ఛొమాణొ ఆఠొ గుంఠొ (ఒడియా నవల)

(ఈ వ్యాసం డీ.టీ.ఎల్.సీ వారి సమావేశంలో జరిగిన చర్చ పాఠం. వ్యాసం ప్రచురించేందుకు అనుమతించిన డీ.టీ.ఎల్.సీ వారికి ధన్యవాదాలు.ఈ వ్యాసం కాపీరైట్లు డీ.టీ.ఎల్.సీ. వారివి. – పుస్తకం.నెట్.)

చర్చాంశం: ఛొమాణొ ఆఠొ గుంఠొ
నవల ఒడియా మూలం: ఫకీర మొహన సేనాపతి, 1902. తెలుగు అనువాదం: పురిపండా అప్పలస్వామి, 1956
చర్చాస్థలం, తేది: ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్, జనవరి 30, 2011
చర్చ సమీక్ష: బూదరాజు కృష్ణమోహన్


కథ(స్థూలంగా):

రామచంద్ర మంగరాజు గారు బీద కుటుంబంలో జన్మించినా, అనేక కుతంత్రాలతో ఒడిశాలోని ఒకానొక జమీందారీ తన కైవసం చేసుకొని, దాని ఆధీనంలో ఉన్న గ్రామాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుంటారు. ఆయన ప్రధాన ఆయుధం నగదూ,ధాన్యమూ వడ్డీకి ఇతరులకి ఇచ్చి, జరిమానా షరతుగా వారి భూములు తన స్వాధీనం చేసుకొవడం. అలా ఆ చుట్టుపక్కల అటు నాలుగు కొసులూ, ఇటు నాలుగు కోసులలో మరొకరి వ్యాపారం గానీ, గోష్పాదం అంత భూమి గాని మిగలనివ్వలేదు.
మంగరాజు గారికి మరొక ప్రచ్ఛన్న ఆయుధముంది. ఆవిడే చంపా. పేరుకి దాసి అయినా, ఆ ఇంటికి ఆవిడే మహారాణిలా వ్యవహరిస్తూ ఉంటుంది. ధర్మ చింతన గల మంగరాజుగారి భార్య హితబోధలు ఆయనకి రుచించవు. పైగా చంపా హేళనకి గురి
అవుతుంటాయి. మంగరాజు గారి కన్ను, ఒక అమాయక సాలీ దంపతులకు అదృష్టవశాత్తూ లభించిన (కథ పేరులో ఉన్న) ఒక ఆరు ఎకరాల ఎనిమిది కుంటల సారవంతమైన భూమి మీద పడుతుంది. మరో వైపు, కాస్త మంచిపేరున్న పక్క ఊరి జమీందారీ వంశంతో బధ్ధ వైరం ఏర్పడుతుంది. చంపా అద్భుతమైన వ్యూహాలు పన్ని ఈ రెండూ మంగరాజు గారికి సాధించిపెడుతుంది. మంగలి జగన్నాథం కూడా తన పాత్ర నిర్వహిస్తాడు. అటు, వైరివంశం ఆస్తి సర్వనాశనం అవుతుంది. ఇటు, భూమిని కోల్పోయి సాలీ దంపతులు శారియా, భగియా వీధిన పడతారు. వారి సర్వస్వమూ, శారియా తాను కన్నకూతురిలా చూసుకుంటున్న ఆవుతో సహా, మంగరాజు ఇంటికి చేరుతుంది. దానితో శారియా మంగరాజుగారి పెరటి గుమ్మంవద్ద పడిగాపులు కాస్తూ ప్రాధేయపడుతూ ఉంటుంది. భర్త చేసే దారుణాలు ఆపలేక, ఆదరణ లేక, భర్త ఎదుటే దాసీ చూపే నిరసన తట్టుకోలేక మంగరాజు గారి భార్య మరణిస్తుంది. మంగరాజుగారి పతనం ప్రారంభమౌతుంది. మంగరాజుగారి పెరట్లో శారియా మరణిస్తుంది. ఆ కేసులో మంగరాజుగారు ఇరుక్కొని జైలు పాలౌతారు. ఖూనీ కేసునుంచి బైట పడేయటానికి, లాయరు తెలివిగా మంగరాజుగారి జమీందారీ తన పేర రాయించుకుంటాడు. ఈలోగా అందినంత పుచ్చుకొని అందరూ పరారు అవుతారు. అయితే చేసిన పాపాలు వెన్నాడి తగిన ఫలం అనుభవిస్తారు.

