మైదానంలో తెల్ల బట్టల పులి కథ– పటౌడీ నవాబు Tiger’s Tale

ఇప్పుడు నేను పరిచయం చేస్తున్న పుస్తకాన్ని ఆఖరుసారి నేను చూసి కనీసం 33 సంవత్సరాలు అయ్యుంటుంది. ఐనా ఇన్నేళ్ళ తర్వాత ఆ పుస్తకం గురించి చెప్పాలని అనిపించింది. ఈ పరిచయం నేను ఇంతకు ముందు చేసిన పరిచయాలకన్నా భిన్నమైనది. ఇది కేవలం పుస్తకపరిచయమే కాదు; ఒకప్పుడు నేను, నా మిత్రులు చాలా అభిమానించిన ఒక క్రీడాకారుడి మరణానంతర స్మరణ కూడా. ఈ సొంతగోల ఇక్కడ మాకెందుకూ అనుకొనే వారందరికీ ముందుగానే నా క్షమాపణలు.

ఈ పుస్తకం ఇప్పుడు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది కాదు. క్రికెట్ వార్తలు చదువుతున్నప్పుడో, షర్మిలాటాగూర్, సయిఫ్అలీఖాన్, సోహాఅలీఖాన్‌ల సినిమాలూ, ఫొటోలూ చూస్తున్నప్పుడో, గ్వాలియర్ సూటింగ్ ప్రకటనలు చూసినప్పుడో, వికలాంగుల గురించి విన్నప్పుడో, వారి విజయాలను గురించి చదువుతున్నప్పుడో ఈ పుస్తకం గుర్తుకు వస్తూనే ఉంటుంది.

ఈ పుస్తకం నేను కొనుక్కున్న, చదివిన మొదటి క్రీడా జీవిత కథ (sports biography). నాకు క్రికెట్ ఆట పరిచయమైన రోజుల్లో (1969లో లయోలా కాలేజీలో పీయూసీ చదువుతున్నప్పుడు) ఆంధ్రదేశంలో టెలివిజన్ లేదు; మిగతా దేశంలో టెలివిజన్‌లు ఉన్న చోట కూడా క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలు లేవు. ఆకాశవాణిలో (విదేశాల్లో ఐతే వారి రేడియోకేంద్రాలు వేళగానివేళ షార్ట్‌వేవ్ రేడియోలో సిగ్నళ్ళు వెతుక్కుంటూ) వినే ప్రత్యక్ష ప్రసారాలు, మరునాడు ఇంగ్లీషు దినపత్రికలలో రిపోర్టులతోనే క్రికెట్ వార్తలు తెలిసేవి. ఐనా అభిమానుల హృదయాల్లో మాత్రం క్రికెట్ ఆటగాళ్ళకు సినిమాహీరోలతో సమానంగా (ఒకోసారి అంతకు మించిన) స్థానం ఉండేది.

అప్పట్లో ఆంధ్రాలో ఇద్దరు క్రికెట్ ఆటగాళ్ళంటే చాలా మోజు ఉండేది. ఒకరు హైదరాబాదు రంజీ ట్రోఫీ జట్టు నాయకుడు ఎం.ఎల్. జయసింహ; రెండవ వారు: భారత క్రికెట్ జట్టు నాయకుడు నవాబ్ ఆఫ్ పటౌడీ జూనియర్ (అప్పటికింకా రాజభరణాలు రద్దుకాలేదు; అతన్ని పటౌడీ, పటౌడీ నవాబ్ అనే వ్యవహరించేవారు). 1969లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలతో ఇండియాలో జరిగిన టెస్టు పరంపరలో క్రొత్త బాట్స్‌మెన్, ఆల్‌రౌండర్లకు స్థానం కల్పించి పరీక్షిస్తున్న రోజులు. జయసింహకి అప్పటికే టెస్టుల్లో స్థానం పోయింది. కానీ, కెప్టెన్ పటౌడీ మీద అభిమానం, ఆశలు.

