అభినయ దర్పణము – 7

(ఈ శీర్షికలో వస్తున్న వ్యాసాలు ఇక్కడ చూడండి)

ద్వితీయాశ్వాసము

అసంయుత లక్షణము

శ్రీ రమణీ మణి వల్లభ

వారిజదళ నేత్ర! సుజనవాంఛిత ఫలదా!

నారదమునివందితపద!

తారుణ్యమయాంతరంగ! కస్తురిరంగా! 1

 

వII అవధరింపుము.

 

పరఁగ నసంయుతహస్తము

వెరవుగఁ దెల్పెదను నష్టవింశతి యిపుడున్

మఱి లక్షణలక్ష్యంబులు

గరుణింపుము!వరశుభాంగ! కస్తురిరంగా!  2

వII ఇఁకఁ, బతాకంబును, ద్రిపతాకంబును, నర్థపతాకంబును, గర్తరీముఖంబును, మయూరార్థచంద్రంబులును, నరాళంబును, శుకతుండంబును, ముష్టియు, శిఖరంబును, గపిత్థ కటకాముఖంబులును, సూచీ చంద్రకళాహస్తంబులును, గోశహస్తంబును, సర్పశీర్షమృగశీర్షంబులును, సింహముఖంబును, లాంగూల సోలపద్మంబులును, జతురహస్తంబును, భ్రమరహస్తంబును, హంసాస్య హంసపక్షంబులును, సందంశంబును, ముకుళంబును, దామ్రచూడ త్రిశూలంబులును నను నీయష్టవింశతియు నసంయుతాఖ్యహస్తంబు లనం బరఁగుచుండు, నంత,   3

 

పతాకహస్త లక్షణము

గరిమ నంగుష్టంబును వంచి కడమ వ్రేళ్ళు

లన్నియును గూర్చి చాఁచిన, వన్నెమీఱఁ

జెలఁగినఁ, బతాకమని చాల వెలయుచుండు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ! 4

పతాకహస్త వినియోగము

వII మఱియు నాట్యారంభమందు, మేఘమందు, వలదనుటయందు, నిశియందు, వాయుస్పర్శంబులయందు, ఖడ్గములయందు, నమరబృందములఁ జూపుటయందు, దాపములయందు, నాశీర్వాదములయందు, దాననుటయందు, నక్కడక్కడననుటయందు, శపథంబునందు, ఫలద్రవ్యాదిస్పర్శంబులయందు, నశ్వమందు, ఖండించుటయందు, నంబుధియందు, దొడ్డ వారలనుటయందు, దొరలయందు, దినమాసవర్షసూచనలయందు, గవాటంబులు మూసి తెఱచుటయందు, బొమ్మనుటయందు, శ్లాఘించుటయందు, నంగాదిస్పర్శంబులయందు, సమమనుటయందు, సప్తవిభక్తులతెఱఁగుం జూపుటయందు, బ్రసాదంబు గైకొనుటయందు, గరతాడనంబులయందుఁ, బీఠంబులయందు, మానినీమణుల కుచస్థలిం బట్టుటయందుఁ, బతాకహస్తంబు వర్తించుచుండు, నంత  5

 

త్రిపతాకహస్త లక్షణము

మఱియును సపతాకంబుగ

వరుస ననామికపువ్రేలు వంచిన నదియున్

ఇరువుగఁ ద్రిపతాకం బని

గరిమను జెలువొందుచుండుఁ గస్తురిరంగా!   6

త్రిపతాకహస్త వినియోగము

వెలయుచుండుఁ గిరీటవృక్షంబులకు మఱి

పాకశాసనునకు బాణమునకు

మొగిలిపుష్పానకు మొనయు చెక్కిళ్ళకు

మెలఁగు వహ్ని జ్వాల మెఱపులకును

దనరు వజ్రాయుధంబునకు దీపమునకు

నేపు మీఱఁగ ద్రిప్పిచూపుటకును

బరమేశ్వరునకును బద్మనాభునకును

సొరిదిఁ బ్రకాశంబుఁ జూపుటకును

వేడ్కరతికేళి మఱి కూడి వీడుటకును

నిన్ని తావుల వర్తించి చెన్ను మీఱు

నిలను ద్రిపతాకహస్తంబు నిందిరేశ!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!    7