చర్చాంశాలు :

“కర్మ ఫలం అనుభవించక తప్పదు” – ఈ కథాంశం తో అనేక కథలు వచ్చాయి. అయితే ఈ నవల ప్రత్యేకత ఏమిటంటే ఆ కథ చెప్పే విధానము. ఇది వ్యంగ్య రసం ప్రధానమైన నవల. అయితే కథా గమనం మాత్రం అంత సరళంగా సాగదు. అనేక పొరలు అనేక కోణాలతో అల్లి బిల్లి గా ఉంటుంది. వాటిలో కొన్ని ఇక్కడ చర్చించడం జరిగింది,కాని నిజానికి నవల్లో అవి అంతర్లీనంగా వుంటాయి.

1) శైలి

ఈ నవల చదువుతుంటే మనకు రచయిత ఇద్దరిలా కనిపిస్తారు. ఒకరు కథ వ్రాసిన వారు. ఇంకొకరు ఆ కథని మనికి వినిపించే వారు. ఎలా ఉంటుందంటే ఒక రకమైన వీధిభాగవత సాంప్రదాయమల్లే కథతో పాటు అవి ఇవి వస్తూంటాయి.”చెబుతాం
చెబుతాం” అంటూ అసలు విషయాన్ని దాటవేస్తూ ముందుకీ వెనక్కీ వెళ్తునట్టు ఉంటుంది. కొన్ని చోట్ల కథ ఒక lane లో వెళ్తూ ఉంటుంది, పక్క lane లో మీ అభిప్రాయం ఏర్పర్చుకుంటూ మీరు వెళ్తూ ఉంటారు … ఇంతలో traffic light పడి, కథ ఆగి, వ్యాఖ్యానం మొదలౌతుంది. ఈ రకమైన శైలి కాస్త అలవాటయ్యే వరకు పాఠకులలో కొంత అసహనం కలగ వచ్చు. ఒక రకంగా ఇది కథ నుంచి విడిగా రచయిత తనకోసం ఏర్పర్చుకున్న ఒక ‘మంచె ‘ . మంచె మీద నుంచోని రచయిత కథని అడ్డంపెట్టుకొని వ్యంగ్య బాణాలు విసురుతారు, లాయరులా వాదిస్తారు, సంస్కృత సుభాషితాలు చెపుతారు, కొన్నిటికి వక్ర భాష్యాలు చెపుతారు, ఒకచో చిన్న ఉపదేశం చేస్తారు. అయితే శైలి లోని వ్యంగ్యం , ఉక్తి చమత్కారం పాఠకులను తన పట్టులో ఉంచుకుంటుంది.

2)అధిక వ్యాఖ్యానం ?

ఈ నవలలో అక్కడక్కడ చెప్పే విషయం విపరీతంగా విస్తరించబడి ఉంటుంది. వ్యంగ్యంలోనూ,హస్యంలోనూ – ఒక సర్జెన్ వాడే కత్తి లాగ – నిశితంగా, సూటిగ చెప్పగలిగే ఈ రచయిత ఎందుకిలా సాగదీస్తున్నట్టూ? ఇందులో ఇంకేదో ఆంతర్యం ఉండి
వుండాలి. అది మొదటి సారి చదివినప్పుడు అందదు.ఆ విషయం, ఈ విషయం మధ్య కథాపరమైన కొన్ని రహస్య సంకేతాలు దాగుంటాయి. గడ్డివామంత వ్యాఖ్యానంలో సూదంత సూచన ఇవ్వడం ఈయన ప్రత్యేకత. ఈ కోవలో… గ్రామ దేవత వర్ణనలో మంటపం వెనకాల సొరంగం; చంపా రూప వర్ణన లో ఎత్తు పన్నూ, ముక్కుకున్న నిమ్మ గుత్తి; టాంగీ పిన్ని అతి జాగ్రత్తగా నీళ్ళ చెంబు చేత్తో మూతవేసి తీసుకువెళ్ళడం .. ఇత్యాది సంకేతాలను అలవోకగా స్పృశించి వదిలేస్తారు రచయిత. ఈ వైనం టాంగీ పిన్ని ఉదంతంలో బాగా పండించారు.

