ఒక నాన్న. కొడుకు. పిస్టల్ కథ – The Road

నాక్కావలిసిన పుస్తకాలేవీ దొరకే అవకాశం తెలీదని గ్రహించిన మరుక్షణం, నేను దిగాలుగా కుర్చీలో కూలబడిపోతుంటే, కొట్టులో ఉన్న అబ్బి, “ఇది చదవండి. నాకు తెల్సి మీకు నచ్చుతుంది.” అని ఇచ్చాడు. మామూలుగా అయితే దాని వంక చూడకుండా పక్కకు పెట్టేసేదాన్నే కానీ, ఆర్నెళ్ళ క్రితం నేనో పుస్తకం అడిగానని గుర్తుపెట్టుకొని గుర్తుచేసిన మనిషి ముందే అలక్ష్యం బాగోదని, వెనకట్ట చూసాను. “లాభం లేదు. ఈ రచయితకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేయాల్సిందే!” అని ఏదో పత్రికా మనిషి ఆవేశపడ్డాడు. కింద అలాంటి ఆవేశాలింకా ఉన్నాయి. ఇట్లాంటి ఏక వాక్య వ్యాఖ్యలు చూసి నేను పుస్తకాలు కొనటం ఎప్పుడో మానేసాను, ఒకట్రెండు సార్లు భారీగా చేతులు కాలాక. పుస్తకం తిప్పితే ముందు అట్ట. గాఢాంధకారంలో దీనావస్థలో ఉన్నట్టు ఓ మనిషి, ఆ మనిషిపై ఒక చిన్నారి చేయి. అయినా ఆసక్తి కలగలేదు. నాకు పుస్తకం సిఫార్సు చేసిన మనిషి నన్నే చూస్తుంటే, పక్కకు పెట్టలేక, అనాలోచితంగా పుస్తకం మధ్యలో ఒక పేజీ తెరిచా. అక్కడున్న సంగతి నాకు నచ్చింది. పుస్తకం కొనడానికి సిద్ధపడ్డాను. ఇంతకూ, నాకు నచ్చింది ఏమిటంటే, ప్రతి పేజిలో మామూలు కన్నా తక్కువ లైన్లు ఉన్నాయి. పేరాకి పేరాకి మధ్య మూడు, నాలుగు లైన్లంత ఖాళీ. సంభాషణలన్నీ ఐదారు పదాలకు మించని వాక్యాలు. భారీ ఎత్తున భారీ పుస్తకాలు చదివుతున్న నాకు, ఈ పుస్తకం చూడగానే, కిక్కిరిసిన జనరల్ కంపార్ట్మెంట్ నుండి జనసాంద్రం తక్కువున్న చోటుకు వెళ్ళిన భావన కలిగింది.

రైలు ప్రయాణంలో మొదలెట్టాను చదవటం. ఉండటానికి మూడొందల పేజీలైనా పదాలు తక్కువుండి గబగబా చదివేసి పక్కకు పారేస్తాననుకున్నాను. పదానికి, పదానికి మధ్య ఊపిరి తీసుకోకుండా చదవటం కష్టసాధ్యమని చాలా త్వరగానే తెల్సొచ్చింది.

