మధుమురళి – అనితర సాధ్య గాన రవళి

(మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వ్యాసం)

భారత సంగీతరంగంలో అత్యున్నత శిఖరాల నధిరోహించిన ప్రతిభాశాలి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఈరోజు (జులై 6, 2011) న 81 ఏళ్ళు నిండుతాయి. “బాలమురళి ప్రతిభా విశేషాలను ఎందరో ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తూ” వ్రాసిన “వాటన్నిటినీ సాధికారంగా భద్రపరచి సంస్కృతి పియులకు అందించాలనే సంకల్పం”తో ఆయన అభిమానులు కొందరు ఈ మధు మురళి అన్న పుస్తకాన్ని ప్రచురించి, గత సంవత్సరం ఆయన 80వ జన్మదినోత్సవం విశాఖపట్టణంలో ఘనంగా జరుపుతున్నప్పుడు ఆవిష్కరించారు.

1930 జులై ఆరున తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన బాలుడికి మురళీకృష్ణ అని పేరు పెట్టుకొన్నారు. పట్టాభిరామయ్యగారు ప్రసిద్ధ సంగీత విద్వాంసులు, వయొలిన్ వాయించటంలో బాగా ప్రఖ్యాతి వహించారు; నూకల చినసత్యనారాయణ వంటివారు ఆయన దగ్గ వయొలిన్ నేర్చుకునేవారు. సూర్యకాంతమ్మ గారు ప్రముఖ ఆధ్యాత్మిక గాయకుడు ప్రయాగ రంగదాసుగారి కుమార్తె; వీణ కచేరీలు చేసేవారు. మురళి పుట్టిన 17 రోజులకు తల్లి మరణించారు. రోజూ పక్కన పడుకోపెట్టుకుని గారాలబిడ్డకి సంగీతం నేర్పారు పట్టాభిరామయ్యగారు. ఇలా వింటున్న మురళికి సరళీస్వరాలు, జంటస్వరాలు, వర్ణాలు, కీర్తనలు నోటికి వచ్చేశాయి. ఏడవ ఏట, గురు ముఖతః సంగీతం నేర్చుకుంటే మంచిదని మురళిని పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గరకి తీసుకెళ్ళారు. రామకృష్ణయ్య పంతులు గారు త్యాగరాజు శిష్యులలో నాలుగోతరం వారు (త్యాగరాజు > మానాంబుచావడి [ఆకుమళ్ళ] వెంకట సుబ్బయ్య > సుసర్ల దక్షిణామూర్తి > పారుపల్లి రామకృష్ణయ్య పంతులు). మురళి పాట విని, పంతులుగారు, తండ్రితో, “వీడికి చెప్పవలసిందేమీ లేదు. వచ్చినవి మననం చేయడం తప్ప”, అన్నారట.

1939 జులై ఆరున (అంటే తన తొమ్మిదవ పుట్టిన రోజున) మురళీకృష్ణ తన మొదటి కచేరీ ఇచ్చాడు. ఆ కచేరీ తర్వాత ప్రసిద్ధ హరికథకులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ హరికథ చెప్పాలి. ఇంతటి అద్భుత గానం తర్వాత నేను చెప్పలేనని ఆయన హరికథ మానేసి, మురళీకృష్ణ పేరుకు “బాల”ను చేర్చారు. ఆరోజునుంచి బాలమురళీకృష్ణ అన్న పేరు స్థిరపడింది. 1942లో తన పదకొండవ ఏట, తిరువయ్యూర్‌లో బెంగళూరు నాగరత్నమ్మగారి ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఈశమనోహరి రాగంలో మనసా శ్రీరామచంద్రుని అనే కీర్తన సమ్మోహనంగా పాడి అందరి మనసూ చూరగొని, ఆ మర్నాడు దాదాపు రెండు గంటలపాటు కచేరీ చేసి అందరి మెప్పులు పొందాడు. పన్నెండేళ్ళకే గాన సుధాకర అన్న బిరుదు పొందాడు.

బాలమురళీకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుకున్నది ఆరో తరగతే అయినా, తెలుగు, తమిళం, సంస్కృతం భాషల్లో కీర్తనలు రచించారు. ఇంగ్లీషు, కన్నడం, మళయాళం భాషల్లోనూ ప్రవేశం ఉంది. తన 16వ ఏట, ఆయన గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీ స్వామి, బాలమురళిని పిలచి, “త్యాగరాజుకి పూర్వం సంగీతం ఎలా ఉండేదంటావు” అని అడిగితే, “బహుశా ఒక క్రమపద్ధతిలో లేదేమో”, అని సమాధానమిచ్చాడు. “అవునా, అంటే త్యాగరాజు సంగీతంలో కొత్త పుంత తొక్కి కొత్తగా రచనలు చేసి, పాడి, పాడించి, వాగ్గేయకారుడయ్యాడు. ఇదివరకెవ్వరూ చేయనిది చేశాడు. చేయలేనిది చేశాడు. చరిత్రలో మిగిలాడు. అదీ నువ్వు చేయాలి.” అన్నారు. తదాదిగా ప్రారంభించి, కేవలం రెండు సంవత్సరాలలో అంటే తన పద్దెనిమిదో ఏడు నిండే లోపే 72 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశాడు (ఈ రాగాల పుస్తకానికి రాగాంగ రవళి అని, 
జనకరాగ కృతిమంజరి అన్న పేర్లు కనిపించాయి ఈ వ్యాసాలలో). బాలమురళి చాలా తిల్లానాలు కూడా సృజించారు. బాలమురళీకృష్ణ తిల్లానాలు లేని నాట్యకార్యక్రమాలు అరుదు. మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో భక్తిరంజని కార్యక్రమానికి ఆయన రూపొందించిన అనేక గీతాలు బహుళ ప్రాచుర్యాన్ని పొంది, తెలుగు జీవనంలో భాగమయ్యాయి. బెంగాలులో రబీంద్ర సంగీతం గానం చేయటానికి ఆహ్వానించబడ్డ ఏకైక దాక్షిణాత్య గాయకుడు బాలమురళీకృష్ణ. వయొలిన్, వయోలా, కంజీర, మృదంగం వాయిద్యాలలో విద్వాంసులు. పేరెన్నికగన్న గాయకులకు పక్కవాయిద్యం వాయించి మన్ననలు పొందారు. సంప్రదాయపు చట్రానికి బందీ కాకుండా కొత్త పోకడలను సృష్టించడంతో కొంత వివాదానికి గురయినా కాలక్రమేణా ఆయన దారి చాలామందికి మార్గదర్శకమయింది.

ఇరవై రెండేళ్ళకే ఆకాశవాణిలో సంగీత పర్యవేక్షక ఉద్యోగం, ఇరవైతొమ్మిదేళ్ళకు ప్రభుత్వ సంగీతకళాశాల ప్రిన్సిపల్ ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాన్ పదవి. తర్వాత వరుసగా ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులు, ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి షెవాలియే బిరుదు, విశ్వవిద్యాలయాలనుంచి డాక్టరేట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలనుంచి అనేక బిరుదులు, అవార్డులతో గౌరవింపబడ్డారు. దాదాపు 22 వేల కచేరీలు చేశారు. సినిమాల్లోనూ పేరెన్నికగన్న పాటలు పాడారు. ఉత్తమ చలనచిత్ర గాయకుడిగా (హంసగీతె 1976), ఉత్తమ చలనచిత్ర సంగీత దర్శకునిగా (మధ్వాచార్య, 1985), ఉత్తమ శాస్త్రీయ సంగీతకారుడిగా ప్రభుత్వ జాతీయ అవార్డులు గెలుచుకొన్న అరుదైన ప్రతిభాశాలి. సినిమాల్లో నటించారు, భక్త ప్రహ్లాద చిత్రంలో నారదుడి పాత్రకు ప్రశంసలు పొందారు; సంధ్యాగిందెన సింధూరం అనే మళయాళం చిత్రంలో నాయకపాత్రకూడా ధరించారు.

