‘అసమానత్వం’లోనించి ‘అసమానత్వం’ లోకే!

వ్యాసం పంపినవారు: మార్తాండ

asamanatvam_nunchi_asamanatvam_lokeస్త్రీ-పురుష సంబంధాల విషయంలో సంకుచిత నమ్మకాల నుంచి బయట పడలేని వాళ్ళు కొందరు, స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు మరి కొందరు. స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి ఉన్న తేడా ఏమిటి? విచ్చలవిడితనం వల్ల స్త్రీలకి లాభమా నష్టమా? ఈ అంశాలు గురించి వివరిస్తూ రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకం పేరు ‘అసమానత్వం’లోనించి ‘అసమానత్వం’ లోకే!.

పాశ్చాత్య సంస్కృతి పేరుతో కొంత మంది విచ్చలవిడి తిరుగుళ్ళని సమర్థించడం జరుగుతోంది. నిజానికి పాశ్చాత్య దేశాలలో కూడా స్త్రీ-పురుషులు అంత విచ్చలవిడిగా తిరగరు(అమెరికా లాంటి కొన్ని దేశాలలో తప్ప). ఇరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్ ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ వారు రష్యన్ రచయిత్రి అలెక్సాండ్రా కొల్లొంటాయ్ వ్రాసిన “The Loves of Three Generations” అనే కథని తెలుగులోకి అనువదించారు. అది బూతు కథ అంటూ విమర్శలు వచ్చాయి. అది ముగ్గురు స్త్రీల జీవితం కాన్సెప్ట్ మీద వ్రాసిన కథ. మరియా అనే స్త్రీ తనని ప్రేమించే భర్తని మోసం చేసి, సెర్జీ అనే డాక్టర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. సెర్జీకి కూడా ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉంటాయి. మరియ భర్తకి ఈ విషయం తెలిసినా ఆమెని క్షమిస్తాడు. కానీ మరియ తన భర్తని అర్థం చేసుకోకుండా అతన్ని, తన పిల్లల్ని వదిలేసి సెర్జీతో వెళ్ళిపోతుంది. మరియా కూతురు ఓల్గా కాన్స్టాంటిన్ అనే విప్లవకారుడిని పెళ్ళి చేసుకుంటుంది. వీళ్ళిదరినీ ఒకసారి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఓల్గా జైల్ నుంచి తప్పించుకుని బయటపడుతుంది. కాన్స్టాంటిన్ జైల్ లో ఉండగా ఓల్గా ఒక ఇంజినీర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఆ ఇంజినీర్ కి పెళ్ళయ్యింది, పిల్లలు కూడా ఉంటారు. ఆ విషయం తెలిసి కూడా ఓల్గా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఓల్గా ఆ ఇంజినీర్ వల్ల గర్భవతి అవుతుంది. ఆ విషయం ఓల్గా జైల్ లో ఉన్న తన భర్తకి ఉత్తరం వ్రాసి చెపుతుంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త ఆమెని ఏమీ అనడు. ఆమె ఇంజినీర్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఆమె భర్త సమర్థిస్తాడు. ఓల్గా కూతురు జెన్యా ఒకే సమయంలో ఎక్కువ మంది మగవాళ్ళతో తిరిగి గర్భం తెచ్చుకుంటుంది. ఆమె అసలు పెళ్లే చేసుకోదు. ఈ ముగ్గురి కథలలోనూ ఇంకా బోలెడన్ని లోపాలు ఉంటాయి. ఈ కథలపై రంగనాయకమ్మ గారు తీవ్ర విమర్శలు చేశారు. స్త్రీ పెళ్ళి చేసుకోకుండా బిడ్డల్ని కంటే ఆ బిడ్డలపై తండ్రి బాధ్యత ఉండదు, అప్పుడు తల్లికే బిడ్డల్ని పెంచే భారం పెరుగుతుంది, ఈ రకంగా కూడా మగవాడు లాభపడతాడు, ఆడది నష్టపోతుంది అని కూడా రంగనాయకమ్మ గారు వాదించారు. రంగనాయకమ్మ గారి విమర్శలకి ప్రతి విమర్శలు కూడా వచ్చాయి. డబ్బులు తీసుకుని సెక్స్ చెయ్యడం తప్పే, వావివరసలు లేని సెక్స్ చెయ్యడం కూడా తప్పే, ఇలాంటి వాటిని మేము సమర్థించడం లేదు, ఇలాంటి ఇంక్లినేషన్స్ లేకుండా సెక్స్ చెయ్యడం తప్పు కాదు… అంటూ కొందరు ఉత్తరాలు వ్రాసారు. ఈ పుస్తకం కొత్త ముద్రణలలో ఆ ఉత్తరాలకి సమాధానాలు కూడా చేర్చారు. రంగనాయకమ్మ గారిని విమర్శిస్తూ ఉత్తరాలు వ్రాసిన వారిలో ప్రముఖ రచయిత చందు సుబ్బారావు గారు కూడా ఉన్నారు. స్త్రీవాద వివాదాలు పుస్తకంలో కూడా సుబ్బారావు గారి వ్యాసం ఒకటి ప్రచురితమయ్యింది. పురుషునికి అనేక మంది స్త్రీలతో తిరిగే అవకాశం ఉన్నప్పుడు స్త్రీకి కూడా అనేక మంది పురుషులతో తిరిగే అవకాశం ఉండాలని విమర్శకుల వాదన. ఆడవాళ్ళు కూడా తిరగాలని చెప్పడం ఈ సమస్యకి సరైన పరిష్కార మార్గం కాదు, ఒక స్త్రీ – ఒక పురుషుడు సంబంధంతోనే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని రంగనాయకమ్మ గారు సూచించారు.

