నన్నావహించిన శాస్త్రవేత్త హోమీ

వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీకి పదహారేళ్లపాటు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైరయిన కొత్త కోటేశ్వర్రావుగారిని ‘ఆంధ్రజ్యోతి ఆదివారం’ కోసం ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లి కూచున్నప్పుడు ఆయనన్నారు కదా ‘‘ఇప్పటి విద్యార్థులకు ఇండస్ట్రియల్ టూర్లు, ఫీల్డ్ విజిట్ల వంటివి ఉండటం లేదు. ముందు తరం నిర్మించిన భారీ స్ట్రక్చర్లను చూసినప్పుడు, వాటి గురించి తెలుసుకున్నప్పుడు వాళ్లలో కలిగే స్ఫూర్తి వేరు. ఇప్పుడెంతసేపూ ముందు బ్యాచ్లో క్యాంపస్ ప్లేస్మెంట్లెన్ని, వాళ్లకొచ్చిన హయ్యెస్ట్ పే ప్యాకేజ్ ఎంత… ఇవే మాట్లాడుకుంటున్నారు కుర్రాళ్లు…’’ అని. ఆర్నెల్ల క్రితం నేను ముంబైలోని ‘భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్’ను సందర్శించి ఉండకపోతేగనక, ఆయన మాటల్లోని నిజమెంతో నా అనుభవానికి వచ్చి ఉండేది కాదేమో! ఆ ప్రయాణంలో తలవని తలంపుగా కంటబడిన ‘A Masterful Spirit Homi J Bhabha’ పుస్తకాన్ని తదేక దీక్షతో మూడు రోజుల పాటు చదువుతూనే ఉన్నాను.

భారతదేశంలో శాస్త్ర విజ్ఞాన రంగాలకు పాదులు తీసిన తొలితరం శాస్త్రవేత్తల్లో హోమీ జహంగీర్ భాభా అగ్రగణ్యులు. మన దేశంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు ప్రాణం పోసిన భౌతిక శాస్త్రవేత్త మాత్రమే కాకుండా, TIFR (Tata Institute of Fundamental Research), అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ (ఇదే తర్వాత పేరు మార్చుకుని బార్క్ గా మారింది) అనే రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలను స్థాపించిన గొప్ప దార్శనికుడు కూడా. ఆయన శతజయంతి సందర్భంగా ఈ పుస్తకం రూపం పోసుకుంది. ‘Human progress has always depended on the achievements of few individuals of outstanding ability and creativeness. Homi J. Bhabha was one of them’ అన్న sir John Cockraft మాటల్లో వీసమెత్తయినా కాదనదగ్గది లేదు. రెండొందల అరవై పేజీల ఈ పుస్తకంలో పది అధ్యాయాలున్నాయి. ముంబైలో సంపన్నులయిన పార్శీల ఇంట పుట్టిన హోమీ జహంగీర్ భాభా బాల్యం, ఆయన చదువు, కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడు ఫిజిక్సుతో ప్రేమలో పడటం, ప్రవాసం, బార్క్ పుట్టుపూర్వోత్తరాలు, ‘అణు సామ్రాజ్య’ స్థాపన వంటి వివరాలను విపులంగా అందిస్తుందీ పుస్తకం. అలాగని తేదీలను, గణాంకాలను డ్రైగా చెప్పదు. గొప్పగా చదివిస్తుంది. అపురూపమైన ఛాయాచిత్రాలెన్నో ఈ పుస్తకానికి ఆకర్షణనిస్తే, ఆనాటి ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో, ఇతరులతో హోమీ భాభా నడిపిన ఉత్తరప్రత్యుత్తరాలను ప్రచురించడం అదనపు విలువను సమకూర్చింది.

ఈ పుస్తకంలో నన్ను మరింత ఆకట్టుకున్నది ‘హోమీస్ అదర్ వరల్డ్’ అని కనిపించిన తొమ్మిదో అధ్యాయం.

‘I know clearly what I want out of life. Life and my emotions are the only things I am conscious of. I love the consciousness of life and I want as much of it as I can get. But the span of one’s life is Limited. What comes after death no one knows. Nor do I care. Since, therefore, I cannot increase the content of life by increasing its duration, I will increase it by increasing its intensity. Art, music, poetry and everything else that I do have this one purpose – increasing the intensity of my consciousness of life.’