3)సంస్కృతం

ఈ నవలలో మరో అంశం సంస్కృత వాక్యాల ప్రయోగం. ఇందులో మనుస్మృతి నుండీ, సంస్కృత సుభాషితాలనుండీ, చాటువులనుండీ, కాళిదాస కావ్యాలనుండి దాదాపు 40/50 సంస్కృత వాక్యాలు కనిపిస్తాయి. రచయిత సంస్కృత భాషా పరిజ్ఞానం, దానిని తన వాదానికి ఊతగా వాడుకోవడం కొంత ఆకర్షిస్తుంది. కాళిదాసు యక్షిణి కొనదేరిన చక్కని పలువరుసతో ‘శికరి దశనా’ అయితే , ఈయన ‘శిఖరి ‘ అంటే కొండనీ, చంపా ఎత్తుపళ్ళు కొండ శిఖరంలా పైకి వచ్చి ఉండడం వల్ల ఆమె కూడ ‘శికరి దశనా’యే అంటాడు. ఇది చదివినప్పుడు ‘శ్రీ రఘురామ చారు తులసీదళ..’ పద్యానికి భాష్యం చెప్పిన చిలకమర్తి వారి గణపతి గుర్తుకు వస్తాడు. అలాగే అయినదానికీ కానిదానికీ ‘శాస్త్రకారుడేమన్నాడంటే ..’ అనే గురజాడ గారి గిరీశం గుర్తుకు వస్తాడు. అలా సరదాగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్టుండీ ‘ఈ సంస్కృత వ్యాక్యానికి అర్ధం అలా విన్నట్టు లేదే! ‘ అని ఒక్క సారి ఉలిక్కి పడతాం . ఇంకొంత ముందుకి పోయాక రచయిత సొంత శ్లోకాలు మొదలౌతాయి. గ్రామదేవత శ్లోకం , ‘ యా దేవి వృక్ష మూలేషు శిలారూపేణ సంస్థితా..’ దేవి స్తోత్రాల పై చేసిన ఒక పేరడీ.ఏది శాస్త్రమో ఏది కల్పితమో అన్న అనుమానం మొదలౌతుంది. ఇలా తమ స్వార్ధం కోసం శాస్త్రవాక్యాలనో, పురాణాలనో లేదా మరేదైనా ప్రమాణమో చూపించి, తాము చెప్పే విషయాలకు ఒక అధికారం ఆపాదించాలని చూసే ప్రబుద్ధులుంటారు సుమా ! — అని హెచ్చరించడమే ఈ సంస్కృత వాక్యాల ప్రయోగం వెనుక ఉన్న ప్రయోజనం కావచ్చు !

4)సాంఘిక జీవనం

ఈ నవల ఒకనాటి ఒడిశా సాంఘిక జీవనానికి అద్దం పడుతుంది. జమీందారి వ్యవస్థ, కులవృత్తులు, పోలీసు వ్యవస్థ, శిస్తులు ఇలాంటి అనేక విషయలపై వివరాలు విపులంగా ఈ నవలలో ఉంటాయి. జమీందారీలు వంశపారంపర్యంగానే కాకుండా
వేలంలో కొనుక్కునే పద్ధతి కూడా British పాలనలో ఉండేదని తెలిస్తుంది. ఇక జమీందారీలే కాకుండా, కుల పెద్ద పదవులు , పౌరోహిత్యాలు ఇవన్నీ వంశ పారంపర్యంగా కొనసాగుతూ ఉండేవి. న్యాయవ్యవస్థ చూస్తే అంతరించి పోతున్న
గ్రామ/కుల పంచాయితీలు , వాటి స్థానాల్లో వచ్చిన కోర్టులూ, వకీల్లు, వకీల్ల సాయం తో నేరాలు చేసి తప్పించుకు తిరిగే డబ్బున్న వాళ్ళు, నాన బాధలు పడే బీద వాళ్ళు – ఇలాంటివి ఆనాడూ ఉన్నాయని తెలుస్తుంది. “ఉభయ పక్షాలు కేసుల్లో ధనం ధారపోసి బికారులౌతున్నారు. ఆ సొమ్మేమో రాకాసి మింగేస్తోంది. పంచాయితీ అయితే నేరం చేసిన వాడికి పడే జరిమాన మంచిపనికే వినియోగ పడేది” అంటాడు రచయిత. కాలం తో మార్పు రాని పంచాయితీలు ఇంగ్లిషు “లా” ముందు వెలవెల పొయాయి. కాలనుగుణంగా తమ పద్దతులు మార్చుకోలేని మోసగాళ్ళకీ అదే గతి పడుతుందేమో ! జమీందారుల విషయమే తీసుకోండి. 30 యేళ్ళ పొలీసు ఉద్యోగంలో తిన్న డబ్బుతో దిల్ దార్ మియా తండ్రిగారు జమీందారీ వేలంలో కొన్నారు. జమీందారీ కొడుకికి వచ్చింది. శిస్తులూ, దస్తావేజుల వ్యవహారం తెలియని అతనిని మత్తులో ఉంచి జమీందారీ మంగరాజు కాజేస్తాడు. కోర్తు కేసు వ్యవహారం తెలియని మంగరాజునుంచి తేలికగా లాయరు లాగేస్తాడు. మంగరాజుగారిది రాబంధువు పద్దతి,లాయరిది సుడిగాలి పద్దతి.(నూరు గొడ్లు తిన్న రాబంధువు …). ఇక సామాన్య ప్రజల జీవితానికొస్తే, జమీందారులు మారినా ప్రజల జీవితంలో తేడా ఏమీ లేదు. “గుర్రాన్ని దొంగలెత్తుకుపోతే దానికేమంటా” అంటాడు రచయిత. రౌతు మారినా దాని బతుకు మారదు.

