వాక్యకోవిదుడు హనుమంతుడు

వ్యాసకర్త: కె. చంద్రహాస్
************
ఈ వ్యాసం ‘రామాయణంలో హనుమంతుడు’ అనే పుస్తకం గురించి. పుస్తకంలో పూజలూ, పునస్కారాలగురించిన విషయాలు ఏవీ లేవు. మతపరమైన ప్రస్తావనలు అసలే లేవు. ఇది పూర్తిగా హనుమంతుడిగురించి. వాల్మీకి రాసిన హనుమంతుడు ఈ పుస్తకంలో కనిపిస్తాడు. ఆ హనుమంతుడి వ్యక్తిత్వంగురించే ఉషశ్రీ రాశారు. కాబట్టి దీన్ని అన్ని మతాలవారూ చదవచ్చు. కొందరు శీర్షికను చూసి చదవరేమో అన్న అనుమానంతో ఈ మాట ముందే చెబితే మంచిదని ఇలా మొదలుపెట్టాను.

మనలో చాలామందికి ప్రపంచంలో జరిగే వూసులన్నీ కావాలి. ఉదాహరణకి — నా మిత్రుడొకడున్నాడు. పేరుతో పన్లేదు. అతనెప్పుడూ ఇతరుల జీవితాల్లోకి తొంగిచూస్తూ వుంటాడు. అదొక జబ్బు. ఫోను చేసి, అతను అడిగే ప్రశ్న: “సాయంకాలం ఇంట్లో వుంటావా?”
“వుండను”
“ఏం?”
“వేరే పని వుంది.”
“ఏం పనబ్బా?”
ఫలానా.
“ఈ వూళ్ళోనేనా?”
“కాదు.”
“మరే వూళ్ళో?”
“…”
“ఎప్పుడు తిరిగివస్తావు?”
ఇలా, ప్రశ్నలపైన ప్రశ్నలు సంధించి, తినేస్తాడు. ఏదో సాకు చెప్పి, ఫోను కట్టేయక తప్పదుకదా?

నాకు తెలిసిన మరో పెద్దమనిషిది ఇంకోరకం నస. ఇంకో మూడు నెలలకి హైదరాబాదులో వున్న ఇతనికి ప్రమోషన్ రావాలి. ఢిల్లీలో పై పదవి. తప్పక వస్తుందికూడా. ఆయన చేయాల్సిందల్లా వూరికే వుండాలి. ఏలా? కుదరదే! నోటి దురద. ఆ పైఅధికారికి ఇతనంటే సదభిప్రాయమే. అంతకుమించి చాలాకాలంగా తెలిసినవాడే. ఒకవిధంగా స్నేహితుడనే చెప్పుకోవాలి. పెద్దమనిషి పనికట్టుకుని ఢిల్లీ వెళ్ళి పైఅధికారి ఇంట్లో మకాం వేశాడు. ఇంతవరకూ ఫరవాలేదు. ప్రమాదమూ లేదు. సదరు పైఅధికారికి ఉదయమే లేచి కాఫీ పెట్టుకోవడం అలవాటు. అదే సమయానికి ప్రమోషన్ రావలసిన మన మహాశయుడూ గంటకొట్టినట్లు లేచి, కాఫీ కలుపుకుంటున్న పైఅధికారికి సుత్తి కొట్టడం మొదలెట్టాడు. ఇలా రెండు రోజులు గడిచాయి. పైఅధికారికి విసుగు, కోపం. వీడు పొద్దుటే ఎందుకులేవాలి అనుకున్నాడు. వీణ్ని ఇంట్లో వుండమనడం తప్పయిపోయిందే అనుకున్నాడు. రేపు ఈ మనిషికి ప్రమోషను వస్తే, నా పక్క రూములో కూర్చుని ఇంకెంత హింసిస్తాడోకదా అని దిగులు చెందాడు. ఎలా అని దీర్ఘాలోచన చేశాడు. అంతే! ఆ ప్రమోషన్ రాకుండా అడ్దుపడ్డాడు. రావలసిన ప్రమోషను ఆగిపోయింది. నిజం. కారణం? మన మహాశయుడికి ఎవరితో ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియనందువల్ల.