అప్పటికే నవాబ్ ఆఫ్ పటౌడీని చాలా గ్లేమర్ ఉన్న సినిమా హీరోయిన్ షర్మిలా టాగూర్ ప్రేమించి పెళ్ళి చేసుకుంది. కుడి కంటి మీదకు ఒక కోణంలో స్టైలుగా వాలిన క్రికెట్ టొపీ, పొడుగు జుట్టు, కొనదేరిన ముక్కు, విలక్షణమైన ముఖం, ఆ ముఖంలో ఒక విధమైన నిర్లక్ష్యంతో పటౌడీ చాలా విభిన్నంగా ఉండేవాడు. అతని ఆటతీరును రేడియోలోనూ, పేపర్లలోనూ వ్యాఖ్యాతలు తెగ ముచ్చటపడిపోతూ అభివర్ణించేవారు. బాటింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ చాలా దూకుడుగానూ, ఆకర్షణీయంగానూ అతని ఆట ఉంటుందని కథలుగా చెప్పేవారు. మాకందరికీ అతను పెద్ద హీరో. 69 సిరీస్‌కు ముందు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ముఖచిత్రంగా వచ్చిన పటౌడీ నవాబు హుక్ చేస్తున్న ఫొటో చాలాకాలం నా హాస్టల్ గదిగోడమీద అంటించి ఉండేది. 1971లో సెలక్షన్ కమిటీ చైర్మన్ విజయ్ మర్చంట్ తన కేస్టింగ్‌వోట్ తో పటౌడీని కెప్టన్సీనుంచి తప్పించినప్పుడు అతనికీ, హైదరాబాదుకీ, ఆంధ్రప్రదేశ్‌కీ, దక్షిణ భారతదేశానికీ చాలా అన్యాయం జరిగినట్లు బాధ పడిపోయాం మేమంతా. కెప్టెన్సీ పోవటానికి కొన్ని నెలల ముందే, ఇందిరాగాంధీ సంస్కరణల పుణ్యమా అని, నవాబుగిరీ కూడా పోయింది; అప్పటినుండీ తన పేరు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అని మార్చుకొన్నాడు.

టైగర్ అన్న బిరుదునామం పటౌడీ క్రికెట్‌లో సంపాదించుకుంది కాదు. పాకులాడే వయసులో నాలుగుకాళ్ళమీద పెద్దపులిలా అటూ ఇటూ పాకేస్తూ చెలరేగిన రోజులనుంచీ ఉన్న ముద్దు పేరు. బాటింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ అతను చూపించే లాఘవానికీ, దూకుడుకీ సరిపోయిందని అభిమానులు, వ్యాఖ్యాతలు ఆ పిలుపునే కొనసాగించారు.

పటౌడీ మీద అభిమానం, ప్రేమ, సానుభూతి మిక్కుటంగా ఉన్న దశలో నాకు Tiger’s Tale పుస్తకం దొరికింది. రైలు ప్రయాణంలో తెనాలి స్టేషన్లో హిగ్గిన్‌బాదమ్స్ పుస్తకాల బడ్డీలో. పేపర్‌బాక్ పుస్తకం. మూడు రూపాయలు అని గుర్తు. అప్పటికింకా ఇంగ్లీషు పేపర్‌బాక్ పుస్తకాలు కొని చదవటం అలవాటు లేదు. టైగర్స్ టేల్ నేను కొనుక్కున్న మొదటి ఇంగ్లీషు పేపర్‌బాక్; మొదటి స్పోర్ట్స్ బయాగ్రఫీ. చాలాకాలం నా చేతిలోనూ, నామిత్రుల చేతుల్లోనూ తెగ నలిగిన పుస్తకం.

మన్సూర్ అలీఖాన్ తండ్రి ఇఫ్తిఖర్ అలీఖాన్ ఢిల్లీకి దగ్గరగా హర్యానాలో ఉన్న పటౌడీ సంస్థానపు నవాబు. మంచి క్రికెట్ ఆటగాడు. ఇంగ్లాండుకీ, భారతదేశానికీ కూడా టెస్టుపోటీల్లో ఆడాడు. తన తొలి టెస్టుపోటీలో సెంచరీ సాధించిన కొద్దిమందిలో ఒకడు. అప్పట్లో ఆయనను నవాబ్ ఆఫ్ పటౌడీగా వ్యవహరించేవారు. కొడుకు కూడా క్రికెట్ ఆడటం మొదలుబెట్టాక ఆయన పేరుకు సీనియర్ అని తగిలించి, చిన్నాయన్ని జూనియర్‌గా వ్యవహరించటం మొదలుబెట్టారు. మన్సూర్ అలీ ఖాన్ తల్లి సజిదా సుల్తాన్ భోపాల్ సంస్థానానికి రాణి (భోపాల్ సంస్థానం పటౌడీ కన్నా పెద్దది, ప్రముఖమైనది). ఒక్కడే కొడుకుగా ఈ రెండు సంస్థానాలకూ వారసుడు మన్సూర్ అలీ ఖాన్. ఐతే హర్యానాకో, మధ్యప్రదేశ్‌కో ఆడకుండా దేశీయ క్రికెట్‌లో పటౌడీ హైదరాబాద్ జట్టుకు ఆడేవాడు. అతని సోదరి కుటుంబం హైదరాబాదులో ఉండేది. జయసింహ లాంటి మేటి క్రీడాకారులతో నిందిన హైదరాబాద్ టీము అప్పటి ఛాంపియన్ బొంబాయితో పోటీ పడగల స్థాయిలో ఉండటం కూడా కారణం కావచ్చు.

