“ఇంద్ర ధనుస్సు” పుస్తక ఆవిష్కరణ

రాసిన వారు: తాతా రమేశ్ బాబు.

************************

అక్షరం మాటున అనైత్యం

మనిషి నిటారుగా నిలబడి నడవటం మొదలు పెట్టి 60 లక్షల సంవత్సరాలు అవుతోందని, ఈ మధ్య అమెరిక శాస్త్రవేత్తలు నిర్థారించారు. అయితే నిలబడి నడవటానికి గల కారణాలపై అన్వేషణ జరపవలసి వుందని ప్రకటించారు.  తన మనోభావాలను ఎదుట వారితో చెప్పే ప్రయత్నం నుంచి భాష పుట్టి ఉండవచ్చు . అలాంటి  తెలుగు అక్షరం పుట్టుక ,వాడుక ,పరిణామాలు గురించి, అంతర్భాగంగా సంస్కృతి ,చరిత్రల నేపధ్యంలో గత దశాబ్దకాలంగా ప్రపంచంలో చాలా చోట్ల సభలు జరుగుతున్నాయి . జరగవలసినదే! అయితే ఆ జరిగే తీరు ఆయా నిర్వాహకుల ఆర్ధిక సామాజిక స్థాయిని పెంచిందేమో కానీ వీటికి ఒనగూరిన ప్రయోజనం ఏమి లేదు. పైగా ఒకింత అస్పష్టత ను పోగు చేసాయి.ఉదాహరణకి, మనం ఆకాశం లోకి చూస్తున్నాము అనుకోండి. ఆయా మబ్బులలో వివిధ ఆకారాలని దర్శిస్తూ ఉంటాం,మన మానసిక పరిస్థుతులను బట్టి. ఒకడు, ఆ మబ్బులో “అ” అక్షరం లాగా కనపడుతోంది కాబట్టి ,ఒకప్పుడు ఆకాశ మంతా “తెలుగు” భాష రాసి ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ,అలాంటి అంశాలను “కొత్తకోణాలు” గా ప్రకటిస్తుంటాడు.  వాడే “సభలు” నిర్వహించే స్థానంలో వున్నాడు కాబట్టి ,ఆ సభలకు తమని పిలవాలి కాబట్టి ,”అవునవును ఇది కొత్త కోణమే” నంటారు, వేదిక మీదకు ఎక్కాలనుకున్నవారు. వేదిక మీద  ఉంటున్న వారు “వాహిని వారి”, “పెద్దమనుషులు ” అని తెలియని మధ్యతరగతి మేధావులు “కామోసు” అనుకుంటారు.  ఈ రకంగా జరిగే అరాచికాలు చూస్తూ ఉంటున్నాం. ఇంకా…. పై వాటి గురించి,”నిన్న,నేడు” గురించే ఆలోచిస్తున్నాం ,”రేపటి”గురించి ఆలోచించాలి అంటూ కూడా సభలు నిర్వహిస్తారు.  ఇదెలా ఉంటుందంటే నిన్న, నేడు-కాసిన్ని రాళ్ళు వెనకేసుకోగలిగాం మరి రేపటి అవసరాలకు కూడా ఇప్పుడే ఆలోచించాలి గదా అన్నట్లు ఉంది . తెలుగును”మేలిమి” భాషగా ప్రభుత్వం  ప్రకటించి, ఇచ్చే “100 కోట్లలో కాసిన్ని కోట్లు వెనకేసుకోవటానికి ,ప్రణాళికలు రూపొందిస్తూన్నాం” అని బాహాటం గా చెప్పినట్లు లేదూ!