 

అర్థపతాకహస్త లక్షణము

ఎనయుఁ ద్రిపతాకహస్తమందునఁ గనిష్ఠ

వ్రేలు గూరిచి వంచిన వివరముగను

ధరణిలోఁజూడ నర్థపతాకమయ్యె

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!    8

 

అర్థపతాకహస్త వినియోగము

చిగురుకును ఛురికకు ధ్వజశృంగములకు

రమణినుదిటికి రెంటికి ఱంపమునకు

వచ్చు నర్థపతాకంబు వైపుమీఱ

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!    9

 

కర్తరీముఖ లక్షణము

అరయ నర్థపతాకంబునందు మిగులఁ

దర్జనిక వ్రేలు వెలిగాను చాఁచి యున్నఁ

గర్తరీముఖహస్తమై ఘనత కెక్కు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   10

 

కర్తరీముఖహస్త వినియోగము

మరణము భేదమున్ మెఱపు మాటికినిం గడకంటి దృష్టియున్

వెరవుగఁ దల్ల క్రిందులను వేదనచేఁ దమిచేతఁ బొర్లునున్

నిరతము దీగెలల్లుకొను నేర్పును వచ్చిన నిన్నితావులన్

వరుసగఁ గర్తరీముఖము వైపుగఁ గస్తురిరంగనాయకా!   11

 

మయూరహస్త లక్షణము

మెఱయ నంగుష్ఠమున ననామికను గూర్చి

కడమ వ్రేళ్ళనుఁ జాచిన ఘన మయూర

హస్తమను పేర విస్తరిల్లు నవని లోన

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!    12

 

మయూరహస్త వినియోగము

నెమలిని దీఁగె లల్లుటను నిక్కముగా శకునంబుఁజూడనున్

రమణులు కాటుకుంచుటను రమ్యముగా మఱి బొట్టుపెట్టుటం

గ్రమముగ వాంతిచేయుటను గ్రమ్మఱఁ జూడఁగ నిన్ని తావులం

దమర మయూరమై వెలయు నన్నిటఁ గస్తురి రంగనాయకా!   13

 

అర్థచంద్రహస్త లక్షణము

ఇరువుగ సపతాకంబును

సరసను నంగుష్ఠ మెనయఁ జూఁచిన నదియున్

మఱి యర్థచంద్రహస్తము

గరిమను జెలువొందుచుండుఁ గస్తురిరంగా! 14

 

అర్థచంద్రహస్త వినియోగము

సారెకుఁ గృష్ణపక్షాష్టమిశశిఁ జూపఁ

జెక్కిటఁజెయ్యుంచి చింతపడను

నడుము పట్టుటకును మెడఁబట్టి నూకను

ధ్యానంబు సేయను దాన యనను

భల్లాయుధమునను బ్రార్థించుటను మఱి

చెలువొంద రామ రాఁజేయుటకును

భుజము దట్టుక జెట్లు పోట్లాడఁ జూడను

సొంపుగా నమరులఁ జూపుటకును

 

జేరి యభిషేకమును వేడ్కఁజేయుటకును

నరయఁగా నిన్ని తావుల నర్థచంద్ర

హస్తమది వచ్చునిదె చూడు మంబుజాక్ష!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   15

 

అరాళహస్త లక్షణము

అనువుగాఁ జూడను పతాకహస్తమునను

దర్జనిక వంచిపట్టిన ధర నరాళ

హస్తమయి చాలవేడ్కగా నతిశయిల్లు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ! 16

అరాళహస్త వినియోగము

ఇరవుగ నాచమనీయము

బరువడి సుడిగాలి నమృతపానంబుననున్

మఱి విషపానము సేయను

గరిమ నరాళంబు వచ్చుఁ గస్తురిరంగా!   17

 