5)వ్యంగ్యము

ఇది వ్యంగ్య రస ప్రధానమైన నవల. అడుగడుగునా తొణికిసలాడుతుటుంది. సేనాపతి గారి వ్యంగ్యం వాత పెడితే చమత్కారం చక్కిలిగింతలు పెడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వ్యంగ్యాన్ని ఇంకో భాషలోకి అనువదించడం అంత తేలికైన
పని కాదు. ఈ విషయంలో పురిపండా గారు నూటికి నూరుశాతం సఫలీకృతులయ్యారు. అనువాదంలోని వ్యంగ్యమే ఇంత గిలిగింతలు పెడితే ఇంక మూలంలో మరింత బావుండి ఉండాలి. సేనాపతి గారి వ్యంగ్యానికి లొంగనిది ఏదీ లేదు. ఒక్క మాటలో : Nothing is sacred. ఇది స్వయంగా చదివి ఆనందించవలసిందే. అయినా కొన్ని మచ్చు తునకలు:

– మంగరాజుగారి తోటలో కాయగూరలు అమ్ముడుపోయేదాకా పైవాళ్ళెవ్వరూ అమ్మడానికి అధికారం లేదు. అది సబబే కూడాన్నూ. ఏమంటారా, మంచి దినుసు అమ్ముడుపోకుండా, చెడ్డ దినుసు అమ్ముడుపోవడం న్యాయం కాదు కదా !

– సృష్టి లో మంచీ చెడ్డా కలిసి ఉంటుంది. చూడండీ, పనసతొనలు ఎంత తీయగా ఉంటాయి. కాని వాటిలోపల ఉండే పొట్టు మహా చెడ్డది;మంగరాజు గారి మునగచెట్టులో అంతా మంచిదే కాని దాని కాడలు మాత్రం మహా చెడ్డవి; జీర్ణం కావు. నౌకర్లు
మునగకాడలు ముట్టరు. అవి సరాసరి సంతకి వెళ్ళవలసిందే.

– అమ్మవారిని బాగా పూజిస్తే, గొట్టాలమ్మ వందా యభై మందికంటే హెచ్చుమందిని తీసుకువెళ్ళలేకపోయేది. వదిలేసి వెళ్ళిపోయేది.

– పూర్వం పార్శీ విద్యకి చాలా గౌరవం ఉండేది. కచేరీలో రాజభాషగా ఉండేది. భారతదేశం నుదుట అల్లా రాసిన రాత – నిన్న పార్శీ ఉండేది, ఇవాళ ఇంగ్లీషు.

ఇలాంటివి కోకొల్లలు

6) అంతా వ్యంగ్యమేనా ?

కాదు. అక్కడక్కడా సందర్భాన్ని బట్టి నవల పోకడ మారుతుంది. ముఖ్యంగా మంగరాజుగారి భార్య మరణించిన ఘట్టం, మానవ సంబంధాల మీద ఒక గంభీరమైన ఉపన్యాసంలా ఉంటుంది. పాఠకులను తాత్విక చింతనలోకి తీసుకువెళ్ళి వెనక్కి తెస్తారు. మరొక చోట చంపా వలలో చిక్కుకుపోతున్న శారియ నిస్సహాయత గుండెనుపిండుతుంది. ఈ నవలలో వ్యంగ్యమూ , హాస్యమూ మధ్య సేనాపతి గారు కొన్ని జీవితసత్యాలు పొదిగారు. వాటిలో కొన్ని:

