ప్రత్యేక కథల పాలపిట్ట

రాసిన వారు: కవిత పలమనేరు

*********************

ఏ పత్రికయినా  ఒక ప్రత్యేక సంచికని వెలువరించినప్పుడు, కవితల ప్రత్యేక సంచిక, వ్యాసాల ప్రత్యేక సంచిక అంటూ ఆ ప్రత్యేకతని తమ పత్రికకి ఆపాదించుకోవడం సహజం. కానీ, పాలపిట్ట సాహిత్య పత్రిక ప్రచురించిన కథల సంచికని ‘ ప్రత్యేక కథల సంచిక ‘ అంటూ ప్రత్యేకతని ఆ సంచికకి కాకుండా అందులోని కథలకి ఆపాదించడం, ఆ కథల స్థాయిని తెలియజేస్తోంది. ఆ పేరుని చూడగానే అందులోని కథల ప్రత్యేకత ఏమై వుంటుందా అనే ఉత్సుకత రేకెత్తడం సహజం. అదే ఉత్సాహంతో  ఆ పుస్తకాన్ని ఏక బిగిన చదివి పూర్తిచెయ్యడం జరిగింది. అలా చదివేలా చెయ్యడం మాత్రమే కాదు చదువుతున్నంత సేపూ ఆలోచింప చెయ్యడం కూడా ప్రత్యేక కథల సంచిక ప్రత్యేకతే. ఆ ఆలోచనల్లో ముఖ్యమయినది ఒకటుంది.

తెలుగులో నాలుగయిదు సంస్థలు వార్షిక కథా సంకలనాలని ప్రచురిస్తాయి. ఆ సంకలనాల్లో కథ రావడం అనేది తెలుగు రచయితలలో చాలా మంది గర్వ కారణంగా భావిస్తారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయా సంకలన కర్తలు ఆ ఏడాది వచ్చిన తెలుగు కథలని కాచి వడబోసి మేలు ముత్యాలని మాత్రమే అందిస్తారనేది అందరి అభిప్రాయం. దానికి తగినట్టుగానే ఆ సంస్థలవారు కథల ఎంపిక విషయంలో తీసుకునే శ్రద్ధ కూడా తక్కువేమీ కాదు.  అయినప్పటికీ ఏటా కనీసం మూడు నాలుగు కథలయినా రెండు మూడు సంకలనాల్లో కనిపిస్తాయి. అలా ఒకే సంవత్సరంలో వెలువడిన రెండు మూడు కథా సంకలనాల్లో తన కథ రావడం ఆ రచయితకి గర్వ కారణం అవుతుంది.

 

కానీ తెలుగు కథా సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన ఇతర భాషలవారు ఎవరయినా ఆ కథా సంకలనాలని చూసినప్పుడు వారికి ఏమనిపిస్తుంది? తెలుగులో ఈ గుప్పెడు కథలు తప్ప మంచి కథలు లేవేమో అందుకే అవే  కథలు  అన్ని పుస్తకాల్లోనూ కనిపిస్తున్నాయి  అనుకుంటే ఆ తప్పు వారిది కాదు కదా? ఆయా సంకలన కర్తలు తమ సంకలనాలను ప్రచురించే ముందే ఒకసారి మాట్లాడుకుంటే ఈ సమస్యని సులభంగా పరిష్కరించవచ్చు. పునరావృతం కావడాన్ని నిరోధించడంతో బాటుగా మరికొన్ని మంచి కథలకి స్థానం కల్పించవచ్చు. అంతకంటే ముఖ్యంగా సాహిత్య సంస్థల మధ్య స్నేహ పూరిత వాతావరణాన్ని పెంపొందించుకోవచ్చు. దానికంటే ముఖ్యంగా మన మధ్య  పరస్పరం మాట్లాడుకునే వాతావరణం కూడా లేదనే విషయంతో బాటుగా మన సాహిత్యంలో లాగే మన సాహితీవేత్తలలోనూ సాహిత్య సంస్థలలోనూ కూడా పరస్పర అవగాహనా అర్ధం చేసుకునే సహనమూ  లేవని ఇతరులు అనుకోకుండా చూసుకోవచ్చు. అంతే కాదు,ఏకత్వంలోంచీ కూడా అనేకత్వాన్ని పిండుకోవడం అనేది తెలుగువాడి జాతీయ లక్షణం అనే అభిప్రాయాన్ని స్థిరపడకుండా అడ్డుకోవచ్చు.
ఒక్కసారి అందరూ మాట్లాడుకుంటే ఇన్ని సమస్యలని అధిగమించ వచ్చునని విన్నవించుకుంటున్నాను. మరో విషయం ఏమిటంటే, ఈ పుస్తకం లోని కథల స్థాయిని గమనించినప్పుడు దాదాపుగా అన్ని కథలూ వార్షిక కథా సంకలనాలలో వచ్చే కథలకి తీసిపోవు. వస్తువు శైలి, శిల్పం, భాష , భావజాలాలు మొదలయిన అన్ని విషయాల్లోనూ వైవిధ్యతని కలిగి వున్నాయి. అన్నీ  విభిన్నమయిన కథలు కాబట్టీ  దీనికి కథల ప్రత్యేక సంచిక అని కాకుండా ప్రత్యేక కథల సంచిక అని పెట్టిన పేరు సార్ధకం అయింది. ఈ కథల గురించి ఎవరయినా విమర్శకులు స్పందించి ఆయా కథలని విశ్లేషిస్తే బాగుంటుంది. అందుకు నాకున్న పరిజ్ఞానం చాలదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

You Might Also Like

One Comment

  1. రమణ కుమార్

    ఇంతవరకూ ఎవరూ ఒక పుస్తకాన్ని గురించి ఇలా రాయలేదు. ఇది కొత్త పద్ధతి. ఈ పుస్తకం లోని కథల గురించి ఏమీ చెప్పకపోయినా ఎన్నో చెప్పారు.
    ప్రత్యేక కథల పాలపిట్ట గురించి విన్నాను. ఇప్పుడు చదివాను. ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు. వెంటనే కొనుక్కొస్తాను.

Leave a Reply to రమణ కుమార్ Cancel