(Homi Bhabha, letter to Jessie Maver, 1934)

చిన్నప్పుడు పెయింటర్ కావాలని తపన పడిన హోమీలో ఆ తపన ఆయనతో పాటు పెరిగిందేగాని తగ్గలేదు. ఆయన గీసిన స్కెచ్లు, నైరూప్య చిత్రాలు, పోర్ట్రయిట్లు వంటివాటిని ఈ పుస్తకంలో చూసినప్పుడు గొప్ప సంతోషం కలిగింది. ఒక్క పెయింటింగ్ అనే కాదు, సంగీతం, సాహిత్యం, గార్డెనింగ్… ఇలా కొన్ని గొప్ప ఆసక్తులున్న హోమీలోని విభిన్న పార్శ్వాలను ఈ అధ్యాయం తేటతెల్లం చేస్తుంది. టాటా ఇనిస్టిట్యూట్ కొత్త భవనం మెయిన్ హాల్లో పెట్టదగిన ఒక మ్యూరల్ కోసం 1962 అక్టోబర్లో హోమీ దేశంలో ప్రసిద్ధులైన పన్నెండుమంది కళాకారులకు ఆహ్వానం పంపారు. వచ్చినవాటిలోంచి భాభా, కమిటీ సభ్యులు కలిసి ఎం.ఎఫ్. హుసేన్ గీసిన ‘భారత భాగ్య విధాత’ డిజైన్సు ఎంపిక చేశారు. ఈ మ్యూరల్ను గీయడం 1964 నాటికి పూర్తిచేశారు హుసేన్. ‘నన్నడిగితే, టాటా ఇనిస్టిట్యూట్లో భాభా సేకరించి పెట్టిన కళాఖండాలు సాటిలేనివి. ఆయన కళాప్రపంచానికిచ్చిన అత్యుత్తమ కానుక అదే. అలాంటి సేకరణ మరోచోట కనిపించదు’ అన్నారు హుసేన్ ఒక ఇంటర్వ్యూలో. ‘Bhabha is a perfect example of the opposite of what C.P.Snow refers to as the alienation of scientists and humanists. He represented the best in the modern educated world, the best of science, of the arts. Bhabha not only understood the language of modern science but was thrilled with a recital of Bharata Natyam or a beautiful bronze from a temple’ అన్న విక్రమ్ సారాభాయి మాటలు ప్రత్యక్షర సత్యాలనిపిస్తుంది.

ఇన్ని మాటలెందుకు? ఒక్కటిమాత్రం నిజం – ఈ పుస్తకాన్ని చదవడమో, బార్కును చూడడమో – ఏది 2000 సంవత్సరానికి ముందు జరిగినా నేను సైన్సెస్ ను వదిలి జర్నలిజం వైపు రాకపోయేదాన్నేమో! అంతగా నన్ను ప్రభావితం చేసింది. కనీసం మూడు నెలల పాటు ఈ పుస్తకంతోనే గడిపేంతగా నన్ను వశపరచుకున్న శాస్త్రవేత్త హోమీ. తొమ్మిది పదో తరగతుల విద్యార్థులు మొదలుకుని సైన్సెస్ తో ఏపాటి పరిచయం, ఆసక్తి ఉన్నవారయినా తప్పక చదవాల్సిన పుస్తకమిది.

Title : A Masterful Spirit Homi J Bhabha (1909 -1966)
Authors : Indira Chowdhury & Ananya Dasgupta
Published by : Penguin books 2010
Pages : 260, Price : rs.1299.

పెంగ్విన్ లంకె ఇక్కడ.