నేను పరిచయం చేస్తున్న పుస్తకానికి ఇంత ఉపోద్ఘాతం చాలా తప్పు. అనవసరం. ఎందుకంటే పుస్తకమంతా ఎవరితో ఎప్పుడు, ఎంత, ఎలామాట్లాడాలి అనే విషయంపైనే. వేసిన బాణమూ, నోటి మాటా తిరిగిరాదు అంటారు. అది నిజం. ఒకే ఒక్క తప్పుమాట కారణంగా, ఎన్నో సంవత్సరాల స్నేహాన్ని పోగొట్టుకున్నవారు నాకు తెలుసు. మనం మాట్లాడే మాటపై మనకు నియంత్రణ వుండాలి. మంచి మాటను చెప్పడానికి తొందరపడాలి. పెద్దలు చెప్పినట్లు చెడు చెప్పేముందు, చెడు మాట్లాడేముందు బాగా ఆలోచన చేయాలి, సమయం తీసుకోవాలి. తప్పదు అనుకుంటెనే చెడు మాట్లాడాలి. దీనర్థం చెడును సమర్థించాలని కాదు.

కార్యసాధకులు తమ కార్యక్రమ నిర్వహణలో ఎవరితో ఎలా, ఎంత మాట్లాడాలో చెప్పే పుస్తకమే “రామాయణంలో హనుమంతుడు”. భారత, రామాయణ, భాగవత కావ్యాలనీ, వాటి సారాన్నీ చాలా సరళంగా, పామరులకు కూడా మనసుకు హత్తుకునేలా, అర్థమయ్యేలా రేడియో మాధ్యమంద్వారా వివరించిన ఖ్యాతి ఉషశ్రీ గారికే చెందుతుంది. తన ప్రసంగాలను ఆధారం చేసుకొని వాటినే పుస్తకాలుగా రాశారు. ఆ పుస్తకాలూ అంతే క్లుప్తంగా వుంటాయి. అందరికీ సులువుగా అర్థమవుతాయి. ఆకట్టుకుంటాయి. కానీ విన్న శ్రోతల భాగ్యమే భాగ్యం. ఆయన భారతమూ, ధర్మ సందేహాల ప్రసంగాన్ని ఆదివారం live గా రేడియోలో ప్రసారం చేసేవారు. ఆయన ప్రసంగాన్ని వినడానికి రోడ్లు నిర్మానుష్యమయ్యేవి. అందరూ రేడియోకు చెవులు అప్పగించి మంత్రముగ్ధులై వినేవారు. వీరి భారత, రామాయణ, భాగవత ప్రసంగాలు 12 ఏళ్ళు నిరాటంకంగా, జనరంజకంగా సాగాయి.

ఆయన “రామాయణంలో హనుమంతుడు” అన్న పుస్తకాన్ని రచన చేయడం మొదలుపెట్టారు. వారు దాన్ని ఎందుకు రాయాలనుకున్నారో ఆయన మాటల్లోనే:

“రామాయణంలో హనుమంతుని వెంట అనుదినం ఒక గంట తిరుగుతూంటే మన ధీశక్తి వికసించి దానిని ఎదుటి వారికి తెలిపే సంభాషణా చాతుర్యం లభిస్తుంది. కిష్కిందలో హనుమత్ ప్రవేశం నుండి చివర రామ పట్టాభిషేక పర్యంతం ఈ ధీమంతుని వెంట సావధానచిత్తులై నడవండి. కొంతలో కొంతయినా మాట్లాడే శక్తి అలవడుతుంది.”

పుస్తకాన్ని రాయడం ప్రారంభించారు గానీ అది పూర్తి అవకముందే 1990 లో వారు పోయారు. వారి అమ్మాయి Dr. గాయత్రీదేవి ఆయన ప్రసంగాల అధారంగా, వారి మాటల్లోనే దాన్ని పూర్తి చేసి 1992 లో ప్రచురించారు. పుస్తకం ముందుమాటలో ఈ విషయం చెప్పారు. Dr. గాయత్రీదేవికి కృతజ్ఞతలు. మాట్లాడడం అనే విద్య నేర్చుకోవాలనుకున్నవారికి హనుమంతుడే గురువనీ ముందుమాటలో రాశారు.

