శశాంక విజయము – మూడవ భాగము

(శశాంక విజయంపై వచ్చిన మొదటి రెండు వ్యాసలనూ ఇక్కడ మరియు ఇక్కడ చదవండి)

చాలా కాలం క్రితం ‘శశాంక విజయం’ పుస్తకాన్ని పుస్తకం.నెట్ పాఠకులకు పరిచయం చేద్దామని ప్రారంభించి రెండు భాగాలలో మూడు ఆశ్వాసాల వఱకు వ్రాసి తఱువాత ఆ పుస్తకాన్ని ఎక్కడో పెట్టి మఱచిపోవటం కారణంగా తఱువాతి భాగం పూర్తి చేయలేకపోయాను. అప్పటినుండి ఆ బాకీ అలాగే ఉండిపోయింది. సౌమ్య గారొకసారి గుర్తు చేసారు కూడా. ఈ మధ్య శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలి? అనే శీర్షికన మహాభారతాన్ని వరుసగా పరిచయం చేసే పనిలో పడి ఈ బాకీని అలానే ఉంచేయటం జరిగింది. కాని ఇప్పుడు తీరిక చేసుకునైనా ఈ బాకీని తీర్చేద్దామని ప్రయత్నిస్తున్నాను.

నాల్గవ ఆశ్వాసం:

సురగురువు ఇంద్రలోకంలో క్రతువును ముగించుకొని స్వస్థానానికి తిరిగి వస్తాడు. అతనికి తన పరోక్షంలో జరిగిన తారా చంద్రుల ప్రణయకలాపం గుఱించి తెలుస్తుంది. తారను ఆ విషయమై నిలదీస్తాడు. ఆ సందర్భంలో తారను గుఱించి –

నిలుకడ సున్న, వావి నహి, నేస్తము నాస్తి, భయంబు లేదు: చం
చల హృదయల్, దురాత్మక, లసత్యలు, జంతలు, కాంత: లింతయున్
దెలియకనా? నృపాలకులు నిగ్రహ మొప్పఁగఁ బోతు టీఁగయున్
బొలయగనియ్య రంతిపురిఁ, బుత్త్రుల నైనను నమ్మ రెంతయున్. 4-17

నేను నా దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నాను. నిజం చెప్పు అని గద్దిస్తాడు తారను బృహస్పతి. కొన్ని హిందీ పదాలుకూడా నహి వంటివి ఉపయోగించటం జరిగింది.

“ఏ మని యుత్తరం బే నియ్యఁ గలదాన ?
నెందునఁ దీరు మీ సందియంబు ?
ఇంక నాపయి దయ యెట్లు కల్గును మీకు ?
సైఁపక యున్న నా జన్మ మేల ?
పాపపు దైవంబు పాపెనో మనలను
తలను వ్రాసిన వ్రాలు తప్ప దింకఁ ,
‘ద ప్పొనర్చిన వారి దండింతు’ నంటిరి
త ప్పొనర్పని వారు ధరణి గలరె ?

యబ్జ భవు కూతురైన యహల్య మొదలు
నేర మొనరించి రనినచో , నేర్పి నడువ
నొకరి తరమౌనె ? మగవార లోర్వ వలయుఁ,
గానిచో వట్టి నగుపాటు గాదె మీకు ? 4-20

ఎంతందంగా ఎంత జాలికొల్పేలా అడుగుతుందో చూడండి. నిజంగా నంగనాచి తుంగబుర్ర అనిపిస్తుంది కదూ.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రము
నచ్చుగఁ దొడిఁగిన వితాన, నబల పయిన్ మీ
కెచ్చుగఁ గోపం బిటు రా
వచ్చునె? తప్పైన సైఁపవలయు” నటంచున్. 4-21

తప్పైన సైప వలనట. చూడండి. తప్పు అవునో కాదో కూడా సందేహాస్పదమే అన్నట్లు మాట్లాడుతోంది. కాళ్ళమీద పడి బ్రతిమాలి, బామాలి అతడిని ప్రసన్నుడిని చేసుకుంటుంది. బృహస్పతి మటుకు చంద్రుడిని – నీ విద్య పూర్తయినది, మీ తల్లిదండ్రుల దగ్గఱకు వెళ్ళవచ్చు నని చెప్పి అతడిని పంపించి వేస్తాడు. చంద్రు డలా వెళ్ళగానే అతని విరహాన్ని సహించలేకపోతుంది తార.

