్తున్నట్లు అనిపిస్తుంది. కొన్ని చోట్ల narrator గా ఆమె వేసే విసుర్లూ, ప్రశ్నలూ చాలా సూటిగా తాకుతాయి. ఈ పుస్తకం వెనక ఇచ్చిన రెండు వ్యాసాలూ సాంఘిక అసమానతలనూ, అన్యాయాలకూ, అత్యాచారాలకు గురౌతున్న గిరిజనుల జీవితాలను మన ముందు ఉంచుతాయి. ఈ వ్యాసాల్లో కనబడ్డ సత్యాలన్నీ కథల్లో పాత్రలు గా మన ముందు ఉంచారు రచయిత్రి. వాస్తవాలను ఈ విధంగా కథల రూపం లో చెప్పడం ద్వారా, చివర ఉన్న ఆ వ్యాసాలు మాత్రమే చదివితే కలిగే స్పందన కన్నా తీవ్రమైన స్పందననే కలిగించారు పాఠకుల్లో.

ఆ ఆదివాసీల ఈ పరిస్థితి కి ఒకానొక కారణం నిస్సహాయత, అమాయకత్వాలు అయితే అన్నింటికంటే పెద్ద కారణం పేదరికం. అసలు వారంతా ఎంతగా exploit కాబడుతున్నారో చదువుతూ ఉంటే చెప్పలేనంత ఆవేశం కలిగింది. రాయలేనన్ని ఆలోచనలు కూడా చుట్టుముట్టాయి. ఎందుకు? ఎందుకిలా? అన్న ప్రశ్న ఈ పుస్తకం మూయగానే కలిగే మొదటి ప్రశ్న. పుస్తకం అడుగుగడుగునా చదువరి ని వెంటాడే ప్రశ్న కూడా ఇదే కావొచ్చు. మహాస్వేతా దేవి గురించి విని ఉండడమే కానీ ఎప్పుడూ చదవలేదు. ఇలాంటి రచనల అవసరం ఎంతటిదో ఇది చదువుతూంటే కానీ అర్థం కాలేదు. నాలుగు కథలు – Dhouli, Shanichari, The Fairy tale of Rajabasha,Chinta. రకరకాల సమస్యలు. బాధితులు మాత్రం ఒక జాతే.

కదిలించే పుస్తకం ఇది. ఆలోచింపజేసే పుస్తకం ఇది. అడవి తల్లి పిల్లల జీవితాలను వారి కాలం లోనే జీవిస్తున్నా, వారి జీవితాలు తెలీని మాడ్రన్ మనుష్యులకి, ది సో కాల్డ్ సివిలైజ్డ్ సంఘానికి – పరిచయం చేస్తూ – వారి అంతరంగాన్ని ప్రశ్నించే పుస్తకం ఇది.

*************************
పుస్తకం వివరాలు:
Outcast : Four Stories – Mahaswetha Devi
Translated by Sarmistha Dutta Gupta
Calcutta, Seagull, 2002
114 pages.
ISBN 81-7046-189-8.

**************************

You Might Also Like

One Comment

  1. perugu

    మంచి పరిచయం..
    ఇలాంటి రచనల వల్ల పర భాషా
    రచనలు ఏ రకంగా వస్తున్నాయో తెలుస్తుంది..!
    అభినందనలు..!

Leave a Reply