నేను పుస్తకం చదివి చాలా బాగావుందే అనుకున్నాను. పుస్తకమంతా 84 పేజీలే. అందులో ప్రతి పదం, వాక్యం ఆకట్టుకున్నాయి. హనుమంతుడు ఇంత గొప్ప వ్యక్తా అని ఆశ్చర్యపోయాను.
ఈ పుస్తకానికి ఆధారం వాల్మీకి రామాయణం. సంస్కృత శ్లోకం తెలుగు లిపిలో ముద్రించారు. దానికింద తెలుగులో ఆ శ్లోకం గురించి వుంటుంది. ఉషశ్రీ వ్యాఖ్యానం అంతా ఈ శ్లోకాలను ఆధారం చేసుకుని చెప్పారు. అంటే ఆయన చెప్పిన ప్రతిమాటకీ వాల్మీకి రామాయణమే ఆధారం.

పుస్తకంలో హనుమంతుణ్ని ఉషశ్రీ ప్రవేశపెట్టే విధానమిది:

“ప్రవేశిస్తున్నాడు, రామాయణ హనుమంతుడు. కొద్ది క్షణాలు ఆ మేరునగధీరుని వెంట, శబ్ద బ్రహ్మవేత్త పదాలలో ధ్యానముంచండి. ఆ తరువాయి ముక్కుపుటాలకు త్రాళ్ళుపోసి లాగుతాడు. మీ ధీశక్తిని వికసింపజేసి మానవత్వాన్ని ప్రవృద్ధం చేస్తాడు.”

హనుమంతుడు వాక్యకోవిదుడు అనే విశేషణంతో పాత్రను ప్రవేశపెడతారు వాల్మీకి. అంటే మాట్లాడడం అనే విద్య తెలిసినవాడు హనుమంతుడు. ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎంత మాట్లాడాలో తెలిసిన వాడు హనుమంతుడు. పుస్తక సారాంశమూ ఇదే. హనుమంతుడు వేర్వేరు వాళ్ళతో ఎలా, ఎంత మాట్లాడుతారో, ఆయన ఎంత వాక్యకోవిదుడో చెపుతారు ఉషశ్రీ. ఈ చిన్న పుస్తకంలో చెప్పిన విషయాలు అందరికీ ఉపయోగపడుతాయని నా విశ్వాసం.

సుగ్రీవుడు భయస్తుడు. వాలిదెబ్బకి పిరికితనం అలవడుతుంది. అల్లంతదూరాన దనుర్భాణాలు చేతబట్టి నడచివస్తున్న రామలక్ష్మణులను చూసి బెదిరిపోతాడు. హనుమంతుడు ఆయన సచివుడు. అతన్ని భయపడవద్దని చెప్పి, కామరూపికాబట్టి, బిక్షు రూపంలో వాళ్ళ వద్దకి వెళ్తాడు. మీరెవరో రాజర్షుల వలె, దేవతామూర్తులవలె వున్నారు అని ప్రశంస చేస్తాడు. ఇలాంటి పొగడ్త నిజమైనప్పడు ముఖస్తుతి అనిపించుకోదు. కానీ వాళ్ళు బదులు పలకరు. కారణం? ఎదుటి మనిషి ఎవరో తెలియదు. అప్పుడు హనుమ తానెవరో చెపుతాడు. హనుమంతుడి మాటలు విన్న రాముడు అతని మాటతీరుని బహువిధాలా లక్ష్మణుడితో ప్రశంసించి —

“నా నృగ్వేద వినీతస్య
నా యజుర్వేద ధారిణః
నా సామవేద విదుషః
శక్య మేవం విభాషితుం”
అంటాడు. అంటే “ఋగ్వేద వినీతుడు, యజుర్వేదధారి, సామవేదవిదుడు అయినవాడు తప్ప ఇలా మాట్లాడలేడు” అన్నాడు.

చివరికి, హనుమంతునికి రాముడు ఇచ్చిన కితాబు ఇది:

“కత్తిదూసి మీదికి వచ్చే శత్రువైనా ఈ మాటలువింటే చేతులు జోడించి తలవంచాలి… ఇతనివంటి దూతను సంపాదించిన రాజు సాధించనిది లేదు.”