అటువలె నంటుకాడు చనినంత నెలంత దురంత చింతచేఁ
బొటపొట బాష్పము ల్దొరుఁగఁ, బొక్కుచు స్రుక్కుచు దిక్కులేని త్రొ
క్కట దిట మార, మార విశిఖమ్ము లురమ్మునఁ దూఱి పాఱఁగాఁ,
ద్రుటి ఘటికా సహస్ర మయి తోఁపఁగ, నాపఁగ రాని కాఁకతోన్. 4-28

అంటుకాడు ప్రయోగం చాలా బావుంది. దిటమార మార విశిఖమ్ము లట. వివిదార్థాలతో పునరావృతి. భేషో. తార చంద్రునిపై మరులు నిజపతిపై విసురులు చూపిస్తుంది ఈ విధంగా —

‘ఇందు ర’ మ్మన్న, మాటల ‘చంద’ మన్న,
నదిగొ ‘నెలవంక’ లెంత లెస్సాయె ననిన
‘రాజ’ భోగంబు లన్న, నా రాజవదన
రమణు పే రని మది నెంచు, భ్రమ వహించు. 4-30

ఇందుడు, చందురుడు,రాజు, నెలవంక – అన్నీ చంద్రుడికి పర్యాయ పదాలే.

విభుఁడు మాటాడుచో వెదకి తప్పులు వట్టు,
బొలయల్క నవలి మోముగఁ బరుండుఁ,
గొన గోటఁ బ్రియుఁడు చెక్కులు చుఱుక్కున జీఱ,
నిది యేమి సరస? మం చీసడించు,
ముచ్చటైన నాథుండు మోవిఁ బ ల్మొన నొక్క,
వెలయాలనా ? యంచు వీడనాడుఁ,
దమకాన ధవుఁడు కందర్ప కేళిఁ బెనంగ,
నెంత సే పని తీవరింప సాగు,

నెక్కడ మనం ? బటన్న, నుచుక్కు మనును,
ఏలనే కోప ? మనిన , నే మేమొ గొణుగు,
మేను పతి చెంత, మనసు రే ఱేని చెంత,
నిలిపి, యా చాన విరహంపు నెగులుతోన. 4-31

భార్య ఇష్టం తప్పినప్పుడు భర్తను ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టగలదో అన్నీ పెట్టి చూపిస్తుందన్నమాట.

తార ఇందుని అందమును రాసిక్యమును సంస్మరించుట

చేరల కెచ్చు కన్నుఁగవ, చెక్కుల యందము చెప్ప శక్యమా
బారలఁ గొల్వ నౌ నురము, బాహులు జానుల మీఱు, సూది బం
గారు కవున్, బ్రవాళములఁ గై కొన వంఘ్రులు, లోకమందు లే
దా రసికత్వ , మా గుణము, లా రతి చాతురి, వానికే తగున్. 4-33

అలయించు నొకవేళఁ బొలయల్కు చిక్కుల,
సొలయించు నొక వేళ సొగసు వగలఁ,
గరఁగించు నొక వేళఁ గళల యిక్కువ లంటి,
మఱగించు నొక వేళఁ మెఱుఁగు మోవిఁ,
బలికించు నొక వేళఁ బావురా పల్కులు,
కులికించు నొక వేళఁ గొసరి నవ్వి,
యానించు నొక వేళ నరిది మోమున మోముఁ,
బూనించు నొక వేళఁ బురుష రతికిఁ,


జిగురు విలుకాని కైన నా సొగసుకాని
యొప్పు లే దన్న, ముది మది తప్పినట్టి
యీ మగం డేడ ? నే నేడ ? యేడ కేడ ?
యేటి కీ పోరు? వీని పొం దెవతె కోరు ? 4-36

తార ధృఢ సంకల్పము.