మన్సూరాలీఖాన్ చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తండ్రికి మల్లేనే కొడుకు కూడా ఇంగ్లీషు పాఠశాలల క్రికెట్‌లోనూ, తర్వత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ససెక్స్ టీముల్లోనూ మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకొంటూ, లీగ్ బాటింగ్ యావరేజెస్ లీడ్ చేస్తున్న రోజుల్లో,  ఒకరోజు క్రికెట్‌మేచ్ తర్వాత స్నేహితులతో రెస్టారెంటుకు వెళ్ళి కారులో తిరిగివస్తున్నాడు. బస చేస్తున్న హోటల్ ఒక ఫర్లాంగు దూరంలో ఉందనగా, ఆమాత్రం దూరం నడుద్దాములే అని ముందు సీట్లో కూర్చున్న మిత్రులు కారు దిగిపోయారు. నడవడానికి బద్ధకించిన పటౌడీ వెనుక సీట్లోంచి ముందుకు మారాడు.

కొన్ని క్షణాల తర్వాత వారిదారిలోకి అకస్మాత్తుగా వచ్చిన ఒక పెద్దకారుతో వారి కారు ఢీకొంది. పటౌడీ కుడిభుజానికీ, చేతికీ దెబ్బలు తగిలాయి. హాస్పిటల్‌కి వెళ్ళాక కారు పగిలిన కారు అద్దంనుంచి ఒక చిన్న గాజు ముక్క కంట్లోకి దూసుకు వెళ్ళిందని తెలిసింది. అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. కంటి అద్దం కరిగిపోయింది; కంటి గుడ్డును కుట్టేయాల్సి వచ్చింది. ఆ కంటిలో చూపు కొద్దిగానే మిగిలింది. అప్పుడు అతని వయస్సు ఇరవై ఏళ్ళు.

ఒంటికంటితో మాత్రమే చూడగలగటం వల్ల అతని దృక్కోణంలో డెప్త్ పర్సెప్షన్ లేదు. గ్లాసులో నీళ్లు ఒంపుదామనుకుంటే నేల మీద పడుతున్న పరిస్థితి. కంటిచూపు అంతగా దెబ్బతిన్నా క్రికెట్ ఆట మానేయాలి అని అతను ఎప్పుడూ భావించలేదు. పూర్తిగా నెల తిరక్కుండానే, నెట్స్‌లో ప్రాక్టీసుకు వెళ్ళాడు. అలాగే ప్రాక్టీసు చేస్తూ, స్టాన్సు మార్చుకుని, టెక్నిక్‌కి సర్దుబాట్లు చేసుకోవటం మొదలు బెట్టాడు. యూనివర్సిటీ చదువుకు సెలవు పెట్టి ఇండియా వచ్చేశాడు.

వచ్చిన కొన్నిరోజులకే భారతదేశంలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ప్రాక్టీసు పోటీల్లో ప్రెసిడెంట్స్ XI జట్టుకు నాయకత్వం వహించటానికి ఈ కుర్రవాణ్ణి ఎన్నుకున్నారు అతని కంటి విషయం తెలీని సెలెక్టర్లు. కుడికంట్లో కాంటాక్ట్ లెన్స్ పెట్తుకొని బాటింగ్ చేయబోతే రెండేసి బంతులు కనిపించాయి. లెన్సు తీసేసి, ఒక కన్ను మూసుకుని బాటింగ్ చేస్తూ, 70 పరుగులతో అగ్రస్థానంలో నిలచాడు. దాంతో టెస్టు మేచ్ ఆడటానికి సెలెక్ట్ అయ్యాడు.