శుకతుండహస్త లక్షణము

అరసి చూచిన మురహరీ! మఱి యరాళ

నామకరమందు వంప ననామికంబు

నదియె శుకతుండహస్త మై యవని వెలయు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  18

 

శుకతుండహస్త వినియోగము

పరఁగ కుంతాయుధమునకు బాణమునకు

మఱియు మర్మము భేదించుమార్గమునకు

మెచ్చ శుకతుండహస్తమె వచ్చుఁగాదె

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   19

 

ముష్టిహస్త లక్షణము

పరఁగ వ్రేళ్ళన్ని మఱి గూర్చిపట్టియున్న

ముష్టిహస్తంబదే యండ్రు మోహనాంగ!

భానుసంకాశ!నుతజనభయవినాశ!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  20

ముష్టిహస్త వినియోగము

స్థిరముగ జుట్టు పట్టుకొని జెట్లదె యుద్ధముచేయ నందునున్

నిరతము దారహారములు నేర్పుగనున్ గళమందు వేయనున్

గరిమను దట్టిచే నడుముగట్టను దన్నెదిరించు వారలం

బరఁగను గొట్ట ముష్టి యిదె వచ్చును గస్తురిరంగ నాయకా ! 21

 

శిఖరహస్త లక్షణము

ముష్టిహస్తాన నంగుష్ఠ మూర్ధ్వముగను

జెలువు మీఱఁగ నెత్తిన శిఖరమౌను

సరసగుణహార! శ్రీరంగపురవిహార!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  22

శిఖరహస్తవినియోగము

వెడ విల్తునికి మఱి విలువవట్టుటకును నా

లింగమునకును లింగమునకుఁ

జెలువొంద గోపురశృంగంబుఁ జూపను

నిది నిశ్చయంబన నేమి యనను

బేర్మి దంతముఁజూపఁ బితృతర్పణమునకుఁ

గంబమునకు నధరంబునకును

ఘంట వాయింపను గా దని పల్కను

నెదిరిని నొడి వట్టి యీడ్చుటకును

 

బరఁగ శ్రేష్ఠంబు ననుటకు భయమునకును

శిఖరహస్తంబు వచ్చును జెన్నుమీఱ

సరసగుణహార! శ్రీరంగపురవిహార!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   23

 