ఆడిక లైన నేమి ? మగ డారడిఁ బెట్టిన నేమి ? చుట్టముల్
వాడక యున్న నేమి ? సరివారలు నవ్విన నేమి ? కాఁపురం
బూడిన నేమి ? నా దగు ప్రియుం డిలుఁ బాసి చనంగ, నేనునుం
దోడనె పోవ నైతి ? మదిఁ దోఁపక పోయె, నిఁకేమి సేయుదున్ ? 4-37

తెగింపు వచ్చేసిందన్నమాట. ఎవరినీ లెక్కచేసే పరిస్థితి లేదింక.

ఏ కరణి నైన వానితో నెనయు టొకటి
కానిచో మేనిపై నాస మాను టొకటి
యింతయే కాక, మగఁ డంచు నితని మొగముఁ
జూచి సై రింపలేను త్రిశుద్ధిగాను.
4-38

అని, యనిశంబు నెంచు, మద నాశుగ మర్దన దుర్దినంబునన్
ఘనమగు మూర్ఛఁ గాంచు, వగకాని వగ ల్గణియించు, నైజపుం
బెనిమిటి నీసడించు, మదిఁ బెక్కు తలంపులు నించు, వాఁడు వ
చ్చె నని తలంచు, నెచ్చటను చీమ చిటుక్క నిన న్జలించుచున్. 4-39

పూర్ణానుస్వారపూర్వ ‘చు’ కారాన్నిఅనుప్రాసగా ఎంత బాగా ఉపయోగించారో చూడండి.

తార చంద్రుని దగ్గఱకు ఓ జటినీమణిని రాయబారం పంపిస్తుంది. అక్కడ చంద్రుడి అవస్థ కూడా ఈమె అవస్థకు ఏమీ తక్కువగా లేదు. చూడండి.తారను గూర్చి ఇలా అనుకుంటాడు చంద్రుడు.

తళుకు బంగరు కుండ, తావి సంపఁగి దండ,
వలపుల సరణి, జవ్వాజి బరణి,
పచ్చి కస్తురి వీణ, బాగైన నెఱజాణ,
కలికి మిటారి, యంగజు కటారి,
మకరందముల వాక, మదన శాస్త్రపుఁ డీక,
రతి చేతి చిలుక, ముర్వంపు మొలక,
మురిపెంబులకు దీవి, మరు తోఁట యెల మావి,
నెఱ నీటు కిరవు, పన్నీటి చెఱువు,

ఎంచఁ దగు ముచ్చటల కిమ్ము, మంచి సొమ్ము,
కాంతలకు నెల్ల మేల్బంతి, కలువ బంతి,
మేటి రతులకు సురతాణి, మించుఁబోణి,
దాని కెన యైన చాన జగానఁ గాన. 4-50

వృత్యను ప్రాస ఎంత బాగుందో చూడండి. చదువరులకు మనసంతా ఆనందమే కలుగుతుంది.

ఘన వేణి వేణి శృంగార మారసి నంత
మో హాంధకారంబు ముమ్మరించె,
హరిమధ్య మధ్య వైఖరి స్మరించిన యంతఁ
బ్రకట ధైర్యము బట్టబయటఁ బడియె,
నతనాభి నాభి సౌందర్య మెంచిన యంత,
బలు వివేకము సుడిఁ బడఁ దొడంగె,
మృగనేత్ర నేత్ర లక్ష్మిని గణించిన యంత,
నెదలోనఁ జాంచల్య మిరవుకొనియెఁ,

బాటలాధర యధరంబు నీటుఁ దలఁచి
నంత, ననురాగ మెంతయు నలవి మీఱె,
నింతి మై నిగ్గు లపుడు విశ్రాంతి హేతు,
లిపు డతి శ్రాంతి హేతు, లే నెటుల సైతు ?