రచయిత్రుల గురించి కొంచెం:
ఇందిరా చౌధురి బెంగళూరులోని Archival Resources of Contemporary History (ARCH) వ్యవస్థాపకురాలు. కోల్కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసరుగా పనిచేశారు.
అనన్య దాస్ గుప్తా కోల్కతాలోని టెలిగ్రాఫ్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం TIFR ఆర్కైవ్స్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

You Might Also Like

11 Comments

  1. వీరభద్రం

    ఏదో పత్రికలో రివ్యూ చదివి,ఆన్ లైన్లో కొన్నాను.సి.వి రామన్ అంతటి వారు డా విన్సి తో పోల్చిన వ్యక్తి కాబట్టి తప్పకుండా Surely You are joking Mr Feynman! లాగా శాస్త్రవేత్త జీవితంలోని ఆసక్తికరమైన అంశాలతో ఉంటుంది అనుకున్న నాకు,పుస్తకం తెరవ గానే విషయం కన్నా బొమ్మలు ఎక్కువగా కనిపించ గానే,నిరాశ పడినప్పటికీ,నెమ్మదిగా ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉంటే,ఒక అసాధారణ ప్రతిభావంతుని బహుముఖ ప్రతిభ కళ్ళెదుట సాక్షాత్కరిస్తున్నప్పుడు పుస్తకం విలువ తెలిసొచ్చింది.

  2. shobha

    Aruna,
    though i didn’t know much about science n homi baba,i liked your article.i will try to give the book to my son.
    shobha

  3. Rohiniprasad

    నేను భాభా అణుకేంద్రంలో పనిచేస్తున్నప్పుడు మా సహోద్యోగి ఒకతను ఒక విషయం point out చేశాడు. Van de Graaf దగ్గర నిలబడి చూస్తే ఒక రోడ్డు తిన్నగా Plutonium Plant దిశగా వెళుతుంది. ఆ రోడ్డు చివరన ఒక పెద్ద పొగగొట్టం టవర్ కనబడుతుంది. దాని మొదలు సరిగ్గా రోడ్డు వెడల్పుకు సమానం. అందువల్ల ఆ రోడ్డే ఆకాశంలోకి చొచ్చుకు వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది భాభా బుద్ధిపూర్వకంగా రూపొందించిన ఏర్పాటు. స్వయంగా చిత్రకారుడు కనక ఆయనకు ఉండిన కళాత్మక దృష్టికి ఇదొక ఉదాహరణ.

  4. కొత్త పాళీ

    @ దుప్పల రవి. విచిత్రంగా ఉన్నది మీ అనుభవం. ఒక్కోసారి మహానుభావుల వ్యక్తిగత దుర్దృష్టం మనబోంట్లకి వరప్రసాదమవుతుంటుంది. శ్రీనివాస శిరోమణి అనే మహా పండితుడు వాల్మీకి రామాయణాన్ని తెలుగు వచనంలో రాయడానికి సంకల్పించే నాటికే ఆయనకి తీవ్రమైన అనారోగ్యం వచ్చి, వ్రాయసకానిగా యువకుడైన ముళ్ళపూడి వెంకటరమణని జీతానికి ఏర్పరుచుకున్నారుట. ఆ అనుభవం వ్యక్తిగా రచయితగా రమణమీద బలమైన ముద్ర వేసిందని రమణే తొలి కోతికొమ్మచ్చిలో చెప్పుకున్నారు.
    ఆర్యీసీ మాజీ ప్రిన్సిపాల్ కోటేశ్వర్రావుగారు ఒక్కరే, మరొకరు ఉండే ఆస్కారం లేదు. ఆయన మాకు ప్రిన్సిపల్‌గా కాక వేరే రూపంలో సాక్షాత్కరించి ఉంటే బాగుండి ఉండేది!