కపిత్థహస్త లక్షణము

తగవుగ ముష్టిహస్తమునఁ దర్జనివ్రేలిని నెత్తి వంచియు

న్నెగడు కనిష్ఠకన్ వెలిగ నేర్పునఁ గొంచెము వంచిపట్టినం

బొగడఁ గపిత్థ హస్తమయి ధారgణిలోఁ జెలంగు నో

నగధర! వాసుదేవ! యదునందన! కస్తురి రంగనాయకా! 24

కపిత్థహస్త వినియోగము

ఇరవుగ లక్ష్మివాణులకు నింపుగఁ దాళము వట్టునందుకుం

బరఁగను బాగ సుట్టుటకుఁ బాలను బిండను గొంగువట్టనుం

దిరముగఁబూలు సుట్టఁగను దీపము ధూపముఁ జూపఁజిల్కకున్

మెఱయఁ గపిత్థహస్తమగు మేల్మిని గస్తురిరంగనాయకా!25

కటకాముఖహస్త లక్షణము

చేరిన ముష్టిహస్తమునఁ జెన్నుగ మధ్యపు వ్రేలిక్రిందుగాఁ

గూరిమి బొట్టవ్రేలి నదె గ్రుచ్చుక తక్కినవ్రేళ్ళు చేరినన్

వారిజనాభ! యింక విను వైపుగనుం గటకాముఖంబు నా

సారెకుఁ దేజరిల్లు నిలఁ జక్కని కస్తురిరంగ నాయకా! 26

కటకాముఖహస్త వినియోగము

నిరతము వజ్రముష్టికిని నేర్పున బాణము నేయ నంగడాల్

గరిమను బట్టి యెత్తుటకు గట్టిగ నాజముధాటిపోటుకుం

దిరముగ వచ్చు నిందులను దేవర! యీకటకాముఖంబు దాఁ

గరివరదాప్రమేయ! భవఖండన! కస్తురిరంగనాయకా!  27

సూచిహస్త లక్షణము

పరగఁ దర్జనివ్రేలిని జాఁచిపట్టి

కడమవ్రేళ్ళను మడఁచిన గట్టిగాను

సూచిహస్తం బనంగను సొంపు మీఱు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ! 28

సూచిహస్త వినియోగము

పరఁగనొక్కటి పరబ్రహ్మంబుననుటకుఁ

జామరంబునకును జగతి యనను

నినునికి నూటికి నిదియది యనుటకు

జడకు ఛత్రంబు కాశ్చర్యమునకు

కానికానీ యని మేను సూపుటకును

నిలలోన భేరి వ్రాయించుటకును

కొనలు సూపుటకును గూర్మి సలాముకుఁ

జిక్కిపోవుటకును ముక్కునకును

 

గట్టివా డనుమెచ్చుకు గరిమ మీఱ

సొరిది నూగారుబారులఁ జూపుటకును

సూచిహస్తంబు వచ్చును సొంపు మీఱ

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  29

చంద్రకళాహస్త లక్షణము: వినియోగము

మొనసి తర్జనికాంగుష్ఠములను జాఁప

నవనిఁ జంద్రకళాహస్తమగును మిగుల

విదియచంద్రుని కిది చెల్లు విమలచరిత!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ! 30

కోశహస్త లక్షణము

వెలయ విరళంబుగా నైదువ్రేళ్ళు సాఁచి

కొనలుఁగొంచెము వంచినఁ గోశ మగును

సరసగుణహార! శ్రీరంగపురవిహార!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  31

కోశహస్త వినియోగము

అనిశము పుట్టకుం బరఁగు నంతటఁ జెట్లకు స్వల్పభోజనం

బునకును బూలబంతులకుఁ బొందుగ ముగ్ధలు చెండ్లు చూపనున్

బనుపడఁ బూలబుట్టకును బాగుగ వడ్డన చేయుగిన్నెకు

న్నెనయును గోశహస్త మిల నింపుగఁ గస్తురిరంగ నాయకా ! 32

సర్పశీర్షహస్త లక్షణము

అరయఁదొలుద తటి సపతాకహస్తమునకుఁ

గొంచెముగ వ్రేళ్ళనన్నిటి వంచియండ

నిలను మఱి సర్పశీర్ష మై చెలువు మీఱు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  33

సర్పశీర్షహస్త వినియోగము

చందనంబునకును సర్పంబునకు మఱి

మెల్లగా ననుటకు మే లనంగఁ

బ్రోక్షింప మిక్కిలి పోషింప దేవాది

తర్పణాలకు నీళ్ళు త్రాగుటకును

హస్తికుంభస్థలం బందుఁదట్టుటకును

దగ జెట్లు భుజములు దట్టుటకును

శాంతుఁడు ననుటకుఁ జల్లన యనుటకు

సాబాసు మంచిది చాలు ననను

 

సర్పశీర్షంబు హస్తంబు సరవిగాను

నిన్నితావుల వర్తించు నింది రేశ!