* “తండ్రిని బట్టి కొడుకు” అంటారు లోకులు. కాని ఇంకోమాట ఉంది. “చెట్టు చచ్చే ముందు కుక్కమూతి పిందెలు”
* తమ ఆయుర్దాయమూ, పరాయి వాళ్ళ ధనమూ అధికంగా అంచనా వేసుకోడం లోకుల నైజం.
* ఊరంతటికీ మంచిపొలం ఊరినాయుడు సాగుచేస్తాడన్నమాట
* పిరికి వాడికి శత్రువులుండరు
* మంచికానివ్వండీ, చెడ్డకానివ్వండీ – సామాన్య పరిమితి దాటి ఎవరిగుణం ఎంత హెచ్చయితే వారు అంత సుప్రసిద్ధులౌతారు
* ఎలాంటి సంఘటనలవల్ల పురుషుల మనస్సు విరిగిపోతుందో, అలాంటివన్నీ కోమల హృదయులైన స్త్రీలు సహజంగా ఓర్చేసుకుంటారు. కానీ భర్త హీనంగా చూస్తే మాత్రం స్త్రీ ఓర్చుకోలేదు

తెలుగు అనువాద సాహిత్యం చాలా విస్తృతమైనదే. కానీ ఎందువల్లో ఒడిశా సాహిత్యంపై కప్పదాటు వేసి బెంగాలీ సాహిత్యాన్ని ఎక్కువగా అనువాదం చేశారు మనవాళ్ళు. రాజకీయంగా, సాంస్కృతికంగా బ్రిటిషు కాలంలో బెంగాలీలకున్న ప్రాముఖ్యత కొంత
కారణం కావచ్చు. ఈ నవల రచయిత ఫకీర మోహన సేనాపతి ఒడియాపై బెంగాలీ సాహిత్య పెత్తనాన్ని అరికట్టడానికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఉత్తరాంధ్ర తెలుగు సాహితీ ప్రముఖుల్లో ఒకరైన పురిపండా అప్పలస్వామి తనను ఈ నవలను
అనువదించమని సూచించినవారు విక్రమదేవ వర్మ గారని పీఠికలో చెప్పుకున్నారు. నవల మొదట ఒడియాలో వచ్చింది 1902 లోనే ఐనా తెలుగు అనువాదం జరిగింది 1956 లో. ఈ మధ్యకాలంలో మనకు బెంగాలీ అనువాదాలు ఎక్కువగానే వచ్చాయి. ప్రక్కనే ఉన్న ఒడియా సాహిత్యాన్ని కూడా తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న కోరికతో పాటు ఇంత మంచి నవలను తెలుగు వారికి అందించాలన్నది విక్రమదేవ వర్మ గారి ప్రయత్నం కావచ్చు.

ఎలాగైతేనేం, తెలుగు సాహిత్యానికి ఒక మంచి నవలను పరిచయం చేసిన ఘనత పురిపండా గారిది. 1956 లో ప్రచురించిన ఈ నవల ఇంతవరకూ పునర్ముద్రణకు నోచుకోలేదంటే తెలుగు సాహితీలోకంలో ఎంత మరుగున పడిపోయిందో తెలుస్తుంది.
పరుచూరి శ్రీనివాస్ ఈ పుస్తకం కాపీని ఇవ్వడం, గురజాడకు సమకాలికుడై ఒడియా సాహిత్యాన్ని అంతగా ప్రభావితం చేసిన సేనాపతి నవలను DTLC లో చర్చించమని వెల్చేరు నారాయణరావు గారు సూచించడం వల్ల అనువాద నవల అయినా తెలుగు
సాహిత్యంలో వచ్చిన ఒక మంచి పుస్తకాన్ని చదవగలిగాము.

You Might Also Like

2 Comments

  1. Chowdary Jampala

    ఈ అనువాదాన్ని ప్రోత్సహించిన విక్రమదేవ వర్మ బహుశా జైపూర్ మహారాజా విక్రమదేవవర్మ కాబోలు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఈ జైపూర్ సంస్థానాధిపతి విక్రమదేవవర్మ విశాఖపట్టణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించారని చదివిన గుర్తు.

  2. varaprasad

    కధ స్తూలంగా బాగానే చెప్పారు,మరింత వివరంగా రాస్తే ఒరియా రచయితల శైలి,వారి జీవన వైవిద్యం,పద్దతులు మా లాంటి వారికీ బాగా అర్ధమయ్యేవి, మన తెలుగు నవలలు ప్రాంతాలవారీగా కొద్ది మార్పులున్నా, చిన్నప్పట్నుంచి చదువుతున్నాం కాబట్టి పర్లేదు.ఇతరబాషలూ,రాష్త్రాల పుస్తకాల్ని పరిచయం చేసేప్పుడు,ఇంకొంచెం వివరంగా రాస్తే ఆయా ప్రాంతాల గురించి అక్కడి పద్దతులు,పడికట్లు,అర్ధం చేసుకొనే అవకాశం మాలాంటి వాళ్ళకు కలుగుతుంది.చాలా బావుంది.

Leave a Reply