కారు ప్రమాదంలో ఒక కంటి చూపు దాదాపుగా పోయి, భుజం దెబ్బతిన్న మొహమ్మద్ మన్సూరాలీఖాన్ ఆఫ్ పటౌడీ ఉరఫ్ నవాబ్ ఆఫ్ పటౌడీ జూనియర్, ప్రమాదం జరిగిన ఆరునెలల పన్నెండు రోజులకు భారత జట్టు సభ్యుడిగా మైదానంలో అడుగు పెట్టాడు. ఆడిన రెండవ టెస్టులో 64,32 పరుగులు, మూడో టెస్టులో సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. (కాలక్రమేణా అతను కనిపెట్టిన కిటుకు ఏమిటంటే, కుడికన్ను క్రికెట్ కాప్‌తో కప్పేసి ఎడమకంటితో బాల్‌ను చూస్తూ ఆడచ్చని; స్టైలుగా పెట్టుకునే కేప్ వెనుక కథ అదీ).

మరు సంవత్సరం వెస్ట్ ఇండీస్ పర్యటించబోతున్న భారత జట్టుకు ఈ యువకుణ్ణి ఉపనాయకుడిగా నియమించారు. బార్బడాస్‌తో ఆడుతున్న మేచ్‌లో ఛార్లీ గ్రిఫిత్ విసిరిన బంతితో జట్టు కెప్టెన్ నారీ కంట్రాక్టర్‌ తలకు తీవ్ర గాయమై, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. దాంతో 21 ఏళ్ళ వయసులో, టెస్టు చరిత్రలో అతి చిన్న వయస్కుడైన కెప్టెన్‌గా భారత జట్టు బాధ్యత అతని భుజాలపై అకస్మాత్తుగా పడింది. ఆ బాధ్యతను అతను పదేళ్ళపాటు మోశాడు. వయసులో చిన్నవాడు. ఒక కన్ను సరిగా లేని వాడు. మిగతా ఆటగాళ్ళకంటే విభిన్నమైన ఆర్థిక సాంఘిక స్థాయిలో, వారికి పరిచయం లేని సంస్కృతిలో పరాయిదేశంలో పెరిగినవాడు. మిగతావారందరినీ ఒక త్రాటిపై నడిపించి విజయపథాన పోవడమంటే మాటలా?

దీనికితోడు, ఆ రోజుల్లో భారతదేశానికి ఏ రకమైన పేస్ బౌలర్లూ లేరు. ఫీల్డింగ్ గురించి, శారీరక దృఢత్వం గురించి ఆటగాళ్ళకు పెద్ద పట్టింపులు ఉండేవి కావు. గెలిచే అలవాటు లేదు. గెలుద్దామన్న పట్టుదల, గెలవగలమన్న ధైర్యం తక్కువపాళ్ళలోనే ఉండేయి. దీనికితోడు ప్రాంతీయ స్పర్థలు, అనుమానాలు. ఈ పరిస్థితుల్లో పటౌడీ ఈ జట్టుని విజయం దిశగా నడిపించడం మొదలుబెట్టాడు. బ్యాటింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ జట్టుకు స్ఫూర్తిగా నిలచాడు. క్రికెట్ ప్రపంచంలో మేటి ఫీల్డర్లలో ఒకడుగా పేరు గాంచాడు (యాక్సిడెంట్ తర్వాత బంతి విసిరేప్పుడు భుజం నొప్పి తగ్గి మామూలు స్థాయికి చేరుకోవటానికి ఐదేళ్ళు పట్టిందట. ఐనా..). White Tiger Prowling in the Covers అని వ్యాఖ్యాతలు కీర్తించేవారు. క్రికెట్ పెవిలియన్‌లో భారతదేశం అన్న భావనే ఉండాలికానీ ప్రాంతీయభావనలుండకూడదని గట్టిగా ఉద్బోధించేవాడు. ఎలాంటి పరిస్థితిలోనూ అపజయాన్ని అంగీకరించకుండా పోరాడటం జట్టుకు నేర్పాడు.

పేస్ బౌలర్లు లేకపోతేనేం, తన స్పిన్ బౌలర్లతోనే విజయానికి వ్యూహం పన్నడం మొదలుబెట్టాడు. బాపు నద్కర్ణి, ప్రసన్న, బేడి, చంద్రశేఖర్‌లకు ధైర్యమిచ్చి ప్రోత్సహించాడు. పటౌడీ సారధ్యంలోనే భారతజట్టు విదేశాల్లో తొలిసారిగా టెస్టుమేచ్‌లో  విజయాన్ని, టెస్ట్ సిరీస్‌లో విజయాన్ని (1967, న్యూజిలాండ్) సాధించింది. భారత జట్టుకు కొత్త గౌరవాన్ని తీసుకు వచ్చాడు పటౌడీ.