మరో విషయం ఇక్కడ చెప్పాలి. పై లాంటి సభలలో కొద్ది నిముషాలు పాల్గొని సందేశమిచ్చినందుకు ఒక రాష్ట్ర “తెలుగు” న్యాయవాదికి 30 వేల రూపాయిలు, ఒక రాష్ట్ర మాజీ “తెలుగు” గవర్నరుకు 15 వేల రూపాయిలు ,ఒక అత్యత్తమ పురస్కారం పొందిన “తెలుగు” సినీ పాటల రచయితకు 15 వేల రూపాయిలు చొప్పున కేవలం” విమాన “ప్రయాణ ఖర్చులుగా చెల్లిస్తూ , ఇలాంటి “గోప్ప”వాళ్ళు సభలలో పాల్గొంటున్నారని “డప్పు” కొట్టి, ప్రభుత్వాల నుండి, ప్రైవేటు సంస్థల నుండి డబ్బు దండుకొంటున్న విషయం మీకు విస్మయంగా లేదూ ! ఇంకా ఐదు నక్షత్రాల , వాహనాల సదుపాయాలు తగ్గకుండా “తెలుగు కోసం” వచ్చే తెలుగు వారి “వెల” ఇలా అఘోరించినందుకు తెలుగు తల్లి “నాడి”పరీక్ష చేసే వైద్యులుగా మారల్సినది” అసలైన “తెలుగు వారుగా ముందు “వైద్యం” ను కనిపెట్టేది మీరే! పైలాంటి పెద్దమనుషులతో సన్మానిస్తామంటూ,బిరుదులూ, అవార్డులు ఇస్తామంటూ, మరింకేదయినా చేస్తామంటూ “వ్యాపార” మయం చేసి లక్షిని ముక్కు పిండి వసూలు చేస్తూ,”తెలుగు దర్జా”లను ఒలకబోస్తూ, పబ్బం గడుపుకొనే “సాహిత్యవార్తలను” నిజమనుకుంటూన్నాం కాదా?!

సరే! ఇహ కవిత్వానికి వస్తే ……

ప్రజల జీవనానికి మార్గ నిర్దేశకతగా కవిత్వం వున్నదశలో వచ్చిన పురాణాలూ, గ్రంథాలూ ప్రజలలో,అటుతరువాత సామాన్య జనంలో సైతం గొప్ప అలజడిని రేపాయి. ఆయా రచనలు, రచయితలూ అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. ముద్రణా సౌలభ్యం లేని రోజులలో, అందరి నోళ్ళల్లో ప్రచారమవటానికి, సంక్షిప్తత ప్రధానంగా, గణాలు నిర్దేశించుకొని పద్యాలు సృష్టించబడ్డాయి. అందుకే “పద్యం” ఆంధ్రుల సొత్తు అయింది .తెలుగు వారి ప్రత్యేకతగా వెలుగొందింది . పద్యాన్ని పగల గొట్టటానికి దుడ్డు కర్రలు ఉపయోగించినా , ఎన్ని దుడ్డుకర్రలు విరిగాయో కానీ పద్యం చెక్కు చెదరలేదు. పైగా మరింత అందాన్ని సమకూర్చుకొంది. కొత్త సొబగులతో అలరారుతోంది.

వచన కవిత్వం ఊపు అందు కొన్నాక కవిత్వం రాయటం, కవిత్వం చెప్పటం, కవిగా అనిపించుకోవటం కోసం ఎందరెందరో ఆరాట పడ్డారు, పడుతున్నారు. తెలుగువారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు కవులే అన్నంతగా చొచ్చుకు పోయారు. ఆ ఆరాటంలో,కవిత్వాన్ని ఒక వ్యసనంగా,కవిత్వాన్ని ఒక పూనకంగా మలచుకొన్నారు. సరస్వతి మాత పూని అక్షర సేద్యం చేయిస్తుందని….ఎవరిని పూనుతుందో, వారు పుట్టిన ప్రదేశం-ఆర్ధిక పరిస్థితి-సమాజంలో స్థానం-మానసిక పరిస్థితి ….ఇత్యాది వాటికీ అనుగుణంగా వస్తువును,శిల్పాన్ని, శైలిని నిర్ణయిస్తుందని అనుకోవచ్చు. చివరికి వచన కవిత్వం స్థాయి ఏ దశ కొచ్చిందంటే, ఒక వాక్యాన్ని రాయటం. దాన్ని ముక్కలుగా విరవటం,అదే కవిత్వమని అనుకోమనటం, ఒక ప్రయోగంగా చెప్పుకోవటం ….. కవిని అనిపించుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతూ,సర్వం కోల్పోవడానికి కూడా సిద్దపడుతూ… ధనం,పలుకుబడి ప్రయోగించి పురస్కారాలు,సన్మానాలు పొందటం … ఇత్యాది దుర్గంధంలో కూరుకు పోయినా, అక్కడక్కడా కవితా పద్మాలు పుష్పిస్తునే వున్నాయి .”వాక్యం…. రసాత్మకం ” గానే కవిత్వాన్ని పండిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ది. 07.08.2011 న కృష్ణా జిల్లా, గుడివాడ దగ్గరగల పామర్రు పంచాయితీ కార్యాలయంలో వీరంకి బుల్లెయ్య రచించిన “ఇంద్రధనుస్సు ” కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది . ఈ సంపుటిని ఆవిష్కరించినది నేనే (తాతా రమేశ్ బాబు ). ఆ సభ విశేషాల పై నా సమీక్ష.