ఒక్క హనుమంతుడినే అలా పొగుడుతాడు రాముడు. రామాయణంలో ఇంకెవరికీ ఈ గౌరవం దక్కలేదు. సుగ్రీవుడు రాజయ్యాడు. రాముని కార్యం మరచిపోయాడు. మళ్ళీ హనుమంతుడే రంగంలోకి దిగి “రాజ్యం లభించింది…మిత్రకార్యం అవశ్య కర్తవ్యం” అని సుగ్రీవునికి జ్ఞాపకం చేస్తాడు. హితవు చెప్తాడు. తరువాత సుగ్రీవాజ్ఞ. జాంబవంతుని ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్రలంఘనం చేసి లంకా నగరం చేరుకుంటాడు.

అశోకవనంలో వున్న స్త్రీ సీత అని గుర్తిస్తాడు. ఆమె ఆత్మహత్యకి పాల్పడుతోంది. ఆలస్యం అయితే నష్టం. తను ఎవరో చెప్పడం మొదలుపెట్టవచ్చు. కానీ ఆ కొంత సమయంలోనే అనర్థం జరిగిపోవచ్చు. తనని ఇంకోరూపంలో వచ్చిన రావణుడు అని ఆమె అనుకోరాదు. రాముడి గురించి మాట్లాడితే అదీ రావణుడి మోసమే అని ఆమె తలచవచ్చు. ఎలా? మీమాంసకు సమయం లేదు. దశరథ మహారాజు గురించి చెప్పడం మొదలుపెడతాడు హనుమ. ఈ దశరథ మహారాజును ప్రస్తుతించే మాటలు రావణుడికో, అతని అనుచరులకో తెలిసే అవకాశం లేదు. ఇతనెవరో రాముడి తాలూకు మనిషి అని సీతాదేవి అనుకుంటుంది. అంతే. ఆమె ఆగిపోతుంది. తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. హనుమంతుని మాటల్లోని బలమూ, విలువా అంత అన్నమాట.

తర్వాత రావణుడి సభలో. ముందు లంకా నగరంలోని వుద్యానవనాలను ప్రశంస చేస్తాడు. రావణుడి కోపం తగ్గేలా మాట్లాడాడు. రావణుడు వినే స్థితికి వచ్చిన తరుణం కనిపెట్టి తను వచ్చిన విషయం చెపుతాడు. రాముడి స్తోత్రం చేస్తాడు. తనలాంటి వీరులు సుగ్రీవుని సైన్యంలో కోకొల్లలు అంటాడు. రావణుడుకి శత్రువు బలం చెప్పి బుగులుపుట్టించాడు. ఆయన ప్రసంగ శైలి గురించి ఉషశ్రీ ఇలా అంటారు: ‘అంతటి ఆగ్రహంలో వున్న రావణుడు కూడా వింటూ మౌనంగా వుండిపోయాడు.’ లంకాదహనం తర్వాత తిరుగుప్రయాణం.

వానరులంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని హనుమంతుడికోసం సముద్రం ఒడ్దున చూస్తూ వుంటారు. సీతాదేవి ఆచూకీ తెలియలేదు అని హనుమంతుడు అంటే సుగ్రీవాజ్ఞ అమల్లోకివస్తుంది. అందరికీ చావు తప్పదు. అట్లా ఎదురు చూస్తున్నవాళ్ళకు ముందుగా గుండెదిటవు కలిగించాలి. అందుకే ఆకాశంనుండే సింహనాదం చేస్తాడు. దిగుతూ “దృష్టా సీతా” అన్నాడు. చూశాను సీతను అన్నాడు. “సీతా దృష్టా” అనడు. సీతను చూశాను అనడు. ముందు ‘సీతా’ అంటే తర్వాత మాట ‘చూశాను’ కావచ్చు లేదా ‘చూడలేదు’ అయినా కావచ్చు. చూశాను అనడం ముఖ్యం. లేకపోతే కొంతమంది అర్భకులు హతాశులై ప్రాణాలు విడిచేస్తారు. అందుకే ముందు ‘దృష్టా’ అన్నాడు. వానరులంతా హాయిగా వూపిరిపీల్చుకున్నారు. అదీ హనుమంతుడి మాటతీరు.