ఎనిమిది పదులు నిండినా, తాను కచేరీలు చేయడం మొదలుబెట్టి ఏడు దశాబ్దాలు పూర్తి ఐనా, బాలమురళీకృష్ణ నేటికీ తరచు కచేరీలు చేస్తూ, పర్యటిస్తూ ఉన్నారు.

ఈ పుస్తకంలో 49 తెలుగు వ్యాసాలు, ఆశీఃపూర్వక పద్యాలు, 16 ఇంగ్లీషు వ్యాసాలు ఉన్నాయి. దాదాపు ప్రతి వ్యాసంలోనూ పై పేరాల్లో ఉన్న విషయాలు పునరావృతమౌతాయి. కొన్ని వ్యాసాల్లో మరీ విషయం తక్కువ, పొగడ్తలు ఎక్కువ. బాలమురళీకృష్ణ బాల్యంలోనే అపూర్వ ప్రతిభ చూపినప్పటికీ, పుట్టగానే తల్లిగారు అతను అసమాన సంగీతకారుడౌతాడని గుర్తించిందనీ, ఆయన ఏడుపు సంగీతంలాగానే ఉండేదనీ రాసిన విషయాలు కొద్దిగా అతిశయోక్తులుగా అనిపిస్తాయి.

ఈ పుస్తకంలో నాకు చదువటానికి ఆసక్తి కలిగించినవి: బాలమురళీ కృష్ణతో ఇంటర్వ్యూలు – సురభి పత్రిక, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, వి.ఎస్.సుందరరాజన్, వి.ఎస్. కుమార్, రాధా భాస్కర్‌లు చేసినవి. బి.వి.కె శాస్త్రి, రోహిణీ ప్రసాద్‌ల వ్యాసాలు మిగతా వ్యాసాలకు భిన్నంగా బాలమురళి సంగీతాన్ని చర్చించాయి (2011 తానా సమావేశాల ప్రత్యేక జ్ఞాపిక తెలుగువెలుగులో కూడా కొద్ది చేర్పులతో బాలమురళిపై రోహిణీప్రసాద్‌పై దాదాపు ఇదే వ్యాసం ఉంది; ఆ సావనీర్లోనే ఉన్నఇంకో వ్యాసంలో ఇరగవరపు రమ బాలమురళీకృష్ణను [పాలపిట్ట పత్రిక కోసం] చేసిన ఇంటర్వ్యూలో ఈ పుస్తకంలో లేని ఎన్నో వ్యక్తిగత విషయాలని ఆయన ఆసక్తికరంగా చెప్పారు). బాలమురళికి బాల్యంనుంచీ సన్నిహితులైన నూకల చినసత్యనారాయణ వ్యాసం కూడా బాగుంది. బాలమురళీకృష్ణకు గంధర్వ గాన సామ్రాట్ బిరుదు ఇస్తూ జయలలిత చేసిన ప్రసంగమూ, బాలమురళీకృష్ణ శిష్యుడు రామ వర్మ వ్రాసిన వ్యాసమూ కూడా విశిష్టంగా ఉన్నాయి.