సరసగుణహార! శ్రీరంగపురవిహార!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  34

మృగశీర్షహస్త లక్షణము

అరయఁగా సప్తశీర్షంపు హస్తమందుఁ

గూర్మిఁగొన వ్రేలు మఱియు నంగుష్ఠ మమర

దాఁప మృగశీర్షహస్త మై తనరుచుండు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   35

మృగశీర్షహస్త వినియోగము

పడతులు చెక్కిళ్ళఁ బసుపు పూయుటకును

రాజీవ నేత్ర మర్యాద యనను

వచ్చెడు ననుటకు నాదంబు సేయను

సోఁకోర్చుకొన గోడఁజూపుటకును

నెదురెదురనుటకు నిల్లు సూపుటకును

నొనరఁగా  బిలువను నుండు మనను

మఱి మ్రుగ్గు వెట్టను దిరుగాడుటకు నింకఁ

బేర్మిఁ ద్రిపుండ్రంబు వెట్టుటకును

 

బరఁగఁ బదములు ప్రియమునఁ బట్టుటకును

వెలయఁ బరిచీలు వట్టను వేడ్కఁగాను

నెనసి మృగశీర్ష హస్త మై తనరుచుండు                                          

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  36

సింహముఖహస్త లక్షణము

మఱి యనామిక యంగుష్ఠమధ్యమములుఁ

గూర్చి మిగిలిన వ్రేళ్ళను గువలయేశ!

చాఁచినను సింహముఖ మయి జగతి వెలయు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  37

సింహముఖహస్త వినియోగము

ఆజ్య హోమంబునకుఁ బిల్లియస్థులకును

జింక కుందేలు వ్యాఘ్రంబు సింహములకు

నెలమి మఱి సింహముఖ మయి వెలయుచుండు

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  38

లాంగూలహస్త లక్షణము

మఱి పద్మకోశమందున

వరుస ననామికపు వ్రేలు వంచిన మఱియున్

నిరతము లాంగూలంబన

గరిమను జెలువొందుచుండుఁ గస్తురిరంగా! 39

లాంగూలహస్త వినియోగము

చేమంతిపూలకుఁ జెలఁగిన యలనిమ్మ

పండ్లకు మఱి చిన్న చెండ్ల కమరు

చిన్నిఘంటలకును గన్నేరుపూలకుఁ

బొనరఁ బోకలకును బుంటలకును

జొన్నకాయలకును బొడ్డుమల్లెలకును

గుండలంబులఁ జూప మెండుగాను

జిన్నిగిన్నెలకును సున్నపుఁగాయకు

సొరిది సుగంధంబు సూపుటకును

 

మెఱయు మఱి యిన్నితావుల గరిమ మీఱి

యిలను లాంగూలహస్తంబు నింది రేశ!

సరసగుణహార! శ్రీరంగపురవిహార!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   40

పద్మకోశహస్త లక్షణము

వెలయ మఱి యైదు వ్రేళ్ళును విరళములుగఁ

బట్టి మేలుగ వంచిన దిట్టముగను

బద్మకోశంబు సుమ్మది పద్మనాభ!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!  41

పద్మకోశహస్త వినియోగము

చక్రవాకములకుఁ జాతకంబులకును

గొమరొప్ప గుంటకుఁ గొప్పునకును

వెలఁగపండ్లకు నింక వెలఁదిపాలిండ్లకుఁ

బండ్లకు గజనిమ్మపండ్ల కమరు

పూర్ణచంద్రునికిని బురికిని మేడకు

సొగసుకు నెమ్మోముఁ జూపుటకును

దామరపూలకుఁ దనరుపట్నమునకు

దేవళంబులకును దేరులకును

 

జెలఁగఁ గలగలశబ్దంబుఁ దెలుపుటకును

మంచిసౌందర్యమునకు శ్లాఘించుటకును

బద్మకోశంబు వచ్చును బాగుమీఱ

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   42                                      

చతురహస్త లక్షణము

సారెఁ గనిష్ఠకాంగుళిని జాఁచియుఁ దక్కిన మూడువ్రేళ్ళనుం

గూరిమి మీఱఁ గూర్చి యదె కొంకక మధ్యపు వ్రేలి క్రిందుగాఁ

జేరినబొట్ట వ్రేలి నిఁకఁ జెన్నుగ వంచియుఁబట్టి చూపఁగా

నారమణీయమౌ చతురహస్తము గస్తురిరంగ నాయకా! 43

చతురహస్త వినియోగము

అనువుగాఁ గస్తురి యనుటకుఁ జెలువొందు

షడ్రసాలకుఁ జెమ్మకు సరవి నమరు

మఱియు సువర్ణ తామ్రాదిలోహములకు

వరలు నానావిధవర్ణములకు

కొంచెమంచనుటకుఁ గొమరొప్పఁ గంటికిఁ

దొలఁగి రసానకుఁ దునుకలకును

దగవుగా నింతమాత్రంబు మెల్లన యనఁ

బరువడి ఘృతతైల పాత్రములకు

 