జగ జంపు వగ కెంపు జగడంపు టలుకచేఁ
దొగ రైన కెమ్మోవి చిగురుదాని,
నల జక్కవలఁ గ్రక్కదలఁ ద్రొక్క గమకించు
బిగువు మీఱిన కుచ యుగముదాని,
సవరంపు బవరంపు సవరింపు నటనచేఁ
గుటిల వృత్తి వహించు కురులదాని,
సరి యెన్న విరి పొన్న సరి గొన్న గరిమచే
గంభీర మగు నాభిఁ గాంచుదాని,

మారు శంఖంబు గెలువ ముమ్మాఱు బద్ధ
కంకణం బైనయట్ల, రేఖా త్రయంబు
పొలుచు కంఠంబు గల దాని పొందు మాని,
మోహ వార్ధికి లోనైతి, మోసపోతి. 4-54

ఏ దిక్కుఁ జూచిన నెలదేఁటి దుమువారు,
లే జాడఁ జన్న నంభోజవనము,
లే చాయ మెలఁగినఁ బూచిన తీవియ,
లే కడ నుండినఁ గోక వితతు,
లే త్రోవ నిలిచిన నెల పొన్న శృంగార,
మే మూల కేఁగిన నిగురు టాకు,
లే వంక కొదిగినఁ దాని మొగ్గల గుంపు,
లే దెస డాసిన జాది పువ్వు,

లదరు పుట్టించు చున్న నా యతివ కురులు,
నయనములు, కేలు, కుచములు, నాభి, చరణ
ములు, నఖమ్ములు, మై తావి, తెలియఁ జేయు
నట్టి వయ్యును; బా గాయ నతను మాయ ! 4-55

క్రమాలంకారం.

నునుఁ బంట నా మోవి నొక్కి ‘చక్కని సామి !
నొచ్చెనో?’ యనుచు నానుచును జొక్కు,
నమరి, వింతగఁ బల్కు మనుచుఁ జెక్కిలిఁ గొట్టి
‘కందెనో?’ యనుచుఁ జన్గవను జేర్చు,
సందీక కౌగిటియందుఁ జేర్చి, ‘చెమర్చె
నో?’ యని పైఁటచే నొనర విసరుఁ,
దడవుగాఁ బడ కిచ్చి ‘బడలితివో?’యంచు
నయముగాఁ బై కొని బయల లాఁగు,

నట్టి చెలిఁ బాసి, తలపోసి, యలసి, గాసిఁ
దాల్మి నెడఁజేసి, వెత డాసి, తనువు రోసి,
తల్లడింపఁగ నాయ హా! దైవ మాయ !
యేది గతి చేర ? విర హాబ్ది కేది మేర ? 4-57

లిరులు, కూర్మముల్, దొనలు, దర్పకు నద్దము, లంటి కంబముల్,
పులినము, నంబరంబు, సుడి, పొం దగుడుం, దరఁగల్, భుజంగముల్
సలు పనఁటు, ల్లతల్, రము, పద్మము, తుమ్మెద గుంపు గూర్చినన్
గలికి యనంగ నౌ: నయినఁ గల్గునె తాదృశ లీల వానికిన్ ? 4-60

పులుగుల కబ్బలో ? కనకపుం జిగి దిబ్బలొ ? దాని గుబ్బలో ?
వలపుల దీవియో ? సుధల బావియొ ? దాని మెఱుంగు మోవియో ?
కలువల బంతియో ? కుసుమ కార్ముక దంతియొ ? కాక యింతియో ?
యలవియె దాని యందము శివా ! తలఁప న్దెలుప న్నుతింపఁగన్ ! 4-64

పంత మి దేలనే ? పెదవి పానక మానక తాళఁజాలనే !
యెంతటి దిట్టవే ! కసర కిప్పుడు నా కొక ముద్దుఁ బెట్టవే !
వంతల నేఁచకే ! మరు దివాణముఁ జూతు నటన్న దాఁచకే !
యింతుల మేటి ! యింత చలమేటికి నేఁటికిఁ జీటిమాటికిన్ ? 4-75

ఇటువంటి పద్యాలు కొన్ని ఉండటం వలననే ఈ పుస్తకం ఆంగ్లేయుల కాలంలో ప్రభుత్వ బహిష్కరణకు గురైంది కాబోలు.