ఇందులో కథేమిటో మనకి మనం తేల్చుకోవాలి. ఫలనా చోట, ఫలనా జరిగింది అని కథకుడు మాత్రం చెప్పడు. కొంచెం సాయం కూడా చేయడు, కథను అర్థం చేసుకోవటంలో. కథలో రెండు ముఖ్య పాత్రలు. తండ్రికొడుకులు. తండ్రి వయస్సు తెలీదు కాని, ఇరవై, ముప్ఫైల్లో ఉండచ్చు. కొడుకు వయసూ తెలీదు గాని, నడవగలడు, మాట్లాడగలడు, చెప్పిన కొన్ని సంక్లిష్ట పనులూ చేయగలడు. బహుశా, ఐదారేడేళ్ళు ఉంటాయేమో! వీళ్ళిద్దరూ, తామున్న పరిస్థితుల్లో ఎలా ఇరుక్కున్నారో తెలీదు. ప్రపంచమంతా సర్వనాశనమైపోయి, అక్కడక్కడ ఒకరో, ఇద్దరో మనుషులు మిగిలారని మాత్రం అర్థమవుతుంది. ప్రపంచం మొత్తంగా ఇంతటి విపత్తు ఎలా సంభవించిందో చెప్పడు. కాని ఎటు చూడూ, బూడిదే ఉంటుంది కుప్పలు తెప్పలుగా. వాటి మధ్య సగం కాలిన, సగం కుళ్ళిన శవాల గుట్టలు. ఎముకలు కొరికే చలి. మొహం చూపని సూరీడు. కట్టుబట్టలతో ఉన్న ఈ ఇద్దరు, ఒక పిస్టల్ ను ఆయుధంగా చేసుకొని, విపరీత వాతావరణ పరిస్థితులనూ, కొండకొచో మిగిన మనుషుల నుండి కలిగలిగే అపాయాన్నీ అధిగమిస్తూ ఎక్కడికి ప్రయాణం కట్టారు? అక్కడికి చేరుకోగలిగారా? అన్నది తక్కిన కథాంశం.

చెప్పే కథలు, రాసే కథలూ ఉంటాయని విన్నాను గాని, ఇలా చెప్పీ చెప్పక చెప్పే కథలు చదవటం నాకో కొత్త అనుభవాన్ని ఇచ్చింది. రచయితలు తామనుకున్న ప్రపంచాన్ని సూక్ష్మదృష్టితో నిశితంగా తయారుచేసి, అందులోకి పాఠకుని సాదరంగా ఆహ్వానించి, ప్రతి మూలనూ పరిచయం చేస్తారు. ఈ రచయిత కూడా అలాంటి మార్గాన్ని ఎన్నుకొని ఉండొచ్చు. ఉన్నదాన్ని ఊహించుకోమంటే తేలీకే గాని, ప్రపంచంలో ఒక పిట్ట కూడా మిగలకుండా పోయిన పరిస్థితులు ఎంత మంది ఊహకొస్తాయి? అందుకని రచయిత ఎంచక్కా ఓ వెయ్యి పేజీల విశ్వరూపం చూపించి ఉండచ్చు. తద్విరుద్ధంగా ఈయన సగం పని పాఠకుని మీదకే వదిలేసాడు. కొంచెం చెప్పి, చాలా మన ఊహకే వదిలేస్తాడు. సన్నివేశాలనూ, పాత్రలనూ నిశితంగా చదవనిదే ఇందులో ఉన్న అసలు ఉద్దేశ్యం తెలీదు. అలా అర్థం చేసుకునే ఓపిక లేకపోతే ఇది నచ్చకపోవచ్చు . నవల పఠనమంటే కొన్ని వేల వాక్య సముదాయాలను చదివి, వాటి అనుగుణంగా ఊహాచిత్రం గీసుకోవడం అనుకుంటే, రచయిత వాక్యాల ద్వారా ఇక్కడ సగం బొమ్మ వస్తుందంతే! మిగితా అంతా మనం ఊహించుకోవాలి. ఉదాహరణకు, ఈ వ్యక్తి భార్య (ఆ పిల్లాడి తల్లి కూడా), అతడి కల్లోకి వస్తూ ఉంటుంది. ఒకానొక కల్లో, “నేను మృత్యువు ప్రేమిస్తున్నా, దానితో పోతున్నా” అని అంటుంది. దీన్ని బట్టి రూఢీగా తెల్సిపోయేది ఆమె బతికిలేదని. కానీ ఆత్మహత్య చేసుకుందా? ఆత్మహత్య సదృశ్యమైన పని చేసిందా? అన్నది తెలీటం కష్టం. అలానే, కాకికి సంబంధించిన నానుడేదో అంటాడు తండ్రి. “కాకంటే?” అని అడుగుతాడు కొడుకు. చూపించటానికి ఒక్క పిట్టుండదు. దీన్ని బట్టి, భూమి పై సకల జీవరాశులూ దాదాపుగా అంతమయ్యినట్టుగా మనం భావించాలి. మరో చోట, “సముద్రం నీలంగా ఉండేది, నాకు తెల్సినంతవరకూ” అని చెప్తాడు కొడుకుతో. తీరా సముద్రం కనిపించాక, అది నల్లగా ఉంటుంది. సముద్రాలే నల్లబారేంతగా జరిగిన విధ్వంసం ఏమిటి? (న్యూక్లియర్ ఫ్యూజన్?) అన్నది మనం తేల్చుకోవాలి.