పుస్తకం అందంగా ముద్రించబడి (శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ), మంచి బైండుతో, రెండు అట్టలపైనా రాయన గిరిధరగౌడ్ అందంగా అలంకరించిన బాలమురళి చిత్రాలతో, ఆకర్షణీయంగా ఉంది. ఈ అభినందన సంచికకు మధుమురళి అని శ్రీరమణ గారు పేరు పెట్టారట. లోపల ఇచ్చిన వివరాల బట్టి ఈ పుస్తకానికి కె.ఐ. వరప్రసాదరెడ్డి అధ్యక్షుడిగా, హెచ్.ఎస్.వి.కె. రంగారావు సంపాదకుడిగా, 45మందితో సంపాదకమండలి ఉన్నా, సేకరించటం తప్ప ఎవరూ సంపాదకత్వం వహించిన దాఖలాలు తక్కువ. వ్యాసాల వరుసకి ఏ పద్ధతీ ఉన్నట్టు తోచదు. అనేక దశాబ్దాలలో, అనేక చోట్ల అనేక మంది వ్రాసిన వ్యాసాలని పునర్ముద్రిస్తున్నప్పుడు, ఏ వ్యాసం ఎప్పుడు ప్రచురింపబడిందో సూచించి ఉండవలసింది. వ్యాసాలు కాలనుక్రమంగా కూర్చకపోవడం కొంత గందరగోళానికి దారి తీసింది. తెలుగులో చాలా అచ్చుతప్పులు, ఇంగ్లీషులో చాలా చాలా చాలా అచ్చుతప్పులు ఉండడం ఇంత అందంగా ముద్రించిన పుస్తకానికి తగదు కాక తగదు. ఒక మంచి సంపాదకుడు, ప్రూఫ్‌రీడరూ ఉంటే ఈ పుస్తకం మరింత అందంగా, ఉపయోగకరంగా ఉండేది. ఇటువంటి పుస్తకంలో మరిన్ని ఛాయాచిత్రాలు, బాలమురళీకృష్ణ జీవన ప్రస్థానంలో ఉన్న ముఖ్యఘట్టాలతో ఒక పట్టిక ఉంటే మరింత సమగ్రంగా ఉండేది.

మధుమురళి
షెవాలియర్, పద్మవిభూషణ్ బాలమురళి అభినందన
జులై 2010
ప్రతులకు:
HSVK Rangarao
206 Sahithi Residency
Railway Gate Rd
Vedayapalem
Nellore -4
Cell: 99 630 54 280
E-mail:huggirao@gmail.com
254 pages; Not priced

**************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors)కు అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

One Comment

  1. kriishna

    పద్మవిభూషణ్ డా.మంగళంపల్లి వారి అంత్యక్రియల సమయాన ఆయనకి జరిగిన ఘోర అవమానానికి సో కాల్డ్ తెలుగు మహానుభావులు, ఉద్దండులు, జాతీయ, అంతర్జాతీయ తెలుగు గ్లోబల్ సంస్థల అధినేతలు, తెలుగు అరివీర భయంకరులు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ఉద్దారకులు, అక్కడ మరియు ఇక్కడ ప్రభుత్వాలు భవిష్య తరాలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పద్మవిభూషణ్ అయి ఉండి భారతరత్న అవార్డుకి అర్హులైన మన మంగళంపల్లి వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరగాలి కదా?. అనుమానం వస్తోంది తెలుగువారిగా మన ఉనికి ఏంటి అసలు?. ప్రచారాలకన్న పని ముఖ్యం ఓ తెలుగు ఉద్ఢరణా కంకణబద్దులారా, మహానుభావులారా
    మహానుభావుడు, యావత్ భారత సంగీత దిగ్గజాల్లో ఒకరు, పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి వారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరగాలి కదా. భారత మాత కీర్తి పతాకని అంతర్జాతీయంగా ఎగరవేసిన వారి పార్ధీవ దేహంపై ఆయన అంతిమ యాత్ర సమయాన భారత పతాకం కప్పి ఉంచడం భారత ప్రభుత్వ ధర్మం కాదా?, అంటే ఆయన అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంచనాలతో జరిపించి ఉంటే ఆయనకు సముచిత రీతిలో నివాళి అర్పించినట్లయ్యేది.. భారతీయుడిగా అందునా ఒక తెలుగు వాడిగా నా హృదయం బాధపడ్తోంది, అవమాన భారంతో భగ్గున మండుతోంది.
    తమిళనాడు, తెలుగు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ నేతలు, తెలుగు ఉద్దండులు ఏం చేస్తున్నారట అప్పుడు?

Leave a Reply