పెనిమిటి వెన్క నిల్చి, నను బిత్తఱి చూపుల నీవు చూడ, నే
మునుకొని ముద్దుఁ బెట్టుటకు మో మటు లొగ్గఁగ, నీవు వేళ గా
దని తల యూఁచ, నే నలుగ, నందుకు గన్నుల నీవు మ్రొక్క, నే
నిను మదిఁ గౌగిటం బొదువ, నీ వఱ గన్నులు మోడ్పవా చెలీ ? 4-79

సన్నివేశాన్ని ఎంతగా కనులకు కట్టేట్లుగా వ్రాసారో చూడండి. ఓహ్! ఎంత బాగుందో ! అక్షర లక్షలే ఇవ్వచ్చు నిటువంటి పద్యాలకి.

నింతువు నాదు కోర్కి, గమనింతువు కేళి కహర్నిశంబు, నా
నింతువు ఱొమ్ము గుబ్బలఁ, దనింతువు పౌరుష కేళిచేతఁ, బూ
నింతువు తోనె కేళికి, గణింతువు నాదు గుణంబు లెల్లెడన్,
గాంతల లోన నీకు సరి గాన జగాన, న గానత స్తనీ ! 4-80

పూర్ణానుసార పూర్వక ‘తు’ కారం ఎంతందంగా అనుప్రాసించారో చూడండి. సరిగాన జగాన న గాన స్తనీ ! వాహ్!! ఎంతందం? ఏమందం?? ఇంకా ఎలా తలపోస్తున్నాడో చూడండి.
కలికి ! నీ సొగసెల్లఁ గలయఁ గన్గొను వేళఁ
గను ఱెప్ప పాటు విఘ్నముగ నెంతు,
నతివ ! నీతో మాట లాడి నిల్చినయట్టి
నిమిషంబు నొక వత్సరముగ నెంతుఁ,
జెలి ! నీవు రతి కేళి నలసి నిద్రించు నా
గడియ సేపు యుగంబు గాఁగ నెంతు,
మగువ ! నీదు చెఱంగు మాసిన మూన్నాళ్ళు
కల్ప కోటి శతంబుగా గణింతు,

నెమ్మి గలవాడ, నీకు మే నమ్మినాఁడ,
లాఁతిగా జూతువా నన్ను లలన ? నిన్నుఁ
గౌగిలింపక మాన నా కన్ను లాన !
నిలిచి మాటాడవే బాల ! చల మి దేల ?83

విరహవేళ ప్రియుడి మనోభావాలు ఎలా ఉంటాయో తెలియజేసాడు. ఆమె నింకా ఇలా బతిమాలుకుంటున్నాడు.

పల్కవే! నునుఁ దేనె చిల్కవే! మారు రా
చిల్క! వేడుక పల్కు కళ్కు దీర,
నిలువవే! యొక సారి కలువవే! వెడవిల్తు
కలువ వేఁడి శరంబు కలఁచెఁ దాల్మి,
చూడవే కన్నెత్తి! వీడవే మోడి! నీ
వీడ వే రావె! నీ వాఁడ నేను,
దియ్యవే చెంత! సందియ్యవే! మడుపు లం
దియ్యవే బళి! కంతు కయ్యమునను.

గలికి! రాయంచ బోదల కళికి యళికి,
యులికి, పలమాన పవమాన గళిత మాన
దళిత మానస లీల నేఁ దాళఁ జాల,
జాల మిది యేల లోల విశాల నయన? 84

తఱువాత మన్మథోపాలంభనము

ఏరా మారుడ ? తల్లివంక యని నీ కెంతేనియున్ లేదుగా ?
రారాపు ల్ననుఁ జేయ నాయ మగునా ? రాజ క్కృపాశాలి యౌ
శ్రీరామా హృదయేశుఁ, డా ఘనున కేరీతిన్ దగన్ బుట్టితో ?
క్షీరాంభోనిధికిన్ హలాహలము మాడ్కిన్ పాంథ విధ్వంసకా ! 88

బలిమి వియోగ వర్గముల బాధలఁ బెట్టెడు నిర్దయాత్మ ! నీ
దళములు చెట్లపాలయి, శతాంగ మరూపక మై, శిలీముఖం
బులు కడు వాఁడి హేయ మయి, పూనిన యిక్షు శరాసనంబు ని
ష్ఫల మయి పోయినం గద! శుభం బగు ధారుణి కెల్ల మన్మథా ! 89