కవితా సౌధాలు నిర్మిస్తున్న “తాపీ” కార్మికుడు,”సహజకవి” బుల్లెయ్య

“ఆధునిక సమాజంలో మనుషులు నివసించటానికి అనువుగా వుండే ఇంటి నిర్మాణ పనులలో తాపీ కార్మికుడుగా పని చేసే వీరంకి బుల్లెయ్య,మనసులు చైతన్యం పొందటానికి కూడా కవితా సౌధాలు నిర్మిస్తున్న చైతన్యశీలి” అని కృష్ణా జిల్లా అధికార భాషా సంఘం సభ్యులు, టివి నటుడు రచయిత,కవి తాతా రమేశ్ బాబు కొనియాడారు. అనంతరం మాట్లాడుతూ అయన, “గత ఆరు దశాబ్దాలుగా, కళా సాహిత్య రంగాలలో, పామర్రు రాష్ట్ర స్థాయిలో విశేష సేవలందించిందని, ఈ గడ్డ మీద జన్మించిన బుల్లెయ్య, కేవలం అయిదవ తరగతి మాత్రమే సాధారణ చదువు చదివి , కారణాంతరాల వల్ల తాపీ కార్మికునిగా జీవిస్తూ కవిత్వం రాయటం స్పూర్తిదాయకమైన విషయమని అన్నారు. అంతేకాదు 2000 సం.లో “కోవెల”, 2005 సం.లో “కదలిక” కవితా సంపుటాలు వెలువరించి కవిత్వాభిమానుల హృదయాలను అలరించారన్నారు.

పామర్రు గత చరిత్ర ను చెబుతూ,” 1945 , నవంబర్ 10 తేదిన “భారతి సమితి “, 1949 లో “గుడివాడ తాలూకా రచయితల సంఘం” ,1951 ,ఫిబ్రవరి 9 వ తేదిన “భారతి సన్మాన సంఘం” మొదలైనవి స్థాపింపబడి వార్షికోత్సవ ,దసరా,వసంత సంచికలు మొదలుకొని 1961 లో రవీంద్రనాథ టాగోర్ శత వార్షిక సంచిక, 1968 .1970 సం.లలో “పామర్రు సర్వస్వం’ లతో పాటు వందలాది పుస్తకాలు వెలువరించి ,సభలు నిర్వహించి ఆంధ్రదేశ సాహిత్యచరిత్ర లో మకు టాయ మానంగా నిలిచింది ఈ గ్రామం అన్నారు. ” అష్టావ దానాలు, శతావధానాలు ,ఆశుకవితా ప్రదర్శనలు ప్రదర్శించి ,ఉపన్యసించి సత్కారాలు ,బిరుదులూ పొందటానికి కవి పండితులంతా ఎదురు చూచేవారని ,అభినవ వాగనుశాసనుడు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ,శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి ,శత సహస్రావధానులు ఓంకారం గురవరాజ కవి, చిట్టి పురుషోత్తమ సోమయాజులు ,బండారు తమ్మయ్య ,విమర్శకాగ్రేసర కొత్త భావయ్య చౌదరి, మొదలగు వారితో పాటు గుడిపూడి ఇందుమతి దేవి ,కనుపర్తి వర లక్ష్మమ్మ ,ఉటుకూరు లక్ష్మి కాంతమ్మ లాంటి వారెందరో ఇక్కడ ఉపన్యాస లిచ్చి సత్కారాలు పొందారన్నారు. ఇంకా 1957 లో కృష్ణా జిల్లా గ్రందాలయ సభ ,1964 లో కృష్ణా జిల్లా పరిషద్ అధ్యక్షుల సన్మానం తో పాటు “మంచి నీటి సరఫరా పధకావతరణ ఉత్సవం “కూడా ఘనం గా నిర్వహించి ఇటు సమాజ ఉద్దరణకు సాహిత్య సభలు,అటు సమాజ అవసరాలకు జనహిత సభలు నిర్వహించిన తేజో ముర్తులున్న పామర్రు గ్ర్రామం ఇది అన్నారు.

