The World is a comedy – Kurt Tucholsky

ఏప్రిల్ మొదటి వారంలో, ఏమీ తోచక, ఒక అరుదైన పుస్తకాలు అమ్మే దుకాణం లోకి అడుగుపెట్టాను. అన్ని జర్మన్ పుస్తకాల మధ్య “the world is a comedy” పేరిట, ఒక ఇంగ్లీషు పుస్తకం కనిపించింది. ఆ పేరుకి ఆకర్షితురాలినై, పుస్తకం తీసి చూస్తే, కవర్ పేజీ పై:

“For the first time, English readers, to whom the humor of Kurt Tucholsky has been a sealed book, will now be able to enjoy the wit of the man on whose head the Nazis set a price and whose books have appeared in most European Languages. In Germany alone, he has had millions of readers, and he rates as the foremost satirist of the past generation, writing in German”

అని కనిపించింది. అంతే! కట్ చేస్తే, నేను పుస్తకం ధర గురించి ఎంక్వయిర్ చేసి, అవాక్కై, అయినా కూడా కొంటూ ఉన్నాను కౌంటర్లో! అలా కొన్నందుకు ఇప్పుడు మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నా అనుకుంటున్నాను. అప్పట్లోనే, ఏకబిగిన చదివించింది పుస్తకం. ఆతర్వాతి కొద్ది రోజుల్లో ఈయన గురించి కనబడ్డ అందరికీ చెప్పాను కూడా. ఇల్లు సర్దుకుంటూ ఉండగా, మిగితా పుస్తకాల వెనుక కనబడ్డంతో, ఇవ్వాళ దీని గురించి రాద్దాం అనిపించింది.

కుర్ట్ టుఖోల్స్కి గురించి ఒక చిన్న పరిచయం: ఆయన జర్మనీ కి చెందిన ఒకప్పటి ప్రముఖ పాత్రికేయులు, వ్యంగ్యకారులు, ఆలోచనాపరులు. ౧౮౯౦-౧౯౩౫ ల మధ్య జీవించారు. ప్రజాస్వామ్య వ్యతిరేఖ శక్తులు పుంజుకోవడం గురించి ముందుగా ఊహించి హెచ్చరించిన వారిలో ఆయనా ఒకరు. తరువాతి కాలంలో నాజీల పాలన ఆయన ఊహలు ఆధారం లేనివి కావని నిరూపించింది. నాజీలు పాలనలోకి వచ్చాక ఆయన పుస్తకాలని దిగజారుడు సాహిత్యం అంటూ తగులబెట్టారు. తరువాత అయన జర్మన్ పౌరసత్వం కూడా కోల్పోయారు. చివరకు అనారోగ్య కారణాల వల్ల ౧౯౩౫లొ స్వీడెన్లో మరణించారు. ఆయన గురించి, ఆయన రచనల గురించి వివరంగా తెలుసుకోనగోరే వారు ఆయన గురించి గల ఆంగ్ల వికీపీడియా పేజీ నుండి మొదలుపెట్టవచ్చు. కుర్ట్ రాసిన వ్యాసాల ఆంగ్లానువాదాలు వచ్చిన తొలి పుస్తకం ఇదే అనుకుంటాను. అయితే, ఇప్పుడు మాత్రం ఒక బ్లాగులో కుర్ట్ రచనల ఆంగ్లానువాదాలు కనబడ్డాయి.

విషయానికొస్తే, ఈ పుస్తకం టుఖోల్స్కి వ్యాసాల సంకలనం. “To Posterity with greetings” అన్న వ్యాసం మొదటిది ఇందులో. అందులో ఉన్న –
“Naturally, you have in your life, three hundred trivial gadgets more than we had, and for the rest, you are just as stupid, just as smart, just as we are.”
-అన్న వాక్యం ఎప్పుడో ఎనభై తొంభై ఏళ్ల క్రితం నాటిదైనా, ఇంకా సార్వజనీనంగా అనిపించడం లేదూ?

“Face of a German”, “A Look in to the future”, “One who enjoys life”, “There is no virgin snow”,”Husband and wife tell a joke”, “Psychology on a hotel terrace” -ఇలాంటి పేర్లలాగే, ఈ వ్యాసాలలో కూడా భిన్న విషయాలను స్పృశిస్తూ సాగుతారు. మానవ సంబంధాల నుండి, ఫిలాసఫీ దాకా, ఈ పుస్తకంలో అన్నింటి గురించీ ప్రస్తావించి తనదైన శైలిలో జర్మన్ జీవితం పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు అని నాకు అనిపించింది. వీటిలో కొన్ని అందరికీ వర్తించేవే. పిట్ట కథలు చెబుతున్నట్లు ఉంటూనే, మధ్యలో చురకలు అంటించడం లో కుర్ట్ హాస్యం, వ్యంగ్యం నాకు చాలా నచ్చాయి. అయితే, చారిత్రిక పరిజ్ఞానం విషయం అటు పెడితే, అప్పటి సమకాలీన సామాజిక స్వరూపం గురించి, జర్మన్ తత్త్వం గురించి నాకంత అవగాహన లేదు. అందువల్ల కొన్ని చోట్ల అర్థం కాలేదు. కానీ, ఇది ఏ దేశపు రాజకీయ, వ్యంగ్య రచనలు చదివినా ఉండే సమస్యే అనుకుంటాను.

నా అభిప్రాయంలో, ఇది తప్పక చదువవలసిన పుస్తకం. కానీ, సమస్యేమిటంటే, బహుశా ఇదిప్పుడు అలభ్యం! (అందుకే షాపు వాడు దానిపై వేసున్న ధరకు ఐదింతలకి అమ్మాడు నాకు!)

పుస్తకం గురించి వివరంగా రాద్దామనే మొదలుపెట్టాను కానీ, ఎలా రాయాలో? ఏం రాయాలో? అర్థం కాక, ఆపేస్తున్నాను.

పుస్తకం వివరాలు:
The world is a comedy : A Tucholsky Anthology
Translated and Edited (with an introductory essay) by Harry Zohn, Brandeis University, German Department
Sci-Art Publishers, Cambridge, Massachusetts, USA.
1957.

You Might Also Like

Leave a Reply