రచనలు చేసేటప్పుడు, ఏం చెప్పాలి? అన్నది మూలం. ఆ తర్వాత ఎలా చెప్పాలి? ఎవరితో చెప్పించాలి? అన్న ప్రశ్నలు వస్తాయి. ఈ “ఎవరితో చెప్పించాలి?”, “ఎంత చెప్పించాలి” అన్నదాంట్లో రచనను సాధారణం నుండి అద్వితీయం వరకూ తీసుకెళ్ళచ్చు. కామూ రాసిన “అవుట్‍సైడర్ / స్ట్రేంజర్” అన్న కథను చదివి నాకు నేను ఇచ్చుకున్న వివరణ: రచయిత ప్రధాన పాత్రతోనే కథ చెప్పిస్తాడు. ఆ పాత్రమో, ’ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి’ అన్న చందాన వ్యవహరిస్తుంటాడు. మూడో వ్యక్తి చూస్తున్నట్టు ఆ కథ చెప్పించుంటే, “వీడు మనిషేనా?” అన్న అనుమానం పాఠకుని కలిగే అవకాశం ఉంది కనుక, మొత్తం రసాభాస అయ్యేదని నాకనిపిస్తుంది. అలా కాకుండా, అతడితోనే కథ చెప్పించి, అతడి ఆలోచనలు దగ్గరగా చూస్తూ ఉండడం వల్ల, వాడో ఉలిపికట్టె అవునో, కాదో వదిలేసి, అతని వైపు నుండి ప్రపంచాన్ని చూడగలం.

ప్రస్తుత పుస్తకంలో నరేషన్ గురించి మాత్రం నాకింకా స్పష్టత ఏర్పడలేదు. మూడో వ్యక్తి చెప్తున్నాడు కథను. అందుకని చుట్టూ ఉన్న పరిస్థితులను  ఏకబిగిన వర్ణించి ఉండవచ్చు. కాని, అలాంటి ధీర్ఘ వర్ణనలు ఉండవు. వాళ్ళున్న చోటను తప్ప, మరేం ఎక్కువగా విశదీకరించడు. భూత, భవిష్యత్ కాలాలను ముఖ్య పాత్రల భావోద్వేగాల ద్వారా వ్యక్తపరుస్తాడే కాని, “అప్పుడూ.. ఇలా జరిగింది, తెల్సునా?” అన్నట్టు చెప్పుకురాడు. ఇహ, కథను చెప్పడానికి సరళమైన వాక్యాలను వాడతాడు. ఉజ్జాయింపుగా, ఒక ముప్ఫై పదాలకన్నా ఎక్కువగా ఉన్న వాక్యాలే ఈ పుస్తకంలో అరుదు. ఎంతటి భీభత్సాన్ని అయినా వీలైనన్ని తక్కువ పదాలతో చెక్కేస్తారు. ఇందులో భూకంప వర్ణన ఎంత చిత్రంగా ఉంటుందంటే, నా కాళ్ళ కింద భూమి కంపించిన భ్రమ కలిగింది. అదంతా నాలుగైదు వాక్యాలతో జరిగిపోయింది.

ఇందులో ఇంకో విషయం, పంక్చువేషన్. musnt, dont అని ఉంటాయి పదాలు. డైలాగులను కోట్స్ లో పెట్టలేదెక్కడాను. సంవాదాలను చెప్తున్నప్పుడు, పాత్రల మనోభావాలను కాని, శరీర భాషను కానీ సూచించే అదనపు వ్యాఖ్యానం ఉండదు. ఉదాహరణకు, తండ్రి-కొడుకుల మధ్య సంభాషణ

I see smoke, he said.
Where.
Past those buildings.
What buildings?

