శ్రీరమణ గారి ‘మిథునం’ కథల సంపుటి – ఒక పరిచయం

రాసిన వారు: కే. చంద్రహాస్
(శ్రీరమణ గారి “మిథునం” సంపుటి పునర్ముద్రణై, ఇవ్వాళ్టి నుండీ మళ్ళీ మార్కెట్లో రాబోతోంది(ట). ఆ సందర్భంగా ఈ వ్యాసం.-పుస్తకం.నెట్ )
*****************************

శ్రీరమణ గారి కథలు అంటే నాకు చాలా యిష్టం. ముఖ్యంగా ‘మిథునం’, ‘బంగారు మురుగు’ కథలంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఈ ఆసక్తి ఇంతకాలం ఆ కథల్ని మాటిమాటికి చదివి ఆనందించేంతవరకే పరిమితమయింది. ఈ ఇష్టానికి మరో రూపం పుస్తకమంటే ఏ కొంచెమైనా ఆసక్తి వున్న మిత్రులందరినీ ‘మిథునం’ కథలను చదవమని కోరడం, చదవకపోతే మీరేదో మిస్సవుతున్నారని హెచ్చరించడం, ఊరించడం, కనపడినప్పుడల్లా ఆ కథల్ని చదివారా? అని అడగటమూ, వీలైతే వాళ్ళకి కథల పుస్తకాన్ని ఇవ్వడం. (పుస్తకం అమూల్యం, కానీ వెల సరసమే: మొదటి ఎడిషను 50 రూపాయలే!)

‘మిథునం’ సంపుటిలో వున్న కథల్ని చదవనివాళ్ళకి పరిచయం చేద్దామన్నదే ఈ చిన్న ప్రయత్నం. సంపుటిలో ఎనిమిది కథలున్నాయి. ‘అరటిపువ్వు సాములారు’ మొదటి కథ. చివరి కథ ‘మిథునం’. బంగారు మురుగు, ధనలక్ష్మి, వరహాల బావి, షోడానాయుడు, తేనెలో చీమ, పెళ్ళి — మిగత ఆరు కథలు.

సంపుటిలో మొదటి కథ అరటిపువ్వు సాములారు. దీన్ని కథ అనడంకంటే స్కెచ్ అనడమే సబబు. శ్రీరమణ గారు పారడీలకు పెట్టింది పేరు. పారడీ అస్త్రం ఈ ప్రారంభ కథలోనే ఆవిష్కరిస్తారాయన. కథ చివర్లో ఓ భక్తురాలు ఆయన గురించి, ఆయన అరటిపువ్వు థియరీల గురించి గ్రంథస్థం చేసి ఏడు కోట్ల ఆంధ్రులకు అందించాలనే కోరికను వెలిబుచ్చగానే సాములారు షాకైపోయి పలాయన మంత్రం పఠిస్తారు. ఇది చదివిన తర్వాత కూడా పాఠకులకు ఒక దివంగత రాజకీయ నాయకుడు గుర్తురాకపోతే తప్పు రచయితది కాదు కదా!

వరహాల బావి ఓ బావి చుట్టూ అల్లిన అందమైన కథ. నీళ్ళకు అలమటించే గ్రామంలో బావి తవ్వడమే కథలోని కథ. తరువాత ఆ బావి మతాలకు అతీతంగా ఊరివాళ్లను సంఘటితం చేస్తుంది. మతం పేరిట దేశం చీలిపోయే ప్రమాదం ఏర్పడుతుందేమో అనిపించే సమయంలో, అంటే 1994 లో రాసిన ఈ కథ చల్లని వెన్నెలలాగా హాయిగొలుపుతుంది, గాయాలకు మలాములా పని చేస్తుంది.