1968లో భారత జట్టు ఇంగ్లాండు పర్యటనతో ఈ పుస్తకం ముగుస్తుంది. 1970లో కెప్టెన్సీ కోల్పోయిన మన్సూరాలీఖాన్ పటౌడీ వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండు పర్యటనలకు వెళ్ళకుండా, 1971 పార్లమెంటు ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గుర్గావ్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు. 1972లో స్వంత గడ్డ మీద ఇంగ్లండులో జరిగిన పోటీలలో జట్టులో స్థానాన్ని మళ్ళీ సంపాదించుకుని తన బాటింగ్ ప్రతిభ చూపాడు. మళ్ళీ 1975లో వెస్ట్ఇండీస్ జట్టు భారత పర్యటనలో కెఫ్టెన్‌గా ఎన్నికయ్యాడు. 3-2 తేడాతో వెస్ట్ ఇండీస్ జట్టు ఆ సిరీస్‌ను గెల్చుకొంది. ఆ సిరీస్ తరువాత మన్సూరాలీఖాన్ పటౌడీ టెస్ట్ క్రికెట్‌నుంచి విరమిస్తున్నట్టు ప్రకటించాడు. ఆడిన 46 టెస్టుపోటీలలో అతను 40 టెస్టులకి కెప్టెన్సీ వహించాడు.

క్రికెట్‌నుంచి రిటైర్ ఐనా గ్లామరస్ స్టార్ ఇమేజ్ తగ్గలేదు. షర్మిలాటాగూరుతొనూ, సయిఫ్ఆలీ ఖాన్‌తోనూ చాలా ప్రకటనల్లో కనిపించేవాడు. క్రికెట్ మాత్రమే కాక, హాకీ, స్క్వాష్ బాగా అడుతాడని, తబలా వాయించటంలో మంచి ప్రావీణ్యం ఉందని, గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని, ప్రాక్టికల్ జోక్స్ వేయటంలో దిట్ట అని వినికిడి.

పటౌడీకి మంచి చదువరిగా పేరుంది; స్పోర్ట్స్‌వరల్డ్ పత్రిక సంపాదకుడిగా తన సంపాదకీయాలు తనే రాసేవాడు అని చెపుతారు. ఐనా, ఈ పుస్తకం పటౌడీ ఆత్మకథగా చెప్పబడినా, దాదాపు అన్ని స్పోర్ట్స్ బయోగ్రఫీల్లానే దీనికి కూడా ఒక భూత రచయిత ఉన్నాడు. ఈ పుస్తకాన్ని రాసింది కెన్నెత్ వీలర్ (Kenneth Wheeler). వీలర్ నాలుగే ఇంటర్వ్యూలు చేసి ఈ పుస్తకం రాశాడని ఈ మధ్య ఎక్కడో చదివి ఆశ్చర్యపోయాను. అన్ని స్పోర్ట్స్ బయాగ్రఫీలలానే దీన్లోనూ చాలా తెర వెనుక కథలు, మిగతా ఆటగాళ్ళ గురించి ఆసక్తిభరితమైన కథనాలూ ఉన్నాయి. కొన్ని క్రికెట్ మేచ్‌లు – ముఖ్యంగా 1967 ఇంగ్లాండు పర్యటన, 1968 ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల పర్యటనలోవి – చాలా విపులంగా వర్ణించబడ్డాయి (పుస్తకంలో వ్యక్తిగత విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి). చాలా ఫొటోలు కూడా ఉన్నాయి. క్రికెట్ ఆటంటే అమితమైన పిచ్చి ఉన్న టీనేజ్ కుర్రవాళ్ళకి అంతకన్నా ఏం కావాలి? ఆ రోజుల్లో ఈ పుస్తకాన్ని నేను, నా మిత్రులు ఎన్నిసార్లు చదివామో?

అన్ని స్పోర్ట్స్ బయాగ్రఫీల్లానే దీన్లోనూ ముఖ్యపాత్ర సాధించిన ఘనతల వివరాలే ఎక్కువ ఉంటాయి. చర్చించిన విషయాల పట్ల సమతూకమూ లేదు. ఐతే ఇతరులను విమర్శించటం, బురద చల్లటం లేదు. అలమరాలో ఉన్న కంకాళాలను బైటకి తీయటం, లో మురికిని బహిరంగంగా ప్రదర్శించటమూ లేదు. కొత్త ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో క్రికెట్ చూస్తున్న అమాయకపు వయస్సులో అభిమానాన్ని పెంచటమే ఈ పుస్తకం చేసింది.