ఇంకా గ్రామప్రజల మానసికవికాసానికి, వినోదానికి కళారంగాన్ని 1905లోనే కరణంగారి ఇంటి ఎదురుగ వున్న ఖాళీ స్థలంలో బారాటి పూరి పాక వేసి “పామర్రు సరస సంగీత హిందూ నాటక సమాజం” ఏర్పాటు చేసారు. మొదటి ప్రదర్శనగా బళ్ళారి కృష్ణమాచార్యులు రచించిన “చిత్ర నళినీయం” నాటకాన్ని ప్రదర్శించారని, పామరు కంపెని నాటకాలు బండారు, గుడివాడ, తెనాలి మొదలైన పట్టణాలలో ప్రదర్శన లిచ్చిందని అన్నారు. 1961లో ఏర్పడిన “లలితకళా సమితి” 3వ వార్షిక పోటిలలో 12 నాటక సమాజాలు తలపడి, ఉత్తమ ప్రదర్శనలతో పామర్రు ప్రతిష్టను ఇనుమడింప చేశారన్నారు.

ఇలాంటి మహత్తరమైన సాహితీ రంగస్థల చరిత్ర గల పామర్రు లో “ఇంద్రధనుస్సు” కవితా సంపుటి ఆవిష్కరించే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కవి బుల్లెయ్యకు పాఠశాల చదువు పెద్దగ లేకపోయినా సమాజమనే పాఠశాలలో చదివి “సహజ కవి” గా ఎదిగారని, నేటి నుండి మనమంతా వీరిని ,”సహజకవి” బుల్లెయ్య గా పిలవాలని,ఇందుకు ఆమోదాన్ని తమ కర్తల ధ్వనుల ద్వారా తెలియచేయాలనీ కోరగా, సభ్యులందరూలేచి నిలబడి అంగీకరసూచకంగా కరతాళధ్వనులతో చెప్పారు. అనంతరం ఆవిష్కర్త తాతా రమేశ్ బాబు మాట్లాడుతూ , సహజ కవి పై ఆశువుగా “నానీ” చెప్పారు :
” తాపీ కార్మికుడు
సహజకవి వీరంకి బుల్లెయ్య
కవితా సౌధాలను కూడా
నిర్మించటానికి సిద్దమయ్య “

“కవిత్వం కోసం ధనం వ్యయంచేయు వారు ధన్య జీవులన్న -నండూరి రామకృష్ణమాచార్య ఆకాంక్షను గుర్తు చేస్తూ,రోజూ పనిచేసుకొని పోగు చేసుకున్న ధనంతో, రోజూ కాలం చేసుకుని రాసుకున్న కవిత్వాన్ని పుస్తకంగా ముద్రించుకున్న బుల్లెయ్య ధన్యజీవి అంటూ, ఈనాడు అక్షరం మాటున జరుగుతున్న అనైత్యానికి దూరంగా ఒక చేత్తో తాపీని ఒక చేత్తో కలాన్ని పట్టుకు కవితా సృష్టి చేస్తున్న బుల్లెయ్య ను అభినందించారు.