గతంలో నేను కూడా ఆ విమర్శకులని సమర్థించాను. ఇప్పుడు ఇంటర్నెట్ పార్నోగ్రఫీ పేరుతో పెరిగిన అసహ్యకరమైన ధోరణులు చూసిన తరువాత అభిప్రాయం మార్చుకోవలసి వచ్చింది. పెళ్ళికి ముంది మోసపోయి బిడ్డని కన్న స్త్రీని పెళ్ళి చేసుకోవచ్చు, రేప్ వల్ల గర్భవతి అయిన స్త్రీనైనా పెళ్ళి చేసుకోవచ్చు కానీ భర్తని మోసం చేసి వేరే పురుషుని ద్వారా బిడ్డని కన్న స్త్రీతో కాన్స్టాంటిన్ ఎలా సమర్థించినట్టు? మాతృత్వాన్ని, బిడ్డల్ని అమ్ముకునే ఆర్టిఫీషియల్ ఇన్సెమెనేషన్, టెస్ట్యూబ్ బేబీ లాంటి పద్దతులని కూడా రంగనాయకమ్మ గారు విమర్శించారు. పిల్లలు లేకపోతే అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు కానీ మాతృత్వాన్ని లేదా బిడ్డల్ని అమ్ముకునే, కొనుక్కునే పద్దతిని ప్రోత్సహించకూడదని రంగనాయకమ్మ గారి వాదన. కొన్ని దేశాలలో ఇరవై ఏళ్ళు నిండకుండానే బిడ్డలకి తల్లులయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ దేశాలలో జనాభా పెరుగుదల సమస్య కూడా ఎక్కువగా ఉంది. పదమూడేళ్ళ వయసులోనే గర్భవతులై బిడ్డని చూడడానికి టైమ్ లేక స్కూల్ చదువులు ఆపేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. విచ్చలవిడి సెక్స్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. వాటన్నిటినీ రంగనాయకమ్మ గారు ఈ పుస్తకంలో వివరించారు.

You Might Also Like

4 Comments

  1. మార్తాండ

    ప్రతి ఆడదాని కారెక్టర్ ని అనుమానించడం నెగటివ్ గా ఆలోచించేవాడి లక్షణం. పెళ్ళికి ముందు మోసపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోవడంలో తప్పు లేదనే నమ్ముతాను. ఒక ఆడది కావాలని తప్పు చేసినంతమాత్రాన వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ అదే తప్పు చేస్తారని అనుకోలేము.

  2. ఆరి సీతారామయ్య

    రంగనాయకమ్మ గారితో ఏకీభవించినా లేకపోయినా ఇది అందరూ చదవదగిన పుస్తకం. “పెళ్ళి చేసుకోకుండా బిడ్డల్ని కంటే ఆ బిడ్డలపై తండ్రి బాధ్యత ఉండదు, అప్పుడు తల్లికే బిడ్డల్ని పెంచే భారం పెరుగుతుంది, ఈ రకంగా కూడా మగవాడు లాభపడతాడు, ఆడది నష్టపోతుంది” – ఇది రంగనాయకమ్మ గారు చెప్తున్న ముఖ్యమైన విషయం.

    పెళ్ళికి ముందు అందరూ మంచివాళ్ళుగానే ప్రవర్తిస్తారు. వ్కక్తిత్వాలగురించి లోతుగా తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుంది (“అతడు-ఆమె” చదివితే తెలుస్తుంది). ఒక వ్యక్తి “మంచివాడు” కాదని బిడ్దపుట్టింతర్వాత తెలిస్తే? బిడ్డకోసం అతనితోనే ఉండటమా? లేక బిడ్డ భారాన్ని తనే మోస్తూ వేరుగా బ్రతకటమా? ఈదీ ఈనాటి ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం అంత సులభంగా దొరకదు.

    బిడ్డల్ని కనకపోతే? అప్పుడు ఎవరితో సంబంధం ఉన్నా స్రీనం నష్టపోదుగదా? అప్పుడు సంబంధాల మంచి చెడ్డలకు కొలమానం ఏంటీ?

    “పెళ్ళికి ముంది మోసపోయి బిడ్డని కన్న స్త్రీని పెళ్ళి చేసుకోవచ్చు, రేప్ వల్ల గర్భవతి అయిన స్త్రీనైనా పెళ్ళి చేసుకోవచ్చు కానీ భర్తని మోసం చేసి వేరే పురుషుని ద్వారా బిడ్డని కన్న స్త్రీతో కాన్స్టాంటిన్ ఎలా సమర్థించినట్టు? ” అని అడిగారు మీరు. అంటే మోసం చేసిన స్రీఉం మంచిది కాదు, మోసపోయిన స్రీడు మాత్రం ఫరవాలేదనే గదా? మోసం చేసిందో చెయ్యబడిందో అంత సులభంగా చెప్పగలమా నిజ జీవితంలో?

Leave a Reply