తఱువాత తఱువాత వసంతోపాలంభనము , మలయాని లోపాలంభనము భ్రమరాద్యుపాలంభనమూ ను. ఈలోగా తార రాయబార మంపిన జటిని వచ్చి చంద్రునకు తారను కలిసే సంకేతమును తెలుపుట. జటిని చంద్రుడిని కలసినప్పుడు ఆమె వివరాలడుగుతాడు చంద్రుడు. ఆమె తాను తారను కలసి వస్తున్నానని చెప్తూ ఆమెకు చంద్రుని పట్ల గల విరహాన్నిలా వర్ణిస్తుంది.

నేర్పు మెయిం బటంబునను నిన్ను లిఖించు, లిఖించి, రెప్ప ల
ల్లార్పక చూచుఁ, జూచి, తన యక్కునఁ జేర్చును, జేర్చి, సంతసం
బేర్పడ సొక్కు, సొక్కి, తన హృద్గత తాపము నిన్ను సోకునం
చూర్పు లడంచుచు న్నెలత యున్నది, కన్నది విన్నవించితిన్. 105

ఇంకా ఏమంటున్నదో చూడండి.

ముద్దియ మోహ మెంతటిదొ మోహనరూప విలాస! వింటె ? యే
సుద్దుల నొల్ల, దెవ్వరినిఁ జూడఁగ నొల్లదు, సొమ్ము లొల్ల, దే
ప్రొద్దు విడెంబు చల్వలును భోజన మొల్లదు, నిద్ర యొల్ల, దీ
కొద్దికి పచ్చ విల్తుని లకోరుల నేమగుచున్నదో కదా! 4-106

లకోరులు =క్రూరమైన బాణాలు
“ఇంటి చెంగటి పూ పొదరింటి కిపుడె రమ్మన్న” దని చెవిని వేస్తుంది. ”మాపటి వేళ వచ్చెదను మల్లియ పూఁబొద రిల్లుఁ జేర” అని చెప్పి జటిని పంపించి వేస్తాడు చంద్రుడు. ఆ పొదరింటిలో తారతో గడిపి ఆమెను తనతో లేవదీసుకు పోతాడు చంద్రుడు. ఇక్కడ బృహస్పతి భార్యకోసం ప్రక్కమీద తడుముకొని ఆమె కనిపించక పొయ్యేసరికి “మద సామజ కంపిత భూరుహం”లా కంపిస్తాడు.దివ్యదృష్టిని చూసి నిశాకరుడు చేసిన కీడు తెలుసుకుంటాడు. దుస్సహాగ్రహంతో పోకారిని పాకారిచేత పరిమార్పిస్తానని బయలు దేరి దారిలో గంగా నదిని చేరతాడు.

గంగం, దరంగ రవ మెసఁ
గంగం బ్రవహించు నిమ్నగం గనుగొని, యే
గంగం, బురముల నెల్ల న
గం గల నిర్జరుల పురి తగం గనుపట్టెన్. 4-139