ఇక్కడ, రెండో మాట పశ్నచిహ్నంతో ఎందుకు ముగియలేదో తెలీదు, ముఖ్యంగా నాలుగోది ముగిసినప్పుడు. అంటే, ఆ అబ్బాయి అంత నిర్లిప్తతతో అడిగాడా? లాంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఇదో మంచి ఆట. పాత్రలన్న మాటలకు సరిపడా గొంతునూ, ముఖకవళికలనూ మనం ఊహించుకోవడం.

ఇహ, ఈ రచనలో నాకు విపరీతంగా నచ్చేసింది: చిన్న వాక్యాలతో, అలతి పదాలతో సృష్టించిన వచనం. చిన్న వాక్యాలను అవసరాన్ని బట్టి, కీలక తరుణాల్లో వాడే రచయితలను చదివాను గాని, మొత్తంగా వాటి మీదే ఆధారమైన రచనలు చదవలేదు నేను. ఇందులో ఎంతటి భావోద్వేగాన్ని అయినా, అలా సరళ వాక్యాలతో చెప్పుకొచ్చేసారు. కొడుకును పొదివి పట్టుకున్నప్పటి చిత్రణ చూడండి:

He sat up and felt about for the boy. He held his hand to the thin ribs. Warmth and movement. Heartbeat.

ఇంకో చోట చలిని వర్ణించడానికి:

Cold to crack the stones. To take your life.

దేవుని మీద అక్కసు:

He raised his face to the paling day. Are you there? he wispered. Will I see you at the last? Have you a neck by which to throttle you? Have you a heart? Damn you eternally have you a soul? Oh God, he wispered. Oh God.

వచనం తేలిక పఠనానికి అనుకూలించేదేదైనా, ఇందులోని విషయం భారీగా ఉండడం వల్ల, గబగబా చదవలేకపోయాను. భయానక, భీభత్స, కరుణ రసాల్లాంటివి వెంటాడుతాయి. మనిషికి మనిషి సృష్టించగలిగేంత భయం, అభద్రతలు, సృష్టిలో మరెవరూ కలిగించలేరనుకుంటాను. చదువుతున్నంత సేపూ పీడకలను అనుభవిస్తున్నట్టే ఉంటుంది. చదవటం పూర్తయ్యాక కూడా ఆ చీకటి ఛాయలు వీడవు. ముఖ్యంగా ముగింపు గుండెను పిండేస్తుంది. అయినా, అంతర్లీనంగా ఇందులో మనిషి మనోబలం మీద నమ్మకం కలిగే పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. అంతటి చిమ్మ చీకటిలోనూ ఒక చిన్న దివ్వె వెలుగుతూనే ఉంటుంది.

సాహిత్యాన్ని  బాగా చదివేవాళ్ళు తప్పకుండా చదవాల్సిన రచననే అంటాను. Reading exercise చేయించే పుస్తకాల్లో ఇదొకటని మాత్రం చెప్పగలను. అహ్లాద వినోదాల కోసం మాత్రమే పుస్తకాలు చదివేవాళ్ళకు ఇది అంతగా నచ్చకపోవచ్చు.

ఇంతటి గొప్ప రచనను నాకు సిఫార్సు చేసినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీని ఆధారంగా సినిమా తీసారు(ట). అది చూసే లోపే ఇది చదువుకోవటం ఉత్తమం.

ఈ పుస్తకం పై వచ్చిన సమీక్షలు:

NewYork Times. 

Guardian

Literitude

పుస్తకం వివరాలు:

The Road

Author: Cormac McCarthy

Publishers: Picador

Pages: 307

 

You Might Also Like

2 Comments

  1. సౌమ్య

    Interesting!

  2. krishna

    I liked this sentence.

    మనిషికి మనిషి సృష్టించగలిగేంత భయం, అభద్రతలు, సృష్టిలో మరెవరూ కలిగించలేరనుకుంటాను

Leave a Reply