73లోనో, 74లోనో, హైదరాబాద్ – ఆంధ్రల మధ్య రంజీ ట్రాఫీ మేచ్ గుంటూర్లో జరిగినప్పుడు పటౌడీని చూశాను. ఫొటోల్లో చూసి ఊహించుకున్నదానికన్నా కొద్దిగా పొట్టిగా అనిపించాడు. అతని ఫీల్డింగు గుర్తుందికానీ, బాటింగ్ గుర్తు లేదు; ఎక్కువ స్కోరు చేయలేదనుకుంటాను. అప్పటి ఆనవాయితీ ప్రకారం ఆంధ్ర జట్టు చిత్తుగా ఓడిపోయింది.

పుస్తకంలో కొన్ని వివరాలు స్పష్టంగానూ, కొన్ని అస్పష్టంగానూ గుర్తు ఉన్నాయి. ఎప్పుడూ గుర్తొచ్చేవి మాత్రం పుస్తకం ముగింపు వాక్యాలు.


“In the country of the blind, it had been said, the one-eyed man is king. But in the keen-eyed world of cricket a fellow with just one good eye-and-a-bit has to settle for something less than the perfection he once sought. Lucky me, despite this, to have been able to play the game all over the world in the company of the giants”.

అందుకే, విపరీత పరిస్థితులకు తలవంచక పోరాడిన ఈ క్రికెట్ బెబ్బులి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయింది.
(ఈ వ్యాసంతో ఉన్న quotation, ఫొటోలు ఇంటర్నెట్ నుంచి తీసుకొన్నవి).

**********

Tiger’s Tale
The story of the Nawab of Pataudi
Mansoor Ali Khan Pataudi
(as told to Kenneth Wheeler)
1969
Hind Pocket Books
129 pages; Rs. 3 (?)

You Might Also Like

12 Comments

  1. Tales of the Prince Charming of Indian Cricket | పుస్తకం

    […] introduction to Tiger’s Tale, the autobiography of Nawab of Pataudi, can be found here.) – Pataudi: Nawab of Cricket Suresh Menon (Editor) 2013 Harper Sport 186 pages; 499 […]

  2. prasad sarma

    థ్యాంక్స్ డాక్టర్ గారు,
    మీ వ్యాసం అద్భుతం. చాల ఆసక్తి కలిగించింది. ఒక మంచి నోస్టాల్జిక్ ఞాపకం నెమరు వేసుకో గలిగాము. ఆ రోజుల్లో వీరి సమకాలికులు ఫరూక్ ఇంజనీర్, ఏక్నాద్ సోల్కర్, దిలీప్ సర్దేశయ్, అప్పుడప్పుడె క్రికెట్లో అదుగుపెట్టిన లిటిల్ మాస్టర్ గవాస్కర్, తర్వాత రోజుల్లో ఆయన బావ అయిన గుండప్ప విశ్వనాధ్ అందర్నీ గ్నాపకం చేసుకున్నాను. మీరన్నట్టు అప్పట్లో కామెంట్రి విండం లెకపోతే మర్నాడు పేపర్లో వచ్చె రెండు మూడు కాలంస్ వార్తలు చదవడం, తర్వాత ఎప్పుడో వారానికి వచ్చె ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చే వివరమైన ఆర్టికిల్స్, ఫోటోలు చూసే వాళ్ళం. సినిమా హాళ్ళల్లో ఆ రోజుల్లో తప్పకుండా వేసే న్యూస్ రీల్స్లో కొంచెం చూపించే వారు. ధన్యవాదాలు.

  3. surampudi pavan santhosh

    సొంతగోలగా అనిపిస్తే క్షమించమన్నారు కానీ మీ టీనేజ్, క్రికెట్ పై ఇష్టం కలిసి నా మనసులో ముద్ర వేశాయి. ఈ పుస్తకం దొరుకుతుందో చదువుతానో తెలీదు కానీ దొరికితే మాత్రం మీరు చెప్పిన ఙ్ఞాపకాలే గుర్తొస్తాయి నాకా పుస్తకం చదివినప్పుడల్లా. ఇలా రాసినందుకు ధన్యవాదాలు. మీరిలా మీ టీనేజి కబుర్లతో కలిపి పుస్తక పరిచయాలు రాస్తే చదవాలని కోరుకుంటున్నాను.

  4. నాగ మురళీధర్ నామాల

    పటౌడీ ప్రయోగించిన “డెకాయిట్ ప్రాంక్” వినే ఉంటారు. నేను ఎప్పుడో ఈనాడు ఆదివారంలో చదివాను. ప్రాంక్ స్టార్ అనుకున్నాను.