ఆ కార్యశూరుడు తన వానర సహచరులతో అన్ని విషయాలూ, అంటే తను లంకలో చూసినవీ, చేసిన విధ్వంసం, లాంకాదహనం, వగైరాలు చెబుతాడు. కానీ సీతమ్మ రాముడికి చెప్పమన్న మాటలు వాళ్ళకు చెప్పడు. ఆ మాటలు వీరికి అవసరం లేదు. రామునితో తన సహచరులతో పంచుకున్న వూసులేవీ ప్రస్తావించడు. సీతాదేవి మాటలే చెబుతాడు. ఆమె చెప్పమన్నవే చెపుతాడు.

హనుమంతుడు సీతాన్వేషణకు వెళ్ళాడు. ఆ ఒక్క పని అయిపోయిందికదా అని వెనక్కి రాలేదు. ఆ పనితోపాటు ముందుముందు జరగబోయే యుద్ధానికి పనికివచ్చే వివరాలూ సేకరించాడు. ఆ విషయాలూ రాముడికి చెప్పాడు. అదీ హనుమంతుని గొప్పతనం. ఎవరికి ఏది చెప్పాలో, ఎంత చెప్పాలో అంతే. తూకం వేసినట్లు.

యుద్ధం ముగిసింది. అయోధ్యకు వెళ్ళేదారిలో భరద్వాజ మహర్షి ఆశ్రమం. పుష్పకవిమానం అక్కడ ఆగింది. భరద్వాజ మహర్షి ప్రసన్నులై హనుమంతుణ్ని పొగుడుతారు. నువ్వు చాలా గొప్పవాడివి అంటారు. హనుమంతుడు నమ్రతతో చేతులు జోడించి ఏమంటాడో వినండి:

“మహర్షీ ఏమని అంటున్నారు మీరు? ఇదంతా నా గొప్పతనమా? మీ వంటి మహామునుల తపశ్శక్తి నన్ను తీసికెళ్ళింది కాని, నేను సముద్రం దాటగలవాడినా? మీ అనుగ్రహంతో ఇది సాధించాను, ఆశీర్వదించండి.”

హనుమంతుడు ఈ సమయంలోకూడా దర్పాన్ని ప్రదర్శించలేదు అంటారు ఉషశ్రీ.

ఇలా హనుమంతుడు ఒక్కొకచోట ఒక్కోరకంగా, వేరు వేరు వ్యక్తులతో వారికి తగినవిధంగా, సమయోచితంగా మాట్లాడి కార్యసాధకుడయ్యాడు. ఈ పుస్తకం చదివితే ఉషశ్రీ అన్నట్లు కొంతైనా మాట్లాడే శక్తి అలవడుతుంది అని నా విశ్వాసం. ఏ కారణంచేతో అది జరగకపోతే కనీసం ఎప్పుడు, ఏం మాట్లాడకూడదో అన్నవిషయం అవగతమవుతుంది. అది జరిగినా గొప్పే కదా!