శబ్దబ్రహ్మ వేంకటపతి. తను చెప్పినట్టు విరుగుతాయి పదాలు, తనకి కావలసినట్టు చేరతాయి. ఈ పద్యంలో ‘గంగ’ శబ్దంపై యమకం అతిసహజంగా దొర్లింది. అమరావతిని చేరిన బృహస్పతి వాలకం చూసి సురలు రిచ్చపోయారు. ఆలిని కోల్పడిన వాడిలా ఇంత దైన్యం ఓడుతున్నాడేమిటనే వారు ఒకరు, పేద బ్రాహ్మణుడి రీతి వచ్చాడేమి అనే వారింకొకరు. ఇంద్రుడు బృహస్పతికి మర్యాదలు చేసి ఆయన సేమ మడుగుతాడు. బృహస్పతి చెప్పలేక చెప్పలేక , శశి చేసిన ద్రోహం అమరేంద్రుడితో చెపుతాడు. శశి చేసిన “కాని పనికి“ ఇంద్రుడు ఆగ్రహోదగ్రు డౌతాడు. అతని వేయి కన్నులూ జేవురిస్తాయి. వజ్రాయుధంతో ఆ గురుద్రోహి తల తెగవేస్తానని లేస్తాడు. ఈ మాత్రం పనికి మీరెందుకు ఆ సముద్ర ముద్దను కరగించటానికి నేను చాలనా? అని అగ్ని అడ్డుకుంటాడు. సామ దాన భేద దండోపాయాలన్నారు కదా పెద్దలు , ముందే దండ ప్రయోగం మంచిది కాదేమో! పైగా శశికి బ్రహ్మ ఇచ్చిన వరాలూ, గాడీవం గట్రా ఆయుధాలు ఉన్నాయి. ముందుగా ఒక దూతను పంపించి వాని ఉద్దేశమేమిటో తెలిసికుంటే మంచిది కదా అంటారు వరుణుడు మొదలైన వారు. సురపతి దూత విమానమెక్కి వెళ్ళి ‘చెందొవ విందు ‘ పట్టణం చేరుకొంటాడు. ప్రమద వనంలో తారతో వినోదిస్తున్న చంద్రుడు కబురంది వస్తాడు దూత వద్దకు. ‘తెలి చల్వకు మసి సోకినట్లు’ నీకొక అపకీర్తి వచ్చింది. నీ తలిదండ్రుల్ని చూసి ఊరకున్నాము. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ గురువు శరణుచొచ్చి, ఆయన భార్య నిచ్చివేయడం మేలు. లేకపోతే, వీపు చర్మ మొలిపిస్తామని సురేంద్రుని మాటగా చెపుతున్నానని ఊరుకుంటాడు దూత. పురుహూతు డెంతటి గృహస్థో మాకు తెలియదా ? ఈ ‘ ఒజ్జల పుచ్చకాయ’మాట లెందుకు? తమ చరిత్ర నెఱుగకుండా తా మొకరి ననడం కూడానా యీ దిక్పాలకులు? అని చెప్తూ చంద్రుడిలా అంటాడు.

అమరేంద్రు సంశుద్ధి యతని మేన్ దెలుపదో ?
ఋషి వధూ రతి వహ్ని కిపుడు లేదొ ?
మఱచెనో పాండు భామా స్నేహ మినజుండు ?
నై రృతి నియమ మెన్నాళ్ళనుండి ?
పొసఁగఁగా లేదొ యూర్వశి గుత్త వరుణున ?
కనిలుఁ డంజనఁ గూడి దనిసె నేమొ ?
కన్నెత్తి యొక సతిం గనుఁ గొనఁడొ కుబేరుఁ ?
డెనయఁడో దారుకా వనిని శివుఁడు ?

తమ తమ చరిత్ర లెఱుఁగక, తాము నొకరి
ననుకొనుట లాయెనా ? మంచి దండ్రు గాక !
నోళ్ళు మూయింతు మద్భు జానూన చండ
గాండివ జ్యా రవంబునఁ గదనమునను, 4-182

నేను సంధికి ఒప్పుకుంటానా అంటాడు చంద్రుడు. అందఱూ యుద్ధసన్నద్ధులవుతారు. ఈలోగా నారదుడిది విని దైత్యగురువైన శుక్రాచార్యుని దగ్గఱికి వెళతాడు.
”ఎక్కడో పుట్టిన కయ్యం ఎగదోయటానికి వచ్చినట్టుందే మహానుభావులు“ అంటాడు శుక్రుడు. “రవి గాననిచో కవి కాంచునే కదా” అంటాడు నారదుడు. ఇక్కడ కవి అంటే శుక్రాచార్యుడని అర్థం.ఇక ఇక్కడినుండి చంద్రుడు దేవతల పోరు ప్రారంభం అవుతుంది. అది తఱువాతి పోస్టులో చూద్దాం.

You Might Also Like

One Comment

  1. sai

    Please give the descriptions of the verses. I can understand few lines but never completely. I appreciate your effort so far, but it looks more of esoteric knowledge. Plz put some effort to reach a novice.

Leave a Reply