  5. షారిక్

    చాలా మంచి వివరాలు ఇచ్చారు. ధన్యవాదాలు.
    ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుందో, వివరాలు వుంటే దయచేసి తెలుపగలరు.

  6. Purnima

    Amazing! I’m so glad to see a cricket lover in you. అంటే మీకా ఆట ఇష్టమని ఇంతకు ముందు చూచాయిగా తెల్సినా ఈ వ్యాసంతో పూర్తిస్థాయి పరిచయం కలిగింది, ఆ క్రికెట్ ప్రేమికుడితో. సచిన్-ద్రవిడ్-గంగూలీ త్రయం నా టీనేజ్‍ను మెస్మరైజ్ చేసినట్టు, మీకు పటౌడి అని అనిపించింది ఇది చదువుతుంటే! రాసినందుకు థాంక్స్!

    ఒక్కప్పటి హైద్రాబాద్ రంజీ టీంకు ఎంత పేరో! మొన్నమొన్నటి దాకా కనీసం ఒక స్థాయి పోటీ అయినా ఇచ్చేవారు. ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది. 🙁 ఆంధ్రా టీం ఆనాటి నుండీ ఆనవాయితీ తప్పటం లేదే!:)

    మొన్న మనవాళ్ళు ఇంగ్లాండులో చేతులెత్తేసాక పటౌడి చిర్రుబుర్రాలడినది ఇంకా చెవుల్లో వినిపిస్తోంది. ఇంతలో ఆయన పోయారంటే నమ్మబుద్ధేయటం లేదు. ఆయన హాస్యచమత్కారాల సంభాషణలు తెలీదు గానీ, తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పటం ఎప్పటికీ గుర్తుంటుంది.

    ఈ పుస్తకం ఇప్పుడు అందుబాటులో లేదు, కొనుక్కోడానికి. ఏ లైబ్రరీలనో ఆశ్రయించాలి.

    కొంచెం nitpicking: ghost writer కి భూత రచయిత అని రాసారూ? ఆంధ్రభారతి ప్రకారం “గుప్త రచయిత” అని ఉంది. as told to.. అని ఉంది కాబట్టి వ్రాయసకాడు అనుకుంటే సరిపోతుందా? (అనుమానాలు మాత్రమే!)

    దీన్ని బట్టి నాకు చాలా బాగా అర్థమైన విషయం మీకు కార్‍డస్ చాలా నచ్చచ్చు. వీలైనప్పుడు ఆయన పుస్తకాలు తప్పక చదవండి. (ఈపాటికే చదివుంటే వాటిని గురించి మీ మాటల్లో చదువుకోవాలని ఉంది.)

    1. Jampala Chowdary

      ఇంతకు ముందు చూడకపొతే ఈ పాత లంకె చూడండి: http://v-chowdary-jampala.sulekha.com/blog/post/2002/03/i-lagaan-i-and-i.htm. నా క్రికెట్‌ప్రియత్వం మూలాలు తెలుస్తాయి 🙂

      మెడికల్ కాలేజ్ రోజుల్లో, ఏమీ తోచకపోతే హాస్టల్లోనో, కాలేజ్ గార్డెన్లోనో గవాస్కర్ గొప్పా, విశ్వనాథ్ గొప్పా అని వాదన మొదలుబెడితే గంటలు చెల్లిపోయేవి. ఆ రోజుల్లో వీళ్ళిద్దరితో పాటు, బ్రిజేష్ పటేల్ , స్పిన్ చతుష్టయం (ప్రసన్న, బేడి, చంద్రశేఖర్, వెంకట్రాఘవన్) మాకు ఇష్టమైన ఆటగాళ్ళు.

      70-75ల మధ్య హైదరాబాద్ జట్టులో చాలా ఆకర్షణీయమైన, ప్రతిభ గల ఆటగాళ్ళు ఉండేవారు: జయసింహ, పటౌడీలతో పాటు, ఆల్‌రౌండర్ అబిద్ అలీ, బాట్స్‌మెన్ అబ్బాస్ అలీ బేగ్, జయంతిలాల్, మీడియం పేస్ బౌలర్ గోవిందరాజ్, వికెట్‌కీపర్ కృష్ణమూర్తి టెస్టు ఆటగాళ్ళు. తర్వాత రాంనారాయణ్, నరసింహారావు, శివలాల్ యాదవ్‌లు కూడా టీంలో చేరారు. కర్ణాటక టీంలో విశ్వనాథ్, బ్రిజేష్ పటేల్, ప్రసన్న, చంద్రశేఖర్, కిర్మాని ఉండేవారు. రెండు టీముల మధ్య పోటీ అంటే సరదాగా ఉండేది. (ఐనా, అప్పట్లో బొంబాయే ఏళ్ళ తరబడి రంజీ ట్రాఫీ ఛేంపియన్). ఆంధ్ర, కేరళ జట్టుల మధ్య పోటీ కూడా రసవత్తరంగా ఉండేది లెండి 🙂