బంగారు మురుగులో బామ్మ గొప్ప రెవల్యూషనరీ. స్వాములంటే దూరంగా వుంటుంది. తర్కంలో దిట్ట. కోపం మామూలుగా రాదు. వచ్చిందా, అందరూ ఆమె ధాటికి హడల్. మనమడంటే గారాబం. వల్లమాలిన ప్రేమ. మనవడికి కష్టం వస్తే తట్టుకోలేదు. కష్టానికి కారకుల్ని తూర్పారపడుతుంది. వాళ్ళెవరైనా సరే. ఆఖరికి స్వామివారి ప్రియ శిష్యుడైన దీక్షితులు కూడా ఆమె అంటే జడుసుకునేలా తన వాగ్బాణాలను సంధిస్తుంది. చివరికి ఆమె ధాటికి తట్టుకోలేక స్వామివారే తెల్ల జండా ఊపేస్తారు. మనవడి జీళ్ళ కోసం పూజ గంట అని కూడా చూడకుండా మాయం చేసే సాహసం, ఉదారం బామ్మకే చెల్లింది. అలాంటి బామ్మ వున్నవాళ్ళు మహర్జాతకులని చెప్పాలి. మనవడికి మంచి పెళ్ళాం రావాలని ఆమె చేసిన పని కథలో మంచి ట్విస్ట్. అదే కథకు ముగింపు కూడాను. ప్రతి గుండెనీ తాకే శక్తి వున్న కథ ఇది. ప్రతి మనిషికీ తన బాల్యాన్ని గుర్తు చేసే గొప్ప కథ ‘బంగారు మురుగు’.

ధనలక్ష్మి వొక యువతి కథ. కష్టాలని అధిగమించి, సంసారాన్ని బ్యాలెన్సు చేసుకుంటూ వ్యాపారంలో ఆమె విజయం ఎలా సాధిస్తుందో చెబుతుంది. వ్యాపార సూత్రాలను ఈ కాలపు ఎం.బీ.ఏ.లకు నేర్పగల దిట్ట ధనలక్ష్మి. మొగుడి చేతకానితనాన్ని చూసి ఆమె నిరుత్సాహపడదు. అతని లోటుపాట్లెరిగి తన మార్గాన నడిపిస్తుంది, పట్టం అతనికే కడుతూ. జీవితంలో డబ్బు ముఖ్యమే కాని వైవాహిక సుఖం కూడా అంతే ముఖ్యం. ఈ విశేషమైన సూత్రం తెలిసిన వాళ్ళ జీవితం నల్లేరుమీద నడకలా సాగుతుంది. మూడో క్లాసు కూడా గట్టెక్కని ధనలక్ష్మికి ఆ నేర్పరితనం, ఆ తెలివి, ఆ దక్షత ఎలా అబ్బాయా అని మనలో చాలామందిమి అనుకుంటామని ముందే వూహించి, శ్రీరమణ గారు శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యంతో మనకు మంత్రం వేస్తారు.

షోడానాయుడు అనే కథలో నాయుడుకు సోడాయే ప్రపంచం. జీవితం అంతా సోడామయమే. సోడానాయుడు మన అందర్లోనూ వుంటాడు: కొందరిలో చాలా స్పష్టంగా, మరికొందరిలో లీలగా. ఈ కథానాయకుడికైతే కువైట్ అయినా అయోధ్య అయినా తేడా ఏమీ వుండదు. అక్కడ సోడా బిజినెస్సు గోల తప్ప. వాళ్ళ అమ్మాయికీ ఈ సోడా నింపే విద్యే నేర్పుతాడు. అల్లుణ్ణీ అదేపనిలో వుంచుతాడు. మనకు రోజూ తారసపడే వ్యక్తి నాయుడు. ఈ కథ ముగింపులో కాస్త నాటకీయత ఎక్కువైందేమో అనిపిస్తే అనిపించవచ్చు. అలాగని రచయిత ఇంకో రకంగా ఎలా ముగించాలో చెప్పండి అంటే దానికి సమాధానం సులువుగా దొరకదు. బహుశా ఆ కథకు అదే కరెక్టు ముగింపేమో!