  5. శ్రీరాం వేలమూరి

    excellent aruna gaaru, keep writing

  6. దుప్పల రవికుమార్

    అరుణగారూ, కోటేశ్వర రావుగారంటే, కళ్లకి వెళ్లే రక్తనాళం దెబ్బతిని శాశ్వతంగా చూపును కోల్పోయిన కోటేశ్వరరావు గారేనా? నాకు విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్శిటీకి దగ్గర్లో ఒక కోటేశ్వరరావుగారితో పరిచయం వుంది. ఆయనకూడా వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయినవారే. ఎమ్మే ఇంగ్లిషు యూనివర్శిటీలో చేస్తున్నప్పుడు, మిగతా మిత్రులు స్కూల్స్ లో పనిచేస్తుంటే నాక్కూడా డబ్బులు సంపాదించాలని ఆశపుట్టి ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకరోజు పేపర్లో ప్రకటన పడింది. ఆ ఉద్యోగానికి దాదాపు ఇరవైమంది దాకా వచ్చారు. అందులో సెలక్ట్ అయ్యాను. ఇంతకీ ఉద్యోగం ఏమటే నాకెంతో ఇష్టమైన పుస్తకాలు చదివే వుద్యోగం. ప్రొఫెసర్ గారికి సైన్స్ చరిత్ర రాయాలని కోరిక. ఇక చూడండి రోజుకు మూడు గంటలపాటు జేడీ బెర్నాల్, ఐజాక్ ఆసిమోవ్ మొదలుకుని ఎన్ని సైన్స్ పుస్తకాలు చదివి వినిపించానో… నేను అక్కడ నా ఎమ్మే అయినంతవరకూ పనిచేశాను. ఇంతలో ఈనాడులో వుద్యోగం రావడంతో వైజాగ్ నుంచి వెళ్లిపోయాను. అప్పట్లో శ్రీకాకుళం యువకుడిగా నా ఇంగ్లిష్ పలకడం ఘోరంగా వుండేది. ఆయన నన్ను సరిదిద్దారు. ఎన్నో పదాలకు, వాక్యాలకు అర్థాలు చెప్పేవారు. నిజంగా నా జీవితంలో ఆ ఆరేడు నెలలూ మరిచిపోలేని, పునాది పడిన మహత్తర అనుభవాలు. నాకాయన ఫోన్ నెంబరు ఇవ్వగలరా?

  7. S.Ramu

    thanks ma’am.
    I’ll try to give this book to my daughter. Its good that you didn’t read the book and you didn’t visit BARC.
    Ramu
    apmediakaburlu.blogspot.com

  8. అరుణ పప్పు

    కుమార్ గారూ, కొత్త కోటేశ్వర్రావుగారి ఇంటర్వ్యూ నేను బ్లాగులో పోస్ట్ చేసి లింకు ఇక్కడ ఇస్తాను.
    లక్ష్మన్నగారూ, అభినందనలకు ధన్యవాదాలు. ఇకపై మీనుంచి మంచిమంచి పుస్తక పరిచయాలు విరివిగా వస్తాయన్నమాట.

  9. విష్ణుభొట్ల లక్ష్మన్న

    TIFR పేరు, హోమీ భాభా పేరు చదవగానే ముప్ఫై ఏళ్ళ క్రితం TIFR తో నా అనుబంధం గుర్తుకి వచ్చింది! అమెరికా వలస రాక ముందు నేను భౌతికశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందింది TIFR లోనే! అప్పటికే మా అన్నయ్య అక్కడే డాక్టరేట్ పరిశోధనలో ఉన్నాడు. TIFR campus లోనే కల్యాణితో పరిచయం కలగటం అది పెళ్ళికి దారితీయటం జరిగింది. మా మమగారు TIFRలో భౌతికశాస్త్రంలో ప్రొఫెసర్. ఇంతగా TIFR నా జీవితంతో ముడిపడి ఉన్న సంస్థ!

    హోమీ భారతదేశం న్యూక్లియర్ ప్రోగ్రాంకి దిశానిర్దేశం చేసినవాడు. ముంబాయి లోని పెద్ద, పెద్ద కార్పొరేషన్లు ఎవరైనా TIFR నుంచి ఉద్యోగాం కోసం వస్తే, ఇంటర్వ్యూ చెయ్యకుండా ఉద్యోగం ఇస్తున్న రోజులు అవి. నన్ను ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నా హోమీ గురించి, TIFR ను రూపోందించటంలో హోమీ పాత్ర గురించి మళ్ళీ చవగానే ఆనందం ఆపుకోలేక రాస్తున్న అభిప్రాయం ఇది.

    అరుణ గారికి అభినందనలు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

    (నేను జర్మనీలో నా పని పూర్తి చేసుకొని తిరిగి అమెరికా వచ్చి 10 రోజులు అయింది. ఇక ముందు ఏదైనా పుస్తకం.నెట్‌కి రాయాలి!)

  10. KumarN

    oops Homi Bhabha

  11. KumarN

    Yes, I was always fascinated by Home Bhabha. What he has done to our country is immeasurable. By the way, where can I get the link for Koteshvara Rao gari’s interview? As a student of that college, I am a bit curious.

Leave a Reply to కొత్త పాళీ Cancel