కాంతనడలకు మఱి హంసగమనములకుఁ

జతురహస్తంబు వచ్చును సరవి మీఱ

సరసగుణహార! శ్రీరంగపురవిహార!

రాక్షసవిహార! కస్తురిరంగధామ!  44

భ్రమరహస్త లక్షణము

పొనర నంగుష్ఠ మధ్యమములను గూర్చి

గరిమఁ దర్జని వంచుక కడమవ్రేళ్ళు

చాఁచినంతనె భ్రమరహస్తంబు నగును

రాక్షసవిహార! కస్తురిరంగధామ!   45

భ్రమరహస్త వినియోగము

పరఁగ నిలలోనఁ జెన్నొందు భ్రమరమునకు

నరయఁ గోకిలకును జెల్లు నమరవంధ్య!

భ్రమరహస్తంబు మిక్కిలి భావ మలర

రాక్షసవిహార! కస్తురిరంగధామ!  46

హంసహస్తలక్షణము

కొమరు మీఱఁ దర్జనిక యంగుష్ఠ మమరఁ

జేర్చి మిగిలిన వ్రేళ్ళను జెన్ను మీఱఁ

జాఁప నది హంసహస్త మై చాలియుండు

రాక్షసవిహార! కస్తురిరంగధామ!   47

హంసహస్త వినియోగము

చెలువుగఁ బూలు గోయఁగను జిత్రము వ్రాయఁగఁ బొట్టువెట్టఁగా

నిల నుపదేశముందెలుప నింపుగ హంసకుఁ బుల్కరింపఁగాఁ

బలుమఱు వాసుదేవు పదపద్మము ధ్యానముచేయ నందునుం

దలకొను హంసహస్తమిది తథ్యము గస్తురిరంగనాయకా! 48

హంసపక్షహస్త లక్షణము

చెలువు మీఱఁగ మఱి సర్పశీర్షమందు

సరగఁ జిటికెన వ్రేలిని జాఁచియున్న

హంసపక్షం బటంచని యవని వెలయు

రాక్షసవిహార! కస్తురిరంగధామ!  49

హంసహస్తపక్ష వినియోగము

చెలువుగ నేటికట్టకును జెన్నుగ వారధి గోడఁజూపనుం

బలుమఱు సేతువందు మఱి బాగుగ నాఱని లెక్కపెట్టనున్

సలలితరీతి నాకునకు శాంతిని జేయుటయందు మిక్కిలిం

జెలఁగును హంసపక్ష మిలఁజెన్నుగఁ గస్తురిరంగనాయకా!  50

సందంశహస్త లక్షణము

ఎలమిఁ దర్జనిమధ్యమములను జేర్చి

గరిమ నంగుష్ఠమునఁ గూర్చి కడమవ్రేళ్ళు

సాఁచినది సందంశం బని జగతి వెలయు

రాక్షసవిహార! కస్తురిరంగధామ!   51

సందంశహస్త వినియోగము

చేరి ముత్యములకు వారిబిందువులకుఁ

గొమరొప్ప రుద్రాక్షగుళికలకును

గరిమ మల్లెలకును గర్పూరమునకును

మఱి పగడములకు మాత్రలకును

సొమ్ము వెట్టుటకును సొరది వాసనచూడ

హవనంబులకు దేవతార్చనలకు

వైఢూర్యమునకును బరఁగఁ గెంపులకును

ముద్రవేయుటకును ముదము మీఱ

 

నొనరఁ జెలియలు మడుపుల నొసఁగుటకును

నరయ సందంశహస్తంబు ననువుగాను

నిన్ని తావుల వర్తించి చెన్ను మీఱు

రాక్షసవిహార! కస్తురిరంగధామ!   52

ముకుళహస్త లక్షణము

ఒనరఁగా నైదుఁవ్రేళ్ళను నొకటిగాను

గూర్చినంతనె ముకుళ మై గొమరుమీఱు

సరసగుణహార! శ్రీరంగపురవిహార!