తేనెలో చీమ వూబిలోనుంచి బయటపడి, మళ్ళీ కూరుకుపోతానేమో అని భయపడే శీనయ్య కథ. పల్లెల్లో ముఠాలకు, రాజకీయాలకు అద్దం పట్టే కథ యిది. ఈ గొడవల్లో చిన్నవాళ్ళు ఆ అగ్నికి ఎలా సమిధలు అవుతారో కథ చిత్రీకరిస్తుంది. కథలో కత్తులూ, సుమోలూ, రక్తపాతాలు వుండవు. చాలా సున్నితంగానే చురుక్కుమనేలా బడుగువాళ్ల బతుకులగురించి చెబుతారు శ్రీరమణ గారు.

పెళ్ళి కథ ఒక పెళ్ళి పందిరిలో పెళ్ళితోపాటు జరిగే అనేక విషయాల మిశ్రమం. ఈ కథలో ఇంజినీరు గారు రావల్సినవన్నీ అందరినుండీ రాబడతాడు. మంత్రిగారు అతని దగ్గిరనుండి అంతకు పదింతలు రాబడతారు – దబాయించి, దర్జాగా. దొందూ దొందే. అంతా అవినీతి లీల. సెటైరు పుష్కలంగా వున్న కథ. ఈ కథను మౌనంగా చదవకండి. గట్టిగా, గొంతెత్తి చదివితే కలిగే ఆహ్లాదం రెండింతలు గ్యారంటీ. రకరకాల మనుషుల గొంతుల సమాహారమే ఈ కథ. కాబట్టి నాటకం మాదిరి నలుగురు కూడి చదివితే ఇంకా రసవత్తరంగా వుంటుంది. ప్రయత్నించి, ఆ అనుభూతిని ఆస్వాదించిన తర్వాత, నా మాట నిజం అని మీరే అంటారు.

మిథునం కథ ఇద్దరు ముసలి దంపతుల మధ్య నడుస్తుంది. వాళ్ళ అనుబంధం, అనురాగం, వాళ్ళ మాటలు, విరుపులు, ఎకసెక్కాలు, పోట్లాటలు చాలా వింతగానూ, రమ్యంగానూ, సహజంగానూ వుంటాయి. ఆ దంపతులిద్దరూ చదువరులను ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. కథలో బోలెడు చమత్కారాలు. విపరీతంగా నవ్వు పుట్టించే కలిగించే సన్నివేశాలు కోకొల్లలు. అంతే కాదు. కథకు ఆయువుపట్టు జీవన వేదాంతం. ఆ అప్పదాసు బుచ్చిలక్ష్మిలు వాళ్ళ సంసారాన్ని చెట్ల మధ్యన మూడు పువ్వులు ఆరు కాయల్లాగా మలుచుకుంటారు. వాళ్ళ పిల్లలు అంతా చేతికి అందివచ్చిన వారే. వాళ్ళకి వీరంటే వల్లమాలిన ప్రేమే. అలాగని వాళ్ళపైన వీళ్ళిద్దరూ వాలిపోరు. ఎవరి బతుకు వాళ్ళదే. అదే సుఖమూ, సంతోషమూను. ఈ కథ శ్రీరమణ గారి రచనా విశ్వరూపం. మంచి ప్రపంచ కథా రచయితల సరసన ఆయనకి కుర్చీ వేయడానికి ఈ ఒక్క కథ చాలు.

మూడు నెలల క్రితం మాట. నా కాపీ ‘మిథునం’ కథల పుస్తకం ఎవరికో చదవమని ఇచ్చాను. అదెవరికి ఇచ్చానో గుర్తురాక, ఇంకొక కాపీ కొనాలి అని హైదరాబాదులోని పెద్దా చిన్నా షాపులన్నీ గాలించాను. పుస్తకం దొరకలేదు. విజయవాడ షాపుల్లో కూడా దొరకలేదు. అంటే పుస్తకం స్టాకులో లేదు. తెలుగు చదివేవాళ్ళు రోజు రోజుకీ తగ్గిపోతున్న సమయంలో ‘మిథునం’ లాంటి మంచి పుస్తకం ఎప్పుడూ అందుబాటులో వుండాలి. వాకబు చేస్తే తెలిసిన విషయం ప్రకారం కొత్త ఎడిషన్ నవోదయ వాళ్ళే మళ్లీ వేస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే పుస్తకం సోమవారం అంటే 11-7-2011 న మార్కెట్లో వుంటుంది అని. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఈ కొత్త ఎడిషన్ సంపుటి వెల 60 రూపాయలని విన్నాను. ఈ రోజుల్లో అంత మంచి పుస్తకాన్ని, మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడుపోయేదాన్ని కేవలం 60 రూపాయలకే అందించడం గొప్ప విషయమే. దీనికి ప్రత్యేకంగా నవోదయ పబ్లిషర్లను, రచయితనూ నిజంగా అభినందించాలి.