ఈ పుస్తకాన్ని దాదాపు పదేళ్ళ కిందట మొదటిసారి చదివాను. పుస్తకం చదివిన తర్వాత కనపడ్డ ప్రతివారికీ దీని గురించి గొప్పగా అదేపనిగా చెప్పేవాణ్ని. ముఖ్యంగా “దృష్టా సీతా” సన్నివేశం అంతా చెప్పేవాణ్ని. నా మిత్రుడు దేవినేని మధుసూదనరావునూ ఈ పుస్తకాన్ని చదవమన్నాను. చదివి, తనకూ చాలా నచ్చిందన్నారు. పుస్తకాలు ఇవ్వడం అంటే ఆయనకు మహా ఇష్టం. మంచి పుస్తకాలను తెలిసిన ప్రతి ఒక్కరికీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత చదివారా అని, ఎలా వుంది అని అడిగి అప్పుడప్పుడు మొహమాటంకూడా పెట్టేస్తారు. అది వేరే సంగతి. ఈ పుస్తకం స్నేహితులకు యివ్వాలి అనే నిర్ణయానికి వచ్చేశారు. మధుసూదనరావు వూరుకునే మనిషికాదు. వెంటనే ఉషశ్రీగారి అమ్మాయిని కలిసి, పుస్తకం కాపీలు కావాలి అని అడిగారు. కాపీలు లేవు. పుస్తకం out of print. అలాంటి సమాధానం ఆయనకు నచ్చదు. మంచి పుస్తకం ఎప్పుడూ అందుబాటులో వుండాలి అనే తత్వం ఆయనది. పుస్తకాన్ని మళ్ళీ ముద్రించారు. ఖర్చు తనదే అన్నారు. అలా పుస్తకం రెండో ఎడిషన్ 2003 లో వచ్చింది. మధుసూదనరావుద్వారా ఆ పుస్తకం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళింది. చిన్నపుస్తకమేకదా. ఆయనకూడా పుస్తకాన్ని చదివి చాలా బాగుందే అనుకున్నారు. అంతేకాదు. దీన్లోని సారాంశం అందరికీ తెలిస్తే బాగుంటుందని, దీన్లో చెప్పింది కొంతయినా పాటిస్తే చాలుకదా అనుకున్నారట. దాదాపు 500 కాపీలు కొనిపించారనీ, వాటిని మంత్రులకూ, ప్రజా ప్రతినిధులకూ, అధికారులకూ పంచిపెట్టించారనీ, చదవమని ఆర్డరుకూడా వేశారని నమ్మదగినవారు చెప్పగా విన్నాను.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి తుమ్ములూరి సూర్యనారాయణ అనే యువకుడు (వృత్తిరీత్యా Engineer U.S.లో) “Words! Mighty Words!” అనే పేరుతో అనువాదం చేస్తే 2007 లో ప్రచురించారు. ఉషశ్రీ తన రేడియో ప్రసంగాలను “స్వ..స్తి” మాటతో ముగించేవారు. ఆయనకు భక్తితో, ఈ పరిచయానికి స్వస్తి.

పుస్తకం వివరాలు:
రామాయణంలో హనుమంతుడు
ముద్రణ: జనవరి 2003 రెండవ ఎడిషన్
ప్రచురణ: ఉషశ్రీ మిషన్, విజయవాడ
ప్రతులకు: అక్షర, నవోదయ
ధర: Rs. 25

ఇంగ్లీష్ పుస్తకం వివరాలు:
“Words! Mighty Words!”
Year of publishing: 2007
Publisher: Ushasree Mission, Vijayawada
Price: Rs.50/ $ 5

You Might Also Like

13 Comments

  1. Ravindranath Muthevi

    హనుమంతుడి వాక్పటిమ పై ఉషశ్రీ గారు రాసిన పుస్తకం పరిచయం చాలా బాగుంది.దానిలో వచ్చిన మధుసూదన రావు గురించిన ప్రస్తావన నూటికి నూరు పాళ్ళూ నిజం.ఎవరికైనా ఏదైనా పుస్తకం ఇచ్చి,అది వారు చదివి అభిప్రాయం తెలిపేవరకూ వెంటబడతారని.

  2. Madhu

    Ushasri Mission has published this book with the title”everitho ela matladali” ( how to talk with others) . This book is available with Ushasri Mission only. Mobile: 98481 13681 or 98485 98797 and with Dr Gayatri Devi 022-22183149 at Mumbai. This book is worth to be read by all students, who wants to improve their communication skills

  3. akondi sundari

    hanu manthuni vakya niraana saili o adbhutam.endukante ayana vyakarana brahma kadaa!.ika ushasree garu vennamaddallanti vakyaalatho visleshana chesaaru.paraadbhutham.

  4. కొత్తపాళీ

    చాలా బావుందండీ. నేను విజయవాడ లొయొలా కాలేజిలో ఇంటారు చదువుతున్నప్పుడూ ఏదో సందర్భంలో ఉషశ్రీగారు ముఖ్యవక్తగా వచ్చి సరిగ్గా ఇదే విషయం మీద మాట్లాడారు.

  5. సౌమ్య

    Interesting. Thanks for the review.

  6. jayasree

    Several times and not once, this book should be read. For certain, we get influenced by Hanumanthudi character and Ushasri’s beauty of presenting Hanumanthudu. And one very important point is ‘Hanumanthudi Sanskaram’.Particularly these days, this has become a scarce commodity!