తొలుత సభకు సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ ఆహ్వానం పలుకుతూ,బుల్లెయ్య మొదట్లో నాగశ్రీ పేరుతో కవిత్వం రాసేవారని,సహజ సిద్దమైన కవిగా, సమాజం లో మార్పును ఆశిస్తూ కవిత్వం అల్లెవారని, బుల్లెయ్య లాగా ఆశువుగా తాను చెప్పలేనని ,అయన వెన్ను తట్టటం చేయగలుగు తున్నానని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన పామర్రు పంచాయతి సర్పంచ్ కలగర కోటేశ్వరరావు మాట్లాడుతూ, “ఇన్నాళ్ళు మా ఎదురుగ వున్న బుల్లెయ్య ను,ప్రతిభగల కవిగా ఈరోజే తెలుసుకొన్నానని, మట్టిలో మాణిక్యం లాంటి వాడని, కారణ జన్ముడని కొనియాడారు. ముఖ్య అతిథి, ఉపసర్పంచ్ పామర్తి విజయశేఖర్ మాట్లాడుతూ, ఎంతో చదువుకొని, పాండిత్యం వున్న వారే కవిత్వం రాయగలరనే అభిప్రాయాన్ని పటాపంచలు చేసి ఏకంగా 3 కవితా సంపుటిలు వెలువరించడం బుల్లెయ్యకే చెల్లిందని అన్నారు. ఆత్మీయ అతిధి సమీప గోల్వేపల్లి సర్పంచ్ రాయవరపు అలెగ్జాందర్ మాట్లాడుతూ, దేవుడు బుల్లెయ్యను వరమిచ్చి పంపించాడని, పనిచేసుకొంటు కవిత్వం రాస్తున్నడంటే గర్వంగా ఉందన్నారు. ఉపాధ్యాయుడు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఏదైనా రంగంలో ప్రతిభాశాలిగా ఎంపిక చేయాలంటే, అభ్యర్థే స్వయంగా దరఖాస్తు చేసుకొనే విధానం వల్ల నకిలీ ప్రతిభ బయట పడే అవకాశం వుందని, సర్వే ద్వారానే ప్రతిభను గుర్తించి గౌరవించాలని, అలాంటి బంగారు రోజులు వస్తే ,బుల్లెయ్యను రాష్ట్రపతి కూడా ప్రశంసించే అవకాసం వుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

చివరిగా “ఇంద్ర ధనుస్సు” కవితా సంపుటి కవి తన స్పందనను తెలియ చేస్తూ ,”ఈ పామరుడను పండితునిగా మా “పామర్రు”లో ప్రశంసలందుకోవటం ఆనందంగా ఉందంటూ, రోజూ తాపి పని చేయందే జీవనం గడవని నాలో కవిని గుర్తించి రేడియో లో నన్ను పరిచయం చేసి, అశేష శ్రోతల హృదయాల దగ్గరకు తీసుకెళ్ళిన కవుల కవి తాతా రమేశ్ బాబుకి కవితాభి నందనాలు. అలాగే విజయవాడ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు రేడియోలో అవకాశం కలిగించి నందులకు కృతజ్ఞతలు తెలియపరచుకొంటున్నాను. మళ్ళి రేడియోలో కవితాగానం చేసే అవకాసం కలిగిస్తారని ఆశిస్తున్నాను. నా “ఇంద్ర ధనస్సు”ను సప్తవర్ణాల కవితాచిత్రంగా ఆవిష్కరించినందులకు ఈ సభకు వందనాలు” అంటూ ముగించారు.

ఈ సభ పామర్రు పంచాయితి కార్యాలయంలో జరిగినందున, పామర్రు ప్రజలందరూ పరోక్షంగా తిలకించి ఆశీస్సులందిమ్చారని భావిస్తూ వందన సమర్పణ జరిగింది. కవికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, కవితా ప్రవాహాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవని, ఆ సరస్వతి రచనకు, ముద్రణకు అనుకూలంగా మలుస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తూ ముగిసింది సభ.

You Might Also Like

One Comment

  1. vamsi krishna

    చాలా హాష్యర్యం కలిగించే విషయాలు ఈ వ్యాసంలొ వున్నాయి. ‘తెలుగు అక్షరం వెనుక భక్షణం’ అని అంటే బాగుంటుందేమొ . ఎమయినా తెలుగు వారు ,ముఖ్యంగా కవులు,రచయితలు గమనించ వలసిన అంశాలు చాలా వున్నాయి. అలాగే సహజ కవి బుల్లెయ్య కు అభినందనలు. మరో పుస్తకమయినా ప్రభుత్వ,స్వచ్చంద సంస్థల సహకరం తో వస్తుందని ఆశించ వచ్చా? తెలుగు తల్లిని ,నిజంగా ప్రేమించి గౌరవించే రోజుల కొసం ఎదురు చుస్తూ …….

Leave a Reply