ఆసక్తిగలవారు శ్రీరమణ గారి కథలపై, ప్రత్యేకం మిథునం కథపై, విష్ణుభొట్ల లక్ష్మన్న గారు పుస్తకం.నెట్లో రాసిన వ్యాసాలు కూడా చదవొచ్చు.

You Might Also Like

15 Comments

  1. ప్రసాదు ఏల్చురి

    శ్రీ రమణ గారి పుస్తకాలు కొన్నాను. అలాట్ కినిగె.కాం లో మిథునం సాఫ్ట్ కాపీ కొనుక్కొని అపుడు అపుడు చదువుతుంటాను.
    బంగారు మురుగు కధ పిడిఎఫ్ గురించి వెతుకుతూ ఉంటె ఈ పేజీ కనిపించింది.

    ఎవరో వ్యాఖ్య రాసారు . పిడిఎఫ్ నా బ్లాగు లో పెట్టాను . కరెక్టేనా కాదా అని. కాపీ రైట్ విషయం పక్కన
    పెడితే

    రమణ గారి కధలు చదువుతూ ఉంటె మనలో ని మనిషి ని సంబంధాలను బయటకు తీస్తాయి. ప్రతి కధ అంతే ఒక మోస్తరు అటూ ఇటూ గా.
    ఈ రోజుల్లో అంతా స్పీడ్ అయిపొయింది . జీవితం పరుగో పరుగు. అలాంటప్పుడు మధ్య మధ్య లో ఒకసారి ఇలాంటి కధలు చదువుతూ ఉంటె మళ్లీ కొంత
    వెనక్కి (రివైండ్ ) వెళతాం. కాబట్టి నలుగురి తో కధ పంచుకొంటే మంచిదే. మాటలో మాట గా నచ్చితే ఆ పుస్తకాలూ కొనుక్కోమని ఓ సలహా జతచేయడం మర్చి పోవద్దు.

    బంగారు మురుగు కధ . ఎంత పాత తరమైనా బామ్మగారు అవసరం వచ్చేసరికి ఎంత నేర్పుగా వ్యవహారం నడిపారో, మంచి పెళ్లి సంబంధం చేయి జారకుండా , మాట చెడకుండా తన మురుగుతో ఎలా పని కానిచ్చారో చూస్తే కళ్ళు చెమరుస్తాయి.

    ఈ రోజుల్లో అదృష్టం అంటే బామ్మలు, తాతలు ఇంటిలో దగ్గర ఉండి మనుమలు మనుమరాళ్లు గారాబాలు అనుభవించడం. అది అందరికీ ఉండదు. అది అంతే .

    1. Nagaveni

      PDF kosam google motham vetukutunna Sir… Plz share to nagaveni065@gmail.com thanks in advance Sir

  2. rajeswari

    adbhutamaina sameekha.mithunam movie vidudala sandharbhangaa andriki nutana vatsaram munde testunnaru sri bharani garu.

    1. rajeswari

      adbhutamaina sameekhsa.mithunam movie vidudala sandharbhangaa andariki nutana vatsaram mundea tesukotheru sri bharani garu

  3. Dr.K.V.S.S.R.K.SASTRY

    Dear Ramana garu,

    Anukokunda browze chestunte mee title kanipinchindi. Deeni gurinchi veenapani chepparu kaanee, story meedani cheppaledu. Review chadivaanu. chaalla baagundi. ivvaalo repo pustakam koni chadivi migilindi raastaanu. Aksharaasyulu kooda niraksha rasyulugaa migilipotunna ee rojullo meelaanti vaaru mallee vayojana vidya praarambhinchadam chaallaa santosham.