    Chandrahasgaru has added flavor to it like adding ghee finally to bring richness and taste to ‘payasam’!
    Enjoy this delicious book!

  7. Srinivas Nagulapalli

    మంచి అంశం, మంచి సమీక్ష. కృతజ్ఞతలు.

    భారతీయులకు Superman ఉన్నాడా అంటే, ఎవరో Superman కు ముందే ఉన్న Hanuman అన్నారట.

    ఏమైనా, “దృష్ట్వా సీతా” అని హనుమంతుని చేత పలికించిన వాల్మీకి శ్లోకాన్ని అనుసరించడమే గాక, ఇంకొంత ముందుకు తీసుకువెళ్ళి వ్రాసిన తెలుగు పద్యం గుర్తొచ్చింది, “సంపూర్ణ రామాయణం” సినిమాలో.

    “కనుగొంటిన్ కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనా
    జననిన్ రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో
    అనిశంబున్ భవదీయ దివ్యపదపద్మారాధనా దీక్షయై
    దినముల్ లెక్కిడు చుండె మిమ్ముగన తండ్రీ రామచంద్ర ప్రభూ!”

    ఒక్క సారి కాదు, రెండు సార్లు “కనుగొంటి” అని పలకడంలో ద్వ్హనింపజేసిన ఉత్సాహం ప్రాముఖ్యత,
    చాలా సహజంగా సార్థకంగా అనిపిస్తుంది. మధురంగా ఘంటసాల గళంలో వినిపిస్తుంది. లక్ష్మణయతీంద్ర కవి “తండ్రీ రామచంద్ర ప్రభూ” అనే మకుటంతో శతకం వ్రాసారు. ఇది దానిలోనిదో కాదో తెలియదు.

    హనుమంతుడు ఎంత వాక్యకోవిదుడో అంతకు మించిన కార్యశీలుడు. చేపట్టిన కార్యం పూర్తి అయ్యేదాకా దృష్టిని మరల్చకపోవడం, విశ్రమించకపోవడం పిల్లలకు సైతం కళ్ళకు కట్టినట్లు చెప్పే సముద్రయానం కథ అందుకే ఇన్ని తరాలవారినీ ఆకర్షించి ఆకట్టుకుంటూ ఉందనిపిస్తుంది.
    ============
    విధేయుడు
    శ్రీనివాస్

  8. chavakiran

    ఈ పుస్తకం కినిగెలో ఈపుస్తకంగా కూడా లభిస్తుంది. http://kinige.com/kbook.php?id=74

  9. Kosaraju Chowdary

    The article is really well written I hope you will contribute more such articles.

  10. K V Chowdary

    I am grateful to Mr Chandrahas and Mr Madhusudan Rao for introducing me to this book
    I have been immensely benefited by it
    I have chanted and read Maharshi Valmiki’s Sundara Kandam. As I read this book earlier, my benefit from reading Sundara Kandam was better and easier.
    This article very crisply summarises the book, a quality for which the author is known for.
    I am told that a batch of Management students studied this book as part of their education in communication.

  11. వీరభద్రం

    హనుమంతుడు సూర్యుని దగ్గర నవ వ్యాకరణాలు నేర్చుకున్నాడట.పాణిని అష్టాధ్యాయి తర్వాత మిగిలిన వ్యాకరణాలు మరుగున పడిపోయాయేమో.

  12. cbrao

    హనుమంతుడి నడవడిక తెలుసుకోవడం ద్వారా, మాట తీరు, వ్యక్తిత్వ వికాసం పెంచుకోవచ్చనే ఉషశ్రీ గారి పరిశీలనతో ఏకీభవించకుండా ఉండలేము. సమీక్ష ఏకబిగిన ఆసక్తిగా చదివించింది.

  13. murthy

    ఒక మంచి పుస్తకాన్నిపరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు.ఈ శీర్షికకు వ్యూస్ ఇంకా పెరుగుతాయి అనుకుంటా.
    “దృష్టా సీతా” గురించి ఎమ్మెస్ రామారావు గారి సుందరకాండ లో విన్నా గానీ వివరణ తెలిసాకా అద్భుతం అనిపించింది.

Leave a Reply