రాక్షసవిరామ! కస్తురిరంగధామ!   53

ముకుళహస్త వినియోగము

పరఁగ దానములకుఁబ్రాణంబు లనుటకు

వేమాఱు సొలపున విరహమునకుఁ

బరువడి మదనుని పంచబాణములకు

మఱి భోజనమునకు మౌనమునకుఁ

దామర మొగ్గకుఁదగవుగా నై దన

శాకపాకములను జెలఁగి యిడను

గదళిపుష్పమునకుఁ గలువల మొగ్గకు

మెచ్చి ధనము చాల నిచ్చుటకును

 

బ్రేమ మీఱఁగ ముద్దులు వెట్టుటకును

దగవుగా నిన్ని తావులఁ దనరుచుండు

ముకుళహస్తంబు నిలలోన, మోహనాంగి

రాక్షస విరామ! కస్తురిరంగధామ! 54

తామ్రచూడహస్త లక్షణము

అనువు మీఱఁగ ముకుళహస్తంబునందుఁ

దర్జనిక వ్రేలు వంచినఁ దగవుగాను

దామ్రచూడం బటంచనఁ దనరుచుండు

రాక్షస విరామ! కస్తురిరంగధామ!  55

తామ్రచూడహస్త వినియోగము

ఒనర వాయసమునకును నొంటె కమరుఁ

గుక్కుటము మూషికంబును గొంగ యనను

జెల్లు నిదె తామ్రచూడంబు చెలువు మీఱ

రాక్షస విరామ! కస్తురిరంగధామ!  56

త్రిశూలహస్త లక్షణము

పరువడిఁ జిటికెన వ్రేలును

గుఱుచగ నంగుష్ఠ మెలమిఁ గూర్చుక మిగులన్

మఱి మూడువ్రేళ్ళు సాఁచిన

గరిమఁ ద్రిశూలంబు నయ్యె గస్తురిరంగా! 57

త్రిశూలహస్త వినియోగము

ఎలమిని ముల్లోకములకుఁ

బలుమఱు మూటికిని బిల్వపత్రంబునకున్

వెలయఁ ద్రిశూలంబునకును

గలిగెఁ ద్రిశూలంబు ధరను గస్తురిరంగా!58

మాలిని

సరసిజదళనేత్రా! సజ్జనస్తోత్రపాత్రా!

హరిహయనుతపాదా! యచ్యుతా! లోకనాథా!

కలికలుషవిదారా! కామినీచిత్తచోరా!

పరహృదయవిదారా! పాహి శ్రీరంగశౌరీ!  59

గద్యము

ఇది, శ్రీవాసుదేవ కరుణాకటాక్ష వీక్షణాకలితశృంగారరసప్రధాన సంగీత సాహిత్య భరత శాస్త్రవిద్యాపారంగత శ్రీమద్యాజ్ఞవల్క్యాచార్య పదారవింద మరందబిందు సందోహపానతుందిల మిళిందీ భూతనిజాంతరంగ శ్రీమృత్యుంజయార్యపుత్ర కాశ్యపగోత్రపవిత్ర సుజనవిధేయ లింగముగుంట మాతృభూతనామధేయ ప్రణీతం బయిన యభినయదర్పణం బను మహాప్రబంధమునందు నసంయుతాఖ్యాష్టా వింశతిహస్తంబులను బరుగుచున్నయది ద్వితీయాశ్వాసము.  60

—  

You Might Also Like

Leave a Reply