      కార్డస్‌ని excerptsగా తప్ప చదవలేదు. అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు క్రికెట్ వ్యాఖ్యాతగా ఉన్న ఎన్.ఎస్.రామస్వామి బాగా రాసేవాడు. ఆయన మంచి పుస్తకప్రియుడు కూడా. మద్రాస్ మూర్‌మార్కెట్లో సెకండ్ హేండ్ పుస్తకాల షాపులో దొరికిన పుస్తకాల గురించి సండే స్టాండర్డ్‌లో ఒక కాలం రాసేవాడు. రామస్వామి క్రికెట్‌గురించి ఏమైనా పుస్తకాలు రాసేడేమో తెలీదు.

    2. Jampala Chowdary

      భూత రచయిత కన్నా గుప్త రచయితే బాగుంది. ఇంకా నయం, దెయ్యం రచయిత అన్నాను కాదు.
      ఈ గుప్త రచయితలు డిక్టేషన్ తీసుకునే లేఖకులకన్నా ఎక్కువ పని చేస్తారు కాబట్టి వ్రాయసకాడు సరిపోదేమో.
      కొన్నేళ్ళ క్రితం, గుప్తరచయితకు ఆత్మకథ ‘చెప్పిన’ ఒక ఆటగాడు తన ఆత్మకథలో ఉన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలగురించి ప్రశ్నిస్తే, “నేనింకా ఆ పుస్తకం చదవందే”, అని జవాబిచ్చాడు. 🙂

  7. సౌమ్య

    క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఏమి చేసారో ఆ జీవితం గురించి తరువాతెప్పుడూ రాయలేదా?

    Timely Article! Thanks a lot!

    1. Jampala Chowdary

      రిటైర్ అయ్యాక పటౌడీ కొంతకాలం స్పోర్ట్స్‌వరల్డ్ పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. ఆ తర్వాత కొంత కాలం టెస్టుమేచ్‌ల్లో అంపైర్‌గానూ, అతిథి వ్యాఖ్యాతగానూ పని చేశారట. ఐ.పి.ఎల్. మొదటి రోజుల్లో దాని బోర్డ్‌లోనూ ఉన్నారట. కానీ పుస్తకాలేమీ రాసినట్లు లేదు. పైన చెప్పినట్లు, సెలెబ్రిటీ ఎండార్స్‌మెంట్లు బాగానే ఉండేవి (పటౌడీ, షర్మిలాల గ్వాలియర్ సూటింగ్ ప్రకటనలు బాగా గుర్తు; అన్నట్లు పెళ్ళికోసం ముస్లింగా మారిన షర్మిలా పెట్టుకున్న కొత్త పేరు – ఆయెషా బేగం). 90ల్లో కొంతకాలం మళ్ళీ రాజకీయాల్లో ఉన్నట్లు గుర్తు. రెండుమూడేళ్ళ క్రితం అనుమతిలేకుండా వేటాడిన కేసులో అరెస్టు అయ్యారు.

      హాస్యప్రియత్వం మాటకొస్తే, ఈ మధ్య ఆయన అన్న మాట ఒకటి గుర్తుకు వస్తుంది: ‘If ICC is the voice of the cricket, BCCI is the invoice’.

  8. KumarN

    WOW..నేను పెరుగుతున్నప్పుడు మా నాన్న కానీ, మిగతా పెద్దవాళ్ళు కానీ, అక్కడక్కడా పేపర్లలో కానీ ఈయన గురించి గొప్పగా వినటమే తప్ప, ఇన్ని వివరాలు తెలీవు.

    “అలమరాలో ఉన్న కంకాళాలను బైటకి తీయటం’ హబ్బ..ఎంత చక్కగా అనిపించిందో, అది చదవగానే. కొన్నిసార్లు ఆంగ్లంలో ఉన్న phrases కి, ఇంత చక్కగా ఎవరన్నా తర్జుమా చేస్తే, నాకెంత ఆనందంగా ఉంటుందో 🙂

    btw, thanks for sharing

  9. Shyam

    బాగా రాసేరు.
    శ్యాం

Leave a Reply to Tales of the Prince Charming of Indian Cricket | పుస్తకం Cancel