  4. పుస్తకం » Blog Archive » Mithunam and Other Stories

    […] వచ్చింది. 2000 నవంబరులో మొదటిసారిగా “మిథునం – శ్రీరమణ కథలు” ఎనిమిది కథల సంపుటంగా నవోదయ […]

  5. Dr.Murthy Remilla

    Dear all,

    Sree Ramana gari bangaru murugu parts dorikithe clu chesi PDF pettenu naa blog lo: murthyremilla.blogspot.com

    Chaala mandi chadivi aanandinche maata nijame kaanee, how far its right do such things with respect copy rights is a question. Please guide me if it is ok.

    Also, i am requestimg sree Jampala chowdary garu to send me the hand written scriot by Sri Bapu of Mithunam story. 1997 communications chusi 3,4 mails chadivi chowdary gaariki mail pampenu. But ni reply so far i am not sure if the mIl id used is right.

    I will immediately buy the new release book but hand scrip is a class in itself.

    Requesting any one else also to help me getting this master piece in bapu’s script. (murthyremilla@antrix.gov.in)

  6. Sai YVST

    Sir, Thank you for your review. Now, I shall go and buy the book and read

  7. Madhu

    Telugu Mithunam is available with Navodaya Vijayavada. We are also trying to get the English translations into the market in next two weeks

  8. ramesh k

    excellent introduction.would like to buy the book at the earliest.interesting article about the book by Sri K.Chandrahas.
    Thank you.

  9. mohanramprasad

    మిధునం లోని కధనం చాలా బాగుంటుంది. చదివి చాన్నాళ్ళై0ది. మీ చిరు పరిచయ0 చూసాక, మళ్ళీ చదవాలని ఉంది.

  10. k.chandrahas

    @జంపాల చౌదరి:

    చౌదరిగారూ
    మీ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. అనువాదం చేసి దాదాపు నెల క్రితమే manuscriptని cover pageతో సహా C. P. Brown Academi వారికి ఇచ్చేశాను. కాపీరైటు దగ్గర చిన్న అడ్దంకి ఏర్పడింది. అదికూడా జూన్ 24న resolve అయింది. ఇక ప్రెస్సుకు పంపుతున్నాం అన్నారు. ఆరోజు నుండి ఇప్పటివరకు కబురు లేదు. శ్రీరమణ గారినో లేదా C. P. Brown Academi వారినో అడగడానికి కాస్త సిగ్గుగా వుంది, అంత తొందరెందుకో అంటారేమోనని.
    ఒకోసారి మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరగవు కదా అని నన్ను నేను బుజ్జగించుకుంటున్నాను.
    ఇదీ విషయం.
    చంద్రహాస్

  11. జంపాల చౌదరి

    మిథునం కథాసంపుటం మళ్ళీ మార్కెట్లోకి రావడం ఆనందకరమైన విషయమే.
    మరి, మిథునం ఆంగ్లానువాదం ఎప్పుడు వస్తుంది చంద్రహాస్‌గారూ?

  12. సూరంపూడి పవన్ సంతోష్

    మంచి పరిచయం. కానీ షోడానాయుడు కథలో ఆ ముగింపుకే నేను కరిగిపోయాను. గుర్తొచ్చినప్పుడల్లా గోళీలు ఘల్లుమంటాయి నా గుండెల్లో. అంతమంచి ముగింపును విమర్శించేశారే. పోన్లేండి. అందర్కీ నా అభిప్రాయాలే ఉండక్కర్లేదు కదా.

  13. Subhadra

    మంచి పరిచయం.. అంత కన్నా మంచి పుస్తకం.. ఇదే పుస్తకాన్ని గురించి నేను రాసిన బ్లాగ్ ఇక్కడ చూడండి..

    http://praseeda1.blogspot.com/search?updated-max=2011-06-11T23%3A31%3A00%2B05%3A30&max-results=4

Leave a Reply